ఆత్మావలోకనం : Self Discovery

0
6

[dropcap]ఈ [/dropcap]రోజు ఓ జర్మన్ లఘు చిత్రం. వున్న రెండు డైలాగులూ జెర్మన్ భాషలో వున్నాయి కాబట్టి జర్మన్ చిత్రం అన్నాను. ఇక చిత్రం నిడివి ఏడు నిముషాల కంటే తక్కువ.
ప్రాథమికంగా సినెమా వ్యాకరణాన్ని ఉపయోగిస్తూ మెదడులోని అనేక ఆలోచనలని దృశ్య బధ్ధం చేయడానికి లఘు చిత్రాలు బాగా పనికొస్తాయి. Mar Weimann అనే కుర్రాడు, తన గాళ్ ఫ్రెండుతో ఈ చిత్రాన్ని తీసాడు. సంగీతం తనే. నటి కూడా అతని గాళ్ ఫ్రెండే. చాయాగ్రాహకుడూ తనే. ఒక iPhone తో తీసాడు. ఇది అతని మూడవ లఘు చిత్రం.
కథను చెప్పకుండా ముందుకు వెళ్ళడం కష్టమే. వాస్తవానికి ఇది సీన్ బై సీన్ చెప్పాల్సిన చిత్రం. ముందే తెలియడం ఇష్టం లేని వారు ముందు ఈ చిత్రం చూసి తర్వాత చదవవచ్చు.
ఒక యువతి (Ulice Raiser) backpack ను తీసుకుని బయలు దేరింది. కొండలు, పొగ మంచు, మబ్బులు, అడవి. తర్వాత చూస్తే అడవి మధ్యలో ఒక వదిలేసిన వేన్ లాంటిదేదో అక్కడ నివాసం చేయతగ్గ గదిలా మార్చి పెట్టబడివుంది. అక్కడికి చేరుకుంటుందామె. బహుశా గతంలోకెళ్ళిందేమో ఆలోచిస్తూ. ఒక ట్రేన్ అలా వెళ్ళిపోతుంది. పట్టాల మధ్య నిలబడి ఆమె ఫోన్ లో భర్త తో మాట్లాడుతుంది. చిన్న దానికి సోమవారం రెండింటికి డాక్టర్ కు చూపించాలనీ, బుధవారం నుంచీ తన తల్లి ఇంట్లో వదిలిపెట్టాలనీ చెబుతుంది. అన్నీ వివరంగా, ఎప్పటిలానే, వ్రాసి వచ్చాననీ అంటుంది. మూడు వారాల్లో వచ్చేస్తావుగా అన్న అతని ప్రశ్నకి జవాబివ్వదు, చిరాకుగా ఫోన్ పెట్టేస్తుంది. ఆమె నిలబడ్డ చోట కాస్త జనావాస సూచనలు కనిపిస్తాయి. అక్కడినుంచి అడవికి బయలుదేరుతుంది.
ఆ గదిలో కాఫీ కలుపుకున్నది గానీ ఎందుకో అది కొంత ఒలికిపోయింది.తెలియని ఆందోళన. ఇంతలో తలుపు కొట్టిన చప్పుడు . మూడు సార్లు. తలుపు తెరిచి చూస్తే ఎవరూ లేరు. కాస్త ముందు వరకూ వెళ్ళి చూస్తుంది. ఎవరూ లేరు. వెనక్కి నడుస్తూవుంటే ఏదో తగిలి ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. గుండ్రటి (circular movement ఒక పునరావృతాన్ని సూచిస్తుంది. ఆమె ఇదివరకు ఎప్పటిలానే అనే మాట వాడింది గుర్తుందా?) బల్ల. దాని మీద ఒక రాయి. ఆ రాయి కింద ఒక కాగితం. తీసి చూస్తుంది. బొగ్గుతో గీసిన బొమ్మ. మంట కోసం పేర్చిన చితుకులు లాంటి బొమ్మ. కాగితం తిప్పి చూస్తుంది. నల్లగా గుండ్రంగా ఒక ఆకారం, దాని చుట్టూ వలయాల్లో పిచ్చి గీతలు. తల పట్టుకుంటుంది.
ఇప్పుడు ఆమె తయారై ఆ backpack తో తిరుగు ప్రయాణం మొదలు పెట్టింది. ఒక చోట వచ్చి ఆగి భర్తకు ఫోన్ చేస్తుంది. ముందు సిగ్నల్ కలవదు. కలిసిన తర్వాత తను మనసు మార్చుకుని ఏమీ మాట్లాడకుండానే ఫోన్ కట్ చేసి వెను తిరుగుతుంది. బహుశా అంత తొందరగా వోటమి ఎందుకు ఒప్పుకోవాలనుకుందేమో.
ఇప్పుడు ఆమె తన గదికి ముందర వున్న నేల మీద చితుకులు పేర్చి రాజేస్తుంది. అందులో ఆ చిత్రం వున్న కాగితాన్ని వేస్తుంది. వెనుక ఆ గది తలుపు దగ్గర జీన్స్ పేంట్ వేసుకున్న రెండు కాళ్ళు మాత్రం కనిపిస్తాయి. తర్వాత ఆ మనిషి మాయం.
ఇప్పుడు ఆమె గదిలో కాఫీ కప్పు పట్టుకుని నిలబడి వుంది. తలుపు చప్పుడు. సమయం చూస్తే సరిగ్గ పది గంటలు. తలుపు తీసి బయట చూస్తుంది. మళ్ళా ఎవరూ లేరు. అక్కడి బల్ల మీద రాయి, దాని కింద చిత్రం వుంటాయి. ఆచిత్రం ఒక summit cross ది. దాని గురించి నాకు సమాచారం లేదు గాని క్రిస్టియన్లకు తెలియవచ్చు. ఓ కొండ మీద పాతిన ఒక క్రాస్ లాంటి ఆకారం అది. ఆ కాగితం వెనక వున్న బొమ్మ ఇదివరకటిదే, వలయాల్లో పిచ్చిగీతల మధ్య ఓ ముద్ద నలుపు.
అలాంటి క్రాస్ ను వెతుక్కుంటూ కొండ ఎక్కి దాన్ని సమీపిస్తుంది. అక్కడ కూర్చుంటూ ఆ కాగితాన్ని పడేస్తుంది.
ఇప్పుడామె గదిలో వుంది. గడియారం పది కావడానికి కొన్ని సెకన్లు మిగిలినట్టు చూపిస్తోంది. ఆమె తలుపు దగ్గరే నిలబడి వుంది. సరిగ్గా పది అయ్యేసరికి తలుపు తీసి బయట చూస్తుంది. ఎవరూ లేరు. వెనుతిరిగి గదిలోకొస్తుంది. లోన బల్ల మీద రాయి కింద చిత్రం వేసిన కాగితం. అందులో అడవి దృశ్యం ఒకటి వుంటుంది. అటూ ఇటూ చెట్లు, మధ్యలో ఒక చీకటి మార్గం. అక్కడ బాణం గుర్తు. మనకు ఈ స్థలం ఇదివరకు కుడా చూపించాడు దర్శకుడు. ఇక కాగితం వెనకాల అదే బొమ్మ.చాయాగ్రహణమూ, సంగీతమూ చాలా బాగున్నాయి. ఏదో హిచ్కాక్ చిత్రం చూస్తూ వున్నట్టు అనిపిస్తుంది. కానీ అతను తీసేది మిస్టరీ చిత్రాలు. ఇందులో ఆమె ఆత్మావలోకనం. మనిషి, మెదడూ, సమాజమూ అన్నీ ఒక మిస్టరీ అనుకోవాలేమో. ఏమో. ఒక చిన్న చితుకుల పేరును తగలబెట్టినా, మరో పెద్ద చితుకుల పేరు మధ్యనుంచే ఆమె బయటికి వచ్చింది. ఇది అంతమయ్యే కథ కాదులా వుంది.
ఇప్పుడు ఆమె ఆ చిత్రంలో వున్న ప్రదేశానికి వచ్చింది. ధైర్యంగానే ఆ మార్గంలోంచి లోపలికెళ్తుంది. ఒక చోట పెద్ద పెద్ద చితుకులు పేర్చినట్టున్న ఒక గుడిసె లాంటిది కనిపిస్తుంది. అక్కడ ఆగిపోతుంది ఆమె. లోపలినుంచి ఆమె లాంటిదే ఒకామె బయటికి వస్తుంది. జీన్స్ పేంట్,”mom” అని వ్రాసి వున్న టీషర్టు, స్లిప్పర్లు, చేతికి అరడజను గడియారాలు, కాస్త జుగుప్స కలిగించేలానే మురికిగా వుంటుందామె. చేతిలో ఒక చిత్రం గీసిన కాగితం తో ఆమె ముందుకు వస్తుంటుంది. జుగుప్సతో, భయంతో ఈమె వెనక్కి పారిపోతుంది.
ఇప్పుడు ఆ గుడిసె బయట పడున్న ఆ కాగితం మీద చిత్రం కనిపిస్తుంది. ఒక పక్క తండ్రీ, కూతురూ చేయి పట్టుకుని వున్నాడు. మరో పక్క ఆమె. ఇంతకు ముందు కనిపించిన వలయాకారపు పిచ్చిగీతల మధ్య ముద్దగా గీసిన నలుపు ఇప్పుడు ఆమె తల స్థానంలో కుదురుకున్నాయి. ఆమె బొమ్మకీ ఆ తండ్రీ కూతుళ్ళ బొమ్మకీ మధ్య ఒక గోడ లాంటిది గీయబడుంది. లోన ఆమె కూర్చుని ఏదో చేస్తోంది. కొంచెం వెలుతురు కనిపిస్తోంది. బహుశా మరిన్ని బొమ్మలు వేస్తున్నదేమో.


దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అతనికే సందిగ్ధంగా వుంది తన ఆలోచనలకు సరి అయిన రూపం ఇవ్వగలిగానా లేదా అని. మనం కొంత ఊహ చేసుకోవచ్చు. ఆమెకు ఇది కొత్త కాదు. మొదట్లోనే భర్త తో అన్నది ఎప్పట్లానే అన్ని వివరంగా కాగితం మీద వ్రాసిపెట్టి వచ్చాను అని. ఇల్లూ, బాధ్యతలూ ఆమెకు బందిఖానా అయ్యాయా? కాళ్ళూ చేతులూ కట్టేసినట్టూ, స్వాతంత్రం లేనట్టూ భావిస్తున్నదా? తనేమిటో తను తెలుసుకోవాలనుకుంటుందా? ఇంట్లో తనకు తగినంత సహకారం లేదా? విశాలమైన అడవిలోనైనా ఓ ఇంటి ఏర్పాటు వుంది. ఓ రోటీన్ వుంది. ఆమె కాఫీ చేసుకోవడం లాంటివి. మనసు గీసిన బొమ్మల వెంట అన్వేషణ వుంది. అది ఎక్కడకు తీసుకెళ్ళింది? ఆ చితుకులను తను రాజేసిందే, అలాంటిదే పెద్ద చితుకుల పోగు మధ్య వున్న తన ప్రతిరూపం దగ్గరికి. ఆరు కాలాలని సూచిస్తాయా ఆ ఆరు గడియారాలూ? లేక రకరకాల బాధ్యతలను ఆయా కాలాల లెక్కన చేయాల్సిన బరువు మోత వుందా? ఆమె మురికిగా ఎందుకుంది? మాం అన్న టీ షర్ట్ అదనగా ఏమి చెబుతుంది? లోపలే వుండి మరిన్ని బొమ్మలు గీస్తున్నట్లైతే అవి తన నిరంతర escape travel plans నా? తండీ కూతుళ్ళకు లేవు, తన తలకే అన్ని వలయాకారపు పిచ్చిగీతలు ఎందుకున్నాయి? గజిబిజి లోపలుందా, బయట వున్నదా? ఈ ఆలోచనలు చుట్టుముడతాయి.
యూట్యూబ్ లో వుంది. చూడమనే నా సిఫారసు.

లింకు: https://www.youtube.com/watch?v=DMhLxijNiMY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here