ఇది కూడా జీవితమే – ‘సెల్ఫీ’ పుస్తకానికి ముందుమాట

0
9

[box type=’note’ fontsize=’16’] వసీరా కవితా సంపుటి ‘సెల్ఫీ’కి శ్రీ కె. శివారెడ్డి గారు వ్రాసిన ముందుమాట ఇది. [/box]

“ముందుమాటంటే మన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవటం”

“తెలివి అంటే మార్పులకు తట్టుకోగల శక్తి”

-స్టీఫెన్ హాకింగ్

“However difficult life may seem, there is always something you can do and succeed at”

-స్టీఫెన్ హాకింగ్

“జ్ఞానానికి అసలయిన శత్రువు – మూర్ఖత్వం లేదా తెలివిలేని తనం కాదు. జ్ఞానం ఉందనే భ్రమలో ఉండటమే అసలయిన శత్రువు.”

-స్టీఫెన్ హాకింగ్

“ఈ విశ్వం ఎవరూ తయారు చేసింది కాదు. అది ఒక నాటికి నాశనమయ్యేది కూడా కాదు. అయితే అది కొంత కాలానికి కుంచించుకుపోతుంది. మళ్లీ విస్తరిస్తుంది. కనుక దానంతట అది ఉంటుంది. అటువంటి విశ్వాన్ని తయారు చెయ్యటానికి దేవునికి ఏ పాత్రా లేదు.”

-స్టీఫెన్ హాకింగ్

ఓ అవిముక్త బంధన స్వేచ్ఛా జీవితంలో ఓ కుర్రాడు, లేదు ఒక పిల్లాడు, అన్వేషణలో పడ్డాడు. జీవనాన్వేషణలో పడ్డాడు. ఇక యాత్ర మొదలయ్యింది. మానవ హృదయాంతరాల దుర్గమారణ్యాల గుండా – ఆదిమ మానవుల అనాది గుహల గుండా ULYSSES ఆత్మ ఆవహించిన ఓ పిల్లాడు నడుస్తున్నాడు – అనంత ఆర్తితో విమోచన లేని దుఃఖంతో సాంద్రమానవ కీకారణ్యాల గుండా – సూర్యుణ్ణి గర్భీకరించుకున్న ఎడారుల గుండా – ఒయాసిస్సుల పక్కగా, శ్మశానాల గుండా- నదుల పక్కగా – గో గ్రహణాలు జరిగిన మైదానాల గుండా, పురాణేతిహాసాలు జన్మించిన యాగాలు యుగాల గుండా, మానవ నాగరికతా మూలాల గుండా – నిరంతరం నడుస్తున్నాడు.

నదుల్ని శోధించాడు. సముద్రాల్ని జల్లించాడు. మానవుడి మానస సామ్రా జ్ఞానానికి మూలమయిన ఒక రహస్యం విచ్ఛేదనకై – విరిగిపడుతున్న కొండచరియల గుండా ఆత్మస్వర్ణాన్వేషణ చేస్తూ నడుస్తున్నాడు.

ఎగురుతున్నాడు భూమార్గాన, వాయుమార్గాన – రోదసిలోకి ఎగసి- నిత్యం విస్తరిస్తున్న విశ్వాంతరాళాలు, వేలవేల గోళాల పరిభ్రమణాల పుట్టకలోనూ, మరణంలోనూ – కొన్ని వేల సంవత్సరాల ముందుపుట్టి ఇంకా భూమికి చేరని ఓ కాంతి కిరణం ప్రయాణపు విభ్రాంతి గుండా – విశ్వసంశోధన చేస్తూ వెళుతున్నాడు.

ఆశ్చర్యానంద భరితుడై, తన్మయీభూతుడై చరిస్తున్నాడు – సంచరిస్తున్నాడు – ఒక ధ్యానమగ్నుడై – నిశ్చేష్టుడై – నిలబడి- ఈ అనంత విశ్వాన్ని తదేకంగా ఆలోకిస్తూ వీటి పుట్టుక గిట్టుకల గురించి అడుక్కాన వెళ్లి అంతుపట్టని ఆనంద బిలాల మధ్య –

ఆ బాలుడు- ఆ కుర్రాడు – ఆ కవి – శిరోభాగాన చరిత్ర మెరుస్తుండగా తాచుపాము పడగమీద మణిలా –

‘వసీరా’ కవిత్వ వశీకరణ విద్య తెలిసిన వాడు. వసీరా అనే కవి – వేసే కొత్త పుస్తకానికి నాలుగు మాటలు రాయడానికి- హాకింగ్ దగ్గర నుంచి అనంత విశ్వంలో పరిభ్రమించాల్సి వచ్చింది.

1989లో ‘లోహనది’ అనే కవితాసంపుటి అచ్చువేశాడు. దానికి నేను తన్మయుణ్ణయి. నాలుగు మాటలు రాశాను. ‘వనీరా’ కవిత్వం మీద చెవి పెట్టి వినమన్నాను. తర్వాత 1994లో ‘మరోదశ’ అనే Socio political poetry అచ్చేశాడు. ఆ పుస్తక ఆవిష్కరణ సభలో వి.వి.గారు అద్భుతంగా మాట్లాడారు.

“ఈ యుద్ధమేఘాలే రాజమందిరంలోపల కనక వర్షాలు.

రాజదండం పెదవుల మీద

తేనెపూసిన తూటాల పంటలు

నెత్తురు ఆవిరై, నవ్వులావిరై

ఊదర ఊదర ఊదర

జనజీవితం సారాబట్టీ

జనపాలన సారాకొట్టు

ఇంట్లో నెత్తుటి వర్షాన్ని ఆపడానికే

యుద్ధమేఘాల్ని ధ్వంసం చెయ్యడానికే

రోడ్డు మీదకు వచ్చాను నేను”

మరోదశ వసీరాకి నిజంగా మరోదశే – వసీరా కత్తికి రెండంచులున్నాయని అప్పుడు తెలియదు. ఒక అశాంతి… అగ్ని ఉంది. ఆరని అగ్నిగుండంగా రగులుతున్న వసీరాని మరోదశలో చూశాం.

దరిదాపు 20-25 ఏళ్లతర్వాత వస్తున్న ‘సెల్ఫీ’ కవితా సంపుటిలో ఒక కొత్త వసీరాని చూస్తారు.

ఒక అధిభౌతిక అధివాస్తవిక, ఆధ్యాత్మిక వాదిగా – పరిణతి చెందాడు. దీనికి మూలాలు గతంలో వచ్చిన కవితా సంపుటుల్లో ఏమైనా ఉన్నాయా? – లోహనదిలో మొదటి కవితే ‘డీ-హ్యూమనైజేషన్’. రాబోయే మార్పుని, ధ్వంసాన్ని ముందుగానే పసిగట్టిన కవిత.

“అది గేటు దగ్గరికి వచ్చినిలబడినపుడు

దానితోకంత లేడుగానీ ఈనెపుల్లతో తోలడానికి తయారూ!

ఇంతలో ఒకావిడ

వాణ్ణెత్తుకుని లోపలికెళ్లిపోతుంది.

తోలనివ్వనందుకు

ఆవుకూడా ఏడుస్తూ వెళ్లిపోతుంది”

ఆవుతోక అనే ఈ కవిత మొదటి సంపుటి ‘లోహనది’ లోదే. అలాగే వెన్నెల్లో గోదారి కవిత.

“ఇవాళ పొద్దున్నే

చందమామను పట్టుకుని

పేపర్ మిల్లులో పారేశారో ఏమిటో

ఇక్కడికొచ్చి చూస్తే

గోదావరే పేద్ద తెల్లకాగితం

దీనిమీద కవిత్వం రాయడానికి

ఆ సూర్యుడే దిగిరానక్కర్లేదు.

నేనిక్కడ నిలబడి చిన్నరాయి పడేస్తే చాలు”

***

“నా భుజం మీద తలవాల్చి

నా డొక్కలో చిన్ని కాళ్లు తన్ని పెట్టి

చిట్టిమోకాళ్లు తన డొక్కలో ముడుచుకుని

నా పక్కమీద ఆదమరచి నిద్రపోతుంది

మావూరి వెన్నెల రాత్రి చెరువు”

ఒక ప్రాకృతిక సౌందర్యానికి తన్మయము కావటం – చిత్ర చిత్రాలుగా చిత్రాలు చేయటం – సౌందర్యంలో ధ్యానమగ్నమవటం. ఆశ్చర్యపోయి – ఆనందించడం ‘వసీరా’ స్వాభావిక తత్వం – ప్రకృతుంది, మహావిశ్వముంది- అనంతంగా విస్తరిస్తున్న రోదసి ఉంది. యిన్నిగోళాల మధ్య బహు సౌందర్యవంతమయిన భూగోళం.

ఈ అనంత సృష్టికి మూలమేమిటి?

ఎవడు నడిపిస్తున్నాడు? – ఈ ఉద్యానవనాలకీ, అసంఖ్యాక జంతుజాలానికీ నీళ్లు పోసేది ఎవరు? పెంచిపోషించేది ఎవరు?

ఒకపక్క భౌతిక శాస్త్రవేత్త – విశ్వరహస్యాన్ని ఛేదించడానికి పూనుకుని – సృష్టి మర్మాన్ని విప్పి చెప్పడానికి పూనుకుని –

శాస్త్ర జ్ఞాన మార్గాన్ని పొడిగించుకుంటూ – మనిషిని శాస్త్రవేత్తగా తీర్చిదిద్దడానికి పూనుకున్న హాకింగ్ –

అదే సౌందర్యవంతమయిన శాస్త్ర మీమాంస –

విశ్వరహస్యాన్ని ఛేదించడానికి పూనుకుని అత్యద్భుత పరిశోధన ఫలితాల ఫలాలను మానవజాతికందిస్తూ

అదే విశ్వం – అదే ఖగోళ అంతరాంతరాళ మనోవల్మీకం- కవి- బాలుడు -, శాస్త్రవేత్త కాదు- సౌందర్యానంద ఆశ్చర్యలోలుడు –

తన భార్య, తన పిల్లలు, తన చెల్లి, తన అమ్మ, తన కూతురు – మహా సౌందర్య రాశులయిన – మహాశ్రామిక మూర్తులు – ఆదిశక్తి నుండి ఇప్పటిదాకా విస్తరిస్తూ అల్లుకుని – సర్వస్వాన్నీ ఆనందించిన – స్త్రీమూర్తి- విశ్వశక్తి – విశ్వానికి ప్రాణభూతమని నమ్మిన కవి- Child like glow ఉన్న కవి. సర్వేసర్వత్రా కన్పిస్తున్న శక్తి అంశ. అందంగానూ, ఆశ్చర్యంగానూ, అంతుబట్టనంతగానూ –

బాలుడు – కవి కీర్తించడం మొదలుపెట్టాడు. స్తోత్రించడం మొదలు పెట్టాడు.

“గగనాలను జలమయం చేసే మేఘాల్లోంచి

కురిసే చినుకుల మధ్య తటిల్లతలు

నీ వడ్డాణానికి వేలాడే మువ్వల కాంతులు

మెరుపుతీగల విద్యున్మాలలు ధరించి

ఎండా వానల మధ్యనుంచి

నువ్వో చిరుమందహాసం చేస్తావు

నీ సుందరహాసం చీకటి మైదానాల మీద

చల్లగాలిలా ప్రసరిస్తుంది.

నీ మందహాసం చీకటి అడవుల మీద

మిణుగురు గుంపులను ఎగరేస్తుంది.

నీ మందహాసం నల్లని రాత్రిలో ప్రవహించే

నదుల మీద నక్షత్ర ప్రతిబింబాలను చల్లుతుంది

నీ మందహాసం బంగారు సముద్రాల మీద సూర్యకాంతిగా

నదుల ముఖచంద్ర బింబాలకు సూర్య తిలకాలుగా మారి

చరాచరాల సంధ్యావందనాలు స్వీకరిస్తుంది.”

“నీ నిర్గుణ నైరూప్య హృదయానికి

ఈ అనంత సృష్టిని హత్తుకునేది నువ్వే కదా

అనంత సృష్టి వాహిని నువ్వే కదా నీ నవ్వే కదా-”

ఎవరు ఈ ‘నీ’- అనంత అద్భుత ఆశ్చర్య బహుముఖ వికసిత స్త్రీశక్తి – చోదక శక్తి – సృజనాత్మకతకు మూలం – సమస్తం నిండి, సర్వాన్నీ ఆవహించి ప్రాణచలనాన్ని ఇచ్చి – సౌందర్య దర్శనం చేయించే స్త్రీ శక్తి – తనచుట్టూ అల్లుకున్న స్త్రీల మహిమాన్విత జీవితాలు కళలు, కాంతులు –

తన్మయుడై- తపోనిష్టలో కూర్చుని ఆలాపిస్తున్నాడు

“నేను జీవితమంతా మెదడులోనే విశ్వమంతా పయనిస్తూ గడిపాను” అని స్టీఫెన్ హాకింగ్ అన్నమాటకీ – వసీరాలోని ఒక ఆనంద ఆశ్చర్య విభ్రాంతికర డెలీరియంకి పెద్దతేడా లేదు- ఇద్దరూ వారి వారి రంగాల్లో తపోనిష్టలో ఉన్న వాళ్లే – తేడా అల్లా ఆయనది శాస్త్రం. ఈయనది కవిత్వం.

వసీరా కవి గాబట్టి – ఊహ- ఊహమీద ఊహ చేస్తూ ఊహోద్యమంలో మునిగి అలంకార సామగ్రిని మనముందు పోశాడు –

హాకింగ్స్ పుస్తకం పెద్ద ప్రశ్నలూ చిన్న సమాధానాలు చదువుతుంటే కవిత్వం చదివినట్టే. నిబిడాశ్చర్యాంబుధిలో మునిగినట్టే.

బహుశ గొప్ప డిస్కవరీస్ అన్నీ అనంత ధ్యాన తపోనిష్ఠలోంచే అని అనుమానం-. ఈ మేధ-ఈ Magic realism నుంచి జన్మించి – అటు సాహిత్యా న్నీ, యిటు శాస్త్రజ్ఞానాన్ని వెలిగించాయని కూడా –

కాళీమాత అనే కవిత –

“కోటి సూర్యుళ్లని కడుపులో దాచుకుని

పెంచి పోషించే పెంజీకటి

నిజానికి చీకటి కాదు

శత సహస్ర దళాల నల్లకలువ

కలువ మధ్యలో కదలాడే నక్షత్రగోళాలు

కేవలం దాని పుప్పొడి రేణువులు మాత్రమే”

ఆ సైన్సులో గానీ, ఈ సాహిత్యంలోగానీ ఊహ పాత్ర అనన్యమైనది.

“అమ్మా సంధ్యాదేవీ!

నీ కోసం చేతులు చాచి నుంచున్నాను

మంత్రాలు రావు, పూజలు రావు

ఎలా వస్తావో తెలీదు

నీ ఒడిలోని సువిశాల గగనంతో సహా

నువ్వు నా చేతుల్లోకి వచ్చి ఆశీర్వదించు”

“నేనూ – కప్పా” అనే కవిత –

అది బెకబెకలు ఆపి

నేను మాటలు ఆపి

ఇద్దరి మధ్యా జానెడు దూరం

ఇద్దరి మధ్యా చారెడు మౌనం

నేనూ కప్పా

ఇద్దరి మధ్యా ధ్యానం

ఇద్దరి మాతృభాష

కప్పతో నేను

నన్నే చూస్తూ కప్ప

నేనూ కప్పా సముద్రం ఆకాశం

నదీ, కొండా అన్నీ కలిపి

అన్నిటి వెనుక ఉన్న

అన్నిటిలో ఉన్న

అమ్మ కడుపులో

ప్రకృతిమాత శరీరమై

ప్రకృతిమాత కడుపులో –

మరోరకంగా ‘గీతాంజలి’ లాంటిది వసీరా కవిత –

పూర్తిగా భౌతిక జీవనానికి తెగతెంపులు చేసుకుని పరిపూర్తి అధిభౌతిక కవిత గాదు. కేదార్నాథ్ సింగ్ లో పల్లెటూరు – నగరం కలగలిసినట్టు- సామాజిక రాజకీయ జీవితానికి విడాకులివ్వలేదు వసీరా – విడాకులిస్తే ‘హథ్రస్’ కవిత రాసేవాడు గాదు.

“సూర్యుని తేజాన్నీ మట్టిబలాన్నీ

చెమటలోని ప్రేమనీ తాగి పెరిగిన

గోధుమగింజ రక్తసిక్తమయ్యింది

చిన్నారి గోధుమ గింజ రక్త కన్నీరులో తడిసి

నేలలోకి వెళ్లిపోయింది”

అలాగే కదమ్ కదమ్ కవిత రాసేవాడుగాదు.

“కార్పొరేట్ విషపు కన్నులు పీకి

నేలబిడ్డలందరి మీదా వెన్నెల వెలుగులు కురిసే

నూతన స్వరాజ్యం కోసం అట్టడుగునుంచి

అన్ని వైపుల నుంచి ముట్టడించి

పోరు జెండాలు ఎగరాల్సిందే ఎగరాల్సిందే”

అలాగే ‘పిడికెడు అన్నం రొట్టెముక్కా’, ‘మట్టి’,లాంటి కవితలు రాసేవాడు గాదు-

సంధ్యాహారతి, వసంతం, సూర్యసాగరం, ఏమో ఎవడికి తెలుసు, ఊయల, అవతరణ, హృదయకమలం, రెండే రెండు అక్షరాలూ, ప్రీతి, చరణాశ్రయం కోసం, బంగారుపాప, ప్రతిబింబాలు, లాంటి బలమయిన అద్భుత కవితలన్నీ – అధివాస్తవిక అధిభౌతిక-ప్రాకృతిక అనుభవం నుంచి వచ్చినవే – ఒక natural + super natural elementsని అద్భుతంగా కలగలిపి – పోతలు పోశాడు. అది ఏ అనుభవం అయినా సరే! అక్షరాల్లోకి కవితలోకి తర్జుమా చెయ్యటం-బొమ్మకట్టడంలోనే కవి ప్రతిభ అంతా ఇమిడి ఉంది.

కవిత ముగిసే సరికి మనమూ ఒక మార్మిక వాతావరణంలో మునిగిపోతాం – భూమి అంచులపై నుంచొని వాయులీనంలో మునిగిపోయి, సమస్త విశ్వాన్ని ఆలింగనం చేసుకుని ఒక దివ్యానుభవంలోకి జారిపోతాం.

‘సంధ్యావందనం’ చేసినా ‘లోలకం సూరీడు’ని వర్ణించినా ‘ఆషాడ గోదావరి’ని కళ్లకు గట్టినా – వసీరా ముద్ర సర్వేసర్వత్రా ఉంటుంది.

యిప్పుడొస్తున్న, యిప్పటి కవులు వాడుతున్న భాష కాదు – తన అనుభవ వ్యక్తీకరణకు తగిన సూటైన భాషనీ పదబంధాన్నీ ఇమేజరీని ఎన్నుకున్నాడు.

ఒకసారి గాదు- రెండోసారి పద్యంలోకి ప్రయాణం చేసినప్పుడుగానీ, Depth of the poem, Density of the poem – మనకు అందదు. అప్పుడుగానీ మనం Dissolve గాము – Dissolve అయితే తప్ప అనుభవం పండదు.

కవిగా వసీరాకి శల్యం లేదు. దరిదాపు రెండు దశాబ్దాలకు పైగా- నిశ్శబ్దం – నిశ్శబ్దం గాదు – ధ్యానం తపస్సు.

భౌతిక కారణాలు, అధిభౌతిక కారణాలూ, కొంచెం పక్కకు జరిగి ఈ శరీరంతోనే ఒక దివ్యానుభవాన్ని అందుకుంటానికి ప్రయత్నించాడా తెలియదు – వస్తువును తయారు చేసేటప్పుడు ఏ ఏ పద్ధతులు అవలంభించాడో- ఏఏ దినుసులు వాడాడో, మనకి తెలియదు. ఒక అద్భుతమైన ఆభరణం తయారయ్యింది. అందరూ ఈ కవిత్వాన్ని నాలాగా అనుభవిస్తారా – లేదా అనేది వారి వారి దృష్టికోణాన్ని బట్టి, మునగటాన్నిబట్టి, పొందిన జీవన తాత్వికతను బట్టి ఉంటుంది. అసలు ఏ కవితకి ఆ కవితని అనుభవిస్తూ మొత్తం సారాంశాన్ని అనుభవించి గ్రహించే నేర్పు నిత్యపాఠకుడికే సాధ్యం. రాయటం ఎలాగో చదవటం గూడా ఒక సాధన. పండిపోవటానికి దారి సాధన.

ఇన్నాళ్లకి ఈ రకంగా ప్రత్యక్షమయ్యాడు వసీరా. మట్టి అనే ఒక్క కవిత చాలు – అతని వస్తు ఐక్యతనీ, భావనా బలాన్నీ ఊహాశక్తినీ – అతని ఆంతరిక అంతశ్చక్తినీ చూయించటానికి.

“ఈ మట్టే నేనుగా పుట్టాను

నేను మట్టిగా పెరిగాను

నాలోంచి మొలిచిన మట్టే

ఈ మట్టిలోకి వట్టివేళ్లు అల్లింది

గరిక పూలను పట్టుకుని

నింగిలోని అగ్ని కుసుమ పరాగంలో తడిసింది

భూయజ్ఞానికి తనలోనే

అరణి* మధించి అగ్నిని నాటింది.

***

పిడికెడు మట్టి, పట్టెడన్నం నాతో కలిసి

రూపాలు మారి విశ్వదర్శనం

పిడికెడు మట్టి, పట్టెడన్నంలో ప్రాణశక్తి నేనే

రసమయంలోని సారాలు మార్చే మారని సారాశం నేనే”

వేదాల్లోని రుక్కులు చదివినట్టుగా ఉందా –

ఒక రుషిత్వం తాలూకు అంశం ఏదో – విశ్వంలోకి చొచ్చుకుని పోతున్న కాంతి ఏదో – మనచుట్టూ కదులుతున్నట్లు – మనలో మేల్కొన్నట్లు ఒక అద్వితీయ అనుభవం-ఇన్నాళ్లకు ఈ రకంగా పలికిన వసీరాకి అభినందనలు

– కె.శివారెడ్డి

*అరణి-యాగాల్లో అగ్నిని పుట్టించే పరికరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here