సెల్ఫీ

0
9

[dropcap]ఎ[/dropcap]యిర్‍పోర్టులో కూర్చునున్నాను. అందరి చేతులలో మోబైల్ ఫోన్లు బాహ్య ప్రాణాలలా కనబడుతున్నాయి. నాకు ఓ పది అడుగుల దూరంగా ఒక ఎస్కలేటర్ ఉంది. ఒక పండు ముసలావిడను ఒక మధ్యవయస్కురాలు ఎస్కలేటర్ మీద నిలబెట్టి పైకి తీసుకుని వెడుతోంది.

“బుద్ధి జ్ఞానం లేదు”, ప్రక్కనుంచి వినిపించింది. ఇక్కడో జంట కూర్చున్నదని తెలుసుకుని అటు చూసాను. ఆ మాట అన్నది మహిళ. ఆవిడ ప్రక్కన భర్తలాగానే ఉన్నాడు. చుట్టూరా చూసి ఆమె వైపు తిరిగాడు.

“నువ్వు చెప్పినట్టు డాబా మీద బట్టలన్నీ మడతలు పెట్టి ఇంట్లో పెట్టేసాను” అన్నాడు.

“అది కాదు నేనంటున్నది”, ఆమె ఎదురుగా చూస్తూ ప్రక్కగా మాట్లాడుతోంది.

“మరి?”

“కనిపించటం లేదూ?”

ఆయన మరల చుట్టూతా చూసాడు. ఏమీ బోధపడలేదు. దూరంగా కాఫీ షాప్ ఉంది. ఎందుకో రెండు గుటకలు వేసాడు.

“కాఫీ త్రాగుతానన్నావు గదా? పోనీ ఇప్పుడు త్రాగుతావా? తలనొప్పిగా ఉందా?”

ఆమె తల పట్టుకుంది.

“అది కాదు. అటు చూదండి” – ఎస్కలేటర్ మీద ముసలావిడ భయంగా భయంగా బిత్తర చూపులు చూస్తూ కనిపిస్తోంది.

ఆయన అదీ చూసాడు. కానీ ఆలోచించాడు. చాకలతను ఇస్త్రీ బట్టల లెక్క తప్పినప్పుడు కూడా అటువంటి బిత్తర చూపులు చూడడు.

నా వల్ల కాదు, నన్ను క్షమించు అనుచున్నట్లు చేతులు కట్టుకుని క్రిందకి చూస్తూ కూర్చున్నాడు.

ఎస్కలేటర్ మీద వాళ్ళిద్దరూ పైకెక్కి మాయమయ్యారు.

“ఇందాకా ఆ ఎస్కలేటర్ మీద చూసారా?”

“చూసాను”

“అమ్మని వదిని ఎందుకలా ఇబ్బంది పెడుతోంది? ఆవిడకేమైనా అయితే?”

“పట్టుకున్నది కదా?” పళ్ళ బిగువున పడిగాడు. చటుక్కున అటు తిరిగింది. ఆ తిరగటంలో గొప్ప విన్యాసం ఉంది. అసలు నువ్వు సమాధానం చెబుతావా? అనే ఓ సంభ్రమాశ్చర్యం. చెప్పినా నా మాటకు బదులు చెబుతావా? అనేది రెండవది. మూడవది, నేను నీకు చెప్పిన దాంట్లో ఏదో తప్పున్నట్లు మాట్లాడే ధైర్యం నీకెక్కడిది అనేది. ఆ విసురుకు ఆయన మరింత క్రిందకి వంగిపోయాడు. హనుమాన్ చాలీసా గట్టిగా ప్రారంభించినట్టు అర్థమవుతున్నది..

“ఏంటి పట్టుకోవటం? అసలు గుండె ఆగిపోతే? జాగ్రత్త ఉందా?”

అత్తగారి గుండె ఆగదని ఆయనకి తెలిసినట్లుంది. ఒక వేళ ఆగినా వాళ్ళావిడ, ఆయన కలిసి ఏమీ చేయలేరనీ తెలుసు. కానీ ఆయన గుండె ఆగకుండా ఆగం చేస్తోంది.

“ఏమీ మాట్లాడరేం?”

“కరెక్ట్”

“ఏంటి కరెక్ట్?”

“గుండె.. కాదు.. జాగ్రత్త లేదు”

“మీరూ ఉన్నారు”

ఇది నిజమేనా? ఉన్నానా? అనుకున్నట్లు, ఎందుకున్నాను? అన్నట్లు, అందరినీ కలయజూసాడు.

ఇంతలో మాకు వెనుక ఉన్న ఎస్కలేటర్ మీదుగా వాళ్ళిద్దరూ దిగుతున్నారు.

“అర్థమైందా?” దాదాపుగా అరిచింది.

“చూస్తున్నాను”

“ఆఁ.. ఆటాడుకుంటోంది ఆవిడతో”

“పోనీ ఆవిడైనా..”

దోమని చూసినట్లు చూసింది. చెయ్యి పైకెత్తి ఊపింది. ఆయన కళ్ళు మూసుకున్నాడు.

“ఏం చేస్తుందండీ? గాలిలో దీపం పెట్టి అలా బ్రతుకుతోంది పాపం”

నాకు ఇటు ప్రక్కన ఓ కుర్రాడున్నాడు.

“అక్కడ సెక్యూరిటీ ఉంది మేడమ్”

ఇటు తిరిగింది.

“సెక్యూరిటీ అవసరమా? అసలు ఆ ఆట ఎందుకు? అది ఎందుకు ఆపరు?

అతను పళ్లు ఇకిలించాడు.

“మీరంతా కలిసి వెళ్తున్నారాండీ?” అడిగాను, కొద్దిగా వేడి తగ్గిద్దామని. కళ్ళజోడు సర్దుకుంది. ఇంతమంది మగవాళ్ళున్నారా, నాతో మాట్లాడగలిగిన వారు? ఆనే ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది.

“అవునండి. టూర్ ప్లాన్ చేసాం. అయినా చూడండీ, వాళ్ళు వేరేగా తిరుగుతారు. మాతో కలవరు”

వాళ్ళాయన మొబైల్ మ్రోగింది. నీకు ఫోన్ చేసేవారున్నారా? అన్నట్లు చూసింది. నా తప్పేమీ లేదన్నట్లు పెదాలు కొరుక్కున్నారు సార్. జాగ్రత్తగా షర్ట్ పాకెట్ లోంచి తీసాడు. కేవలం ఊ, ఆ.. లతోనే ఏదో సంవాదం సాగుతోంది. మధ్య మధ్యలో సిగ్నల్స్ కోసం అన్నట్లు ఆవిడని చూస్తున్నాడు. ఫోన్ ఆగిపోయింది. జాగ్రత్తగా లోపల పెట్టాడు. కళ్ళు మూసుకొని మరల ఏమన్నా అంటుందేమని తెరచి చూసాడు.

“ఏంటిట?”

బిక్క మొహం వేసుకుని చూస్తున్నాడు.

“ఎవరు?”

“అన్నయ్య”

“ఏవంటాడు?”

“నాన్నకి అలాగే ఉందిట. డాక్టర్ ఏమీ చెప్పటం లేదు”

“కావాలని ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాలా?”

ఆయన ఏమీ మాట్లాడలేదు. అక్కడ పెద్దాయన పరిస్థితి అలా ఉంటే వీళ్ళ టూర్ ప్రోగ్రామ్ ఏంటో అర్థం కాలేదు.

“అదుగో చూడండి” మళ్ళీ అరిచింది.

ముసలావిడ, ఆవిడ కోడలు మరల ఎస్కలేటర్ ఎక్కుతున్నారు.

“పెద్దవాళ్లని చూసుకునే పద్ధతేనా ఇది? నేనేమైనా అంటే అందరూ నన్నే తప్పు పడతారు”

ఆయన ఎందుకో లేచాడు. వెళ్ళి ఏదో చెబుతాడనుకున్నాను. అలాంటిదేమీ జరగలేదు. మరల కూర్చున్నాడు.

“చూడండి. ఎలా వణుకుతోందో అమ్మ. ఆ రాక్షసి చూడండీ ఆవిడ భుజాన్ని ఎలా పట్టుకుందో? ఏంటి? వింటున్నారా?”

“చూస్తున్నాను”

“మీరూ ఉన్నారు”

అవునా అన్నట్లు ఎందుకో నన్ను చూసాడు. బావుండదని చేతులు కట్టుకొన్నాను.

“ఇదంతా అస్తి కోసం..”

నేను విడ్డూరంగా చూసాను.

“అవునండీ..” అంటోంది. “..ఇలా ఏదో చేస్తూ పోతే, ఏ కాలో ఇరుక్కుని కథ తొందరగా ముగించాలని..”

“ఆవిడ బాగానే ఉన్నారండీ”

వెంటనే షాక్ తిన్నట్లు ఇటు తిరిగింది.

“అయ్యో మీకు తెలీదండీ! సినిమాల్లో చూపించేవన్నీ నిజాలే. నా దగ్గర కూర్చోనీయదు మా అమ్మని. చూడండి ఎలా ఇబ్బంది పెట్టేస్తోందో? నరనరాల గురించి నాకు తెలుసు!”

వాళ్ళు ఎస్కలేటర్ మీద వెళ్ళిపోయారు.

మళ్ళీ ఆయన ఫోన్ మ్రోగింది.

“తియ్యకండి” అరిచింది. ఆయన బాధగా చూసాడు.

“అసలు టూర్ అయిపోయేవరకు ఆ మొబైల్ నాకు ఇచ్చెయండి”

ఆయన ఇవ్వలేదు కానీ చేతులు కట్టుకున్నాడు.

“మీరు కూడా వెళ్ళి ఆ పని.. ఆ పని ఆపించెయ్యచ్చు కదండీ?” అడిగాను.

కొద్దిగా దగ్గరకు వచ్చింది. ఏదో రహస్యం చెబుతున్నట్లు చెప్పింది – “దగ్గరకు రానీయదండీ”

“ఎందుకలాగ?
“మేమిద్దరం ఏదైనా మాట్లాడేసుకుంటాం కదా?”

“పోనీ లెండి, అత్తా కోడళ్ళు అలా ఉండడం కూడా మంచి విషయమే కదా?”

“అయ్యో. అదంతా డ్రామా అండీ..”

వాళ్ళాయన మొబైల్ మ్రోగింది. అటు తిరిగింది. ఆయన దాన్ని పట్టుకుని బేలగా చూసాడు.

“ఏంటిటా ఆత్రం? ఎందుకూ ఊరకే చేస్తూ ఉంటాడు? ఏమీ కాదు ఆయనకు”

“మీ మామగారికాండీ?” నాకు ఈ ఆరాలంటే ఈ మధ్య మహా ఇష్టంగా ఉంటోందనే నా మాట నమ్మాలి. అందరూ మొబైళ్ళలో మునిగిపోతే నేను ఎక్కువగా ఆ మొబైళ్ళలో ఉన్న మోములను చూస్తూ టైం పాస్ చేస్తాను. సినిమాలో కూడా హీరో హీరోయిన్లు డాన్స్ చేస్తుంటే వాళ్ళను అస్సలు చూడను. వాళ్ళకు అటూ ఇటూ ఉన్న ఆ ఎగస్ట్రాలను అదే పనిగా చూస్తాను. ఒకళ్ళిద్దరు పాపం ఏదో ఎక్స్‌ప్రెషన్ కూడా ఇస్తూ ఉంటారు ఎందుకో?! అని చూస్తుంటే పిచ్చి ఆనందంగా, మనోరంజకంగా ఉంటుంది! ఆ మాటకొస్తే మొబైళ్ళు చూసుకుంటున్న వారి మొహాలను జాగ్రత్తగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఏదో పాట కూడా గుర్తుకొస్తుంది. ‘అందమైన మనసులో, అంత అలజడెందుకో? ఎందుకో..’ వాళ్ళ మొహాల మీద ఏంటో ఆ అలజళ్ళు, వెర్రి ఆనందం, పిచ్చి ఆలోచనల మరకలు, తెలియని ఆవేదన, ఆందోళన, ఒక్కోసారి చిరునవ్వులు, ఒక్కోసారి కళ్ళు మూసుకుని చేస్తున్న నిట్టూర్పులు.. గొప్ప ప్రపంచం ఈ స్మార్మ్‌ ఫోన్‍లది.

ఒకరితో మాట్లాడాలంటే మొబైల్, వద్దనుకున్నా మొబైల్.. ఇష్టం లేకపోతే ఏదో కాల్ వచ్చినట్లు నటించి, అది పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోవచ్చు.

“మావగారే!” విసుగ్గా చెప్పింది. “..ఇప్పటికి వందసార్లు ఆస్పత్రికి వెళ్ళటం, రావటం. అక్కడున్న వాళ్ళకేదో వ్యవహారం ఉంది, వాళ్ళు హడావిడి చేస్తూ ఉంటారు. మేము కాని వాళ్ళం!”

“ఓ.. ఏంటో, కానరాని సమస్యలు ఇలానే ఉంటాయి. అవునూ, మీ అన్నయ రాలేదే? మీతో?”

“వాడికి చివరి నిముషంలో లీవ్ కాన్సిల్ అయింది. ఈ మహాతల్లి పండగ చేసుకుంటోంది”

“అర్థమైంది”

ఇంతలో ఆ ఎస్కలేటర్ పైన ఏదో అలజడి ప్రారంభమైంది. జనమంతా లేచి నిలబడి అటు చూస్తున్నారు. మెల్లగా అర్థమైంది. అక్కడ ఓ టాప్ హీరో వచ్చి కూర్చున్నాడట. అందరూ అటు ప్రయాణం కట్టారు. ఎస్కలేటర్ ఫుల్ అయిపోయింది. ఒకొక్కళ్ళు సెల్ఫీల కోసం ఆరాట పడిపోతున్నారు. ఈవిడ లేచి నిలబడింది. ఎస్కలేటర్ క్రిందనే నిలబడి సెల్ఫీలో ఆ స్టార్ పడేటట్లు ప్రయత్నం చేస్తోంది. కుదరక క్రిందా మీదా పడుతోంది, జనం అడ్డమొస్తున్నారు. ముసలావిడ, ఆవిడ కోడలు వచ్చి నా కుడి వైపు కూర్చున్నారు. కొద్దిసేపు నేనేమి మాట్లాడలేదు.

సెల్ఫీ కోసం ఇక్కడి నుండే ప్రయత్నం చేసున్న ఆవిడని చూపించి అడిగాను – “ఆవిడ మీ ఆడపడుచు కదూ?”

“అవునండీ”

“ఎందుకండీ పెద్దావిడని ఎస్కలేటర్ మీద ఇబ్బంది పెడుతున్నారు? ఆవిద ఎంత కంగారు పడిపోయారో తెలుసా?”

“కంగారెందుకండీ? నాకేమైనా మోజా? అత్తయ్యగారే ఒకటి రెండు సార్లు దాని మీద ప్రాక్టీస్ చేయించమన్నారండీ, ఒంటరిగా ఉన్నప్పుడు హఠాత్తుగా వెళ్ళాల్సి వస్తే తెలియాలి కదా? అని పట్టు పట్టారు”

“ఓ. ఇంతకీ చేతైందా?”

“చాలా చక్కగా..”

ముసలావిడ నవ్వుతోంది. ఈ సెల్ఫీ మనిషి వల్ల కావటం లేదు. ఆయన చేతులు కట్టుకుని చూస్తున్నాడు. చివరగా ఓ ఆలోచన వచ్చింది ఆమెకు. వెళ్ళి ఎస్కలేటర్ మీద ఇటు తిరిగి నిలబడింది. అంటే సెల్ఫీలో ఆమె ఆ ‘తారకుడి’ని మేఘాల మీద నుండి పైకెక్కి చేరుకున్నట్లు వస్తుందన్న మాట! ఎస్కలేటర్ అలా పైకి పోతోంది. ఆమె ముందు కొందరు నిలుచుని ఇటు ప్రక్క నుండి, అటు ప్రక్క నుండి ఫోటోలు, వీడియోలు తీసేసుకుంటున్నారు. ఈమె అలా పైకి తేలుతోంది. చివరి మెట్టు చూసుకోలేదు. జెర్క్ ఇచ్చింది. మొబైల్ చేతిలోంచి ఎస్కలేటర్ మీద పడిపోయింది. ఆమె ఆ హీరోకి సాష్టాంగ పడ్డట్టు కనిపిస్తోంది అందరికీ. ఆ దృశ్యాన్ని అందరూ మొబైళ్ళలో బంధించేస్తున్నారు. సెక్యూరిటీ వాడొచ్చి ఎస్కలేటర్‍ని ఆపేసాడు. ఆ మొబైల్ కోసం గాలించి పైకి తీసాడు. “ఇక్కడ ‘నో ఫోటోగ్రఫీ’ అని ఉంది. ఎవరికీ అర్థం కాదా?” అరిచాడు. ఆవిడ భర్త పరుగున వెళ్ళబోయి అక్కడ ఆగాడు.. ఏం చెయ్యాలో తెలియలేదు. ఆదేశాలు లేవు!

నా ఫ్లయిట్ రెడీ అయినట్లు తెలుసుకుని లేచాను. స్వజన ధర్మం, స్వధర్మం, లోక ధర్మం – మూడు అర్థం చేసుకుని ముందుకు సాగాలంటే నిజమైన వ్యక్తిత్వాన్ని బలపరుచుకునే అసలైన సెల్ఫీ జనం ఎప్పుడు తీసుకోవటం నేర్చుకుంటారోననే వింత ఆలోచన కలిగింది! ఏదో మొబైల్ మ్రోగినట్లయి బ్యాగ్ సర్దుకుని చూసాను. అక్కడ కూర్చీలో ఆయన గాభరాలో మరిచిపోయిన మొబైల్.. మ్రోగుతోంది అలా. స్క్రీన్ మీద ‘అన్నయ్య’ అని కాలర్ పేరు కనిపిస్తోంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here