[శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారి ‘శాపానుగ్రహశక్తిమంతుడు – వేములవాడ భీమకవి’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
వేములవాడ భీమకవి శాపానుగ్రహశక్తిమంతుడుగా, ఉద్దండకవిగా సుప్రసిద్ధుడు. శ్రీనాథుడంతటి కవిసార్వభౌముడు ‘వచియింతు వేములవాడ భీమనభంగి నుద్దండలీల నొక్కొక్క మాటు’ అన్నాడు మరి.
కం.
భీమకవి రామలింగని
స్త్రీమన్మథుఁడై చెలంగు శ్రీనాథకవిన్
రామకవిముఖ్యులను బ్రో
ద్దామగతిన్ భక్తి మీఱఁ దలఁచి కడంకన్॥
అన్నాడు కూచిమంచి జగ్గన.
కం.
లేములవాడక సుఖియై
లేమలవాడన్ జనించి
లేమలవాఁడన్ నామంబునఁ బరగిన నుత
భీమున్ గవిభీము సుకవిభీముఁ దలంతున్॥
అన్నాడు గోపరాజు.
ఈ భీమకవి నివాసం గోదావరీమండల దాక్షారామపు లేములవాడగా కొందరు, నైజాం రాష్ట్రం వేములవాడగా ఇంకొందరు భావిస్తున్నారు.
రెండు వాదాలూ కొట్టివేయదగ్గవి కాదు.
శ్రీనాథునిలాగా భీమకవీ తెలుంగాధీశుని కస్తూరీ ఘనసారాది సుగంధవస్తువులు యాచించినట్లు ఒక చాటుపద్యముంది.
మ.
ఘనుఁడన్ వేములవాడవంశజుఁడ దాక్షారామభీమేశనం
దనుడన్ దివ్యవిషామృత ప్రకటనానాకావ్యధుర్యుండ భీ
మన నా పేరు నెఱుంగఁ జెప్పితిఁ దెలుంగాధీశ!
కస్తూరికా ఘనసారాదిసుగంధవస్తువులు వేగం దెచ్చి లాలింపురా!
‘తెలుంగాధీశుడు’ గాక ‘కళింగాధీశుడు’ అయివుండొచ్చని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు భావిస్తున్నారు.
భీమకవి ప్రసిద్ధమైన కవిజనాశ్రయం కర్త అని లోకప్రతీతి. కానీ గ్రంథంలో ‘రేచన’ కర్త అని ఉన్నది. రేచన పేరున గోదావరీమండల దాక్షారామభీమేశ్వరస్వామి ఆలయంలో ఒక శాసనం కనిపిస్తున్నది. . భీమకవి యా రేచన పేరుతో కవిజనాశ్రయం రచించివుండవచ్చు .
వేములవాడ భీమకవి గ్రంఠాలేవీ ప్రస్తుతం లభ్యం కాకపోయినా అతని పేరుతో చాల చాటుపద్యాలు ప్రచారంలో ఉన్నాయి. సాహిణి మారన, చాళుక్యచొక్కభూపతి, సాగిపోతరాజు, (అనంతవర్మ) కళింగగంగ దేవుడు, చోడగంగడు, మైలమభీమడు, నల్లసిద్ధి, లేటివరపు పోతరాజు, రణతిక్కనల మీద చాటుపద్యాలు చెప్పాడు ఈ కవి.
ఇందులో కొన్ని కల్పితాలు అయినా కావచ్చు.
మైలమభీమని పై భీమకవి చెప్పిన ప్రశస్తమయిన ప్రశంసా పద్యాలలో మచ్చుకు రెండు పద్యములు ప్రస్తావిస్తాను.
~
అరినరు లేఱువభీమని
పొరువున మనలేరు చిచ్చుపొంతను వెన్నై
తెరువునఁ బెసరై జూదరి
సిరియై రేన్చెట్టుక్రింద జిల్లెడుచెట్టై
~
యాచకఖేచరుండు సుగుణాంబుధి మైలమభీమఁ డీల్గినన్
జూచి వరించె రంభ, యెడఁజొచ్చెఁదిలోత్తమ, దారి నిద్దఱన్
దోచె ఘృతాచి, ముగ్గుఱకు దొడ్డడికయ్యము పుట్టె, నంతలో
నాఁచుకుపోయె ముక్తిసతి, నవ్విరి యద్దశఁ జూచి నిర్జరుల్!
~
వేములవాడ భీమకవి శాపానుగ్రహశక్తిమంతుడనటానికి చాల చాటు ధారలున్నాయి.
గుడిమెట్ట గ్రామానికి వెళ్ళినప్పుడు ఏ కారణం చేతో సాగిపోతురాజనే రాజు భీమకవి గుర్రాన్ని తన అశ్వశాలలో బంధించి, అతగాడు ఎంత వేడుకొన్నా విడిపించలేదుట. దాంతో వెర్రి కోపం తన్నుకొచ్చిన భీమకవి ఆ రాజు ఏడు రోజులకు చస్తాడని శపిస్తూ ఈ పద్యం చదివాడుట.
చం.
హయ మది సీత, పోతవసుధాధిపుఁ డారయ రావణుండు,
ని శ్చయముగ నేను రాఘవుఁడ, సహ్యజ వారిధి, మారుఁ డంజనా
ప్రియతనయుండు, లచ్చన, విభీషణుఁ డా గుడి మెట్టఁ లంక నా
జయమును బోతరక్కసుని చావును నేడవనాఁడు చూడుఁడీ!
అట్లాగే. కోమటి వారిని నిందించినట్లూ భీమకవి పద్యాలు కొన్ని ‘లక్షణ గ్రంథము’లో కనిపిస్తాయి.
చం.
గొనకొని మర్త్యలోకమునఁగోమటి పుట్టఁగఁ బుట్టెఁ
దోన బొం కును గపటంబు లాలనయుఁ గుచ్చితబుద్ధియు రిత్తభక్తియున్
ననువరిమాటలున్ బరధనంబును గ్రక్కున మెక్కఁ జూచుటల్
కొనుటలు నమ్ముటల్ మిగులఁగొంటుఁదనంబును మూర్ఖవాదమున్!
భూలోకంలో కోమటివారు పుట్టినట్లు తెలిసి కల్ల, కపటం లాంటి కుత్సిత బుద్ధులు కొన్ని.. తాము కూడా పుట్టాయని కవి తిట్టాడు ఈ పద్యంలో. కోమటివారి మీద భీమకవి చెప్పిన తిట్టు పద్యాలు ఇంకా చాల ఉన్నాయి.
తిట్టిపోయడమే కాకుండా అనుగ్రహించి చెప్పిన పద్యాలూ చాల ప్రచారంలో ఉన్నాయి. సాహిణిమారుడనే దండనాథుఁడు చాళుక్యచొక్కభూపతి నెదిరించి యుద్ధానికి తమారయ్యాడుట! ఆ దండనాథుడికి శాపం పెడుతూ చొక్కభూపతికి జయం కలగాలని అనుగ్రహించిన ఈ పద్యం అందుకు ఉదాహరణ.
ఉ.
చక్కఁదనంబు దీవియగు సాహిణిమారుఁడు మారుకైవడిన్
బొక్కిపడంగలండు చలమున్ బలమున్ గల యాచళుక్యపుం
జొక్కనృపాలుఁడుగ్రుఁడయి చూడ్కుల మంటలు రాలఁ జూచినన్
మిక్కిలి రాజశేఖరునిమీఁదికి వచ్చిన రిత్తవోవునే!
ఆస్థానానికి వెళ్ళినప్పుడు కళింగగంగు అనే రాజు అనాదరంగా ‘ఇలా వేళా పాళా రావటమేంటి?’ అని దురుసుగా మాట్లాడుట. దాంతో వళ్ళు మండిన భీమకవి ‘ముప్ఫై రెండు రోజుల తరువాత నిష్ట దరిద్రుడవయిపోతావ’ని రాజు మీద షష్టాష్టకాలు చదివేసాట్ట.
ఉ.
వేములవాడభీమకవి వేగమె చూచి కళింగగంగు తా
సామము మాని కోపమున సందడి దీఱిన రమ్ము పొమ్మనెన్
మోమును జూడ దోస మిఁక ముప్పదిరెండుదినంబు లావలన్
జామున కర్దమం దతని సంపద శత్రులపాలు గావుతన్.
కవి శాపం నిజమయింది. రాజకళింగగంగు గర్భదరిద్రుడైపోయాడు. పొట్టకూటి కోసం ఎవరి కంటా పడకుండా మారు వేషంలో ఇల్లిల్లూతిరిగి బిచ్చమెత్తుకుంటున్నాడు. భీమకవి ఒకరోజు రాత్రి పల్లకీ ఎక్కి దివిటీల వెలుగులో ఎక్కడికో పోతున్నప్పుడు గోతిలో పడి రోదించే ఆ రాజు దుస్థితికి జాలిపడి ఇలా అనుగ్రహించాడుట.
ఉ.
వేయుగజంబు లుండఁ బదివేలు తురంగము లుండ నాజిలో
రాయలఁగెల్చి సజ్జనగరంబునఁ బట్టము గట్టుకో వడిన్
రాయకళింగగంగు కవిరాజభయంకరమూర్తిఁ జూడఁగాఁ
బోయెను మీనమాసమునఁ బున్నమ వోయిన షష్ఠినాటికిన్॥
తన పెరట్లోని ఆముదం చెట్టు ఆకులను ముందుకోసంగాను కోసుకొనేందుకు వచ్చిన భీమకవి నౌకరును పొరతో కొట్టాడుట ఒక బ్రాహ్మణుడు. దానికి కోపమొచ్చి భీమకవి ఆ బ్రాహ్మణుడు చచ్చిపోతాడని తిట్టిపోశాట్ట. అదే నిజమయింది చివరకు బ్రాహ్మణుడికి.
కం.
కూరడుగము కాయడుగము
నారయఁగా నుల్లి బచ్చ లల్లమడుగ మా
పేరాముదపా కడిగినఁ
బారమ్మునఁ నేసె నట్టె బాపడు డ్రెళ్ళున్.
అట్లాగే జన్నమాంబ అనే ఆమెకు ఉన్న గండమాలావ్యాధిని పద్యరచన చేసి నయంచేశాడన్న కథా ప్రచారంలో ఉంది.
కం.
ఘనరోగంబులబలమా?
కనుఁగొనఁగా జన్నమాంబకర్మపుఫలమా?
నినుఁ బ్రార్థించెద వినుమా
మునుకొని యోగండమాల! మునుగకుఁ జనుమా!
కానీ కొన్నాళ్ళకు ఆమె మీద ఎందుకో కోపం రావటంతో పోగొట్టిన ఆ వ్యాధినే ఓ పద్యం చదివి తిరిగి అంటగట్టాడని కథ.
భీమకవి తన శాపానుగ్రహశక్తిని తానే గొప్పగా చెప్పుకొన్న పద్యం ఇది:
సీ.
గడియలోపలఁదాడి కడఁగి
ముత్తునియగాఁ దిట్టిన మేధావి భట్టుకంటె
రెండుగడెల బ్రహ్మదండిముండ్లన్నియు
దుల్లఁ దిట్టినకవి మల్లుకంటె
మూఁడుగడెలకుఁ దా మొనసి యత్తిన గండి
పగులఁ దిట్టిన కవిభానుకంటె
అఱజాములోపలఁ జెఱువు నీళ్ళింకంగఁ
దిట్టినబడబాగ్ని భట్టుకంటె
గీ.
ఉగ్రకోపి నేను నోపుదు
శపియింపఁ గ్రమ్మఱింప శక్తి గలదు నాకు
వట్టిమ్రానఁ జిగురు పుట్టింప గిట్టింప
బిరుదు వేములాడ భీమకవిని.
ఉ.
రామునమోఘ బాణమును రాజశిఖామణికంటిమంటయున్
భీముగదావిజృంభణ ముపేంద్రునివజ్రముఁ జక్రిచక్రమున్
దామరచూలివ్రాఁతయును దారకవిద్విషుఘోరశక్తియున్
లేములవాడ భీమకవి లేశము తిట్టిన రిత్తవోవునే!