సిగ్గులేని జాతి “షేంలెస్”

0
49

“కొన్ని విషయాలు మనకు తెలిసినవే అయినా, కొన్ని చిన్నచిన్న మెలకువలు కొత్తగా కలుగుతాయి. అందుకే దీన్ని చూడతగ్గ లఘు చిత్రం అంటున్నాను” అంటూ ‘షేమ్‌లెస్’ షార్ట్ ఫిల్మ్‌ని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి.

ఈ వారం మరో లఘు చిత్రం. ఇది పదిహేను నిముషాల నిడివి కలది. గొప్ప చిత్రమా? కాకపోవచ్చు. కానీ రూపకల్పన అందంగా వుంది. లఘు చిత్రాలకు అవసరమయ్యే సస్పెన్సు వగైరాలు కాస్త అతి గా అనిపించవచ్చు కాని, మన కాలపు మనిషి లక్షణాలు బయటపెడుతుంది ఈ చిత్రం.

ఇద్దరు నటులూ మంచి నటులే. హుసేన్ దలాల్, షాయాని షిండే. ముఖంగా షిండే. వొక 10/10 గదిలో ఎక్కువ తిరగడానికి కూడా అవకాశం లేని చోట వాళ్ళు సంభాషణా చాతుర్యంతో, హావభావాలతో మనల్ని కట్టిపడేస్తారు. అస్తవ్యస్తంగా వున్న గది. సోఫాలో కునికిపాట్లు పడుతున్న హుసేన్. హాఫ్ పేంట్స్, టీ షర్టు వేసుకుని వున్నాడు. కాలింగ్ బెల్ మోగుతుంది. వినిపించుకోడు. మరలా మరలా మోగుతుంది. మెలకువ వచ్చి తలుపు తీస్తాడు. ఎదుట సాయాని షిండే. తను ఆర్డరిచ్చిన తిండి తీసుకు వచ్చింది. ఆలస్యంగా వచ్చినందుకు తిడతాడు. ఆమె క్షమాపణలు కోరుతుంది. కొన్ని క్షణాల తర్వాత ఆ ఫుడ్ డెలివరి వాళ్ళకి ఫోన్ చేసి తను డైట్ కోక్ అడిగితే మామూలు కోక్ పంపారని మళ్ళీ తిట్ల వర్షం కురిపిస్తాడు. ఈ సారి షిండే వచ్చి డైట్ కోక్ ఇచ్చి మామూలు కోక్ తీసుకెళ్తుంది. పిజ్జలు ఎక్కువ తిన్నాడని, గేస్ అయిపోయి అతను వదులుతున్న అపానవాయువు చెబుతుంది. కాసేపు తర్వాత వంటగదిలోకెళ్తాడు. అన్ని డబ్బాలూ ఖాళీగా వున్నాయి. మళ్ళీ ఫోన్ చేసి ఆర్డరిస్తాడు. మళ్ళీ షిండే వస్తుంది. మరో సారి అతను నోటి దూల తీర్చుకుంటాడు. సార్, రెండు యాభైలున్నాయా అని అడుగుతుంది షిండే. ఇదొక్కటే మిగిలింది, నాచేత ఈ డెలివరీ పని కూడా చేయించుకో అని తిడుతూ లోపలికెళ్ళి తన పర్సు తీస్తుంటాడు రెండు యాభైల కోసం. మరు క్షణం తల మీద మోదడంవలన అతను స్పృహ కోల్పోతాడు. ఇప్పుడతను కుర్చీలో కూర్చుని వున్నాడు. కాళ్ళూ చేతులూ కట్టేసి వున్నాయి. నోట్లో టిష్యూ పేపర్ల వుండ. ఎదుట షిండే. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న మాటలలోంచే మనమే గుర్తించని మనలోని వొక పార్శ్వం కనిపిస్తుంది.

నగరీకరణ జరిగింది. జీవితం మారింది. ఇంటర్నెట్టు రాకతో మరింత. ఇప్పుడు ఈ మొబైళ్ళలో నెట్ వాడకం ఆ మార్పుని పదింతలు చేసింది. ఇంట్లో కూర్చునే తిండి తెప్పించుకోవచ్చు, సరుకులు తెప్పించుకోవచ్చు, టేక్సి పిలిపించుకోవచ్చు. ఒక్కటేమిటి సర్వం. కొత్త వ్యాపారాలు వచ్చాయి. కొత్త ఉపాధులు అందుబాటులోకొచ్చాయి. ఇంకా?

ఈ నెట్టు, ఫేస్ బుక్కు, వాట్సాప్ లు కొత్త కొత్త స్నేహాలకు తావిచ్చాయి. దూరాలన్నీ చెరిగిపోయాయి. అయితే మనిషులు దగ్గరయ్యారా? మనిషి ఇద్దరయ్యాడా? కొన్ని విషయాలు మనకు తెలిసినవే అయినా, కొన్ని చిన్నచిన్న మెలకువలు కొత్తగా కలుగుతాయి. అందుకే దీన్ని చూడతగ్గ లఘు చిత్రం అంటున్నాను.

W కీథ్ గోంస్ తనే వ్రాసుకుని తనే దర్శకత్వం వహించాడు. వ్రాత, చిత్రీకరణా రెండూ బాగున్నాయి. ఒవైస్ ఖాన్ కెమెరా పనితనం, జాషువా రోడ్రిగ్స్ సంగీతం బాగున్నాయి. వొక పెద్ద చిత్రం లో ఈ అంశాన్ని తడమాలంటే తగిన న్యాయం చెయ్యడం కుదరకపోవచ్చు. లఘు చిత్రంలో దీన్నే భూతద్దంతో చూపించడానికి వీలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here