శంఖాకార పైన్ చెట్లు

0
9

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘శంఖాకార పైన్ చెట్లు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ప[/dropcap]దిహేను పదహారేళ్ళ క్రిందట స్విట్జర్లాండ్ వెళ్ళినపుడు పైన్ చెట్లను తొలిసారిగా చూశాను. మంచు ప్రదేశాలలో పర్వతాల మధ్యన లోయల్లో పెరుగుతాయని తెలుసుకున్నాను. ఆల్ఫ్స్ పర్వతాల మీద కేబుల్ కార్లలో వెళుతున్నపుడు పైన్ చెట్లు చేతికి తగిలేంత దగ్గరగా కనిపించాయి. అంతకముందు బాటనీ టెక్ట్స్ బుక్కుల్లో చదవటమే తప్ప చూసింది లేదు. ఇవి కోనిఫర్ లకు చెందిన చెట్లని పుస్తకాల్లో చదివాము. తర్వాత మా పిల్లలు స్కూళ్ళకు వెళుతూ ఉన్నపుడు హిమాలయాల చెట్ల గురించి చెప్పే పాఠంలో చెప్పాను. నేను దేవదారు, మేపుల్, చినార్, పైన్ చెట్ల అందాలతో ఛార్టులు పిల్లల కోసం తయారు చేశాను. వీటిని అనేక ఎగ్జిబిషన్లలో ప్రదర్శించాను. ప్రస్తుతం మా సృజన్ పిల్లల హాస్పిటల్లో పిల్లల కోసం మిల్కీ మ్యూజియంలో ప్రదర్శింపబడుతున్నాయి. స్విట్జర్లాండ్‌లో మేము ‘ఎడిల్ వీస్’ అనే హోటల్లో ఉన్నాము. ఆ హోటల్ ఆవరణలో పైన్ చెట్లు ఉన్నాయి.

వాటిని చూసి నా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆ చెట్టును తనివితీరా తాకి సంతోష పడటమే గాకుండా ఫోటో కూడా తీసుకున్నాను. అప్పుడే ఆ చెట్టు కింద రాలిన పైన్ చెట్టు మొక్క ఎండు కాయలు కనిపించాయి. అవి చాలా అందంగా ఉన్నాయి. అసలే నాకు చెట్ల యొక్క ఎండు కొమ్మలతో బొమ్మలు చేసే అలవాటు ఉన్నది కదా! మరింకెందుకు ఆలస్యం! వెంటనే ఆ ఎండు కాయల్ని ఏరుకున్నాడు ఇది ఆడ, మగ పుష్పాలు ఉండే శంఖులన్నమాట చాలా అద్బుతంగా ఉన్నాయి. నేను వాటిని ఒక కవర్లో భద్రపరిచి ఇండియాకి తెచ్చుకున్నాను. ఇంతకీ ఈ ‘ఎడిలేవిస్’ అనే పేరెంటో తెలుసా? స్విట్జర్లాండ్ జాతీయ పుష్పం పేరు. ఆ పువ్వులను కూడా చూసి సంతోషించాను.

పైన్ చెట్ల శంఖుల్ని కడుగుదామని నీళ్ళలో వేశాను. నిపుణుడైన కొయ్య కళాకారుడు చెక్కినట్లుండే పూల రెక్కల వలే ఉండే శంకుల్ని ముడుచుకుపోయాయి. నాకు చాలా బాధేసింది. అయ్యో అనవసరంగా నీళ్ళలో వేశానే అనుకున్నాను. నీళ్ళలో నుంచి తీసి ఎండలో పెట్టాను. నేనేదో తయారు చెయ్యాలి అని ఆశిస్తే అవి అలా ముడుచుకు పోయామేమిటి అని చాలా నీరసం వచ్చింది. ఎండలో పెట్టాక కాసేపటి తర్వాత చూశాను. మళ్ళీ చక్కగా విచ్చుకుని కనిపించాయి.

ఓ కొత్త విషయం కనిపెట్టానని “యురేకా” అని అరుద్దామనుకున్నాను. నీళ్ళలో వేస్తే పూర్తిగా ముడుచుకుపోయి మొగ్గల మారిపోయాయి. ఎండలో పెట్టి ఆరపెట్టగానే పువ్వుల్లా విచ్చుకున్నాయి. ఈ పైన్ చెట్ల శంఖులకు బంగారం, వెండి రంగులు వేసి ఇంద్రలోకపు పువ్వుల్లా మార్చాను. మా అద్దాల షెల్ఫులో ఇప్పటికీ అందంగా అమరి ఉన్నాయి.

స్విట్జర్లాండ్‌లో చూశాక మళ్ళీ ఈమధ్య కాశ్మీర్ లోయలో పైన్ చెట్లను చూడటం జరిగింది. పాత చుట్టాలను చూసినంత ఆనందం కలిగింది. పైనేసి కుటుంబానికి చెందిన శంఖాకార చెట్లివి. ఇవి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతాయి. ప్రధానంగా ఉత్తర సమ శీతోష్ట ప్రాంతాలలో కనిపిస్తాయి. ఈ చెట్లుకు మృదువైన కలప లభిస్తుంది. పైనేసి కుటుంబంలో దాదాపు 126 జాతుల చెట్లున్నాయని మిస్సోరీ బొటానికల్ గార్డెన్ మరియు రాయల్ బొటానికల్ గార్డెన్స్ వారు పరిశోధించి ప్రకటించారు. వీటిని ఆకు, శంఖు, విత్తన లక్షణాలను బట్టి రెండు ఉప జాతులుగా విభజించారు. పైనస్ ఉపజాతిలో సుమత్రన్ పైన్, కొరియన్ ఎరుపు పైన్, పర్వత పైన్, జపనీస్ బ్లాక్ పైన్, తైవాన్ రెడ్ పైన్, స్టోన్ పైన్ వంటి అనేక రకాలు పైన్ జాతులున్నాయి. అలాగే స్ట్రోబస్ ఉప జాతిలో ఫాక్స్ టైల్ పైన్, తూర్పు తెలుపు పైన్, బ్లూ పైన్, కొలరాడోపిన్యాస్, స్విస్ పైన్, భూటాన్ వైట్ పైన్ వంటి అనేక రకాలున్నాయి

ఈ చెట్లు సాధారణంగా 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు జీవిస్తాయి. గ్రేట్ బేసిన్ బ్రీస్టల్ కోనే పైన్ అనే పురాతన పైన్ చెట్టు 4,600 సంవత్సరాల క్రిందటి ప్రాచీనమైన చెట్టు.  బాగా ఎండి పోయిన ఇసుక నేలల్లో పెరుగుతాయి. లింబర్, బ్రిస్టల్ కోనే వంటి జాతులు నీరు బాగా దొరకకపోయినా తట్టుకుంటాయి. ఆకులు పొడవుగా సూదుల్లా ఉటాయి. కాండం మొక్క చుట్టుకొలత 10 నుండి 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఆడ, మగ శంఖువుల పొడవులో తేడా ఉంటుంది. పుప్పొడి వెదజల్లబడ్డాక చెట్ల నుండి శంఖువులు రాలి కిందపడిపోతాయి. నేను స్విట్జర్లాండ్‍లో ఏరుకుని తెచ్చుకొన్నవి ఈ శంఖులే. వీటి విత్తనాలు చిన్నవిగా ఉంటాయి. పైన్ చెట్లు 50 అడుగుల నుంచి 260 ఆడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. కొన్ని మరుగుజ్జు చెట్లు కూడా ఉటాయి. సైబీరియన్ ద్వార్ఫ్ పైన్ అతి చిన్నగా మూడు నుంచి పది అడుగులు మాత్రమే పెరుగుతుంది.

సీతాకోకచిలుకలు, చిమ్మటలు వంటి పురుగులు ఈ చెట్ల ఆకుల్ని తింటాయి. వడ్రంగి పిట్టలు, క్రాన్ బిల్స్, సిస్కిన్‍లు ఈ చెట్ల విత్తనాలను తింటాయి. ఈ చెట్లును క్రిస్మస్ చెట్టుగా అలంకార చెట్టుగా ఉపయోగిస్తారు. వడ్రంగులు తయారు చేసే వస్తువులకు పైన్ చెట్లు కలప ఉపయోగ పడుతుంది. విత్తనాలను బేకింగ్ కోసం, వంట కోసం ఉపయోగిస్తారు. అకుల్ని ఉడికించి టీ తయారు చేస్తారు.

ప్రకృతి దృశ్యాల పెంపకాలకు పైన్ చెట్లలో అన్ని రకాలను ఉపయోగిస్తారు. వీటి మొక్క సూది రకపు ఆకులతో ప్రత్యేక మైన చెట్లుగా గుర్తింపబడతాయి. జపనీస్ వైట్ పైన్, స్విస్ మౌంటెన్ పైన్, జోప్పి జెఫ్రీ పైన్, అంకుల్ ఫోగి పైన్, స్కాట్స్ పైన్, బరెగాన్ గ్రీన్ పైన్, సిల్వేర్ కొరియన్ పైన్ వంటి పైన్ చెట్లను ఆకురాల్చే చెట్లు అంటారు. జపనీస్ వైట్ పైన్‌ను బోన్సాయ్ చెట్టుగా మార్చడానికి ఉపయోగిస్తారు. ఒక కాండాన్ని ఉత్పత్తి చేస్తూంది. ఈ చెట్టుకు రెండున్నర అంగుళాల శంఖులు కాస్తాయి. గరుకైన పొలుసుల్లాంటి బెరడు వస్తుంది. వేసవి కాల ప్రారంభంలో చెట్టుకు విత్తన శంఖులు కనిపిస్తాయి. జోప్పి జెఫ్రీ పైన్ చెట్లు సన్నీ రాక్ గార్డెన్లలో పెంచడానికి పనికొస్తుంది. బొప్పి యొక్క ఆకులు నీలం ఆకుపచ్చ రంగులో సుందరంగా ఉత్పత్తి చేస్తాయి. సిల్వేరే కొరియన్ పైన్ చెట్టు మధ్యరకపు మరుగుజ్జు చెట్టుగా పెరుగుతుంది.

కీటకాల వలన, శిలింద్రాల వలన పైన్ చెట్ల కాండాలకు ముప్పు కలుగుతుంది. వీటి కాండాలకు వచ్చే జిగురును అనేక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. తుఫానుల్లో ఈ చెట్లు విరిగి పడే అవకాశం ఉంటుంది. పైన్ చెట్లు సాధారణంగా సంవత్సరానికి రెండు అడుగుల కన్నా ఎక్కువగా పెరుగుతాయి. పర్వత ప్రాంతాల్లో పెరిగే పైన్ చెట్లు గురించిన విశేషాలివి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here