శంకర విజయం

0
9

[12 మే 2024 శంకర జయంతి సందర్భంగా శ్రీమతి కానాల సుమంగళి గారి ‘శంకర విజయం’ అనే రచనను అందిస్తున్నాము.]

~
పరిత్రాణాయ సాధునాం, వినాశాయ చ దుష్కృతాం ,
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

భారతీయ ఆస్తికత అల్లల్లాడు తరుణాన
ఆది శంకరులు జనించే సాక్షాత్ శివాంశాన

ఆది శంకరుల జననం – సనాతన సాంప్రదాయాల పునరాగమనం
భారతదేశంలో ఆనాటి అవైదిక సంస్కృతుల తిరోగమనం

భారతజాతి అజ్ఞానం తొలగింప జన్మించిన ఘనుడు
విజ్ఞాన కాంతులను దశ దిశలా వ్యాపింపజేసిన భానుడు

అద్వైత సిద్ధాంత రూపకల్పనా దురంధరుడు
హిందూ ధర్మాన్ని పునఃస్థాపన చేసిన మహోన్నతుడు

జ్ఞానం మూర్తీభవించిన మన రెండవ జగద్గురువు
వైదిక సాంప్రదాయ ప్రచారకర్తగా మన ఆది గురువు

ఉపనిషద్ బ్రహ్మసూత్ర భగవద్గీతల భాష్య కర్త
సుప్రసిద్ధ వివేక చూడామణి ప్రకరణ గ్రంథకర్త

నేను ఆనంద స్వరూపడనని గౌడపాదుల మెప్పించిన గడుసుదనం
బాల్యంలోనే బహిర్గతమైంది ఆదిశంకరుల మేధావీతనం

పేద బ్రాహ్మణి దుస్థితి బాపగా తొలిసారి విప్పె గాత్రం
అశువుగా జాలువారే శంకరుల నోట కనకధారా స్తోత్రం

తల్లి ఆర్యాంబ అనుమతి గొని, సన్యాసాశ్రమ స్వీకరణం
జనన మరణ చక్రబంధ పాశాల నుండి విరమణం

జనని శ్రమ తప్పించ పూర్ణా నది దిశ మార్చిన ప్రేమ మూర్తి
జలాకర్షణ మంత్రంతో నర్మదా నదిని బంధించిన ఘన కీర్తి

సౌందర్య లహరి, శివానందలహరి లోని స్తోత్ర వర్ణనలు
మనోఫలకంపై కదలాడి తీరు, శివపార్వతుల స్వరూపాలు

మండన మిశ్రునితో పూర్వ మీమాంస ఖండన మండనలు
ఉత్తర మీమాంసను బలపరిచే వాద ప్రతివాదనా రూపాలు

కర్మ ఉపాసనలతో చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రతలు సాధ్యం
జ్ఞానకాండ వల్లే మనకు మోక్షం లభించుట తథ్యం

ఉభయ భారతి కామశాస్త్ర శరసంధాన ప్రక్రియా విధానం
అమరక రాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేసి, ఇచ్చె సమాధానం

పూర్వపక్షుల శుష్క వితండవాదం అర్థరహితం
శ్రుతిని బలపరిచే శంకరుల తర్కవాదం అర్థసహితం

జ్ఞాన బోధతో తల్లికి ఏర్పరిచే పరమపద సోపానం
యోగాగ్నితో చితి రగిల్చి కన్నతల్లి రుణం తీర్చిన విధానం

ప్రసవించే కప్పను పాము పడగతో రక్షించిన ఉదంతం
జాతి వైరం లేనిదీ శృంగేరని శారదా పీఠం స్థాపించిన వృత్తాంతం

మండన మిశ్రుని ఓడించి సురేశ్వరాచార్యునిగా మార్చిన వైనం
పవిత్ర శృంగేరి లోని శారదా పీఠాధిపతిగా చేసె నియామకం

తొలి శిష్యుడు విష్ణు శర్మకు పద్మపాదునిగా చేసె నామకరణం
పూరీలోని గోవర్ధన మఠాధిపతిగా పదవీ నిర్ధారణం

మూగవాని జ్ఞానమెరిగి హస్తామలకుడని నామమిడె
ఆచార్యుని గావించి ద్వారకా పీఠాధిపత్యం ఒసంగబడె

మందబుద్ధి కాలనాథుని సేవకు మెచ్చి ప్రసాదించె జ్ఞానం
తోటకాష్టంతో స్తుతింప బదరీలోని జోషి మఠం అప్పగించిన వైనం

దివ్య క్షేత్ర దర్శనాలు, లింగస్థాపనలు శంకరుల భక్తికి తార్కాణం
హిందూమతైక్యతకు శైవ వైష్ణవ శాక్తేయ శాఖల సమీకరణం

గురుపరంపరగా సనాతన ధర్మ పరిరక్షణలో శంకరుల ప్రమేయం
ప్రియ శిష్యులను మఠాధిపతులను చేయుటలోని ఆంతర్యం

తత్వ జ్ఞాని మేధావి, కవి, సర్వజ్ఞ పీఠాధిపతి నామధేయుడు
బదరీ, కేదార్నాథ్ దర్శించి ముక్తిని పొందిన అధినాయకుడు

బ్రహ్మసత్యం జగన్మిథ్య – జీవో బ్రహ్మైవ నాపరా
అర్థం తెలిసి మసులుకుంటే జన్మ ధన్యమే కదా

సహనావవతు సహనం భునక్తు , సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు ,మా విద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here