శాపగ్రస్తులు

0
11

[dropcap]“మా[/dropcap]స్టారూ! పూర్వ విద్యార్థులం అందరం మన స్కూలు ఉపాధ్యాయుల్ని సన్మానించాలనుకుంటున్నాం. మీరు తప్పకుండా రావాలి” సుధాకర్ ఫోన్ చేసి చెప్పాడు.

మా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతమందో విద్యార్థులు. చేరిన వాళ్ళు స్కూల్లో చేరుతారు. చదువులు ముగించుకుని స్కూలు విడిచిపెడ్తారు. అయితే అంతమందిని గుర్తుంచుకోవటం ఉపాధ్యాయులకి చాలా కష్టం. అయితే క్లాసులో బాగా అల్లరి చేసేవాళ్ళు; మంచి మార్కులు తెచ్చుకునేవారు మా ఉపాధ్యాయ వర్గానికి బాగా గుర్తుండిపోతారు.

సుధాకర్ క్లాసులో బాగా అల్లరి చేసేవాడు. అందరి చేతా చేయిపించేవాడు. విద్యార్థులకి నాయకుడు కూడా. ఉపాధ్యాయులకి మారుపేర్లు పెట్టి పిలవటంలో దిట్ట. ఇలాంటి వాడిని ఓ త్రోవలో పెట్టాలి అని ఆలోచించారు మా ప్రధానోపధ్యాయులు. వెంటనే అతడ్ని స్కూలుకి యస్.పి.ఎల్. – అదే స్కూలుకి విద్యార్థి నాయకుడిగా నియమించారు. ఇలా నియమిస్తే స్కూల్లో కొంత అల్లరి తగ్గుతుంది, క్రమశిక్షణ ఉంటుందని అతని ఆలోచన.

అతని ఆలోచన పని చేసిందనుకుంటాను. వెంటనే స్కూలు వాతావరణంలో ఎంతో మార్పు. సుధాకర్‍లో కూడా ఎంతో మార్పు. అంత అల్లరివాడు కూడా సాఫ్ట్‌గా మారాడు. అందుకే సుధాకర్ ఫోన్ చేయగానే ఇట్టే గుర్తుపట్టాను అతడ్ని. అయినా విద్యార్థి దశలో కొంతమంది స్వభావమే అలా ఉంటుంది. ‘అది వయసు ప్రభావం వాళ్ళని తప్పు పట్టలేము’ అని అనుకున్నాను.

‘ఆ వయసులో పిల్లలకి పెద్దవాళ్ళ పర్యవేక్షణ లేకపోతే వాళ్లు చెడు మార్గం పడతారు. అందుకే పెద్దవాళ్ల మార్గదర్శనం ఎంతో అవసరం. పిల్లలు ఉన్నతంగా ఎదగాలన్నా, పతనావస్థకి చేరాలన్నా ఈ వయస్సుదే ప్రాధాన్యత. ట్రైనింగ్ పిరియడ్‍లో బాల మనోవిజ్ఞానం చదువుకుని వచ్చిన మా ఉపాధ్యాయులకే ఒకొక్క పర్యాయం వాళ్ళ అల్లరికి సహనం కోల్పోయే పరిస్థితి వచ్చేది’. తిరిగి ఆలోచిస్తున్న నేను ఆలోచనా ప్రపంచం నుండి బయటపడ్డాను.

ఇక నా విషయానికి వస్తే నేను ఉపాధ్యాయ వృత్తి నుండి పదవీ విరమణ చేసిన తరువాత సాహిత్య సేవ వేపు దృష్టి మళ్ళించాను. దాన్నే నా హాబీగా మలచుకున్నాను. పదవీ విరమణ చేసిన మా ఉపాధ్యాయుల్లో ఇద్దరు ముగ్గురు కరోనా సమయంలో మృత్యువాత పడ్డారు. మిగతా వాళ్ళు మాత్రమే ఈ విద్యార్థుల కలయిక సమావేశంలో పాల్గొన్నాము.

స్కూలు ప్రాంగణం కళకళలాడుతోంది. దగ్గరుండి మా ఉపాధ్యాయుల్ని పూర్వ విద్యార్థులు వెహికల్స్ మీద స్కూలు ప్రాంగణానికి తీసుకువచ్చారు. ఎప్పుడో విడిపోయిన విద్యార్థులు, ఇటు రిటైర్ అయి ఇన్నాళ్ళకి కలుసుకున్న ఉపాధ్యాయుల వదనాల్లో ఆనందమే ఆనందం.

చిన్న వయస్సులో మా దగ్గర చదువుకున్న వాళ్ళేనా వీళ్ళు అని విస్తుపోవడం మా ఉపాధ్యాయుల పనయింది. అందుకు కారణం వాళ్ళలో శారీరకంగా వచ్చిన మార్పే. కొంతమందిని పోల్చుకోగలుగుతున్నాం. మరికొంతమంది మా దగ్గరకు వచ్చి తమని తాము పరిచయం చేసుకుంటున్నారు. వాళ్ళల్లో ఉన్నత స్థాయికి ఎదిగినవాళ్ళు ఉన్నారు. చిన్నా చితక వృత్తులు చేసుకున్నవాళ్ళు ఉన్నారు. అయితే ఆ ప్రాంగణంలో అందరూ సమానులే.

చనిపోయిన ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆత్మకి శాంతి కలగాలని అందరూ లేచి నిలబడి నివాళులు అర్పించిన తరువాత సభ ఆరంభమయింది. ఒక్కొక్కళ్ళూ విద్యార్థి దశలో తమ తమ మధుర జ్ఞాపకాల్ని పంచుకుంటున్నారు. ప్రస్తుతం తాము చేస్తున్న పనులు, కుటుంబ వివరాలు వివరిస్తున్నారు.

మరికొంతమంది విద్యార్థి దశలో కొంతమంది ఉపాధ్యాయులని ఎలా ఇబ్బందిపెట్టింది, ఇమిటేట్ చేసింది, వాళ్ళ విద్యాబోధన ఎలా ఉండేది – ఇలా రకరకాల విషయాలు హాస్యోక్తులతో వివరిస్తూ – అక్కడ వాతావరణాన్ని వినోదభరితంగా మలిచారు.

అందరూ మాట్లాడేరు. వింటున్నాను. అయితే సురేశ్ అనే విద్యార్థి మాటలు నన్ను కదిలింప చేశాయి. ఆలోచింప చేశాయి. నాలో ఏదో తెలియని అలజడి, ఆవేదన. అతను మాట్లాడుతూ “నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. తెరిచిన పుస్తకం. నా జీవితం గురించి చెప్పుకోడానికి ఎటువంటి విశేషతలు లేవు. నాది సామాన్య సాదాసీదా జీవితం. నా సహచరులందరూ పిల్లల్తో కుటుంబ జీవితం గడుపుతూ ఉంటే నేను నాలుగు పదుల వయస్సు దాటినా ‘పెళ్ళి కాని ప్రసాదు’లా – అదే ముదర బ్రహ్మచారిగా మిగిలిపోయాను” అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వు వెనక అతని ఆవేదన, హృదయాంతరాలలో గూడు కట్టుకున్న నిరాశ నాకు అగుపించాయి.

సురేశ్ మాటలు అంతవరకూ అక్కడున్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గంభీరంగా మార్చివేసాయి. అయితే అది తాత్కాలికమే. తిరిగి కొంతమంది విద్యార్థులు వినోదబరితంగా మార్చారు. పాటలు పాడగలిగిన వాళ్ళు పాడుతున్నారు. జోకులు వేసి కొంతమంది నవ్విస్తున్నారు. ఇద్దరు ముగ్గురు మిమిక్రీ చేసి వినోదపరుస్తున్నారు. అయితే వాటి వేటి మీదా లేదు నా మనస్సు. సురేశ్ మాటలే నాకు తలంపుకి వస్తున్నాయి.

ఎవ్వరూ చూడని, గమనించని ఆవేదన సురేశ్‍లో నాకు అగుపించింది. ఆవేదన ఉన్నప్పుడు కళ్ళలో సన్నటి తెర తళుక్కుమనటం సహజం. అది కూడా వచ్చి ఉంటుంది. దూరంగా ఉండటం వలన గమనించలేకపోయాను.

ఎవరి కన్నులోనైనా కన్నీరు వచ్చిందంటే వారిలో ఆవేదన ఉన్నట్టే. అది రానంత వరకూ వాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు బాగున్నట్టే. ఆ కన్నీరు వాళ్ళ కళ్ళలో వచ్చిందంటే వారికి కన్నీరు తెప్పించిన సామాజిక పరిస్థితుల్ని బాగు చేయలేకపోయినా కళ్ళలో కన్నీరు రాకుండా వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోవచ్చు. ఇంకా వాళ్ళకి శక్తి కాని ఉంటే సమాజాన్ని కూడా బాగు చెయ్యవచ్చు. అంతే కాని ఏడుస్తూ కూర్చోకూడదు. ఇలా భావోద్వేగంగా ఆలోచిస్తున్నాను నేను.

ఆ తరువాత స్కూలు యాజమాన్యం విద్యార్థులను సంబోధిస్తూ మాట్లాడింది. అంత వరకూ బాగానే ఉంది. అయితే యాజమాన్యం విద్యార్థుల్ని స్కూలుకి అవసరమైఅ సదుపాయాలు.. బోరు తవ్వించమనడం, డైనింగ్ హాల్ కట్టించమనడం నాకు నచ్చలేదు. నాకే కాదు, విద్యార్థులకి కూడా వాళ్ళ ప్రస్తావన నచ్చలేదు. వాళ్ళ కళ్ళలో అగుపడ్తున్న అసహనాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను. విధి లేక స్కూలు యాజమాన్యం ప్రస్తావన వాళ్ళు అంగీకరించవలసి వచ్చింది.

స్కూలు యాజమాన్యం ప్రస్తావన నాకు కూడా నచ్చలేదు. పూర్వ విద్యార్థులు ఇష్టపూర్వకంగా స్కూలు గురించి తాము ఏదేనా చేయాలని ముందుకు రావాలి కాని, స్కూలు యాజమాన్యం డిమాండ్ ఏంటి అని నాకు అనిపించింది.

అంతే కాదు ఫంక్షనుకి, ఉపాధ్యాయులకు శాలువాలు, బహుమతులు ఈయడానికి పూర్వ విద్యార్థులు భారీగా ఖర్చు చేశారు. వాళ్ళలో కొందరికి స్తోమత లేకపోయినా తమ వంతు సాయం వారు చేశారు.

నాలో తర్కం. ఏం స్కూలు యాజమాన్యం స్కూలుకి తగ్గ హంగులు సమకూర్చుకోలేదా? దానికి బదులు స్కూల్లో ఎంతోమంది పేద విద్యార్థులున్నారు. వాళ్ళకి ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేయమని అడిగినా బాగుండేది. ఇది నా ఆలోచన. నా భావాన్ని అవధాని మాస్టారితో చెప్పాను.

“గోపాలం! నీ చాదస్తం కానీ, మన మాట ఎవరు వింటారు? పరిసరాలకి, పరిస్థితులకి అనుగుణంగా మసలుకోవడమే మన విధి” అన్నారాయన.

భోజనాలు అయిన తరువాత మా ఉపాధ్యాయులం స్టాఫ్ రూమ్‍లో విశ్రాంతి తీసుకుంటున్నాం. జీవితంలో మాకెదురయిన అనుభవాల్ని సాధక బాధకాల్ని ముచ్చటించుకుంటున్నాం. నా ఆలోచన మాత్రం సురేశ్ చుట్టూ తిరుగుతోంది.

కాలం మారింది అని అందరూ అంటారు. కానీ మారింది కాలం కాదు, మారింది మనిషి మనస్తత్వం. అప్పుడూ, ఇప్పుడూ రాత్రి పగలు ఒక్కటే. అదే సూర్యుడు, అదే చంద్రుడు. అవే ఋతువులు. మారిన మనస్తత్వాన్ని చూసి కాలం మారిందంటున్నారు. ఇది పొరపాటు.

“మనిషి జీవితమే చాలా విచిత్రమయినది. వయస్సులో ఉన్నప్పుడు శక్తి ఉంటుంది కానీ డబ్బు ఉండదు. మధ్య వయస్సులో డబ్బు, శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉన్నా కష్టపడే శక్తి ఉండదు” తిరిగి అవధాని గారు అన్నారు. నేనేం జవాబు ఇయ్యలేదు.

“గోపాలం! నా మాటలు విన్నావా?” నా పరధ్యానం చూసి రెట్టించారు ఆయన. “విన్నాను.. విన్నాను. నేను సురేశ్ మాటల గురించే ఆలోచిస్తున్నాను” సమాధానం ఇచ్చాను అతనికి.

“దీనిలో ఆలోచించడానికి ఏం ఉంది? నేటి అమ్మాయిలు అబ్బాయి తల్లిదండ్రుల్ని చెత్తబుట్టలుగా భావిస్తున్నారు. దానికి కారణం నేడు వాళ్ళు ఉన్న సమాజంలో వచ్చిన వికృత మార్పులు. ఏం చేయగలం? వాళ్ళ సంఖ్య సమాజంలో తగ్గిపోయింది. ఆడపిల్లల మగపిల్లల నిష్పత్తి సమాజంలో హెచ్చుతగ్గుల్లో ఉంది. సామాజిక వికృత చేష్టల వల్ల, వింత పోకడల వల్ల ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయి వాళ్ళకి ఇంత డిమాండ్. వాళ్ళ డిమాండ్ ఎక్కువయినప్పుడు వాళ్ళు తమకి అనుకూలుడయిన అబ్బాయిని ఎంచుకోవడం సహజం. వాళ్ళు చదువుకుంటున్నారు. దానికి తగ్గట్టు నాలుగు అంకెల్లో సంపాదిస్తున్నారు” సోషల్ మాస్టారు అన్నారు.

“సంపాదిస్తే సంపాదించవచ్చు. ఆకాశానికి నిచ్చెనలు వేయకూడదు. తన కన్నా ఎక్కువ జీతం వస్తున్న వాడినే పెళ్ళాడుతాను, తన కన్నా ఎక్కువ చదువుకున్న వాడినే పెళ్ళి చేసుకుంటాను అని ఆలోచించడం తప్పు. వాళ్ళు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి” సైన్సు మాస్టారు అన్నారు.

నా ఆలోచనలు మరోలా ఉన్నాయి. అమ్మాయిలు ఇలా ప్రవర్తించడానికి వాళ్ళది తప్పు కాదు. వాళ్ళకి మార్గదర్శకులుగా ఉన్న పెద్దవాళ్ళది తప్పు. కొంతమంది అమ్మాయిల ఇళ్ళల్లో తండ్రి డమ్మీ. అన్నీ తల్లే మాట్లాడుతుంది. ఏ టూ జెడ్ అంతా తల్లిదే పెత్తనం.

పూర్వం అమ్మాయిల తల్లిదండ్రులు అబ్బాయిల ఇళ్ళకి వెళ్ళేవారు. కాని పరిస్థితులు రివర్సు అయ్యాయి. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులకి సంబంధం కలుపుకోవడానికి ఫోన్ చేస్తే అమ్మాయి తల్లే మొదట ఫోన్ ఎత్తుతుంది. ఆమే ఆ ఇంటికి కర్త, కర్త్మ, క్రియ.

“గోపాలం! ఏం ఆలోచిస్తున్నావు?” అవధాని గారు రెట్టించారు.

“లోకం పోకడ.”

“అంటే?”

“ఈ రోజుల్లో అమ్మాయి బాగా సంపాదిస్తోంది. సంపాదనతో పాటూ వాళ్ళ ఆలోచనా విధానం కూడా వేరు. నాకు నువ్వు, నీకు నేను – మనం ఇద్దరం ఉంటే చాలు, మరెవ్వరూ వద్దు అనే ధోరణిలో ఉన్నారు. సుఖంలో ఎవరి అవసరం ఎవరికీ అక్కరలేకపోయినా, కష్ట సమయంలో మన వాళ్ళు అనే వాళ్ళు ఉండాలి.”

“గోపాలం! నీ ఆలోచన బాగుంది. ఆ సమయంలో అత్తింటి వాళ్ళు అక్కరలేకపోయినా, పుట్టింటి వాళ్ళు ఉన్నారు కదా అన్న ధీమా అమ్మాయిలకి. చూడు, ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయానికి వస్తే – ప్రస్తుతం పెళ్ళిళ్ళు షాదీ డాట్ కామ్, మ్యాట్రిమోని పెళ్ళిళ్ళే. ఇలాంటి పెళ్ళిళ్లలో అమ్మాయి అబ్బాయి కొద్దిపాటి పరిచయంతో – పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. తరువాత ఒకరి భావాలు మరొకరికి నచ్చక విడాకులకి సిద్ధమవుతున్నారు. మన సమయంలో అయితే పెద్దలు అటు, ఇటు మంచిచెడ్డలు చూసి పెళ్ళి సంబంధం నిశ్చయించుకునేవారు. మీ తరం పద్ధతులు పాత చింతకాయ పచ్చడి అని కొట్టి పారేస్తున్నారు నేటి తరం వారు” అవధాని గారు లోకం పోకడల్ని వివరిస్తూ అన్నారు.

“మరో విషయం. సురేశ్‌కి పెళ్ళవలేదని బాధపడ్తున్నాడు అని అనుకుంటున్నాము. కానీ ఆనాడు పెళ్ళికొడుకు అమ్మాయిని చూసి నచ్చలేదు అని అంటే ఎంత బాధపడేదో? నాణానికి ఒక వేపు చూసాము, కానీ రెండో వేపు కూడా చూడాలి. కొంతమంది విప్లవ భావాలు గల అమ్మాయిలయితే ‘నేను అంగడి సరుకునా’ అని నిలదీసేవారు. అందుకే ఇప్పుడు పరిస్థితులు మారాయి అంటున్నాను” సోషల్ మాస్టారు అన్నారు.

ఇలా మా మధ్య లోకం పోకడల చర్చ జరుగుతోంది. నిశితంగా పరిశీలిస్తున్నాను. రచయితగా నేను మరింత స్పందిస్తున్నాను. అంటే ఆనాడు ‘అమ్మాయి నచ్చలేదు, నల్లగా ఉంది’ అని అబ్బాయిలంటే, ఈనాడు అమ్మాయిలు ‘అబ్బాయి నచ్చలేదు’ అని తిరస్కరిస్తున్నారు. ఆనాడు తెల్లగా ఉన్న అబ్బాయికి నల్లగా ఉన్న అబ్బాయికి తెల్లటి, అందమైన అమ్మాయే కావాలి. ఇప్పటి అమ్మాయిలు కూడా అలాగే అనుకోరా? ఆనాడు అమ్మాయి బలిపశువయితే, ఈనాడు అబ్బాయి బలిపశువవుతున్నాడు. అంతే తేడా.

“ఆనాడు అమ్మాయి నచ్చకపోతే, జాతకాలు పడలేదని అనేవారు. ఇప్పుడు అబ్బాయి నచ్చకపోతే అమ్మాయి తరఫు వాళ్ళు ఇదే మాట అంటున్నారు. ప్రేమ పెళ్ళిళ్ళు, కులాంతర, మతాంతర పెళ్ళిళ్ళు కూడా విచ్ఛిన్నమవుతున్నాయి నేడు” అని అన్నాను నేను. సురేశ్ ఉదంతం వల్ల ఇంత చర్చ జరిగింది మా ఉపాధ్యాయుల మధ్య.

తిరిగి ఇళ్ళకి వెళ్తున్న సమయంలో సుందరం అనే పూర్వ విద్యార్థి నన్ను తన కారులో మా ఇంటికి దిగబెట్టడానికి సిద్ధపడ్డాడు. సుందరం సురేశ్‍కి మంచి స్నేహితుడు. అంతే కాదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల సుందరం చదువు ఆపేసి కారు కొని అద్దెకు తిప్పుతూ తన జీవన యాత్ర సాగిస్తూ ఉంటే, సురేశ్ ఐ.టి.ఐ.లో ఉత్తీర్ణత సాధించి, స్టేట్ గవర్నమెంట్‍లో క్లాస్ ఫోర్ ఉద్యోగిగా జీవితం గడుపుతున్నాడు.

ఉదయం స్కూలుకి వస్తున్న సమయంలో నాలో ఉన్నంత ఉత్సాహం, ఉల్లాసం ఇప్పుడు లేవు. ఏదో నిరాశ, దిగులు, బాధ, నీరసం, నిస్సత్తువ, అశాంతి, అసంతృప్తి, నిర్వేదం నాలో. కారులో కూర్చుని గంభీరంగా ఆలోచిస్తున్నాను.

“సురేశ్ గురించే కదూ మీ ఆలోచన మాస్టారూ!” అన్నాడు సుందరం. నేను అవును అని అనలేదు, కాదు అని అనలేదు.

“నాకు తెలుసు. మీరు సురేశ్ గురించే ఆలోచిస్తున్నారు. అయితే ఒక్క విషయం. ఒక విధంగా చూస్తే, వాడు చాలా దురదృష్టవంతుడు. జీవితంలో చిత్తుగా ఓడిపోయాడు. వయస్సు పైబడుతున్నా, సర్వీస్ పెరుగుతున్నా, ప్రభుత్వంవారు సురేశ్ ఉద్యోగాన్ని టెంపరరీగానే ఉంచారు కానీ పెర్మనెంట్ చేయలేదు. ఇలాంటి వాడికి పిల్లనెవరు ఇస్తారు? ఉద్యోగం టెంపరరీ అని తల్లిదండ్రులు అతని పెళ్ళి గురించి పట్టించుకోలేదు. ఉద్యోగం పెర్మనెంట్ అయ్యేసరికి వయస్సు పైబడింది. వాడికి వచ్చిన సంబంధాలన్నీ విడాకులవి, వితంతువులవి.

జీవితంలో విసిగిపోయిన సురేశ్ ఇక జీవితంలో పెళ్ళి చేసుకోకూడదని గట్టిగా తీర్మానించుకున్నాడు. కొంతమంది అమ్మాయిలకి వాడి ఉద్యోగం నచ్చలేదు. ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అన్నది విడిచిపెడ్తే వాడి నుదుటన కళ్యాణ ఘడియ వ్రాసి లేదేమో?” సుందరం నిట్టూర్పు విడుస్తూ అన్నాడు.

ఆనాడు సమాజంలో పెళ్ళి కాని ముదర కన్యలు ఉంటే, ఈనాడు పెళ్ళి కాని ముదర బ్రహ్మచారులు మిగిలిపోతున్నారు. వాళ్ళందరూ పెళ్ళి కాని ప్రసాదులు. ఇప్పుడు ఈ ముదర బ్రహ్మచారులు సమాజంలో శాపగ్రస్తులు అనుకుంటూ నిట్టూర్పు విడిచాను నేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here