శాస్త్ర విజ్ఞానం – వైద్య రంగం

0
8

[న్యూరో టెక్నాలజీ వస్తున్న కొత్త ఆవిష్కరణలు వైద్యరంగానికి ఎలా ఉపకరిస్తున్నాయో ఈ రచనలో వివరిస్తున్నారు శ్రీమతి ఆర్. లక్ష్మి.]

[dropcap]గ[/dropcap]త 20 సంవత్సరాలలో న్యూరో టెక్నాలజీకి సంబంధించిన పరిశోధనలు, పేటెంట్స్/ఆవిష్కరణలు 20 రెట్లు పెరిగాయి. న్యూరో ఇమేజెస్, న్యూరో సిమ్యులేషన్ వంటి ముఖ్యమైన విధానాలతో కూడుకున్న ఈ సాంకేతికలన్నీ, న్యూరో టెక్నాలజీకి సంబంధించిన ఆవిష్కరణలన్నీ కృత్రిమ మేధతో ముడిపడి ఉన్నవే. నరాల పనితీరుకు సంబంధించిన సమస్యలు, డిప్రెషన్, పెరాలిసిసి, ఎపిలెప్సీ వంటి వాటి చికిత్సలో చాలా పురోగభివృద్ధిని సాధించిన మాట ముమ్మాటికీ నిజమే.

ఎలాన్ మస్క్‌కి చెందిన న్యూరాలింక్-బ్రెయిన్ ఇంప్లాంట్ చిప్ క్లినికల్ ట్రయల్స్‌కు యు.ఎస్. డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి కూడా పొందింది.

వినికిడి లోపాలు, దృష్టి లోపం, పక్షవాతం, డిప్రెషన్ వంటి వాటికి మెదడులో చిన్న చిప్‍ను అమర్చడం ద్వారా చికిత్సను అందించవచ్చని, లోపాలని సరిచేయవచ్చని క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతినీయమని కోరడం, అనతి కాలంలోనే అనుమతి లభించడం జరిగింది. ఈ ఇంప్లాంట్‌ను కంప్యూటర్‍కు అనుసంధానించడం ద్వారా సమాచారాన్ని గ్రహించవచ్చు. ఈ వ్యవస్థ ద్వారా పలు అంచెలలో మెదడు సంకేతాలు విశ్లేషించబడి అంతిమంగా కంప్యూటర్ స్క్రీన్‍పై కనిపిస్తాయి. అంటే మనసులోని మాటను చెప్పలేని స్థితిలో ఉన్న రోగులు సైతం ఈ వ్యవస్థ ద్వారా తమ ఆలోచనలను/భావాలను బహిర్గతం చేయగలుగుతారు. 20 సంవత్సరాల నుండి జరుగుతున్న అవిరళ కృషి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలాలను అందిస్తోంది.

బ్రెయిన్ – కంప్యూటర్ ఇంటర్‌ఫేస్:

ఇది మెదడు సంకేతాలను సేకరించి విశ్లేషించి, ఆజ్ఞలుగా తర్జుమా చేసి పరికరానికి అందిస్తుంది. అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రోడ్ వ్యవస్థ మెదడు లోని వివిధ భాగాల నుండి సమాచారాన్ని రికార్డు చేయడానికి వెసులు కల్పిస్తుంది. న్యూరో ఇమేజింగ్, న్యూరో స్టిమ్యులేషన్ వంటి కొన్ని ముఖ్యమైన పద్ధతుల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. డిప్రెషన్, ఎపిలెప్సీ వంటి నాడీ వ్యవస్థ పనితీరుకు సంబంధించిన సమస్యలలో చికిత్సకు స్పష్టమైన కారణాలు తెలుస్తాయి.

పెరాలిసిస్, పార్కిన్‍సన్స్ వంటి వ్యాధులలో రోగుల ఇబ్బందులను రోబోటిక్స్ సహాయంతో తగ్గించటానికీ ఈ ఇంటర్‌ఫేసెస్ ఉపయోగపడతాయి. మెదడుకు సంబంధించిన ఏ రకమైన సంకేతమైనా BCI (brain-computer interface) వ్యవస్థలో ఉపయోగపడుతుంది. శరీరంలో కదలికలను కోల్పోయిన కండరాలు ఈ వ్యవస్థ కారణంగా తిరిగి స్పందిమ్చగలగడానికీ, కొంతవరకూ ఉత్తేజితం కావడానికీ వెసులు ఏర్పడింది.

తద్వారా కృత్రిమ అవయవాల అమరికతో రోగులు కొంత వరకు స్వతంత్రంగా తమ పనులను తాము చేసుకోగల పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తిగా పూర్వపు సామర్థ్యాలను పునరుద్ధరించలేకపోయినప్పటికీ గతంలో కంటె వారి జీవన నాణ్యత చాలా వరకు పెరిగింది. తమ ఆలోచనలను చర్యల ద్వారా కొంత వరకూ అయినా వ్యక్తం చేయగల స్థాయి వరకు ఆరోగ్యం మెరుగుపడడమే దానికి కారణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here