శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-2

0
10

[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

[dropcap]నం[/dropcap]దయ్య ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. అసలు అతని ప్రతిభను గుర్తించి చేరదీసిన వారు, బందరు జాతీయ కళాశాలలో చేర్పించిన వారు కొండా వెంకటప్పయ్యగారే. అట్లే ‘మాలపల్లి’ని రాసిన ‘ఉన్నవ’ బాహ్మణుడే అని మాలతిగారు stress చేస్తారు.

నందయ్య వాళ్ల నాన్నను గురించి చదువుతూంటే, నాకు శ్రీకృష్ణదేవరాయలవారు తమ తెలుగు పంచకావ్యాల ఒకటైన ‘ఆముక్తమాల్యద’ లో సృష్టించిన ‘మాల దాసరి’ పాత్ర గుర్తుకు వచ్చింది. మాల దాసరి విష్ణుభక్తుడు. మహాజ్ఞాని. తెల్లవారుజామున, చీకట్లో చూసుకోకుండా ‘మరులు తీగ’ తొక్కి, పరవశుడై, దారి తప్పుతాడు. అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడతాడు. అతడూ జ్ఞానే! తనను విరుచుకొని తినటానికి సిద్ధమవుతున్న ఆ భయంకరాకారుని చూసి, మాల దాసరి భయపడడు. ఒక జీవి క్షుద్బాధ తీర్చడానికి, నశ్వరమైన, దైవదత్తమైన ఈ శరీరం ఉపయోగపడితే, అంతకంటే కావలసిందేమిటంటాడు. ఈ జవాబుకు బ్రహ్మరక్కసి విస్తుబోతాడు. ‘విష్ణు సేవనము చేసి తిరిగివచ్చి నీకు ఆహారం అవుతాను’ అని వేడుకుంటాడు దాసరి.

వీరిరువురి సంభాషణలో ఆధ్యాత్మిక పరిమళాలు గుబాళిస్తాయి. ‘జన్మ’లను గురించి మాల దాసరి ఇలా అంటాడు,

“సీ.
దిక్పాలతను వెత్తి తిరిపెంపు దను దోన
యెన్ని మార్లెత్త మీయెను నీవు?
మాతంగ తనువెత్తి మశకంపు దను దోన
యెన్ని మార్లెత్త మీయెను నీవు?
కేసరి తనువెత్తి కీటంపు దను దోన
యెన్ని మార్లెత్త మీయెను నీవు?
ధరణీశు తనువెత్తి దాస్యంపు దను దోన
యెన్ని మార్లెత్త మీయెను నీవు?

తే.
సోమయాజుల మెన్ని మార్ల్గాము శ్వపచ
ఖగ కుల మెన్ని మారులు గాము పాము
గాములమ యెన్ని మారులు గాము వెండి
కంస రిపుభక్తుల మొకండె కాము గాని!”

అద్భుతమైన పద్యం. “మనిషి ప్రారబ్ధ వశాన ఎన్నో జన్మలెత్తుతాడు. ఒక జన్మలో దిక్పాలకుడుగా, వేరొక జన్మలో బిచ్చగాడిగా, వెంట వెంటనే, ఒక జన్మలో ఏనుగుగా, మరో జన్మలో దోమగా, ఒక జన్మలో సింహంగా, మరు జన్మలో కీటకంగా, ఒక జన్మలో రాజుగా, మరొక జన్మలో బానిసగా, ఒక జన్మలో యజ్ఞం చేసే సోమయాజిగా, ఇంకో పుట్టుక వ్యపచుదిగా అంటే కుక్కలను తినే యెరుకలవాడిగా, తర్వాత పక్షలుగా, తర్వాత పాములుగా, రాక్షసులుగా ఇలా జన్మలు ధరిస్తూనే ఉన్నాము. మన దురదృష్టం, కంసుని శత్రువైన విష్ణు భక్తలుగా మనం జన్మను పొందలేదు. అదే సరైన జన్మ. దాని తర్వాత పునర్జన్మ ఉండదు. అదే నేరుగా మోక్షం” అంటాడు మాల దాసరి.

తన విష్ణు గాన కీర్తన ఫలంలో కొంత ధారబోసి తనకు విముక్తిని ప్రసాదించమని వేడుకుంటాడు బ్రహ్మరాక్షసుడు, దానికి మాల దాసరి ఒప్పుకోడు. ఇలా అంటాడు.

“ఊతనీరు చెలది నేత మూ టాయిటి
దూది యెండపసుపు తొర్రియక్క
రంబు మేను దీని రహి బుణ్యమమ్ముట
కప్పురంబు వెట్టి యుప్పు గొనుట ఊత”

“రాక్షసోత్తమా! ఈ శరీరం చాలా అశాశ్వతమైనది మరియు అవాస్తవమైనది. నేసిన వెదురుబుట్టలో నీరు పట్టుకుంటే నిలుస్తుందా? సాలెపురుగుల వలతో చేసిన పొట్లంలో దీన్నైనా కట్టగలమా? వేసవిలో ఎండిపోయి వరుగైన దూది ఇది. తారిపోయిన పసుపుకొమ్మ ఎంత దంచినా పసుపుగా మారదు, దంతాలు లేని తొర్రినోటి మాట. దీనికోసం నా విష్ణుసంకీర్తనాఫలాన్ని నీకెలా ఇవ్వగలను? ఇది ఎలా ఉందంటే ఉప్పు కోసం కర్పూరాన్ని మార్చుకున్నట్లుంటుంది!”

రకరకాల శ్రేష్ఠ, హీన జన్మలను ప్రస్తావించి, భగవంతుడు ప్రసాదించిన జన్మలలో మన ప్రమేయం లేదని, ఏ జన్మనైనా సార్థకం చేసుకోవచ్చునని, దానికి మార్గం ఆత్మజ్ఞానం, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడేమేనని, ఆయన దృష్టిలో అన్ని జన్మలూ సమానమేనని మాల దాసరి బోధిస్తాడు.

సరిగ్గా ఇదే తత్త్వాన్ని, నందయ్య తండ్రి పాత్ర ద్వారా శ్రీమతి మాలతీ చందూర్ నిరూపించారు. జ్ఞానానికి, సేవాభావానికి, దేశభక్తికి, సమదర్శనానికి, కులంతో సంబంధం లేదని, నందయ్య త౦డ్రి, కొండా వెంకటప్పయ్య గారు, ఉన్నవ గారు, జానకమ్మ గారు, రాముడత్తయ్య గారు, వాసుదేవరావు గారు ఇంకా అలాంటి గొప్ప మనసున్న వారి ద్వారా మాలతిగారు తన హృదయనేత్రి నవలలో నిరూపించారు.

మాకు హైసూల్లో గురువుగారు సయ్యద్ మహమ్మద్ ఆజం గారు. ఆయన మాకు సాంఘికశాస్త్రం, ఆంగ్లం బోధించేవారు. ఆయన ఆహార్యం ఆయన మతానికి అనుగుణంగా ఉండేది. ఆయన మాట్లాడే తెలుగు స్వచ్చంగా ఉండేది. ఆయన మంచి కవి, పండితుడు (తెలుగులో). గండ్లూరి దత్తాత్రేయశర్మ గారి లాంటి కాకలు దీరిన అష్టావధానుల సభలతో ఆయన పృచ్ఛకులుగా వ్యవహరించేవారు.

అయిన ‘సయ్యదయ్య మాట సత్యమయ్య’ అనే మకుటంతో ఒక శతకం వ్రాశారు. దానిని తన మాతృదేవికి అంకితం ఇచ్చారు. ఆ శతకం లోని పద్యాలతో చాలా మటుకు మనం ఇంతవరకు చర్చించిన భావ జాలమే ఉంది. మచ్చుకు ఈ పద్యం:

‘ఎన్ని గుడులు తిరిగి ఎన్ని పూజలు సేయ
దేవుడెటులు మెచ్చు జీవులార
సాటి మానవునికి సాయంబె పూజరా
సయ్యదయ్య మాట సత్యమయ్య!’

దీనిని 9వ తరగతిలోనే నేను ఇంగ్లీషులోనికి అనువదించి మాస్టారుకు చూపాను. ఆయన నన్ను భుజం తట్టి మెచ్చుకున్నారు. అలా ఆయనకు ప్రియ శిష్యుడినైనాను. మాలతీ చందూర్ గారు నాకు అభిమాన రచయిత్రి కావడానికి కారణం కూడా ఈ భావ జాలమే! మాస్టారు తన గ్రంధాన్ని తన తల్లికి అంకితమిస్తూ రాసిన పద్యాలు ఇవి-

మాతృ ఋణము దీర్చ మనిషికి శక్యంబె
దేవుడామెను బంపె నవని బ్రోవ
బ్రేమ సామ్రాజ్యమును మిగుల గోము మీర
లాలనము సేయు నా తల్లి లలిత వల్లి.
~
మెహరున్నీసా బేగము
అహరహమును నాదు క్షేమ మరయుచునుండెన్‌
ఇహపర సాధన దనదౌ
సహకారము పరిఢవిల్లె సన్మతి నైతిన్‌

ఇంతకంటే ఏ కొడుకైనా తన తల్లికి నివాళి ఏమివ్వగలడు? సర్వత్ర సమదర్శనాడాయన. దేవతార్చనలో చివరగా “మంత్రహీనం, క్రియా హీనం, భక్తిహీనం పరమేశ్వరా, యత్పూజితం మయా దేవ, పరిపూర్ణం తదస్తుతే” అని వచ్చే మంత్రాన్ని నేను ఆయనతో చెబితే, “ఒరేయ్ బాపనయ్యా! దీనికి ఇంచుమించు సమానార్థకమైనది మా ఖుర్ అన్ లోని ప్రార్థనలోనూ ఉందిరా!” అని చెప్పి దానిని స్వరయుక్తంగా చదివి వినిపించారు.

‘ఏకంసత్ విప్రాః బహుధా వదన్తి!’ అన్నారు కదా విజ్ఞులు. సత్యం ఒక్కటే! దాన్ని విప్రులు (బ్రాహ్మణులు కాదు) అంటే పండితులు రకరకాలుగా ఆవిష్కరిస్తారు. మాల దాసరి ద్వారా రాయల వారు చెప్పినా, నందయ్య తండ్రి ద్వారా మాలతీచందూర్ గారు చెప్పినా, సయ్యదయ్య శతకం ద్వారా మాస్టారు మహమ్మద్ ఆజం గారు చెప్పినా, అరిస్టాటిల్ మహాశయుడు చెప్పినట్లు, దాని పరమార్థం (Import) ఒక్కటే.. సత్యనిష్ఠ, పరోపకారం, సమత్వం ఏ ఒక్క కులానికీ పరిమితం కావు. కులాతీత, మతాతీతమైనవే ఇవన్నీ అని తేటతెల్లం అవడం లేదూ?

మల్లాది రామకృష్ణశాస్త్రి గారు మహా పండితుడు. ‘మది శారదా దేవి మందిరమే’ లాంటి విద్వత్ స్ఫోరకమైన పాటలు రాసినవాడు. ఆయన కూడా మన మాలతమ్మలాగే సర్వత్ర సమదర్శనుడు. ఆయన రాసిన ‘కృష్ణాతీరం’ నవలలో అక్కడక్కడా, కులాధిపత్యాల మీద చెణుకులు ఉంటాయి.

ఒకచోట అన్నప్పగారు తన కొడుకు బుచ్చన్నతో ఇలా అంటారు. శవధానులుగారి అబ్బాయి ఆ కాలంలోనే శూద్రుల పిల్లను వివాహమాడతాడు. దానిని సమర్థిస్తూ అప్పన్న గారు, పరమ శ్రోత్రియుడు –

“మనలో మన మాట! ఇంతకూ వాడు చేసిన మహాపరాధం ఏమిటి? తన మనసుకు నచ్చిన పిల్లతో కాపురం చేస్తున్నాడు. అనుకూల దాంపత్యం.. ఇక బ్రాహ్మణీకం అంటావా? చిత్తశుద్ధి, సదాచారం వినయం, వివేకం – ఇవి బ్రాహ్మణ లక్షణాలు. అంతేకాని, ఫలానా ఇంట్లో పుట్టడం కాదు. ఇప్పటి మన సంకుచిత దృష్టితోనే చూస్తే.. మన లెక్క ప్రకారం, మంత్రద్రష్టలైన ఋషుల్లో, యెంతమంది బ్రాహ్మణులున్నారు? ఒక్కడో, ఇద్దరో మనహాయిస్తే, తతిమ్మా వారందరిలోనూ, అనులోమ ప్రతిలోమముల ఫలితాలే కదా!”

ఇంతకంటే బాగా కుండను ఎవరు బ్రద్దలుగొట్టగలరు చెప్పండి? మల్లాదివారేం అల్లాటప్పా మనిషా? పరమ శ్రోత్రియుడు, జ్ఞాని, గొప్ప విద్యాంసుడు. అయిన కంటే తెలిసిన వారెవ్వరు? అందుకీ ‘Great men think alike’ అన్నారు. గొప్పవారెప్పుడూ ఒకేలా ఆలోచిస్తారు!

ఇంకోచోట అవధానులుగారి బ్రాహ్మణేతర కోడలిని గురించి ఇలా అంటారు అన్నప్పగారు. “మన కులం కాదన్నమాటే గానీ, వేరు కులం అయినా, ఏ కులంలో గాని, శ్రోత్రియులంటూ ఉంటూనే ఉంటారు!”

ఈ అన్నప్ప గారు, మల్లాది వారికి official spokesman అని చెప్పవచ్చు. ఒక చోట ఇలా అంటాడు.

“విక్రమార్క చక్రవర్తి తండ్రి బ్రాహ్మడు! నాలుగో వర్ణాల పిల్లల్ని చేసుకున్నాడు. ఎవరూ వంక పెట్టలేదేం?”

“నాలుగు కులాలు అంటే, అది లెక్కవరుసగాని ఒకదానికి ఒకటి తీసికట్టని కాదు. తల్లి కడుపున తొలిచూలు బిడ్డ బ్రాహ్మడూ, నాలుగోవాడు శూద్రుడూ అవుతాడా?మన వెర్రిగాని..”

“చూడు గంటయ్య మామా! చేనుగట్టునో, చెట్టుచాటునో చేతికందిన మనిషిని షికస్తు చేసే శిష్టాచార సంపన్నుల జోలికి యెవడూ పోడేల? ఒక మనిషి నిజాయితీన పోతే, హర్షించలేకపోతే, అదీ ఒక బ్రాహ్మణీకమేనా?”

వాసుదేవరావుగారినీ, రామలక్ష్మమ్మగారిని, వారి పోకడలనూ హర్షించలేని సుబ్బమ్మగారు, బుచ్చి, సీతంమామ్మగారూ, మాలతీ చందూర్ గారి దృష్టిలో నిజమైన బ్రాహ్మణులుకారు! జానకమ్మ గారిని మించిన బ్రాహ్మలు ఎవరు?

స్వాతంత్ర్య సమరయోధులను కథలో లీనం చేసిన వైనం:

మనం ముందుగానే చెప్పుకున్నట్లు, చరిత్రను ఫిక్షన్‍గా మలచడం ఆషామాషీ వ్యవహారం కాదు. చాలా మటుకు మనం చదివిన ‘హిస్టారికల్ ఫిక్షన్’లలో సింహభాగం చారిత్రిక నేపథ్యం ఆక్రమించి, కల్పనకు అవకాశం తగ్గి, రీడబిలిటి (చదివించే గుణం), పాఠకుల ఆసక్తిని పట్టి ఉంచే శక్తి (sustainability) దెబ్బ తిన్నాయి.

శ్రీమతి మాలతీచందూర్ చేసిన విజయవంతమైన ప్రయోగం ఏమిటి? ఆమె ఎన్నుకున్న కధా కాలం, ఆ కాలంలో జీవించిన స్వాతంత్ర్య సమరయోధులు, కల్పిత పాత్రలు, అతి సహజంగా కలిసిపోయి, ఉభయులూ సజీవ చిత్రాలుగా మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటారు. ఎక్కడా మనకు అంటే పాఠకులకు అపనమ్మకం కలుగదు. ఈ ‘suspension of readers’ disbelief’ అనే విశిష్ట గుణం ఆమె నవలలు, కథలు అన్నింటిలో అతి సహజంగా ఒదిగిపోతుంది – ఉదాహరణకు గాంధీజీ విజయవాడకు రావడం అనే సంఘటననే తీసుకుంటే, అది కథలో, కథనంలో కలిసిపోయి ఉంటుంది కాని, పనిగట్టుకొని (on deliberation) మధ్యలో జొప్పించినట్లు (insert) ఉండదు. అదే కాదు, ఇంకా ఎన్నో, సత్యాగ్రహుల కార్యకలాపాలలో సమకాలీన, జాతీయ, ప్రాంతీయ సమరయోధులు తమ స్ఫూర్తిని కార్యకర్తలలో ఎలా నింపాలో అర్థం అవుతుంది. గోపాలం చిన్ని మనసులో రాముడత్తయ్య స్వాతంత్య్ర సమర దీప్తిని వెలిగిస్తుంది. అతని అమ్మానాన్నల ధోరణి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదే అత్తయ్యతో అంటాడు గోపాలం. అప్పుడామె ఇలా అంటుంది –

“మీ నాన్న. అమ్మ లాంటి పిరికిపందలు ఉండబట్టే.. భరత మాత.. సంకెళ్లలో పడి ఏడుస్తుంది.”

ఇక్కడ పిల్లవాడికి తల్లిదండ్రుల పట్ల వైముఖ్యం కలుగ చేయడం రాముడత్తయ్య ఉద్దేశం కానీ కాదు. వారి సంకుచిత ప్రభావం నుండి వాడిని బయటపడవేసి, వాడిని సంస్కారవంతునిగా తీర్చిదిద్దడమే ఆమె లక్ష్యం. పిల్లలను సక్రమంగా ‘educate’ చేయకపోతే, వారు బుచ్చి (గోపాలం తమ్ముడు) లాగా స్వార్థపరులుగా, దేశవ్యతిరేకులుగా తయారవుతారు. ఈ సందర్భంలో హితోపదేశ కావ్యంలోని ఒక శ్లోకం ఉటంకించడం సందర్భానికి తగినట్లు ఉంటుంది.

“మాతా శత్రుః పితా వైరీ యేన బాలో న పాఠితః।
న శోభతే సభామధ్యే హంసమధ్యే బకో యథా॥”

పిల్లలను సరిగ్గా గైడ్ చేయని తల్లి తండ్రులు వారికి శత్రువులని చెబుతున్నారు విష్ణుశర్మ పండితులు. అలాంటి పిల్లలు, హంసల మధ్య కొంగల లాగా రాణించరట.

“గుణిగణగణనారంభే న పతతి కఠినీ సుసమ్భ్రమాద్ యస్య।
తేనాంబా యది సుతినీ వద వన్ధ్యా కీదృశీ భవతి?॥”
ధర్మార్థకామమోక్షాణాం యస్యైకోఽపి న విద్యతే।
అజాగలస్తనస్యేవ తస్య జన్మ నిరర్థకమ్॥” అన్నారు.

మంచి గుణాలు లెక్కించే క్రమంలో ఎవరి పేరు చిటికెన వేలిస్థానంలో (అంటే మొదట) ఉండదో, వాడి పుట్టుక వృథా! మనం దేన్నైనా లెక్కించేటపుడు చిటికెన వేలితో ప్రారంభిస్తాము .

తండ్రి కంటే, తల్లి సుబ్బమ్మ గారి ప్రభావం గోపాలం మీద ఎక్కువగా ఉండేది. రాముడత్తయ్య అతన్ని తనవెంట తీసుకువెళ్లి, ఆ దుష్ప్రభావానికి అతన్ని దూరం చేసింది. అక్క మాటను మీరలేని అశక్తుడు గోపాలం తండ్రి, వెంకట్రామయ్య. అతని జీవితం వడ్డించిన విస్తరి. “అతనికి ఏ విధమైన ఆశయాలూ లేవు; అక్క గారిలా ఏదో చేయాలనే ఆరాటమూ లేదు” అంటారు రచయిత్రి అతని గురించి. సుబ్బమ్మగారు కూడా పరోక్షంగా వదినెగారిని ఏమన్నా అనడమేగాని, ఎదురుగా మాట్లాడే ధైర్యం లేదు. గోపాలం రాముడత్తయ్యతో వెళ్లిన తర్వాత, తన భావజాలాన్ని రెండో కొడుకైన బుచ్చిపై రుద్దడం ప్రారంభించింది. బుచ్చి కూడా ఆ తల్లికి తగ్గ కొడుకే.

సుబ్బమ్మకు రామలక్ష్మమ్మ పట్ల, సహజమైన ఆడపడుచు మత్సరంతో పాటు, ఆమె తెలివితేటలు, సమర్థత పట్ల అసూయ కూడా ఉంది. కొంత inferiority complex (న్యూనతాభావం) ఉంది. కొడుకును వదినెతో పంపకుండా శతవిధాల ప్రయిత్నించింది . ప్రలోభపెట్టింది. ఆమె పెద్ద కొడుకు మరణించాడు. మిగిలింది ఇద్దరు. గోపాలాన్ని వదినెగారు తీసుకుపోయి ‘చెడగొడతారేమో’నని ఆమె భయం. కానీ గోపాలం ససేమిరా వినలేదు. అత్తయ్యతో వెళ్లిపోతానని ‘మొండికేశాడు’.

“మా వదినె గారు నా కొడుక్కు మందు పెట్టింది” అంటూ మెటికలు విరిచింది సుబ్బమ్మ.

“అవును, స్వరాజ్యం అనే మందు పెట్టాను. ఈ మందు అందరూ సేవిస్తే తప్ప, మనకు స్వతంత్రం రాదు” అంది రాముడత్తయ్య.

– హృదయనేత్రి, పుట 18.

“వెయ్యరో ఒక మందు, వెయ్యి రోగములయందు” అన్నట్లు, అప్పటి దేశ పరిస్థితులను బట్టి, అదే సరైన మందు!

అందరూ ఊరి బయట శిబిరాల్లో ఉంటారు. వాటికి ‘రామనగర్’ అని పేరు పెట్టుకున్నారు. మహాత్ముడు చీరాల పేరాల విచ్చేశారు. స్వయంగా ఈ శిబిరవాసుల సమస్యలు వినడానికి. గాంధీజీని దగ్గర నుంచి చూడగలిగాడు గోపాలం,. రాముడత్తయ్య తనని ఎత్తుకొని, ఆయన పక్కకు తీసుకుని వెళ్లింది. అప్పుడు రచయిత్రి ఇలా అంటారు.

“ఆయన గోపాల రావు తల మీద చేయి వేసి నవ్వినపుడు, చిన్నపిల్లవాడైన అతనికి ఆ క్షణం తెలియలేదు గాని, ఆ స్పర్శ వల్ల ఏదో అపూర్వ ప్రకంపన కలిగింది.”

అద్భుతమైన ఆత్మశక్తి గలవాడు మహాత్ముడు. అది గోపాలంలోకి ప్రసరించి, చిన్న వయసులోనే అతని దృక్పథాన్ని విస్తృతం చేసింది. గాంధీజీ స్వరాజ్యనిధికి మొట్టమొదట తన నగలు ఇచ్చి తీసిన ఆమె జానకమ్మగారు! వాటిని తృణపాయంగా ఎంచి, గాంధీగారి పాదాల ముందుంచిందామె. బంధువులందరూ ఆమెను తిట్టారు, దుమ్మెత్తిపోశారు.

“జానకమ్మగారు నోరు మెదపలేదు. నగల మూట ఇచ్చేసి ముసుగు సవరించుకుంటూ, వేదిక దిగింది, ఏమీ ఎరగనట్లు.”

ఈ మాటల్లో సంపద పట్ల ఆమెకున్న నాన్-అటాచ్‌మెంట్‌ను అద్భు తంగా ఆవిష్కరించారు రచయిత్రి. ఆమెలోని ‘నిర్వికారత’ మనకు కళ్లకు కట్టేట్లు చేశారు.

గాంధీజీ, ‘my life is my message’ అన్న మహనీయుడు. ఆయన జీవితమే అయిన సందేశం. ఏదైనా ముందు తాను ఆదరించిన తర్వాతే ఇతరులకు బోధిస్తారాయన. ‘Practice before you preach’ అన్నది అయిన నమ్మిన సిద్ధాంతం. అందువల్లే ఆయన మాటలను కోట్లాది భారతీయులు శిరసావహించారు.

“స్త్రీలకు నగల మీద వ్యామోహం ఉండకూడదు” అన్నారు ఆయన చీరాల పేరాల సమావేశంలో. మాగంటి అన్నపూర్ణమ్మ, జానకమ్మగార్ల వంటి మాన్యచరితలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వెంటనే రాముడత్తయ్య ముందుకెళ్లి తన ఒంటి మీద నగలన్నీ వలిచి ఇచ్చేసింది. ‘వీటిని మళ్లీ తిరిగి చేయించుకోన’ని ఆమె నుంచి హమీ తీసుకున్నారాయన.

“గాంధీజీకి నగలు ఇవ్వడానికి ఆడవాళ్లు ముందుకు తోసుకు రావటం అతని బాల్య స్మృతిలో శాశ్వతంగా నిల్చిపోయింది” (పుట 20) అంటారు రచయిత్రి. Unconditional sacrifice (షరతులు లేని త్యాగానికి) కు ప్రతీక ఈ సంఘటన.

బెజవాడకు మహత్ముడు వచ్చినపుడు కూడా గోపాలాన్ని తీసుకువెళ్లారు. అత్తయ్య, మామయ్య. వాడిని భుజం మీదికి ఎత్తుకుని ఆయన్ను చూపించారు.

“కుర్చీల్లోని మధ్య కుర్చీలో, కొల్లాయి కట్టుకుని, పైన కండువా కూడా లేని ఒక పిలక మనిషి కూచుని ఉన్నాడు. ఆయన చుట్టూ మనుషులు” (పుట 15) అంటారు, నిరండబరతకు ప్రతిరూపమైన ఆయనను వర్ణిస్తూ, మాలతిగారు. ఆయన మన కళ్లముందు కదులుతారు.

“ఆయనే మహత్మాగాంధీ! జేజే పెట్టు, జండా ఊపు” అంటోంది అత్తయ్య.

“మహాత్మా గాంధీకి జై – భారతమాతకి జై – బోలో స్వతంత్ర భారత్‍ కీ జై” దిక్కులు పిక్కటిల్లేటట్లు అందరూ అరుస్తున్నారు. ఒక్క సారి సముద్రంలా ఘోష! గోపాల రావుకు భయంవేసింది” (పుట 15).

ఈ సంఘటనను చదువుతున్నపుడు పాఠకుల మనస్సు భావోద్వేగంతో నిండిపోతుంది. వారూ అక్కడ గుంపులో తోసుకుంటూ, మహాత్ముని చూడాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఫీల్అవుతారు. అదీ మాలతి గారి వర్ణనాపటిమ!

గాంధీజీకి ఆరేళ్ల శిక్ష విధించారు.. అన్న వార్త పేపర్లో చదివినపుడు.. ఆ ఊరిలోని ఏ యింట్లో పొయ్యి వెలగలేదు. ఇంట్లోంచి శవం వెళ్లిపోయినట్లు ప్రతివారూ ఏడుస్తూ కూర్చున్నారు”

ఈ మాటలు, అశేష ప్రజలు మహాత్ముని ఎంత ఆత్మీయంగా own చేసుకున్నారో చూపిస్తాయి. అందుకీ ఆలర్ట్ ఐన్‌స్టీన్ ఇలా అన్నారు ఆయన గురించి:

“Generations to come will scarce believe that such a one as this, ever in flesh and blood walked upon this earth.”

ఇటువంటి వ్యక్తి రక్తమాంసాలతో, సజీవంగా, ఈ భూమి మీద నడయాడినాడంటే భావితరాలు నమ్మడం కష్టం.”

ఎంత గొప్ప భావన! కానీ దురదృష్టవశాత్తు, ఆయనను విమర్శించేవారు ప్రస్తుతం తయారయ్యారు! ఆయనను చంపినవాడిని హీరోగా కీర్తించేవారు బయలుదేరారు! ఆయన సిద్ధాంతాలలో వంకలు వెదికేవారు సరేసరి! ఆయనలో కొన్ని లోపాలుండవచ్చు. ఆయన జీవితచరిత్ర ‘My Experiments with Truth’ నిండా ఆయన తన లోపాలనీ రాసుకొని, self-examination ద్వారా వాటిని తాను ఎలా అధిగమించాడో సవినయంగా తలియజేసుకున్నాడు. కాలాన్ని బట్టి విలువలు మారతాయి. తప్పదు. కాని అయిన మాత్రం నిస్సందేహంగా మహాత్ముడే! ఆ పదం ఆయనకు తప్ప. మరెవరికి వాడినా శోభించదు.

కన్నెగంటి హనుమంతరావు గారిని బ్రిటిష్ పోలీసులు, 30 మంది చుట్టుముట్టి కాల్చి చంపడం అనే సంఘటన హృదయ విదారకమైనది. ఆయన దాహంతో అలమటిస్తుంటూంటే ఒక కొవ్వు పట్టిన హెడ్ కానిస్టేబుల్ మూత్రం తాగమని ఆయన ముఖం మీద పోస్తాడు. ఆయన అంతిమయాత్రను రచయిత్రి అద్భతంగా వర్ణించారు. పలనాడంతా తరలి వచ్చింది.

“పూలమాలల్లో ఊరేగుతున్నది ఆయన ‘భౌతిక కాయం’ అనిపించలేదు. పూల రధంలా కనిపించింది” అంటారామె. (పుట 28)

వాసుదేవరావుగారు, జానకమ్మగారు జైలు నుంచి విడుదలై, కడలూరు నుంచి, మదరాసు మీదుగా చీరాలకు చేరుకోవడం ఆ ఊరివారికి కొత్త ఊపిరిని ఉత్సాహాన్ని ఇచ్చింది. “జైలుతో వారిని పెట్టిన బాధలు వర్ణనాతీతం. జానకమ్మగారికి రాళ్ల అన్నం, దేవతాపులుసు పెట్టారని తెలుస్తుంది.

“‘దేవతాపులుసు’ అంటే రాళ్లూ, ఇసుకా కలిపిన పప్పుపులుసు. గొడ్డుకారం, బొద్దింకలు – మట్టిముంతల్తో ఇస్తారు” – పుట 30.

కాకినాడ కాంగ్రెస్ సభల్లో దుగ్గిరాల వారు బులుసు సాంబమూర్తి గారు, దుర్గాబాయమ్మగారు, సరోజినీ నాయుడు గారు పాల్గొన్నారు. దుర్గాబాయికి అప్పుడు 15 సంవత్సరాలు. చలాకీ పిల్ల. “జవహర్ లాల్ నెహ్రూను కూడా గేటు దగ్గర టికెట్ కావాలని అటకాయించిన ధైర్యశాలి” అని ఆమెను గూర్చి, సభలకు వెళ్లిన జానకమ్మగారు చెప్పారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here