శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-7

0
12

[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

గోపాల రావు విడుదల – అనుకోని స్వాగతం – అందులో కపటం – అతని నిరాసక్తత:

[dropcap]అ[/dropcap]త్తయ్య మరణం అతన్ని క్రుంగదీసింది. ‘చివరి క్షణాల్లో తను అమె పక్కన లేకపోయానే’ అని మథనపడ్డాడు గోపాల రావు. నాలుగేళ్ల తర్వాత జైలునుంచి విడుదల ఐనాడు. అతని కుటుంబ సభ్యులందరూ జైలు గేటు దగ్గర అతన్ని రిసీవ్ చేసుకోవడానికి వేచి ఉన్నారు. వారి దృక్పథంలో అతని పట్ల ఊహించని మార్పు.

ఖరీదైన కారులో అతన్ని యింటికి తీసుకెళ్లారు. కొడుకు పన్నెండేళ్ల వాడయినాడు. పచ్చగా బొద్దుగా ఉన్నాడు. అందరి ముఖాలూ ప్రసన్నంగా ఉన్నాయి. అతనిపట్ల గౌరవ భావంతో, మర్యాదగా చూస్తున్నారు. భార్య ఒళ్లు చేసి, పసిమి నిమ్మపండులా మెరిసిపోతోంది. ఆ ఇల్లు రెండంతస్తుల భవనం. రాజభవనంలా ఉంది. ‘మన గది’ అని తమ గదిలోకి తీసుకెళ్లింది – ఇదంతా గోపాల రావుకు సంతోషంగా ఏమీ లేదు. రచయిత్రి ఒకే ఒక్కమాటలో అతని మానసిక స్థితిని చెప్పారు:

“ఆమె ‘మన గది’ అని తామిద్దరినీ కలిపి అంటున్నా, తను ఈ పరిసరాలలో ఇమడలేనేమో అన్న సంకోచం అతన్ని పీడిస్తోంది.” (పుట 100)

అతన్ని కలుసుకోవడానికి చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారట. “దేనికి?” అన్న అతని ప్రశ్నకు జవాబు లేదు. కొత్తగా భార్య సమకూర్చిన సౌకర్యాలు అతనికి ‘repulsive’ గా ఉన్నాయి.

“ఏళ్ల తరబడి చన్నీళ్లకీ నియమనిష్ఠలకీ అలవాటు పడిన ఈ శరీరానికి నాజూకు యివ్వడం ఇష్టం లేకపోయింది.”

ఇక్కడ బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం, ‘కాటి సీను’లో హరిశ్చంద్ర చక్రవర్తితో అనిపించిన మాటలు ఉటంకించడం సముచితంగా ఉంటుంది.

“అహో! ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుండు గతించిన వెనుక, ఈ కష్టములకు తావెక్కడిది?”

ఎంత అద్భుతమైన భావన! తాను మరణించిన తర్వాత తనని ఆశ్రయించుకుని ఉన్న కష్టాలు ఏమైపోతాయో పాపం! అని విచారిస్తున్నాడు! కష్టాలతో ఆయన ఎంత మమేకమైపోయినాడో ఈ మాటలు మనకు తెలియచేస్తాయి.

గోపాల రావుకు వేడినీళ్ళు, ఎత్తు పీట, సువాసన సబ్బు, సన్నని ఖద్ధరు లాల్చీ, పంచా, భార్య చిరునవ్వు, సమ్మోహనకరమైన ఆమె సాన్నిహిత్యం, నున్నగా తళతళలాడుతున్న పాలిష్‌తో మెరిసిపోతున్న కర్రమెట్లు, సోఫాలు అన్నీ అంతగా నచ్చకపోవడం కూడా ఈ కోవలోకే వస్తుంది.

వచ్చిన వారిలో నందయ్య కూడా ఉన్నాడు. ఆప్యాయంగా గోపాల రావును రెండు చేతులతో కావిలించుకున్నాడు. తనను దళితుడిగా కాకుండా మనిషిగా మొదటినుంచీ అభిమానిస్తున్న గోపాల రావంటే అతనికి ప్రేమా, గౌరవం.

అతన్ని ఎలక్షన్లో నిలబెట్టాలని వారి తాపత్రయం. గతంలో తన ఖద్దరు గుడ్డలను గోనె పట్టాలని ఎగతాళి చేసిన బావమరది ఇలా అన్నాడు – “బావా.. నీకున్న పేరు, గౌరవం నీకు తెలియదు. నీవు జైల్లో ఉండగానే నందయ్యగారు నీ పేరిట నామినేషన్ దాఖలు చేశారు.”

ఎంత తేడా?

“ఇదిగో గోపాలం – నీ పేరు పార్టీ ప్రముఖులు ఒప్పుకున్నారు. నిన్ను చీరాల్లో నిలబెడుతున్నాం” – నందయ్య.

అతని ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు.

“మూఢునిలా కూచున్నాడు గోపాల రావు.”

గోపాల రావు జైలు జీవితాన్ని, స్వాతంత్ర్య సమరంలో అతని పాత్రను వాళ్లందరూ cash చేసుకోవాలనుకుంటున్నారు. ‘Opportunism’ అంటే అవకాశవాదానికి అది పరాకాష్ఠ. మొన్నటివరకు నిష్ప్రయోజకుడని తెగడిన నోళ్ళే అతన్ని దేశాన్ని ఉద్దరించబోయేవాడని పొగడుతున్నాయి.

అవకాశవాదాన్ని కార్ల్ మార్క్స్ ఇలా నిర్వచించారు.

“A tactic of convenience or expediency, used for self-serving motives, involving, some of other kind of political, economical of intellectual trick.”

“అవకాశవాదం ఒక ఎత్తు, జిత్తు. సౌకర్యవంతమైన స్వార్థపు యోజనం. అది అనైతికం, ఐనా సరే రాజకీయ ఆర్థిక మేధోపరమైన ట్రిక్! అంటే వంచన!”

అతని స్వాతంత్ర్య సమర నేపథ్యాన్ని అడ్డుపెట్టుకొని వాళ్లంతా జీవితంలో మరింత ఎదగాలని ఆశిస్తున్నారు. కాని అతనిలా అన్నాడు

“నేనా.. నాకు పదవుల మీద వ్యామోహం లేదు.”

ఇది పెదవుల మీది నుంచి వచ్చిన మాట కాదు. హృదయం లోంచి వచ్చిన మాట! అధికారం అనేది మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందని, వ్యక్తిత్వాలను కలుషితం చేస్తుందనీ అతనికి తెలుసు.

“Power corrupts, absolute Power corrupts absolutely.” – Lord Acton (1834-1902)

పై మాటలు జగత్ప్రసిద్ధి చెందాయి. లార్డ్ యాక్టన్ బ్రిటన్ లోని లిబరల్ పార్టీ నాయకుల్లో ఒకరు. క్యాథలిక్, చరిత్రకారుడు, రచయిత. ఆయన పూర్తి పేరు John Emerich Edward Dalberg Acton. గోపాల రావుకు దీని మీద పూర్తి అవగాహన ఉంది.

అవకాశవాదానికి అధికారం తోడైతే ఎంత దారుణంగా ఉంటుందో అతనికి తెలుసు. చివరికి భార్య కూడా దీనికి మినహాయింపు కాదు. యుద్ధంలో జపాన్ జర్మనీ పరాజయం పాలయ్యాయి. బ్రిటన్‌లో చర్చిల్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్నిపొందాడు. లేబర్ పార్టీ అధికారం లోకి వచ్చింది. తర్వాతి ప్రధాని అట్లీ భారతదేశానికి స్వాతంత్యం ఇవ్వడానికి అంగీకరించాడు.

ఎలక్షన్లలో నిలబడాలంటే డబ్బు అవసరం అని కూడా గోపాల రావుకు తెలియదు. బుచ్చి ఎలక్షన్లకు తాను పెట్టుబడి పెడతానంటాడు. వార్ టైమ్‌లో ఎవరెవరు ఎంత సంపాదించారో చెప్పాడు. తాను వారితో పోలిస్తే ఎంత వాడినన్నాడు. అంతా వినయంగానే చెప్పాడు. బుచ్చి మామయ్య కారుతో బాటు ఒక ఏనుగును కూడా పెంచుతూండడం గమనించాడు గోపాల రావు.

తమ్ముడితో ఇలా అన్నాడు – “అయితే నేను ఈ ఎన్నికలలో నిల్చోను. అది నా ప్రిన్సిపల్స్‌కు వ్యతిరేకం. నేను కావాలనుకున్న వాళ్లు ఓటేస్తారు. అక్కరలేకపోతే మానేస్తారు.” (పుట 105)

ఇంత నిజాయితీపరుడు రాజకీయాలకేం పనికొస్తాడు? ఓట్ల కోసం ప్రచారం చేయడం కూడా అతనికి నచ్చలేదు. మొత్తానికి గెలిచినా, ప్రకాశం గారు ముఖ్యమంత్రిగా కొలువుదీరిన మద్రాసు రాష్ట్రప్రభుత్వంలో నందయ్యను హరిజన ప్రతినిధిగా మంత్రివర్గంలో చేర్చుకున్నారు. గోపాల రావుకు అవకాశం ఇవ్వలేదు. అప్పుడు అవకాశవాద ఆత్మీయులందరికీ, భార్యతో పాటు, ఆశాభంగం కలిగిందంటారు రచయిత్రి.

దేశవిభజన పంపకాలు. ఆర్థిక ఇబ్బందులు, హిందూ ముస్లింల సంఘర్షణలతో దేశం అట్టుడికిపోతూ ఉంది. అగస్టు 14 రాత్రి స్వాతంత్య్రం వచ్చింది.

స్వతంత్ర భారతం – గోపాల రావులో ఇంకో రకం సంఘర్షణ – విలువలకు తిలోదకాలిస్తూన్న సమాజం – రాజీ పడలేని గోపాల రావు:

స్వాతంత్య్రానంతరం గోపాల రావు జీవితంలో ఇంకో దశ ప్రారంభమైంది. స్వాతంత్ర్యం అతనికి కొత్త సంఘర్షణ కొని తెచ్చింది.

ఆగస్టు పద్నాలుగో తేదీ రాత్రి మద్రాసు నగరం లోని వీధి వీధి కార్లలో తన కుటుంబ సభ్యులతో తిరిగాడు గోపాల రావు. దేశానికి స్వాతంత్య్రం మరి కొద్ది క్షణాల్లో వస్తోంది. ఆ ఆనందోత్సాహాలను ఇలా వర్ణిస్తారు రచయిత్రి. అందులో నగరాన్ని అలంకరించిన విధానం వివరిస్తారు. ఒకే ఒక్క వాక్యం. అందులో Topic sentence గా నిలుస్తుంది.

“వీధుల్లో క్రిక్కిరిసిన జనం, జాతి, మత వయో వివక్షత లేకుండా, అందరూ ఏకకంఠంతో అభినందనలు చెప్పుకుంటున్నారు!”

స్వాతంత్య్రం ప్రశ్నలు పడిన తపన, జాతి, మత, వయోభేదాలకు అతీతమైనదని ఆమె చెప్పారు. మొదట అందరం భారతీయులం, తర్వాతే హిందువులం, ముస్లింలం, బ్రాహ్మలం, రెడ్లం, దళితులం, ఇంకా ఎవరైనా!

ఇదే సూత్రాన్ని, గుజరాత్ లోని Statue of Unity ప్రతిబింబిస్తుంది. స్వాతంత్య్రం తర్వాత కూడా అంతర్గతంగా విభజితమై ఉన్న దేశాన్ని సర్దార్ వల్లభాయిపటేల్, ప్రథమ భారత హోంమంత్రి ఏకీకృతం చేశారు. స్వతంత్ర సంస్థానాలు ఇండియన్ రిపబ్లిక్‌లో విలీనం కావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. కొందరికి నచ్చచెప్పా రు. కొందర్ని బెదిరించారు, కొందర్ని దండించారు. అందుకే ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన, 182 మీటర్ల సర్దార్ విగ్రహాన్ని ఐక్యతా చిహ్నంగా అక్కడ నెలకొల్పింది భారత ప్రభుత్వం.

సందర్శకులు అక్కడ ఒక Pledge (ప్రతిజ్ఞ) తీసుకోవాలి. ఐదారు రకాల ప్రతిజ్ఞలు అక్కడ కంప్యూటర్ మానిటర్ మీద display అవుతుంటాయి. అన్నీ సమైక్య భారతాన్ని గ్లోరిఫై చేసేవే. అందులో ఒక దాన్ని మనం ఎన్నుకొని, మన వివరాలు ఎంటర్ చేస్తే ఎదురుగా ఉన్న గోడ మీద మన Pledge, మన పేరు, ఊరు display అవుతాయి. గతంలో మేము గుజరాత్ ట్రిప్‌కు వెళ్లినపుడు ఈ ప్రతిజ్ఞ చేశాము. ‘I Pledge to stand for my identity, as an Indian first, to make my India a proud nation.”

“నేను ప్రప్రథమంగా ఒక భారతీయుడననే గుర్తింపు కోసమే కట్టుబడతాను, తద్వారా నా భారతదేశాన్ని సగర్వంగా తల పైకెత్తుకునేలా చేస్తాను. అలా అని ప్రతిజ్ఞ చేస్తున్నాను.”

మాలతీ చందూర్ గారు భావించింది సరిగ్గా ఇదే. విగ్రహం ఉన్న క్యాంపస్ లోనే ఒక అందమైన గోడను నిర్మించారు. దాని పేరు ‘Wall of Unity’ (ఐక్యతా కుడ్యం). దాని మీద మెటల్ అక్షరాలను ఇలా పొదిగారు:

“The soil of the nation is the soul of the nation.”

జాతి మట్టే జాతికి ఆత్మ! పటేల్ విగ్రహం కోసం లక్షా అరవై తొమ్మిది వేల గ్రామాల నుండి, అన్ని మతాలవారు, అన్ని కులాల వారు తమ పొలాల్లోని మట్టిని ఇచ్చారు. అక్కడ మరో స్మారక చిహ్నం చూశాము

“Ek Bharath Sreshta Bharath”

ఐక్య భారతమే శ్రేష్ఠ భారతం!

గోపాల రావు, రాముడత్తయ్య, వాసుదేవరావు మామయ్య లాంటి వారు దీని కోసమే పోరాడారు. కాని అలాంటి వారిలో కొందరు స్వాతంత్ర్య ఫలాలను చూడకుండానే గతించారు.

భారత యూనియన్‌లో విలీనమయిన సంస్థానాధీశులు పటేల్‍తో దిగిన గ్రూప్ ఫోటో పెద్దది enlarge చేయించి అక్కడ తగిలించారు.

రాత్రి పన్నెండు గంటలకు రేడియోలో జవహార్ లాల్ నెహ్రూ ఇలా ప్రకటించారు.

“ప్రపంచమంతా నిద్రావస్థలో ఉన్న ఈ అర్ధరాత్రి భారతదేశం మేలుకుంది. బానిసత్వం, పరాయిపాలన గాఢ సుషుప్తి నుంచి మేలుకుంది.”

కొన్ని లక్షల ర్రేడియోల ముందు చప్పట్లు మోగాయంటారు రచయిత్రి. అక్కడే గోపాల రావు మానసిక స్థితిని మనకు చూపిస్తారామె.

“స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, దీపాలంకారాలు చూసి ఇంటికొచ్చిన అందరూ ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటున్నారు – ఒక్క గోపాల రావు తప్ప!”

భార్య అడుగుతుంది “మీకు సంతోషంగా లేదా?” అని. “ఉందీ, లేదూ..” అతని జవాబు. స్వాతంత్య్రం వచ్చినందుకు సంతోషించాలా లేక దేశవిభజన జరిగినందుకు విచారించాలా? ‘ద్వైదీ భావకాతరం మేమనః’ అన్నట్లు అతని జవాబులో ఈ డోలాయమాన పరిస్థితి కనిపిస్తుంది.

“బాపూజీ మాటలు లెక్కచేయకుండా తమకు స్వతంత్రం రావాలన్న ఆతృతతో దేశవిభజనకీ, పాకిస్తాన్ అవతరణకీ ఒప్పుకున్నారు నాయకులు” అంటారు ఈ సందర్భంలో రచయిత్రి. ఎంత నిజం?

“అంతవరకు దేశ స్వాతంత్య్రం కోసం అన్నదమ్ములవలె పోరాడిన హిందూ ముస్లిములు బద్ధశత్రువులైపోయారు. అటు లాహోర్ నుంచి, ఇటు తూర్పు బెంగాల్ నుంచి లక్షలాది కాందిశీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చేస్తున్నారు..” (పుట 108)

ఈ మాటలు రచయిత్రి, మానసిక వేదనకు అద్దం పడతాయి. గాంధీజీ ‘మన దేశం నైతికంగా చిమ్మ చీకటిలోకి దిగజారిపోతోంద’ని బాధపడ్డారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here