శోభ కృతి

0
11

[dropcap]సూ[/dropcap]ర్యోదయం మొదలు జీవిత గమనంలో ఎన్నో రకాల మంచి చెడులు ఆలోచిస్తూ మంచి  జీవితం కోసం ప్రతి మనిషి ఆలోచిస్తాడు.

రాఘవరావు గారికి ఇద్దరు కూతుళ్లు శోభశ్రీ, కృతిక ఇద్దరు కూడా మంచి చదువులు చదివారు. ఉద్యోగాల్లో చేరాలని ఉబలాటం చూపారు. కానీ రాఘవ గారు పెద్ద పిల్ల పెళ్లి ఫ్రెండ్ కొడుకుతో చేశారు. రెండవ పిల్ల కృతిక పెళ్లికి ఉన్నది.

వాళ్ల పేర్లు కూడా జాతకం ప్రకారం నక్షత్రం ప్రకారం పెట్టారు. భార్య సౌభాగ్య లక్ష్మి కూడా సంప్రదాయ పండిత కుటుంబం నుంచి వచ్చింది. బాగా చదువుకున్నది. ఉద్యోగం వద్దు అంటే సరే చెయ్యను అన్నది.

కుటుంబం అంతా సంపాదన కోసం పరుగు పెడితే ఇల్లు వాకిలి పట్టించుకునేది ఎవరూ? రాఘవరావు అమ్మ నాన్న పెద్ద వాళ్ళు అయ్యారు. మిగిలిన కొడుకులు దూరంగా బొంబాయ్, కలకత్తా, ఢిల్లీలలో ఉన్నారు. వీళ్ళు మాత్రమే విజయవాడలో దగ్గరగా ఉన్నారు.  కాబట్టి కొంచెం తల్లి తండ్రి బాధ్యత చూడాలి. తమ్ముళ్ళు ఒకడు బెంగాలీ అమ్మాయిని మరొకడు గుజరాతీ అమ్మాయిని చేసుకున్నారు.

నాన్నగారు ఎంత గొప్ప పండితుడు అయిన ఏమీ అనలేదు. విధి వ్రాత అన్నారు. బంధువులతో  మాట బేధాలు వచ్చాయి, వాళ్ళ పిల్లలని కలుపుకొలేదని. కొన్నాళ్ళు మాటలు మానేశారు. ఆ తరువాత కాల గమనంలో మార్పు వచ్చి ఎందుకో మంచి చెడు, మాటలు అంటూ కలుపుకున్నారు.

మనకి కనిపించని గ్రహాలు మన జీవితాన్ని శాసిస్తాయి. ఎంత తెలివి, డబ్బు ఉన్న గ్రహాల ముందు సామాన్యులుగా మిగులుతారు. మంచి చదువు, ఉద్యోగం, పెళ్లి పిల్లలు, కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించి విజయాన్ని సాధిస్తున్నారు, కానీ ప్రేమ అనేది ఒక అద్భుత విషయం. నిరంతరం శ్రమిస్తూ సంపాదించడం కాదు, తల్లి తండ్రిని వదిలి వచ్చిన భార్యను పెళ్లి బంధంతో తన ప్రేమను అందించాలి. కానీ ఎంత సేపు విమర్శలతో వేధించకూడదు.

ప్రేమించాను ప్రేమించాను అంటు పెళ్ళి చేసుకున్న సరే, పెద్ద వాళ్ళు చేశారు మీరే అన్ని చూడాలి అంటే కాదు ఏ తరహా పెళ్లి అయిన జీవితంలో మన ఇంటికి వచ్చిన పిల్లని బాగా ప్రేమగా ఆప్యాయతగా చూసుకోవాలి.

ఇది చిత్రంగా ఉంటుంది, ప్రేమ పెళ్లి అయినా; పెద్దల పెళ్లి అయిన అత్త అమ్మ మధ్యనే ఆడపిల్ల జీవితము. అత్త అంటే అధికారం అహంకారము, పెదాలు దూరంగా పలుకుతాయి. అమ్మ ఆదరణ ఆప్యాయత అని అర్థం, పెదాలు దగ్గరగా పలుకుతాయి.

రెండో కూతురు కృతికకి కొంచెం ఫోర్స్ ఎక్కువ. ఆ నక్షత్రం అగ్ని నక్షత్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది. కోపం ఎక్కువ. ఎక్కడ ప్రేమించి చిన్నాన్నల మాదిరి పెళ్లి చేసుకుంటుందో అన్న భయం ఉన్నది.

మినిమం భర్తగా కొన్ని బాధ్యతలు మగాడికి ఉంటాయి. భర్త అంటేనే జీవిత భరోసా. పెళ్ళి అయితే నాకు మంచి భర్త లభిస్తాడన్న ఆశ ప్రతి ఆడపిల్ల పడుతుంది. దానిని నిజం చెయ్యాలి. నువ్వే విమర్శించి ఆ స్థానం వెటకారం డాట్ కామ్‌లా ఉంటే ఎలా?

జీవితంలో పెళ్లితో సరే, ఇంకా అన్ని ఆమె చూసుకుంటుంది అని కాదు. ఆమెకి సరియైన జీవితం ఇవ్వాలి, అప్పుడే జీవితము విలువ వస్తుంది. పెద్ద వాళ్ళు కూడా పిల్లలకి నేర్పాలి. నీకు భార్య శాశ్వతంగా ఉంటుంది అని చెప్పాలి, అప్పుడే విలువ. అబ్బే అది ఎక్కడి నుంచి వచ్చిందో దాని మాటకు విలువ వద్దు అనకూడదు. ముఖ్యంగా అత్తగారు ఆ పరిస్థితిని ఇస్తుంది, మామగారు అన్నిటికీ ఓకె అంటారు.

జీవిత గమనంలో ఎన్నో భావాలు. పుట్టింట జరుగని ఆనందాలు అత్తింటివారి సహకారంతో అన్ని సజావుగా నెరవేరాలని కోరుకుంటారు. కానీ భర్త దృష్టిలో మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ భర్త అత్త మాట విని కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించి వారినే చూస్తూ భార్యను పట్టించుకోకుండా ఉంటే ఆమెలో ఎంతో బాధ ఉన్నది, అది పైకి తెలియదు కదా. అందుకే ఆమె కొంత కాలం ఆ అత్త ఇంట్లో ఉండి జీవిత ఉన్నతి కోసం ఉత్తమ మార్గాలు ఎంపిక చేసుకుని ఆనందాన్ని పొందాలనే భావనతో తండ్రి సహకారం కోరింది.

కానీ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి నీకు జీవితాన్ని ఇచ్చాను, నువ్వు అక్కడే ఉండీ సాధించుకో అన్నాడు. ఇది సమంజసమా.

కానీ స్త్రీ పరిస్థితి ఇప్పటికీ అదే. పెళ్లి అయితే పుట్టింటివారు అత్తవారికే అప్ప చెపుతారు. ఏమిటో  కని పాతిక ఏళ్ళు పెంచి పోషించిన ఘనత తల్లి తండ్రిదే. కానీ వారు నమ్మకంతో జీవిత భరోసాతో పిల్లను అన్ని ఇచ్చి పెళ్ళి చేస్తారు వారిలో ఏ లోపం ఉండదు. అయినా వారిలో లోపాలు వెతుకుతారు. మేము అంతా గొప్ప వాళ్ళం, ఇంత గొప్ప వాళ్ళం అంటూ కథలు చెపుతూ మా ఇంటి పేరు అంతా గొప్పది ఇంత కన్నా గొప్పది అంటూ విభిన్న అభిప్రాయాలు ప్రక్క ఇంటి వారిని అడగండి ఎదురు ఇంటి వారిని అడగండి అంటూ ఓ గొప్పలు పోతారు. ఆహా వారి కోడలు అంటే మరీ ప్రేమ చూపుతారు.

నాన్నగారు గొప్ప సంఘ సేవకుడు. అమ్మ మంచి సంస్కారవంతమైనధి. ఇలా అమ్మగారు ఉపన్యాసం రెడీ చేసుకుని ప్రాక్టీస్ చేస్తోంది. జూమ్‌లో ఈరోజు ఒక ప్రముఖ సంస్థ సేవ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ తెలుగు ప్రపంచ మహా సభలు నిర్వహణలో ప్రసంగం ముఖ్య అతిథిగా పిలిచారు. అందుకు రెడీ అవుతోంది.

“కృతికా, నువ్వు ఇలాంటి వ్యాసాలు రాయడం, వాటి గురించి చర్చించడం వల్ల నీకు అసలు పెళ్లి అవుతుందా?” అంటూ వాళ్ళ చుట్టాల అబ్బాయి ఒకటి రెండుసార్లు హెచ్చరించాడు.

“పెళ్ళి కాకపోతే నష్టం లేదు మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు” అన్నది.

“అది కాదే, సమాజంలో నీ రచనల వల్ల ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అస్తమానం వ్యతిరేక భావాలు చూపుతావు. నేను మీ వదినని ఎంత బాగా చూస్తున్నాను, ఆమె ఉద్యోగానికి వెడితే పిల్లలని జాగ్రత్తగా స్కూళ్లకి పంపి నేను పొలానికి వెడతాను. నాలాంటి మీ నాన్న లాంటి వాళ్ళను చూసి, మంచిగా చెప్పవే. వీలయితే మా ఇంట్లో వాళ్ళు అని గొప్పగా చెప్పాలి. అంతే కానీ భర్త గురించి, ప్రేమ గురించి, వ్యంగంగా చెప్పవద్దు. ఈ వైశాఖంలో నీ పెళ్లి చెయ్యాలని మీ అమ్మ ఆరాటపడుతోంది” అన్నాడు.

దూరం చుట్టం శ్రీనివాస్  రాఘవరావు గారి పొలంలో కొంత కౌలుకు చేస్తూ ఇంటికి వచ్చి మంచి చెడు చూస్తూ ఉంటాడు. మగ పిల్లలు లేరు గనుక, కొడుకు మాదిరి రాఘవరావు గారికి సహాయ పడతాడు. చనువుగా చెల్లెళ్లు శోభను, కృతికను చూస్తాడు.

శోభ పెళ్ళిలో గెడ్డం కింద బెల్లం ముక్క కొట్టి కాశీ ప్రయాణం వద్దు  అని ప్రేమగా చెప్పి జవారు పుచ్చుకున్నాడు. “నీ పెళ్ళికి కూడా నేనే మీ ఆయన దగ్గర సఫారీ సూటు పుచ్చుకోవాలి” అన్నాడు.

కృత్తిక గడుసరి పిల్ల. కబుర్లు బాగా చెపుతుంది. ‘అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది’ అంటుంది.

“నీతో ఎవరు వేగగలరు? అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నారు. మీకు డిష్ వాషర్, వాషింగ్ మిషన్ బహుమతి ఇస్తే మంచిది. ఈ రోజు అన్ని మానేసి సన్మానాలు, ఉపన్యాసాలు అంటున్నారు” అన్నాడు వ్యంగ్యంగా.

“హా మా ఆడాళ్ళకి అవి లేక పోయినా పని చేస్తాము. ఈ రోజు మగాళ్ళు చెయ్యడానికే ఆ గిఫ్ట్స్ ఉపయోగపడుతాయి” అన్నది.

“బాబోయ్ నిన్ను ఎవడు కట్టుకుంటాడో గాని వాడి పని అవుతుంది” అన్నాడు.

“అన్నయ్యవి నువ్వు ఉన్నావుగా, నువ్వు బావగారిని సేవ్ చేద్దువు” అని నవ్వింది.

“మరి పెళ్లి కొడుకుని రెడీ చేశావా? మా అత్తగారు ఎక్కడో కొడుకుని కని పెళ్లికి రెడీ చేస్తోంది” అని నవ్వింది
“ఎలాంటి భర్త కావాలి?”

“నాకు నచ్చినట్లు చూస్తే చాలు.” అంటూ..

“భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే నవగ్రహాలు సూర్యుని చుట్టూ కక్షలో తిరుగుతాయి. కుటుంబంలో వ్యక్తుల్లో అమ్మ భూమి. తన చూట్టూ తిరుగుతూ భర్త చుట్టూ తిరుగుతుంది. తండ్రి చుట్టూ పిల్లలు ఇతర వ్యక్తులు తిరుగుతారు. పూర్వం అయితే పిల్లలు నవగ్రహాల మాదిరి ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే పిల్లలు ఉంటున్నారు. అవును, నువ్వు ఏ పని మీద వచ్చావు? నా ఉపన్యాసానికి బ్రేక్ వేసాను” అన్నది.

“ఉగాది వస్తుందిగా, ఎవరెవరికి మన ఉగాది కిట్ పంపాలని అడగడానికి” అన్నాడు.

“కాస్త బాగా తెలిసిన వాళ్ళకి మామిడికాయలు ఎక్కువ పంపుతారు, జీడీ ఆవకాయ, మెంతి బద్దలు వేసుకుంటారు. పండుగ పూట మనల్ని బాగా ఆనందంగా తలచుకుంటారు” అన్నది సౌభాగ్యమ్మ.

“అవును అవును”  అంటూ వంత పాడారు రాఘవ గారు.

“అవునూ, కృతికకు పెళ్లి ఈ ఏడాది చెయ్యాలి అన్నారు, సంబంధం కుదిరిందా?” అన్నాడు.

“నువ్వు లేకుండా, నీకు తెలియకుండా పెళ్లి చేస్తామా?” అన్నారు.

“అది కాదు, అది అడ్వాన్స్‌డ్‌గా ఈ పాటికి దాని దృష్టిలో ఎవరో ఉంటారు కదా?” అన్నాడు.

“ఆ గొడవ ఇప్పుడు వద్దు. కానీ మనం వేపపూలు, మామిడికాయలు, చెరకు ముక్కలు, అరటి పళ్ళు, మామిడి ఆకులు మన బ్యాంక్ వారికి, ఎల్.ఐ.సి వారికి పంపాలి. వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు” అన్నాడు రాఘవ రావు.

ఆయన ఎల్.ఐ.సి మేనేజర్‌గా చేసి రిటైర్ అయ్యాడు. సొంత ఊరు వచ్చి స్థిరపడ్డాడు. తల్లిని తండ్రిని ప్రేమగా చూసాడు. తనకి కొడుకులు లేకపోయినా దగ్గరి బంధువు శ్రీనివాస్‌ని చదివించాడు. ఉద్యోగం అంటే, వాడు వద్దు నేను పొలాలు చూసుకుంటాను, ఆ వెనుక ఎల్.ఐ.సి ఎజెంట్ పని వేసుకుంటాను అన్నాడు.  అలాగే వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉన్నాడు.

ఆ ఊరు కరణంగారు శ్రీనివాస్‌కి  తన కూతుర్ని ఇచ్చి చేశాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. దూరంగా ఉద్యోగాలు. కూతురు అల్లుడిని దగ్గర పెట్టుకున్నాడు. ఎవరో ఒకరు చూడాలి కదా.

సౌభాగ్యమ్మ మాట్లాడుతూ, “ఆ మధ్య కృతికకు ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు చిత్రంగా మాట్లాడారు. వచ్చిన దగ్గరినుంచి మీ అమ్మాయి బాధ్యతలు అంటూ చెప్పారు. అంతేనా మరి, కానీ వాళ్ళ బాధ్యతల గురించి ఏమి చెప్పలేదు. ఈ ప్రపంచములో ఆడపిల్లలు చాలా మంచివాళ్ళనీ చెప్పాలి. భర్త మాత్రమే ప్రేమగా చూసినా సంతోష పడుతుంది అన్నాను.

దానికి కాబోయే వియ్యపురాలు, ‘ఆహా’ అంటూ, ‘వదినగారూ, మ ఇంట్లో అంతా పని వాళ్ళు ఉన్నారు. నాకు మీ పిల్ల వంట వార్పు వద్దు, నాకు వంట మనిషి ఉన్నది. రోజు స్వీట్ చెయ్యాలి. ఉదయం రెండు రకాల టిఫిన్స్ చెయ్యాలి. రెండు పచ్చళ్ళు చెయ్యాలి. సాంబారు కానీ మజ్జిగ పులుసు కానీ చేసి పెడుతుంది. మా పిల్లలు ఇద్దరు క్యారేజ్‌లు పట్టుకు వెడతారు.. ఇంట్లో నేను ఉండి అన్నీ చూసుకుంటాను. మీ పిల్ల మా కోడలుగా కూర్చుని ఉండటమే ముఖ్యము. మా ఇంటి కోడలు అంటే అంతా గౌరవము, ఉద్యోగం చేసి, ఊళ్ళేలనవసరము లేదు.  ఇంటి పట్టున సజావుగా ఉంటే అంతే చాలు. నా కొడుకు లక్షలు లక్షలు తెచ్చి పోస్తున్నాడు.’ అని చెప్పింది.

ఆవిడ తెల్లవారింది మొదలు అతి గొప్పలు చెపుతుంది. వినే వాళ్ళు లేకపోతే ఎవరికో ఒకరికి ఫోన్ చేసి కబుర్లు చెపుతుంది.. ఆవిడకి ఊరంతా స్నేహితులే. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఈ సంబంధం అయితే మంచిది. ఆవిడ గారికి నోరు ఎక్కువ, కానీ సంబంధం మంచిది. మరి కృతిక ఏముంటుంది? అన్నది తెలుసుకోవాలి” అని చెప్పింది శ్రీనివాస్‍తో.

***

ఇక్కడ కృతిక సంబంధం గురించి చూస్తే – కాబోయే మామగారు రామయ్య గారు, కాబోయే అత్తగారు జానకమ్మ గారు. వాళ్ళ జీవిత విధానం బాగుంటుంది. కానీ కృతిక వారితో అడ్జస్ట్ అవ్వాలి.

ఇప్పుడు మార్కెట్లో ఏసిలు, కార్లు కూడా నెల వారి అద్దెకు ఇస్తున్నారు. కనుక నెలకి ఒక బ్రాండ్ కార్ ఇంటి ముందు ఉంటుంది. వాళ్ళ గొప్ప అందరికి కూడా బాగా  తెలియాలి. ‘కావాలంటే మా ఇంటికి వచ్చి పక్క వాళ్ళని ఆ వీధి వాళ్ళని అడగండి’ అంటుంది జానకమ్మ.

పనిమనిషి అన్ని పనులు చేస్తుంది. ఆమెదే పెత్తనం. ఎవరు ఏమి చెప్పక్కరలేదు. అవసరం అయితే బాబు గారిని అడిగి డబ్బు పట్టుకు వెడుతుంది. అది  టిప్ కింద లెక్క, తిరిగి ఇవ్వదు.  ఇవ్వడం ఇష్టం లేదు అని  చెపుతుంది.

సరే ఇంటి పనివాళ్ళకి ఇవ్వక పోతే ఎవరికి ఇస్తాము అని అంటాడు రామయ్య. అవును కదా, తనని ఇంటి పనిమనిషిగా కాక ఇంట్లో మనిషిలా చూస్తారు.

ఉదయం ఏడుగంటలకు వచ్చి కాఫీ తాగి ఇల్లు చిమ్ముతుంది.  పాచి గిన్నెలు కడిగి తుడిచి ర్యాక్‍లో సర్దుతుంది. దానికి వేరే డబ్బు ఇస్తారు. ఆ తరువాత తడి బట్ట పెట్టీ ముగ్గులు వేస్తుంది కూడా. ఎవరూ ఉండరు, అలాగని ఎవరూ పనిమంతులు కారు.

విడిచిన బట్టలు నానవేసి టిఫిన్ తిని వేరే ఇంటికి వెడుతుంది. వంట మనిషి రంగంలో ప్రవేశించి కూరలు తరుగుకుని వంటలు చేస్తుంది. ఈలోగా కుక్కర్లో అన్నం పప్పు పెట్టేస్తుంది. పాన్‌లో కూర వండుతుంది. వేరే చిన్న కుక్కర్లో పులుసు ఐటమ్స్ పెట్టి వండుతుంది. పచ్చడి మిక్సీలో పడ్తుంది. ప్రతి రోజు కొత్త పచ్చడి ఉండాలి. లేకపోతే టిఫిన్ ఎవరూ తినరు. ఏ రోజు పచ్చడి ఆ రోజు చెయ్యాలి. ఇది ఆ ఇంటి పద్ధతి. జానకమ్మ గారు పిల్లల్ని గారంగా పెంచింది. చదువు, కంప్యూటర్స్ నేర్చుకోవడం, రేడియో ప్రోగ్రామ్‌లు  ఇవ్వడంలో మహా ఘనులు.

పెద్ద అబ్బాయి రేడియోలో పని. చిన్న అబ్బాయి టివి ఛానల్‌లో పని. ప్రైవేట్ ఛానెల్ అయినా జీతం బాగుంటుంది. తండ్రి రామయ్య గారు ఇంజినీరుగా ప్రైవేట్ కంపెనీలో చేసి రిటైర్ అయ్యారు. ట్రాన్స్‌ఫర్‍లు లేవు. అంతా హాయిగా చదువుకున్నారు. ఇద్దరు కొడుకులు కూతుళ్ళు ప్రయోజకులయ్యారు. ఇల్లు దాటరు. నెల తిరిగేటప్పటికి ఎవరీ ఇన్‍కమ్ వారు తెచ్చేవారు. ఇల్లంతా నీట్‍గా వుంటుంది. ఇంట్లో అన్ని టేకు సోఫాలు కుర్చీలు. డైనింగ్ టేబుల్ కుర్చీలు అన్ని కూడా మంచి ఆధునిక పద్ధతిలో ఉంటాయి. వస్తువులు పాతవి అయినా సరే అలంకరణ కొత్తగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త వస్తువులు కొంటారు. ఎక్కడి కక్కడ డస్ట్ బిన్ ఉంటుంది. ఇంట్లో తుక్కు ఉండకూడదు, దోమలు ఈగలు వస్తాయి. వాటి కోసం మందులు వేస్తారు. స్ప్రే అయితే మంచిదని అదే వాడుతారు. అంట గిన్నెలు సైతం జాగ్రత్తగా కడిగి ఒక వార పెడతారు.

కంపెనీ వారు పెద్ద అపార్ట్‌మెంట్ కట్టించి అందులో స్వంతంగా కొనుక్కునేలా ఏర్పాటు చేశారు. అలా ఆ క్వార్టర్ వాళ్ళ సొంతం అయిపోయింది. పెద్ద పిల్లాడు, రేడియో సెంట్రల్ గవర్నమెంట్ కనుక చాలా తొందరగానే పెళ్లి అయ్యింది. వాడు చదివింది డిప్లొమా ఇంజినీర్ మాత్రమే. కానీ ఒక్కతే కూతురు అదే ఊళ్ళో, ఆయన డాక్టర్.  ఏదో రేడియో టాక్‍కి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఆయనను వీడు చేస్తే ఆయన వివరాలు అడిగి పిల్లని ఇచ్చాడు. సిస్టర్స్ పెళ్లి అంటే ముందు నువ్వు చేసుకో ఆ తరువాత వాళ్ళకి నేను చూస్తాను అంటు పట్టుపట్టి ఇంటికి వచ్చి పిల్లను చేశారు.

వాళ్ళకి వేరే ఇల్లు కొని అందులో పెట్టీ తండ్రి తల్లి చూసుకుంటారు. పెద్దకొడుకు శ్రీనివాస్ దీపక్ ఆ విధంగా సెటిల్ అయ్యాడు. ఇంక ఇద్దరు ఆడపిల్లల బాధ్యత తీర్చడానికి మధుసూదన్  ఉన్నాడుగా, ఏ సంబంధం వచ్చిన అక్కల పెళ్లి అంటాడు. పెద్ద పిల్లకి సంబంధాలు చూస్తుంటే కుండ మార్పిడి సంబంధాలు వచ్చాయి. కానీ ఇంకో పిల్లను పెట్టి ఈ పిల్లాడికి చెయ్యడం ఎలా? ఆడపిల్ల పెద్దది కూడా.

రామయ్య గారు ఉన్న దాంట్లో కుటుంబాన్ని బాగా చూసుకునేవాడు. జానకమ్మ కూడా ఇల్లు బాగానే ఉంచి పిల్లల్ని పద్ధతిగా పెంచింది.

ఏ ఇంట్లో చేసినా అత్తింటివారు చెప్పినట్లు వింటుంది, వంట వార్పు అన్ని పద్ధతిగా నేర్చుకున్నది. జానకమ్మ పిల్లల చేత పని చేయించడం ఇష్టం లేక వంట మనిషిని పెట్టుకున్నది. రేపు పెళ్లి అయ్యాక ఎలాగూ ఆడపిల్ల ఆడపిల్లే కదా, హౌస్ అడ్మినిస్ట్రేషన్ వస్తే చాలు, ఏ ఇంటి పద్ధతి ఆ ఇంటిది అంటుంది.  అందరూ ఒకలా ఉండరు.

ఎక్కడి బట్టలు అక్కడ దండెం మీద వేస్తారు, తడి టవల్స్ పంచెలు తెచ్చి తలుపులు కిటికీలు పై వేస్తారు  కొందరు. అయితే ఫ్యాన్ కింద మంచంపై ఆ పంచే పడేస్తారు ఇంకొందరు. వెనక్కల భార్య ఉండి తీసి అరేయ్యాలి.  ఆ చేత్తో బాత్ రూమ్ దగ్గర దండెం పై వేస్తే ఏమి అవుతుంది? భార్య సుఖ పడకూడదు. అలాంటి జిడ్డు లక్షణాలు రాకుండా ఇంట్లో మగ పిల్లల్ని పెంచింది జానకమ్మ. అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు ఎంతో పద్ధతిగా ఉంటారు ఒక్క మెతుకు అనవసరంగా పడెయ్యరు. చిన్న చిన్న విషయాలే. ఆదా మంచి ఆహారం దొరకడం కష్టం, బయట ఈగ దోమలు ఉన్న తిండీ కావాలి అంటూ ఎగబడతారు. ఆ  అలవాటు ఆ ఇంటి పిల్లలకి లేదు అనిపిస్తుంది.

కారప్పూస, జంతికలు, బూందీ, చెక్క వడలు వంటివి కూడా వారానికి ఒక రకం వంట మనిషి చేత చేయిస్తుంది. శుక్రవారం పరమాన్నం లేక రవ్వ కేసరీ చేయిస్తుంది. శనివారం పులిహోర లేక దద్దోజనం చేయిస్తుంది. పండుగలు వస్తే మిఠాయి, బొబ్బట్లు, అప్పాలు, పూతరేకులు, మినప సున్ని చేయిస్తుంది. ఇంట్లో వాళ్ళకి స్నాక్స్ ఎప్పుడంటే అప్పుడు ఉండాలి. ఒక్కో రకమైన వంటకం ఒక్కో రోజు చేయిస్తుంది.
ఉదయం పూట టిఫిన్‌గా గారె, బజ్జీ, పకోడీ, మైసూర్ బజ్జి, కట్టు పొంగలి కూడా చేయిస్తుంది. పిల్లలున్న ఇంట్లో నాలుగు పెట్టకపోతే ఎలా? శరీరానికి అప్పుడప్పుడు నూనె పిండి వంటలు ఉండాలి. వండాలి, తినాలి. సంతృప్తి పడాలి. ఓట్స్, కార్న్ ఫ్లాక్స్, బ్రెడ్, కేక్స్, పఫ్స్,  బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్ తిననివ్వలేదు. అదే అలవాటు పెద్ద వయస్సులో కూడా ఉన్నది.

ఏమైనా మన పిండివంటల ముందు మిగిలినన్నీ బలాదూర్ అని చెప్పాలి. వంట వార్పు అన్ని పద్ధతిగా ఆడపిల్లలకి నేర్పింది. అత్త ఇంట తల్లి మాట పడకూడదు. పిల్లల కోసం జానకమ్మ ఇరువది నాలుగు గంటలు ఆలోచిస్తూ ఉంటుంది. పిల్లల్ని కనగానే సరి కాదు, వాళ్ళని సవ్యంగా పెంచాలి అప్పుడే జీవితం సజావుగా ఉంటుంది.

అత్తగారు ఒక్క మగపిల్లాడు కుదరదు అంటే పిల్లల్ని కనడం తప్పలేదు. రెండో సారి, మూడో సారి ఆడపిల్లలు పుడితే ఇంకా నాలుగవ కాన్పులో మగపిల్లాడు మధుసూదన్ పుట్టాడు. అత్తగారు మామగారి పేరు పెట్టాలని పట్టుబట్టి మరీ పురుడు పోసింది. “నీకు కాన్పులు తేలిక.  మూడవ పురుడు పోసిన దాన్ని నాలుగు పొయ్యలేనా? వంట మనిషిని పెట్టీ మనుమడి పెంపకం చూసుకుంటాను” అని పట్టు పట్టింది. “నీ మామగారు సంపాదించినది చాలు మాకు, మనుమల్ని పెంచుకుంటాను” అంటు  అన్నపూర్ణ పట్టుపట్టి పిల్లల పెంపకం పెట్టుకున్నది.

కదిలే దేవుళ్ళు, వాళ్ళని బాగా పెంచాలి అంటూ అత్త మామ పిల్లలని పాడి పంటల మధ్య బాగా ఆనందంగా పెంచారు. టెన్త్ వరకు వాళ్ళ దగ్గర పెట్టుకుని చదివించారు. ఆ తరువాత జ్ఞానం వచ్చాక అమ్మ నాన్న దగ్గరికి వెళ్లి చదువుకున్నారు పెద్దాడు శ్రీనివాస్. బామ్మ దగ్గరే ఉండి డిప్లొమా ఇంజినీరింగ్ చేశాడు కనుక వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉన్నాడు. వాడు అక్కడే ఇష్టంగా ఉండేవాడు. తాత గారితో పొలానికి వెళ్లి పనులు చూసేవాడు. సాయంత్రం హాయిగా లైబ్రరీకి వెళ్లి చదువుకునేవాడు. అలా సాహిత్యంపై మక్కువ పెంచుకుని రేడియోలో ఉద్యోగం సంపాదించుకున్నాడు.  ప్రమోషన్‌తో పై స్థాయికి ఎదిగాడు. ప్రొడ్యూసర్‌గా మంచి పేరు కూడా వచ్చింది. గ్రామ సీమలు, పల్లె సీమలు అంటూ వ్యవసాయదారుల కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు ఎక్కువగా చేసేవాడు. పల్లెలో ఎక్కువ మంది తెలుసు కనుక దానికి తగ్గట్టుగా ప్రోగ్రామ్ డిజైన్ చేసి రికార్డ్ చేసేవాడు. అలా పల్లెలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు.

ఒకసారి రైతే రాజు అని ఒక ధారావాహికను సమర్థవతంగా నిర్వహించాడు. విభిన్న ప్రాంతాల రైతుల జీవన శైలిపై పల్లె జీవన చిత్రాలుగా పేరు పెట్టాడు. ఆ విధమైన కృషిని రేడియోలో ప్రసారం చేశాడు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏ యుగమైనా, ఏ కాలమైనా ఆహారం అందరికీ అవసరమే. అందులో మార్పు లేదు. దేశాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి పంట సాగు ఉంటుంది. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రైతు బిడ్డ ప్రజా క్షేమం కోసం కష్టించి పంటను సక్రమంగా పండించేవాడు. ఆహారం ఆవాసం ఆహార్యం తప్పని సరి. ఎవరి స్తోమతకు తగ్గ వారు జీవితాన్ని గడపాలి.

ఉగాది వస్తుంది అంటేనే కొత్త మామిడి పిందెల జీడీ అవకాయ అందరికీ ఇష్టం అని అందరికీ కూడా తెలుసు. పునాస కాయ రుచి వేరే ఉంటుంది. ఏటికి ఏడాది ఉండే దేశవాళీ కాయ రుచి వేరే ఉంటుంది.

అందుకే ఏటికి ఒకసారి అవకాయా మాగాయ పెడుతుంది జానకమ్మ. అంతా అత్తగారు ఇచ్చిన ట్రైనింగ్. పిల్లల్ని ఆవిడ పెంచి కోడలికి పనులు నేర్పింది. మళ్ళీ అవిడ పద్ధతి లోనే ఉండాలి. వేరే పద్ధతి కుదరదు. కూరలు కూడా ఆవిడ చెప్పినట్లు మునగకాడ నాలుగు అంగుళాల ముక్కలు, వంకాయ నాలుగు ముక్కలు, గుమ్మడి కాయా, ఆనప కాయా పెద్ద ముక్కలు, దోసకాయ పొట్టి ముక్కలు అంటూ దగ్గర ఉండి చెప్పి పులుసు ముక్కలు రెడీ చేయిస్తుంది. ఉడికాక పులుసు పోసి పిండి కలిపి  కొంచెం పోసి పోపువెయ్యలి. పులుసు ఎంత ఉడికితే అంతా బాగుంటుంది. కొత్తిమీర వేసి ఎక్కువ సేపు ఉడికించాలి. బెల్లం మన ఇష్టం ప్రకారం తక్కువ ఎక్కువ వేసుకోవాలి. ఇవన్నీ జానకమ్మకి తెలుసు, అయినా అత్తగారికి ఏదో ఒకటి చెప్పక పోతే రోజు గడవదు. రోజు గడుపుకోవడనికి కోడలిపై పెత్తనం చేస్తుంది.

మధుసూదనరావు ఎందుకే పూర్ణా, దాన్ని అలా సతాయిస్తావు, వంట దాని పద్ధతిలో దాన్ని చెయ్యమను. ఎలా వండినా అవే పదార్ధాలు కదా, నీ డిసిప్లిన్ ఎందుకు? అంటూ  నవ్వుతాడు. అయినా సరే అన్నపూర్ణ ఊరుకోదు.  దగ్గర ఉండి మరీ చెపుతూ ఉంటుంది. మధుసూదన్‌కి ఆ పద్ధతి నచ్చదు.  వంట వార్పు స్త్రీల హక్కు, అందుకని ఎవరు పద్ధతి వారిది, స్వేచ్ఛనివ్వాలి. లేకపోతే ఇంటిలో వంటిటి యుద్ధం అంటాడు. కాని పూర్ణ ఊరుకోదు. అత్తగారిగా ఆ ఇంటిలో  తన  మాటకి విలువ నిచ్చి పనులు చెయ్యాలి అంటుంది.

మధుసూదన్ తన తల్లి మాట కాదనేవాడు కాదు. ముగ్గురు అక్కల పెళ్ళిళ్ళు చేశారు. చిన్న పిల్లాడిగా ఉన్న తండ్రి వెనకాల ఉంటూ ఇంటి బాధ్యతలు చూసాడు, నేర్చుకున్నాడు. ఒక్క కొడుకు. గారం, ప్రేమ, ఆత్మీయత, ఆదరణతో పాటు పనిలో నైపుణ్యం కూడా నేర్చుకుంటు అలవర్చుకున్న విధానంలో అభినందనలు చెప్పాలి. తన భార్య అన్నపూర్ణ – కోడల్ని కూడా ఆర్డర్‌లో పెట్టాను అంటుంది కాని స్వతహాగా జానకి పనిమంతురాలు, అత్తగారు చేతికింద నేర్చుకున్న అమ్మాయిని అన్నట్లు ఉంటుంది అనుకున్నాడు.

మంచి తెలివైన పిల్ల. అత్తవారింట్లో ఎన్ని వచ్చినా అత్తగారు దగ్గర ఏమి రానట్లే ఉండి ఆమె చెప్పినట్లు చేస్తూ అన్ని నేర్చుకున్న అన్న తీరులో ఉండటం వల్ల మంచి పిల్ల అంటుంది. జీవిత గమనం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అందరు. తప్పదు అంటూ మొక్క మాదిరి ఆడపిల్ల జీవితం అక్కడ. మరీ అందుకే ఎన్నో నీతులు నిజాయితీ నేర్పుతూ అటెన్షన్‌లో ఉంటున్నారు. ఇదే జీవితం.

పెద్ద పిల్ల రూప ఎమ్.ఎస్.సి. చదివింది. బోటనీ స్టూడెంట్.  బాగా సున్నిత మనస్తత్వం. మొక్కలు అంటే ఇష్టం. అగ్రికల్చర్ బి.ఎస్.సి చదువుతాను అన్నది, కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. అందుకు బోటనీ చదివింది. ఇంటి నిండా మొక్కలు కుండీలలో పెంచుతుంది. కొన్ని నేలపై వేసింది. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ కదా, నేల తక్కువ భవనం ఎక్కువ ఉంటోంది. దానికి తగ్గట్టు బోన్సాయ్ మొక్కలు వచ్చాయి. పొట్టి వంగడాలు, అతి  తక్కువ సమయంలో కాయలు కాసే కొబ్బరి, మామిడి మొక్కలు వచ్చాయి. ఇలాంటివి కొని ఇంట్లో వేస్తుంది. కొన్ని మొక్కలు తొట్టెలో పెట్టి టెర్రస్ పై పెట్టింది. అందమైన పూల మొక్కలు బాల్కనీలో పెట్టింది. జాజిమల్లె తీగల విన్యాసం అందరికీ నచ్చింది. పువ్వులు ఎవరూ కావాలని అడిగితే వారికి ఇస్తుంది. అందుకని అందరూ ఓకే అన్నారు. మొక్కల పెంపకం చంటిపిల్లల పెంపకం లాంటిది. అందుకే అందరూ రూపకి ఓటు వేస్తారు. ఎన్నోరకాల మందారాలు కడియం నుంచి తెస్తారు. అవి కొని వేసింది. పువ్వులు మాత్రం అందరూ కోసుకుంటారు. తెల్ల పూలు, నంది వర్ధనం, గరుడ వర్ధనం, నిత్యా మల్లె, ఎర్ర మందారం, బిళ్ళ గన్నేరు, పచ్చ బిళ్ళ పూలు, నూరు వరహాలు, విష్ణు కాంతా పూలు, శంఖాలు ఇవి బాల్కనీ తొట్టెలో వేసిన బాగా పూస్తాయి. సీజన్లో బంతి అద్భుతమే కదా. బెంగుళూర్ కనకాంబరం తక్కువ నెలలో ఎక్కువ మొక్కలు వెయ్య వచ్చును. ఇలా ఆలోచించి బోటనీ స్టూడెంట్ అనిపించుకుంది.

ఎవరు మొక్కలు నాటిన ఫలితం అందరికీ అందేలా చూస్తుంది. పూజకి కావాలి కదా పుణ్యం నాదే కదా అంటుంది. ఇది ఏ ఇంటి కోడలు అవుతుందో నోట్లో నాలుక లేదు, అందరినీ పలుకరిస్తూ ఎంతో ఆప్యాయతగా ఉంటుంది. దగ్గర సంబంధాలు ఉన్నాయి కానీ వాళ్ళకి చదువు పనికి రాదు అంటూ తక్కువ చదివిన గడసరి పిల్లల్ని ఎంచుకున్నారు. సంతృప్తి ముఖ్యం జీవితంలో. ఉద్యోగం వద్దు అనుకున్న అసలు చదువుకున్న పిల్ల వద్దు అన్నారు. ఏమిటి? పెళ్లికి ముందు అడిగితే చదువు అవనివ్వాలి, అప్పుడు గానీ మా వాడికి చెప్పాం మేము అన్నారు. చదువు అయ్యాక డబ్బు కావాలి, వంట బాగా చేసే పిల్ల కావాలి, ఇదండీ నేటి కొత్త విషయం. ఏమిటో చిత్రం కదా!

రూప స్నేహితురాలు ఉజ్వల వేరే రాష్ట్రం అబ్బాయిని ప్రేమించింది. ఊళ్ళోనే పెళ్లి. అది కూడా ఉదయం  పదకొండు గంటలకు. పెళ్లి అభిజిత్ లగ్నంలో అటు ఇటు పెద్ద ఇష్టం ఉన్నట్లు లేదు. వీళ్ళు ఉన్నవాళ్ల కోవకి చెందిన వాళ్ళే అయిన పిల్ల ఇష్ట ప్రకారం అన్నదమ్ములు చెయ్యమన్నారు. ఒక్కతే కూతురు. సరే, రూపతో పాటు రమ్య కూడా వెళ్ళింది.

బాగా గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మంది యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బంధువులు ఓ పాతిక మంది ఉంటారు. పెళ్లి కొడుకు కజిన్ సినిమాల్లో వేస్తుందిట. ఆ అమ్మాయిని చూడటం కోసం ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళలో ఒక సినిమా  ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు. ఇంకా సినిమా రంగం వారు కొందరు వచ్చారు. అది కవర్ చెయ్యడానికి మీడియా వాళ్ళు వచ్చారు.
ఇంకేమి సభ మండపం, పెళ్లి మండపం రెండు కూడా చాలా నిండుగా ఉన్నాయి. రమ్య, రూప పాత కాలం పద్దతిలో పట్టు చీరలు కట్టుకొని వెళ్ళారు. అక్కడ అంతా బుట్టబొమ్మ నెట్టడ్ గాగ్రాలు వేసుకున్నారు. పమిట కేవలం మగవారి కండువా మాదిరి ఉన్నది.  సరే ఈ తరం అంతే కదా, పులిని చూసి నక్క వాత అంటారు. అందుకే మరి సినిమా సెట్టింగ్‍లా ఉన్నది. విత్తం కొద్దీ వింతలు, విడ్డూరం అన్నట్లు ఉన్నది.

స్వయంవరం మాదిరి ఏర్పాటు చేశారు. అదే మన వాళ్ళు ఎదురు సన్నాహం అంటారు కదా, అలా అంతా కూర్చున్నారు. స్వయంవరంలో సరదాలు, సమాహారాలు, సమాచారాలు, పూర్వీకుల బాటలో ఈ తరం వారు కూడా నడుస్తున్నారు అన్నట్లు ఉన్నది.

పెళ్ళి సంబంధం మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ ఇద్దరే నిర్ణయాలు తీసుకున్నారు. పెద్దలు లేరు, ఉజ్వల కుటుంబం వారు కూడా ఊరుకున్నారు. డైరెక్ట్‌ గా వాళ్ళ అమ్మ, నాన్న, అక్క, బావ, పిల్లలు, చెల్లెలు అంతా పెద్ద కారు వేసుకుని వచ్చారు. మాకు పిల్ల నచ్చింది, పిల్లాడు ఇష్ట పడుతున్నాడు అంటూ వీళ్ళని మాట్లాడనివ్వలేదు. అంతా వారే ఉన్నారు. పిల్లాడు  పిల్లను చూస్తూ అన్ని విషయాలు మాట్లాడి వారిని మెప్పించి ఒప్పించి పెళ్లి కుదిర్చారు.

ఏమి వద్దు, ఘనంగా పెళ్లి చేయాలి అంటారు. ఆ ఘనంగా అన్నది ఎంత వరకు అని ఆలోచించాలి. ముహూర్తం రోజున ఎదురు సన్నాహంలో అన్ని ఒక్కొక్కటి బయటపడ్డాయి. బట్టలు ముందు పెట్టాలి అన్నారు, అలాగే బట్టలు పెట్టారు. మండపంలో  గౌరీ పూజ అవుతోంది. పెద్ద ఆడపడుచు వచ్చి ఆంటీ పిల్ల పెళ్లి అయ్యాక ఆడబడుచులకి ఏదైనా ఆభరణం, పట్టు చీర పెట్టాలి, ఇది మా సంప్రదాయం అన్నది. వెంటనే ఉజ్వల “అలాగే వదిన గారూ మీ తమ్ముడు ఏమి వద్దు అన్నారు. కానీ మీరు అడుగుతున్నారు కనుక నేను మీ ఇంటికి వచ్చాక మీరు మీ కోరికలు చెపితే ఆ తరహాగా అన్ని పంపుతారు. అయినా నేను కూడా మీ తమ్ముడితోనే చదివాను. మా ఇష్ట ప్రకారం చేసుకుంటున్నాము. ఇద్దరం మాట్లాడుకొని ఆలోచిస్తాను” అని ధైర్యంగా చెప్పింది. ‘ఇవన్నీ మాకు చిన్న విషయాలు, బట్టలు స్వీట్స్ పెట్టడం మామూలే’ అని నవ్వి పూజలో పూవులు పెడుతుంది. గౌరీ మంత్రం చెపుతూ చాలా శ్రద్ధగా పూజ చేసింది.

తల్లి తండ్రి, పెళ్లి వాళ్ళలో ఆ మాటలు విన్న వాళ్ళు అవాక్కయ్యారు.  పెళ్లి కూతురా మజాకా అన్నారు. పిల్లని బాగా చూసుకోండి అన్నారు. పిల్ల తల్లి తండ్రి ఎప్పుడు ఎలార్ట్ గానే ఉండాలి, ఆధునిక పెళ్ళిలో సమాచారం ఇది.

పెళ్ళి భోజనాలు అయ్యాయి. పెద్దలకు భక్తిగా పాద నమస్కారాలు చేసి దీవెనలు పొందారు. స్నేహితులకి కూడా బట్టలు పెట్టారు, అది విషయం. స్నేహతురాలితో ఎంతో ఆనందంగా మాట్లాడుతూ అందరికీ స్వీట్స్ పాకెట్స్ ఇచ్చింది  ఉజ్వల. ఉజ్వల ఏమైనా తెలివైనది, రూప చెల్లెలు రమ్యకి కూడా బట్టలు పెట్టింది.

***

పెద్దల ఆస్తులు పల్లెలో వదిలి తమ మేధావి తరం వలసలు పోయాయి. ఎంతో తెలివిగా  ఒక తరంలో అంత ఉద్యోగ బేరాలు బాటలో విదేశీ పరుగులు పెట్టి భవనాలు నిర్మించి కోట్లు గడించి స్వదేశానికి వచ్చి ఆస్తుల బేరీజు వేసుకుని  పెద్ద ఐదు నక్షత్రాల హోటల్ ఉండి పల్లెటూరు రైతుల్ని బంధువుల్ని హోటల్‌కి పిలిచి తమ గొప్పలు చెపుతూ పొలాలు ధరలు బేరీజు వేసుకుని ఎనబై ఏళ్ల పెద్దాయన మొదలు అంత ధన పరుగులు పెడుతున్నారు. పెద్దల అవసరం లేదు, పిల్లల జీవితాలు గాలికి వదిలి వృద్ధాప్యంలో కూడా ధనమే అన్నిటికీ మూలం అంటున్నారు. ఇదండీ ఎక్కడ ఉన్నా జీవితం ఒకటే.

ఆడదాని మెడలో కట్టే తాళి మగవాడు జీవితానికి స్పీడ్ బ్రేకర్. ఇది మగపిల్లలు  కొందరి అభిప్రాయం. అదే ఆడపిల్లలకి కూడా అత్త ఇల్లు అగడాల నిధి, సన్నిధి కూడా. నేటి తరం పిల్లల అభిప్రాయము. కానీ పెద్దవాళ్ళు  దీనికి ఒప్పుకోరు.

నేడు పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్నట్లు పెళ్లి అయ్యాక ఆ  తరువాత ఉండటం లేదు. ఆడపిల్లలు చదువుకుని సవ్యసాచిలా మారుతున్నారు. కానీ మగ పిల్లలు పెరుగుదలలో మగ మహా రాజులు అంటూ బాధ్యతా రహితంగా మారడం వల్ల సంబంధాలు రావడం కష్టంగా ఉన్నది. మరో ప్రక్క ఆడపిల్లలు తక్కువ అయ్యారు.

కారణం అత్తగార్లు ఆడపిల్ల వద్దు అంటూ పసి మోగ్గలని మాయం చేస్తూ కోడళ్ళను వేధించడం వల్ల ఆడపిల్లల సంఖ్య తగ్గి విద్యావంతుల సంఖ్య పెరిగింది. అందుకే మగపిల్లలు పెళ్లి కాకుండా బ్రహ్మచారుల్లా ఉండిపోతున్నారు. మరి ఈ ప్రజ్ఞ బామ్మ గారిదే అంటారు. కోడళ్ళు భయంతో ఆడపిల్లలను మాయం చేసినా, అత్తగారిని మెచ్చుకోకపోయినా మగపిల్లాడి పెళ్లి గురించి ఆవేదన పడుతున్నారు.

జానకమ్మ రెండో కొడుకు మధుసుదన్ పెళ్లి కొంచెం ఆలస్యం అయింది.

“మొన్న మనకి చెప్పిన పిల్ల మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన విషయాలు, విధానం వినండి” అని తల్లికి తండ్రికి వినిపించి “మనం చూసిన అమ్మాయి కదా, వాళ్ళకి కబురు పెట్టండి, మనకి ఇష్టమే” అని అన్నాడు

“ఏమిటిరా ఆ పిల్ల అలా అత్తింటిని దుయ్యబట్టింది కదా” అంటే, “సమాజంలో జరిగే సత్య అంశాలు గురించి చెప్పింది, అంతే. ప్రతిదీ ఆమెకే మనం అన్వయిస్తే ఎలా?” అన్నాడు.

“ఉండండి నేను ఫోన్ చేసి మెచ్చుకుని, ఆమెను మా ఛానెల్‍కి ఇంటర్వ్యూ చేస్తాను” అన్నాడు.

ఫోన్ నంబర్ కలెక్ట్ చేసి ఫోన్ చేశాడు. సరే అంటూ అవతలి నుంచి రిప్లై వచ్చింది. జానకమ్మ మాత్రం భయపడింది.

సరే ఛానల్ వారు వచ్చే సమయానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఊళ్ళో ఇంకా అమ్మాయిలు కూడా వచ్చారు.

అతనే పెళ్లి కొడుకు అని తెలియదు కారణం, పెళ్లి చూపులకి మధు రాలేదు. వాళ్ళ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు. అందరూ కృతికను మెచ్చుకున్నారు. వచ్చిన మధుసూదన్ కూడా “ఈ తరానికి తగ్గట్లు మాట్లాడారు, బాగుంది” అన్నాడు.

రాఘవరావు గారు ఓ యాభై కాయలు బుట్ట కట్టించి ఇచ్చారు వాళ్ళ స్టాఫ్‌కి కూడా, మా ఊరు మామిడి కాయలు బాగుంటాయి అంటూ. పన్నెండు కాయలు చొప్పున వేసి కవర్స్ ఇచ్చారు. అరటి పళ్ళ అత్తలు, చెరకు గడ ముక్కలు, వేప పూలు కూడా ఇచ్చారు. అన్ని ప్రిజ్‌లో పెట్టండి మామిడికాయ జీడీ ఆవకాయ పెట్టమనండి అని చెప్పారు.

అంతా ఆనందంగా కృతిక ప్రజ్ఞను పొగిడారు.

అయితే అతనే పెళ్లి కొడుకు అని వాళ్ళకి తెలియదు. ఇంటికి వెళ్ళి మధుసూదన్ కబురు పంపాడు. ఈ సంబంధం వచ్చి రెండున్నర ఏళ్లు అయ్యింది. అన్ని మార్చి పోయి వదిలేసాక మళ్ళీ వచ్చారు. విధి విచిత్రం, గ్రహాలు ఇప్పటికీ మారాయి. ఆధునిక భావాలు ఉన్న పిల్ల పెంపకంలో. పెద్దలు అంటే గౌరవం ఉన్నది. అందుకు మధుసూదన్ నవ్వుకుని సరే అనుకున్నాడు

అటు ఇటు పెద్దలు అన్ని మాట్లాడుకున్నారు. కట్నాలు కానుకలు వద్దు, అసలు మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకున్నది అది చాలు అన్నాడు నవ్వుతూ. ప్రగతి సాధించిన మహిళలు ఇలాగే ఉంటారు అన్నాడు.

ఎవరికి ఎవరూ రాసి పెట్టారో వాళ్ళు అవుతారు. ఎన్నేళ్ళు వేచి ఉన్నా వాళ్ళే వచ్చి చేసుకుంటారు.

***

ఉగాది పండుగ ఘనంగా చేస్తారు రాఘవరావు గారు. పెద్ద బకెట్‌లో పచ్చడి చేయించి వీధి గదిలో పెట్టుకుని వచ్చిపోయే వాళ్ళకి పంచి పెడతారు. కొందరు పంచాంగం గురించి వివరాలు జాతక ఫలాలు నక్షత్ర ఫలాలు అడిగి తెలుసుకుంటారు. ఊళ్ళో అమ్మవారు జాతరకు ఇళ్ళకి వచ్చి స్వయంపాకం పట్టుకెడతారు. ఆడవాళ్ళ అయితే తమలపాకులు, అరటిపళ్ళు, వక్క పెట్టి తాంబూలం ఇస్తుంది సౌభాగ్యమ్మ.

కూతురి ఫ్రెండ్స్ వస్తారు. అందరికీ గారెలు, ఉగాది పచ్చడి, కేసరీ, ఒక బూరి, అరటిపండు పెడుతుంది. ఆ రోజు ఇంట్లో అమ్మవారికి నివేదన పెడతారు.

మామిడి కాయ పప్పు, తెలకపిండి కూర, ముక్కల పులుసు, కొబ్బరి పచ్చడి, బూరెలు, గారెలు, చప్పిడి బూరెలు, బజ్జీలు వేసి పెడతారు. అది చాకలికి ఇస్తారు. ఈ విధంగా పల్లెలో పూజలు ఉంటాయి.

ఎక్కడ ఉన్నా, అపార్ట్‌మెంట్స్‌లో ఉన్నా పండుగ చేస్తారు. నివేదనలు పెడతారు. ఉగాది నుంచి మన జాతకాలు మారుతాయని అంటారు.

ఈ ఏడు కృతిక పెళ్లికి సన్నాహాలు చేశారు. వారం నుంచి ఈవెంట్ వాళ్ళు అన్ని అలంకరించారు. జనం అదో విచిత్రంగా సినిమా సెట్టింగ్ మాదిరి ఉన్నదని చూసేవారు. వారం ముందు వారం తరువాత గాని ఆ సెట్టింగులు విప్పలేదు.

శోభకృత్ నామ సంవత్సరంలో కృతిక పెళ్లి ఘనంగా చేశారు. అటు వాళ్ళు ఇటు వాళ్ళు అసలు వీళ్ళకి పెళ్లి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూపులు చూశారు.

పెళ్ళికి మీడియా వాళ్ళు అంతా వచ్చారు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అంటూ గట్టి మేళం వారు శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కీర్తనలు వాయించారు.  పెళ్ళిలో రక రకాల టెక్నిక్స్ పెట్టిన స్క్రీన్ లో ఊళ్ళో సెంటర్స్ లో పెట్టారు. ఒక వెయ్యి మంది జనం దాకా వచ్చారు.  అటు తరఫు ఇటు తరపు చాలా రోజుల తరువాత పెళ్లి సందడి. అందుకే ఎక్కువ మంది హాజరు. అందులో చిన్న ఊళ్ళో పెళ్లి కనుక అరెంజ్‌మెంట్స్ గొప్పగా చేశారు. ఊరంతా పచ్చి గడ్డి రోడ్లపై పరిచి మొక్కల కుండీలు అమర్చి పచ్చి పూల మండపం కట్టి అలంకరించారు. ఇక్కడ కొబ్బరికాయలు కొబ్బరి ఆకుల డెకరేషన్ ఒరిజినల్‍వి పెట్టారు.

పెళ్ళి కొడుకు టివి l లో ఆర్ట్ డైరెక్టర్ కనుక ఈవెంట్ వాళ్ళని తెచ్చి ఆ పద్ధతిలో అలంకరణ చేశారు. ఒక విధంగా చెప్పాలి అంటే మయసభ మాదిరిగా ఎంతో అందమైన అలంకారాలు, పచ్చి కూరల అలంకారాలు, సరస్సులు బొమ్మలు అన్ని కూడా అందరికీ విచిత్రంగా ఆనందంగా అమర్చారు. పెళ్ళి తరువాత కూడా వారం దాకా ఆ పువ్వులు మొగలి రేకులు ఎండకు వాడకుండా అలాగే ఉన్నాయి.

పెద్దకూతురు శోభ పెళ్లి ఏదో మామూలుగా చేశారు కానీ చిన్న కూతురు కృతిక పెళ్లి వైభవంగా జరిగింది.  అందరికీ సారె చీర పెట్టీ పంపారు రాఘవరావు గారు, సౌభాగ్య లక్ష్మి గారు.

మరి మనం కూడా ఆశీర్వదిద్దామా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here