కాజాల్లాంటి బాజాలు-75: షాపింగ్ అంటే అదీ…

4
8

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap]మధ్య చాలామందికి ఆన్‌లైన్‌ షాపింగ్ అవసరమయిపోయింది.

ఇదివరకయితే యేదైనా చీర ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నామని చెప్పడం గొప్ప విషయంలా అనిపించేది. ఎందుకంటే నేనేదైనా చీర కొనుక్కోవాలంటే ముందా బట్ట యెలా వుందో పట్టుకు చూస్తే కానీ కొనలేను. బట్ట చేతికి మెత్తగా తగలాలి. ఆ తర్వాతే రంగూ, బోర్డరూ చూడడం. కానీ యిలా ఆన్‌లైన్‌ చీర తెప్పించుకుంటే నాకా అవకాశం యెక్కడుంటుందీ! అందుకే నేనిన్నాళ్ళు ఆన్‌లైన్ షాపింగ్ జోలికి పోలేదు. కానీ ప్రస్తుతం చీరలకే కాదు ప్రతి చిన్నదానికి అది తప్ప వేరే దిక్కు లేకుండాపోయింది. మరింక నేనూ ఆ సంద్రంలో దూకక తప్పలేదు. అలా దూకినప్పుడు నాకు కొన్ని విషయాలు వింతగా అనిపించేయి.

మామూలుగా షాప్‌కి వెడితే ఎదురుగా షెల్ఫ్‌లో అన్నీ కనిపిస్తుంటాయి కదా.. మనకి కావల్సినవి తీసుకుంటాం. కానీ ఈ ఆన్‌లైన్‌లో అలాకాదే..

అసలు ముందు ఇంట్లోకి కావల్సిన పప్పులూ, ఉప్పులూతో మొదలెట్టేను. కందిపప్పుని ఇంగ్లీషులో యేమంటారూ అనుకుంటూ ఎప్పుడో మర్చిపోయిన పదాలు గుర్తు చేసుకుంటూ మామూలుగా దాల్ అని కొట్టేసేను. అంతే తూర్ దాల్, మూంగ్ దాల్, ఉరద్ దాల్ అంటూ ఓ పదిరకాల పప్పులున్న కవర్లన్నీ పేర్లతో, బరువుతో సహా వచ్చేసేయి స్క్రీన్ మీదకి. ఇదేదో బాగుందే అనుకుంటూ ఒక్కో బొమ్మా పెద్దది చేసి చూసుకుంటూ కావల్సిన పప్పులన్నీ బాస్కెట్‌లో పడేసేను.

తర్వాత నూనెలు.. పూజా ఆయిల్ ఒకటి కావాలి, చేతిమీదకి నూపప్పు నూనె ఒకటి కావాలి, ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసుకుంటే రిఫైండ్ ఆయిల్ ఒకటి కావాలి..వాటిలో ఒకటుంటే ఒకటి లేదు. సరే వున్నవే బాస్కెట్‌లో పడేసి, మిగిలినవాటివైపు వెళ్ళేను. ఇలా ఇంట్లోకి కావల్సినవన్నీ చూసుకుంటూ, తీరుబడిగా ఓ గంట ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటే… నేనడిగినవాటితోపాటు వాడు “ఇవి కూడా కొనుక్కోండి” అంటూ పక్కన ఇంకో ఇన్ని సరుకులు చూపిస్తున్నాడు.

పాపం, వాణ్ణి మటుకు చిన్నబుచ్చడమెందుకనుకుంటూ అందులోవికూడా కొన్ని బాస్కెట్‌లో పడేసేను.

హమ్మయ్యా.. నెలకి కావల్సిన సరుకులన్నీ ఆన్‌లైన్‌లో కొనేసేను అని సంబరపడిపోతూ బిల్ చూస్తే నాకు కళ్ళు తిరిగిపోయేయి. ఎప్పుడూ మేము ఖర్చుపెట్టేదానికి రెండింతలు ఎక్కువ కనిపించింది.

మళ్ళీ లిస్ట్ చూసుకుంటూ వెనక్కెళ్ళేను. అఖ్ఖర్లేనివి తీసెయ్యాలనుకుంటూ వాటికి ఇంటూలు పెట్టుకుంటూ వెళ్ళడం మొదలెట్టేను. కానీ ఆ ఇంటూలు రెండో మూడో మాత్రమే వచ్చేయి. ఎలాగైతేనేం కిందపడీ మీదపడీ మొత్తానికి ఆర్డర్ పెట్టేసేను. సరుకులు మర్నాడు వచ్చేస్తాయని మెసేజ్ కూడా వచ్చేసింది. కానీ ఎందుకో నాకంతా అసంతృప్తిగా అనిపించింది. ఇన్ని వేలు పోసి ఇన్ని సరుకులు కొన్నా కూడా ఈ అసంతృప్తి యేమిటా అనుకుని ఆలోచిస్తుంటే కళ్ళముందు సినిమా రీలు గిర్రున తిరిగింది.

ఇదివరకు వారానికోసారి యేదో వంక పెట్టుకుని మెయిన్ రోడ్ కి వెళ్ళేదాన్ని. దార్లోనే వున్న కళాధర్ షాప్ లోకి మేచింగ్ బ్లౌజ్ అనే వంకతో ఓసారి తొంగిచూసి, ఎదురుగా కంటికి నదరుగా కొత్తగా యేమైనా చీర కనిపిస్తే కొనేసుకుని, పక్కనే వున్న టైలర్‌కి జాకెట్, పీకో ఫాల్ కుట్టడానికి ఇచ్చేసి, రోడ్డు దాటి సూపర్ మార్కెట్ లోకి వెళ్ళేదాన్ని.

సూపర్ మార్కెట్‌లో షెల్ఫ్‌లో వున్నవన్నీ చూసుకుంటూ, కొత్తవి యేమొచ్చేయా అని పరిశీలిస్తుంటే యెప్పుడో యేడాదిక్రితం ఈ లొకాలిటీలోంచి స్వంత యిల్లు కట్టుకుని వెళ్ళిపోయిన వర్ధనమ్మగారో లేకపోతే ఆర్నెల్లపాటు అమెరికా కొడుకు దగ్గరుండి వచ్చిన జానకమ్మగారో కనిపించేవారు. అంతే..

వర్ధనమ్మగారేమో కొత్తింట్లో వున్న సదుపాయాల గురించి చెప్పేవారు. జానకమ్మగారేమో ఆర్నెల్లపాటు అమెరికాలో ఒక్కరూ కబుర్లు చెప్పుకుందుకు మనిషి కనపడక ఎంత ఇబ్బంది పడేవారో చెప్పేవారు. అలా సాధకబాధకాలన్నీ కలబోసుకుంటూ అక్కడే ఓ గంట కబుర్లు చెప్పేసుకునేవాళ్లం.

ఆ తర్వాత ఇటు పక్కనున్న షాప్‌కి వెళ్ళి కుక్కర్‌కి గాస్కెట్ కొనుక్కుని, మిక్సీకి బుష్ వేయించుకుని, కొత్తకొత్తగా కిచెన్‌లో పనికొచ్చే సామాను లేమొచ్చేయా అని ఓ లుక్కేస్తుంటే మా పక్కింట్లో ఆర్నెల్లపాటు అద్దెకుండి వేరే ఇంటికి మారిపోయిన సరస్వతో లేకపోతే మా వదిన బాబాయిగారి కోడలు సరోజో కనిపించేవారు. సరస్వతిగారేమో కొత్తగా మారిన ఇంటావిడ ధాష్టీకం గురించి వల్లించి వల్లించి చెప్పేవారు. సరోజయితే తన పిల్లల పెళ్ళిప్రయత్నాల గురించి చెపుతూ ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కుదుర్చుకోవడం ఎంత కష్టమో అని చెప్పుకుంటూ వాపోయేది. మరింక గంటేం సరిపోతుంది కబుర్లాడుకోడానికి.. అదంతా అయ్యేక ఎదురుగా కనపడుతున్న సందులో కూరలు కొనడానికి కాలు పెడతానో లేదో ఎంతమంది తెల్సినవారో.. ప్రతివాళ్ళు పలకరించి క్షేమసమాచారాలు కనుక్కునేవాళ్ళే.. అవునుమరి.. అప్పుడే నలభైయేళ్ల నుంచి ఈ లొకాలిటీలో వుంటున్నాం.. ఆ మాత్రం మనుషుల పరిచయాలుండవా!..

అందరినీ పలకరిస్తూ కూరలు కొనుక్కుంటుంటే ఇంటినుంచి వెటకారాలాడుతూ ఫోన్ వచ్చేది .. “ఇక్కడే వున్నావా.. గౌతమీ యెక్కేసేవా..” అంటూ. హూ! ఎంత రాజమండ్రీ అంటే యిష్టమైతే మటుకు అలా కూరలకని వెళ్ళి గౌతమీ యెక్కేస్తారా ఎవరైనా మరీ చోద్యం కాపోతే!

నేనేం తక్కువ తిన్నానా అనుకుంటూ “అబ్బే.. లేదు..ఇప్పుడే అమెరికా వెడదామని ఫ్లైట్ ఎక్కేసేను.” అంటూ ఢామ్మని ఫోన్ గొంతు నొక్కేసి, ఆ వేడి తగ్గడానికి పక్కనే వున్న అయిస్ క్రీమ్ షాప్ లోకి దూరిపోయేదాన్ని. సరే ..ఇంకక్కడ ఇంకోళ్ళు కనిపించడం. మళ్ళీ కబుర్లూ.. గట్రా.. మామూలే..

అన్నీ ముగించుకుని యింటి కొచ్చేటప్పటికి మనసెంత హాయిగా వుండేదీ.. బోల్డు సరదా కబుర్లూ, సమాచారాలూ.. అన్నీ యింట్లోవాళ్లకి మళ్ళీ యాక్షన్ చేస్తూ, ఆ కబుర్లకి నా వ్యాఖ్యానాలు కూడా జోడించి మరింత అందంగా చెప్పడం… ఎంత బాగుండేదీ! అసలు షాపింగ్ అంటే అదే కదా! ఏవీ ఆ రోజులూ.. మళ్ళీ అలా సాయంత్రం పూట హాయిగా ఓ నాలుగు రోడ్లు తిరిగొచ్చే కాలం యెప్పటి కొస్తుందో కదా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here