శ్రద్ధ

0
9

[dropcap]ఆ[/dropcap]రోజే వేసవి సెలవుల తర్వాత పాఠశాల పునః ప్రారంభమవుతున్నది. పంతుళ్ళంతా ముందుగా వచ్చారు. గదులన్నీ పండుగ కళతో అందగిస్తున్నాయి. పెద్దపంతులు బడి చిమ్మే మాలచ్మిని పిలిచి “మహాలక్ష్మీ! బడి గదులన్నీ చాలా బాగా అలంకరించావు, చాలా బావుందమ్మా!” అన్నారు .

“అయ్యా! పెద్దసార్ గారూ, నేకాదండీ! మా చంటోడు ఆనందప్ప ఇదంతా చేసిండండీ! ఆడికి బడంటే పేనం సారూ! ఆన్ని బల్లో ఏసుకుంట రాండీ!” అంది ఆ అమాయకురాలు. ఆ వేసవి ముందే ఆమె బడి చిమ్మను కుదిరింది.

పెద్ద సార్ నవ్వి “భలేదానివే లక్ష్మమ్మా! ఇది ప్రభుత్వ పాఠశాల. ఆనందప్పను తప్పక తీసుకురా! బడిని ఇంత బాగా అలంకరించిన మీ వాడిదే ఫస్ట్ అడ్మిషన్.” అన్నారాయన. అలా ఆనందప్ప ఆ బళ్ళో విద్యార్ధి అయ్యాడు. వాడి చిరకాల కోరిక నెరవేరింది. పిల్లలంతా బడికి ఉత్సాహం ఉరక లేస్తుండగా పరుగు పరుగున వచ్చారు.

జూన్ మాసం వచ్చిందంటే బడిపిల్లలకు ఉత్సాహం, కొత్త తరగతిలోకి వెళ్తామని, ఇటు టీచర్లకేమో తమ క్లాసులకు ఎలాంటి పిల్లలు వస్తారో ఏమో! వారెంత అల్లరి చేసినా కొట్టకూడదాయె, ఎలా వారితో వేగాలాని ఒక విధమైన సందిగ్ధం. ఇహ తల్లిదండ్రులకు కొత్త పుస్తకాల సంచులూ, చెప్పులూ, కలాలూ, నోట్ బుక్కులూ ఎక్కడ నుంచీ తెచ్చి కొనివ్వాలాని చింత పట్టుకుంటుంది.

ఎవరెలా ఉన్నా లక్ష్మమ్మ కొడుకు ఆనందప్ప మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. వాడు తెలివితో పాటుగా ఎంతో హుషారైన వాడు. వాడికి తనను బళ్ళో వేసుకున్నందుకు పెద్ద పంతులంటే మహా ఇష్టం ఏర్పడింది.

“నాకు సదువంటే శానా ఇట్టం. పెద్ద సార్ గారు శానా మంచోరు.. నన్ను బల్లో ఏసుకున్నరు” అంటూ వాడు అందరితో చెప్పుకోడం విన్న పంతుళ్ళంతా వాడికి చదువు మీద ఉన్న శ్రధ్ధా భక్తులకు సంతోషించారు. తరగతి గదిలో పంతులుగారు చెప్పేది ఆనందప్ప బాగా విని ఏకసంధాగ్రాహిలా వెంటనే అప్పగించేవాడు. రాయనూ, చదవనూ త్వరత్వరగా నేర్చేసుకున్నాడు.

వాడి తెలివికి ఉపాధ్యాయులే నివ్వెర పోయేవారు. తరగతి గదిలో ఏ సమస్య వచ్చినా వాడు తెలివిగా చక్కబెట్టేవాడు. నల్ల బల్ల రాయక పోతే బడి పక్కనే ఉన్న చేలల్లోకి వెళ్ళి సరస్వతీ ఆకుతెచ్చి నలిపి రసం తీసి బోర్డుకు రాసేవాడు, అప్పుడు చక్కగా తెల్ల సుద్ద ముక్కతో పంతులు గారు వ్రాసింది అందరికీ బాగా కనిపించేది. తరగతి గదిలో మట్టి నేల గుంతలుపడి, గతుకులుగా ఉంటే, బడికాగానే వెళ్ళి మన్నుతో గుంతలు పూడ్చి, ఆవు పేడ తెచ్చి తల్లికి చెప్పి చక్కగా అలికించేవాడు. తల్లిని పిల్చుకొచ్చి చుట్టూతా ముగ్గు పెట్టించే వాడు, తెల్లారి గది తెరిచే సరికి పంతులుగారికి ఆశ్చర్యమేసేది. అలా వాడిశక్తి కొద్దీవాడు పైసా ఖర్చు చేయకుండా తరగతి గదిని అలంకరించేవాడు.

అలా అలా వాడు మూడో తరగతిలోకి వచ్చేశాడు. శతక పద్యాలన్నీ కంఠతా పట్టేశాడు. వేళ్లతోనే లెక్కలు ఖచ్చితంగా చేసేసేవాడు. పాటలు, కధలూ గబగబా నేర్చేసుకునే వాడు.

జాతీయ పండులు వస్తేచాలు “ఏరా! ఆనందా! రేపు మన స్వాతంత్ర దినోత్సవం కదురా! ఏంచేద్దాం?” అనగానే, “రేపుదయం చూడండి సారూ!” అనేవాడు. ఉదయం పంతుళ్ళంతా వచ్చే సరికి బడిలో గదులన్నీ పచ్చని మామిడాకుల తోరణాలతో, రంగోలీలతో, అరిటి పిలకలతో పండుగ ఇంటిని తలపిస్తున్నది. తమ పెరట్లో వేసి పెంచుకున్న రకరకాల పూలుకోసి అమ్మతో మాలలు కట్టించి తెచ్చి జాతీయ నాయకుల ఫోటోలకు వేసేవాడు.

తరగతి గదిలో పిల్లలు కాయితాలు చింపిపోసేవారు. తెల్లకాయితాలు నోట్సుల్లోంచీ చింపి చిన్న చిన్న ముక్కలుగా చేసి తలలపై చల్లుకునే వారు. నోట్సు కాయితాలతో విసినకర్రలూ, పడవలూ, నాలు గ్గిన్నెలూ చేసి పంతులుగారు వచ్చేసరికి అవన్నీ తమ వెనకాల పడేసేవారు. ఆనందప్ప తన ఇంటిపక్క పాత కాయితాలమ్మే అంకప్పమామ వద్ద ఒక అట్టపెట్టె సంపాదించి తెచ్చి తరగతిగదిలో ఒకమూల ఉంచి అంతా కాయితాలు చింపివేసిన వాటన్నింటినీ దాన్లో వేసి, బడయ్యాక, దూరంగా ఉన్న వీధి చెత్తకుండీలో పోసేవాడు.

“ఒరే కాయితాలు చింప కండిరా! తరగతిగది శుభ్రంగా ఉంచుకుందాంరా!” అంటే అంతా వాడిని ఎగతాళి చేసేవారు. ఐనా వాడు తనపని మానలేదు.

పెద్ద క్లాసులకొచ్చేకొద్దీ ఆనందప్పకు నోటు పుస్తకాలు ఎక్కువ కావాల్సి వస్తున్నది. అమ్మ వద్ద డబ్బులు ఉండవాయె! ఎలాగాని వాడు ఆలోచిస్తూ ఇంటిముందుకూర్చున్నాడు. తమ ఇంటిపక్కన పాత పుస్తకాలు కొని అమ్మే అంకప్పమామ కనిపించి “ఏంటబ్బయ్యా! అట్టాకూకున్నావ్ ?” అని అడిగాడు. తన సంచీలోని నోటు పుస్తకాలన్నీ క్రింద కుమ్మరించాడు అంకప్పమామ. వెంటనే ఆనందప్ప మొదడులో ఒక ఆలోచన మెరిసింది.

“మావా! ఈ పుస్తకాల్లో తెల్లకాయితాలన్నీ నేను తీసుకోనా?” అని అడిగి మామ సరేనన్నాక ఆ గుట్టలోని ఖాళీ కాయితాలన్నీ చింపుకుని చక్కగా సర్ది నోటుపుస్తకాలు సూదితో కుట్టుకుని, ఆ పుస్తకాల గుట్టలోంచే అట్టలు ఏరుకుని కుట్టుకున్న పుస్తకాలకు వేసుకుని, అందమైన చేతి వ్రాతతో తనపేరూ, తరగతీ, బడి పేరూ, ఆ నోట్సు ఏ సబ్జక్టుకో కూడా వ్రాసేసుకున్నాడు. ఒక గంటలో పది నోటు పుస్తకాలు తయారు చేసేసుకున్నాడు. అదంతా చూస్తున్న అంకప్పమామ వాడితెలివికి ఆశ్చర్యపడ్డాడు.

ఆ మరునాడు బళ్ళో ముందుగా అన్ని నోటు పుస్తకాలతో వెళ్ళీంది ఆనందప్పే. పంతులు ఆశ్చర్యంగా ఇన్ని పుస్తకాలెలా ఒక్కరోజులో కొనుక్కున్నావురా!ఆనందూ!” అని అడగ్గా, తాను చేసినపని చెప్పేశాడు.

పంతులుగారు వాడిని మెచ్చుకుని “పిల్లలూ!పొదుపరితనం చిన్నప్పటినుంచే నేర్చుకోవాలి. ఆనందులాగా తెలివిగా పాత నోటు బుక్కులలోని కాయితాలు వాడుకోవాలి. కాయితాలను వృథా చేయడం తప్పు. చెట్లగుజ్జుతో కాయితాలు తయారు చేస్తారు. మీరు కాయితాలను వృథా చేస్తే చెట్లను చంపినట్లే. చెట్లు లేకపోతే మనకు ప్రాణవాయువు ఎలా వస్తుందీ? భూమిమీద జీవులన్నీ బ్రతకను ప్రాణవాయువు, అంటే ఆక్సిజన్ కావాలి కదా! అందువల్ల కాయితాలను పొదుపుగా వృథా చేయకుండా వాడుకోడం నేర్చుకోండి. అందరూ ఆనందుకు క్లాప్స్ ఇవ్వండీ!” అంటూ పంతులు గారు మెచ్చుకోగానే ఆనందప్పకు చాలా సంతోషం కలిగింది.

అదర్రా పిల్లలూ! పొదుపుగా,తరగతి గదిని పరిశుభ్రంగా ఉంచుకోడమంటే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here