శ్రేయోభిలాషి బోల్తా పడ్డాడు!

0
10

[dropcap]బం[/dropcap]ద్ అంటే మొదటి దెబ్బ రవాణా సౌకర్యాలకు తగులుతుంది. ఎవ్వరికైతే స్వంత వాహనాలు ఉంటాయో వారు మాత్రం తమ పనులు చేసుకునేదానికి వెళ్ళగలరు. కాని, వాళ్ళని కూడ వెళ్ళనివ్వకుండా అడ్డుకొంటారు బంద్‌ని ప్రోత్సహించేవారు. పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని వచ్చి రోడ్లకు అడ్డంగా పెట్టేస్తారు. పైగా అక్కడ తాగేసి అరుపులు, నినాదాలు. ఏదో ఒకటో రెండో బస్సులు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా అందులోని ప్రయాణికులందరిని దించేసి టైర్లలో గాలి తీసేసి తగులబెట్టేస్తారు.

ప్రజల నిస్సహాయులయిపోతారు. ఎందుకంటే రాజకీయవేత్తలే పాలు పోసి పెంచిన తమ గుండాలని పురమాయిస్తారు ఈ అరాచకానికి, తమ లక్ష్య సాధనకు.

***

అలాంటి ఒక రోజు అన్ని ప్రయాణ సౌకర్యాలు ఆగిపోయాయి. సిటీ బస్సులను ఎక్కుడికక్కడే ఆపేసారు. కొన్ని మోటార్ సైకిళ్ళు, స్వంత కార్లు, మాత్రమే ఎలాగో వెళ్ళగలుగుతున్నాయి. చాల మంది ఆఫీసులకి, ఇళ్ళకి నడిచి వెడుతున్నారు. అందరి ముఖాలు మీద విషాదం, విసుగు, జుగుప్స పైగా ఏమీ చేయలేని అసహాయత.

సంజుక్తకి ఉస్మానియా యూనివర్సిటీలో యం.యస్.సి ఆఖరి పరీక్ష రోజు. ఆమె బస్సు కొరకు చాలా సేపు చూసింది. ఒక్క ఆటో కూడ అటువైపు రాలేదు. టెన్షన్ పెరగడంతో గోళ్ళు కొరుక్కుంటూ ఉండిపోయింది. ఈ పరీక్ష కనుక వ్రాయకపోతే, తనకు ఒక సంవత్సరం పాడవుతుంది. దానితో ఉద్యోగం రావడం కూడ ఆలస్యం అవుతుంది. ఇక తను ఎవరినైనా లిఫ్టు అడగాల్సిందే, అని తనలో నిరార్ధాణ చేసుకుంది.

అలా తన ఆలోచనలు పూర్తి కాగానే ఒక బైకు తనను దాటిపోయింది. అతన్ని ఆపుదామనే ఉద్దేశంతో గట్టిగా చప్పట్లు చరిచింది.

***

నేను ప్రభుత్వ అగ్రికల్చరల్ విభాగంలో డిప్యూటీ డైరక్టరుగా ఉద్యోగం చేస్తున్నాను. నేను వంద శాతం బ్రహ్మచారిని. అమ్మ నన్ను ఇక పెళ్ళి చేసుకోరా అని ప్రతి రోజూ బ్రతిమాలుకుంటూ ఉంది.

ఇక్కడ అత్యవసర మీటింగేదో పెట్టారు డైరక్టరు. అందుకని తొందరగా బైకు మీద వెడుతున్నాను.

నాకు ఎవరిదో చప్పట్లు వినబడడంతో అద్దంలో చూసా, వెనుక ఒక అమ్మయి ఆపమని చెయ్యూపుతోంది. నేనాపాను. ఆమె నా దగ్గరికి వచ్చింది. హెల్మెట్ తీసాను.

“చెప్పండి” అన్నానామెతో.

“క్షమించండి సార్. నేను యూనివర్సిటీలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని ఇరవై నిమిషాల్లో చేరుకోవాలి. లేకపోతే నా ఫ్యూచర్ దెబ్బతింటుంది. ఇదే అఖరి పరీక్ష. చాల సేపటి నుండి బస్సు కోసం ఎదురు చూసాను. కనీసం ఒక్క ఆటో అయినా ఇటు వైవు రాలేదు. నన్ను కాస్త ఏమనుకోకండా అక్కడ దించేస్తారా ప్లీజ్” అని గుక్క తిప్పుకోకుండా చెప్పింది.

ఆమె పసుపు పచ్చ చీర కట్టుకుని ఉంది. ఎర్ర బ్లౌజ్ వేసుకుంది. సన్నగా, నాజుగ్గా ఉంది. పొడుగాటి మెడలో సన్నటి ముత్యాల హారం. ఎర్ర గాజులు రెండు జేతులకి. ఎడమ మడికట్టు మీద బ్లాక్ డయల్ గోల్డ్ వాచీ. కొద్దిగా ఇరుక్కుగా ఉన్న నుదిట మీద ఎర్ర టికిలీ. చేతిలో పసుపు రంగు హ్యండ్ బ్యాగ్. మధ్య తగరతి కుటుంబానికి చెందినదిలా ఉంది. నా జవాబు కోరకు ఆత్రతతో చూస్తోంది, చక్రాల్లాంటి కళ్లు పెద్దవి చేసుకుని.

“అలాగే” అన్నాను ముక్తసరిగా. ఇదే నాకు మొట్టమొదటసారి ఒక అమ్మాయిని తన వెనుకల కూర్చోబెట్టుకోవడం. నా భుజం పట్టుకుంది గ్రిప్ కోసం. నేను హెల్మెట్ పెట్టుకుని పది నిమిషాల్లో పరీక్షా కేంద్రం చేరాను. అది నా దారి కాకున్నా ఆమెకు నా సహయం అవసరమని.

“చాలా థాంక్స్! మీ మేలు మర్చిపోలేను” అంది మెల్లగా దిగుతూ.

“ఫర్వాలేదు. మీరేమీ అనుకోకపోతే ఈ పార్కర్ పెన్ను తీసుకుని పరీక్ష వ్రాయండి. అది మీకు అదృష్టాన్ని తెస్తుంది” అన్నాను.

ఆమె తీసుకుని నవ్వి క్షణాల్లో ఎంట్రన్స్ కేసి నడిచి చేరి తర్వాత చెయ్యి ఊపింది.

నేను ఆఫీసుకెళ్ళి పోయాను. నా గదిలోకెళ్లి పేపర్లు తీసుకుని మీటింగ్‌కి వెళ్ళాను.

***

ఇంటి కొచ్చింతరవాత అమ్మ వేడి వేడి పొగల కక్కే కాఫీ ఇచ్చింది. “అమ్మా కాఫీ చాలా బాగుందే” అని వరండాలో కూర్చీలో చతికలపడి ‘భూమి మీద ఉన్న దేవతలను ప్రేమించండి’ – ‘LOVE THY ANGELS ON EARTH’ ఇంగ్లీషు నవల చదువుతూ కూర్చున్నాను. మధ్య మధ్యలో నేను సహాయం చేసిన అమ్మాయి ఊహల్లోకి వస్తోంది. కనీసం నేనామె పేరు అయినా అడిగి ఉండాల్సింది అని వాపోయాను. అయినా, ఆమె పరీక్షల హడావిలో వెళ్ళిపోయింది. మనిషిని చూసి పేరు ఊహించండం కూడ కష్టమే.

***

ఒక సంవత్సరం ఇట్టే గడిచిపోయింది. ఆమె నా కలల్లో తరచూగా వస్తోందెందుకనో? ఆమె పేరైనా తెలుసుకోలేదని. ఆమెను గురించి ఆలోచించడం మానేసాను.

ఒక ఆదివారం కొన్ని పుస్తకాలు రిఫర్ చెయ్యడానికి స్టేట్ సెంట్రల్ లైబ్రెరీకి వెళ్ళాను. అక్కడ ఓ చెట్టుక్రింద సిమెంట్ బెంచీ మీద కూర్చుని నోట్స్ వ్రాసుకుంటూన్నాను.

“సార్” అన్న ఒక తీయటి గొంతు వినబడింది.

నేను తిరిగి చూస్తే ఆ రోజు పరీక్షా కేంద్రంలో దించిన అమ్మాయే.

“ఎలా ఉన్నరండీ” అంది వినయంగా

బాగున్నాను అని ఒక చిరునవ్వు విసిరాను.

“సంజుక్త నా పేరు” అంది.

“జయరాం”

ఆమె చేతులో నాలుగు పుస్తకాలు ఉన్నాయి.

“జయరాంగారు, ఆ రోజు మీ సహాయం కనుక అందకపోయింటే నేను సమయానికి పరీక్ష కేంద్రం చేరుకునేదాన్ని కాదు, డిస్టింక్షన్‌లో పాసయ్యేదాన్ని కాదు, ఇవ్వాళ ప్రభుత్వ మహిళా కాళాశాలలో లెక్చరర్‌గా పనిచేసేదాన్ని కాదు” అంది చేతులు జోడించి.

ఆమె చేతులను సుతారంగా క్రిందకు దించి “అలా అనకండి సంజుక్త గారూ. మళ్ళీ కలుసుకున్నాంగా” అన్నాను.

“మరి మంచి కాఫీ త్రాగుదామా?” అంది.

“మీ ఇష్టం” అన్నాను.

నా పేపర్లన్నీ ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో కుక్కేసి నా బైకు దగ్గరికి వెళ్ళాను. సంజుక్త నా వెనుక కూర్చుంది, నా భుజాన్ని ఆసరాగా తీసుకుని.

“మీరెంత మంది ఉన్నారింట్లో?” సంజుక్త కాఫీ త్రాగుతూ అడిగింది.

“ముగ్గురం. నేను మా అమ్మా నాన్నలు.”

“మీరేం చేస్తుంటారు?”

“ప్రభుత్వ అగ్రికల్చరల్ విభాగంలో” అన్నాను నా అసలు పోస్టు చెప్పడం ఇష్టం లేక.

“నాకు తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. నా అన్ననే నన్ను పెంచాడు. నా వదినే నాకు అమ్మ” అంది.

“సారీ. మీకే అవసరం వచ్చినా నాకు ఫోను చెయ్యండి” అని నా సెల్ నంబరిచ్చాను.

“నన్ను నా అన్న స్వంత కూతురుగా చూసుకుంటున్నాడు. పేరు శశిధర్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం. స్వంత ఇల్లు. అతనే నేనేదో ఉద్యోగం చేసుకుంటానంటే పట్టు పట్టి నన్ను యం.యస్.సి. చదివించాడు. నాకు తల నొప్పిగా ఉందంటే ఇద్దరూ విలవిలాడిపోతారు.”

ఆమెకేదో గుర్తొచ్చి “నేనిక వెళ్ళాలి” అని సెలవు తీసుకుని అక్కడే ఉన్న ఆటోలో వెళ్ళిపోయింది.

***

ఆరు నేలలు గడిచి పోయాయి. ఓ ఆదివారం స్పెన్సర్ మాల్‌‌లో నాకు కావలిసిన కొన్ని అత్యవతర వస్తువులు కొనుగోలు చేస్తుంటే ఎవరో నా భుజాన్ని సున్నితంగా తట్టారు. తిరిగి చూద్దును కదా సంజుక్త నవ్వుతూ సెల్యూట్ చేసింది.

“హల్లో… సంజుక్త గారూ” అన్నాను విస్మయంతో.

ఇద్దరూ బిల్లులు కౌంటర్‌లో చెల్లించి బయటకి వచ్చాము.

“టీ త్రాగుదామా?” అంది – నేను చెప్పేంతలో

ఇద్దరం దగ్గరలో ఉన్న చిన్న హోటల్‌కి వెళ్ళాము.

“నా లెక్చర్స్ మూడు నెలల్లో ఒక కొలిక్కి వచ్చింది. నాకిప్పుడు యం.ఫిల్ చేయాలని కోరికగా ఉంది.”

“మీరు తప్పక చెయ్యాలి” అన్నాను ఆమె కోరికను బలపరుస్తూ.

ఇంతలో నా సెల్ మ్రోగింది. నా బాబాయి మిగతా వాళ్ళు ఇంట్లో వేచి ఉన్నారని వేగిరం రమ్మని అమ్మ సందేశం.

“ఇంట్లో బంధువు లొచ్చారట. నేనిక బయలుదేరనా?”

“వెళ్ళండి. మరోసారి కలిసి మాట్లాడుకోవచ్చు” అంది.

 ***

కాల గమనంలో మరో ఆరు నెలలు కొట్టుకు పోయాయి. సంజుక్త నుండి ఫోనేమీ రాలేదు. ఆమె ఎక్కడా కలవనూ లేదు.

నేను ఆఫీసు టూర్ నుండి ఆదివారం ప్రొద్దుట వచ్చాను. టిఫిన్ అవీ అయ్యింతర్వాత అమ్మ నా దగ్గరకు వచ్చి, “మనం ఇవ్వాళ నీకు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలిరా” అంది. “మీ బాబాయి జాతకాలు కూడ శాస్త్రిగారికి చూపించారు. చాలా గణాలు కలిసి వచ్చాయట. అమ్మయి ఫోటో లేదనుకో. మనం నేరుగా వెళ్ళి, చూసేద్దాం” అంది ఆతృతతో.

“ఫోటో ఉంటే ఒక ఐడియా ఉండేది. చూసి తర్వాత బాగా లేదంటే ఆమెకి బాధ కలిగించిన వాళ్ళమవుతాము” అలా అని తప్పించుకోవాలనుకున్నాను. ఎందుకంటే నా హృదయంలో ఇప్పుడు సంజుక్త పూర్తిగా చోటు చేసుకుంది కదా.

అమ్మకు కోపం వచ్చేసి ఏదో అనబోయేంతలో నేనే అన్నాను, “సరేలేవే వెడదాం”. ఆమెను కించపర్చడం నాకు సుతరామూ ఇష్టంలేదు.

నేనెళ్ళి నా గదిలో టేబిల్ మీద ఉత్తరాలు ఒకటొకటి చూడ్డం మొదలెట్టాను. అందులో నాకొక నీలం రంగు కవరు ఆకర్షించింది. అందులో ఉన్న ఉత్తరం తీసి చదివాను. అందులో ఇలా వ్రాసి ఉంది.

“నేను మీకు అపరిచితుడను. కాని, నేనొక ముఖ్య సూచన ఇవ్వదలిచాను. మీరు ఆదివారం ఒక అమ్మాయి ఇంటికి పెళ్ళిచూపులకు వెడుతున్నారు. ఆమె అందంగా ఉంటుంది. బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం. ఎటొచ్చి ఆమె ప్రవర్తనే బాగులేదు. ఎవరితోనో తిరుగుతూ ఉంది. ఇంకొక మంచి సంబంధం చూసుకోనడం మంచిది. ఇట్లు మీ శ్రేయోభిలాషి.”

అమ్మ నాన్నలకు ఆ ఆకాశరామన్న ఉత్తరం సాంతం చదివి వినిపించాను.

అమ్మ బాగా కంగారు పడిపోయి “ఈ సంబంధం మనకు ఒద్దు. వెళడం మానేద్దాం” అంది.

“అమ్మా మనకేం తెలియకుండా ఆ అమ్మాయి మీద అభాండాలు వేసిన ఎవరో అనామకుడు వ్రాసిన ఉత్తరం చదివి భయపడి వెళ్ళడం మానకూడదు. అతనో, ఆమో వ్రాసిన ఉత్తరంలో నిజం ఉండకపోవచ్చు. అలా వ్రాయడం కేవలం ఈర్ష్య మూలాన కూడా ఉండొచ్చు. అంతగా కావాలంటే మన నిర్ణయం రెండు రోజుల్లో చెబుతామని వాకబు చెయ్యొచ్చు” అన్నాను.

నాన్నగారు కూడా నాకు వత్తాసు పలికారు.

వాళ్ళ ఇంటికెళ్ళాము. ఇల్లు ఎంతో చక్కగా పెట్టుకున్నారు. పిల్ల అన్న, ఆమె నాన్నలా వ్యవహరించి మర్యాదలు గట్రా చేసాడు.

అమ్మాయి వచ్చి తలొంచుకుని కూర్చుంది మా ఎదుట బుద్దిగా. చూస్తే ఆమెకు ఇష్టం లేదనిపించింది నాకు.

“నీ పేరేమిటమ్మా?” అని అడిగింది అమ్మ.

“సంజుక్త” అంది అతి తక్కువ స్వరంతో, తలపైకి ఎత్తుకుండానే.

“ఉద్యోగం చేస్తున్నావా?”

“అవునండి. ప్రభుత్వ మహిళా కళాశాలలో లెక్చరర్‌గా” అంది అది కూడా తల పైకి ఎత్తకుండానే.

“నీకనిపిస్తే కొన్ని ప్రశ్నలు వేసి చూడు అమ్మాయిని” అంది అమ్మ నా వేపుకి తిరిగి.

నేను సోఫా నుండి లేచి “మనం పెళ్ళి మే లో చేసుకుందామా, లేక డిసెంబర్‌లోనా సంజుక్తా” అన్నాను.

సంజుక్త వెంటనే నా గొంతు గుర్తు పట్టి తన గదిలోకి తుర్రుమంది. సంజుక్త వెనకనే ఆమె వదిన వెళ్ళింది.

“సంజుక్తా, అతను అన్న మాటలకి బాధపడి ఏడుస్తున్నావా? అతనికి నువ్వు బాగా నచ్చినట్టున్నావు. నువ్వెక్కడ జారిపోతావోనని, ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం అని అతృతతో అడిగాడు” అంది.

“లేదు వదినా ఇవి ఆనందబాష్పాలు. ఆయన ఎవరో కాదు నేను చెప్పాగా నీకు, బంద్ రోజు ఎవరో తన బైక్ మీద పరీక్షా కేంద్రం దగ్గర దిగబెట్టి, పెన్ను కూడ ఇచ్చారని. ఆయనే ఈయన. ఇవ్వాళ ఆయన చలువతోనే ఉద్యోగం చేసుకుంటున్నాను. నాకు తెలియకుండా ఆయన్ను ప్రేమించాను” అంది సంజక్త సంతోషం ఉరకలు వెయ్యగా.

అమ్మ నా వైపు చూసింది ఆశ్చర్యంగా.,. ఎప్పుడూ క్రమశిక్షణతో ఉంటున్న నేను అలా అడిగేసినందుకు.

ఇంతలో సంజుక్త ఆమె వదిన వచ్చారు.

“నేను మిమ్మల్ని మేలో పెళ్ళి చేసుకోవచ్చా?” అంది నా కళ్ళలో చూస్తూ. తలూపాను.

సంజుక్త ముందు ఆమె వదిన, అన్నాలకు నమస్కారం చేసి, అమ్మా నాన్నలకు పాదాభివందనం చేసింది.

“నాకన్నా అదృష్టవంతురాలు లేదు” అని నన్ను హత్తుకుంది ప్రేమ పెల్లుబికి వచ్చినందుకు.

“నేను చెప్పడానికి నా దగ్గర పదాలు లేవు” అని ఆమె నుండి విడిపోయాను.

నాన్న అమ్మలు, సంజుక్త అన్నావదినలు ఇంత తొందరగా వాళ్ళ కోరిక తీరినందుకు సంతోషంతో తబ్బిబ్బయిపోయారు.

తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నాకు సంజుక్తకు మధ్య జరిగినదంతా వివరించాను అమ్మానాన్నలకు.

ఆ శ్రేయోభిలాషి ఉత్తరం మా మీద ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. అది కేవలం ఒక ఒక ఫాల్స్ అలారం మాత్రమే అని నవ్వుకున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here