శ్రీవర తృతీయ రాజతరంగిణి-12

4
7

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

జ్యేష్ఠమాదం ఖానం చ హాజ్యఖానం చ మధ్యమమ్।
బ్రహ్రమ్‍ఖాన మనుజం సుతాన్ సాజే జానునృపః॥
(శ్రీవర రాజతరంగిణి, 56)

జైనులాబిదీన్‍కు ముగ్గురు కొడుకులు. పెద్దవాడు ఆదమ్ ఖాన్. రెండవవాడు హాజీ ఖాన్. మూడవ వాడు బహ్రామ్ ఖాన్.

జైనులాబిదీన్ పుత్రులు ముగ్గురిలో ఆదమ్ ఖాన్ ఎంత ప్రయత్నించినా కశ్మీరు సింహాసనాన్ని అధిష్ఠించలేకపోయాడు. జైనులాబిదీన్ ఇతడిని యువరాజుగా ప్రకటించాడు కానీ, అతనంటే అయిష్టం ఏర్పడింది. హాజీ ఖాన్ సుల్తాన్ అయ్యాడు కానీ ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరు వదలి పారిపోవల్సి వచ్చింది. ఆదమ్ ఖాన్ సుల్తాన్ కాలేదు కానీ అతని కొడుకు ఫతహ్ షాహ మూడు విభిన్న సందర్భాలలో కశ్మీరు సుల్తాన్ అయ్యాడు. ఈ వివరాలు స్పష్టం చేస్తాయి, జైనులాబిదీన్ యాభయి ఏళ్ళ సుస్థిరమైన పాలన తరువాత కశ్మీరు ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో! యాభయి ఏళ్ల పాటు సుల్తాన్ సుస్థిర పాలనను అనుభవించిన వారికి,  ఆ తరువాత అల్లకల్లోలమై, అధికార పోరుల వల్ల అనిశ్చిత పరిస్థితికి ఆలవాలమైన కశ్మీరును అనుభవిస్తుంటే, జైనులాబిదీన్ గొప్పదనం మరింత స్పష్టమవుతుంది. అందుకే శ్రీవరుడు, జైనులాబిదీన్ గొప్పతనాన్ని భావి తరాలకు అందించేందుకు రాజతరంగిణి రచనను కొనసాగించాడు, జోనరాజు తరువాత!

జ్యేష్ఠా లావణ్య సౌభాగ్య సుభ గౌః ప్రాకృతైర్గుణైః।
జననం రాజ్ఞాయామాస చంద్రమా ఇవ వారిధిమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 57)

చంద్రుడు సముద్రానికి ఎలా సంతోషం కలగిస్తాడో, అలా ఆదమ్ ఖాన్ తన అందం వల్ల, ప్రాకృతికమైన రూపం వల్ల సుల్తాన్‍కు ఆనందం కలిగించాడు.

ప్రత్యహం హాజ్యఖానః స కర్పూర ఇవ సౌరభై।
బాల లీలాయతైస్థైస్తై స్వ ముదాన్తమజిశ్వపత్॥
(శ్రీవర రాజతరంగిణి, 58)

కర్పూరం సుగంధాన్ని ప్రకటితం చేసినట్టు, ప్రతి రోజూ బాలక్రీడలతో, ఉదాత్త గుణాలను ప్రదర్శించేవాడు హాజీ ఖాన్.

తౌ సుతౌ సమ్మతౌ పిత్రో రక్షణాయాక్షి పన్నృపః।
స్వాధాత్రే యతయా స్వస్థో ద్యాయోష్ఠక్కురపక్షయోః॥
(శ్రీవర రాజతరంగిణి, 59)

పిల్లలిద్దరూ తల్లిదండ్రులకు అత్యంత ప్రియమైన వారు. అందుకని రాజు, వారిద్దరికి ఇద్దరు ఠక్కురాల సంరక్షణలో ఉంచాడు.

స్వపక్ష స్థాపనా దక్షాః పర పక్షేష్ట ఖండనాః।
తార్కివా ఇవ తేన్యోన్యం ధాత్రే యాష్ఠక్కురా బభుః॥
(శ్రీవర రాజతరంగిణి, 60)

ఇద్దరు రాజకుమారుల సంరక్షణ బాధ్యత స్వీకరించిన ఠక్కురాలిద్దరూ స్వార్థపరులు. తమ స్వార్థం కోసం వారు ఒకరినొకరు ఖండిస్తూ దెబ్బ తీయాలని ప్రయత్నించేవారు.

సుల్తానుల పాలనలో ఇది సర్వసాధారణం. సుల్తానుకు ఎంతమంది సంతానం ఉంటే, అంతమంది సలహాదార్లు. తమ స్వలాభం కోరి, ఆ సంతానాన్ని సింహాసనం కోసం పోటీ పడేందుకు ప్రోత్సహించేవారు. తమ సంరక్షణలో ఉన్న వాడికి సింహాసనం చిక్కితే, అతడి పేరు మీద తాము రాజ్యం చేయవచ్చు, లాభం పొందవచ్చనని ఉవ్విళ్ళూరేవారు. అందుకని వారు సోదరుల నడుమ చిచ్చుపెట్టేవారు. ఒకరికొకరిని వ్యతిరేకం చేసి వారి నడుమ సింహాసనం కోసం పోరు నడిపించేవారు. శ్రీవరుడు ఈ విషయమే ప్రస్తావిస్తున్నాడు.

ఇది భారతీయ సమాజానికి కొత్త విషయం. భారతీయ సమాజంలో అధికారం కోసం పోటీ లేదు. పెద్ద కొడుకు రాజవుతాడు. అంతే. మిగతావారు అతడికి అండగా నిలబడతారు. పంచపాండవులు అయిదుగురు శక్తిమంతులు, కానీ, ధర్మరాజు రాజు అవటం పట్ల ఎవ్వరూ అభ్యంతరాలు వ్యక్తపరిచినట్టు కనబడదు. పైగా, ధర్మరాజు తీసుకున్న నిర్ణయాలు, ఎంతగా తమకు అప్రియమైనవైనా మిగతా వారంతా శిరస్సులు వంచి స్వీకరించారు. ఇది భారతీయ జీవన విధానం.

రాజ్యం ‘నాది అంటే నాది’ అనుకోవటం భారతీయులకు అలవాటు లేదు. ‘రాజ్యం నీది’ అంటే, ‘కాదు నీది’ అనటం అలవాటు. అలాంటిది సుల్తానుల పాలన వచ్చిన తరువాత రాజ్యం కోసం పోరాడటం, అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకుని మరీ సింహాసనం కోసం పోరాడటం కొత్తల్లో ఆశ్చర్యం కలిగించినా, తరువాత అలవాటవటమే కాదు ఆనవాయితీ అయింది కూడా.

అధికారం కోసం ఆశ పడటం ఒకప్పడు కూడని పని. ఎందుకంటే, అధికారం ఒక బాధ్యత. అధికారం అంటే ధర్మ నిర్వహణ బాధ్యత. కానీ ఇప్పుడు అధికారం అంటే ఐశ్వర్య సంపాదనకు రహదారి. అధికారం అంటే అహంకారాన్ని సంతృప్తి పరచుకునేందుకు అడ్డదారి.  భారతీయ సమాజంలో వచ్చిన ఈ మార్పును జాగ్రత్తగా అధ్యయనం చేయల్సి ఉంటుంది.

శ్రీవరుడి కాలం నాటికి అధికారం కోసం పోరు కొద్ది కొద్దిగా అలవాటు అవుతోంది. అయినా సరే అన్నదమ్ములు అధికారం కోసం పోటీ పడటం, ఒకరిని ఒకరు చంపుకోవటానికే కాదు, వారు తండ్రితో సైతం పోరుకు ముందుకు ఉరకటం శ్రీవరుడు ఆశ్చర్యంతో, కాస్త అసహ్యంతో, మరికొంత నిర్లిప్తతతో ప్రదర్శించటం రాజతరంగిణిలో కనిపిస్తుంది.

సౌందర్య స్నేహ వృక్షస్య మూలచ్ఛేదన కారిణః।
తేన్యోన గోత్రజద్వేపాత్ తయోరాసన్ సమత్సరాః॥
(శ్రీవర రాజతరంగిణి, 61)

సహోదరుల నడుమ ఉండాల్సిన స్నేహవృక్షాన్ని మూలంతో సహా ఖండించారు. తాము సగోత్రీకులమన్న భావన విడిచి అసూయను ప్రదర్శించారు. రాజకుమారుల పట్ల అసూయాగ్రస్థులయ్యారు.

శ్రీవరుడు విషయాన్ని ఎంతో లోతుగా ప్రదర్శించాడు. రాకుమారులు సొదరులు. వారి సంరక్షకులయిన ఠక్కురాలు కూడా సోదరులే. నిజానికి రాకుమారులైనా, వారి సంరక్షకులైనా, సోదర మైత్రి నెరపుతూ అన్యోన్యంగా ఉండవచ్చు.

కానీ, ఠక్కురాల నడుమ ఉన్న అసూయా ద్వేషాలు, స్వార్థాలు వారి నుండి రాకుమారులకు సంక్రమించాయి. తమ నడుమ ఉన్న వైరాన్ని వారు రాజకుమారుల నడుమ వైరంగా పెంపొందించారు.

సాధారంగా సోదరుల నడుమ అంతర్గతంగా పోటీ ఉంటుంది. అసూయ ఉంటుంది. ఈ అసూయను, పోటీని అణచివేయాలని భారతీయ పురాణాలు, ధర్మశాస్త్రాలు ప్రయత్నించాయి. దీన్ని అణచకపోతే, అది వారి నడుమనే కాదు వారి ద్వారా సమాజంలోని ఇతరుల నడుమ కూడా వైరం సృష్టిస్తుంది.

అన్నదమ్ముల పుత్రులయినా కౌరవులు, పాండవుల నడుమ వైరం ‘కురుక్షేత్రాని’కి కారణమయింది. కాబట్టి ఇలాంటి వినాశనకరమైన ఆలోచనలను అణచి పెట్టాలని భారతీయ ధర్మం ప్రయత్నించింది. ఉత్తమ ప్రవర్తనను ఆదర్శంగా సమాజం నిలిపింది. గమనిస్తే, దుర్యోధనుడు   ఎంతగా దౌష్ట్యం ప్రదర్శించినా, కౌరవులు  ఏ సందర్భంలో కూడా దుర్యోధనుడిని దూషించలేదు. అంతా నాశనమవుతుందని తెలిసినా, ఎదురుతిరగలేదు.

విభీషణుడు కూడా అన్నతో విభేదించి రాజ్యం వదలి వెళ్ళాడు తప్ప, తన సమర్థకులను సమీకరించి అన్నకు వ్యతిరేకంగా పోరాడలేదు. ఇతర సోదరులు ఆ మాత్రం వ్యతిరేకత కూడా ప్రదర్శించలేదు. స్వచ్ఛందంగా యుద్ధంలో దూకి ప్రాణత్యాగం చేశారు. కానీ ఈ ఆదర్శాలు, ఉత్తమ బోధనలు తరువాత కాలంలో  ఇందుకు విభిన్నమైన పరిస్థితులను అనుభవించాల్సి రావటంతొ మంచిమాటలు  కేవలం బోధనలుగా మిగలటంతో భారతీయ సమాజం రూపాంతరం చెందింది. ఫలితాలు మనం అనుభవిస్తూ ఉన్నాం.

రాజాపుత్రాస్త్రయస్తస్య గుణాతిశయ సుందరాః।
తత్కృతాన్యోన్య వైరేణ సమం వృద్ధిం సమాయయుః॥
(శ్రీవర రాజతరంగిణి, 62)

సుందరమైన గుణాలు కల రాజపుత్రులు, ఠక్కురాలు తమ నడుమ సృష్టించిన వైరంతో పెరిగి పెద్దయ్యారు. వారితో పాటు వారి నడుమ వైరం కూడా వృద్ధి పొందింది.

సుల్తానులను గమనిస్తే వారందరి ప్రవర్తన దాదాపుగా ఒకటేగా అనిపిస్తుంది. వారి సంతానం నడుమ రాజ్యం కోసం పోటీని గమనిస్తారు. కొడుకులకు పిలిచి వారికి బుద్ధి చెప్పటమో, బెదిరించి వారిని సరైన దారిలో పెట్టడమో చేయరు. సంతానం నడుమ వైషమ్యాలు కనబడగానే వారిని దూరప్రాంతాలపై అధికారం ఇచ్చి అక్కడికి పంపిస్తారు. తండ్రి దృష్టికి దూరంగా వెళ్లిన వారు తండ్రి పట్ల ద్వేషం పెంచుకుంటారు. చుట్టూ చేరిన స్వార్థపరులు అగ్నికి ఆజ్యం పోస్తారు. సైన్యం కూడగట్టుకుని రాజ్యంపై అధికారం కోసం తండ్రితో పోరాడతారు. సోదరుడని కూడా చూడకుండా క్రూరంగా హింసించి చంపేస్తారు. సుల్తానుల చరిత్ర అంతా సోదరుల రక్తసిక్తమే!

‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అంటాడు శ్రీశ్రీ.

ఇది ఇతర దేశాల చరిత్రకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. భారతదేశ చరిత్రకు అంతగా సరిపోదు. కల్హణ రాజతరంగిణి, జోనరాజు, శ్రీవర రాజతరంగిణిలు చదువుతుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. భారతీయ సమాజం ఇతరుల ప్రభావంతో రూపాంతరం చెందడమూ తెలుస్తుంది.

దేహసమో దేశాయం తస్యాత్మసమో మహీపాలః।
తస్మిన్ సుఖిని ససుఖా దుఃఖిని తస్మిన్ స దుఃఖా సౌ॥
(శ్రీవర రాజతరంగిణి, 63)

దేశం శరీర సమానం. రాజు ఆత్మ లాంటి వాడు. రాజు సంతోషంగా ఉంటే దేశమంతా సంతోషంగా ఉంటుంది. రాజు దుఃఖిస్తే దేశం దుఃఖిస్తుంది. అతి చక్కటి శ్లోక్లం ఇది.

తన చుట్టూ జరుగుతున్న అప్రియమైన సంఘటనల పట్ల శ్రీవరుడి స్పందన ఇది.

దేశం శరీరం – రాజు ఆత్మ.

శరీరానికి ఉన్న రోగాలు ఆత్మను బాధించవు.

ప్రజలు తమ సమస్యలతో రాజు దగ్గరకు వస్తే, రాజు వాటిని పరిష్కరిస్తాడు. ప్రజలను సంతోషింపచేస్తాడు. కానీ ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, ప్రజలలో ఎవరెవరి సమస్యలు వారికి ప్రత్యేకం. ఆ సమస్యల వల్ల వాళ్ళు వ్యక్తిగతంగా బాధపడతారు. ప్రజల వ్యక్తిగత సమస్యలు రాజ్యంపై అంతగా ప్రభావం చూపించవు. కానీ రాజు వ్యక్తిగత సమస్యలు కూడా ప్రజలపై, రాజ్యంపై ప్రభావం చూపించగలవి. అందుకే, రాజు సమస్య ప్రజల సమస్య, దేశ సమస్య. శరీర సమస్యలు ఆత్మకు అంటవు. కానీ ఆత్మ లేకపోతే శరీరం కట్టె మాత్రమే!

ఈ శ్లోకం ద్వారా శ్రీవరుడు రాజు, రాజ్యం అన్న విషయాల పట్ల భారతీయల దృష్టిని ఎత్తి చూపిస్తున్నాడు. భారతీయ వ్యవస్థలో ప్రజల బాగోగులు చూడటం రాజు బాధ్యత. ఆ రాజుకు సమస్యలు రాకుండా చూడటం ప్రజల బాధ్యత. అందుకే ఆ కాలంలో రాజులు శత్రుదేశాల విషయంలో తప్ప, ఇతర ఏ విషయం పట్ల ఆందోళన చెందేవారు కాదు. సంగీతం, సాహిత్యం, ధార్మిక విషయాలతో కాలం గడిపేవారు. ఇదంతా మధ్యయుగంలో మారిపోయింది.

రాజ్యం కోసం ఏకగర్భ జనితులు పోటీ పడటం, కుట్రలు కుతంత్రాలు చేయటం, తండ్రిని ఎదిరించటం, తండ్రిపై విప్లవం లేవదీయటం వంటి అసంభవం అనుకున్న విషయాలు భారతదేశపు నేలపై సంభవం అవుతున్నాయి. దీనిపై శ్రీవరుడి వ్యాఖ్య ఈ శ్లోకం.

అన్యోన్యం సరూషో రాజపుత్రయోర్మన్త్రి దుర్నయాత్।
అభూజ్జ్యేష్ఠ కనిష్ఠత్వం ప్రక్రియా రహితం తయో॥
(శ్రీవర రాజతరంగిణి, 64)

తమ సలహాదార్ల దుష్ట పద్ధతుల వల్ల రాకుమారుల నడుమ వైషమ్యాలు తీవ్రమయ్యాయి. వారు తమ నిర్దిష్ట కర్తవ్యాలను నిర్వహించటం మానేశారు.

సుల్తాను దుఃఖానికి కారణం చెప్తున్నాడు శ్రీవరుడు. ఆ దుఃఖం ప్రభావం కశ్మీరు ప్రజలపై పడుతుంది. సోదరులు రాజ్యం కోసం యుద్ధం చేస్తే అధికంగా నష్టపోయేది ప్రజలే. వారు జైనులాబిదీన్‌తో యుద్ధం చేసినా నష్టం ప్రజలకే. ఏ పక్షం గెలిచినా వ్యతిరేక పక్షాలకు చెందినవారిపై, వారి సమర్థకులపై అత్యాచారాలు చేస్తే కూడా నష్టపోయేది సామాన్య ప్రజలే. అందుకే రాజు దుఃఖం ప్రజల దుఃఖం అన్నాడు శ్రీవరుడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here