శ్రీవర తృతీయ రాజతరంగిణి-21

0
14

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

రాజపుత్ర మహాబాహో దాక్షిణ్యామృత సాగర।
శృణు పిత్రా సమాదిష్టం యత్ తత్సర్వం బ్రవీమి తే॥
(శ్రీవర రాజతరంగిణి, 117)

ఓ రాజపుత్రా! ఓ మహా శక్తిశాలీ! ఓ దయామృత సాగరా! మీ తండ్రి నీకు చెప్పమని నాతో చెపిన విషయం చెప్తా విను.

కోపంతో తనని చుట్టుముట్టిన వారిని చూసి బెదరలేదు సందేశం మోసుకు వచ్చిన విప్రుడు. అందరి ఎదుట రాజపుత్రుడికి తాను వినిపించాల్సిన సందేశాన్ని వినిపిస్తున్నాడు. అయితే, ఈయన కేవలం రాజు మాటలను అప్పచెప్పేవాడే తప్పించి స్వయంగా అభిప్రాయాలను చెప్పేవాడు కాదు. అందుకని ముందే స్పష్టంగా చెప్తున్నాడు – ‘రాజు ఏం చెప్పమన్నాడో అదే చెప్తున్నాను’ అని. అంటే, ఎవడు రాజు సందేశాన్ని అతడి అభిప్రాయంగా పరిగణించి అతడిని దూషిస్తారో, హింస జరుపుతారో అనే భయం ఉండటం వల్ల – నేను సందేశాన్ని అందించేవాడినే. ఆ సందేశంలో ఉన్న విషయాలతో నాకు సంబంధం లేదు అని ముందే disclaimer ఇస్తున్నాడన్న మాట.

ఫలం సంసార వృక్షస్య లాభోమృత పరత్ర చ।
పిత్రోర్నేత్రోత్సవో నిత్యం పుత్రః కైనార్మ్ నిన్ద్యతే॥
(శ్రీవర రాజతరంగిణి, 118)

సంసార వృక్ష ఫలం లాంటివాడు, ఇహపర లోకాలలో లాభం కలిగించేవాడు, తల్లి తండ్రులకు నిత్యం ఆనందకారి అయిన పుత్రుడిని దూరం చేసుకోవాలని ఏ తండ్రి అయినా అనుకుంటాడా?

ఈ మాటలు జైనులాబిదీన్ మానసిక వేదనను స్పష్టం చేస్తాయి. సంసార వృక్ష ఫలం సంతానం అనటం ఎంతో చక్కగా ఉంది. భారతీయ ధర్మంలో అన్ని ధర్మాలలోకీ సంసార ధర్మం అత్యుత్తమమైనది. ప్రపంచం నడిచేందుకు దోహదం చేస్తుంది. గమనిస్తే, ఈ సృష్టిలోనే ఓ గమ్మత్తయిన పద్ధతి కనిపిస్తుంది. విజ్ఞాన శాస్త్రవేత్తలు వంద శాతం efficiency కల self-perpetuating mechanism ను సృజించాలని తపన పడుతూన్నప్పటికీ 100 శాతం efficiency అంటే ఎలాంటి పొరపాట్లు చేయకుండా, అనవసరంగా శక్తిని వ్యర్థం చేయకుండా, సమయాన్ని వ్యర్థం చేయకుండా అనంత కాలం పని చేయగల లక్షణం, అలాంటి లక్షణం కల యంత్రాన్ని సృజించలేకపోతున్నారు.  ఈ లక్షణం  సృష్టిలో పునరుత్పత్తి లక్షణంలో కనిపిస్తుంది. వృక్షం నుండి ఉద్భవించే ఫలంతో వృక్షాన్ని తయారు చేయగల బీజాలుంటాయి. మనిషిలోనూ అంతే. సృష్టిలో సర్వం ఇంతే. నీరు ఆవిరైతే వర్షం వస్తుంది. వర్షం వల్ల నీరు భూమిలో చేరుతుంది. ఆపై వర్షం కురుస్తుంది.. ఇలాంటి ఒక తనని తాను అనంతకాలం సృజించుకుంటూ పని చేసే  పద్ధతి సృష్టిలో అణువణువునా కనిపిస్తుంది.  తమ పేరును శాశ్వతంగా ప్రపంచంలో నిలిపేది సంతానం. ఇహలోక  పరలోక ప్రస్తావన సుల్తాన్‌కు భారతీయ ధర్మంపై ఉన్న అవగాహన, విశ్వాసాలను సూచిస్తుంది.

ఇస్లాంలో తండ్రి కొడుకుల సంబంధం గురించి పవిత్ర ఖురాన్ లోనూ, ఇతర వ్యాఖ్యల్లోనూ సృష్టంగా వివరించటం కనిపిస్తుంది. ముఖ్యంగా, ఇస్లాం ప్రపంచం ప్రామాణికంగా భావించే ‘అల్- బుఖారీ హదిత్’లో ఉన్న సంఘటన తండ్రి కొడుకుల సంబంధాన్ని విస్పష్టంగా చూపిస్తుంది. ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి ‘జిహాద్’ కోసం అనుమతిని అడిగాడట. “నీ తల్లిదండ్రులు జీవించి ఉన్నారా?” అని ప్రవక్త అ వ్యక్తిని ప్రశ్నించారు. “ఉన్నారు” అన్న సమాధానం వచ్చింది. “అయితే వారి సేవలో నీ జీవితం గడుపు” అన్నారట ప్రవక్త. ‘జిహాద్’ కన్నా ప్రధానం తల్లిదండ్రుల సేవ.

సున్ని ఇస్లాంలో అత్యంత ప్రాధాన్యం వహించే  ‘అల్ తిర్మిధి హాదిత్‍’లో “స్వర్గానికి ద్వారం వంటివాడు తండ్రి. ఈ ద్వారాన్ని అంటిపెట్టుకుని ఉండు, లేకపోతే స్వర్గాన్ని వదలుకో” అన్న ఆజ్ఞ కనిపిస్తుంది.

వీటిని బట్టి చూస్తే, ‘ఇహలోకం లోను, పరలోకం లోను ఆనందం కలిగించే వాడు సంతానం’ అని సుల్తాన్ అనటం అటు ఇస్లాం సూత్రాలను, భారతీయ ధర్మపుటాలోచనాను ప్రతిబింబిస్తుందనుకోవచ్చు. అంటే, మతం ఏదయినా,  సంస్కృతి సంప్రదాయాలు ఏవైనా, జీవన విధానం ఏదయినా తండ్రి, కొడుకుల అనుబంధం విషయంలో సార్వజనీనత ఉంటుంది.

సర్వః సంచినుతే సర్వం పుత్రార్థం ప్రయతో యతః।
వార్ధకే వచనగ్రాహీ భవేత్ పితృ సుఖప్రదః॥
(శ్రీవర రాజతరంగిణి, 119)

ప్రతి తండ్రి తన సంతానానికి ఆస్తిని సంపాదించి అందించాలని తపన పడతాడు. వృద్ధాప్యంలో తండ్రి జీవితాన్ని సుఖప్రదం చేసేది సంతానమే.

జైనులాబిదీన్ తన కొడుకుకు పంపిన సందేశంలో ఆవేశం, బెదిరింపులు లేవు. ఒక సుల్తాన్ తనపై తిరుగుబాటు చేసిన వాడికి పంపిన సందేశంలా లేదు. ఈ సందేశంలో సుల్తాన్ కన్నా తండ్రే అధికంగా కనిపిస్తున్నాడు. తనపై కత్తి దూసిన కొడుకును జాలిగా, అభ్యర్థిస్తున్న సగటు తండ్రి కనిపిస్తున్నాడు. అత్యంత కరుణారసాత్మకమైన అభ్యర్థనాత్మక సందేశం ఇది.

తండ్రి సంతానానికి ఆస్తిని సంపాదించి ఇవ్వాలని తపన పడటం ఆ కాలంలో కన్నా ఈ కాలంలో మరింత ఎక్కువగా బోధ పడుతుంది. ప్రతి ఒక్కరూ తమ సంతానం జీవితం సుఖప్రదం చేయాలని తపన పడటం, ఏదో రూపంలో ఆస్తులు సంపాదించాలని ఆత్రపడటం మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా వృద్ధాప్యంలో తమ జీవితం సుఖప్రదం చేస్తాడన్న ఆశతో మాత్రం కాదు. ఆధునిక సమాజంలో తండ్రి కొడుకులను వేరు చేస్తూ మహా సముద్రాలున్నాయి. కానీ తన వార్ధక్యంలో తమకు తోడుగా సంతానం ఉండాలన్న ఆకాంక్ష మాత్రం ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది.

ఇత్థం లోకద్వయస్థిత్యాం త్వయి జాతే సుతే మమ।
దూరే సర్వసుఖాశాస్తు చిన్తా ప్రత్యుత్ వర్ధితా॥
(శ్రీవర రాజతరంగిణి, 120)

నువ్వు నాకు సంతానంగా పుట్టావు. నా ఇహపరలోకాలలో సుఖ శాంతులు ఇవ్వాల్సి వాడివి నువ్వే. కానీ నీ ఈ ప్రవర్తనతో నాకు సుఖశాంతులు లేకుండా పోయాయి. బాధ వేదనలు అధికమయ్యాయి.

‘లోకద్వయి’ అన్నాడు శ్రీవరుడు. దాంలో ఇస్లాం, భారతీయ ధర్మాల ఆలోచనలను సూచించినట్టయింది. ఇస్లాంలో స్వర్గాన్ని జన్నత్ (paradise) అంటారు. నరకాన్ని ‘జహన్నుమ్’ అంటారు.

ఇహ పర లోకాలలో సుఖసంతోషాలను ఇవ్వవలసిన సంతానం కత్తి పట్టి రాజ్యం కోసం పోరాడడానికి సిద్దంగా ఉంటే సుఖశాంతులేం ఉంటాయి? తన సంతానం అధికారం కోసం ఒకరినొకరు చంపుకోటానికి  సిద్ధంగా ఉంటే, తండ్రికి సుఖశాంతులేం వుంటాయి?

సుల్తాన్‌లా కాదు, తండ్రిగా జైనులాబిదీన్ కొడుకుకి పంపిన సందేశం ఇది.

త్వత్కృతో దుర్జనాశ్వాసో నిశ్వాసో య ఇవాన్వహమ్।
మలినీ కురుతే శుద్ధం మద్రాజ్య ముకురోపమమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 121)

నువ్వు దుష్టులకు ఆశ్రయం ఇస్తున్నావు. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో నా పాలనా కాలం అనే దర్పణం మలినమవుతోంది.

చక్కటి పోలిక. సుల్తాన్ పలన శుభ్రమయిన  అద్దం లాంటింది. హాజీఖాన్ ఆశ్రయం ఇస్తున్న దుర్జనుల ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల శభ్రమైన దర్శణం లాంటి అతని పాలనా దర్పణం మలినమవుతోంది. అంటే, దుష్టుల సలహాలను హాజీఖాన్  వినటంవల్ల , మచ్చలేని అద్దంలాంటి సుల్తాన్ పాలన మలినమైన అద్దంలా అవుతోందన్నమాట.

‘నా జీవితంలో ఇదొక మచ్చ’ అనటం తెలుసు. కొడుకు తనపై తిరుగుబాటు చేసి కత్తి దూయటం తన పాలనకు మాయని మచ్చలాంటిదని చెప్తున్నాడు సుల్తాన్.

సుల్తానుకు  తెలుసు ఈ వక్రబుద్ధి హాజీఖాన్‍కు స్వయంగా పుట్టినది కాదని. అతని చుట్టూ ఉన్నవారు రెచ్చగొట్టటం వల్ల హాజీఖాన్ కత్తి దూస్తున్నాడని సుల్తానుకు తెలుసు. అదీకాక, నువ్వు చేస్తున్నది తప్పు అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. ‘నువ్వు మంచివాడివే, నీ చుట్టూ ఉన్నవారు నీ మనసును పాడు చేశారు. నిన్ను తప్పు దారి పట్టిస్తున్నారు’ అనటం భవిష్యత్తులో రాజీ పడే వీలును కల్పిస్తుంది. దోషం తిరుగుబాటు చేసిన కొడుకుది కాదు, అతడిని రెచ్చగొట్టిన వారిది అనటం వల్ల యుద్ధంలో ఓడిపోయినా కొడుకును శిక్షించకుండా ఉండేందుకు భూమికను సుల్తాన్ సిద్ధం చేయటాన్ని తెలుపుతుంది.

ఇప్పటిదాక తన కొడుకుపై తనకు ఉన్న ఆశలను, కొడుకు బాధ్యతలను చెప్పిన సుల్తాన్ నెమ్మదిగా హాజీఖాన్ దోషం లేనట్టు, వేరేవారు తప్పు మార్గం పట్టిస్తున్నట్టు మాట్లాడుతూ మిత్రభేదం కలిగించాలని ప్రయత్నిస్తున్నాడు.

జీవనాశోద్యతా యేమే లసన్త్యు చ్ఛటంఖలాః ఖలాః।
సుచిరం నైవ తిష్ఠంతి సరసః సారసాః ఇవ॥
(శ్రీవర రాజతరంగిణి, 122)

ఇప్పుడెవరెవరైతే లాభాల ఆశతో నీ చుట్టూ తిరుగుతూ నీకు విధేయులుగా ప్రవర్తిస్తున్నారో వారెవరూ నీకు అండగా ఎక్కువ కాలం నిలబడేవారు కాదు. హంసలు ఎప్పుడైనా చెరువుల్లో ఎక్కువ కాలం ఉంటాయా? ఉండవు. అలానే ఈరోజు నిన్ను రెచ్చగొడుతున్న వారెవరూ నీతో ఎక్కువ కాలం నిలవరు అంటున్నాడు జైనులాబిదీన్. ఈ రకంగా తన కొడుకు హాజీఖాన్ మనసులో అతని చుట్టూ ఉండి యుద్ధానికి ప్రోత్సహిస్తున్న వారి విధేయత పట్ల అనుమానం రగిలించాలని ప్రయత్నిస్తున్నాడు జైనులాబిదీన్.

హాజీఖాన్ మంత్రులు కూడా అతడికి ఇలాంటి సలహానే ఇచ్చారు. జైనులాబిదీన్  నోటి వెంట అవే మాటలు వస్తున్నాయి. బహుశా, హాజీఖాన్ దగ్గర ఉన్న మంత్రులు జైనులాబిదీన్ సమర్థకులయి ఉండవచ్చు. లేదా, స్వతహాగా వారు హాజీఖాన్ మంచి కోరి ఉచితమైన, ధర్మబద్ధవు సలహా ఇచ్చి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కొడుకుతో యుద్ధం తప్పించాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు జైనులాబీదీన్.

గొప్ప మొఘులులలో ఒకడిగా చరిత్ర రచయితలు పరిగణించే జహంగీర్ ప్రవర్తనను జైనులాబిదీన్ ప్రవర్తనతో పోలిస్తే, వ్యక్తిగా జైనులాబిదీన్ గొప్పగా భావిస్తున్న  మొఘలులందరి కన్నా ఎంతో ఎత్తులో ఉంటాడు.

జహంగీర్ 36 ఏళ్ల వయసులో, అక్బర్ మరణించిన తరువాత రాజ్యాధికారం చేపట్టాడు. అతడు అధికారం చేపట్టిన సంవత్సరంలోగా అతని కొడుకు ఖుస్రో మిర్జా సింహాసనం కోసం జహంగీర్‌తో యుద్ధానికి వచ్చాడు. జహంగీర్‌కి 36 ఏళ్ల వయసంటే అతడి కొడుకు వయసు ఎంతో ఎక్కువ ఉండదు. కానీ దయాదాక్షిణ్యాలు లేకుండా జహంగీర్ కొడుకుతో యుద్ధం చేసి అతనిని బంధించటమే కాదు, తన మరో సంతానానికి ఖుస్రో మీర్జాను అప్పగించాడు. ఖుస్రో మీర్జాను హింసించి. గ్రుడ్డివాడిని చేసి వదిలాడు అతని సోదరుడు.

జహంగీర్ ప్రవర్తనకు పూర్తిగా భిన్నంగా ఉంది, ఉన్నతంగా ఉంది జైనులాబిదీన్ ప్రవర్తన. కొడుకు సైన్యంతో కశ్మీరుకు వచ్చాడని తెలిసిన  తరువాతనే యుద్ధానికి సిద్దమయ్యాడు జైనులాబిదీన్. అప్పుడు తాను చస్తే బాగుండునుకున్నాడు. తన సైన్యం శక్తి తెలుసు జైనులాబిదీన్‍కు. యుద్ధం చేస్తే కొడుకు ఓటమి తథ్యం అని తెలుసు. అయినా కొడుకును అనునయించేందుకు ఓ దూతను పంపాడు. కొడుకును బెదిరించలేదు. బ్రతిమిలాడుతున్నాడు. ఇది జైనులాబిదీన్ గొప్పతనం. తాను శక్తిమంతుడయి కూడా శక్తి చూపి బెదిరించకుండా, తండ్రిలా బ్రతిమిలాడుతున్నాడు, నీతి చెప్తున్నాడు. మంచీ చెడు వివరిస్తున్నాడు. జైనులాబిదీన్ గురించి ఎంతగా తెలుసుకుంటే, చరిత్ర రచయితలు మొఘులులపై చూపిన అతి పక్షపాతం అంతగా అర్థమవుతుంది. నిజానికి అక్బర్ ను  కాదు, జైనులాబిదీన్ ను  జాతీయ స్థాయిలో ఉత్తమ పాలనకు, వ్యక్తిత్వానికి, లౌకిక విలువలకు ఆదర్శంగా నిలిపివుండాల్సింది   అనిపిస్తుంది.

మదాదేశం వినా దేశం కిమర్థం స్వయమాగతః।
కేన రాజ్యం బలాత్ ప్రాప్తం నిజ భాగ్యోదయం వినా॥
(శ్రీవర రాజతరంగిణి, 123)

నా ఆదేశాలు లేకుండా ఎందుకని కశ్మీరం స్వయంగా వచ్చావు? భాగ్యోదయం (అదృష్టం) లేకుండా ఎవరికయినా రాజ్యం ప్రాప్తించిందా?

ఇప్పటిదాక తండ్రిలా బ్రతిమిలాడిన జైనులాబిదీన్ ఈ శ్లోకంలో సుల్తాన్‍లా ప్రశ్నిస్తున్నాడు.

సుల్తాన్ ఆదేశాల మేరకు తన వారితో శ్రీనగర్ విడిచి వెళ్లాడు హాజీఖాన్. సుల్తాన్ అతనిని తిరిగి రమ్మనలేదు. తనంతట తానే రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని సైన్యంతో రాజు అనుమతి లేకుండా కశ్మీరుకి వచ్చాడు. ఇది రాజధిక్కార నేరం క్రిందకు వస్తుంది. కొడుకుని తండ్రిలా బ్రతిమిలాడాడు. ఇప్పుడు సుల్తానులా రాజధిక్కార నేరాన్ని ప్రశ్నిస్తున్నాడు. అంతే కాదు, అదృష్టం వరించకుండా స్పయంగా ఎవరయినా రాజ్యాధికారం చేపట్టాడా? అని ప్రశ్నిస్తున్నాడు. అంటే, నువ్వు మూర్ఖుడివి, కాలం కలసి వస్తే అధికారం అదే వస్తుందని చెప్తున్నాడు.

ఇక్కడ శ్రీవరుడు ‘భాగ్యోదయం’ అన్న పదం వాడటం వల్ల ఈ మాటలు నిజంగా జైనులాబిదీన్‍వే అని భావించే వీలుంది. ఎందుకంటే కల్హణుడు , జోనరాజు, శ్రీవరుడు, శుకుడి రాజతరంగిణిలలో కర్మ సిద్ధాంతానికి ప్రాధాన్యం ఇచారు. శ్రీవరుడు, శుకుడి రాజతరంగిణి లలో కర్మ సిద్ధాంతం కనిపించినా, ‘భాగ్యం’ ప్రస్తావన అధికంగా ఉంటుంది. ‘భాగ్యం’ అన్న పదానికి ‘కిస్మత్’ సమానార్థకం. ఇస్లాంలో కర్మ కన్నా ‘కిస్మత్’కు ప్రాధాన్యం. ఇక్కడ సుల్తాన్ అదే భావాన్ని వ్యక్తపరిచాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here