శ్రీవర తృతీయ రాజతరంగిణి-22

0
9

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

బాహ్యదేశావనిః సర్వా భుజ్యతే తృప్తసే న కిమ్।
యేన మండల మాత్రః మేవాశిష్ట హర్తుమాగతః॥
(శ్రీవర రాజతరంగిణి, 124)

బాహ్యదేశాల భూమి మొత్తం నీవు అనుభవించవచ్చు. అయినా నీకు సంతృప్తి కలగటం లేదా? మిగిలిన నా మండలం కూడా హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావు?

చాలా చమత్కారంగా కొడుకుని ప్రశ్నిస్తున్నాడు జైనులాబిదీన్.

బలహీనుడైన ఆదమ్‍ ఖాన్‌ను తన దగ్గర ఉంచుకుని, హాజీఖాన్‍ను కశ్మీరు బయటి ప్రాంతాలకు పంపించాడు జైనులాబిదీన్. ఈ రకంగా ఆదమ్ ఖాన్‍కు రక్షణ లభించటమే కాదు, రాజ్యం కోసం హాజీఖాన్ కశ్మీరు వైపు కాక, కశ్మీరు వెలుపలి వైపు దృష్టిని సారిస్తాడని జైనులాబిదీన్ భావించాడు. కానీ, బయట ఉన్న విశాలమైన భూభాగాలను వదిలి హాజీఖాన్ కశ్మీరు వైపే దృష్టి సారించాడు. ఆధిపత్యం లాక్కునేందుకు సైన్యంతో దండయాత్రకని వచ్చాడు. దీన్ని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నాడు జైనులాబిదీన్. కశ్మీరేతర ప్రాంతాలన్నీ నీవే. అయినా కాశ్మీరే కావాలని ఏమిటీ నీ పట్టుదల? అని ప్రశ్నిస్తున్నాడు.

పూంఛ్ నుంచి రాజౌరీ వరకు పశ్చిమంగా కల భూభాగాన్ని, కశ్మీరు బాహ్య మండలంగా భావిస్తారు. అంటే కశ్మీరుకు ఆవలి భూభాగాన్ని బాహ్యదేశంగా భావించేవారన్న మాట. అందుకే జైనులాబిదీన్ బాహ్యదేశమంతా నీదే. అయినా సంతృప్తి లేక కశ్మీరు కోసం అరాట పడుతున్నావేమిటి? అని ప్రశ్నిస్తున్నాడు.

తన్నివర్తస్వ మా పుత్ర పాపబుద్ధిం వృథా కృథాః।
బలద్వయవధాత పాపం తవైవత్ పరిణేశ్యతి॥
(శ్రీవర రాజతరంగిణి, 125)

ఓ పుత్రా! వెనక్కి తిరిగి వెళ్లిపో. అనవసరంగా పాపాల్ని పెంచుకోకు. రెండు సైన్యాలకు ప్రాణ నష్టం కావించిన పాప ఫలితం నువ్వు అనుభవించాల్సి వస్తుంది.

ఈ శ్లోకం అద్భుతమైన శ్లోకం!

సైనికులు యుద్ధం చేస్తారు. వీరమరణం పొందుతారు. వారి ప్రాణత్యాగాల ఫలితంగా రాజ అధికారం పొందుతాడు. అధికారం అనుభవిస్తాడు. కానీ ఇరువైపులా ప్రాణహానికి కారణమైన రాజులకు పాపం చుట్టుకుంటుంది. యుద్ధం ఎంత సమంజసమైన కారణం కోసం చేసినా అది పాపమే.  కేవలం ధర్మ రక్షణ కోసం చేసిన హింస మాత్రమే సాత్విక హింస. మిగతా అంతా ఎంతగా సమంజసమైనదైనా పాపానికి కారణమవుతుంది. యుద్ధానికి కారణమైన వారు ఆ పాప ఫలితం అనుభవించాల్సి వస్తుంది.

భగవద్గీతలో  సాత్విక హింస’ అన్న ఆలోచన కనిపిస్తుంది. ఎదుటి వాడిపై క్రోధం లేకుండా; అసూయా ద్వేషాలు లేకుండా, కేవలం తన కర్తవ్య నిర్వహణ కోసం, ధర్మం కోసం చేసే హింస ‘సాత్విక హింస’ అవుతుంది. పరోక్షంగా జైనులాబిదీన్ ఆ ప్రస్తావన చేస్తున్నాడు. జైనులాబిదీన్ యుద్ధం కోరలేదు. అతనికి యుద్ధం చేయాలని లేదు. యుధ్ధానికి సైన్యాలు మోహరించి సిద్దంగా ఉన్న సమయంలో కూడా సంధి ప్రయత్నాలు చేస్తున్నాడు. కొడుకుపై ద్వేషం, క్రోధం ఉండే ప్రసక్తి లేదు. కానీ, రాజ్యాన్ని దాడి నుంచి రక్షించటం రాజు ధర్మం. ఆ ధర్మం నెరవేర్చేందుకు  జైనులాబిదీన్ కదనరంగంలో అడుగు పెట్టాల్సి వచ్చింది. కాబట్టి అతడు రాజ్య రక్షణ అనే ధర్మాన్ని నిర్మోహంగా నిర్వహిస్తున్నాడు, ఇక్కడ దోషం హాజీఖాన్‍ది.

అతడికి కశ్మీరేతర భూమి అంతా పాలించే వీలుంది. అయినా కశ్మీరుపై అధికారం కోసం అర్రులు చాస్తూ యుద్ధానికి వచ్చాడు. అతను కనుక తనకి ఉన్న దానితో సంతృప్తి పడితే యుద్ధం లేనేలేదు. కానీ తానేదో నష్టపోతున్నానన్న భ్రమతో, రాజ్యంపై  తన హక్కు   పోతుందన్న అపోహతో యుధ్ధానికి వచ్చాడు. కాబట్టి యుద్ధం జరిగితే ఇరువైపుల జరిగే ప్రాణహానికి హాజీఖాన్ స్వార్థం, ఆత్రం, తనది కాని దానిపై ఆశ కారణమవుతాయి. కాబట్టి పాపం పూర్తిగా హాజీఖా‍న్‌దే అవుతుంది. దాని ఫలితం కూడా అతడే అనుభవించాల్సి ఉంటుంది.

ఇస్లాంలో ‘పాపం’ భావన భారతీయ తాత్త్విక చింతనకు భిన్నమైనది. ఇస్లాంలో ఎవరయినా కావాలని భగవంతుడి ఆజ్ఞలను ఉంల్లంఘించినా, ఇతరుల హక్కులకు భంగం కలిగించినా  అది ‘పాపం’ అవుతుంది. అయితే, వ్యక్తి తన ప్రమేయం లేకుండా, తనకు తెలియకుండా పొరపాటు చేస్తే దోషం అతనిది కాదు. చేసిన తప్పుకు నిజాయితీగా పశ్చాత్తాపపడితే ‘పాపం’ అంటదు.

ఇందుకు భిన్నంగా భారతీయ ధర్మంలో తెలిసి చేసినా, తెలియక చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. అందుకే మహాభారత యుద్ధంలో విజయం సాధించినా, ఆ యుద్ధాన్ని ధర్మ యుద్ధంగా అందరూ భావిస్తున్నా,  పాండవులు చివరి దశలో కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. అర్జునుడి శక్తి నిర్వీర్యమై పోయింది. ఒకరొకరుగా పాండవులు – తమ సోదరులు నేలవాలి పోవటం నిస్సహాయంగా చూస్తూ, ఏమి చేయలేక ముందుకు సాగాల్సిన దుస్థితిని అనుభవించారు.

కాబట్టి, ఇక్కడ జైనులాబిదీన్ ‘పాపఫలం’ అనుభవించాలని తన కొడుకును హెచ్చరించటం రెండు వైపులా పదునైన కత్తి వంటింది. భారతీయ ధర్మంలోని కర్మఫలం ఒకవైపు, ఇస్లాంలోని తెలిసి చేసే  దుష్కర్మ ఫలం మరో వైపు పదునైన కత్తిలా హాజీఖాన్‌పై ప్రయోగించాడు జైనులాబిదీన్. ‘దోషం నీదే’ అని నొక్కి చెప్పాడు.

ఇత్యుక్తిః పైత్రునీ ప్రోక్తా కిం తు సత్య మహం బ్రువే।
నశ్యన్తి భూపాంఛయేనాగ్రాత్ త్వర్భటాశ్చటకా ఇవ॥
(శ్రీవర రాజతరంగిణి, 126)

ఇప్పటి వరకూ మీ తండ్రి చెప్పిన మాటలను నేను చెప్పాను. ఇపుడు నా మాట చెప్తాను. నిజం చెప్తాను. గ్రద్ద ముందు చిన్న పిట్ట నిలవలేనట్టు రాజు ముందు నీ సైన్యం నిలవలేదు. క్షణంలో పారిపోతారు.

బ్రాహ్మణుల లక్షణాలలో ఇదొక లక్షణం. కొందరు బ్రాహ్మణులు లౌక్యంగా మాట్లాడుతారు. కొందరు సూటిగా, నొర్మొహమాటంగా, కుండలు బద్దలు కొట్తినట్టు మాట్లాడతారు.

“నిండుమనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణా
ఖండల శస్త్రతుల్యము జగన్నుత! విప్రులయందు నిక్కమీ..”
(నన్నయ భారతము: ఆదిపర్వం: ప్రథమాశ్వాసం 100)

నన్నయ ఆ కాలంలోనే ఈ లక్షణాన్ని అద్భుతమైన పద్యంలో పొందుపరిచాడు. మనస్సు వెన్న వంటిది. మాట వజ్రాయుధం లాంటిది. శ్రీవరుడి రాజతరంగిణిలో రాజదూతగా హాజీఖాన్ దగ్గరకు వెళ్లినపుడు రాజు సందేశాన్ని వినిపించి ఊరుకుంటే అయిపోయేది. కానీ కఠినమైన ఉచిత సలహా నిక్కచ్చిగా ఇచ్చాడు. ‘రాజు డేగ అయితే నువ్వు చిన్న పిట్టవు’ అని కుండ బద్దలు కొట్టి చెప్పాడు. దూతగా అతను తన హద్దు దాటి ప్రవర్తించాడు. అంత కఠినంగా నిజం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అలా చెప్పకపోత – ‘పల్కు దారుణా ఖండల శస్త్ర తుల్యం’ ఎలా అవుతుంది?

ఇతి రూక్షాక్షరాముక్తిం శ్రుత్వా విప్రస్య తే భటాః।
ఛిత్వా కర్ణౌ వ్యధూ రక్తాదాయుధేషు విశేషకాన్॥
(శ్రీవర రాజతరంగిణి, 127)

విప్రుడు మాట్లాడిన కఠినమైన మాటలు హాజీఖాన్ భటులకు ఆగ్రహం కలిగించాయి. వారు ఆవేశంతో అతడి చెవులను కత్తిరించారు. ఆ రక్తం వారు తమ ఆయుధాలకు పూశారు.

ఈ శ్లోకం పలు విషయాలను తెలుపుతుంది.

భారతీయ ధర్మంలో దూత రాజుతో సమానం. దూత ముఖం నుండి వెలువడే మాటలు రాజు ముఖం నుండి వచ్చినవే. కాబట్టి ఎదుటి రాజుకు ఎంత మర్యాద ఇస్తారో, అంత మర్యాద దూతకు ఇవ్వాలి. రాక్షసులు మాత్రమే దూతలకు హాని చేస్తారు. ఇది భారతీయులకు అలవాటయిన పద్ధతి. అక్కడక్కడా ఈ నియమోల్లంఘనం జరిగేది. అయితే అది ఆనవాయితీ కాదు, పొరపాటు.

దూతకు ఇంత ప్రాధాన్యం ఎందుకంటే ఋగ్వేదంలో ‘అగ్ని’ని దూతగా భావించారు. మానవుల నుండి దేవతలకు విజ్ఞప్తులు, దేవతల నుండి మానవులకు సందేశాలు మోసేది అగ్ని. కాబట్టి అగ్నిని ఎలా గౌరవిస్తామో, దూతను అలా గౌరవించాలి. కానీ దేశంలో ఇస్లాం ప్రవేశంతో దూతకు గౌరవమిచ్చే పద్ధతి దెబ్బతిన్నది. దూత మాటలు నచ్చకపోతే దాడి చేయటం ఆనవాయితీ అయింది. అయినా సరే రాజు సందేశం వినిపించేందుకు విప్రులు ముందుకు వచ్చేవారు. నిర్భయంగా, నిర్మొహమాటంగా రాజు సందేశంతో పాటు తమ అభిప్రాయాన్నీ వినిపించేవారు. విప్రులే కాదు నిమ్నజాతుల వారు కూడా దూతలుగా సమ్మానితులని మనుధర్మ శాస్త్రం వల్ల తెలుస్తుంది. నిమ్నజాతుల వారయినా దూతలకు హాని తలపెట్టకూడదని మనుధర్మ శాస్త్రం చెప్తుంది. ఆధునిక కాలంలో కూడా దౌత్యధికారులపై హింస జరపరు. వారికి రక్షణ ఉంటుంది. కానీ మధ్య యగంలో ఇస్లామీయులు దూతలపై హింసకు వెనుకాడలేడు.

ఇక ఆయుధాలపై రక్తాన్ని అద్దటం ఒకప్పటి ఆచారం. ఇది ఒక రకమైన శస్త్ర పూజ లాంటిది. కత్తిని ఒర నుంచి వెలుపలికి తీస్తే దానికి రక్తతర్పణం చేయాలి. అటే ఒర నుంచి కత్తిని నిష్ప్రయోజనంగా తీయరు సైనికులు అని అర్థం. అందుకని వారు దూత చెవులు కోసి ఆ రక్తాన్ని ఆయుధాలకు పూశారు. ఈ పద్ధతి యూదుల నుంచి ప్రపంచానికి సంక్రమించిందంటారు. భారతదేశంలో రక్తంతో తిలకం దిద్దుకోవటం ఉంది. అయితే ఆ రక్తం శత్రువుది కాదు, తమది. శత్రువు రక్తం భీముడు ద్రౌపది కురులకు పూశాడు. అది సంప్రదాయం కాదు. ప్రతిజ్ఞ మాత్రమే.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here