శ్రీవర తృతీయ రాజతరంగిణి-24

1
11

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ఆత్రాన్తరే ద్విజ తాద్రుగవస్థ వీక్ష్య భూపతిః।
మురారాతిరివ కృద్ధో యుద్ధసన్నద్ధతాం దధే॥
(శ్రీవర రాజతరంగిణి, 141)

ఈ శ్లోకం నుంచి శ్రీవరుడి పద్య కవిత్వ  రచన  ప్రతిభ అత్యద్భుతమైన రీతిలో ప్రకటితమవుతుంది.  అతడి కవితాసృజన ఆవేశం ప్రస్ఫుటమవుతుంది. అతడిలో అణగి ఉన్న అనేక వేదనలు అగ్నిపర్వతంలా బ్రద్దలై, అతని శ్లోకాల రూపంలో వెలువడ్డాయనిపిస్తుంది. యుద్ధ వర్ణనలలో అత్యన్నత స్థాయిని ఆక్రమించే వర్ణనా శ్లోకాలివి. మహాభారతం  యుద్ధ వర్ణనతో సమాన స్థాయిలో యుద్ధ దృశ్యాలను తన శ్లోకాల ద్వారా చిత్రించి పాఠకుల హృదయ తెరలపై ప్రతిష్ఠిస్తాడు శ్రీవరుడు. సాహిత్య ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో పరిగణనకు గురవ్వాల్సిన శ్లోకాలివి.

తాను దూతగా పంపిన బ్రాహ్మణుడి అవస్థ చూసిన రాజుకు,  కృష్ణుడికి సమానమైన కోపం వచ్చింది. కృద్ధుడయిన రాజు యుద్ధానికి సిద్ధమయ్యాడు.

ఇక్కడ శ్రీవరుడు సుల్తాన్ జైనులాబిదీన్‍కు కలిగిన కోపాన్ని శ్రీకృష్ణుడికి కలిగిన  కోపంతో పోల్చటం గమనార్హం.

దూతను హింసించటం అన్నది అధర్మం. అది నేరం. దాన్ని సహించకూడదు. దూతను అవమానిస్తే, రాజును అవమానించినట్టే. ఎందుకంటే దూత వినిపించేది రాజు సందేశాన్ని. రాజు స్వయంగా శత్రు శిబిరం లోకి వెళ్లి తన మాటను వినిపించలేడు కాబట్టి, తనకు ప్రతిగా దూతను పంపుతాడు తన సందేశంవినిపించేందుకు. అలాంటి ప్రతినిధి అయిన దూతను హింసించటం, అవమానపరచటం అంటే, పరోక్షంగా రాజును అవమానించటమే. అందుకే మరో మాట లేకుండా జైనులాబిదీన్ యుద్ధానికి సిద్ధమైపోయాడు. దూతను హింసించటం కూడా యుద్ధ భేరీ మ్రోగించటమే!

మహాభారతంలో పాండవుల తరఫున శ్రీకృష్ణుడు దూతగా శాంతి సందేశాన్ని మోసుకుని వెళ్తాడు. దుర్యోధనాదులు శ్రీకృష్ణుడిని బంధించి అవమానించాలనుకుంటాడు. ఈ విషయం తెలిసిన కృష్టుడి రథసారధి సాత్యకి శ్రీకృష్ణుడికి ఈ విషయం తెలుపుతాడు. తనను దుర్యోధనాదులు బంధించాలనుకుంటున్న విషయం శ్రీకృష్ణుడికి తీవ్రమైన ఆగ్రహం కలిగిస్తుంది. విశ్వరూప ప్రదర్శన చేసి, తనను బంధించమని వారికి సవాలు విసురుతాడు. అతని విరాట్ స్వరూప ప్రదర్శన అందరిలో భయకంపనలు కలిగిస్తుంది. దేవతలు విస్మయం చెందుతారు. భూమి కంపిస్తుంది. సముద్రాలు అల్లకల్లోలమవుతాయి. శ్రీకృష్ణుడి శాంతి సందేశాన్ని తిరస్కరించటం వల్ల యుద్ధం అనివార్యమవుతుంది. అధర్మపుటాలోచనలు చేసిన వారు శిక్షను అనుభవిస్తారు. దుశ్చర్య వల్ల కలిగే దుష్పలితాన్ని అనుభవిస్తారు. జైనులాబిదీన్‍కు శ్రీకృష్ణుడి అంత కోపం వచ్చింది అని అనటం వెనుక ఇంత భావన ఉంది. ఎలాగయితే శ్రీకృష్ణుడి శాంతి సందేశం విఫలమై కృష్ణుడికి ఆగ్రహం కలుగటం వల్ల కురుక్షేత్ర యుద్ధం జరిగి, కౌరవులు సర్వనాశనమయ్యారో, అలాగే జైనులాబిదీన్‌కు అంత కోపం తెప్పించటం వల్ల ఘోరమైన  యుద్ధం జరుగుతుంది. శత్రువులు సర్వ నాశనమౌతారు అని స్పష్టంగా సూచిస్తున్నాడు శ్రీవరుడు. అత్యద్భుతమైన రచనా సంవిధానం ఇది. ఈ పోలిక వెనుక ఉన్న పరమార్థం తెలియని పాశ్చాత్యులు శ్రీవరుడు రాజును భగవంతుడితో పోల్చాడనీ, రాజు మెప్పు పొందటం కోసం బ్రాహ్మణులకు అలవాటయిన రీతిలో పొగిడేశాడని భావించటంలో శ్రీవరుడి దోషం ఏమీ లేదు!

ఇక్కడ శ్రీవరుడు కృష్ణుడిని సూచించేందుకు ‘మురారి’ అన్న నామం వాడటం వెనుక ఓ గమ్మత్తు ఉంది.  ‘ముర’ అనే దైత్యుడిని సంహరించటం వల్ల  శ్రీకృష్ణుడిని ‘మురారి’ అంటారు. ప్రాగ్జోతిషపుర సేనాపతి ముర. ఇతడు పంచముఖ రాక్షసుడు. ఇతడు కశ్యప ప్రజాపతి కుమారుడు. గొప్ప తపస్సు చేసి బోలెడన్ని వరములు పొందాడు. నాలుగు వేల మంది పుత్రులను  కన్నాడు. ప్రాగ్జోతిషపుర సరిహద్దులను ఆరు వేల దారాలతో కట్టి భద్రం చేశాడు. శ్రీకృష్ణుడు నరకాసురుడితో యుద్ధానికి వెళ్లినప్పుడు ఈ దారాలను సుదర్శన చక్రంతో కత్తిరించాడు. నరకాసురుడిని, మురను, అతడి సంతానాన్ని సంహరించాడు. అందుకే శ్రీకృష్ణుడికి ‘మురారి’ అన్న పేరు వచ్చింది. ఇప్పుడు జైనులాబిదీన్‍ను ‘మురారి’ అనటం వెనుక ఇంత కథ ఉంది. శత్రువులను సంపూర్ణంగా నాశనం చేయగల శక్తి కలవాడు జైనులాబిదీన్ అని సూచిస్తుంది ‘మురారి’ అన్న పోలిక.

శుక్రయోగ జనామర్‍క్షపరీక్షణ విచక్షణః।
స్వపక్ష రక్షణం క్ష్మాపః పృష్ఠీకృతరవిర్వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, 142)

గ్రహ, నక్షత్ర గతులను పరిశీలించి, విశ్లేషించటంలో నిష్ణాతుడైన రాజు, సూర్యుడు తన వెనుక ఉండే రీతిలో సేనలను మోహరింప చేశాడు. తన మనుషుల రక్షణకు ఏర్పాట్లు చేశాడు.

రాజ్ఞః పృష్ఠగతః సూర్యః ఖడ్గాన్తాః ప్రతిబింబితః।
జయస్తే భవితేత్యేవ వ్యక్తుం చ్యోమ్నోవతీర్ణవాన్॥
(శ్రీవర రాజతరంగిణి, 143)

రాజు వెనకనున్న సూర్యబింబం ఆయన ఎత్తి పట్టుకున్న కత్తిపై ప్రతిబింబించి, రాజుకు జయమవుతుందని ప్రకటిస్తూ దిగంతం నుండి దిగిపోతున్నట్టుంది. సాయంత్రం అయింది.

చక్కటి దృశ్యాన్ని కళ్ళ ముందు ఉంచాడు శ్రీవరుడు.

తన వెనుక వైపు సూర్యుడుండేట్టు సేనలను మోహరింప చేశాడు జైనులాబిదీన్. వెనుక వెలుతురు ఉండటంతో శత్రువుకు తాము స్పష్టంగా కనబడరు. అందుకే ఆయన కత్తి ఎత్తగానే ఆ ఖడ్గంపై సూర్యబింబం ప్రతిబింబించింది. జైనులాబిదీన్‍కు జయం పలుకుతూ సూర్తుడు అస్తమించాడు. సూర్యుడిని వెనక వైపున ఉంచటం వల్ల మరో లాభం ఉంది. అది తరువాత శ్లోకం చెప్తుంది.

కియంతోమీతి యావత్ సోచిన్తయత్ తావదగ్రతః।
అర్కదీప్తిజ్వలచ్ఛస్త్రధు తిద్యోతితభూతలమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 144)

నిర్యత్సన్నాహిసాద్యోఘ పతద్ఘట తురంగమమ్।
గణశో గణశో ధావత్ తత్సైన్యం సమవైక్షత॥
(శ్రీవర రాజతరంగిణి, 145)

అప్పటిదాక శత్రు సైనికులెంతమంది ఉన్నారోనని ఊహించేందుకు రాజు ప్రయత్నిస్తున్నాడు. కానీ సూర్య కిరణాలు శత్రుసైనికులపై పడి వారిని స్పష్టంగా చూపిస్తున్నాయి. వారున్న భూమిని సైతం ప్రకాశవంతం చేశాయి సూర్యకిరణాలు. అంటే సూర్యుడు తన వెనుక వైపు ఉండేట్టు చేయటం వల్ల, ఎదుటి పక్షం సైన్యం స్పష్టంగా కనిపించటమే కాక తాము శత్రు పక్షానికి సరిగ్గా కనబడరన్న మాట. ఎందుకంటే శత్రు పక్షం కళ్ళల్లోకి సూర్య కిరణాలు తిన్నగా పడుతుండటం వల్ల వారు జైనులాబిదీన్  సైన్యాన్ని సరిగ్గా చూడలేకపోతారు. అంచనా వేయలేకపోతారు.

కోన్యో వీరౌ హాజీఖానాధ్యీ రాజ్ఞా వాగ్రజేనవా।
గృహీత సర్వసైన్యేన ధైర్యాత్ క్రష్టుమశక్యత్॥
(శ్రీవర రాజతరంగిణి, 146)

ఆ వెలుతురుతో శత్రు సైన్యంలో హాజీఖాన్ కాక ఇంకెవరెవరు వీరులున్నారో రాజు, అవని పెద్ద కొడుకు చూశారు. తమ సైన్యంతో వీరిని – ఇంకే వీరుడున్నా  వారితో సహా తాము గెలవలేని వాడెవడైనా ఉన్నారా అని చూశారు.

అంటే జైనులాబిదీన్, ఆదమ్ ఖాన్‍లు గెలవలేని వీరులెవ్వరూ శత్రు సైన్యంలో లేరని అర్థం.

తత్ర మల్లశిలారుగ సంగతాస్తద్భటా నటాః।
తృంగదంగా విహంగానాం నాట్య భంగిమ దర్శయన్॥
(శ్రీవర రాజతరంగిణి, 147)

నృత్యం చేసే వారు వేదికపై నృత్య భంగిమలు ప్రదర్శించినట్టు, మల్లశిల అనే రంగస్థలం వద్ద ఇరుపక్షాల సైనికులు యుద్ధ విన్యాసాలు ప్రదర్శించారు. శ్రీవరుడు ప్రస్తావించిన ‘మల్లశిల’ ప్రాంతం షోపియాన్ జిల్లాలో ఉన్నదని పరిశోధకులు గుర్తించారు.

మల్లశిల ప్రాంతం వద్ద ఇరు పక్షాల సైనికులు ఢీకొన్నారు. వారివురి  యుద్ధం రంగస్థలంపై నృత్యకారులు ప్రదర్శించే నృత్య భంగిమలలా ఉన్నాయట.

అత్యద్భుతమైన వర్ణన ఇది.

మల్లశిల వద్ద జరిగిన యుద్ధానికి శ్రీవరుడు ప్రత్యక్ష సాక్షి. శ్రీవరుడు సృజనాత్మక కవి. అందరూ అవే అంశాలను చూసినా, కవి దృష్టి వేరుగా ఉంటుంది. సైనికులు కత్తులు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేస్తుంటే అది నృత్యంలా కనిపిస్తున్నది కవికి.

‘కోరియోగ్రఫీ’ అన్న పదం ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోనికి వచ్చింది. సినిమ్మాల్లో యుద్ధాలన్నీ కోరియోగ్రాఫ్ చేసిన యుద్ధాలే.  కానీ శ్రీవరుడు తను దర్శించిన యుద్ధాన్ని ఎవరో కోరియోగ్రఫ్ చేసిన నృత్య కదలికల్లా ఉన్నాయని అంటున్నాడు. గమనిస్తే, యుద్ధ విద్య ప్రదర్శన నృత్య ప్రదర్శనలా ఉంటుంది. కత్తి గాని బల్లెం కాని, ఇతర మారణాయుధంతో యుద్ధ్ధం కానీ, మల్ల యుద్ధం కానీ, కరాటే, కుంగ్‌ఫూ ఏవైనా ఒక పద్ధతి ప్రకారం ప్రదర్శిస్తే నృత్య కదలికలను పోలి ఉంటాయి. శ్రీవరుడు యుద్ధ విద్యలోని నృత్య పోలికను గమనించి దాన్ని ఎత్తి చూపుతున్నాడు..

వవర్ష శరదారభిః స భూప కటకాంబుదః।
స్ఫురచ్ఛస్త్రతడి జ్జ్యోతిస్తూర్య గంభీర గర్జితః॥
(శ్రీవర రాజతరంగిణి, 148)

యుద్ధ వర్ణనల్లో శ్రీవరుడిలో అణిగి ఉన్న కవి  విశ్వరూప ప్రదర్శన  కనిపిస్తుంది.

రాజు సైన్యం నీరు నిండిన మేఘం లాంటిది. రాజు వద్ద మేఘంలోని మెరుపు లాంటి ఆయుధాలున్నాయి. అవి వర్షించేవి బాణాలను. ఆ బాణాలు వర్షించే లయకు అనుగుణంగా తూర్యారావాలు గర్జిస్తున్నాయి.

పూర్వకాలం యుద్ధాలలో సైనికులకు ఊపునిచ్చేందుకు లయబద్ధంగా వాయిద్యాలను మ్రోగించేవారు. ఆ వాయిద్యాల లయను అనుసరించిన బాణాల వర్షం హోరు గంభీరంగా ధ్వనిస్తోంది.

కళ్ల ముందు దృశ్యం కనిపిస్తోంది. రాజు సేన మేఘం లాంటింది, దానిలో మెరుపులు ఆయుధాలు, బాణాల వర్షం కురుస్తుంది అనటంతోటే ఓ వైపు పైకి లేచి క్రిందకి దిగి, ఒకదాన్నొకటి తాకే కత్తుల మెరుపులు, రివ్వురివ్వుమంటు దూసుకుపోయే బాణాల శబ్దాలు అనుభవిస్తాం.

ఈ రకంగా ఆ కాలంలో యుద్ధాన్ని వర్ణించినవారు లేరు.

అమీర్ ఖుస్రో పలు యుద్ధాలకు ప్రత్యక్ష సాక్షి. పలు ఘోరమైన యుద్ధాలకు ప్రత్యక్ష సాక్షి. ఆయన తన పర్షియన్ భాష రచనలలో యుద్ధాలను వర్ణించాడు. కానీ ఆయన  యుద్ధ వర్ణనలు ఏకపక్షం. పైగా, ఆయన వర్ణనలన్నీ కాఫిర్‍లకూ, విశ్వాసపాత్రులకు నడుమ యుద్ధ వర్ణనలు. కాఫిర్‍లు తమ తప్పుకు శిక్షను అనుభవించటం యుద్ధ పలితం.

శ్రీవరుడి వర్ణనలు ఇందుకు భిన్నం.

శ్రీవరుడు వర్ణిస్తున్నది తండ్రి కొడుల నడుమ యుద్ధం. ఇక్కడ ఆయన సుల్తాన్ వైపు వాడయినా, సుల్తాన్ విజయాన్ని మరీ గొప్పగా చూపలేదు. ఎందుకంటే ప్రస్తుతం సుల్తాన్ పోరాడుతున్నది కేవలం తన తనయుడితో మాత్రమే కాదు, భావి సుల్తాన్‌తో కూడా.

జైనులాబిదీన్ తాత్కాలికంగా విజయం  సాధించినా భవిష్యత్తులో సింహాసనాన్ని అధిష్ఠించేది హాజీఖాన్. కాబట్టి శ్రీవరుడు యుద్ధ వర్ణనలో సమతౌల్యాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇది అతని యుద్ధ వర్ణనలకొక నిష్పాక్షికతను ఆపాదిస్తుంది.

అతనిలోని కవి స్పందించటంతో ఈ యుద్ధ వర్ణనలు అత్యద్భుతంగా ఉంటాయి. యుద్ధ దృశ్యాలను సినిమా రీళ్లలా కళ్ళ ముందు నిలుపుతాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here