శ్రీవర తృతీయ రాజతరంగిణి-27

1
14

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

అన్యేద్యుర్హత శిష్టాంస్తాన్ భృత్యానానీయ పూర్వవత్।
హాజ్యఖానః సానుతాపశ్చిమదేశే స్థితం వ్యాధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, 167)

యుద్ధంలో ఓడిపోయాడు. హాజీఖాన్‌లో పశ్చాత్తాప భావన మొదలయింది. ప్రాణాలతో మిగిలిన సేవకులను వెంట తీసుకుని ‘చిభ’ దేశానికి పారిపోయాడు. ఆ దేశంలో నివసించాలని నిశ్చయించుకున్నాడు.

శని తలపై నృత్యం చేస్తున్నప్పుడు హితవచనాలు రుచించవు. మంచి తలకెక్కదు. హాజీఖాన్ మంత్రులు చక్కటి సలహాలిచ్చారు. కానీ హాజీఖాన్ వినలేదు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధరంగంలో సిద్ధంగా ఉన్న కశ్మీరు సైన్యాన్ని చూడగానే అతనికి తన పొరపాటు అర్థమైంది. కానీ హాజీఖాన్‍నే నమ్ముకుని, తమ ఇష్టానికి వ్యతిరేకంగా యుద్ధానికి వచ్చిన వారు వెనుదిరగటానికి ఇష్టపడలేదు. దాంతో వారి భయానికి యుద్ధంలో దిగాల్సి వచ్చింది. మనస్ఫూర్తిగా చేయని ఏ పనికయినా సత్ఫలితం లభించదు. యుద్ధంలో ఓడిపోయాడు. ఇప్పుడు పశ్చాత్తాపపడి లాభం లేదు. ప్రాణాలతో ఉన్న వారిని వెంట తీసుకొని శాశ్వతంగా కశ్మీరు వదిలి ‘చిభ’ దేశంలో స్థిరపడాలని అనుకున్నాడు. ఆ దేశం చేరాడు.చరిత్ర పరిశోధకులను ‘చిభ’ దేశం కష్టపెట్టింది. కొందరు ‘చిభ’ అన్న దేశం లేదని, వ్రాయసగాళ్ళ పొరపాటు వల్ల ‘చిత్ర’, ‘చిభ’ అయిందని అభిప్రాయపడ్డారు. హాజీఖాన్ ‘చిత్ర దేశం’  చేరుకున్నాడని తీర్మానించారు. అయితే, కశ్మీరు పరిసర ప్రాంతాలలో ఎంత అన్వేషించినా ఈ ‘చిత్ర దేశం’ ఎక్కడా దొరకలేదు.

ఎన్నో పరిశోధనల తరువాత తెలిసిందేమిటంటే, కశ్మీరులో చివ రాజపుత్రుల ఉపజాతి ఒకటి ఉంది. వీరంతా ఒకప్పుడు ‘డోగ్రా’ జాతికి చెందినవారు. కాలక్రమంగా ‘చివ ఉపజాతి’గా ఏర్పడ్డారు. కశ్మీరులో ప్రజలను ఇస్లాం మతంలోకి మార్చటం ఒక ఉద్యమంలా సాగుతున్న కాలంలో చివ జాతి రాజపుత్రులు బలవంతాన మతం మారారు. వీరు ఇస్లాం స్వీకరించారు. డోగ్రాలు వీరోచితమైన వ్యతిరేక పోరాటం జరిపి మతాంతరీకరణను అడ్డుకున్నారు. తమ ధర్మాన్ని నిలుపుకున్నారు. చివ జాతి రాజపుత్రులనే ‘చిఖాలీ’ లంటారు. వీరిలో ఇస్లాం స్వీకరించిన ‘జాట్’లు కూడా కలిసారు. వీరంతా వ్యవసాయం ప్రధాన వృత్తి చేసుకున్నారు. తూర్పు ప్రాంతంలోని చిఖాలీలు ఠాకూర్లు. చిఖాలీ ముస్లింలు మీసం ఉంచుకోరు. ఇతర వేషభూషణలు ముస్లింల లానే ఉంటాయి. ఫ్రాచీన కాలంలో  చిఖాలీ ముస్లింలు హిందువుల నడుమ వివాహాలు జరిగివి. అయితే, ఎవ్వరూ తను మతం మారేవారు కాదు. హిందువులు తమ ధర్మాన్ని అనుసరించేవారు, ముస్లింలు తను మతాన్ని పాటించేవారు. ఒకే ఇంట్లో హిందూ దేవీదేవతలకు పూజలు జరిగేవి, నమాజ్ జరిగేది. రానురాను ఈ ‘అలవాటు’ పోయింది. ఇప్పడు, మత భావనలు తీవ్రమయ్యాయి. వీరి అధికంగా ఉండే ప్రాంతమే ‘చిభ దేశం’. ఇది కశ్మీరు సరిహద్దు దాటిన తరువాత దక్షిణం వైపు ఉండేది.

శ్రీ హాజీఖాన్ ‘చిభ దేశం’ చేరాడని శ్రీవరుడు వ్రాశాడు. కానీ పర్షియన్ చరిత్ర రచయితలు హీర్‍పూర్‌లో తల దాచుకుని అటు నుండి ‘భీమవర్’ చేరాడని రాశారు. ఫరిష్తా మరో రకంగా రాశాడు. హాజీఖాన్ తన అనుచరులతో ‘నీర్ నగరం’ పారిపోయాడని రాశాడు. ‘తవక్కత్ అక్బరీ’ ప్రకారం హాజీఖాన్ ‘వనీర్’ లేదా ‘నీర్’ నగరంలో తలదాచుకున్నాడు. కేంబ్రిడ్జ్ వారు రాసిన చరిత్ర పుస్తకంలో హాజీఖాన్ ‘భీమవర్’ పారిపోయాడు.

శ్రీవరుడు జరుగుతున్న చరిత్రకు ప్రత్యక్ష సాక్షి. సంఘటనలు జరిగిన కొద్ది కాలం తరువాత ఆయన రాజతరంగిణి రచించాడు. పర్షియన్ చరిత్ర రచయితలు, ఫరిష్తా వంటి వారు తరువాత ఎంతో కాలం తరువాత తమ రచనలు చేశారు. కానీ ఆంగ్ల చరిత్ర రచయితలు, ప్రత్యక్ష సాక్షి అయిన శ్రీవరుడి రచనను కాదని, పర్షియన్ రచయితలకు ప్రాధానం ఇచ్చారు. వారు రాసిన దాన్ని సవ్యంగా భావించారు. జారతీయులకు చారిత్రక సృహ, చైతన్యం వంటివేవీ లేవన్న అభిప్రాయాన్ని, ప్రత్యక్ష సాక్షి కథనాన్ని త్రోసిరాజని నిరూపించారు.

ఖిన్నానాశ్వాసయన్ కాంశ్చిత్ సంభిన్నాన్ ప్రతిపాలయన్।
భక్షయన్ క్షుధయా క్షీణాన్ నగాగ్రే సోనయన్నిశామ్॥
(శ్రీవర రాజతరంగిణి, 168)

నిరాశతో, బాధతో ఉన్నవారిని ఓదార్చాడు. ధైర్యం చెప్పాడు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించాడు. తనతో వచ్చిన వారిలో ఆ రాత్రి కొండపై గడిపాడు.

మా బాధిష్ట సుతం కశ్చిన్మత్పరో వాతి విహ్వలః।
ఇతి కారుణికో రాజా న్యవర్తత రణాద్ దృతమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 169)

నా పుత్రుడికి ఎవరూ హాని తలపెట్టవద్దు, బాధించవద్దని ఆజ్ఞలు జారీ చేసి రాజు యుద్ధరంగం వదిలాడు.

యుద్ధంలో ఓడిపోయి హాజీఖాన్ పారిపోతున్నాడు. అతడిని ఆదమ్ ఖాన్ వెంబడిస్తున్నాడు. ఆదమ్ ఖాన్ ఎందుకు వెంబడిస్తున్నాడో అందరికీ తెలుసు. హాజీఖాన్ అడ్డు తొలగించుకుంటే ఆదమ్ ఖాన్ సింహాసనాన్ని అధిరోహించేందుకు అడ్డంకులేవీ ఉండవు. ఇది జైనులాబిదీన్‍కూ తెలుసు. అందుకని, ముందే ఆజ్ఞలు జారీ చేశాడు, హాజీఖాన్‌కు ఎవ్వరూ హాని తలపెట్టకూడదని.

హాజీఖాన్‍కు సలహాలిచ్చిన మంత్రులు ఇదే చెప్పారు. హాజీఖాన్‌ను జైనులాబిదీన్ క్షమిస్తాడు. ప్రాణాలు కోల్పోయేది, హాజీఖాన్‍ను నమ్మి అతని తండ్రికి వ్యతిరేకంగా పోరాడినవారు. అదే జరుగుతోంది.

శ్రీవరుడు వ్రాసిన దానికి భిన్నంగా రాశారు పర్షియన్ చరిత్ర రచయితలు. వారు ఆదమ్ ఖాన్‌ను వీరుడిగా నిలపాలని ప్రయత్నించారు. ‘తవాకత్ అక్బరీ’లో, హాజీఖాన్‌ను ఆదమ్ ఖాన్ వెంటాడి పట్టుకుని బందీ చేశాడని, చివరి క్షణంలో సుల్తాన్ ఆజ్ఞలు అందటంతో చంపకుండా వదిలేసాడని ఉంది.

ఫరిష్తా ప్రకారం శూరపురం నుంచి హాజీఖాన్‌ను ఆదమ్ ఖాన్ వెంబడించాడనీ, సుల్తాన్ నుండి ఆజ్ఞలు అందటంతో వెంటబడటం ఆపేశాడు. అయితే, మళ్ళీ మనం శ్రీవరుడి రచననే ప్రామాణికంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజతరంగిణి రాసిన కాలానికి పాత్రధారులు సజీవంగా ఉన్నారు. ఏదైనా పొరపాటు జరిగితే తల శరీరం నుంచి వేరవుతుంది. కాబట్టి శ్రీవరుడినే నమ్మాల్సి ఉంటుంది.

ఆసిష్యే సుఖితః సుతార్సిత భరో బుద్ధియేత్ దత్తా నిజా
రాష్ట్రేశా వరసేవకాః సతురగాః సంవర్ధితా యే మయా।
తేమీ రాజ్య జిహీర్పవః సుతరతా యుద్ధాయ మయ్యాగతా
ధిగ్ మాం యేన నయోజ్ఞతేన ఘృణయానర్థః స్వయం స్వీకృతః॥
(శ్రీవర రాజతరంగిణి, 170)

రాజ్యభారం తన సంతానానికి అప్పగించి తాను ఎలాంటి బరువులు లేకుండా సుఖంగా విశ్రాంతి తీసుకోవచ్చని అనుకున్నాడు. అందుకని పాలనా వ్యవహారాలు కొడుక్కు ఇచ్చాడు. వీరులు, పెద్దలు, బలము బలగము ఉన్న వారిని అతడికి సహాయంగా ఉండేట్టు పంపాడు. తద్వారా తనకు శాంతి లభిస్తుందనుకున్నాడు. కానీ ఎవరిని నమ్మి వారిని తన కొడుక్కు సహాయంగా పంపాడో, వారు తన కొడుకు పక్షం వహించి తనకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమై వచ్చారు. వారందరిపై విచక్షణను మరిచి కరుణ ప్రదర్శించినందుకు తనని తాను తిట్టుకున్నాడు రాజు. తనని తాను నిందించుకున్నాడు.

ఇక్కడ మనకు జైనులాబిదీన్‌పై జాలి కలుగుతుంది. పొరపాటు చేసిన కొడుకును నిందించే బదులు, దోషిగా ఎంచే బదులు – తనని తాను నిందించుకోవటం, నేరం తనపై మోపుకోవటం కనిపిస్తుంది. ఒక సగటు తండ్రి కనిపిస్తాడు. ఆదమ్ ఖాన్, హాజీఖాన్‍ల నడుమ  అధికారం కోసం పోరు జరగకుండా ఉండేందుకు ఇద్దరినీ దూరం ఉంచాలని నిర్ణయించాడు. బలహీనుడయిన ఆదమ్ ఖాన్‌ను తన రక్షణలో ఉంచుకుని, హాజీఖాన్‌ను కశ్మీరు బయటకు పంపించాడు. అతడికి రక్షణగా, సహాయంగా తాను నమ్మిన శక్తిమంతులను అతడి వెంట పంపాడు. కానీ వారందరు వారిపై కరుణ చూపిన తనను సమర్థించకుండా, కొడుకు పక్షం వహించి తనతో యుద్ధానికి రావటం జైనులాబిదీన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. నమ్మకూడని వారిని నమ్మి, వారికి పదవులిచ్చి.. అధికారం కట్టబెట్టినందుకు తనని తాను నేరస్థుడిగా భావిస్తున్నాడు. తానీ పని చేయకపోతే, తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ధైర్యం హాజీఖాన్‍కు వచ్చేది కాదు. వీరందరి అండ లభించేది కాదు. కాబట్టి దోషం అంతా తనదేనని, నేరం తనపై వేసుకుంటున్నాడు జైనులాబిదీన్, సగటు మధ్యతరగతి తండ్రిలా.

ఇత్యాది విమృపన్ రాజా స్వపురం దుఃఖితోగమత్।
విరోధాదాయినో నిన్దన్ సేవకాన్ విధికర్మణా॥
(శ్రీవర రాజతరంగిణి, 171)

ఇలా ఆలోచిస్తూ, తనకు వ్యతిరేకంగా పోరాడిన విరోధులను నిందిస్తూ, దుఃఖితుడై రాజు తన నగరానికి తిరిగి వచ్చాడు.

శ్రీవరుడు జైనులాబిదీన్‌ను అతి సన్నిహితంగా చూశాడు. వారిద్దరి నడుమ రాజు, సేవకుడు అన్న సంబంధం కన్నా – రాజు, ఆంతరంగికుడు అన్న అనుబంధం అధికంగా ఉంది. శ్రీవరుడిని జైనులాబిదీన్ అత్యంత సన్నిహితుడుగా భావించాడు. రాబోయే శ్లోకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. చివరి క్షణం వరకూ జైనులాబిదీన్ వెంట ఉన్నది శ్రీవరుడే. కాబట్టి జైనులాబిదీన్ మనస్సులో జరిగే సంఘర్షణలు, చెలరేగే వేదనలు, ఆశనిరాశలు శ్రీవరుడి కన్నా బాగా తెలిసిన వారు ఇంకొకరు లేరని అనటం అనృతం కాదు.

సంగ్రామ మృతవీరేంద్ర చ్ఛిన్న మస్తక పంక్తిభిః।
ఆనీయ రాజా నగరే ముఖాగారమకారయత్॥
(శ్రీవర రాజతరంగిణి, 172)

ఒకే శ్లోకం అర్థం చేసుకునే వారి దృష్టిని బట్టి అర్థం మారటం అన్నది ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. చరిత్ర రచనలో ఏ ఒక్కరి ఆలోచనలనో, నిర్ణయాలనో ప్రామాణికంగా భావించటం, వారి తీర్మానాలే నిజం అనీ, చరిత్రలో అలాగే జరిగిందనీ తీర్మానించటం ఎంత పొరపాటో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుని, వ్యాఖ్యానించే విధానం స్పష్టం చేస్తుంది.

నగరానికి తిరిగి వచ్చిన రాజు, యుద్ధంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీరులందరి తలలను నగరానికి రప్పించాడు. వారందరి కళేబరాలను ఒకదానిపై ఒకటి పేర్చి మృతవీరుల జ్ఞాపకార్థం ఒక ‘ముఖాగారం’ నిర్మించాడు. ‘ముఖాగారం’ అంటే ‘మీనార్’. అంటే వారి స్మృత్యర్థం వారి తలలను పేర్చి ‘మీనార్’ నిర్మించాడన్న మాట. శ్రీవరుడు సంస్కృత భాషలో పెర్షియన్ పదాలకు సమానార్ధకాలయిన పదాలను సృష్టించి వాడుతున్నాడు. గతంలోనూ, ఫిరంగి వర్ణన సమయంలోనూ శ్రీవరుడు పర్షియన్ పదాలకు సమానమయిన సంస్కృత పదాలను ఏర్పాటుచేశాడు.

పర్షియన్ పదాలకు సరిసమానమైన సంస్కృత పదాలను సృజించి శ్రీవరుడు వాడటం గమనిస్తే, సంస్కృత భాషను సజీవంగా నిలిపించేందుకు, మారుతున్న పరిస్థితులను అనుగుణంగా, ప్రచారంలోకి వస్తున్న నూతన పరభాషా పదాలకు తగిన సంస్కృత పదాలను సృజించి, తన కావ్యం ద్వారా ప్రచారంలోకి  తీసుకు వచ్చి భాషను పరిపుష్టం చేయటం తెలుస్తుంది.  భాష అనే ప్రవాహాన్ని సజీవంగా నిలపాలంటే ఆ ప్రవాహంలోకి నూతన పదాలనే ఉపనదులు కొత్త పదాలనే  నీటిని తెచ్చి కలుపుతుండటం తప్పని సరి. ఏ భాషలో నూతన పదాల సృష్టి లేక, ప్రయోగాల దృష్టి అడుగంటుతుందో; నూతన పదాలు సృష్టిస్తూ, విభాషా పదాలను తనలో మిళితం చేసుకోలేకపోతుందో ఆ భాష ఉనికి ప్రమాదంలో పడుతుంది. భాష అలాంటి ప్రమాదంలో పడకుండా సాహిత్య సృజనకారులు పదాల సృష్టి చేస్తూ, ప్రయోగాలు చేస్తూ, ఇతర భాషల పదాలను స్వీయ భాషా ప్రవాహంలో మిళితం చేస్తూ, సాహిత్య సృజన చేస్తే, ఆ భాష సజీవంగా, శక్తిమంతంగా నిలుస్తుంది. జీవంతో తొణికిసలాడుతుంటుంది. సృజనాత్మక సాహిత్యం ద్వారా సరికొత్త పదాలు ప్రజలను చేరతాయి. వాడుకలోకి వస్తాయి. అలా, భాష పరిపుష్టమవుతుంది.

ఇటీవలే ఓ స్వయంప్రకటిత మేధావి తెలుగు భాషను సాహిత్యం నుంచి రక్షించాలని ప్రకటించి తన అజ్ఞానాన్ని చాటుకున్నాడు. ఏ భాష అయినా సృజనాత్మక సాహిత్యం వల్లనే సజీవంగా నిలుస్తుంది. కాల్పనికేతర రచనలు పాండిత్య ప్రదర్శనలే తప్ప భాషకు ప్రాణం, జీవం సృజనాత్మక సాహిత్యమే. సృజనాత్మక సాహిత్యం ఆధారంగానే విమర్శ, పదాలవాడకం, పదాల అర్ధాలు ఏర్పడతాయి. వ్యాకరణం, శాస్త్రీయ రచనలు కొద్దిమందికే పరిమితం. సృజనాత్మక సాహిత్యం ప్రజల నాల్కలపై నడయాడుతూ భాష సజీవంగా నిలిచేందుకు కారణమవుతుంది. అలాంటి సృజనాత్మక సాహిత్యం నుంచి భాషను రక్షించాలనటం ఆక్సిజన్ నుంచి మనిషిని రక్షించాలనటం లాంటిదే!

సంస్కృతంలో సృజనాత్మక సాహిత్యం కొనసాగినంత కాలం సంస్కృతం సజీవ భాషలా నిలిచింది. సాహిత్య సృజన తగ్గి, భాషా వ్యాకరణాల చర్చ పెరిగి కాల్పనికేతర సాహిత్యం అధికం అయినప్పుడు, భాష సామాన్యుడికి దూరమవుతుంది.  అయితే ఇదంతా తెలియక ఆ  మూర్ఖ మేధావి ‘భాషను సాహిత్యం నుంచి రక్షించాల’ని ఎంతో గొప్పగా ప్రకటించి తనకు భాష గురించి తెలియదని, సాహిత్యం గురించి తెలియదనీ తన అజ్ఞానాన్ని బహిర్గతం చేసుకున్నాడు. ఆ అజ్ఞానాన్ని గొప్ప విజ్ఞాన ప్రదర్శనగా పొగిడి ఆకాశానికేత్తే మూర్ఖ వందిమాగధ భజన బృందం గాళ్ళు ఆ మూర్ఖత్వాన్ని అతి గొప్ప తెలివిగా పొగడి తమ కర్తవ్యం నిర్వహించారు. తామూ మేధావులమేననుకుని సంతృప్తి పడ్డారు.

ఇదంతా చూస్తే, భాషను సాహిత్యం నుంచి కాదు, ఇలాంటి స్వయం ప్రకటిత మూర్ఖ మేధావుల నుంచి, అజ్ఞాన భజన బృందం గాళ్ళ నుంచి రక్షించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అనిపిస్తుంది.

వీరుల తలలను పేర్చి వారి జ్ఞాపకార్థం ఒక ‘ముఖాగారం’, ‘మీనార్’ నిర్మించాడని శ్రీవరుడు చెప్పాడు – పర్షియన్ రచయితలు ఇందుకు పూర్తిగా భిన్నమైన ఆలోచనను ప్రకటించారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here