శ్రీవర తృతీయ రాజతరంగిణి-28

1
14

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

“Haji Khan was put to rout. Most of his troops were killed and the Sultan ordered a column of their heads to be erected, in order to celebrate his victory and to serve the event as a warning for disturbers of public peace.” (History of Muslim Rule in Kashmir by R.K. Parmu).

శ్రీవరుడు శ్లోకంలో ‘సంగ్రామ మృతవీరేంద్ర చ్ఛిన్న మస్తక పంక్తిభిః’ అన్నాడు.

‘సంగ్రామంలో మరణించిన వీరుల తలల పంక్తి’ ఏర్పాటు చేశాడు జైనులాబిదీన్. ‘ముఖాగారం’ నిర్మింప చేశాడు. శ్రీవరుడు చెప్పింది జైనులాబిదీన్ వ్యక్తిత్వం ప్రకారం సరిపోతుంది.

జైనులాబిదీన్‍కు యుద్ధం ఇష్టం లేదు. ఆరంభం నుంచీ ఆయన యుద్ధాన్ని తప్పించాలని ప్రయత్నించాడు. యుద్ధం తప్పనిసరి అయినప్పుడు నిర్ణయాత్మకంగా వ్యవహరించాడు. కానీ మౌలికంగా జైనులాబిదీన్ ఇతర సుల్తాన్‌లకు భిన్నమైనవాడు. తన రాజ్యంలో శిక్షల క్రౌర్యాన్ని తగ్గించినవాడు జైనులాబిదీన్. కాబట్టి, యుద్ధంలో తన తరఫున పోరాడి ఓడిన వీరుల తలలతో, వారి స్మారకార్ధం  ఒక కట్టడాన్ని నిర్మింప చేయటంలో ఆశ్చర్యం లేదు.

“The king caused the heads of the great warriors who had fallen in the battle to be brought, and over them to build a beautiful edifice in the town.” [Kings of Kashmir (The Rajataragini of Srivara) by J.C. Dutt]

శ్రీవరుడు చెప్పిన దానికీ, భారతీయ చరిత్రకారులు చెప్తున్నదానికీ తేడా వస్తోంది. శ్రీవరుడి శ్లోకాన్ని జె.సి. దత్ సరిగ్గా అనువదించాడు. మరణించిన వీరుల తలలపై ‘beautiful edifice’, ‘మీనార్’, ‘ముఖాగారం’ నిర్మించాడు  జైనులాబిదీన్ వీరుల సంస్మరణార్థం. కానీ పర్షియన్ చరిత్ర రచయితలు జైనులాబిదీన్ స్వభావాన్ని మార్చేశారు. ఆయనను ఇతర సుల్తానులతో సమానం చేసేశారు.

పీర్ హసన్ ప్రకారం, బందీలుగావున్న హాజీఖాన్ సైనుకులందరినీ చంపి, వారి తలలపై ఒక మీనార్ నిర్మింపచేశాడు జైనులాబిదీన్.

తవాకత్-ఎ-అక్బరీ ప్రకారం నగరం చేరిన తరువాత సుల్తాన్ ‘ శత్రువుల తలలతో మీనార్ నిర్మించండి’ అని ఆదేశాలు జారీ చేశాడు. బందీలుగా చిక్కిన హాజీఖాన్ సేనలను చంపి వారి తలలపై మీనార్ నిర్మించాడు ఆదమ్ ఖాన్. అంతేకాదు, సుల్తాన్ కు వ్యతిరేకంగా కుట్రలు చేసినవారినీ, వారి సమర్ధకులను, వారి కుటుంబాలనూ తీవ్రంగా హింసించాడు ఆదమ్ ఖాన్. అందువల్ల, హాజీఖాన్ సమర్ధకులందరూ, ఆదమ్ ఖాన్ సమర్ధకులుగా మారిపోయారు.

ఫరిష్తా ప్రకారం- నగరం చేరిన సుల్తాన్ ఆదేశాల ప్రకారం ఒక ఖంబా( మీనార్) నిర్మించారు. ఆ మీనార్ అన్నివైపులా బందీలుగా చిక్కిన హాజీఖాన్ సైనికుల తలలను వ్రేలాడదీశారు.

శ్రీవారుడి ప్రకారం తనవైపు పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీరుల సంస్మరణార్ధం వారి తలలను యుద్ధరంగంనుండి తెప్పించి, వాటిపై ఒక మీనార్ ను నిర్మింపచేశాడు జైనులాబిదీన్.

 కానీ, పర్షియన్ రచయితల  ప్రకారం, తన విజయాన్ని ఘనంగా సంబరాలతో జరుపుకున్నాడు జైనులాబిదీన్. బందీలుగా చిక్కిన  శత్రుసైనికులను  ఊచకోత కోసి, వాళ్ల తలలతో మీనార్ నిర్మింపజేశాడు.

“Zain-ul-Abidin celebrated his victory with a ferocity foreign to his character.” (Cambridge History of India, Volume III, Wolseley Haig).

జరిగిన సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి, సంఘటనలు సంభవించిన కొద్ది సంవత్సరాలలోనే తాను చూసిన విషయాలను రచించిన శ్రీవరుడిని విస్మరించి సంఘటనలు జరిగిన కొన్ని వందల ఏళ్ళ తరువాత రాసినవారినో, సంఘటనలతో సంబంధంలేని వారు రాసినవాటినో ప్రామాణికంగా తీసుకుని కేంబ్రిడ్జ్ చరిత్ర పుస్తకంలోకి  ఎక్కించి ప్రామాణికం చేశాడు హేగ్.   ఇక్కడే భారతదేశ చరిత్ర రచనలో ఉద్దేశపూర్వకంగానే చోటు చేసుకున్న పొరపాట్లు గ్రహించే వీలు చిక్కుతుంది.

శత్రువులను ఊచకోత కోసి, వారి తలల గుట్టలపై జైనులాబిదీన్ స్మారకం నిర్మించాడని పర్షియన్ రచయితలు రాశారు. కానీ, ఆ స్మారకం జైనులాబిదీన్ ఎందుకు నిర్మించాడంటే, భవిష్యత్తులో ఎవ్వరూ తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలన్న ఆలోచనలు చేయకుండా ఉండేందుకు హెచ్చరికగా! అని రాశారు పర్షియన్ చరిత్ర రచయితలు.

సున్నీ ముస్లింలయిన ఓట్టోమాన్ రాజులు, శత్రువుల శవాల గుట్టలు, తలల గుట్టలు ఏర్పాటు చేయటంలో పేరు పొందారు. తైమూర్ సంగతి వేరే చెప్పనవసరం లేదు. సైనికుల తలలతో పాటు, సామాన్యుల తలలను కూడా పేర్చి మరీ గుట్టలు తయారు చేశాడీయన. ఒక నేరం చేసి పట్టుబడ్డవాడిని, మరెవరూ ఆ నేరం చేయకుండా భయం కలిగించేందుకు బహిరంగంగా భయంకరంగా శిక్షించటం ఆనవాయితీయే!

సుల్తానుల కుటుంబాలలో, స్వంత సోదరులనే ఘోరంగా శిక్షించటం, వారిని అతి భయంకరంగా శిక్షించి ఊరేగించటం వంటి చర్యలు సాధారణం. ఇందువల్ల ఆయా వ్యక్తుల అనుచరులు, సమర్థకులు ఎవరైనా ఉంటే వారికి ఎలాంటి పిచ్చి  ఆలోచనలు  చేయకూడదన్న సందేశం అందుతుంది. స్వంత సోదరుడినే వదలలేదు, ఇక మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అని అర్థం అవుతుంది.

కాని ఇలాంటి సుల్తానులకు జైనులాబిదీన్ భిన్నం అన్నది ఆరంభం నుంచి తెలుస్తూనే ఉంది. నేరస్థులకు సైతం శిక్షల తీవ్రతను తగ్గించాడు. ఇస్లామీయుడై కూడా అన్య మతస్థులను గౌరవించాడు. వారికి రక్షణ నివ్వటమే కాదు, కీలకమైన పదవులు అప్పచెప్పాడు. వారి పవిత్ర స్థలాలను నిర్మింప చేశాడు. వారి పండుగలు, సంబరాలతో తానూ పాల్గొన్నాడు. వారి మందిరాలలో, వారితో ప్రార్థనలు చేశాడు. తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కొడుకుతో యుద్ధం చేస్తూ కూడా, కొడుకుకి ఎలాంటి హానీ తలపెట్టవద్దని ఆజ్ఞలు జారీ చేశాడు. అలాంటి సుల్తాన్ ఓడిపోయిన శత్రువులను, అదీ బందీలుగా వున్న వారిని,  ఊచకోత కోసి, ఇతరులకు హెచ్చరికగా వారి తలల గుట్టపై కట్టడం నిర్మింప చేయటం అసంభవం, అనూహ్యం, అనౌచిత్యం!

కానీ పర్షియన్ చరిత్ర రచయితలు జైనులాబిదీన్ ఇలా ప్రవర్తించటం అనౌచిత్యమనీ, అప్పటికే ఆయనను కాఫిర్‍లను ప్రేమించేవాడనీ, అవకాశం లభించినప్పుడల్లా దూషించారు. అందుకే అచ్చు ‘కాఫిర్’లా ఉన్న ఆయన ప్రవర్తనను తమ స్థాయికి తగ్గట్టుగా మార్చి ప్రదర్శించారు. కేంబ్రిడ్జ్ చరిత్ర పుస్తకం రాస్తున్న హేగ్ కూడా ఈ విషయం గ్రహించాడు. అందుకే ప్రత్యక్ష సాక్షి అయిన శ్రీవరుడి ఔచితీవంతమైన సత్యాన్ని వదిలి పర్షియన్ రచయితలు చెప్పినదాన్ని సత్యంగా భావించి ప్రామాణికంగా నిలిపాడు కానీ, ‘a ferocity foreign to his character’ అని మాత్రం అన్నాడు. భవిష్యత్తులో ఎవరైనా శ్రీవరుడు రాసింది చూపించి, ప్రత్యక్ష సాక్షి కథనం వదిలి, ‘ఎన్నో ఏళ్ల తరువాత వారు రాసింది నమ్ముతావా?’ అని అడిగితే, ‘అరెరె.. నాకూ అనుమానం వచ్చింది. కానీ, ఎదురుగా ఉన్న సత్యాన్ని కాదనెదెవరూ’ అని తప్పించుకునే అవకాశం ఇస్తుందీ ‘a ferocity foreign to his character’ అన్న వాక్యం. ఇదీ విదేశీ రచయితలు మన చరిత్రను రచించిన విధానం. ఇలాంటి చిన్న చిన్న విషయాలలోనూ  వారు భారతీయ చరిత్ర రచయితల రచనలను విస్మరించి, చిన్న చూపు చూసి భారతదేశంలోకి చొరబడిన విదేశీ రచయితల రచనలనూ, అభిప్రాయాలను, దృక్కోణాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. అలా వారు రచించిన చరిత్రను  సత్యంగా భావించి, ప్రామాణికమని నమ్మి మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నామన్న సత్యాన్ని విస్మరించి అసత్యపు దారుల్లో ఆనందంగా విహరిస్తున్నాం.

ఇత్థం సేవకపైశున్యాత్ పితాపుత్ర విరోధతః।
సమరే తత్ర తద్వర్షే వీరలోకక్షయో భవత్॥
(శ్రీవర రాజతరంగిణి, 173)

ఈ రకంగా, దుష్టుల వల్ల జరిగిన తండ్రీకొడుకుల యుద్ధం వల్ల వీరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంవత్సరం అనేక వీరులు ప్రాణాలు కోల్పోవటంతో వారి సంఖ్య తగ్గిపోయింది.

రాజ్యస్థితి ప్రవికసన్నలినీహిమౌధో
లోకక్షయోచిత మహాభయ ధూమకేతుః।
విఘ్నప్రసక్త ఖల ధూమాంశాంధకారః
శాపః సుఖస్య నృపతే స్వజనైవిరోధః॥
(శ్రీవర రాజతరంగిణి, 174)

తన వారి నడుమ సంఘర్షణలు రాజు ఆనందాన్ని, సుఖశాంతులను దెబ్బతీస్తాయి. బాగా విరిసిన కమలాలకు మంచు కురిస్తే ఎలా నష్టమో, అలాగే రాజుకు బంధువులు నడుమ పోరు శాంతిని భగ్నం చేస్తుంది. ఎలాగయితే రాజ్యానికి తోకచుక్క నష్టదాయకమో, అలా బంధువుల నడుమ వైరాలు రాజు శాంతిని నష్టపరుస్తాయి.

ఇతి పండిత శ్రీవర విరచిత రాజతరంగిణ్యాం
మల్లశిలా యుద్ధవరనం నామ
ప్రథమ సర్గః॥

దీంతో శ్రీవరుడు రచించిన ‘మల్లశిలా యుద్ధ వర్ణన’మనే ఈ ప్రథమ అధ్యాయం పూర్తవుతుంది.

ఇక్కడితో శ్రీవరుడు రచించిన రాజతరంగిణిలో ప్రథమ అధ్యాయం పూర్తవుతుంది. అయితే, కొన్ని ప్రతులలో దీని తరువాత మరొక శ్లోకం ఉంది.

శ్రీ మానసింహా నృపతె తవ నామ వర్ణా
పంచేషు పంచ విశి ఖన్తి నితంబినీపు।
ప్రాణాన్తి బంధ్రుపు విరోధిపు పాండవన్తి
దేవ దుర్మంత కృ పండిత మండలేషు॥

ఓ శ్రీ మాన్‌సింహ రాజా! నీ పేరు లోని అక్షరాలు వామదేవుడి పంచబాణాల లాంటివి, శత్రువులకు పంచ పాండవుల లాంటివి, మిత్రులకు అవసరమైన అగ్నులు, పండితులకు పంచ దేవద్రుమాల  లాంటివి.

ఈ శ్లోకాన్ని శ్రీవరుడు రాయలేదని, రాజతరంగిణిని కాపీ చేసినవారు జోడించినదిగా భావిస్తున్నారు. ఈ శ్లోకంలోని మానసింహ రాజు, బహుశా రాజతరంగిణి కాపీని తయారుచేయించిన వాడని అనుకుంటున్నారు.

దీంతో శ్రీవరుడు రచించిన తృతీయ రాజతరంగిణిలో మొదటి అధ్యాయం పూర్తవుతుంది. రెండో అధ్యాయం వచ్చే వారం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here