శ్రీవర తృతీయ రాజతరంగిణి-38

2
33

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తృతీయ సర్గ

తదా మాడవరాజ్యస్యా విశోకా శోకదా నదీ।
ప్రదక్షిణేచ్ఛయేవాన్తర్వివేశ విజయేశ్వరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 13)

ఆ సమయంలో మాడవ రాజ్యానికి శోకప్రదమైన నదిలా భావించే విశోక నది ప్రదక్షిణాలు చేయాలన్న కోరికతో ఉన్నట్టు విజయేశ్వరంలోకి ప్రవేశించింది.

‘నీలమత పురాణం’ ప్రకారం విశోక నది లక్ష్మీస్వరూపం. ఇది కౌండిన్య, క్షీరనది, వితస్తలతో సంగమిస్తుంది. పీర్ పంజాల్ పర్యత శ్రేణులకు ఉత్తరాన ఉన్న ‘బనిహాల్’ వద్ద పరుగులు తీస్తూ ప్రవహిస్తుందీ నది. సౌబంధన్ క్రింద ఉన్న క్రమ సరస్సు కౌసర్‌నాగ్ ప్రదేశాన్ని ఈ నది ఆరంభ స్థలంగా పరిగణిస్తారు. పర్వతాల నుండి క్రిందకు దిగగానే పలు నదులు దీన్లో కలుస్తాయి. పూర్వ కరాల్, దేవసరస్ ప్రాంతాలలో ఈ నదీప్రవాహం వల్ల పంటలు పండుతాయి. విశోక అంటే శోకం లేనిది. కానీ ఈ నదిని శోకానికి కారణంగా భావిస్తారని చెప్పటం ఓ చమత్కారం.

విజయేశ్వరం, శారదాపీఠంతో సమాన స్థాయి, పవిత్రత, ఆదరణలు పొందిన మందిరం. కానీ సికందర్ బుత్‍షికన్ కాలంలో ఈ మందిరం ధ్వంసం అయింది. అయినా సరే, విజయేశ్వరానికి ప్రదక్షిణం చేయాలన్న కోరికతో విశోక నది విజయేశ్వరంలో ప్రవేశించింది అంటున్నాడు, శ్రీవరుడు. అంటే, నాశనమైనా, విజయేశ్వరం ప్రఖ్యాతి కానీ, ప్రతిష్ఠ కానీ, ఆదరణ కానీ శ్రీవరుడి కాలానికి ఏ మాత్రం తగ్గలేదన్న మాట. అదీగాక, విధ్వంసానికి గురైనా ఆ ప్రాంతాన్ని ఇంకా పవిత్రంగా భావిస్తున్నారన్న మాట. విశోక నది విజయేశ్వర ప్రదక్షిణ కోసం విజయేశ్వరంలోకి ప్రవేశించటం ఒక రకంగా చూస్తే, ధ్వంమైన ఆలయాన్ని శ్రీవరుడు తలచుకుంటూనే ఉన్నాడన్న ఆలోచన వస్తుంది. ధ్వంసమైన ఆలయాలు తమ ఓటమికి, చేతకానితనానికి, న్యూనతా భావానికి నిదర్శనంగా భావిస్తున్నట్టు తోస్తుంది. బహుశా, ఆ కాలంలో ఆలయం ధ్వంసమైనా ఆ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తూనే ఉన్నట్టున్నారు కశ్మీరీయులు. కశ్మీరీయులే కాదు, భారతదేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ఇలా ధ్వంసమయిన గుడుల జ్ఞాపకాలను తాజాగా వుంచుకోవటం, ఆ గుడులను పునరుధ్ధరించాలని ప్రయత్నించటం కనిపిస్తుంది. అనేక ప్రాంతాలలో పలు కారణాలవల్ల ఈ ప్రయత్నాలు విస్మృతిలో పడ్డాయి. ఇంకొన్ని ప్రాంతాలలో, ఈ జ్ఞాపకాలు ఆచారాలు, సాంప్రదాయాల రూపంలో వున్నాయి కానీ, ఆ ఆచారాలు ఏర్పడటం వెనుక వున్న చారిత్ర మరుగునపడింది. ఎందుకు పాటిస్తున్నారో తెలియకుండా వాటిని పాటిస్తున్నారిప్పటికీ. ఉదాహరణకు, రాజమహేంద్రవరంలో ఒక కుటుంబంలో పెళ్ళి సంబరాలలో భాగంగా గుర్రం మీద ఊరేగుతూ, కత్తి తిప్పుతూ ఓ మసీదువరకూ వెళ్ళి వెనక్కివస్తారు. దీని వెనుక వున్న కథ ఏమిటంటే, ఒకప్పుడీ కుటుంబం ఆధ్వర్యంలో వున్న మందిరాన్ని ధ్వంసంచేసి ఆ స్థానంలో మసీదు నిర్మించారు. ఆ సమయంలో ఆ కుటుంబం వారు, ఏనాడయినా ఆ మసీదు స్థానంలో గుడిని పునరుధ్ధరిస్తామని ప్రతిజ్ఞ పట్టారు. అప్పుడేర్పడిందీ ఆచారం. తరాలు మారుతున్నకొద్దీ అసలు విషయం మరుగునపడి, మసీదువద్దకు కత్తి తిప్పుకుంటూ ఊరేగింపుగా వెళ్ళటం మిగిలివుంది. ఇలాంటి గాథలు ఎన్నోవున్నాయి దేశవ్యాప్తంగా!!!

భారతదేశ చరిత్రను గమనిస్తే, సుల్తానుల పాలనాకాలంలో పెర్షియన్ భాషలో రచించిన గ్రంథాలలో కూలగొట్టిన మందిరాలతో పాటూ, పునర్నిర్మించిన మందిరాలను మళ్ళీ మళ్ళీ కూలగొట్టిన వివరాలూ కనిపిస్తాయి. మందిరాలను ఎన్నిసార్లు కూలగొడితే అన్నిసార్లు పునర్నిర్మాణాలు సాగిన సంఘటనలూ లభిస్తాయి. కూలిన మందిరాల స్థానంలో మసీదులు వెలిసిన తరువాతనే పునర్నిర్మాణాల ప్రయత్నాలు ఆగేవి. కుబేర్నాథ్  సుకుల్ రచించిన వారణాసి వైభవ్ పుస్తకంలో ఒక అధ్యాయం మొత్తం వారణాసిలో పలుమార్లు ధ్వంసమయి, పునర్నిర్మాణమయి, మళ్ళీ ధ్వంసమయిన మందిరాలు, ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి మారిన మందిరాలు, తీర్థాల  గురించివుంది. సుకుల్ ప్రకారం  12 నుండి  17వ శతాబ్దాల నడుమ వారణాసిలోని ప్రధానమందిరాలన్నీ అయిదుమార్లు ధ్వంసమయ్యాయి. పునర్నిర్మాణమయ్యాయి.  ఒక్కవారణాసి చరిత్ర ఇది. దేశమంతా ఇంతకన్నా తీవ్రస్థాయిలో విధ్వంసం పునర్నిర్మాణాలు సాగాయి. దీన్నిబట్టి చూస్తే, సికందర్ బుత్ షికన్ నాశనం చేసిన విజయేశ్వర మందిరాన్ని శ్రీవరుడు పవిత్రంగా భావించి, ఆ గుడికి ప్రదక్షిణలు చేసేందుకు వరదనీరు ఆ ప్రాంతంలో ప్రవేశించిందని అనటం సమంజసమే కాదు, మందిరాన్ని పునర్నిర్మించి ఆ స్థలం పవిత్రతను పునరుద్ధరించాలన్న ఆకాంక్ష అతని మనసులో వుందని ఊహించటం అనౌచిత్యం కాదని అనిపిస్తుంది.

స్నానాత్ పాపహరీ పూర్వప్రవాహోపగతా నదీ।
ఇతీవ తజ్జలే తూర్ణం మమజ్జుర్గ్రుహపంక్తయః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 14)

తమ పాపాలను ప్రక్షాళణ  చేసుకునేందుకు విశోక నదిలో స్నానమాడాలని దూకినట్టు అనేక ఇళ్ళు నదిలో మునిగాయి.

నదీస్నానం పవిత్రం. పాపాలు ప్రక్షాళన అవుతాయి. అందుకని విజయేశ్వరం లోని ఇళ్ళు తమ పాపాలను కడిగి వేసుకోవటానికి తమ దగ్గరకు వస్తున్న విశోక నదిలో మునకలు వేశాయట. భారతదేశంలో కర్మ సిద్ధాంతం అణువణువునా విస్తరించింది. తమకు ఏదైనా చెడు జరిగితే ‘ఎందుకిలా?’ అనే ప్రశ్న కన్నా, ముందు ‘పూర్వజన్మలో ఏదో పాపం చేశాను, అందుకే నాకు ఇలాంటి కష్టం వచ్చింది’ అనుకుంటాం. ‘ఏం పాపం చేశానో’ అంటూ బాధపడతాం. ‘విజయేశ్వరం’ ధ్వంసం అయింది. అంటేనే, ఏదో పాపఫలితాన్ని ఆ ప్రాంతం ప్రజలు అనుభవిస్తున్నట్టు. అందుకే పాప ప్రక్షాళన కోసం నదిలో మునకలు వేసినట్టు అక్కడి ఇళ్ళు విశోక నదిలో దూకుతున్నాయనటం ఔచితీమంతం. ఆ కాలంలో ఆలయాల విధ్వంసం పట్ల పైకి ఆవేశాన్ని, నిరసనను ప్రదర్శించకున్నా, వారి మనస్సులలో ఒదిగి ఉన్న ఆవేదన, ఆక్రోశాలను అంతర్లీనంగా ప్రదర్శిస్తుందీ వర్ణన. కవి కాబట్టి ఏదో వర్ణించాడని అనుకునే వీలు లేదు. వర్ణనల వెనుక అనుభూతులుంటాయి. ఆకాంక్షలుంటాయి.  అనుభవాల తాలూకు ఆలోచనలుంటాయి.

పురాణేషు ప్రసిద్ధా యా విశోకా శోకనాశనీ।
తదాభూద్ విపరీతార్థా ప్రజాభాగ్యవిపర్యాయాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 15)

పురాణాలలో విశోక నదిని శోకనాశినిగా వర్ణించారు. కానీ ప్రజల దౌర్భాగ్యం వల్ల విశోక నది తన పేరుకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది.

విశోక నది లక్ష్మీస్వరూపం. లక్ష్మి దుఃఖాన్నివ్వదు. సుఖసంతోషాలనిస్తుంది. కానీ లక్ష్మి తన స్వభావానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దారిద్య్ర్యం, దుఃఖాలు వ్యక్తిని వెన్నంటుతాయి. ఒకప్పటి పురాణాలు ఇప్పుడు వ్యతిరేకంగా ధ్వనిస్తున్నాయన్న శ్లేష అంతర్లీనంగా కనిపిస్తుందీ శ్లోకంలో. పురాణాలు ప్రాభవాన్ని కోల్పోతున్నాయన్న సూచన కూడా కనిపిస్తుంది.

యేభ్య ప్రతిష్ఠా ప్రాప్తా తాన్ దుఃస్థాన్ ద్రష్టుమసాంప్రతమ్।
ఇతీవ తోయే తత్కాలం మమజ్జుర్నగరే గృహాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 16)

తమను నిర్మించి, ప్రతిష్ఠను ఇచ్చిన వారి దుఃఖాన్ని చూడటం భరించలేక కాబోలు, భవంతులు స్వయంగా జలాలలో నిమజ్జనమయి పోతున్నాయి.

నదీ ప్రవాహా వేగానికి కూలిపోయి నదిలో కలిసిపోతున్న భవంతులు, తమ యజమానుల దుఃఖాన్ని చూడలేక స్వచ్ఛందంగా నది ప్రవాహంలో కలసిపోతున్నట్టున్నాయట.

నదీ ప్రవాహంలో కూలిపోయే భవంతులను చూస్తే అని స్వచ్ఛందంగా కూలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని వివరిస్తున్నాడు శ్రీవరుడు.

శిలాదారూమయీ మగ్నస్తామ్మీభూత చతుర్గ్రుహా।
చతుష్పాదివ ధర్మో యా లోకోత్తరణాకృద్ బభౌ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 17)

శిలలతో, దారువులతో నాలుగు స్తంభాలు నిర్మించాడు జైనులాబిదీన్. రాజును కలిసేందుకు ప్రజలు ఈ స్తంభాల ఆధారంతో నిర్మించిన వంతెనను దాటి వచ్చేవారు. ఇదెలాగంటే, ప్రజలు చతుష్పాద ధర్మాలను పాటించటం వల్ల నరకం దాటగలుగుతారో, అలాగ ప్రజలు ఈ వంతెన ద్వారా రాజును కలవగలిగేవారు.

‘చతుష్పాద ధర్మ’ అంటే, చర్య, క్రియ, యోగ, జ్ఞానాలు. ఈ నాలుగు దశల ద్వారా వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. ‘చర్య’ అంటే వ్యక్తిత్వం, క్రమశిక్షణ.

తారదాగ్రామ పంక్త్యాశ్చ దర్శనాయ విశాంపతేః।
యాత్రాగతస్య రామస్య సేతుబంధ ఇవాభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 18)

తరదా (దారదా) గ్రామాన్ని దర్శించేందుకు వచ్చిన రాజుకు – రాముడికి సేతువులా ఇది ఉపయోగపడింది.

వితస్తాయాం కృతా జైనకదలిః సా గృహోజ్జ్వలా।
జలవేశాత్ తటే మగ్నా భగ్నాద్ యా నగరాన్తరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 19)

వితస్త నదిపై నిర్మించిన జైన్ కదల్ ఒడ్డున ఉన్న గృహాలు, జలప్రవేశం వల్ల నాశనం అయ్యాయి.

ఒకప్పుడు శోభాయమానంగా ఉన్న గృహాలు, ఇప్పుడు వరద నీటి వల్ల నాశనం అయ్యాయన్న మాట.

శ్రీవరుడు వరదల వల్ల జరగుతున్న వినాశనాన్ని – నీరు ఒక్కక్క మెట్టు పైకి ఎక్కుతున్నట్లు – ఒకటొక్కటిగా వర్ణిస్తూ వస్తున్నాడు..

‘జైన్ కదల్’ అన్నది వితస్త నదిపై జైనులాబిదీన్ నిర్మించిన ఏడు వంతెనలో నాలుగవది.

ఆ కాలంలో ఈ వంతెన ‘నాలుగవ వంతెన’గా ప్రసిద్ధి పొందింది. పూర్వకాలంలో జయాపీడుడు, నిర్మించిన వంతెన స్థానంలో జైనులాబిదీన్ ఈ వంతెనను నిర్మింపచేశాడు.

పాదద్వయావశేపాపి స్థాపితాగ్రే భవిష్యతామ్।
పాదద్వయం పూరయితుం సమాస్యేవ మహీభుజామ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 20)

నాలుగు పాదాలుండాల్సిన వంతెన రెండు పాదాలు నాశనమయ్యాయి. దాంతో భవిష్యత్తులో రాజులయ్యే వారు పూరించాల్సిన సమస్యలా రెండు పాదాలు మాత్రమే ఉన్నాయి.

క్రమరాజ్యే తదా కుర్వన్ కల్లోలైరాకులం జనమ్।
మహా పద్మసరో వేగాదగాద్ దుర్గ పూరాంతరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 21)

క్రమ రాజ్యంలో ఉన్న సరస్సులు, నదులు ప్రజల జీవితాలలో అల్లకల్లోలం సృష్టించాయి. మహా పద్మసర్ నీళ్ళు వేగంగా దుర్గపురంలోకి ప్రవేశించాయి.

మహా పద్మసర్ ను కొందరు ‘మహాన్ ప్రసార్’గా భావిస్తున్నారు. ఏది ఏమైనా నగరంలోకి నీరు ప్రవేశించిందన్న దానిలో ఎలాంటి వివాదం లేదు. ‘దుర్గాపురం’ ప్రస్తుతం ‘ఉల్లూరు’ సరస్స ఒడ్డున ఉంది.

అన్యః సరోవరః కోపి పద్మనాగ సరోన్తికమ్।
ప్రీత్యా కిమోగతో దూరాద్ యం దృష్ట్వా విశశంకిరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 22)

ఇతర సరోవరాలు పద్మనాగ సరోవరాన్ని దర్శించేందుకు వచ్చాయా అన్న భ్రమ కలుగుతోంది. నీట మునిగిన నగరాన్ని దూరం నుంచి చూస్తుంటే, ఎటు చూసినా  నీరే  కనిపిస్తోంది. అంటే ఒక సరస్సు, ఇతర సరస్సులు కలసి మొత్తం భూమి అంతా నీరే అయి కనిపిస్తోందన్న మాట. ఇలా అంతా నీరు కనిపిస్తుంటే, ఎలా అనిపిస్తోందంటే, ఒక సరోవరంను కలిసిందుకు అనేక ఇతర సరోవరాలు వచ్చినట్టు.

స్వయముత్పాటయత్యస్మాన్ వృక్షవత్ సహాసాగతః।
ఇతీవ తత్ర వేశ్మాని చిక్షిపుః స్వం జలాంతరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 23)

నగరంలోని కట్టడాలన్నీ, ఎలాగో ఈ నీళ్లు వృక్షాలను వ్రేళ్ళతో సహా పెకిలించినట్టు తమని కూడా పునాదుల నుండి పెకిలించి వేస్తాయని భావించి తమని తాము నదిలో పారేసుకున్నాయి. అంటే, నదితో పాటు అవి కూడా వృక్షాల్లా కొట్టుకుపోయాయన్న మాట.

దూరే సముద్రో మద్ భర్తా కోయం మే సముపాగతః।
ఇత్థం వితస్తా త్రస్తేవ ప్రతీపమగమత్ తదా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 24)

తన భర్త సముద్రుడు ఎంతో దూరంలో ఉన్నాడు. ఈలోగా తనని ముంచేయటానికి వస్తున్న జలాలను చూసి, ‘వీళ్ళెవరు?’ అని భయంతో వితస్త నది వ్యతిరేక దిశలో ప్రవహించసాగింది.

చక్కటి ఊహాత్మక వర్ణన ఇది.

నది నీరు సముద్రంలో కలవటం ప్రాకృతికం. నది సముద్ర సంగమాన్ని కవులు తమ తమ సంస్కారాన్ని, సృజనాత్మకతలను బట్టి ఊహించారు, కథలు అల్లారు.

నది భర్త సముద్రం అంటున్నాడు శ్రీవరుడు. కిన్నెరసానిని సముద్రుడు మోహించినట్టు విశ్వనాథ ఊహించాడు. పురాణాలు, ధర్మశాస్త్రాలు సందర్భాన్ని బట్టి, తాము చెప్పాలనుకుంటున్న అంశాన్ని బట్టి నదీ సముద్రాల నడుమ సంబంధాన్ని చిత్రిస్తాయి. నదీ ప్రవాహాన్ని మానవ జీవిత ప్రయాణంతో పోల్చి, సముద్ర సంగమాన్ని ‘మోక్షం’ తో పరమాత్మతో లయమవటంతో పోలుస్తాయి ఆధ్యాత్మిక శాస్త్రాలు.

తన భర్త సముద్రం ఎంతో దూరంలో ఉండగా తనతో సమాగమానికి ఉరుకులు పరుగుల మీద వస్తున్న సరస్సుల జలాలను చూసి వితస్త వాటికి దూరంగా వ్యతిరేక దిశలో ప్రవహిస్తోందట!

సీమోజ్ఝితా చలన్మార్గా పక్తాంతం కలాంకితా।
స్థితిః కళియుగస్యేవ భూరభూజ్జలపూరితా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 25)

సరిహద్దులు లేవు, దారుల గుర్తులు లేవు. ఎలాంటి చిహ్నాలు లేక ఎటు చూసినా నీరు తప్ప  మరేమీ కనబడటం లేదు. అయితే, బురద, ఇతర మలినాలతో నిండి – అనేక అవమానాలు, భయాలతో నిండి కళంకిత అయిన నీరు – కలియుగాన్ని తలపుకు తెస్తోంది.

కలియుగం నీతిరహితం, మర్యాదరహితం. కలియుగం అంధకార పూరితం. నిరాశాజనకం. కలియుగంలో నాస్తిక సంప్రదాయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. కర్తవ్య నిర్వహణ, బాధ్యతలను లెక్క చేయరు. శారీరిక, మానసిక, నైతిక శక్తులు పతనమవుతాయి. అన్నింటినీ ముంచెత్తి, ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఆ నీటిలోని మలినాలు, మలినమైన కలియుగాన్ని తలుపుకు తెస్తోంది.

నర్మగర్భితమైన శ్రీవరుడి వర్ణనలు భూత, భవిష్యత్, వర్తమానాలను ఒకే శ్లోకంలో దర్శింప చేస్తున్నాయి. ఇటువంటి వర్ణనలు, శ్రీవరుడు తన రాజతరంగిణిని జైనులాబిదీన్ మరణం తరువాత రాశాడన్న ఆలోచనను బలపరుస్తాయి. జైనులాబిదీన్ మరణం తరువాత కశ్మీరు స్థితికి, ఇప్పుడు శ్రీవరుడు చేసిన వర్ణన సరిపోతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here