[box type=’note’ fontsize=’16’] అనేక ప్రత్యేకతలు ఉండబట్టే దేవుడు రమజాన్ నెలను బహుళప్రయోజనకారిగా తీర్చిదిద్దాడని, మానవుల ఇహ పర ప్రయోజనాలకు, సాఫల్యానికి ఇతోధికంగా దోహదపడే నెల ఇదని వివరిస్తున్నారు ఎం.డి. ఉస్మాన్ ఖాన్ ‘శుభాల సీజన్ రమజాన్‘ అనే ఈ రచనలో. [/box]
[dropcap]ప[/dropcap]విత్ర రమజాన్ అత్యంత శుభప్రదమైన నెల. శుభాల సిరులు వర్షించే వరాల వసంతం. మానవుల మానసిక, ఆథ్యాత్మిక వికాసానికి, జీవనసాఫల్యానికి అవసరమైన అనేక విషయాలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఈనెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించింది. ఇది మొత్తం మానవాళికీ మార్గదర్శక జ్యోతి. ఈ నెలలోనే ‘రోజా’ వ్రతం విధిగా నిర్ణయించబడింది. ఈ నెలలోనే వెయ్యినెలల కన్నావిలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్ /షబెఖద్ర్’ ఉంది. ఈ నెలలో చేసే ఒక్కో మంచి పనికి అనేకరెట్లు పుణ్యఫలం లభిస్తుంది. ఒక విధిని ఆచరిస్తే 70 విధులు ఆచరించినదానికి సమానంగా పుణ్యం లభిస్తుంది. విధి కానటువంటి ఒకచిన్నసత్కార్యం చేస్తే, విధిగా చేసే సత్కార్యాలతో సమానమైన పుణ్యఫలం దొరుకుతుంది. సహజంగా ఈ నెలలో అందరూ సత్కార్యాల వైపు అధికంగా మొగ్గు చూపుతారు. దుష్కార్యాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. సమాజంలో ఒక మంచిమార్పు కనబడుతుంది.
ఫిత్రా ఆదేశాలు కూడా ఈ నెలలోనే అవతరించాయి. ‘ఫిత్రా’ అన్నది పేదసాదల హక్కు. దీని వల్ల వారికి కాస్తంత ఊరట లభిస్తుంది. ఎక్కువశాతం మంది జకాత్ కూడా ఈ నెలలోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదసాదల ఆర్థిక అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. తరావీహ్ నమాజులు కూడా ఈ నెలలోనే ఆచరించబడతాయి. అదనపు పుణ్యం మూటకట్టుకోడానికి ఇదొక సువర్ణ అవకాశం. ఈ నెలలో చిత్తశుధ్ధితో రోజా (ఉపవాసదీక్ష) పాటించేవారి గతఅపరాధాలన్నీ మన్నించబడతాయి. ఉపవాసులు ‘రయ్యాన్ ‘ అనే ప్రత్యేక ద్వారం గుండా స్వర్గప్రవేశం చేస్తారు.
రోజా – ప్రాచీన నేపథ్యం
ఈ విధమైన అనేక ప్రత్యేకతలు ఉండబట్టే దేవుడు ఈనెలను బహుళప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. మానవుల ఇహ పర ప్రయోజనాలకు, సాఫల్యానికి ఇతోధికంగా దోహదపడే నెల ఈ రమజాన్ నెల.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి శక్తివంచన లేని కృషి చెయ్యాలి. అలుపెరుగని ప్రయత్నం ఆరంభించాలి.
నిజానికి రోజా వ్రతమన్నది కేవలం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం వారి అనుచర సముదాయానికి మాత్రమే పరిమితమైన ఆరాధన కాదు. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఆరాధన ఇది. దీనికి చాలా ఘనమైన ప్రాచీన, సామాజిక నేపథ్యముంది. అనాదిగా ఇది అన్ని కాలాల్లో, అన్ని సమాజాల్లో చెలామణిలో ఉన్నట్లు దైవగ్రంథం ద్వారా మనకు తెలుస్తోంది. ఖురాన్‌లో ఇలా ఉంది: ‘విశ్వాసులారా! పూర్వప్రవక్తల అనుయాయులపై ఏ విధంగా రోజాలు విధిగా నిర్ణయించబడ్డాయో, అదే విధంగా ఇప్పుడు మీపై కూడా రోజాలు విధిగా నిర్ణయించాము. దీని వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది’. (2-183)
అంటే, ఉపవాసవ్రతం కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే ప్రత్యేకమైనది, పరిమితమైనది కాదని, పూర్వకాలం నుండి విధిగా ఉన్నటువంటి ఆరాధనే అని ఈ ఖురాన్ వాక్యాల ద్వారా మనకు అర్ధమవుతోంది. ఈనాడు కూడా ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లో అన్ని జాతులు, అన్నిమతాలవారిలో ఉపవాసవ్రత సాంప్రదాయాన్ని మనం గమనించవచ్చు. కాకపోతే ఒక నిర్దిష్టమైన, మార్గదర్శక సాంప్రదాయ విధానం లేకపోవచ్చు. మొత్తానికైతే ఆ భావన, ఆచరణ ఏదో ఒకరూపంలోఉందనడంలో సందేహం లేదు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత, నేపథ్యం కలిగిన ఉపవాస వ్రత ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని కూడా దేవుడు చాలా స్పష్టంగా విశదీకరించాడు. మానవ సమాజంలో భయభక్తుల వాతావరణాన్ని, నైతిక, మానవీయ విలువలను, బాధ్యతా భావం, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే ధ్యేయమని సెలవిచ్చాడు. ఒక మనిషి దైవం కోసం, దైవప్రసన్నత కోసం, దైవాదేశాలకనుగుణంగా, ప్రవక్త సాంప్రదాయ విధానం ప్రకారం ఉపవాసం పాటించినట్లయితే తప్పకుండా అతనిలోఈ సుగుణాలు జనించితీరవలసిందే. మనసా, వాచా, కర్మణా త్రికరణ శుధ్ధిగా ఉపవాసాలు ఆచరించేవారిని సత్కార్యాంల ప్రతిరూపం అనవచ్చు. ఇలాంటి వారి అంతరంగంతోపాటు, బాహ్యంలోకూడా పవిత్రాత్మనిత్యం జాగృతమై ఉంటుంది. అనుక్షణం వారు అప్రమత్తంగా ఉంటూ, అన్నిరకాల దోషాలకు అతీతంగా పరిశుధ్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మానవసహజ బలహీనతలవల్ల ఏవైనా చిన్నాచితకా తప్పొప్పులు దొర్లిపోతూనే ఉంటాయి. ఈ లోపాలనుండి ఉపవాసాన్ని రక్షించి పరిశుధ్ధపరచడానికి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఫిత్రాలు చెల్లించమని ఉపదేశించారు. ఫిత్రా చెల్లించనంత వరకు రమజాన్ రోజాలు భూమ్యాకాశాల మధ్య వ్రేలాడుతూ ఉంటాయి. దైవసన్నిధికి చేరవు. కనుక ఫిత్రాల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు.
విలువల పెంపుదలే లక్ష్యం
నిజానికి నమాజ్, రోజా, జకాత్, హజ్ లాంటి ఆరాధనల ద్వారా మనిషి సంపూర్ణ మానవతావాదిగా, మానవరూపంలోని దైవదూతల గుణసంపన్నుడిగా పరివర్తన చెందాలన్నది అసలు ఉద్దేశం. అందుకే దైవం సృష్టిలో ఏ జీవరాశికీ ఇవ్వనటువంటి ప్రత్యేకతను, బుధ్ధికుశలతను, విచక్షణాజ్ఞానాన్ని ఒక్కమానవుడికే ప్రసాదించాడు. అందుకని మనిషి తన స్థాయిని గుర్తించాలి. మానవ సహజ బలహీనతల వల్ల జరిగిన తప్పుల్ని తెలుసుకోవాలి. దైవం ముందు వాటిని ఒప్పుకోవాలి. పశ్చాత్తాపంతో ఆయన వైపుకు మరలాలి. క్షమాపణ కోసం ఆయన్నే వేడుకోవాలి. పవిత్ర రమజానే దీనికి సరైన సమయం, సరైన తరుణం. దైవానికి దగ్గర కావడానికి,ఆయనతో ప్రత్యేక సంబంధం నెలకొల్పుకోడానికి ఇంతకు మించిన సదవకాశం మరొకటి లేదు. ఈ నెలలో ఆచరించబడే ప్రతి ఆచరణా అమూల్యమైనదే. ప్రత్యేకించి రోజా ప్రతిఫలం అనంతం, అనూహ్యం. రోజా ప్రతిఫలాన్ని విశ్వప్రభువు తన అనంతమైన ఖజానాలోంచి స్వయంగా తానే ఇస్తానంటున్నాడు. కాబట్టి అత్యంత భక్తిశ్రధ్ధలతో రోజాలు ఆచరించి పరమ ప్రభువు అల్లాహ్ నుండి నేరుగా ప్రతిఫలం, బహుమానం అందుకోడానికి ప్రయత్నించాలి.
ఈ విధంగా పవిత్ర రమజాన్ ఉపవాసాలు మానవులకు ఇహ, పరాల్లో అనంతమైన మేలును, శుభాన్ని కలగజేస్తాయి. కనుక చిత్తశుధ్ధితో నియమబద్దంగా ఈ నెల ఉపవాసాలు పాటిస్తూ, ఐదు పూటల నమాజుతో పాటు, తరావీహ్ నమాజులు, దానధర్మాలు, గ్రంథపారాయణం తదితర అంశాలపట్ల ప్రత్యేక శ్రధ్ధ కనబరచాలి. ఈనెల్లాళ్ళ శిక్షణ మిగతా పదకొండు నెలలకూ ఉపయోగపడేలా మలచుకోవాలి. చివరిదశలో ఏతికాఫ్, లైలతుల్ ఖద్ర్ జాగరణ పట్ల శ్రధ్ధ వహించాలి. మానవాళి పాలిట శుభాల పంటగా వచ్చినటువంటి ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. దైవం సమస్త జనులకూ, జగత్తుకూ రమజాన్ శుభాలు సమృధ్ధిగా ప్రసాదించాలని మనసారా కోరుకుందాం.