శిక్ష

0
11

[dropcap]జ్యో[/dropcap]తి రోజూ పొద్దున్నే వచ్చి మౌనంగా అంట్లు తోమి, ఇల్లు ఊడ్చి వెళ్ళిపోతోంది. ముఖంలో కళ లేదు. ఇదివరకటి మాటల గల గల ప్రవాహాలు లేవు. పలకరిస్తే సమాధానం చెపుతుంది. అదీ ముక్తసరిగా. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ముద్దాయిలా!

ఒకసారి దొంగగా ముద్ర పడిన వ్యక్తి మారినా సమాజం ఆ మార్పును హర్షించదా! అనుమానంగానే చూస్తుందా! ఈ నాలుగు రోజుల నుంచి నన్ను తొలుస్తూ, ఎక్కడా నిలవనీయకుండా ఏ పని చేస్తున్నా వేధిస్తున్న ప్రశ్న ఇది.

మా గంగ అపార్టుమెంట్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఆరు ఇళ్లలో ఒక దాంట్లో మా అన్న వాళ్ళు, ఇంకో దాంట్లో అక్క వాళ్ళు, మరో దాంట్లో మా ఆడపడుచు వాళ్ళు, ఒక దాంట్లో మేం ఉంటున్నాం. మా పక్కన ఒకటి, ఎదురు రెండు ఉన్నాయి. వెనక వైపు రెండింట్లో వేరే వాళ్ళు వుంటున్నారు. అందరిళ్లలో జ్యోతే పనిచేస్తుంది. పొద్దున్న ఆరింటికి వచ్చి, పదింటి లోపల అందరి పనులు చేసేసి వెళ్ళిపోతుంది. ఒక్క పూటే! సెకండ్ ఫ్లోర్‌లో మధ్యాహ్నం నాలుగింటి నుంచి ఎనిమిది లోపల చేసుకువెళ్ళిపోతుంది. సెలవలు ఎక్కువ పెట్టదు. శుభ్రంగా చేస్తుంది. అందుకే, జ్యోతిని ఎవరూ వదలరు.

అయితే, ఆరు నెలల కిందట ఒకరోజు జ్యోతి మా అక్క వాళ్ళింట్లో హాల్లో షోకేస్‌లో ఉన్న వంద రూపాయల నోటు తీయటం మా అక్క చూసింది.

మా అక్క, “ఏం చేస్తున్నావు నువ్వు? నీ మీద నమ్మకంతో డబ్బులు, విలువైన వస్తువులు ఇంట్లో ఎక్కడపడితే అక్కడ వదిలేస్తున్నాం. నువ్వు దొంగతనం చేస్తున్నావా!” అంటూ అరిచింది. మా అందరినీ పిలిచి పంచాయతీ పెట్టింది. పనిలోంచి తీసేస్తానంది.

జ్యోతి కళ్ళ నీళ్లతో “అమ్మా, తప్పయి పోయింది. ఇంకెప్పుడు చేయను. పిల్లాడికి జ్వరం. మందుల కోసమని తప్పే చేశాను. ఈ తప్పు కాయండమ్మా” అంటూ కాళ్ళా వేళ్ళా పడింది.

తప్పు ఒప్పుకుందిగా. ఇంకోసారి ఇలా జరిగితే మానిపిద్దాం, అని అందరం నచ్చజెప్పాము. జ్యోతి పనిలోకి వస్తోంది. తను ఎప్పుడూ అలా చేయలేదు. అవసరం అలా చేయించి ఉంటుంది. డబ్బు అడిగితే జీతంలో తగ్గించుకుంటారని, అలా చేసి వుంటుందనుకున్నాను. అప్పటి నుంచి ఎటువంటి ఫిర్యాదు లేదు.

నాలుగు రోజుల కిందట అక్క వాళ్ళింట్లోనే బంగారు నెక్లెస్ బీరువాలో నగల పెట్టెలో కనిపించలేదు. వాళ్ళింట్లో బీరువా తలుపుకే తాళం చెవి పెట్టి వుంటుంది. అక్క అంతా వెతికింది. ఇది జ్యోతి పనే అని తీర్మానించింది. ఆ సాయంత్రం జ్యోతి పైకి వెళుతుంటే అక్క పిలిచి గట్టిగా అడిగింది. నేను మా ఒదిన, ఆడపడుచు అక్క గుమ్మం ముందే ఉన్నాం. జ్యోతి తెల్లబోయింది. అక్క పోలీసులని పిలిపిస్తానంది. జ్యోతి “నిజంగా నాకేం తెలీదమ్మా. బీరువా దగ్గరకి నేనెందుకు వెళతాను? మరోసారి బాగా వెతకండమ్మ. ఆ రోజు పిల్లాడి మందుల కోసం తీసాను. అదే మొదటిసారి, చివరి సారి. నన్ను నమ్మండమ్మా” అంటూ ఒట్లు పెట్టింది. ఏడ్చింది. అక్క కరగలేదు. పని లోంచి తీసేసింది. అక్కని చూసి ఒదిన, ఆడపడుచు తీసేసారు. నెమ్మదిగా ఇది తెలిసి, వెనక వాళ్లు పైవాళ్ళు అందరు మానిపించేశారు. జ్యోతిపై దొంగగా శాశ్వత ముద్ర పడిపోయింది. జీవనాధారం పోయింది.

ఈ నగ జ్యోతి తీయలేదని నా గట్టి నమ్మకం. అక్క అడిగిన వెంటనే తెల్లబోయిన జ్యోతి ముఖం చూస్తేనే, తనకేం తెలియదని రూఢీ అయిపొయింది. వంద రూపాయలు తీసినప్పుడు అక్క నా ఎదురుగుండానే తిట్టింది. అప్పుడు తప్పు చేసిన బెరుకు జ్యోతి ముఖంలో కనిపించింది. వెంటనే ఒప్పేసుకుంది కూడా!

జ్యోతి భర్త ఏడాది కిందట లారీ ప్రమాదంలో పోయాడు. ఉన్న ఒక్క పిల్లాణ్ణి మంచి స్కూల్‌లో చదివించాలని సంపాదనంత కొడుకు ఫీజులకి, పుస్తకాలకి ఖర్చు పెడుతోంది. అందరూ మానిపించినా నేను జ్యోతిని మానిపించలేదు. అక్కకి కోపం వచ్చింది. “మా కంటే నీకు జ్యోతే ఎక్కువా? నీ ఇంట్లో కూడా విలువైనదేదైనా పోతే నీకే తెలిసోస్తుందిలే” అంది. నేనేం మాట్లాడలేదు. అన్నయ్య, బావగారు ‘పోలీసుల దాకా వద్దులే’ అంటే ఎలాగో ఊరుకుంది.

ఇది జరిగిన నెళ్ళాళ్ల తరవాత, ఒకరోజు నేను అక్కవాళ్ళింట్లో ఉన్నాను. ఎదురు గుమ్మమే! అక్క బీరువాలో ఒక్కో అర సర్దుతూ మాట్లాడుతోంది. కొత్త చీరలు చూపిస్తోంది. ఒక అరలో నాలుగు వరసలుగా చీరలున్నాయి. ఒకవరస తీసి మంచం మీద పెట్టింది. ఆ కాస్త ఖాళీ వచ్చాక అరలో నిగ నిగ మెరుస్తూ నెక్లెస్! “ఇదేంటి ఇక్కడుంది” అంటూ తీసింది అక్క. అది జ్యోతి దొంగతనానికి గురైన నగ! జ్యోతిని దొంగగా ముద్ర వేసిన నగ! జ్యోతిని నిరాధారను చేసిన నగ! బీరువాలో భద్రంగా ఉంది. అక్క ముఖంలో భావాలు కనిపించనీయకుండా “ఆ రోజు పెళ్ళికి వెళ్లి వచ్చాక, నగల బాక్స్‌లో పెట్టటానికి టైం లేక ఇంట్లో అందరూ ఉంటే, చీరల మధ్యలో పెట్టాను. తరవాత పెట్టాలనుకుని మర్చిపోయానన్న మాట!” అంది. అక్క ముఖం వెలిగిపోతోంది.

“కాని, జ్యోతి చేయని నేరానికి శిక్ష అనుభవిస్తోంది కదా అక్కా, తనని, మీరెవ్వరు పనిలోకి రానివ్వట్లేదు” అన్నాను కోపంగా.

ఒక్కక్షణం అక్క ముఖం మ్లానమైనా వెంటనే, “సుజీ, జ్యోతి నెమ్మదిగా వేరే చోట కుదురుకుంటుందిలే. ఇప్పుడు దొరికిందని తెలిస్తే లోకువైపోతాం. నువ్వు ఎవ్వరితో చెప్పొద్దు. అన్నయ్య వాళ్లతో, మీ ఆడపడుచు వాళ్లతో అనొద్దు. జ్యోతికి అస్సలు తెలియకూడదు” అంటూ నా చేయి పట్టుకుని చాలా ఒట్లు వేయించుకుంది. నన్ను కట్టేసింది. నాకు జ్యోతి నిస్సహాయ స్థితే గుర్తుకు వస్తోంది. అలవాటైన ఈ వీధి వదిలి పిల్లాడితో ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళలేదు. తన ఇల్లు, పిల్లాడి స్కూలు ఇక్కడికి దగ్గర. మారటం అక్క చెప్పినంత తేలిక కాదు తనకి. నేను ఊరుకోదలచుకోలేదు.

“అక్కా, జ్యోతి చాలా మంచి అమ్మాయి. నీ వల్ల తనకి చాలా నష్టం జరిగింది  నీ మాటల ప్రభావం అందరి మీద పడింది. పదకొండు ఇళ్ల పని పోయింది. ఒంటరిగా పిల్లణ్ణి పెంచుకుంటూ, జీవితంతో యుద్ధం చేస్తోంది. ఈ నెలంతా పనిలేదు. జీతం లేదు. ఇల్లు జరగక, ఏం చేయాలో తోచక సతమత మవుతోంది. తనేం చెప్పలేదు. నేను గ్రహించాను. అంతే!

ఇలాంటి పొరపాట్లు ఒక్కోసారి జరుగుతుంటాయి. ఒప్పుకోవటంలో తప్పేం లేదు. రేపు జ్యోతితో మాట్లాడు అక్కా. నగ దొరికిందని చెప్పు. పనిలోకి రమ్మను. నిన్ను చూసి అందరు రానిస్తారు. జ్యోతి గురించి నీకూ తెలుసు. నేరం మోపావని ఏమీ అనదు కూడా.”

చెప్పగా, చెప్పగా, అక్క ఎలాగో ఒప్పుకుని మర్నాడు జ్యోతిని పిలిచింది. క్రమంగా అందరిళ్లలో జ్యోతి పని చేయటం ప్రారంభించింది.

కాని, ముఖంలో మునుపటి నవ్వులు లేవు. మాటలు లేవు. మౌనంగా చేసుకుపోతోంది. బహుశా, ఇలా తిరిగి రావటం కూడా తనకి ఇష్టం లేదేమో! కాని, అవసరం! ఇష్టప్రకారం ఉండనివ్వదు.  చేయని నేరానికి అంత పెద్ద నింద మోపారు. నగ దొరికింది కాబట్టి సరిపోయింది, లేకపోతే, తానే చేసినట్లు శాశ్వతంగా మచ్చ ఉండిపోయేదిగా, జ్యోతి మనసులో ఎడ తెగని ఆలోచనలు!

తనపై పడిన నింద జ్యోతి ఎలా మర్చిపోతుంది? కాలమే, ఆమె మనసుకు తగిలిన గాయాన్ని నయం చేయాలి. అందాకా ఈ శిక్ష తప్పదేమో, అనుకుంటూ వుంటాను నేను మౌన జ్యోతిని చూసినప్పుడల్లా!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here