సింహాద్రి ఆలోచన

0
11

[బాలబాలికల కోసం ‘సింహాద్రి ఆలోచన’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

[dropcap]శిం[/dropcap]గాపురం చిన్న ఊరు. చుట్టూ చెట్లు కొండలు కలసి పోయి ఊరికి కొత్త అందాల్ని తెచ్చి పెడుతున్నాయి. ఊర్లో ఉన్న ఎనిమిది వందల ఇళ్ళలో సింహాద్రి గారిల్లే పెద్దది. ఆయనే ఆ ఊరికి పెద్దదిక్కు. ఊర్లో వారికి ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండి వచ్చిన కష్టాన్ని రూపు మాపడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంటాడు. అందుకే సింహాద్రి గారంటే ఊరి ప్రజలకు ఆయనపై ఎనలేని గౌరవం.

తన పలుకుబడిని ఉపయోగించి ఊర్లో మూడు బావులు, ప్రభుత్వ సహాయంతో ఒక ఉత్తమ బడి భవనాన్ని కట్టించాడు.

ఆయనకున్న ఒకే ఒక బలహీనత వేట! సమయం దొరికినపుడు తుపాకీ తీసుకుని తన నమ్మినబంటు వెంకటయ్యతో పక్కనున్న కొండకోనల్లోకి వెళ్ళి సాయంత్రానికి ఒక అడవి పందినో జింకనో తన జీపులో వేసుకుని వచ్చి తన ఇంటి చుట్టు పక్కలవారికి చూపించి తన వేట ప్రతిభ ప్రదర్శించేవాడు. అలా తెచ్చిన జంతువులకు తన తుపాకీ దెబ్బలు తగిలితే ఆ గాయాలకు తనే మందు వేసి కట్టు కట్టి మరలా అడవిలో వదలి పెట్టి వచ్చేవాడు. సింహాద్రి ఈ విచిత్ర ప్రవర్తనకు ఊరి వాళ్ళు అశ్చర్య పోయేవారు.

ఇదే విషయం ఒకసారి వెంకటయ్య సింహాద్రిని,

“అయ్యా తమరు వేటాడుతున్నారు బాగానే ఉంది మరలా ఆ జీవానికి కట్టుకట్టి అడవిలో వదలడమెందుకు?” అని అడిగాడు.

సింహాద్రి ఒక చిరునవ్వు నవ్వి “వేట నా బలహీనత రా. అడవిలో బతుకుతున్న వాటిని చంపటం ఒక తప్పు అని నాకు తెలుసు. డబ్బు, తుపాకీ ఉన్నాయని నేను విర్రవీగుతున్నానేమో అనే అనుమానం నాలో మొదలయింది. వేటాడకూడదని ఎంత ప్రయత్నించినా ఆగలేక పోతున్నా, జంతువును చంపకుండా దాని కాలు మీదనో తొడ మీదనో కాలుస్తున్నా. దెబ్బతిన్న దాన్ని రక్షించి మరలా అడవిలో వదిలితే ఏదో తృప్తి” సింహాద్రి మాటల్లో దర్పం, జంతువులపట్ల ఏదో తెలియని ప్రేమ వెంకటయ్యకు గోచరించాయి.

ఒకరోజు పొద్దున్నే సింహాద్రి ఇంటి ముందు జనం కోలాహలం వినబడింది. వరండాలో పడుకున్న వెంకటయ్య గబుక్కున లేచి ఆ జన సమూహం వద్దకు వచ్చాడు.

“వెంకటయ్యా, అయ్యగారితో చెప్పు. అడవిలో నుండి ఒక చిరుత పులి ఊర్లోకి వచ్చి రెండు దూడల్ని చంపింది! దాని అయ్యగారే వేటాడి మా జీవాల్ని రక్షించాలి” చెప్పారు అందరూ ముక్త కంఠంతో.

వెంకటయ్యకు సింహాద్రి మాటలు గుర్తుకొచ్చాయి.

“అయ్యగారు వేటాడటం తగ్గించుకోవాలనుకొంటున్నారు. అంటే జంతువులను చంపదలచుకోవడం లేదు. నా మాట విని పట్టణానికి వెళ్ళి పోలీసులకు చెప్పడం మంచిది..” చెబుతున్నాడు వెంకటయ్య.

బయట కోలాహలం విని సింహాద్రి బయటకు వచ్చాడు. జనంలో ఒక పెద్దాయన పులి వ్యవహారం వివరించాడు.

సింహాద్రి ఓ రెండు నిముషాలు ఆలోచించి “సరే ఒక గంటలో అడవి దగ్గరకు వెళ్ళి ఆ పులి ఆట కట్టిస్తాను” అని జనానికి భరోసా ఇచ్చాడు.

సింహాద్రి మాటలు విని వెంకటయ్య ఆశ్చర్య పోయాడు.

చెప్పినట్టే సింహాద్రి, వెంకటయ్య జీపులో తుపాకీ తీసుకుని బయలుదేరారు. సాయంత్రం నాలుగు గంటల వరకు గాలిస్తే చిరుత పులి జాడ కనబడింది. సింహాద్రి మొహంలో బుర్రమీసాల చాటున చిరునవ్వు మెదిలింది. సింహాద్రి చాకచక్యంగా  తుపాకీని గురిపెట్టాల్సిన చోట పెట్టాడు. టప టప మంటూ తుపాకీ పేలింది. చిరుత ఒక పిల్లి లాగ అరచి పడిపోయింది!

సింహాద్రి వెంకటయ్యలు పరుగున వెళ్ళి చిరుతను పరిశీలించారు. చిరుత తొడలో బుల్లెట్ దిగబడి రక్తం ఓడుతూ దాని కళ్ళలో బాధ ప్రస్ఫుటంగా కనబడుతోంది. వెంకటయ్య తన చేతిలో ఉన్న తాడుతో దాని మూతి కట్టేశాడు. ఒడుపుగా చిరుతను తెచ్చి జీపులో పడేసారు. జీపు శింగాపురం చేరింది. సింహాద్రి గారి రాకను ప్రజలు గమనించి గుంపులుగా సింహాద్రి ఇంటికి చేరుకున్నారు. జీపులో చిరుత బాధతో మూలుగుతోంది!

“అయ్యా కర్రలతో కొట్టి చంపుదాం, అది మూలుగుతోంది” గుంఫులోని ఉడుకు రక్తం యువకుడు అడిగాడు.

“వద్దు” అన్నట్టు సింహాద్రి చెయ్యి ఎత్తాడు. జనం ఆశ్చర్యపోయారు.

చల్లని నీరు తాగాక సింహాద్రి ఈ విధంగా చెప్పాడు.

“చిరత క్రూర జంతువు ప్రకృతి ధర్మం ప్రకారం మరొక జంతువును అది చంపి తినాలి. కానీ అడవుల్లోని చెట్లు కొట్టివేసి అడవిలో జంతువులు బతకనీయకుండా మనం చేస్తున్నాం. అందుకే క్రూర జంతువులకు అడవిలో తగినన్ని జంతువులు లేక ఊళ్ళ మీద పడుతున్నాయి అదిగాక సింహం, పులి, చిరుతలను కాపాడకపోతే అవి అంతరించిపోయే ప్రమాదం తద్వారా జీవవైవిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఈమధ్య ఒక ఆచార్యుడు పేపర్లో వ్రాశాడు. వీటిని కాపాడకపోతే కొన్నాళ్ళకు వాటి బొమ్మలు పుస్తకాల్లో చూసుకోవలసి వస్తుంది. అందుకే అడవిలో చెట్లు కొట్టకండి. పోతే ఈ చిరుతను పశువైద్యశాలకు తీసుకవెళ్ళి కట్టు కట్టిచ్చి పట్టణంలోని జూలో వదలి పెడుతాను. దాని ఆరోగ్యం, తిండి జూ వారే చూసుకుంటారు” అని చెప్పాడు సింహాద్రి.

సింహాద్రి మాటలు వారిలో ఆలోచన రేకెత్తించాయి. చప్పట్లు కొట్టి వారు వెళ్ళిపోయారు. బాంకుకు వెళ్ళి తన హామీ మీద పశువులు ఉన్న వారికి కంచె కోసం డబ్బులు ఏర్పాటు చేశాడు.

అందుకే శింగాపురం ప్రజలు సింహాద్రిలో ఒక నిజమైన నాయకుణ్ణి చూస్తూ గౌరవిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here