సిరి ముచ్చట్లు-18

0
9

[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని; యవ్వనప్రాయంలోని జ్ఞాపకాలను గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో 18వ ముచ్చట. [/box]

[dropcap]సి[/dropcap]రి +2 పాసైనందుకూ, అదీ 1st న వచ్చినందుకూ బంధుమిద్రులంతా అభినందించారు. అన్నయ్యలిద్దరికీ అప్పట్లో +2లో II రావడము కూడా సిరిని అందరూ గొప్పగా మెచ్చుకోవడానికి ఒక కారణమైంది. వేసవి సెలవుల్లో కుటుంబ సమేతంగా వచ్చి, కొన్నాళ్ళుండి వెళ్ళే పిన్ని ఈసారి చిన్న కొడుకులను తీసుకొని ముందుగానే వచ్చింది. సిరిని అభినందించింది. చిన్న తమ్ముళ్ళను తన గదిలోకి తీసుకెళ్ళి చందమామ లోని బొమ్మలు చూపుతూ కథలు చెప్పుతున్నది సిరి. హాల్లో కూర్చుని మాట్లాడుకొంటున్నారు పిన్నీ, అమ్మ నానమ్మలు. వాళ్ళందరి మాటలు సిరికి వినబడ్తూనే వున్నాయి.

“అయితే అక్కయ్యా, ఈ వేసవిలో సిరికి పెళ్ళి చేస్తున్నట్లేనా?” అన్నది పిన్ని.

ఆ మాట విని సిరి ఉలిక్కి పడింది.

‘అదేంటే? సిరికి అప్పుడే పెళ్ళా?’ విస్తుపోతూ అడిగింది అమ్మ.

‘అప్పుడే ఏంటక్కయ్యా? ఇంకో రెండు నెల్లయితే సిరికి 16 నిండి 17 ఏళ్ళు రావూ? ఇంకెన్నాళ్ళాగుతారు? మనకంత కన్నా ముందే కాలేదూ?’ అన్నది పిన్ని.

“అవుననుకో. కానీ సిరిని ఇంకా చదివించాలనుకొంటున్నామే. మీ బావకైతే ఆ కోరిక మరీ మరీ వుంది” అన్నది అమ్మ.

“ఏం పెట్టి చదివిస్తారే? పెద్దాడికీ, చిన్నవాడికీ డిగ్రీలు పూర్తయి ఏడాది గావస్తున్నా ఇంకా ఏ ఉద్యోగామూ రాలేదు గదా? ఈ ఇల్లు తప్ప వేరే ఏ ఆస్తీ లేదాయే. ఆ పుస్తకాల షాప్ పైన ఎన్నాళ్లు సంపాదిస్తే మాత్రం, ఇల్లు గడవడమే గొప్పని నాకు తెలీదా?” పిన్ని తనకున్న చనువుతో నిర్మొహమాటంగా అన్నది.

వాస్తవం వినడానికి కష్టంగా వున్నా మారదు కదా? అమ్మ మౌనంగా వున్నది. నానమ్మ కూడా ఏం అనలేదు.

‘అక్కయ్యా ఇలా అన్నానని నువ్వు బాధ పడవద్దే, మా ఊరిలో ఒక మంచి సంబంధం వుంది. పిల్లవాడు అందగాడు, బుద్ధిమంతుడు. స్వంతిల్లు వుంది. ప్రస్తుతం ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగము కూడా రానుందట. నేను ఈ సంబంధం గురించి మాట్లాడేందుకే వచ్చాను. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదే’ అన్నది పిన్ని.

ఇదంతా వింటున్న సిరికి దుఃఖం ముంచుకుని వచ్చింది.

“ఎంతో చదువుకోవాలన్న నా కోరిక మొగ్గలోనే చిదిమేయబడనుందా?” అనుకొంది బాధగా.

అమ్మ ఏమి చెప్పుతుందా అని చూసింది. చిన్నబోయిన ముఖంతో తలదించుకొని కూర్చుంది అమ్మ. “అక్కయ్యా, నేను ముందే చెప్పాను, నువ్వు నొచ్చుకోకుండా వాస్తవం ఆలోచించమని. మన వాళ్ళెవరన్నా ఆడపిల్లల్లో ఇంత చదివిన వాళ్ళున్నారా? ఇంకా చదివిస్తే, అంతకన్నా ఎక్కువ చదివిన వాడినే తేవాలిగా? మరి ఆ స్తోమత మనకుందా?” అని సూటిగా అడిగింది పిన్ని.

ఎప్పుడు వచ్చాడో గానీ రాజన్నయ్య అంతా విన్నాడేమో… “పిన్నీ రోజూలెప్పుడూ ఇలాగే వుండవుగా? మొన్నటి ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను. త్వరలోనే నాకు ఆర్డర్స్ వస్తాయి. తమ్ముడికి కూడా వచ్చే అవకాశముంది. సిరికిప్పుడప్పుడేమీ పెళ్ళి చేయవద్దు. తన కొచ్చిన ర్యాంక్‌కు మెడిసిన్‌లో కూడా సీట్ వస్తుంది. తనిష్టమైన చదువు చదువుకొంటుంది” అన్నాడు స్థిరంగా. అన్నయ్య వైపు కృతజ్ఞతగా చూసింది సిరి.

“ఓయబ్బో, నువ్వెప్పుడింత పెద్దవాడివైవురా? మీ ఇద్దరి సంపాదనతో సిరిని డాక్డర్‌ను చేస్తారా? అలా జరిగితే నాకు మాత్రం సంతోషం కాదూ? కానీ అప్పుడు మనం కావాలనుకొన్న సంబంధాలు వస్తాయా? అనుకూలంగా కుదురుతాయా?” అన్నది.

“ఇది గాకుంటే మరొకటి, ఎవరికెప్పుడు, ఎక్కడ వ్రాసిపెట్టి వుంటే అక్కడే జరుగుతుంది, పిన్నీ! సిరి చదువును ఆపడం నాకైతే అస్సలు యిష్టం లేదు” ఖచ్చితంగా అన్నాడు రాజు.

నానమ్మ, అమ్మ మౌన ప్రేక్షకులయ్యారు. పిన్ని తన వాదన కొనసాగిస్తూనే “ఒరేయి రాజూ, నీకు జాబ్ వస్తే ఎంత జీతం యిస్తార్రా? మహా అయితే 200/- లేదా 250/- అంతే గదా? రాముకూ అంతే. ఆ జీతాలు ఎన్నాళ్ళు కూడబెట్టి సిరిని డాక్డర్ చదివిస్తార్రా? ఎంత చదివినా ఆడపిల్లకు పెళ్ళి చేయక తప్పుదు గదా? అదేదో ముందే చేస్తే నయం గాదూ? ఒరేయి, మంచి సంబంధంరా, ఎన్నాళ్ళనుండో నాకు వాళ్ళు తెలుసు. ఇదిగో ఆ అబ్బాయి ఫోటో తెచ్చాను. చూడండి” అంటూ తన పెట్టె తెరిచి కవర్‌లో పెట్టిన ఫోటో ఒకటి తీసి అందించింది.

అందరూ ఆసక్తిగానే ఆ ఫోటోను చూశారు. అమ్మ మఖంలో కాస్త రిలీఫ్ కనబడింది.

“అబ్బాయి బాగున్నాడురా” అన్నది అన్నయ్యతో.

“కావచ్చు అమ్మా. నువ్వూ పిన్నిలాగే ఆలోచిస్తున్నావా? సిరి కేమంత వయస్సు వచ్చిందనీ?” ఆశ్చర్యంగా అన్నాడు అన్నయ్య.

“అవుననుకో, ఎప్పడికైనా ఆడపిల్ల పెళ్ళి చేయాల్సిందేగా? పిన్ని చెప్పిందీ ఆలోచించతగిందే. ఏమంటారత్తాయ్యా?” అని నానమ్మ నడిగింది అమ్మ.

“సిరిని చదివించాలనేదీ సరైన నిర్ణయమే. ఇప్పుడింత మంచి సంబంధం రావడం మనం ఊహించనది. ఇప్పుడు కాదనుకుంటే మళ్ళీ వస్తుందో, రాదో అనేదీ సందిగ్ధమే. అయినా సిరిని అడగకుండా ఏమీ నిర్ణయించవద్దు” అన్నది నాన్నమ్మ.

“కనీసం నానమ్మయినా నా గురించి ఆలోచింది” అనుకొన్నది సిరి.

“అవునులెండి. ఇంకా చాలా టైముంది గదా? తర్వాత మాట్లాడుకొందాం” అని ఆ సంభాషణకు తెర దించింది అమ్మ.

సిరి మనసు కల్లోల కడలిగా మారింది. ఆలోచనల అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్తున్నాయి. తన ఫ్రెండ్సిద్దరూ పై చదువుల కెళ్తున్నారు. విరజ మెడిసిన్‌లో చేరుతుందిట. ఇప్పటిలాగ ఆ రోజుల్లో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేవు. +2 లేక PUCలో వచ్చిన మార్కులే ప్రాతిపదికగా సీట్స్ యిచ్చేవారు. గిరిజి A.G, BScలో చేరుతున్నదట. మరి నా చదువేమవుతుందో? ఈ పిన్ని ఎందుకొచ్చిందో? ఈవిడగారు నా పెళ్లి కెందుకింత తొందర పడ్తున్నదో? తన కూతురికి 10వ తరగతి అవగానే పెళ్ళి చేసిందిగా? నాకు మాత్రం ఎందుకు చేయగూడదనే పంతం కాబోలు! ఏది, ఏమైనా అమ్మానాన్నలు పిన్నికి తల ఒగ్గకూడదు. దేవుడా! నా చదువు కొనసాగేలాగ చూడు తండ్రీ! అని పదే పదే ఆ దేవుడిని వేడుకుంటూ నిద్రకు దూరమై ఆశాంతిగా గడిపింది సిరి.

తన పరోక్షంలో పిన్ని అమ్మ నాన్నలతోనూ నానమ్మ తాతాయ్యలతోనూ ఏమీ నూరి పోసేస్తోన్నదని సిరికి చాలా ఆందోళనగా వుండేది. “తమ్ముళ్ళను తీసుకొని అలా పార్క్ దాకా వెళ్ళి ఆడించమ్మా సిరీ” అని తను బయటకి పంపుతున్న పిన్నిపై పీకల దాకా కోపం వచ్చినా, నిస్సహాయంగా మౌనం వహించేది సిరి.

ఒక వారం పాటు వున్నది పిన్ని. ఈ లోగా రాజు కాలోజీలో చేరేందుకు అప్లికేషన్ ఫామ్స్‌తో పాటు ఒక వార్త కూడా తెచ్చాడు. మెడిసిన్‌లో చేరడానికి 7 వేలు ఫీజ్ కట్టాలిట. మిగిలిన డిగ్రీ కాలేజీలకైతే 200 కట్టాలిట అని చెప్పాడు. “అమ్మో ఏడువేలే?” అని అందరూ గుండెల పైన చేతులుంచుకొన్నారు. నాన్న చాలా నీరసపడిపోయాడు.

“అమ్మా! నాలాంటి అసమర్థుడికి పుట్టిన నువ్వు దురదృష్టవంతురాలివి తల్లీ” అని కన్నీరు దాచుకొన్నాడు.

“అయ్యో నాన్నా! అంత మాట అనవద్దు. డాక్డర్ కావాలని నాకేమీ కోరిక లేదు. అసలు రక్తం చూస్తేనే నాకు భయం” అన్నది సిరి.

“అమ్మా! సిరీ!” కాతర కంఠంతో పలికిన నాన్న చేతులు పట్టకొంటూ “అవును నాన్నా నేనూ మా గిరిజ లాగ AG BSc చేరుతాను. దానికీ మంచి ఫ్యూచర్ వుంటుందట” అనునయంగా అన్నది సిరి.

“దానికైనా 200/- రూపాయల ఫీజ్ ఇంకా పుస్తకాలకూ అవీ ఇవీ కావాలిగా?” దిగులుగా అన్నది అమ్మ.

“నిజమే” నిస్పృహ ధ్వనించింది నాన్న గొంతులో.

‘అన్నయ్యల డిగ్రీల చదువులప్పుడు ఫీజులు తక్కువుండేవి. నాన్నకు ఉద్యోగమూ వుండేది. పైగా స్కాలర్‌షిప్‌లూ వచ్చాయి అన్నయ్యలకు. నా దాకావచ్చేసరికి ఆర్దిక పరిస్థతి తల క్రిందులైంది. ఏం కానుందో’ అని తనలో తనే అనుకొంటూ బాధపడుతూ తన గదిలో కెళ్ళింది సిరి.

“ఏదో ఒకటి చేద్దాంలే నాన్నా. నా ఆర్డర్స్ రాగానే ఎవరి దగ్గిరైనా అప్పు దొరకవచ్చు. నెమ్మదిగా అప్పు తీర్చేద్దాం. ముందు ఈ దరఖాస్తులు నింపి రెండు మూడు కాలేజీల్లో యిద్దాం. దేనిలో వచ్చినా సరే” అన్నాడు అన్నయ్య.

అన్నీ వింటున్న పిన్ని కలగచేసుకొంటూ “మీ మాట మీదే గానీ నా మాట అస్సలు వినిపించుకోరు గదా? ఇప్పుడు తన చదివి ఉద్యోగం చేయాలా? ఊళ్ళేలాలా? మంచి సంబంధం. పెద్దగా కట్నకానుకలూ ఆశించడం లేదు. పిల్ల నచ్చేతే చాలన్నారు. అంతగా కావాలంటే పెళ్ళయ్యాకైనా చదువుకోవచ్చు” అన్నది.

ఆ చివరి మాట అందరికీ నచ్చింది.

“వాళ్ళు ఒప్పుకొంటారా?” ఆశగా అడగాడు నాన్న.

“అడిగి చూద్దాం బావా. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నాకు ఎప్పటి నుంచో తెలుసు. మన మాట కాదనరులే” అని భరోసా యిచ్చింది పిన్ని.

ఆ తర్వాత ఏమేమి ఒప్పందాలు జరిగినవో గానీ పిన్ని సంతృప్తిగానే ఊరి కెళ్ళిపోయింది.

సిరికి ఆలోచనలు తెగడం లేదు. ఎవ్వరినీ అడుగనూ లేదు.

(ఇంకా వుంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here