[box type=’note’ fontsize=’16’] బాల్యం లోని అమాయకత్వాన్ని, అందాన్ని గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో రెండవ ముచ్చట. [/box]
తన తోటి పిల్లలతో కలసి తొక్కుడు బిళ్ళ, దూదుంపుల్లా, దాగుడు మూతలు మొదలైన ఆటలెన్నో ఆడి ఆడి అలసిపోయి ఇంటికి వచ్చింది సిరిచందన. “బడి నుండి రాగానే బ్యాగ్ బల్లమీద పడేసి ఆటలకెళ్ళావా? ముందు కాళ్ళు-చేతులు కడుక్కొని రా… పో, పప్పులు పెడతాను” అని ప్రేమగానే కసురుకొనది అమ్మ. నాన్న ప్రతీరోజు పిల్లలు ముగ్గురికీ వేర్వేరుగా స్వీట్స్-మిక్చర్ పొట్లాలు లాంటివి పొట్లాలు కట్టించి తెస్తాడు. అవి దాచిపెట్టి వాళ్ళు బడి నుంచి రాగానే తలా ఒకటి ఇస్తుంది అమ్మ. అవి తిన్నాక కాస్సేపు హోంవర్క్ చేసుకొని, భోంచేసి తాతయ్య కథలు వినడానికి అన్నయ్యలు, నానమ్మ పాటలూ – కబుర్లు వినడానికి సిరీ వాళ్ళ పక్కన చేరడం అలవాటు. నిద్రవచ్చే వరకూ వుండి ఆవలింతలు రాగానే, ఎవరి మంచాలపైకి వాళ్ళెళ్తారు. ఆప్యాయతానురాగాలు, అనుబంధాలు కలబోసుకున్న అందమైన పొదరిల్లు లాంటిది వాళ్ళ ఇల్లు. అందులో విరబూసిన సిరిమల్లి చిన్నారి సిరిచందన.
ఆవేళ రోజూలాగే తనకిచ్చిన పప్పుల పొట్లం విప్పి తింటున్నది సిరి. అప్పటికే తినడం ముగించిన అన్నయ్యలు పుస్తకాలు ముందేసుకున్నారు. అది సీతాఫలాల కాలం. రెండ్రోజుల క్రింద బియ్యం డబ్బాలో మాగబెట్టిన ఆ కాయలు పండినవో లేదోనని చూసింది అమ్మ. కాయలన్నీ చక్కగా పండినవి. రాజూ, రామూ, సిరిలతో పాటు నానమ్మా, తాతయ్యలకు తలా ఒకటి ఇచ్చి, తానూ ఒకటి తీసుకొన్నది అమ్మ. నాన్న ఇంకా ఆఫీసు నుంచి రాలేదు. అందుకని నాన్న వాటా పండు గిన్నెలో దాచిపెట్టింది. అందరూ ఒకచోట కూర్చుని సీతాఫలం రుచిని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకొంటూ తినసాగారు. సిరి తాను తినే పప్పులు పక్కనబెట్టి పండు తినడం మొదలుపెట్టింది. పండు త్వరగా తినేసి, మళ్ళీ పప్పులు తినాలిగా?
అందుకే త్వరత్వరగా తినడంలో పొరపాటున సీతాఫలం గింజ మింగేసింది సిరి. కంగారుపడ్తూ, “గింజ మింగేసాను, ఏమవుద్ది?” అన్నది భయంగా. అప్పటికే పళ్ళు తినేసిన పెద్దవాళ్ళు ఎవరి పనుల్లో వారు మునిగారు. పిల్లలు ముగ్గురే వున్నారక్కడ. “ఏమవుతుంది, తలలో చెట్టు మొలుస్తుంది” తాపీగా అన్నాడు రాజు. “అవునవును” అంటూ వంతపాడాడు రాము. “నిజంగానా? నా జుట్టులోంచి వస్తుందా? మరి నా జడలు? అన్నయ్యా! నాకు చెట్టు వద్దు, నా జడలే నాకు కావాలి” అని ఏడుపు ముఖంతో రాజుని అడిగింది సిరి. “నేనేం చేసేది చెల్లీ? నువ్వు గింజ మింగేసావు గదా! ఆ మధ్య రేగు గింజలో నుండి మొక్క రాలేదూ? అలాగే సీతాఫలం గింజలో నుండి కూడా మొక్క వస్తుంది మరి” కూల్‌గా వివరణ ఇచ్చాడు రాజు. “నీ జడలు కత్తిరిస్తారిక” అన్నాడు రాము. ఏడుపు ముంచుకువచ్చింది సిరికి. “అమ్మా, నా తలలో చెట్టు మొలవద్దు, నా జుట్టు కత్తిరించవద్దు” అని గట్టిగా ఏడుస్తూ అమ్మ దగ్గరికి పరిగెత్తింది. అమ్మ కంగారు పడింది. “ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? జుట్టు కత్తిరించడమేమిటి?” అని సిరిని పొదివిపట్టుకొంటూ ఆప్యాయంగా అడిగింది అమ్మ. చేతిలో పని వదిలి పెట్టి నానమ్మ కూడా కంగారుపడ్తూ వచ్చింది.
“నేను సీతాఫలం గింజ మింగాను గదా! మరి నా తలలో చెట్టు మొలుస్తుందట గదా! నా జడలు కత్తిరిస్తారట గదా!” వెక్కిళ్ళు పెడుతూ చెప్పింది సిరి.
“అలాగని ఎవరన్నారు?” చిరు కోపంతో అడిగింది అమ్మ.
“అన్నయ్యలిద్దరూ చెప్పారు” అని సిరి చెప్పగానే అమ్మ నవ్వును ఆపుకొంటే, నానమ్మ పైకే నవ్వేసింది. రాజూ రామూ కూడా ముసి ముసి నవ్వులు చిందించారు. తానింతగా ఏడుస్తుంటే ‘వీళ్ళంతా నవ్వుతున్నారేంటి’ అని సిరికి కోపం కూడా వచ్చేసింది.
“ఆరి భడవలూ, చెల్లిని అలాగ ఏడిపించవచ్చా?” అని నానమ్మ గద్దిస్తే ఈసారి గట్టిగానే నవ్వారు అన్నయలిద్దరూ. సిరికేమీ అర్థం గాక, అయోమయంగా వుంది.
అమ్మ సిరిని దగ్గరికి తీసుకొని ముద్దుపెట్టుకొంది. “అలాగేం కాదురా. మొక్క మొలవదు. అన్నయ్యలు నిన్ను ఆటపట్టించడానికి అలాగన్నారంతే..” అన్నది. “మరి నేను గింజ మింగానుగా?” అమాయకంగా అడిగింది సిరి.
“అదేమవుతుందో నేను చెప్తాను రా” అంటూ సిరిని తనవైపుకు తిప్పుకుంది నానమ్మ. “ఇంక అల్లరి చాలు గానీ, వెళ్ళి చదువుకోండి” అని అన్నయలిద్దర్నీ కోప్పడింది అమ్మ. నవ్వుకొంటునే అన్నయ్యలిద్దరూ జారుకొన్నారు.
“నానమ్మా, నేను తిన్న గింజ ఎలా మరి?” సందేహం తీరని సిరి మళ్ళీ అడిగింది. “అదేమీ కాదురా. చిన్న గింజే కదా! అరిగిపోతుంది. లేదంటే రేపుదయం విరేచనంలో పోతుంది. అంతే” అన్నది నానమ్మ. “విరేచనమంటే?” మళ్ళీ సందేహం సిరికి. “అంటే… అంటే…” అని ఆలోచిస్తున్న అత్తగారిని ఆదుకొంటూ… “టాయిలెట్” అన్నది అమ్మ. “ఛీ” అప్రయత్నంగానే అనేసింది సిరి.
“ఛీ ఏముందే, ‘నేడు తిన్న ఫలం రేపు మలం అవుతుంద’నేది పెద్దల మాటేగా?” అన్నది నానమ్మ.
“అయితే చెట్టు రాదు కదా?” నిర్ధారణ చేసుకోవడానికి మళ్ళీ అడిగింది సిరి.
“ఏం రాదురా. మీ నాన్న గానీ, తాతయ్యగాని వచ్చాక అన్నయ్యల సంగతి చెప్తారులే. నువ్వెళ్ళి చదువుకో పో తల్లీ” అని అమ్మ సిరి తల నిమిరింది.
“ఏం చెప్పద్దులే” అని అక్కడి నుండి కదిలింది సిరి. చిన్నదైనా పెద్ద మనసుగల చిన్నారి సిరిని అపురూపంగా చూస్తూ నవ్వుకొన్నారు అమ్మా, నానమ్మలు.
(మళ్ళీ కలుద్దాం)