సిరిముచ్చట్లు-21

0
8

[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని; యవ్వనప్రాయంలోని జ్ఞాపకాలను గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో 21వ ముచ్చట. [/box]

[dropcap]అ[/dropcap]మ్మా నాన్నలనూ, సిరినీ ఆప్యాయంగా ఆహ్వానించింది పిన్ని. బాబాయి కూడా సాదరంగా కుశల ప్రశ్నలేసాడు. చిన్న తమ్ముళ్ళతో కలిసిపోయి, తానూ చిన్నదాని గానే మారి ఆటలాడుతూ, ఆనందంగా గడపసాగింది సిరి.

రెండు రోజులు రెండు నిమిషాల్లాగే గడిచాయి.

ఆ వేళ సిరిని దగ్గిరికి పిలిచి అమ్మా నాన్నలు “నీతో కొంచెం మాట్లాడాలి తల్లీ” అన్నారు.

తనతో మాట్లాడవలసినంత ముఖ్య విషయమేంటబ్బా? అనుకుంది సిరి.

బుద్దిగా తల్లి ప్రక్కనే కూర్చుంటూ “ఏంటమ్మా?” అని అడిగింది.

“మరేం లేదు తల్లీ, ఆ మధ్య వచ్చి వెళ్ళిన సంబంధం వాళ్ళు బాబాయినీ పిన్నీని నీ గురించి అడిగారట. ఇంకా ఆ అబ్బాయికి ఏ సంబంధమూ కుదరలేదట” అన్నది అమ్మ.

“అయితే?” భృకుటి ముడుస్తూ, రవంత కోపంగా అన్నది సిరి.

“కోపం వద్దు రా. నీ చదువుకు ఏ అడ్డుచెప్పమని అన్నారట. అందుకే నీ అభిప్రాయము అడగాలనీ..” అంటూ అర్ధోక్తిలోనే ఆపేసాడు నాన్న.

తన చదువు కొనగుతుందనే మాట నచ్చింది సిరికి. అందుకే శాంతపడి “ఇప్పుడేమి తొందరుంది నాన్నా. ఇంకో ఏడాదైతే డిగ్రీ అయిపోతుంది గదా. అప్పుడు చూడవచ్చులెండి” అన్నది ఆమె గొంతులో తీవ్రత లేకపోవడం గమనించారు అమ్మా నాన్నలు.

“అది కాదమ్మ, అబ్బాయి బాగున్నాడు. చదువుకొన్నాడు. ఏదో ఒక ఉద్యోగమూ చేస్తున్నాడు. స్వంతిల్లూ వుంది. పైగా నీ చదువుకు ఆటంకం కలిగించరు. పెళ్ళయినా నువ్వు మా దగ్గరే వుండి నీ డిగ్రీ పూర్తి చేయవచ్చు. ఇంత మంచి అవకాశాలు మళ్ళీ వస్తాయా” నచ్చచెప్పుతున్నట్లుగా అనునయించింది అమ్మ.

రెండేళ్ళ క్రితం చూసిన ఆ అబ్బాయి ఫోటో లీలగా గుర్తుకు వచ్చి, ఆలోచనలో పడింది సిరి.

ఆ ఫోటోను ఆ వేళే పెద్దన్నయ్యకి యిచ్చింది. తర్వాత అదేమైందో తెలియదు. వాళ్ళు కాదన్నారని ఎవరూ పట్టించుకోలేదు. మళ్ళీ ఒకసారి ఆ ఫోటో చూస్తే బాగుండేది అనిపించింది సిరికి అప్పుడు.

“నువ్వు సరే అంటే మనం వెళ్ళేలోగా ఆ అబ్బాయిని పిలిపిస్తానన్నది పిన్ని” అన్నది అమ్మ.

‘అసలిక్కడికి రాకండా వుండాల్సింది’ అని ఒక్క క్షణం అనిపించినా వెంటనే అమ్మ చెప్పిన మాటలన్నీ మళ్ళీ మనసులో ప్రతిధ్వనించాయి. సిరి కన్నెమనసు ఒక్క క్షణం అప్రయత్నంగానే పులకరించింది.

“ఏమంటావమ్మా?” అడిగాడు నాన్న.

“మీ యిష్టం నాన్నా” అనేసి అక్కడ నుండి కదిలి పెరట్లోకి వెళ్ళింది సిరి. హమ్మయ్య అనుకొంది అమ్మ.

రెండు రోజుల తర్వాత.. తమ్ముళ్ళను వెంట పెట్టుకొని మధ్యాహ్నం సినిమా కెళ్ళి వచ్చింది సిరి.

రాగానే అమ్మ, పిన్నీ హడావిడి చేసి సిరిని ముస్తాబు చేయబూనారు.

“ఏమిటమ్మా, ఎందుకు నాకీ అలంకరణ?” అని అడిగింది సిరి కంగారుగా.

“ఏమీ లేదమ్మా, ఆ అబ్బాయి తన ఫ్రెండ్‌తో కలిసి వస్తున్నానని మీ బాబాయికి కబురు చేసాడట. ముందీ చీరె కట్టుకో” అంటూ పిన్ని ఓ క్రొత్త చీరె అందించింది.

“ఇవన్నీ అవసరమా, నేను ఎలాగున్నానో అలాగే వుంటాను పిన్నీ. సహజంగా కనబడాలి. నాకీ చీరేమీ వద్దు పిన్నీ. ఇలాగే లంగావోణీలోనే వుంటాను. ఈ అలంకరణతో వచ్చే అందం శాశ్వతమా” అన్నది సిరి.

“అది కాదే” అని పిన్ని ఇంకేదో చెప్పబోయింది.

“పోనీలేవే దానికి నచ్చినట్లే వుండనీయి” అన్నది అమ్మ.

అమ్మ పిన్నీ యివ్వబోయిన నగలూ, అలంకరణలూ అన్నీ పదిలేసి చాలా సింపుల్‌గా తయారైంది సిరి. కాస్సేపటికే ఆ అబ్బాయి తన మిత్రుడితో కలిసి వచ్చాడు. ముందు గదిలోని కుర్చీల్లో నాన్నా, బాబాయితో పాటు వాళ్ళూ కూర్చున్నారు. పిన్నీ, అమ్మా వెంట రాగా కాఫీ ట్రే తీసుకొని ముందు గదిలోకి నడిచింది సిరి. “మా అమ్మయి సిరిచందన” అంటూ పరిచయం చేసాడు నాన్న. కాఫీ కప్పులు టీపాయి పైన పెట్టి “నమస్కారం” అంటూ అతని వైపు చూసింది సిరి. అతడు పలకరింపుగా నవ్వాడు. తెల్లని పలువరుస తళుక్కున మెరిసింది. చటుక్కున కళ్ళు త్రిప్పుకొని లోనికెళ్ళబోయింది సిరి.

“అదేంటండీ కాఫీ ఇవ్వకుండానే వెళ్తారా” చిలిపిగా నవ్వుతూ అడిగాడు వరుడు.

వెనుదిరిగినదల్లా ఆగిపోయింది సిరి.

“వాళ్ళకు కాఫీ టిఫిన్లివ్వమ్మా” అన్నాడు బాబాయి.

పింగాణీ ప్లేట్స్‌లో అందంగా అమర్చిన స్వీట్స్, కారాలు వాళ్ళ ముందున్న స్టూల్ పైన పెట్టి కాఫీ కప్పులను కూడా అక్కడే వుంచి మౌనంగానే వెనుదిరిగింది సిరి.

మరోసారి నవ్వుతూ కాఫీ కప్పును అందుకొన్నాడు వరుడు. అతని మిత్రుడు కూడా కాఫీ కప్పును చేతిలోకి తీసుకొన్నాడు.

“అదేమిటి బాబూ, ఏమీ తినరా?” అన్నాడు నాన్న.

“ఇందాకే టిఫిన్ తినేసి వచ్చాము అంకుల్” వినయంగా అన్నాడు వరుడు.

“అవునండీ” అంటూ వంతపాడాడు వరుడి మిత్రుడు.

లోనికెళ్ళి అద్దం ముందు కూర్చున్న సిరికి చిలిపిగా నవ్వుతున్న వరుడి ముఖం కనిపించినట్లయింది. ఉలిక్కిపడి అక్కడి నుండి లేచి మరో వైపు వెళ్ళిందామె. అక్కడ కూడా ఎదురుగా నుంచుని నవ్వుతున్నట్లుగా కనిపించాడతడు. అతని ఒత్తయిన ఉంగరాల జుట్టూ తళ-తళ మెరుస్తున్న అతని పలువరుసా కళ్ళెదుట పదే-పదే కనబడుతూ ఆమెను ఒక చోట కుదురుగా వుండనీయడం లేదు.

ఎంతందంగా వున్నాడో. ఎంత చక్కగా నవ్వుతున్నాడో అనుకొంది సిరి.

ఈ మధ్యే పెళ్ళయిన తన క్లాస్‌మేట్ విద్య చెప్పిన మాట గుర్తు వచ్చింది సిరికి.

విద్యను పెళ్ళి చేసుకొన్న కొద్ది రోజులకే ఆమె భర్తకు కంపెనీ పనిపైన రెండేళ్ళ పాటు అమెరికాకు వెళ్ళాల్సి వచ్చింది. విద్యకింకా చదువు పూర్తి కాలేదు. తను ఒక్కడే అమెరికాకు వెళ్ళాల్సి వచ్చినందుకు చాలా బాధపడుతునే ‘ఈ లోపు నీ డిగ్రీ పూర్తివుతుందిగా, నేను ప్రతీ ఆరునెలల కోసారి వారం పదిరోజుల కోసము వస్తుంటాన’ని భార్యను బుజ్జగించి వెళ్ళాడతడు. అతను అమెరికా నుండి వ్రాసే ఉత్తరాలను ఫ్రెండ్స్‌కు చూపిస్తూ “అసలు పెళ్ళి కాకుండా వున్నా బాగుండేదే. ఆయన ప్రేమానురాగాలను చవిచూసాక యిలాగ దూరంగా వుండాలంటే నరకంలాగే వున్నది. ఎప్పుడెప్పుడు తను వస్తాడా మళ్ళీ మేమిద్దరము కలిసి ప్రేమ సాగరంలో ఈదులాడ్తామా అని వేయి కళ్ళతో వేచి చూడాల్సి వస్తున్నదే” అన్నది విద్య.

రేపు నా పరిస్థితీ అంతే అవుతుందా, జ్ఞాపకాల సంకెలలో బందీనవుతానా, నా చదువేం కావాలి. అమ్మో, విద్యలాగే నేనూ బాధపడాలేమో అని పరి-పరి విధాలుగా ఆలోచనలో పడింది సిరి.

కాస్సేపు చదువు ముగిసే వరకూ పెళ్ళి చేసుకోకూడదని అనిపించింది. మళ్ళీ వెంటనే నవ్వుతున్న వరుడి ముఖం కళ్ళముందు కదిలి, ఆమె నిర్ణయాన్ని నీరుగార్చింది. విద్యా వాళ్ళాయన చాలా దూరంగా అమెరికాలో వున్నాడు, కాబట్టి ఎప్పుడుంటే అప్పుడు వాళ్ళు కలుసుకోవడమూ కుదరదు. కానీ మాకలా కాదుగా అనుకొగానే తను రావచ్చు లేదా నేనైనా తన దగ్గరికి వెళ్ళవచ్చు కదా అని తనకు తానే సర్ది చెప్పుకుంది పరువాల కుప్ప సిరి.

వయసు తెచ్చిన అందాలతో పాటు మనసులోన వరుడు రగిలించిన మరుల సెగలు ఆమెను నిద్రకు దూరం చేసాయి. అన్నీ కలిసి వస్తే పెళ్ళికి సరే అనాలి అని మనసులోనే నిర్ణయించుకొన్నాకే ఆమెకు ప్రశాంతంగా అనిపించింది.

కమ్మని కలలు కంటూ తనలో తానే నవ్వుకొంటూ నిద్రలోనికి జారుకొంది సిరి. సిరి ముఖంలోని ఆనందం గమనించిన అమ్మా నాన్నా తృప్తిగా నిశ్వసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here