సిరి ముచ్చట్లు-4

    0
    5

    [box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో నాల్గవ ముచ్చట. [/box]

    [dropcap]అ[/dropcap]న్నయ్యలతో పాటే బడికెళ్ళి, మళ్ళీ వాళ్ళతోనే తిరిగి ఇంటికి వస్తున్నది సిరి. చిన్న వయసులోనే తెలివితేటలతో శ్రద్ధగా పాఠాలు వింటూ, తు.చ. తప్పకుండా నేర్చుకొంటూ అందరి మెప్పును పొందింది సిరి. తమ చెల్లిని అందరూ మెచ్చుకొంటుంటే ఎంతో గర్వించేవాళ్ళు అన్నయ్యలు. కానీ తాము మాత్రం ఏదో ఒకదానికి చెల్లిని ఆటపట్టిస్తునే వుండేవారు.

    స్కూల్‌లో తరగతి గదిలో టీచర్స్ అడిగిన ప్రశ్నలకు సరైన జవాబు చెప్పనివాళ్ళని చెప్పినవాళ్ళతో చెంపదెబ్బలు కొట్టించేవారు. అలా చెంపదెబ్బలు కొట్టే ఛాన్స్ సిరికి చాలాసార్లు వచ్చేది. తనకన్నా ఎంతో ఎత్తుగా, బలంగా వున్న మగపిల్లలను కూడా కొట్టాల్సి వచ్చినప్పుడు సిరికి కొంచెం భయం కలిగేది. ఆ పిల్లలేమో టీచర్ వినకుండా, “చిన్నగా కొట్టు అమ్మాయి. లేకపోతే బయటికెళ్ళాక నీ జడలు కత్తిరిస్తాం జాగ్రత్త!” అని బెదిరించేవారు. అలాగని చిన్నగా కొడితే, “ఏంటి గంధం పూస్తున్నావా? గట్టిగా కొట్టకపోతే ఆ దెబ్బలేవో నీకే పడ్తాయి” అనేవాళ్ళు టీచర్లు. ఓసారి ధైర్యం చేసి, “నా జడలు కత్తిరిస్తామన్నారు సార్. ఎలా కొట్టాలిక?” అని చెప్పేసింది.

    “ఎవరా కూత కూసిన అడ్డగాడిద? ఎవరు?” అని ఉపాధ్యాయుడు హుంకరించాడు. ఎవరిని చూపించినా ప్రమాదమేనని భావించిన సిరి భయంతో మౌనంగా నిలబడింది. సార్ మరోసారి అదే ప్రశ్న వేసినా సిరి మాట్లాడలేదు. సార్‌కు కోపం నషాళానికంటింది. నిలబడిన నలుగురు అబ్బాయిలనూ చేయి చాపమని బెత్తం తీసుకొని “చదువైతే రాదు, శుద్ధ మొద్దావతారాలేసుకుని బడికి వస్తారు. ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేరు, కానీ ఆడపిల్లను… అదీ చిన్నపిల్లను బెదిరిస్తార్రా? తన జడలు కాదు, ముందు మీ తోకలు కత్తిరిస్తానాగండి” అంటూ అందరికీ తలా ఓ దెబ్బ వడ్డించారు ఆయన. చేయి చుర్రుమనడంతో కళ్ళనీళ్ళను బలవంతంగా ఆపుకొన్నారు అబ్బాయిలు. ఆ తర్వాత వాళ్ళెవరూ సిరి జోలికి రాలేదిక. ఇది సిరికి ఒక మరపురాని సంఘటనగా మిగిలిపోయింది.

    ప్రతీ తరగతిలోనూ ‘ఎ’, ‘బి’ అనే సెక్షన్లు ఉంటాయి. సాధారణంగా ‘ఎ’ లో తెలివైన పిల్లలూ, ‘బి’లో యావరేజ్ పిల్లలూ వుంటారనుకొంటారు. కానీ ప్రతి సెక్షన్ లోనూ అన్ని రకాల పిల్లలూ వుంటారు. సిరి ఆరో తరగతిలో వుండగా జరిగిన మరో సంఘటన కూడా సిరికి బాగా జ్ఞాపకమే. తను ‘ఎ’ సెక్షన్‍లోనే వుంది. రెండు సెక్షన్స్‌కి కలిపి క్విజ్ కండక్ట్ చేశారు. దాంట్లో ఇరు పక్షాలకూ కలిపి సమానమైన మార్కులు వచ్చాయి. ఫైనల్ క్వశ్చన్‌కి ముందు కాసేపు విరామం యిచ్చారు.

    ఆ సమయంలో, ” ‘ఎ’ వాళ్ళమంతా ఏనుగులం. ‘బి’ వాళ్ళు బల్లులు. మిమ్మల్ని మా కాళ్ళతో తొక్కి నలిపేస్తాం” అంటూ ‘ఎ’ సెక్షన్ వాళ్ళు ‘బి’ సెక్షన్ వాళ్ళని ఎగతాళి చేస్తూ రెచ్చగొట్టారు. అప్పుడు వాళ్ళూ రెచ్చిపోయి “అదేం కాదు, ‘బి’ వాళ్ళంతా భీముళ్ళు. ‘ఎ’ వాళ్ళు ఎలకలు. మిమ్మల్నే మేం నలిపేస్తాం” అన్నారు. రెండు సెక్షన్స్ వాళ్ళూ మేమే గొప్ప అని వాదించుకోసాగారు. సిరి కల్పించుకొని “సరే మేము ఎలుకలమే. కానీ మీరు బియ్యం. ఎలుకలన్నీ బియ్యాన్ని కరకరా నమిలేస్తాయి. గెలుపు మాదే” అంది. ‘బి’ వాళ్ళు ఊరుకోలేదు. “ఎలకలని భీముళ్ళు తోసి పారేస్తారు. చూస్తూండండి. గెలిచేది మేమే” అన్నారు. విజిల్ వినబడగానే అందరూ నిశ్శబ్దంగా వుండి పోయారు.

    అదృష్టవశాత్తు సిరి వున్న ‘ఎ’ సెక్షన్ వాళ్ళకూ, అదీ సిరి వల్లే గెలుపు దక్కింది. ఫైనల్‌గా అడిగిన ప్రశ్నకు సిరి మాత్రమే సరైన జవాబు చెప్పింది. పిల్లలంతా చప్పట్లతో కేరింతలు కొట్టారు. స్పెషల్ ప్రైజ్‌‍గా సిరికి ఒక మంచి పెన్‌ని బహుకరించారు. అది తెచ్చి ఇంట్లో అందరికీ చూపించింది సిరి.

    “మా సిరి తల్లి బంగారు కొండ” అని అంతా మెచ్చుకొన్నారు.

    (మళ్ళీ కలుద్దాం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here