సిరి ముచ్చట్లు-6

    0
    8

    [box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో ఆరవ ముచ్చట. [/box]

    [dropcap]సి[/dropcap]రిలో అన్నీ మంచి లక్షణాలే వున్నాయనుకొంటే పొరపాటే. తన మాట చెల్లకపోతే, అనుకున్నది కాకపోతే వెంటనే కోపం ముంచుకువస్తుంది సిరికి. అలిగిందంటే ఎన్ని గంటలైనా మూతి ముడుచుకుని కూర్చుంటుంది. తనను మళ్ళీ మామూలు స్థితికి తెచ్చి, ప్రసన్నురాలిని చేయడానికి ఇంటిల్లిపాదీ ఎంత శ్రమపడ్తారో వివరించడం కష్టం. మొండితనం కూడా ఎక్కువే సిరిలో.

    ఇంటికి దగ్గరగా వుండే థియేటర్‌లో నెలకొకసారి అందరూ కలిసి సినిమాకి వెళ్ళడం ఆనవాయితీ. ఆ నెలలో క్రితం వారమే సినిమా కెళ్ళివచ్చారు అందరూ. మళ్ళీ నెల దాకా ఆగాల్సిందే. అయితే వాళ్ళ ఇంటికి 7 – 8 కిలోమీటర్ల దూరంలో వున థియేటర్‌లోకి ‘పరమానందయ్య శిష్యుల కథ’ సినిమా వచ్చింది. అది చూడాలని సిరి కోరిక. అదే అమ్మతో చెప్పింది.

    “నెలకొక సినిమా అంటేనే ఇంచుమించు 50 రూపాయలవుతున్నాయి తల్లీ. ఒక నెల కూరగాయల ఖర్చది. మొన్ననే చూశాం గదా? మళ్ళీ అంటే ఎలాగ?” మృదువుగానే అభ్యంతరం చెప్పిన అమ్మ వైపు కోపంగా చూసింది సిరి. “అంత దూరం అందరమూ వెళ్ళాలంటే అదనంగా రిక్షాల ఛార్జీలు అవుతాయి. మళ్ళీ మన దగ్గరకి వస్తుందిలే. అప్పుడు చూద్దాము” నచ్చచెప్ప చూసింది అమ్మ.

    “అందరం వద్దులే. నాన్న, నేను వెళ్తాము” అన్నది సిరి. “అదెలాగా సిరీ? నాన్న అలసిపోయి వస్తారు. రాగానే సినిమా అంటే ఎలాగ?” అన్నది అమ్మ.  నానమ్మ కూడా అదే అన్నది, కానీ సిరి అలిగి కూర్చుంది. అన్నయ్యలతో పాటు అన్నం తినడానికి కూర్చోలేదు. “నాకు ఆకలేయడం లేదు” అని ముసుగుదన్ని పడుకొంది. నానమ్మ, అమ్మా రెండుసార్లు పిలిచినా పలకలేదు సిరి. విషయం విన్న తాతయ్య వచ్చాడు.

    “సిరీ, అన్నం తినకుండా పడుకుంటే ఎలాగమ్మా? లేచి కొంచెం తిని పడుకో” అని బుజ్జగిస్తూ లేపాడు. “పర్లేదు తాతయ్యా, నాకు ఆకలేస్తే తింటాను లెండి” అన్నది సిరి. “అది ‘పరమానందయ్య శిష్యుల కథ’ సినిమా చూడాలిట. ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం అంటే వినడం లేదు మామయ్యా” అని ఫిర్యాదు చేసింది అమ్మ.

    “తర్వాతెప్పుడో వెళ్తే ఆ సినిమా ఉంటుందా?” కోపంగా అడిగింది సిరి. “మనందంరం వెళ్ళాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా?” మందలిస్తున్నట్టుగా అంది అమ్మ. మధ్యతరగతి పరిస్థితిని అధిగమించలేని నిస్సహాయత అమ్మది. అర్థం చేసుకోలేని పసి వయసు సిరిది.

    “చూడమ్మా సిరి, మీ నాన్న వచ్చాక నేను చెప్తాలే, నువ్వు లేచి ముందు అన్నం తిను” అని అనునయించారు తాతయ్య. ఊహుఁ, మొండిపిల్ల సిరి. వింటే తను సిరి ఎలాగవుతుంది? “వద్దు తాతయ్యా, నాకు తినాలని లేదు” అంటూ గోడవైపు తిరిగి మూడంకె వేసింది.

    “ఇంక వదిలేద్దురూ, దాని సంగతి తెలిసిందేగా, వాళ్ళ నాన్న వచ్చాకా వాడే చూసుకుంటాడులే” అని నానమ్మ అనగానే, అందరూ మౌనం వహించారు. అన్నయ్యలిద్దరూ తినడం ముగించి, పుస్తకాలు తీసుకుని లాంతరు ముమ్దు కూర్చున్నారు. ఎనిమిదవుతుండగా నాన్న వచ్చాడు. ఇంట్లోకి రాగానే ఆయనకి పిల్లలందరూ కనబడాలి. వాళ్ళ కోసం తను తెచ్చిన తినుబండారాలను అమ్మ చేతికిచ్చి, అందరినీ ఒకసారి నిండుగా చూసి, నవ్వుతూ పలకరించకపోతే నాన్నకు చాలా వెలితిగా వుంటుంది. ఆవేళ రోజూ లాగా సిరి కనబడకపోయేసరికి “పాప ఏదీ?” అన్నాడు.

    “అలిగి పడుకుంది” కొంచెం విసుగ్గా ధ్వనించింది అమ్మ గొంతు.

    “ఏం జరిగింది?” ఆదుర్దాగా అడిగాడు నాన్న.

    “ఏముంది? ఏదో సినిమా చూడాలట. క్రితం వారమేగా వెళ్ళివచ్చాం. ఇంకా చిన్న పిల్లా ఏంటి? అర్థం చేసుకోకుండా ఈ అలగడాలేంటి?” విసుగ్గా అన్నది అమ్మ.

    “చిన్న పిల్లగాక మరేంటి అనూ? వుండు, నేను కనుక్కుంటానులే” అని నాన్న సిరి దగ్గరైకి వచ్చాడు. ముసుగు కప్పుకున్న సిరి అన్నీ వింటూనే వుంది.

    “సిరీ, నా బంగారు తల్లీ! ఏమైందిరా? ఏం సినిమా అదీ?” అని ముసుగు తప్పిస్తూ లాలనగా అడిగాడు నాన్న.

    “అదే… ఆ గారాబమే దానినింత పెంకిగా, మొండిగా తయారు చేస్తున్నది. రెండు తగలనిస్తే గానీ ఈ పెంకితనం తగ్గదు” అన్నది అమ్మ. “చూడండి నాన్నా, అమ్మ ఎలా తిడుతున్నదో?” గారంగా అంది సిరి నాన్నను చుట్టేస్తూ.

    “అనూ, నువ్వు కాస్త ఊరుకుంటావా? ఇంతకీ ఏం సినిమా అమ్మా అది?” అడిగాడు నాన్న. “మరి నాన్నా, అది ‘పరమానందయ్య శిష్యుల కథ’ అని మొన్నప్పుడో వచ్చిందట. రేపే లాస్ట్ డే” అని మా ఫ్రెండ్స్ చెప్పారు. ఈవేళ వెళ్దాం నాన్నా. రేపు మీకెలాగూ సెలవే కదా. సెకండ్‌ షో కింకా చాలా టైముంది గదా!” మరింత గారంగా అంది సిరి. ఏమనాలో తెలియక ఒక్క క్షణం మౌనం వహించాడు నాన్న.

    “నానన, మాకు అది తెలిసిన కథే. అది మళ్ళీ ఎప్పుడన్నా మన దగ్గిరున్న థియేటర్‌కి వచ్చినప్పుడు చూస్తాం లెండి. ముందీ మహాతల్లిని తీసుకెళ్ళండి” అన్నాడు రాజు. “అవును నాన్నా, మేం తర్వాత చూస్తాం” అన్నాడు రాము.  సిరి అన్నయ్యల వైపు కోపంగా చూసింది.

    “సరే అయితే, ముందు అన్నం తినాలిగా? రా, మరి” అన్నాడు నాన్న.

    అమ్మ గొణుక్కుంటూనే నాన్నకు, సిరికీ అన్నం వడ్డించింది. భోం చేయగానే సిరి చకచకా తయారైంది సిరి. నాన్న కూడా తయారై తన సైకిల్‌పైన ఎక్కించుకుని అంత దూరం వున్న సినిమాకు సిరిని తీసుకుని వెళ్ళాడు.

    నాన్న ప్రేమకూ, బాధ్యతకూ కొలమానం లేదని ఆ వయసులో తెలియని సిరికి తర్వాత్తర్వాత ఆ సంఘటన ఒక మరపురాని సంఘటనగా మనసులో చెరగని ముద్రలా మిగిలిపోయింది. నాన్నంటే ఒక గొప్ప వ్యక్తి, ఏదైనా సాధించగల వ్యక్తి అనీ, సినిమా హీరో కన్నా మిన్న అనీ అనుకునేది సిరి.

    (మళ్ళీ కలుద్దాం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here