సిరి ముచ్చట్లు-7

    1
    5

    [box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లుసిరి ముచ్చట్లు” సిరీస్‌లో ఏడవ ముచ్చట. [/box]

    [dropcap style=”circle”]సి[/dropcap]రికి హిందీ సబ్జక్టంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అందులో ఫస్ట్ మార్కులు తనదే. కానీ కొత్తగా వచ్చిన హిందీ మాస్టారంటే మాత్రం చచ్చేంత భయం. ఎందుకంటే ఆయన వేరే పిల్లలను దండించడం చూసింది గనుక. అతను హిందిలో మహాపండితుడు. అందులో ఎవరైనా తప్పుగా వ్రాసినా, మాట్లాడినా అస్సలు సహించడు. ఫెయిలైన విద్యార్ధులని చేతులపైన వాతలు తేలేలాగ కొట్టడం చూసింది సిరి. అప్పటి నుండీ హిందీ క్లాసంటేనే దడ మెదలైంది. ఆ ఒక్క పీరియడ్‌ను ఎలాగైనా తప్పించుకోవాలని చూసేది. అందులో భాగంగానే ‘కడుపులో చాలా నొప్పిలేస్తున్నది’ అనీ,  లేదా కొంచెంగా ఊగుతున్న పన్నును మరింతగా ఊపి ‘రక్తం వస్తున్నది’ అని ముందు పీరియడవగానే ఆ సార్ దగ్గిరే అనుమతి తీసుకుని బయటపడేది. ఆ పీరియడ్ అయిపోయే వరకూ ఎవరి కంటా పడకుండా బయట కాలక్షేపంచేసి, మళ్ళీ తరగతి గదిలోకి వెళ్ళేది. ఇది అన్నయ్యలకు గానీ, ఇంట్లో గానీ తెలియదు.

    అలాగ ఎన్నిసాకులు వెతకగలదు? వరసగా 3, 4 రోజులు మాత్రమే తన పాచిక పారింది. ఆ తర్వాత ఆ సార్‌ను అడగడం మానేసి సార్ రాకముందే వెనుక గుమ్మం ద్వారా బయటికెళ్ళింది సిరి. బయట తనకన్నా చిన్న పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆడసాగింది. అనుకోకుండా తన మిత్రుడింటికి వెళ్ళి తిరిగి వస్తున్న తాతయ్య చూసాడది. ఆయన దగ్గరికి వచ్చేవరకూ సిరి గమనించనే లేదు. జోరుగా ఆటలో లీనమైంది.

    తాతయ్య దగ్గిరగా వచ్చి ‘ఇక్కడున్నావేంటి?’ అని అడిగేసరికి ఉలిక్కిపడి కుంటడం ఆపింది.

    తాతయ్య ప్రశ్నకేం జవాబు చెప్పాలో తెలియక బిత్తరపోయి చూస్తూ నిలబడింది సిరి.

    ‘ఈ టైంలో ఇక్కడ ఆడుకుంటున్నావేంటమ్మా’ మళ్లీ అడిగాడు తాతయ్య.

    ‘ఏం లేదు తాతయ్యా, ఇప్పుడు టీచర్ల మీటింగ్ అవుతున్నది. మమ్మల్ని వదిలేసారు’ అని తేలిగ్గా అబద్దం చెప్పింది సిరి.

    ‘మరి అన్నయ్య లేరి?’ జవాబిచ్చింది సిరి.

    ‘వాళ్ళు క్లాసులోనే ఉన్నారుగా’ జవాబిచ్చింది సిరి. మొదట తను చెప్పిన అబద్ధానికీ, తర్వాత చెప్పిన నిజానికీ పొంతన కుదరదనే విషయం తెలియని పసివయస్సు సిరిది.

    బడిలో పిల్లల సందడేమి లేదు. ఎవరి తరగతి గదుల్లో వారుండి బుద్దిగా పాఠాలు వింటున్నారు. అది గమనించిన తాతయ్య సిరి అబద్ధం చెప్పిందని గ్రహించాడు.

    ‘నీ బ్యాగేది?’ అని అడిగాడు.

    ‘నా క్లాస్‌లోనే వుంది తాతయ్యా, ‘ఇప్పుడు హిందీ పీరియడవగానే వెళ్తానుగా’ తడుముకోకుండా అనేసింది సిరి. అలాగన్నాక నాలుక కరచుకొంది. బిక్క ముఖం వేసింది. తాతయ్యకు ఏదో అర్థం అయీ కాకుండా వుంది.

    ‘సరి, సరిలే ముందు బళ్ళోకెళ్ళు’ అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు తాతయ్య.

    అంతే, మర్నాడే నాన్న సిరి వాళ్ళ స్కూల్‌కి వచ్చాడు. అక్కడ సిరి వాళ్ళ తరగతిలో అందరూ పెద్ద పెద్ద పిల్లలుండడం, అందులో ఎక్కువ మంది మగపిల్లలే వుండడం గమనించాడు, సిరిని బుజ్జగించి అలాగ స్కూల్ మధ్యలో బయటకెళ్ళడానికి కారణం ఏమిటి? అని తెలుసుకున్నాడు.

    వారం తిరక్కముందే సిరిని ఇంటికి దగ్గిరలోనే వున్న మరో స్కూల్లో చేర్పించాడు. అక్కడ హిందీ సార్ బెడద లేకపోవడంతో సిరికెంతో రిలీఫ్‌గా అనిపించింది. మళ్ళీ బాగా చదువుతూ అందరినీ మెప్పిస్తూ హుషారుగా వుండసాగింది. చాలా మంది సిరికి ప్రెండ్సయ్యారు. టీచర్లంతా కూడా సిరిని అభిమానించేవారు.

    ఉన్నట్లుండి ఒక్కసారి ప్రేయర్‌లో సిరికి వణుకు పుట్టించే హిందీ మాష్టారు కనిపించాడు. ముచ్చెమటలు పోసాయి సిరికి. తరగతి గదిలో ఎప్పుడూ ముందు వరసలోనే కూర్చునేది కాస్తా వెనుక బెంచీలో ఎవరికీ కనబడకుండా దాగి కూర్చుంది. పాపమా హిందీ సార్ గురించి ఎంత చెడ్డగా చెప్పాలో అంత చెడ్డగా తన ప్రెండ్సందరికీ చెప్పి అతని మీద వాళ్ళకీ దురబిప్రాయం కలిగేలా చేసింది సిరి.

    ‘ఆయన చాలా కోపిష్టి, అందరినీ బాగా కొడ్తాడు, వాతలు తెల్తాయి ఆయన కొడ్తే’ అని ఫ్రెండ్స్‌నీ  భయపోట్టింది. సిరి భయపడినట్లుగా ఆ సార్ సిరి తరగతికి రాలేదు. ప్రమోషన్ పై బదలీ అయిందాయనకి. పై క్లాస్ వాళ్ళకే భోదిస్తాడని సిరికి తెలియదు. ఎప్పుడు తమ క్లాస్‌కి వస్తాడోనని బెదురుతూనే వుండేది.

    ఒకరోజు తెలుగుసార్ రాలేదని వాళ్ళ తరగతికి హిందీ సార్ వచ్చాడు. సిరికి బిక్కు బిక్కుమంటూ  కూర్చున్నది. ‘పిల్లలూ, మీరంతా తెలుగు బుక్స్ తెరిచి నిన్నటి పాఠంలోని ప్రశ్నలూ జవాబులు నిశబ్దంగా చదువుకోండి’ అన్నాడు హిందీ సార్.

    కిక్కురుమనకుండా అందరూ ఆ ఆజ్ఞను పాటించారు.

    సిరిని చూస్తూ ‘సిరి కదూనీ పేరు? ఇలా  రామ్మా’ అన్నాడు హిందీ సార్.

    భయంతో  వణికిపోతూ నిలబడింది సిరి. అక్కడ నుండి అంగుళం కూడా కదలకుండా నిలబడిన సిరి దగ్గరికి వచ్చి ‘ఎందుకమ్మా అంత భయపడున్నావు? నేను చదవకుండా అల్లరి  చేసే జులాయి వెధవలను కొడ్తాను గానీ, నిన్నేమంటాను! నీకు హిందీ అంటే  చాలా యిష్టమనీ, బాగా చదువుతావనీ నాకు తెలుసు. అయినా ఇప్పడు ఎవరినీ కొట్టగూడదని గవర్నమెంట్ రూల్ పెట్టిందిలే. నేను మీ తరగతికి రాను కూడా. మీ తరగతిలో నువ్వే  నా సబ్జక్టులో ఫస్ట్ వస్తావనీ తెలుసు. బాగా చదువుకో. అన్నింటిలోనూ ఫస్ట్ రావాలి’ అని సిరిని వీపు తట్టి మృదువుగా చెప్పాడు సార్.

    ‘హమ్మయ్య’ అని తేలిగ్గా నిట్టూర్చింది సిరి.

    క్రమక్రమంగా హిందీ సార్ పట్ల భయం తొలిగి, భక్తి గౌరవాలు పెరిగాయి సిరికి.

    (మళ్ళీ కలుద్దాం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here