సిరి ముచ్చట్లు-8

0
7

[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో ఎనిమిదవ ముచ్చట. [/box]

[dropcap]సి[/dropcap]రికి చిన్నప్పటి నుండీ పువ్వులన్నా, వర్షమన్నా చాలా ఇష్టం. వాళ్ళింట్లో ఒక రేరాణి (Night Queen) పూల చెట్టుండేది. రాత్రివగానే దాని పూలు నక్షత్రాల్లాగ విచ్చుకొని దూర-దూరాల దాకా సుగంధాలు వెదజల్లేవి.

ఇంటి ముందు సాయంకాలాల్లో మంచాలు వేసుకుని కూర్చుని అందరూ ఆ సువాసనలను మనసారా ఆస్వాదించేవారు. అమ్మ నాటిన కనకాంబరం, బంతి, చేమంతి, గులాబీ, సన్నజాజి మొక్కలకు రోజూ నీళ్ళు పోస్తుంది సిరి. అరచేయంత వెడల్పుగా పూసే తెల్ల చేమంతులను చూసి మురిసిపోవడం, నానమ్మ పూజ కోసం నందివర్ధనం పూలు కోసివ్వడం, కనకాంబరాలు, సన్నజాజులూ కలిపి మాల కట్టివ్వడం సిరికి అలవాటు.

పూలు మాల కట్టడం అమ్మ దగ్గిర నేర్చుకొన్నది సిరి. అలాగ పూలు త్రెంచడం, మాల కట్టడం ఎన్నాళ్ళుగానో చేస్తున్న సిరి ఒక్కసారిగా మానేసింది. శ్రద్ధగా మొక్కలకు నీళ్ళు మాత్రం పోస్తున్నది. పువ్వులను ఆప్యాయంగా స్పృశిస్తూ, ముద్దాడుతున్నది. అమ్మా, నానమ్మ ఆశ్చర్యపోయారు.

“అదేమిటే సిరి, నిన్నా ఈ వేళా పూలు కోయనేలేదు, దండ కూడా అల్లివ్వలేదు?” అని అడిగింది నానమ్మ.

“అవునమ్మా సిరి, ఏమైంది?” అన్నది అమ్మ.

‘ఇంక నుండీ మనమెవ్వరూ పూలు కోయవద్దు’ అన్నది సిరి.

‘ఎందుకనీ’ అడిగాడు నాన్న.

తాతయ్య కూడా ప్రశ్నార్థకంగా చూసాడు. అక్కడే వున్న అన్నయ్యలు కూడా ఆసక్తిగా వింటున్నారు.

“మొన్న మా తెలుగు సార్ ‘పుష్పవిలాపం’ పాఠం చెప్పారు నాన్నా. పూలకి కూడా మనలాగే మనసూ, బాధా వుంటాయని అప్పుడే తెలిసింది. ఇన్నాళ్ళూ సున్నితమైన ఆ పూలను త్రెంచి సూదులతో గ్రుచ్చి, దారాలతో గట్టిగా ముడులు వేసి నేను ఎంత హింసించానో తలచుకొంటేనే చాలా బాధగా వుంది” అన్నది సిరి బాధగా చూస్తూ.

“అదా సంగతి?” అన్నాడు తాతయ్య.

“మేము ఎప్పుడో విన్నాము ‘పుష్పవిలాపం’ పాఠం” కోరస్‌గా చెప్పారు అన్నయ్యలు.

“అయ్యో పిచ్చి తల్లీ, ‘పుష్పవిలాపం’ పాఠం విని పూలు కోయడము మానేసావా? అట్లైయితే ఎలాగే తల్లీ? లోకంలో పూసే పులన్నీ ఏం గావాలి? దేవుడి పూజకూ, పెళ్ళిళ్ళకూ, పేరంటాలకూ పూలు లేకపోతే ఎలాగ?” అన్నది నానమ్మ.

“అవును కదా?” అన్నది అమ్మ.

“నా బంగారు తల్లి మనసెంత సున్నితమో!” మురిపెంగా అన్నాడు నాన్న.

‘అందతా నాకు తెలియదుగానీ మన ఇంట్లో మాత్రము కోమలమైన, సున్నితమైన ఈ పూలను నేను కోయను. మాలలూ అల్లను. ప్లీజ్ నానమ్మా, అమ్మా! మీరూ కోయకండి. వాడిపోయేదాకా కొమ్మలకే వుండనీయండి. కావాలంటే మీ పూజకు బయటకొనుక్కోండి’ అన్నది సిరి.

‘సరే… సరే, మేమూ త్రెంచములే తల్లీ’ అన్నారు అమ్మా, నానమ్మా.

మొక్కల నిండా విరబూసిన పూలు పిల్ల తెమ్మరలకు మెల్లగా తలలూపుతుంటే వాటిని చూస్తూ, తాకుతూ పరవశించిపోయింది సిరిచందన.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here