‘సిరికోన’ చర్చాకదంబం-10

0
6

[box type=’note’ fontsize=’16’] సిరికోన వాక్స్థలిలో జరిగిన చర్చ పాఠ్యాన్ని కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ. [/box]

ఈశ్వరార్చనలో తులసి (సిరికోన ముచ్చట్లు)

వివరణ: ఆచార్య రాణి సదాశివమూర్తి

(కొత్తశోధన’ –కవిత: శ్రీ ఎన్. సి. చక్రవర్తి)

[dropcap]సా[/dropcap]హితీమిత్రులు హైమా భార్గవ్, సుజాత గారలకు ఒక అనుమానం వచ్చింది, ఓ పాటలోని ప్రయోగం సందర్భంగా! “శివుడికి తులసీదళాలు అర్పిస్తారా? తులసితో ఈశ్వరార్చన చేస్తారా?” అని హైమ గారడిగితే, “తులసి కథలో ఆమె భర్తని శివుడు హతమార్చాడని, కాబట్టి శివుడిని, శివపరివారాన్ని తులసితో పూజించరని చదివానండి” అంటూ సుజనగారడిగారు…

మా బృందంలో ఎవరికి ఏ అనుమానం వచ్చినా, తీర్చే సంప్రదాయ విజ్ఞాన కల్పవృక్షం మా ప్రథమ దేశికులు, ఆచార్య రాణి సదాశివమూర్తి గారు. పురాణశాస్త్ర ప్రమాణాన్ని చూపుతూ వారిలా వివరించారు:

తులసీమఞ్జరీభిర్యః కుర్య్యాత్ హరిహరార్చ్చనమ్ ।

న స గర్భగృహం యాతి ముక్తిభాగీ భవేన్నరః ।

తులసీ దళములతో హరి, హరులను అర్చించిన వారు తిరిగి తల్లికడుపులోనికి చేరరు.

ముక్తిని పొందుదురు.

పుష్కరా- ద్యాని తీర్థాని గఙ్గాద్యాః సరితస్తథా ।

వాసుదేవాద- యోదేవా వసన్తి తులసీదలే ।

తులసీమఞ్జరీయుక్తో యస్తు ప్రాణాన్ విముఞ్చతి ।

యమోన వీక్షితుం శక్తో యుక్తం పాప శతైరపి”

ఇతి పాద్మోత్తరఖండే

“యత్రైకస్తులసీవృక్షస్తిష్ఠతి ద్విజసత్తమ! ।

తత్రైవ త్రిదశాః సర్వే బ్రహ్మవిష్ణుశివాదయః ।

కేశవః పత్రమధ్యేషు పత్రాగ్రేషు ప్రజాపతిః ।

పత్రవృన్తే శివస్తిష్ఠేత్ తులస్యాః సర్వదైవ హి।

లక్ష్మీః సరస్వతీ చైవ గాయత్రీ చణ్డికా తథా ।

శచీ చాన్యా దేవపత్న్యస్తత్ పుష్పేషు వసన్తి వై ।

ఇన్ద్రోఽగ్నిః శమనశ్చైవ నైరృతో వరు ణస్తథా ।

పవనశ్చ కువేరశ్చ తచ్ఛాఖాయాం వసన్త్యమీ ।

ఆదిత్యాదిగ్రహాః సర్వే విశ్వే దేవాశ్చ సర్వదా ।

వసవో మనవశ్చైవ తథా దేవర్షయోఽఖిలాః ।

విద్యాధరాశ్చ గన్ధర్వాః సిద్ధాశ్చాప్సరసస్తథా ।

తులసీపత్రమాశ్రిత్య సర్వదా నివసన్తి వై ।

చిన్వన్తి తృణజాతాని తులసీమూలజాని వై ।

తద్దేహస్థా బ్రహ్మహత్యాశ్చినోతి తత్క్షణాద్ధరిః ।

గ్రీష్మకాలే ద్విజశ్రేష్ఠ! సుగన్ధైః శీతలైర్జలైః తులసీసేచనం ।

కృత్వా నరో నిర్వాణమాప్నుయాత్ ।

చన్ద్రాతపం వా ఛత్రం వా తులస్యై యస్తు యచ్ఛతి ।

విశేషతః నిదాఘేషు స ముక్తః సర్వ- పాతకైః ।

ఇతి పాద్మే క్రియాయోగసారే “

ఆచార్య వర్యులు ఈ వివరణ తెలపడానికి కాస్త ముందు, డా. ఉపద్రష్ట వారు:

“యన్మూలే సర్వ తీర్థాని సన్మధ్యే సర్వ దేవతా

యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్’’ – అని శాస్త్రం.

తులసిమొక్క కాండములో సమస్త దేవతానీకం ఉంటుందని, దాని అగ్రభాగంలో చతుర్వేదాలు, మూలములో సకల తీర్థాలు వుంటాయని ఈ శ్లోకం పిండీకృతార్థం. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, రుద్ర తులసి, ఇత్యాదులు ఎన్నో రకాలుగా ఉన్నాయని జనశ్రుతి.” అని తాను విన్న తులసి ప్రాశస్త్యాన్ని వివరించారు.

ఇంతలో నీలకంఠం నరసరాజు గారు – “గణపతి దేవార్చనకు, తులసి నిషిద్ధమంటారు.. సత్యమేనా? సెలవివ్వగలర”ని మనవి చేశారు.

దానికి ఆచార్య వర్యులు సదాశివమూర్తి గారి సప్రమాణిక వివరణ:

గణేశపూజనే తులసీనిషేధం

యథా

తులసీం ప్రతి గణేశవాక్యమ్

తులసితో గణేశుడు చెప్పిన విషయం

“పుష్పాణాం సారభూతా త్వం భవిష్యసి మనోరమే! ।

కలాంశేన మహాభాగే! స్వయం నారాయణప్రియా ।।

అందరి మనస్సులను ఆకర్షించుదానా!

సమస్తపుష్పములలో నీ యొక్కచిన్న సౌరభకళాంశముచేతనే సారభూతమైనదానివి (అనగా సర్వ శ్రేష్ఠురాలవు) కాగలవు. నీవు నారాయణునకు ఇష్టురాలవు.

ప్రియా త్వం సర్వదేవానాం కృష్ణస్య చ విశేషతః।

పూజా విముక్తిదా నౄణాం మమ త్యాజ్యా చ సర్వదా

నీవు దేవతలందరకూ పూజలో ఇష్టురాలవు. విశేషించి శ్రీకృష్ణుని నిత్యం తులసీ దళములతో పూజిస్తే ఆ నరులు జన్మాంతంలో ముక్తిని పొందుతారు. కానీ నా పూజలో మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టబడదగినదానవు

బ్రహ్మవైవర్త్తే గణేశఖణ్డమ్।

“అక్షతైర్నార్చయేద్విష్ణుం

న తులస్యా వినాయకమ్।

న దూర్వయా యజేద్- దుర్గాం ధుత్తూరేణ న భాస్కరమ్” రాఘవభట్టధృతమ్

రాఘవభట్టీయంలో చెప్పిన విధంగా

విష్ణువును అక్షతలతో పూజించరాదు.

వినాయకుని తులసితో అర్చించరాదు.

అలాగే దూర్వలతో దుర్గను, ఉమ్మెత్త తో సూర్యుని పూజించరాదు.

అయితే వ్రతకల్పరత్నాకరంలో చెప్పిన ప్రకారం వినాయక చవితి నాడు మాత్రమే 21పత్రిపూజలో తులసి కూడా ఒకటి. అప్పుడు మాత్రమే వినాయకుని తులసితో పూజించవచ్చును..

ముక్తాయింపు:

తులసికి సంబంధించి వివిధమూలాలలో ఎక్కడ ఏమున్నదో దాన్ని ప్రశ్నానుకూలంగా మీముందు ఉంచాను కానీ నా పక్షం ఏమిటో చెప్పలేదు కదా! ఇదిగో ఇదీ స్వపక్షం:

నేను ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యుణ్ణి. కనుక నా దృష్టిలో

తులసి (Holy Basil) సర్వౌషధమహారాజ్ఞి.

మనకు తెలియని మరో విషయం.

ఉత్తరేణి (Achyranthes aspera).. సర్వౌషధచక్రవర్తి! ఈ రెండు ఉన్న చోట వ్యాధులే ఉండవని భారతీయ వైద్యవిధానం చెప్పే పాఠం. “ఇతి రాణీ సదాశివమూర్తి!”

సంశయ విచ్ఛిత్తి అంటే ఇలాకదా ఉండాలి !!

 * * *

సంప్రదాయజ్ఞులకు సంశయ విచ్ఛిత్తి అలా ఆనందకరంగా కలిగితే, ఆ తర్వాత సకల సాహిత్య రసజ్ఞులకు రసానందం ఇలా, ఎన్. సి. చక్రవర్తి గారి కవితారూపంలో కలిగింది. ఇదీ ఆ కవిత👇:

క్రొత్తశోధన

చక్రవర్తి

పాపం! జాలివేస్తోంది

ఈ ఆకులనూ పువ్వులనూ పoడ్లనూ చూస్తే..

అవి ఎరుగకుండానే చెట్లూమొక్కలూ వాటిని కనేసాయి.

కాసేసాయి.

దేవుడి సంతానమేకదా అనుకునేలోపు

కొన్నిటిని గుడి ఆదరించింది

కొన్నిటిని ఇంటిపూజ అలంకరించుకుంది.

కొన్నిటిని చీపురు గుండెకు హత్తుకుంది.

రుచీపచీల్లో తేడాలు సరే.

సువాసనల్లో అస్తి నాస్తులు సరే.

అసలు మట్టికే చూపులో తేడా ఉందేమో.

కాకుంటే లఘ్వలఘు దృష్టి సృష్టీ ఎవరివీ??

అభిరుచులూ అంట్లూ దేవునికి అంటగట్టే శాస్త్రం

ఎక్కడ పుట్టిందా??

అనే ఆరా అప్పుడప్పుడు నన్ను నిలవనీయదు.

ఏ ఆకులు పడకపోతే

దేవుడు శపిస్తాడో

ఏ పూవులు మెచ్చి

భగవంతుడు వరాలిస్తాడో

పరిశోధించి

భక్తితత్త్వ విశ్వవిద్యాలయంలో

డాక్టరేట్ తీసుకోవాలి.

ఇప్పుడు ఇంక తపస్సు మొదలుపెట్టా..

ఏ ఆకులో రేఖలు నిలువుగా ఉన్నాయి?

ఏ ఆకు రేఖలు అడ్డంగా ఉన్నాయి??

కుంకుమపెట్టుకుని ఏవి పుట్టాయి?

ఏ పండు ఏ లోకంలో దొరుకుతుందో!

ఏది ఎవరికి పరలోకానిదో..

నేరుగా వాణ్ణే గైడ్ గా పెట్టుకుంటా.

కాలం మారిపోయిందిగా

ఇప్పుడు అన్నీ సంకరాలే కదా!

పైవారికీ అభిరుచులు ఏమైనా మారాయేమో!

తెలుసుకుని కొత్త సిద్ధాంతం వ్రాస్తా…”

***

(నివేదిక కూర్పు: గంగిశెట్టి లనా)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here