‘సిరికోన’ చర్చాకదంబం-13

0
8

సిరికోన వాక్స్థలిలో జరిగిన చర్చ పాఠ్యాన్ని కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ.

~

టీరత భారతం

― సూత్రం: ఆచార్య రాణి సదాశివ మూర్తి

కొనసాగింపు: పాలపర్తి,ఉపద్రష్ట, ఘంటశాల, కొలిచాల, తుమ్మూరి, రామ్ డొక్కా, విట్టుబాబు, కిలపర్తి మొ౹౹

నివేదిక : గంగిశెట్టి ల.నా.

~

“హేమిటీ?” అని దీర్ఘాల దర్పం చూపే వారి మాట అటుంచండి.

ఏదో ఒక ‘టీ’ లేకుండా , ఇప్పుడు మనవాళ్ళలో చాలా మందికి గడవటం లేదు. అసలు ప్రపంచంలో మన భారతీయుల కంటే, టీ ని ప్రేమించే వాళ్ళు ఇంకే దేశంలోనైనా ఉన్నారా? అని నా అనుమానం!!

దానికి పుట్టిల్లు లాటి చీనాలోనైనా ఉన్నారా? అని కుసందేహం. కుసందేహమేననుకోండి. అక్కడ మంచినీళ్లకు బదులు, ఎక్కువగా తే తోయములు గ్రోలుచుందురని ఎరుకయే లెండి!! ‘తే’ అన్న శబ్దమే ఛయినీలది. ఆపై ఛాయ్ శబ్దం కూడా వారి పేరిట వెలసిందే! వాళ్ళ ప్రాంతం పేరిట వారిని తెల్లోళ్ళు ‘ఛా’ వారని వ్యవహరించారు. ఆ ‘ఛా’ వాళ్ళ ఆకే, బుడతకీచుల (పోర్చుగీసు వారు) చేతుల మీదుగా అంగిరీజుల చేతికి వచ్చింది. 17వ శతాబ్దంలో వాళ్ళు భారతదేశంలో విరివిగా వాటి తోటలు వేయించి, పెంచి, ‘వ్యాపారించారు’!! ఆ దొరలను అనుకరిస్తూ, మనవారూ మెల్ల మెల్లగా అలవాటు చేసుకున్నారు…

అందులో మొదట అలవాటు చేసుకున్నది ఉత్తరాది వారు. మొదట ఆ భాగాల్లో, అందునా అస్సాం, ఇతర హిమవత్పర్వత సాను భాగాల్లోనే తే తోటల పెంపకం జరిగింది కనుక, ఆ అలవాటు వారికి రావటం సహజమే. ఒకప్పుడు ఉత్తర – దక్షిణ భారతాలను విడదీసి చూడడానికి టీ -కాఫీ ల అలవాటును ఒక ప్రాథమిక అంశంగా చూసేవారు.. ఇప్పుడు తారుమారు స్థితి అయింది కానీ, ఒకప్పుడు ఉత్తరాదికి వెళ్లే రైలు బండెక్కామా, గుక్కెడు కాఫీ దొరక్క గొంతు ఎండిపోయేది.. అప్పట్లో అంత టీ మయం, ఇప్పుడు భారతమంతా టీ మాయం…

దీన్నే చమత్కరిస్తూ “టీ రతం భారతం” అనే చమత్కారవంతమైన శీర్షిక పెట్టి, స్వీయవిరచిత సీసం కప్పులో, బహు విధాల టీ ని పోసి, ఆమధ్య కోనకందించారు, ఆచార్య రాణి సదాశివమూర్తి గారు… ఆ బహువిధ తే తోయములేవో చూద్దామంటారా? చూడండి:

అచ్ఛమైనదొక’టి’ అల్లంబుననొక’టి’
ఒక’టి’ మిరియముల నొక’టి’ పచ్చ
పాలతోడనొక’టి’ పాలులేనిదొక’టి’
తేటమీగడకట్టి తేలనొక’టి’
నల్లమందుదొక’టి’ చల్లనిదొక్క’టి’
గసగసాలనొక’టి’ *గరికనొక’టి’
నిమ్మగడ్డినొక’టి’ నిమ్మనీటనొక’టి’
ఔషధీయమొకటి ఔననంగ

వేడ నిచ్చునీరు వేడితేనీరది
వేయివిధములరయ వేడ్క మీర.
‘టీ’రతమ్ము నేడు భారతమఖిలంబు
తెమ్ము తెమ్ము బోటి ‘తే’టి నీరు
(* గరిక టీ – వ్హీట్ గ్రాస్ టీ)

రాణివారి సీసం లోని మొదటి రెండు పాదాల టీ భేదాలు తప్ప, అన్యం గ్రోలే భాగ్యం ఈ వ్యాసరచయితకు లభించలేదు. దానికి చింతితుడను..

(చైనా వెళ్ళినప్పుడు అక్కడ గైడ్ చెబితే, జాస్మిన్ టీ పొట్లం తెచ్చుకొని, దాచుకొని దాచుకొని ఏపాలు కలపకుండా, స్వచ్ఛంగా, అలానే సేవించాను. ఒకమారు చిత్ర సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ గారు వచ్చి, ఆ టీ ని సేవించి, ముచ్చటపడి , తమ షాపతనికి చూపి తెప్పించుకొంటానని ఆ పొట్లం కవరును తీసుకెళ్లారు! ఛాయినా మల్లిక తే తోయమే, తోయము!!)

***

ఇంతకీ సిరికోనలో ఈ “టీ రథం” ఏమిటి? ఏమిటి దీని కథాకమామీషు? అనే ప్రశ్న వస్తుంది కదా! సెలవిస్తాను, అవలోకించండి….

ఆ మధ్య గిరీశం గారిని గుర్తుకు తెచ్చుకొని, అచ్చతెలుగు అవధాని డా. పాలపర్తి గారు ఎక్కడో ఓ పద్యం చెబితే, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అట్లాంటా మిత్రులు కొలిచాల సురేష్ గారు సరదాగా ఈ కింది పద్యం చెప్పారు.

వాతాహారవిరోధుని
చేతుల జారిన యమృతము చెట్టై ధరణిన్
శ్రీతేయాకై విరిసెను
టీ తాగని వాడు పోతుటీగై పుట్టున్!

ఇందులో “ప్రాస స్థానంలో పడ్డ ‘తాగని’ శబ్దం అసాధువు, ‘త్రాగని’ శబ్దం కదా సాధువు,” అని వైయాకరణులు అనుకునే అవకాశం ఉందని వారే భావించి, -ద్రా- ద్వితీయాక్షరంగా మరో పద్యం చదివించారు. అది:

నిద్రాపేక్ష హరించి స-
ముద్ర తరంగ సరణి కడు మోదమొసంగున్
భద్రాత్మక పేయంబగు
టీ ద్రాగని వాడు పోతుటీగై పుట్టున్!
(*పేయము=పానీయము; భద్రాత్మకము=శుభముకూర్చునది)

దానిపై అస్మదీయుడు స్పందిస్తూ

“టీ తాగి తాగి నేనిపు

డే తీరైతినొ, ఎరుగ పరేశునితరమే!” అని అదే కందంలోనే కామెంటించి, ఆపై స్వచ్ఛందంగా

“కవికులపు పోతుటీగా!

కళవళ పడనేలా!? కాలము మారెగా!!

త్రాగు అసాధువు; తాగే సాధువు!!!” అని అభినవ్య వ్యాకరణ సూత్రం చెప్పాను…

ఆపై డాలస్ గురుపీఠం డా. ఉపద్రష్ట సత్యం గారు, నన్నో మరి కొలిచాల గారినో హాస్యమాడుతూ ― “హా! తెలిసెన్!” … మీ ‘వచోవైశారద్యానికీ,’ ‘‘సాహిత్యస్ఫురన్మాధురీ చారుప్రౌఢిమ”కు ‘టీ పానమా’ రహస్యం?” అంటూ లోగుట్టు బయటపెట్టేశారు.

అంతటితో ఆగారా? లేదు! వారి శేముషి నీ, వారి స్వాభావిక శైలిలో – “ఓ మహానుభావుడు సరస శ్లోక రూపంలో వెలువరించిన భావం గుర్తుకొచ్చింది” అంటూ ఈ క్రింది శ్లోకం సెలవిచ్చారు:

“కాఫీపానం చ టీ పానం నిశ్శ్రేయసకరే ఉభే

కాఫీటీపానయోర్మధ్యే టీపానం విశిష్యతే”

ఇదిలా సాగుతూ ఉంటే కవయిత్రి ఘంటశాల నిర్మల గారికి అసలు ఈ “టీ” ని అసలు సిసలు తెలుగులో ఏమని పిలవాలి? అనే ఆలోచన వచ్చింది. రావటం ఆలస్యం, వెంటనే ఇలా పేరు పెట్టేశారు :

కషాయదుగ్ధమిశ్రిత సశర్కర ఉష్ణోదక పానీయము

ఎవరింటి టీ తో ఏం కష్టం పడ్డారో పాపం!!! “ఆ ‘కషాయ’ కు ముందు ‘శుష్కహరిత’ కూడా జోడిస్తే?” అనేది ఉపద్రష్ట గారి సూచన!

ఈ -‘ శుష్క హరిత్తృణ కషాయ దుగ్ధ….’ మిశ్రణ మీమాంస ఇలా సాగుతూండగానే, నిర్మలగారు ఉత్తుంగ పద్యోత్సాహ తరంగితులై తానూ ఒక పద్యం గాని పద్యం ఇలా చదివించారు:

“టీయే పానీయమ్ముల మేటి
ఏదీ మరియొకటి సాటి ఎంచగ భువిలో
వ్రాయసకాళ్ళకు ప్రియవధూటి
శిరోభారమునకు చెల్లుచీటి సిత్రముగాదా!”

నిర్మలగారు వచనకవితామార్గానికి చెందిన వారు. పద్యరూపంపై గౌరవమున్నా, అందులో ప్రవేశం లేదు. అందుకే “ఇది కేవలం సద్యోగర్భంగా ‘పేలిన’ సరదా పలుకు. పంటికిందరాళ్ళులా పరమదోషాలుండే ఉంటాయి. కోనలోని పండితశ్రేష్ఠులు సవరించేందుకైనా అర్హమని భావిస్తే, సవరించ కోరుతున్నాను” అన్నారు.

ఆపై… పైదాన్ని మిత్రులు తుమ్మూరి రామ్మోహన్ రావు గారు ఇలా సలక్షణ కందంగా సవరించి సమర్పించారు:

“ఈ టీ పానీయములన్
మేటి గదా! ఏది సాటి మేదిని యందున్
దీటైనది తలపోటుకు
వాటముగా బ్రియ వధూటి వరకవి గమికిన్౹౹”

ఇంతలో, ఉపద్రష్ట సత్యం గారికి, రెండో కప్పు కాఫీ సేవిస్తూ ఉంటే, వెనకటికి పోకూరి కాశీపతి గారు, మదరాసులో అవధానం చేస్తుండగా, తాపీ ధర్మారావు గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిన కాఫీ దండకం గుర్తొచ్చింది. ఆసక్తి ఉన్నవారి కొరకు వెంటనే పంచేశారు:

“శ్రీమన్మహాదేవి… లోకేశ్వరీ! కాళికా సన్నిభాకారిణీ! లోక సంచారిణీ అంబ! కాఫీ జగన్మోహినీ! తొల్లి శ్రీకృష్ణుడాస్వర్గమున్‌ జేరి పూతంబ పారిజాతంబున్‌ తెచ్చియున్‌ నాతికిన్‌ ప్రీతిగానిచ్చుకాలంబు నందు ఆ సుమంబునందునం గల్గు బీజంబు ఉర్వీస్థలిన్‌ రాలియున్‌ లోక బేధంబుజే కాఫి భూజంబుగా పుట్టియున్‌ కొమ్మలన్‌ రెమ్మలన్‌ బూవులన్‌ తావులన్‌ జక్కనౌపిందెలన్‌ జిక్కినౌ కాయలన్‌ చొక్కమౌ బండ్ల భాసిల్ల దద్బీజజాలంబు ఐర్లండు నింగ్లండు హాలెండు పోలెండు రష్యా జపాన్‌ జర్మనీ గ్రీకు దేశంబులన్‌ నాటి పెన్‌ మాకులై ఇండియాన్‌ తోటలై విత్తనాలిచ్చుచున్నావటంచున్‌ మదించోడిన్‌ బాపురే తీపిలో నీరమున్‌ క్షీరమున్‌ చక్కెరన్‌ మించుటన్‌ గాదె , నీ బీజ చూర్ణంబు ఆ మూటిలో జేర్చి సేవించుటన్‌ నీదు బీజంబునన్‌ బెంచులో మాడ్చి చూర్ణంబు గావించినన్‌ తీపి పోదాయె నీ మాధురీ శక్తి నీ యింపు నీ సొంపు నీ పెంపు వర్ణింప నేనెంతవాడన్‌, ధనాకర్షిణీ! ప్రాణసంరక్షిణీ! ధాత్రినెవ్వారలేన్‌ వేకువన్‌ లేచియున్‌ నిత్యకృత్యంబులన్‌ దీర్చి మున్ముందుగా నిన్ను పానంబు గావింపకున్నన్‌, ద్విజుల్‌ వేదమంత్రంబులున్‌ పల్కగాలేరు

ప్రాంచత్కవుల్‌ పద్యంబుల్‌ హృద్యమౌరీతి నిర్మింపగా లేరు గాయకుల్ శౌరి దాసుల్‌ గళంబునెత్తియున్‌ బాడి నృత్యంబులన్‌ చేయగా లేరు శిల్పుల్‌ మనస్ఫూర్తిగా సుత్తి చేపట్టగా లేరు వైశ్యోత్తముల్‌ కొట్ల తాళంబులన్‌ తీయగాలేరు డ్రైవర్లు స్టీరింగులన్‌ పట్టగా లేరు టీచర్లు పాఠంబులన్‌ చెప్పగాలేరు డాక్టర్లునింజక్షనుల్‌ జేయగాలేరు ప్లీడర్లు నోరెత్తి వాదింపగాలేరు

జడ్జీలు ఏ స్వల్పమౌ తీర్పులన్‌ జెప్పగాలేరు దిట్టంబుగా బ్రాలసుల్‌ కూట సాక్ష్యంబులన్‌ చెప్పగాలేరు వారంగనల్‌ కోడెగాండ్రన్‌ వెసన్‌ కేళిలో నోలలాడింపగాలేరు ముప్పూటలన్‌ నిన్నొగిన్‌ గ్రోలకున్నన్‌ శిరోభారమై నాల్క ఎండున్‌-మనంబెంతో చాంచల్యమున్‌ నిత్యమున్‌ వేకువన్‌ దర్శనంబిచ్చి నిన్‌ బాగుగా త్రాగు సౌభాగ్యమున్‌ గూర్చి రక్షింపవే సారెకున్‌ గొల్చెదన్‌ విశ్వకర్మాస్వయంబంధునన్‌ సత్కవీంద్రుడనన్‌ చెల్లు పోకూరి కాశీపతి స్వాంతరాజీవసంవాసినీ! నీకికన్‌ మంగళంబౌ మహాకాఫీ దేవీ నమస్తే నమస్తే నమస్తే నమః.”

ఎంచక్కా “టీరతం” నడుస్తూంటే, ఉన్నట్లుండి ఇట్లా కాఫీ యోప ద్రష్టవ్యానికి కడంగుతామంటే , తక్కుంగల కవులు ఊరకుంటారా ఏమిటి?

అందుకే ఆస్టిన్ వాసి, రామ్ డొక్కా గారు, రంగ ప్రవేశం చేసి–

“పండితుడను కాను, పండిత శ్రేష్ఠుండ
కాను కాను గాని, నేను గూడ,
ప్రశ్న వేసినపుడు పలుకంగ వలెగదా,
నిజము చెప్పుచుంటి నిర్మలక్క..”

అంటూ మునుపు నిర్మలగారు పెట్టిన అనవద్య అపద్య పద్యానికి తన వెర్షను ఇలా కవి సేసుకొన్నారు:

“కం. చేటేమిటి? లోటేమిటి?
ఈ”టీ”వరమిచ్చెనమ్మ, ఇమ్మహి ప్రజకున్,
చీటికి మాటికి గ్రోలుచు
మేటిల్లెడి తలపువీణ మీట కవనమౌ..”

ఇప్పట్టున, నిజం చెప్పొద్దూ, నాకూ ఒకపాటి టీవేశం తన్నుకొచ్చింది. దరిమిలా నేనూ ఒక కందాన్ని సంధించాను:

“కం. టీయే మేటి సకల పా
నీయముల,శిరోభరముల నీల్గుడు చీటీ
వ్రాయసకాండ్ర వధూటి క
దా! యేదీ తనకు సాటి ధారుణి లోనన్”

“సదుగ్ధ,శర్కరీ సమ్మిత, శుష్క తే పత్రోష్ణ కషాయ ప్రమోదినీ! ఏతత్ ప్రశంసకు మీమాటలే సరి… కానీ తేతోయముల పుచ్చుకొను వేళ, కించిత్ ప్రలోభమునకు లోనై పై తీరుగ మార్చితి.. ఏ తీరున నిక మన్నింతురో, మగానుభావులన్!!” అని నిర్మల గారికి వారికి కరమిష్టమైన “మగానుభావ” శబ్దం వాడి మరీ నివేదించాను….

ఆ తదుపరి, ఇపుడిపుడే వేమనారాధన మొదలుపెట్టిన కెనెడా మిత్రులు, శ్రీ కరవది హనుమంతరావు ఇలా ఆటవెలదిని కట్టి విసిరారు:

“ఆ.వె. కాకి కోకిలములు కానొక్కగానున్న
కూత మేత బ్రతుకు కూడ వేరు
త్రాగు వార ఛాయి తాగుబోతులు వేరు
విశ్వ సత్య మిదియె వినుర హనుమ”

“ఆ.వె. కప్పు వేడి ఛాయి కరిగించు నిద్రను
పచ్చ ఛాయి తోన బరువు తరుగు
ఛాయి తోనె మొదలు చర్చలు సంధులు
విశ్వ సత్య మిదియె వినుర హనుమ”

ఇంతలోగా కొలిచాల సురేష్ గారి నిశితమైన చూపు నిర్మల గారి టీగీతం పై పడింది. నిర్మల గారినుద్దేశిస్తూ వారన్నారు― ” మీరు రాసింది కూడా చక్కగా చతుర్-మాత్రా గణాలతో లయబద్ధంగా సాగుతోంది. దాన్ని కందంలో కిట్టించే ప్రయత్నాలు అందంగానే ఉన్నాయి కానీ, నాకు మీ ఒరిజినల్ గీతమే నచ్చింది. నిజానికి మీరు రాసింది కందపద్యానికి మూలమైన ఆర్యాగీతిలో దాదాపుగా సరిపోతాయి. ఆర్యాగీతిలో:

  1. ప్రాస అవసరం లేదు.
  2. విరామ యతి ఉంటే చాలు.

నాకైతే మార్చాల్సిన అవసరం కనిపించలేదు. అంతగా కందంలో ఇరికించాలంటే ఇదిగో ఇలా ప్రాసలేని ఆర్యాగీతిగా నడిపించవచ్చు (బేసి జ-గణం పరవాలేదనుకుంటే):

“టీయే పేయముల మేటి
ఏదీ మరియొకటి సాటి ఎంచగ భువిలో
కవుల ప్రియవధూటి శిరో-
భారమునకు చెల్లుచీటి సిత్రముగాదా!”

ఒక ఆధునిక కవయిత్రికి ఇంతకంటే విజయం కావాలి? వారూ వారి మిత్రులు విజయోత్సాహ సంరంభంలో ఉండగా ఆచార్య రాణి సదాశివమూర్తి గారు– తేనీటి కోనేరు– శీర్షికతో ఈ తేట సీసాన్ని వినిపించారు:

సీ. తేనీటి కోనేరు తేటతెల్గున బుట్టె
వెలదికిన్నెరసాని వెనుక సఖియ
కోనపండితవాణి కూన రాగమ్ముల
సిరికోన పద్యాల సిరులు కురియ
అలసినవారలకమృతపానీయంబు
కవిభటశ్రేణులకమ్రమిదియె
రచయిత మతిగెల్చు రమ్యరసాయన
మమరపానతుల్యమతుల గతుల

ఆ.వె. నడుపదారి జూపు నవ్యబంధమ్ముల
బాపుమాంద్యమిలను పరిమళముల
వాహ తాజటంచు వాద్యగాండ్రు పొగడ
జగతి మురియజేయు జయమునిచ్చు

అప్పుడిక సమధికోత్సాహంతో ఘంటశాల నిర్మల గారు తన సహజ కవితా ధోరణిలో

“రాణివారి రచన ఘుమఘుమలతేయాకు
బాణీకి మేమంత బహుపరాకు
గాత్రము చూతమా- మిసిమి మొగలిరేకు
ఏతావతా కోనకు కవనగానపుసోకు” అంటూ అభినందించి

“ఆనందమానందమాయె

మది ఆనందార్ణవమాయె” అని మమరచిపోయారు!

ఇలా మొదలైంది సిరికోనలో “టీరతం!”

అంతటితో ఆగిందా! ఆ పై వారానికి రంగప్రవేశం చేశారు విట్టుబాబు. ఈయన ఇంతకు మునుపే టీ శతకం, బహు విట్టీగా రాసిన వారు. సిరికోన టీరతం గూర్చి, వారి గురు స్థానీయులు డా.సూరం శ్రీనివాసులు గారి ద్వారా విన్నవారై, ప్రత్యేకం తన టీ బాణీ వినిపించటానికే సిరికోనలో ప్రవేశించిన వారై, మునుపటి శతకంలోని పద్యాలను కాక , మాకోసం సరికొత్తగా కొత్తపద్యాలు కవిగట్టి విసిరారు. అవే ఇవి:

మరిన్ని టీలు

పొరలుచుఁ బొంగెడి నీలో
సరగునఁ జక్కెరనుఁ బోసి సరియగు రీతిన్
దొరలించగ లోటాతో
బిరాన, సుయ్ మనుచుఁ బిలుచు ప్రేరణమా? ‘టీ’

నలుగురు కలసిన నడుమన
కిలకిల నవ్వులు విరియగఁ గీలకమగుచున్
జెలిమినిఁ బెంచెడి వరమా!
యలసటఁ దొలగించు కరమ! యద్భుతమా ‘టీ’

ఆశువుగఁ గవితలల్లగఁ
గోశములోఁ బదములన్ని కొసరుచు రాగా
నాశావహకవిజాతికిఁ
బాశకమగు నీదు చవియె! పరవశమా! ‘టీ!’

వారి చిరమిత్రుడే కిలపర్తి దాలినాయుడు గారికి పై ముట్టీల బలం (మూడు+ టీల బలం//సంధికార్యం సరిచూసికొనుడు) పైకొని, కాస్త ఆలస్యంగా – ఏమి”టీ”బలం– అని ఒక సీస పు టీ కవితనిలా అందించారు:

“సీ. పంచేంద్రియమ్ములు పనిచేయవలెనన్న
పడక దిగకనె “టీ”పట్టవలయు!
పరిగెత్తి భానునిపట్టకొన వలెనన్న
పొగలుగ్రక్కెడి”టీ”ని పోయవలెను!
చురుకైన నిర్ణయాల్ చుట్టుకొనవలెనన్న
చుర్రున కాలు”టీ”సుధలు గ్రోలు!
సభలోన చప్పట్ల చరుపు వర్షము గోర
వక్తలకు”టీ”నీయ శక్తి పెరుగు!

తే.గీ. రామ విజయరహస్యముభీమ బలము
కృష్ణు సత్యలు నరకుపైగెలుపు బలము
కలిగి యుంటకు వైద్యులుకలిపినట్టి
బలరసాయన ద్రావకఫలమదేమొ?

పో టీ త్రాగగ బయటకు
నా టీ నాదేను త్రాగి నాకము జూడన్।
మీ టీ మీటగ వచ్చును
నై టీ మరిమారకున్న నైజము మీకున్।।

పోటీ, నాటీ, మీటీ, నైటీ లతో టీకందము

(నై … నహీఁ … హిందీ)

―ఆచార్య రాణి సదాశివ మూర్తి

― ఇతి టీ రత భారతోపాఖ్యానమ్, సిరికోన సమర్పణమ్ సంపూర్ణమ్

 ― గంగిశెట్టి లక్ష్మీనారాయణ (విశ్రాంత ఆచార్యుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here