‘సిరికోన’ చర్చాకదంబం-14

0
8

[సిరికోన వాక్స్థలిలో జరిగిన చర్చ పాఠ్యాన్ని కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ.]

~

సిరికోనీయం

‘రాగరాగిణి రమణి’ (సీసమాలిక) ; ‘భైరవీ’ ప్రకాశిని ― ఆచార్య రాణి సదాశివమూర్తి

(ఉపకులపతి, శ్రీవేంకటేశ్వర వైదిక విశ్వవిద్యాలయం, తిరుపతి)

(ఆచార్య రాణి సదాశివమూర్తిగారు వైదిక విశ్వవిద్యాలయ కులపతి బాధ్యతలు స్వీకరించాక, సృజనాత్మక సాహిత్యరచనలకు వీలు బహు తక్కువైపోయింది.. అయినా ప్రయాణ సమయాల్లో తెరపి దొరికినప్పుడు, ఆ నిత్య ప్రయోగశీలి మనస్సు సృజనలో సేదదీరుతూంటుంది.. అలా ఈ నెల మొదటి వారంలో భోపాల్ వెళ్లి వస్తూ, విమానయానంలో అల్లి, ‘సిరికోన’కు ఇచ్చిన కవిత ఇది👇..)

రాగరాగిణి రమణి

(*72 మేళకర్తలనామావళితో సురలోక భూలోక మహిళాస్తవ సీసమాలిక.

సూచన: ఈ సీసమాలికలో ప్రతి పెద్ద పాదం ఒక మేళకర్త రాగం పేరు తో మొదలౌతుంది (ఆ రాగాల వివరాలు దిగువ ఇవ్వడమైంది.); కొన్ని చోట్ల రాగం పేరులో ప్రియ అని వచ్చినప్పుడు “ప్రి” కి పూర్వాక్షరాన్ని లఘువు గానే గ్రహించడం జరిగింది. గమనించ ప్రార్థన.)

సీ.
కనకాంగివై నీవు కమనీయరూపాన
కల్పపాదపవల్లి కళలజూపి
రత్నాంగివై యింట రమణీయరుచులతో
లలనామణులలోన లక్ష్మివౌచు
గానమూర్తివనగ ఘనరాగములనేర్చి
సరససుస్వరకోటి సరణిగెల్చి
శ్రీవనస్పతిభాతి జీవనావనికెల్ల
చల్లదనమునిచ్చు చందనాంగి
మానవతివి నీవు మానినీగణముల
లెక్కింపదగునట్టి లేమవీవు
తానరూపిణివమ్మ తాపంబు తొలగింప
గేహకృత్యములెల్ల కేళినీకు
సేనావతివనంగ సేవికాతతులచే
సేవలందుకొనెడు సిరివి నీవు
హనుమతోడి జనని యంజనాంబికవోలె
తనయుల లాలించు తల్లివీవు

ధేనుకాగణముల దేవధేనువువంటి
సుధలనొసగుమాత సుగుణవీవు
నాటకప్రియవమ్మ నటరాజసతివీవు
సుతుల నటనమెచ్చు సుదతి నీవు
కోకిలప్రియగాన కోమలస్వరగాత్రి
కోనకోనల బల్కు గోరువంక
రూపవతిగ నవ్యరోచిస్సులను గూడి
భాసిల్లు కమనీయ భామవీవు
గాయకప్రియవమ్మ గానరీతులనెంచ
చతురాననునిపత్ని సాటి నీవు
వకుళాభరణదీప్తి వచనంబులను నింపి
పరివారసుఖముల పాదుకొల్పి
మాయమాళవగౌళ మనసులోతులనిల్పి
మంచిమాటలనేర్పు మాతృమూర్తి
చక్రవాకమువంటి చక్కని సతివీవు
పతికి హృదయరాజ్ఞి పరమ సాధ్వి!

సూర్యకాంతవునీవు సూర్యుండు నీపతి
కార్యశూరుని పత్ని కార్యదక్ష
హాటకాంబరి లక్ష్మి హరిపత్ని దయజూడ
హాయినొందుమ నీవు హసితవదన
ఝంకారసుధ్వనుల్ జయకారములు కాగ
కేళ్యక్షి మధుపాళి గెల్చినావు
నటభైరవిగ నిల్చి నాట్యంబు జూపేవు
నట్టింట నలుదెసల్ నడచి నీవు
కీరవాణిని* జూచి కీర్తించి హరికథల్
సుతుల సన్మార్గంబు జూపు జనని
ఖరహరప్రియవమ్మ కమలాలయ తల్లి
గృహలక్ష్మి నీవమ్మ కృత్యయజ్ఞ
గౌరీమనోహరి గారవింపగ హితుల్
ఇంట మింటను గూర్ప నీప్సితముల
వరుణప్రియవు గేము వామవై నడిపేవు
పతియు పెద్దలు సంతు పరవశించ

మారరంజని భర్తృమానసకలహంసి
దాంపత్యసుఖదాత్రి ధర్మతరుణి
చారుకేశివి ఘనచారుచర్యాలయ
చారువైభవదీప్తి చారుగాత్రి
సరసాంగి సరసాల సమరాన సమ్రాజ్ఞి
సంతోషశిఖరాల సర్వదాత్రి
హరిపూర్వకాంభోజి యలరింప స్వరపాళి
ఆత్మీయతనుపంచు హాయివమ్మ
శంకరాభరణంబు శర్మదధీరమై
అమరు నీ పూజలందాదరముగ
నాగమోదిని శివనగపుత్రికరుణచే
గానఫణితి నీదు గమక మహిమ
యాగప్రియా గృహయజమానపత్నివి
అర్చింప జఠరాగ్ని నఖిల జనులు
రాగవర్ధని యన రాజితహృదయాబ్జ
అనురాగ ఘనరూపవమ్మ వీవు

గాంగేయభూషిణి గంగా తరంగిణి
నడకలో నవ్వులో నర్తనమున
వాగధీశ్వరివీవు వాదపటిమజూపి
ఒప్పింపదగునట్టి ఓర్పు నీది
శూలినివి కపాలి సుందరేశుడు మెచ్చు
రూపలావణ్యయౌ రుద్రపత్ని
చలనాట పలికించు చతురాంగనవు నీవు
చంచలదృక్చరచాపనేత్రి
సాలగం జయకారసంగీతరసధాని
గళమునందమరంగ గానమొసగి
నవజలార్ణవసీమ నాదభూవలయమున్
రసమయమొనరించు రామవీవు
ఝాలవరాళివై జలపాత ఝరివోలె
నిండుజవ్వనశక్తి నింపిజగతి
నవనీతమయగీతి నందనందనుగూర్చి
ఆలపించవె వల్లవాంగనాగ్ర

పావని నీవని పలువురు పొగడంగ
పొంగవు మోహము పొందవెపుడు
రఘుప్రియ నడచిన రమణీయ పథిలోన
సంచరింతువెపుడు సాదరముగ
గృహగవాంభోధిని గృత్సధేనువు నీదు
ధీకోశమాశల దీర్చువేళ
భవప్రియ సమనీవు బాధలెన్నిటినైన
తోడునీడగనిల్చి తొలగజేయ
శుభపంతుసువరాళి సుఖములనొసగంగ
థిల్లాన జీవనతీరమందు
షడ్విధమార్గిణి సకలార్తిభంజని
సజ్జనోచితమార్గసాక్షినీవు
నీవు సువర్ణాంగి నీమాట సద్వాక్కు
నీనవ్వు నింగికే నిండు వెలుగు
దివ్యమణివినీవు దీవ్యత్ప్రభవునీవు
దివ్యౌకసులు మెచ్చు ధీరనీవు

ధవళాంబరివి నీవు ధరను వీణాపాణి
దరహాసచంద్రికాధారమీవు
నామనారాయణీ నరమంగళేశ్వరి
సర్వార్థసాధికా శరణు తల్లి
కామవర్ధినివీవు కామప్రదాయని
కామసాధనరీతికాంతిదాత్రి
రామప్రియా సీత రమ్యాభిధాయిని
గృహధర్మబోధకై కృష్ణవీవు
గమనశ్రమకునోర్చి గంధవాహినివౌచు
సౌజన్యమునుచూపు సౌమ్యవీవు
విశ్వంభరివనుచు విశ్వమే కీర్తింప
వినయంబు ధనమైన విమలమతివి
శ్యామలాంగివి నీవు శ్యామాక ఛవివెల్గు
శ్యామసుందరివీవు శ్యామవీవు
షణ్ముఖప్రియవమ్మ షట్చక్ర గామిని
కౌళభామామణి గౌరినీవు

సింహేంద్రమధ్యమ సింహగర్జనవాణి
సింహాసనారూఢ సింహయాన
హేమవతివి నీవు హేమాద్రి తనయవు
భువినిబంగరుగని పోతనీవు
ధర్మవతివి నీవు ధరణిరంజిలునట్లు
ధాన్యదానముచేయు ధన్య వమ్మ
నీతిమతివనుచు నీయందు ప్రీతితో
నియమముగ జనులు నిన్ను పొగడ
కాంతామణివి తల్లి కలిమిగర్వములేని
సకలసద్గుణరాశి సరళరూప
రిషభప్రియవనంగరిపుమనోహారిణి
తరుణీజనంబుల తారతిలక
నవలతాంగికిసాటి నతమధ్య తనుతన్వి
సుమసమదరహాస సుందరాస్య
వాచస్పతిరసన వాగ్దేవి వరపుత్రి
కచ్ఛపీసుస్వర కమలనేత్రి

మేచకళ్యాణివై మేచకకేశినీ
మణిమయమేఖలామండితాంగ
చిత్రాంబరీశాంతచిత్తాసుభాషిణీ
చింతాతిరిక్తవు సిద్ధభాగ్య
సుచరిత్ర సద్భావ సుగుణాకరా శుభా
సుందర సుకుమార సుమసమాస్య
జ్యోతిస్వరూపిణి జోతలగైకొను
యోషిద్వరాగణ్యయోగధామ
ధాతువర్ధిని లాస్య ధరణీహితాచార
తారతమ్యరహిత తరళహృదయ
నాసికాభూషిణి నాదానుమోదిని
తారలు చినబోవ తళుకులొలుకు
కోసలమున రామ కోదండభంగిమన్
భ్రూభూవిలాసాల భూమికమరె
రసికప్రియమనగ రమ్యరమణిదీప్తి
మేళకర్తలందు మేళవించె

ఆ.వె.
అరయనేడుపదులకాపైనమరిరెండు
మేళకర్తృరాగమేళమందు
సురల నరుల నుండి చూపింప యత్నంబు
రమణివైభవంబురంజితముగ
(*కీరవాణి – శ్రీశుకప్రోక్తభాగవతం)

[*72 మేళకర్తల పేర్లు: 1. కనకాంగి రాగం, 2.రత్నాంగి రాగం, 3.గానమూర్తి రాగం, 4. వనస్పతిరాగం, 5. మానవతి రాగం, 6. తానరూపి రాగం, 7. సేనావతి రాగం, 8. హనుమతోడి రాగం, 9. ధేనుక రాగం, 10. నాటకప్రియ 11. కోకిలప్రియ రాగం, 12. రూపవతి రాగం, 13. గాయకప్రియం రాగం, 14. వకుళాభరణం రాగం, 15. మాయామాళవగౌళ రాగం, 16. చక్రవాకం రాగం, 17. సూర్యకాంతం రాగం, 18. హటకాంబరి రాగం, 19. ఝంకార ధ్వని రాగం, 20. నటభైరవి రాగం, 21. కీరవాణి, 22. ఖరహరప్రియ, 23. గౌరీమనోహరి, 24. వరుణప్రియ, 25. మారరంజని, 26. చారుకేశి, 27. సరసాంగి, 28. హరికాంభోజి, 29. ధీరశంకరాభరణం, 30. నాగానందిని, 31. యాగప్రియ, 32. రాగవర్ధని, 33. గాంగేయభూషిణి, 34. వాగధీశ్వరి, 35. శూలిని, 36. చలనాట, 37. సాలగం, 38. జలార్ణవం, 39. ఝాలవరాళి, 40. నవనీతం, 41. పావని, 42. రఘుప్రియ, 43. గవాంబోధి, 44. భవప్రియ, 45. శుభపంతువరాళి, 46. షడ్వితమార్గిణి, 47. సువర్ణాంగి, 48. దివ్యమణి, 49. ధవళాంబరి, 50. నామనారాయణి, 51. కామవర్ధిని, 52. రామప్రియ, 53. గమనశ్రమ, 54. విశ్వంభరి, 55. శ్యామలాంగి, 56. షణ్ముఖప్రియ, 57. సింహేంద్రమధ్యమ, 58. హేమవతి, 59.ధర్మవతి, 60. నీతిమతి, 61. కాంతామణి, 62. రిషభప్రియ, 63. లతాంగి, 64. వాచస్పతి, 65. మేచకళ్యాణి, 66. చిత్రాంబరి, 67. సుచరిత్ర, 68. జ్యోతి స్వరూపిణి, 69. ధాతువర్ధిని, 70. నాసికాభూషిణి, 71. కోసలము, 72. రసికప్రియ రాగాలు..]

**

భైరవీ

[సంగీత శాస్త్ర అధ్యయనంలో ‘సంగీత భూషణ’ పట్టాన్ని పొందిన శ్రీ ఎ. సి.పి. శాస్త్రిగారు “భైరవము అంటే భీతి గొలిపేది అనే అర్థం స్థిరపడిపోయింది కదా! జరాసంధుడి వంటి రాక్షసులు భైరవపూజలు చేశారని ప్రతీతి.. మరి ఇలాటి అర్థమున్న పేరును, ‘భైరవి’, ‘ఆనందభైరవి’ వంటి రాగాలకు పెద్దలెందుకు పెట్టారా? అనే ప్రశ్న ఉదయిస్తున్నది” అని తన సందేహాన్ని వెలిబుచ్చారు. దానికి సమాధానం ఇది:]

“భైరవుని పత్ని భైరవీదేవి.. అంతమాత్రాన భీకరస్వరూపిణి అని కాదు. చివరి వరకూ చదివితే సమాధానం మీకే స్పష్టమౌతుంది..

భైరవీభేదాలు:

  1. త్రిపురభైరవీ
  2. సమ్పత్- ప్రదా భైరవీ
  3. కౌలేశభైరవీ
  4. సకలసిద్ధిదా భైరవీ
  5. భయవిధ్వంసినీ భైరవీ
  6. చైతన్యభైరవీ
  7. కామేశ్వరీ భైరవీ
  8. షట్కూటా భైరవీ
  9. నిత్యా భైరవీ
  10. రుద్రభైరవీ
  11. భువేనేశ్వరీ భైరవీ
  12. త్రిపురబాలా భైరవీ
  13. నవకూటా భైరవీ
  14. న్నపూర్ణా భైరవీ

ఈ భైరవీ స్తోత్రమంత్రములు ఇలాగ―

అథ త్రిపురభైరవీ

“వియద్భృగుహుతాశస్థో భౌతికో బిన్దుశేఖరః ।

వియత్తదాదికేన్ద్రాగ్నిస్థితం వామాక్షిబిన్దుమత్ ॥

ఆకాశభృగువహ్నిస్థో మనుః సర్గేన్దుఖణ్డవాన్ ।

పఞ్చకూటాత్మికా విద్యా వేద్యా త్రిపురభైరవీ ॥” ౧ ॥

త్రిపురా బాలా మంత్రం వలే త్రిపురభైరవీ మంత్రం

అథ సమ్పత్ప్రదా భైరవీ

సమ్పత్ప్రదా నామ తస్యాః శృణు నిర్మ్మలమానసే ॥

శివచన్ద్రౌ వహ్నిసంస్థౌ వాగ్భవం తదనన్తరమ్ ।

కామరాజం తథా దేవి ! శివచన్ద్రాన్వితం తతః ॥

పృథ్వీబీజాన్తవహ్న్యాట్యం తార్త్తీయం శృణు వల్లభే ! ।

శక్తిబీజే మహేశాని ! శివవహ్నీ నియోజయేత్ ॥

కుమార్య్యాః పరమేశాని ! హిత్వా సర్గన్తు బైన్దవమ్ ।

త్రిపురా భైరవీ దేవీ మహాసమ్పత్ప్రదా ప్రియే ! ॥ ౨ ॥

అథ కౌలేశభైరవీ ।

సమ్పత్ప్రదాభైరవీవద్విద్ధి కౌలేశభైరవీమ్ ।

హసాద్యా సైవ దేవేశి ! త్రిషు బీజేషు పార్బ్బతి ! ।

ఇయన్తు సహారాధ్యా స్యాత్ పూజాధ్యానాదికం తథా ॥ ౩ ॥

అథ సకలసిద్ధిదా భైరవీ।

ఏతస్యా ఏవ విద్యాయా ఆద్యన్తే రేఫవర్జితే ।

తదేయం పరమేశాని ! నామ్నా సకలసిద్ధిదా ।

సమ్పత్ప్రదాభైరవీవత్ ధ్యానపూజాదికం తథా ॥ ౪ ॥

అథ భయవిధ్వంసినీ భైరవీ

సమ్పత్ప్రదా భైరవీ ఆద్యన్తే రేఫరహితా చేత్తదా

భయవిధ్వంసినీ భైరవీ భవతి ।

దక్షిణామూర్త్తౌ తథాదర్శనాత్ ।

పూజాదికన్తు సమ్పత్ప్రదావత్ ॥ ౫ ॥

అథ చైతన్యభైరవీ ।

వాగభవం బీజముచ్చార్య్య జీవప్రాణసమన్వితమ్ ।

సకలా భువనేశానీ ద్వితీయం బీజముద్ధృతమ్ ॥

జీవం ప్రాణం వహ్నిసంస్థం శక్రస్వరసమన్వితమ్ ।

విసర్గాఢ్యంమహేశాని ! విద్యా త్రైలోక్యమాతృకా ॥

ఋష్యాదిన్యాసః ।

శిరసి దక్షిణామూర్త్తయే ఋషయే నమః ।

ముఖే పఙ్క్తిచ్ఛన్దసే నమః ।

హృది చైతన్యభైరవ్యై దేవతాయై నమః ॥ ౬ ॥

అథ కామేశ్వరీ భైరవీ ।

“కామేశ్వరీ చ రుద్రార్ణా పూర్వ సింహాసనే స్థితా ।

ఏతస్యా ఏవ విద్యాయా బీజద్వయముదాహృతమ్ ॥

తదన్తే పరమేశాని ! నిత్యక్లిన్నే మదద్రవే । ఏతస్యా ఏవ తార్త్తీయం రుద్రార్ణా పరమేశ్వరి ! ॥ ౭ ॥

అథ షట్కూటా భైరవీ ।

డాకినీ రాకిణీ బీజే లాకినీ కాకినీయుగమ్ ।

శాకినీ హాకినీ బీజే ఆహృత్య సురసున్దరి ! ॥

ఆద్యమైకారసంయుక్తమన్యదీకారమణ్డితమ్ ।

శక్రస్వరాన్వితం దేవి ! తార్త్తీయం బీజమాలిఖేత్ ।

బిన్దునాదకలాక్రాన్తం త్రితయం శైలసమ్భవే ! ॥ ౮ ॥

అథ నిత్యా భైరవీ ।

ఏతస్యా ఏవ విద్యాయాః షడ్వర్ణాన్ క్రమశః స్థితాన్ ।

విపరీతాన్ వద ప్రౌఢే ! విద్యేయం భోగమోక్షదా ।

న్యాసపూజాదికం సర్వ్వమస్యాః పూర్బ్బవదాచరేత్ ॥ ౯ ॥

అథ రుద్రభైరవీ ।

శివచన్ద్రౌ మాదనాన్తం ఫాన్తం వహ్నిసమన్వితమ్ ।

శక్తిభిన్నం బిన్దునాదకలాఢ్యం వాగ్భవం ప్రియే ! ॥

సమ్పత్ప్రదాయా భైరవ్యాః కామరాజం తదేవ హి ।

సదాశివస్య బీజన్తు మహాసింహాసనస్య చ ।

ఏషా విద్యా మహేశాని ! వర్ణితుంనైవ శక్యతే ॥ ౧౦

అథ భువనేశ్వరీ భైరవీ।

హసాద్యం వాగ్భవఞ్చాద్యం హసకాన్తే సురేశ్వరి ! ।

భూబీజం భువనేశానీ ద్బితీయం బీజముద్ధృతమ్ ।

శివచన్ద్రౌ మహేశాని ! భువనేశీ చ భైరవీ ॥ ౧౧ ॥

అథ త్రిపురబాలా భైరవీ ।

అధరో బిన్దునామాద్యం బ్రహ్మేన్ద్రస్థః శశీ యుతః ।

ద్వితీయం భృగుసర్గాఢ్యో మనుస్తార్త్తీయమీరితమ్ ।

ఏషా బాలేతి విఖ్యాతా త్రైలోక్యవశకారిణీ ॥ ౧౨

అథ నవకూటా బాలా ।

బాలాబీజత్రయం దేవి ! కూటత్రయం నవాక్షరీ ।

వియత్కూటత్రయం దేవి ! భైరవ్యా నవకూటకమ్ ॥ ౧౩ ॥

అథాన్నపూర్ణా భైరవీ ।

ప్రణవం భువనేశాని ! శ్రీబీజం కామబీజకమ్ ।

హృదన్తే భగవత్యన్తే మాహేశ్వరిపదం తతః ।

అన్నపూర్ణే ఠయుగలం విద్యేయం వింశదక్షరీ ॥ ౧౪ ॥”

ఇతి తన్త్రసారే భైరవీమన్త్రపరిచ్ఛేదః ॥

అలాగే భైరవరాగం యొక్క పత్ని – భైరవీ అనే రాగిణి

యథా, —

“భైరవీ కౌశికీ చైవ భాషా వేలాబలీ తథా ।

వఙ్గాలీ చేతి రాగిణ్యో భైరవస్యైవ వల్లభాః ॥”

భైరవీ, కౌశికీ, భాషా, వేలాబలీ, వంగాలీ.. అనే అయిదుగురు రాగిణులు.. భైరవరాగపత్నులు

మతాంతరం లో..

మాలవరాగపత్నులైన రాగిణులు..

యథా, —

ధానసీ మాలసీ చైవ రామకీరీ చ సిన్ధుడా ।

ఆశావరీ భైరవీ చ మాలవస్య ప్రియా ఇమాః ॥”

అస్యా ధ్యానం యథా, —

“సరోవరస్థా స్ఫటికస్య మన్దిరే సరోరుహైః శఙ్కరమర్చ్చయన్తీ ।

తాలప్రయోగప్రతిబద్ధగీతి-ర్గౌరీతనూర్నారద భైరవీయమ్ ॥”

ఈ రాగిణినిపాడటానికి అనుకూల సమయం పూర్వాహ్ణకాలం

అస్యా గానసమయః పూర్వాహ్ణకాలః ।

యథా, —

“విభాషా లలితా చైవ కామోదీ పఠమఞ్జరీ ।

రామకీరీ రామకేలీ వేలోయారీ చ గుజ్జరీ ॥

దేశకారీ చ శుభగా పఞ్చమీ చ గడా తుడీ ।

భైరవీ చాథ కౌమారీ రాగిణ్యో దశ పఞ్చ చ ।

ఏతాః పూర్వాహ్ణకాలే తు గీయన్తే గాయనోత్తమైః ॥”

ఇతి సఙ్గీతదామోదరః॥

హనూమన్మతే ఏషా సమ్పూర్ణజాతిః ।

ఈ రాగిణిలో స్వరాలు

మధ్యమ పఞ్చమ ధైవత నిషాద షడ్జ ర్షభగాన్ధారాన్తః ।

మధ్యమస్వరం ఈ రాగిణి ఇల్లు

శరదృతువు లో ఉదయం పూట ఈరాగిణి గానానుకూల సమయం

– రాగమాలాగ్రంథం

మంత్రశాస్త్రంలో భైరవీవర్ణనం

అల్పవయస్కా, సురూపా, సునేత్రా, విస్తారవదనా ।

పిఙ్గలకేశా, కోమలాఙ్గీ, రక్తవర్ణా, శ్వేతవసనా గలశోభితచమ్పకమాలా

ప్రఫుల్లపద్మయుక్తపర్వ్వతగుహాయాం శివపూజాపరాయణా

**

[ఇంత వివరణ అయ్యాక, శ్రీమతి లలితాభాస్కర్ గారు “అష్టభైరవులు ఉపభైరవులు గురించి కూడా తెలుప ప్రార్థన” అంటూ అభ్యర్థించారు..

దానికి సమాధానం:]

“భైరవవిశేషాలు తెలుసు కోవాలంటే శ్రీభైరవతంత్రం, ఆకాశభైరవతంత్రం, విజ్ఞానభైరవతంత్రం వంటి గ్రంథాలు ఉపకరిస్తాయి.”

శత్రుహృదయభేదకమైన మహారవమును చేసిన వాడు కనుక పరమశివుడు భైరవుడైనాడు.

ఈ క్రింది భైరవభేదాలను చూడండి..

వామనపురాణంలో చెప్పబడిన విధంగా…

ఒకానొక సారి రాక్షసులతో దేవతలపక్షాన పరమశివుడు యుద్ధం చేస్తుండగా రాక్షసరాజు తన గదను పరమశివుని ఉరస్సు పైకి విసిరాడు. ఆ దెబ్బకు శివుని రుధిరం నుంచి మహారవం చేస్తూ అష్టదిక్కుల్లో అష్టభైరవులు పుట్టారు.

సర్వాధారుడైన పరమేశ్వరుని నుంచి..

తూర్పున – విద్యారాజభైరవుడు

దక్షిణాన కామరాజభైరవుడు

పశ్చిమం నుండి నాగరాజభైరవుడు

ఉత్తరం నుంచి ఛన్దరాజభైరవుడు

ఈశాన్యం నుంచి లగ్వితరాజ భైరవుడు

ఆగ్నేయం నుంచి దేవరాజ భైరవుడు,

నైఋతి నుంచి ఉగ్రరాజ భైరవుడు

వాయవీయ దిక్కునుండి విఘ్నరాజభైరవుడూ ఆవిర్భవించారు.

(ఇది వామనపురాణోక్త అష్టభైరవచరితం)

అలాగే బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పిన విధంగా.. శరదృతువులో శ్రీ దుర్గా పూజలో పూజింపబడే అష్టభైరవుల పేర్లు..

“మహాభైరవుడు, సంహారభైరవుడు, అసితాంగభైరవుడు, రురుభైరవుడు, కాలభైరవుడు, క్రోధభైరవుడు, తామ్రచూడ భైరవుడు, చంద్రచూడ భైరవుడు.. అని అష్ట భైరవులు”

తంత్రసారంలో.. కాళీపూజలో.. అష్ట భైరవులు

  • ససితాంగ భైరవుడు
  • రురుభైరవుడు
  • చండభైరవుడు
  • క్రోధభైరవుడు
  • ఉన్మత్తభైరవుడు
  • కపాలభైరవుడు
  • భీషణభైరవుడు
  • సంహార భైరవుడు

భైరవ భైరవీ ఉపాసనం వంగదేశంలో చాలా ప్రసిద్ధం.

భైరవభైరవీ విశేషాలగురించి ఒకమహాగ్రంథమే వ్రాయవచ్చు. ఉపాసిస్తే ఎన్నో రహస్యాలు తెలుస్తాయి.

ఈ విషయంలో ఇంతకన్నా ఎక్కువ చెప్పడానికి సమయం చాలదు..

ప్రశ్నలు చిన్నవే. సమాధానాలు చెప్ప మొదలిడితేపెద్ద పెద్ద వ్యాసరాజ భైరవాలే!*

(కూర్పు: ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here