‘సిరికోన’ చర్చాకదంబం-15: సాహిత్యంలో శబ్ద-అర్థాలు

0
10

సిరికోన వాక్స్థలిలో జరిగిన చర్చ పాఠ్యాన్ని కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ.

~

సాహిత్యంలో శబ్ద-అర్థాలు

– చర్చ: ఆచార్య రాణి సదాశివమూర్తి, డా.చొప్పకట్ల, సర్వశ్రీ బులుసు వెంకటేశ్వర్లు, ఏసీపీ శాస్త్రి, పాలకుర్తి రామమూర్తి గారలు.

-కూర్పు, వ్యాస కదంబం: గంగిశెట్టి ల.నా.

~

[dropcap]ఇ[/dropcap]టీవల ఓ కవిమిత్రులు కోనలో ఓ కవిత రాస్తూ, అందులో పాదారంభంలోని అక్షరంతో ప్రాసమైత్రి కుదరడానికి ‘దఘ్నం, జఘ్నుడు, నిఘ్నుడు’ వంటి అరుదైన పదాలను వాడారు. అవీ సహజంగా పడ్డ శబ్దాలుగా కాక, పనిగట్టుకుని వెదికితెచ్చిన పదాల్లా అగుపించాయి. ఎలాగూ అవి సామాన్య పాఠకులకు అందవు కనుక, చివర వాటి అర్థాల పట్టిక కూడా ఇచ్చారు..

కవిత చివర అలాటి శబ్దార్థ కోశం (glossary) ఇచ్చే అవసరం రావటం కంటే, వచనకవితకు మరో ట్రాజెడీ లేదు, నా ఉద్దేశ్యంలో!.. ఆ మాటే నిర్మొహమాటంగా చెబుతూ, “ఎందుకు శబ్దానికింత పెత్తనమివ్వటం?..” అని అడిగాను..

మా కవిమిత్రుడే కాదు, పెద్ద పెద్ద మహాకవులే శబ్దం మాయకు అపారంగా లోనయ్యారు.. ఆ కారణంగానే కదా, వరాలతెలుగు కవి పోతన్న గారిని కట్టమంచి గారు కొంత కింది స్థాయిలో భావించారు తన కవిత్వ తత్త్వవిచారంలో!.. తెలుగు మరో వరాలపంట శ్రీనాథుడు తక్కువేమిటి?.. శ్రీహర్షునితో పోటీపడ్డట్లుగా –ఆయన దమయంతిని ‘సదసత్సంశయ గోచరోదరీ’ అని వర్ణిస్తే, ఈయన ఒక పద్యంలో ఆ సమాసాన్ని అలాగే వాడుతూ, ప్రతిద్వంద్విగా “అస్తిన్నాస్తి విచికిత్సాహేతు శాతోదరీ” అని మరో పద్యంలో అందుకొన్నాడు.. అలాగే ఆయన “కమలేందీవరషండమండిత లసత్ కాసార సేవారతి” అని సరిపెడితే, ఈయన దాన్ని మరింతగా “నానా నదీనద కాంతార పురీ శిలోచ్చయుండనై” అని లాగదీసి తన భాషాధికారాన్ని ప్రదర్శించుకున్నాడు.. సాగీతే భాషాధికారం, సాగకుంటే భాషాడంబరం! కాదంటే శబ్దలోలుపత్వం!!.. ఇదేగా సాహిత్య చరిత్ర అంతటా!!

“శబ్దార్థౌ సహితౌ సాహిత్యం” అని భామహుడు ఏ సుముహూర్తంలో అంత గొప్ప సూత్రాన్ని అందించాడో కానీ, అధిక సంఖ్యాకులు మాత్రం శబ్దమే కవిత్వమనే భ్రమలో పడ్డట్లున్నారు.. శబ్దానికే పైచేయివాటం అంటగట్టారు.. పద్య కవిత్వంలో కాదు; వచనకవిత్వంలో కూడా అదే స్థితి.. శబ్దార్థాలతో సహితమైనది – కలిసినది – సాహిత్యం అంటున్నాము. మరి ఆ రెండూ కలియగా ఏర్పడ్డ ఆ ‘ఎక్స్’ ఏమిటి? ఆ రెండూ దేనికి ఆధారాలో అది! శబ్దం అర్థానికి ఆధారం/ఆకారం.. ఆ రెండూ కలిసి ఆ ‘ఎక్స్’ కు ఆధారం.. ఆ ఎక్స్ రెండింటికీ అతీతమైనది!.. దాన్నే మన పెద్దలు రసమన్నారు. ‘రసో వై సః’ అని మార్మీకరించారు.. భారతీయ సంస్కృతిలోని ప్రతి తాత్త్వికాంశంలోనూ ఆ మూడో డైమన్షన్ ముఖ్యమైంది; అనిర్వాచ్యమైంది.. అక్కడికి వచ్చేసరికి ఎంతో కొంత మార్మికత తప్పని సరి!

కవిత్వంలో కూడా అంతే.. కానీ అనిర్వాచ్యమైన దానికంటే, మనందరికీ వాచ్యమైనదానిమీదనే ప్రేమెక్కువ! కనపడనిదానిమీద కంటే కనపడేవాటి మీదనే మక్కువెక్కువ.. ఆ వాచ్యతాసహజప్రీతివల్లనే కాబోలు, ఎక్కువమందిమి శబ్దం మీద ఎక్కువ మక్కువ చూపుతుంటాము..

***

శబ్దార్థాలకు సంబంధించిన ఏ చర్చాసందర్భం తలెత్తినా, కోనలో మునుపు చాలా పెద్ద చర్చలే జరిగేవి.. అందులో శాస్త్ర చర్చలు..

మునుపోమారు జరిగిన చర్చ ఇప్పుడు అవశ్యం స్మరించుకోదగింది అనిపిస్తోంది.. అందుకే దాన్ని వ్యాసకదంబం చేసి నివేదిస్తున్నాను..

***

ఒకమారు ఏదో సందర్భంలో శబ్దార్థాల చర్చ వచ్చినప్పుడు, అప్పట్లో కోన సభ్యులు, డా. చొప్పకట్ల సత్యనారాయణ గారు వసుచరిత్ర ప్రస్తావన తెస్తూ “రామరాజభూషణుని మార్గం వేరు ప్రతిపద్యశ్లేషఘటనం అతని ప్రత్యేకత! ఆ ప్రత్యేకతే అతని కొంపముంచింది. వసుచరిత్ర ఒక శ్లేషకావ్యంగా మిగిలిపోయింది.” అన్నారు. ఆ మాటపై స్పందిస్తూ, అప్పట్లో మరో విద్వత్సభ్యులైన బులుసు కవిగారు “శబ్దానికి లోబడితే కవి.. అర్థానికి లోబడితే మహాకవి.. చూచు – అనే క్రియమీద వ్యామోహంతో ‘అరిచూచున్.. హరిచూచు — చూచుకములన్’ అంటూ పద్యాన్ని ఎంత పాడుచేశాడు సోమన..” అని పొడిగిస్తూ “ఇదే ఎత్తుగడతో పోతన్నగారు పద్యాన్ని ఎంతో ఎత్తుకు తీసుకుపోయాడు కదా!” అని పేర్కొన్నారు.. దానికి చొప్పకట్ల గారు “నిజమే!శబ్దానికి సలాముగొడితే అర్ధం పేలవమౌతుంది” అని ఒప్పుకున్నారు..

ఆ తర్వాత కవిత్వంలో శబ్దార్థాల మీద లోతైన చర్చ మొదలైంది.

మొదటగా అప్పట్లో తిరుపతి సంస్కృత జాతీయ విశ్వవిద్యాలయంలో డీన్, ఇప్పుడు శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయం కులపతి, ఆచార్య రాణి సదాశివమూర్తి గారు, సంస్కృతంలోని ప్రసిద్ధ కావ్యనిర్వచనాలన్నిటినీ ఇస్తూ చర్చకో శాస్త్రీయభూమికను సమకూర్చారు.. ఆ నిర్వచనాలు మనందరికీ అవసరమైనవే:

*వాగర్థావివ సంపృక్తౌ* – కాళిదాసు

*శబ్దార్థౌ సహితౌ కావ్యమ్* – భామహుడు

*శబ్దార్థౌ సత్కవిరివ ద్వయం విద్వానపేక్షతే* .. మహాకవి మాఘుడు

*శరీరం తావదిష్టార్థవ్యవచ్ఛిన్నా పదావళీ* .. దండి

*అదోషౌ సగుణౌ సాలంకారౌ శబ్దార్థౌ కావ్యమ్* .. ఉద్భటుడు

*కావ్యశబ్దోఽయం గుణాలంకారసంస్కృతయోః శబ్దార్థయోః వర్తతే* .. ఆచార్య వామనుడు

*సహృదయ హృదయాహ్లాదిశబ్దార్థమయత్వమేవ హి కావ్యలక్షణమ్* .. ఆనందవర్ధనుడు

*తదదోషౌ శబ్దార్థౌ సగుణావనలంకృతీ పునః క్వాపి* .. మమ్మటుడు

*శబ్దార్థౌ నిర్దోషౌ సగుణౌ ప్రాయస్సాలంకారౌ కావ్యమ్* .. వాగ్భటుడు

*సాహిత్యం చ శబ్దార్థయోః సంబంధః* – కవికంఠాభరణవ్యాఖ్యాకారః .. *రత్నేశ్వరుడు*

*కావ్యం విశిష్టశబ్దార్థసాహిత్యసదలంకృతిః* .. క్షేమేంద్రుడు

*గుణవదలంకృతం చ వాక్యమేవ కావ్యమ్* .. రాజశేఖరుడు

*నిర్దోషం గుణవద్వాక్యమలంకారైరలంకృతమ్।*

*రసాత్మకం కవిః కుర్వన్ కీర్తిం ప్రీతిం చ విందతి*..’సరస్వతీకంఠాభరణం’లో భోజుడు

*వాక్యం రసాత్మకం కావ్యమ్* .. విశ్వనాథ కవిరాజు

*రమణీయార్థః ప్రతిపాదకః శబ్దః కావ్యమ్* .. జగన్నాథుడు

*కావ్యం రసాదిమద్వాక్యం శ్రుతం సుఖవిశేషకృత్* .. ‘అలంకారశేఖరం’లో శౌద్ధోదని

*సదర్థబోధకశబ్దద్విట్ స్వపితృద్విడేవ హి* .. (చక్కని అర్థాన్ని బోధించే శబ్దశత్రువు స్వపితృశత్రువే)–‘అలంకారపీయూష’ కర్త,వినయంధరుడు..

“వీటికి వాగను శాసనుడైన నన్నయ చెప్పిన “విశ్వశ్రేయః కావ్యమ్. తదదోషౌురికృతౌచవాగర్ధౌ,–సావాగ్యారసవృత్తిః” అనే మాటల్ని కూడా కలుపుకోవలసి ఉంటుందంటూ, “రసప్రవృత్తమైనదే ధ్వనిభూషితమైనదే కావ్యత్వాన్ని పొందుతుందనేది సారాంశం!.. బులుసు పలుకులలోని భావమిదే!!” అని జోడించారు డా.చొప్పకట్ల గారు.

ఆచార్య రాణి గారు, నిర్వచనాలన్నిటినీ క్రోడీకరించి చెప్పినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఏసీపీ శాస్త్రిగారు “చివరి నిర్వచనం వినయంధరునిది మరొక్క దారి వివరంగా చెప్ప గోరుతాను. ద్విట్ శబ్దం అర్థం కాక అడిగాను” అని అభ్యర్థించారు..

తానెరిగిన అర్థం ఎవరడిగినా, తడయక చెప్పే ఆదర్శ ఆచార్య లక్షణం రాణి గారిది.. ఇలా వివరించారు: “వినయంధరుడు 12 వశతాబ్దికి చెందిన జైనాలంకారికుడు.. ఆయన, శబ్దార్థములలో.. శబ్దమును ప్రసిద్ధప్రస్థానాతిరిక్తంగా పితృస్థానీయంగా గ్రహించి.. *శబ్దగతా అర్థబోధకశక్తిః మాతా* .. అని చెప్పి *శబ్దం వినాऽర్థబోధ ఏవ న సిద్ధ్యతి* *అతః శబ్దో న త్యాజ్యః* అని చెప్పాడు.. ఇక్కడ *ద్విట్* .. *కంసద్విట్*, *మధుద్విడాదుల* లలో సంహర్తృ అర్థంలో తీసుకొనరాదండి. *శబ్దశత్రువు లేక ద్వేషి* *పితృశత్రువు* లేక *ద్వేషి* అని గ్రహించాలి.” అని స్పష్టం చేశారు..

“శబ్దం నుండే అర్థం పుడుతుంది. కనుక శబ్దం అర్థానికి తండ్రి. కవిత్వంలో అర్థశక్తి శబ్దశక్తిని విభేదిస్తుంది. కాబట్టి అది పితృ ద్వేషి (ద్విట్) అయింది. అంతేనా రాణీ వారూ! నా అవగాహన సరైనదేనా” అని బులుసుకవిగారు మరింత స్పష్టత కోసం సాభిప్రాయంగా అడిగారు.

అందుకు “మీ చమత్కృతి బాగుంది. పాలను చంపి పెరుగు పుట్టినరీతి. కాని ఇక్కడ శబ్దనిరాసకనిరాసనంచేస్తూ చెప్పాడాయన. అభిధావృత్తిమాతృకాకారుని వలెనే.” అంటూ, సంబంధిత ప్రామాణికోక్తులను ఆచార్య రాణి గారు ఉదాహరించారు. “*వాచః వృత్తిః.. వాగ్వ్యాపారః; సః *శబ్దార్థమయః;

సా చ వృత్తిః త్రిధా : అభిధా .. లక్షణా ..వ్యంజనా చేతి ; తత్రాభిధాయాం..

శబ్దః .. వాచకః; అర్థః .. వాచ్యః; లక్షణాయాం ..శబ్దః .. లక్షకః .. అర్థః .. లక్ష్యః ; వ్యంజనాయాం ..శబ్దః .. వ్యంజకః .. అర్థః .. వ్యంగ్యః –ఇతి వ్యవస్థీకృతమ్

అత ఏవ వక్రోక్తికారేణ కుంతకేనాపి..

శబ్దో ..వివక్షితార్థైకవాచకోऽన్యేషు సత్స్వపి।

అర్థః ..సహృదయాహ్లాదకారిస్వస్పందసుందరః।।ఇతిప్రోక్తమ్” – అంటూ మొత్తం వృత్తులు, వాటి లక్షణాలకు సంబంధించిన మూల సూత్రాలను ఇచ్చారు..

మా శాస్త్రిగారు కావటానికి రిజర్వ్ బ్యాంకులో పెద్ద ఉద్యోగ స్థానం నుంచి నివృత్తులైనా సంగీత సాహిత్యాలలో అపారమైన అభినివేశం కలవారు. కనుకనే అంతటితో ఆగక, “సాధ్యోహి రసో కవిభిః .. నిర్దోష పదబంధం నుండి.. రససేతువు మీదుగా రస గమ్యం కలదే కవిత్వం అను పరిణామ క్రమాన్ని పెద్దలందరూ చర్చిస్తే ఆనందంగా ఉంటుంది.. నవరసాలలో లేని దేశభక్తి రసం స్వాతంత్రోద్యమ సమయంలో ఆవిర్భవించింది.. కార్మికుల శ్రేయస్సే విశ్వ శ్రేయస్సు అనుకున్న శ్రీశ్రీ మహాకవి అయినాడు.. మహాకవి కవిత్వంలో అభ్యుదయమా లేక రసమా ఏది ప్రజలను కట్టిపడేసింది? .. నందనారు (భక్తుడు) చరితంలో కూడా (జయభేరి) కార్మికుల అవస్థలు వర్ణించిన శ్రీశ్రీ పాట అందరినీ అలరించిందే!! ..ఏమిటీ రహస్యం?” అంటూ చర్చను మరో మెట్టు పైకి తీసుకొని వెళ్లారు..

దానిమీద ప్రతిస్పందిస్తూ ఆచార్య రాణి సదాశివమూర్తి గారు, బులుసుగారి మాటలను కూడా దృష్టిలో ఉంచుకొని, వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవి:

“మన తెనుగు ఆదికవి ‘సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకలితార్థ

యుక్తి లోనారసి మేలునాన్ ఇతరులు అక్షర రమ్యత నాదరింప’ అనే ఇదే భావాన్నే, అంతకుమునుపటి అలంకారశాస్త్రనిర్మాతల దృష్టికి సవరణగా చెప్పాడేమో!

మీరన్న మహాకవులు, పై పద్యం లోని ‘కవీంద్రులు’.

సారమతులైన వారి చేతుల్లోకి కావ్యంవస్తే, ప్రసన్నంగా చెప్పబడుతున్న కథలో ‘కలితం చేయబడ్డ’ (అంతర్మిళితం చేయబడ్డ) – ‘అర్థయుక్తి’ – భావ చమత్కారాన్ని – ‘లోనారసి’ – లోతుగా పరిశీలించి- చూస్తారు.. దాన్ని మాత్రమే మేలు మేలని ప్రశంసిస్తారు..

‘ఇతరులు’ – బులుసుగారు మొదటగా అన్న కవులు- ‘అక్షర రమ్యత’- శబ్దాల సొగసు, శబ్దం లోని ప్రతి అక్షరం కూర్పు, వాటి నాదం మొ౹౹ న వాటితో వినోదిస్తుంటారు..

‘ఇతరులు’ అనే మాటతో ఎంత తేలిగ్గా తీసేశాడు తెలుగు ఆదికవి, ఆ శబ్ద వినోదులను!

‘అర్థయుక్తి’ని లోనారసి చూసి శభాష్ అనేవారు (మేలునాన్) మహాకవులు, *కవీంద్రులు*; తతిమ్మావారు *ఇతరులు*

(**ఆ మాటతో ఆయన వాళ్ళను కవులు అని కూడా లెక్క వేయలేదేమోనని నాకో కుసందేహం!పోనీ, కవులు కావచ్చు, శ్రోతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు అనుకొందాం.)

ఆ కవీంద్రులు కూడా ప్రసన్నకథాకలితమైన భావచమత్కారాన్నే భలే అంటారు. *ఆ కథ పస లేని శుద్ధ భావ కవిత్వంలోని భావ చమత్కారాన్ని కాదు*.. అనేది అక్కడి భావం అని నాకనిపిస్తుంది..

కనుక ఆధునిక కవులు, పాశ్చాత్య ప్రభావం వల్ల కావచ్చు, ఆ పాశ్చాత్య ప్రభావంలో మిళితమైన, ముద్రణ/పత్రికామాధ్యమం వంటి వ్యాపారాత్మక పరిమితుల ప్రభావం వల్ల కావచ్చు, కథాసంబంధం లేనిదాన్ని కూడా కావ్యమంటున్నా, రెండు లైన్లు గిలికితే చాలు, మినీ మహాకావ్య మంటున్నా, మన ప్రాచీనుల దృష్టిలో కథాసహితమైనదే కావ్యం అనుకొంటాను.. కథా వస్తువే సమస్త రస విన్యాసానికి ప్రథమాధారం! వస్తువు మొదట. దాన్ని కథనం చేసే నేర్పు – సకల శోభాయమానంగా (అలంకారంగా) తీర్చే తీర్పు – ఆ వెన్నంటి ఉండుట. ఇక ఆపై ఆ అర్థ యుక్తిని బట్టి రస నిర్భరత.. ; సంయక్ కావ్యానంద బోధ!

ఒక్క సమాసంతో ప్రథమ లక్షణోపదేశం చేసిన మహోత్తమ కావ్యమర్మజ్ఞుడు మన ఆదికవి, ఆయనకు వెనుక, ఆ సమాస స్ఫూర్తి నిచ్చిన కన్నడ ఆదికవి. ఆ పంపడు కూడా మన తెలుగు వాడే అగుట మనకు గర్వ కారణం.

మొత్తం మీద బులుసుగారి మాటల్లో నిబిడీకృతమైoది మన తెలుగు దృష్టి అనేది నా భావం!

***

సూత్రప్రాయంగా సాగాయి, ఆచార్య రాణి సదాశివమూర్తి గారి మాటలు!

వాటితో విభేదించటం లేదంటూ, జిజ్జాస కొద్దీ తన భావాలనిలా పంచుకున్నారు, సిరికోనలోని మరో విద్వన్మూర్తి పాలకుర్తి రామమూర్తి గారు: “..నిన్న మీరు ‘శబ్దానికి లోబడితే కవి.. అర్థానికి లోబడితే మహాకవి’ అన్నారు. మరి భావం ఏమిటి? భావం లేకుండా శబ్దం లేదు.. శబ్దం లేకుండా అర్ధం లేదు కదా. ప్రయోగించిన శబ్దాన్ని అనుసరించి, పాఠకుని/విమర్శకుని స్పురణ ననుసరించి అర్ధం వస్తుంది. అప్పుడు కవి భావన, సాధిత అర్థం వేరువేరవుతాయి కదా.

ఒక్కొకసారి.. కవి ప్రయోగిత శబ్దం తన భావనలో లేని క్రొత్త భావనను/అర్థాన్ని తేవచ్చు..

Word represents the concept and concept is known by the word. Both are interdependents. శబ్దము భావనకు ప్రతీకగా నిలుస్తుంది. భావము శబ్దము వల్ల తెలుసుకోబడుతుంది. ఈ రెండూ పరస్పరాధారితాలు. ఒకటి లేకుండా మరొకదానికి ఉనికి లేదు.

గొప్ప సాహిత్యం, లేదా సృజనగా మనం భావించే ఘట్టాలలో మనకు కనిపించే గుణం తాత్పర్యం (భావ)అతీతమైన శబ్దశక్తి. అంటే అక్కడ శబ్దం స్వ అర్థాన్ని త్యాగం చేస్తున్న దన్నమాట. శబ్దానికి విలువలేదని అనడంలేదు. మనోహరమైనవ్యంగ్యం శబ్ద సమ్మేళనం లోనే పుడుతుంది కదా.

ఇది మన భారత రామాయణాల్లోనూ కావ్యాల్లోనూ కొన్ని చోట్ల మాత్రమే వ్యాపించివుంటుంది. శంతనుడు తాను మళ్లీ పెళ్లిచేసుకుంటానని స్పష్టంగా చెప్పాడా? వయసులో ఉన్న కొడుకు గ్రహించేలా చెప్పాడు. అక్కడ నన్నయగారు వ్రాసిన రెండు పద్యాలు వ్యర్థమైనవేనా?? మనకు ఆయన భావాన్ని చెప్పి తప్పుకొంటున్నాయి. అంటే శబ్దజాలం లేదా శబ్దం, స్వకీయ అర్థాన్ని త్యాగంచేసి పాఠకునికి కొత్త భావనను అందించింది. సృష్టిలో అన్నిటికంటే గొప్ప భావం – త్యాగం. దానివల్ల మరెన్నో గొప్ప భావాలు పోషితమౌతాయి అనటానికి ఇదో తార్కాణం.. అల్లాగే ఇంతలు కన్నులుండ పద్యం చూడండి.. సుగాత్రీ శాలీనుల ఘట్టం చూడండి. దానికి గుణీభూత వ్యంగ్యమని లేక ఏదో పేరు పెట్టుకోవచ్చు. పెట్టుకోనివ్వండి.

ఇదే రసవిద్య. కవిత్వంలోరసవిద్య.”

రామమూర్తి గారి మాటల్లో కాదనటానికి ఏముంది? శబ్దమే అర్థప్రపంచానికి ఏకైక మార్గం.. కానీ శబ్దార్థాలు రెండింటికి పరమగమ్యం రసానుభవమే కదా.. ఆ రసానుభవాన్నే కదా, మనం నేడు అనుభూతి అంటున్నది!.. మంచి కవితకు అదే కదా ప్రాణశక్తి!!

పోతే, రామమూర్తి గారు ‘భావం’ అనే దానికి ‘concept’ అనే ఆంగ్ల పదం వాడటం గురించి ఆచార్య రాణి గారు ఇచ్చిన తాజాకాలం: “ప్రస్తుత సందర్భం ‘భావము’ అనే దానికి ‘Concept’ అనేదానికన్న ‘తాత్పర్యార్థము (Purport Sense)’ తీసుకుంటే సముచితంగా ఉంటుందేమో ఆలోచించగలరు.. ‘తాత్పర్యార్థము’ కూడా అర్థకోటిలోకి చేరిపోతుంది. అప్పుడు కాళిదాసువంటివారి మతాతిరిక్తంగా వాగర్థములకు అడ్డుగోడవంటి concept చొరబాటు పరిహరింపబడగలదు.”..

ఈ మాటలు అవశ్యం లోతుగా విచారించి చూడవలసినవి.. అవి ‘అర్థం- భావం’ పరిధిలోకి చేరుతూ, మరో పెద్ద చర్చను అపేక్షించేవి!!**

(కూర్పు, వ్యాసరూపకల్పన: ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here