‘సిరికోన’ చర్చాకదంబం-5

0
6

[box type=’note’ fontsize=’16’] సిరికోన వాక్స్థలిలో జరిగిన చర్చ పాఠ్యాన్ని కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ. [/box]

అస్తమిస్తున్న సంస్కృతిలోవరదగుడి’: ‘రెట్టమతం’

చర్చ: డా. ఏల్చూరి మురళీధరరావు, డా. సూరం శ్రీనివాసులు, శ్రీమతి ఘంటశాల నిర్మల, శ్రీ జెఎస్సార్ మూర్తి ప్రభృతులు.

వ్యాసరచన/సమర్పణ: ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ.

~

[dropcap]కొ[/dropcap]న్ని శబ్దాలు వాడుకలో అలా నిలిచిపోతాయి, వాటిని వాడేస్తుంటాము కానీ, వాటి వెనకాల ఎంత సుందరమైన ఊహ ఉంటుంది?.. ఎంత అద్భుతమైన తాత్త్వికత ప్రకాశిస్తుంటుంది?.. ఎంత చక్కటి సాంస్కృతిక అనుభవం సాక్షాత్కరిస్తుంటుంది?… వాటిని మనం ఏమీ ఆలోచించం… ఆధునికత పొంగులో, ఆలోచించటం అటుంచి, కనీసం యాంత్రికంగానైనా వాడుకలో నిలుపుకోము! నిర్దాక్షిణ్యంగా వదిలేస్తుంటాం… మన సంస్కృతిని మనమే నేలపాలు చేసుకొంటుంటాం!

అలా పోగొట్టుకున్న అందమైన పదాల్లో ఒకటి: ‘వరదగుడి’.

వర్షం రావటానికి మునుపు ఆకాశంలో చంద్రుని చుట్టూనో, సూర్యుడి చుట్టూనో గుండ్రంగా ఏర్పడుతుందే అది!

ఘంటశాల నిర్మల గారి మాటల్లో “వర్షం ముసురుకువస్తున్న సూచనగా చంద్రుడి చుట్టూ ఒక ప్రకాశవంతమైన పొగవంటి వృత్తం ఏర్పడటం. పడమటిదిక్కున వరదగుడి వేసిందన్నా, ఉత్తరాన ఉరుములు వురిమాయన్నా వాన ఖచ్చితంగా వస్తుందని అర్థం – రైతాంగానికి గొప్ప సంబరం.” దాన్నే సి.పి. బ్రౌన్ నిఘంటువు “halo round the sun సూర్యాది పరివేషము” అని పేర్కొంటోంది.

ఈ వరదగుడిని రాయలసీమ ప్రాంతాల్లో డా.కోడూరు ప్రభాకరరెడ్డి గారు సూచించినట్లు ‘వానగుడి’ అని కూడా అంటారు.

ఆ మాటను ధ్రువీకరిస్తూ, శతావధాని డా. సూరం శ్రీనివాసులు గారు, “ఈ వరదగుడినే చంద్రగుడి,సూర్యగుడి అని మేము చిన్నప్పడు వ్యవహరించే వాళ్ళ”మంటూ, శ్రీహర్షుడు తన నైషధం ప్రథమసర్గలో నలగుణప్రస్తావన సందర్భంగా, …

“తనోతి భానోః పరివేశకైతవా

త్తథా విధిః కైండలతాం విధోరపి” అని ఈ గుడినే ప్రస్తావించాడని ఆ ప్రాచీన ప్రయోగ వివరాన్ని కూడా అందించారు…

** ** **

ఇంతకీ ఇదంతా ఎందుకు వచ్చిందంటారా?

మా జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు, ఏదో సందర్భం మీద, జానపద పలుకుబళ్ల ప్రసక్తి తీసుకువచ్చి, ‘రోజులమారాయి’ చిత్రంలో కొసరాజు రాఘవయ్య చౌదరి గారి సుప్రసిద్ధమైన పాట “ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా” అనే పాటను మొత్తం ఉదహరించి ఈ కింది ప్రశ్నను లేవనెత్తారు:

“సామాన్యంగా అమాయకుడైనవాడి గురించి చెప్పేటప్పుడు ‘కల్లాకపటం తెలియనివాడు’ అంటాం. కానీ కొసరాజుగారు ‘కల్లాకపటం కాననివాడా’ అంటూ మొదలుపెట్టారు. అంటే మంచీచెడ్డా చూడకుండా చిత్తంవచ్చినట్లు చేసేవాడనే భావం స్పురిస్తోందని నా శంక. ఏరువాక అంటే ఏమిటి? ఆ పేరెందుకు వచ్చింది? ఈ సందర్భంగా ఆ పాటను పెడుతున్నాను. దానినుండి మావంటివారు తెలుసుకోవలసిన విషయాలను వివరించగలరు!” అని!

వారు కోరిన ఏరువాక గురించి, “అది ఇప్పటికీ సర్కార్ జిల్లాల్లో అరుదుగానైనా వాడుకలో ఉండే వ్యావసాయిక ఉత్సవం. కలిసికట్టుగా నాగళ్ల పూజ చేసి తొలి దుక్కి దున్నే పండగ. చక్కటి రైతుల పండగ.” అంటూ ఈ వరదగుడి ఎంత అందమైన మాట! దాన్ని పూర్తిగా పోగొట్టుకొన్నామే! అని భవదీయుడు బాధపడ్డాడు… దాంతో మొదలైందీ చర్చ!

ఇంతకీ మొదలుపెట్టిన మాటల భావం చెప్పలేదు కదా!

నా దృష్టిలో ఈ వరదగుడి అనేది ఒక చక్కటి కవితాచిత్రం! తాత్త్విక పదచిత్రం!

వ్యవసాయదారుడుకి వరుణుడి కంటే మించిన వరదుడెవరున్నారు? వరమిచ్చే వాడు వరదుడు! వానదేవుడి కంటే మించిన వరదుడు, భూదేవిని మించిన తల్లి ఎవరు? వాన రాకడ కంటే మించిన సంబరం ఏముంది? దాన్ని సూచిస్తూ, గుండ్రంగా ఏర్పడే ఆ రంగుల కాంతిని, గుండ్రత వల్లే కావచ్చు, అంతకు మించిన భక్తితో ‘గుడి’ అనేశాడు మన పూర్వపు రైతు పెద్దన్న. అది ఆకాశంలో వానదేవుడి గుడి చాలా గొప్ప కవితాత్మక భావుకతతో అన్నాడు. వరదగుడి అనే సుందర భక్తిపదచిత్రాన్ని కల్పించేశాడు!!

అందులో ఒకప్పటి మన భక్తి భావన, సంస్కృతి, భావుకత ఎంత అందంగా ఒదిగిపోయాయో చూడండి! మన ప్రాచీనుల భక్తి సంస్కృతికి అద్దం పట్టేవి అలాటి మాటలే! అర్థం కాని మంత్రాల మౌన శ్రవణాలు కాదు!

వీటిని నిలుపుకొంటూ, వాటిని పోగొట్టుకోవటం మన వర్తమాన దౌర్భాగ్యం!

దాన్ని వదిలేద్దాం!

దీనికి ముక్తాయింపుగా పరిశోధక పరమేష్ఠి డా. ఏల్చూరి మురళీధర రావు గారు ఈ కింది మాటలు పలికారు…

“వరదగుడి, గాలిగుడి పర్యాయ పదాలే. వరదగుడి వల్ల ఏయే సమయాలలో వాన కురుస్తుందో, వాన కురవదో రెట్టమతశాస్త్రంలో అయ్యలాఖ్య భాస్కరాఖ్య కవులు వివరంగా పేర్కొన్నారు. ఆముక్తమాల్యదలో రాయలు ‘అతిజల మబ్ధిఁ గ్రోలె’ అన్న పద్యంలో వరదగుడి వల్ల వాన కురవకపోవటాన్ని వర్ణించారు.

రెట్టమతశాస్త్రంలోని భాగం ఇది:

ఇందులో చెప్పిన అంశాలు– నవ పాఠకుల కోసం– ఇలా క్రోడీకరిస్తున్నాను:

  1. వరదగుడి/వానగుడి అని చెప్పబడే ఈ సూర్య, చంద్ర పరివేషాలు స్వచ్ఛమైన బంగారు కాంతులు ప్రకాశించేలాగా వానకారులో కనబడితే వానలు బాగా పడతాయి. (ఇతర కాలాల్లో కనబడితే యుద్ధసంరంభాలు వంటి రాచకార్యాలు పుడతాయి) (పద్యం 60)
  2. మేఘాల్లేకుండానే వానాకాలంలో అగుపడితే, ఇక ఆ ఏడు వర్షాలు పడవు. (ప. 61)
  3. మేఘాలతో కలిసి చంద్రునికో, సూర్యునికో గుడి కడితే వేగంగా వానలు పడతాయి (ప. 62)

  1. అలా రెండు మూడు గుడులు కడితే సమృద్ధిగా వానలు పడతాయి. అలా పడకుంటే ఆ రాజులు చాలా ఇబ్బందుల పాలవుతారు. ( ప.63)
  2. ఆ గుడులు కూడా ఏ దిక్కున కడితే ఆ దిక్కుల్లోని రాజులు ఇడుముల పాలవుతారు. ఒక వేళ అవి తెల్లటి రంగులో కట్టాయా, ఇక వానలసలు పడవు. (ప.64)
  3. ఆ గుడుల్లో కూడా– చంద్రుడి గుడి పరిధిలో– బృహస్పతి ఉంటే బ్రాహ్మణులకు మంచిది కాదు; శుక్రుడుంటే వానలు తప్పక పడతాయి; బుధుడుంటే శిశువులకు మంచిది కాదు; కుజుడుంటే అక్కడక్కడ భయంకరమైన యుద్ధాలు వస్తాయి; సూర్యుడి కుమారుడైన శని ఉంటే, పట్టం గట్టుకొన్న వారు గట్టి బాధల పాలవుతారు. (ప.65 )
  4. చంద్రుని చుట్టూ కట్టిన గుడి ఎర్రటి రంగులో ఉండి, అందులో శని, కుజ, గురులుంటే ప్రజలకు చాలా తీవ్రమైన బాధలు కలుగుతాయి. (ప. 66)
  5. చంద్రుడు అస్తమించే సమయంలో కట్టిన ఎర్రటి పరిధిలో గురుడు, కుజుడు, శనులు ఉంటే, చక్రవర్తులు ఇడుముల పాలవుతారు. (ప.67 )
  6. చంద్రుడు మునిగేటప్పుడు, ఆ పరివేషంలో, గురుడుంటే భూమికి మంచిది కాదు; శుక్రుడుంటే బోయవారు మరణం పాలవుతారు. (ప.68)

 *ఇదీ రెట్టమత శాస్త్రంలో వరదగుడుల శాస్త్రార్థాలు*

 *** *** ***

ఇంతకీ ఈ రెట్టడెవరు?

ఈ రెట్టమత శాస్త్రంలోని అనేక విశ్వాసాలు, ఇప్పటికీ నిన్నటి తరానికి చెందిన పల్లెటూళ్ళ రైతుల నోళ్ళలో నర్తిస్తూనే ఉన్నాయి. వాళ్ళకి ఈ రెట్టడెవరో తెలియదు. వాళ్ళ దృష్టిలో రెట్టమతమంటే ‘రెట్టమదమే’! అంటే భుజగర్వం అనే! (రెట్ట అంటే భుజాగ్రంనుండి మోచేతివరకున్న శరీర భాగం!) ఎవరినీ లెక్కచేయని పొగరుకు అది మరో మాట! రాయలసీమలో విరివిగా వాడుకలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ‘రెంటమతం’ అని కూడా అంటారట!

దాన్నలాగుంచితే, ఈ రెట్టమతాన్ని గూర్చి ఏల్చూరివారు మరి కాస్త ఇలా వివరించారు: “రెట్టమతస్త్రం Meteorology కి సంబంధించి, మరీ ప్రత్యేకించి రైతులకు forecasting weather conditions కి పరిమితమైనది. కన్నడం వాళ్ళు రట్ట మతమని అంటారు.”

కన్నడంలో రట్టడనటమే రివాజు. ఈ రట్ట/రెట్ట శబ్దాల గురించి నాకో థియరీ కూడా తయారై ఉంది కానీ, దాన్ని నేను, అంటే ఈ కదంబవ్యాస రచయితనైన గంగిశెట్టి లక్ష్మీనారాయణను, త్వరలో అచ్చుకెక్కనున్న నా ‘ప్రాచీనాంధ్ర సాహిత్య ప్రస్థానా’ల్లో వివరించనున్నాను. కనుక, దాన్నిక్కడ అసమగ్రంగా పేర్కొనటం ఉచితం కాదు. అయినా పరిశోధనార్థుల కోసం, ఈ కింది ప్రశ్నలను ఏల్చూరిగారి నెపంగా, పాఠకుల ముందు పెడుతున్నాను…

రెట్టడు 14వ శతాబ్దికి చెందిన జైనుడని చదివిన జ్ఞాపకం.. మొదటి సారిగా ఈ గ్రంథాన్ని నేను శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో 65-66 ప్రాంతంలో చూసిన గుర్తు. రెట్టమతశాస్త్రంతో పాటు మరో వ్యవహారనామం కూడా ఈ గ్రంథానికున్నట్లు గుర్తు. మిత్రులొకరు దీన్ని ఆయుర్వేద గ్రంథంగా భావించారు. కానీ కాదు, పూర్వ కాలీనుల వ్యవసాయ జ్యోతిర్విజ్ఞాన గ్రంథం ఇది. లేదా సస్య జ్యోతిశ్శాస్త్రం. సస్యాలన్నాక, ఓషధులు-అంటే-మూలికలు/ మొక్కలు మాట కూడా అందులో వస్తుంది కానీ, అది నామ మాత్రమే. ఆ శాస్త్ర వివరణ ఏ మాత్రమూ లేదు…

జ్యోతిశ్శాస్త్రానికి సంబంధించిన ఇతర గ్రంథాలు మానవ జీవన శుభాశుభ ఫలిత గణనానికి ప్రాధాన్యమివ్వగా, ఇది రైతు జీవనులకుపకారకంగా కూర్చబడింది. బహుశా నాటి కర్ణాటాంధ్ర జనజీవనాన్ని, వారి విశ్వాసాలను పరిగణనలోకి తీసుకొని ఇది సంతరింపబడింది. ఆ దృష్ట్యా, నాటి సామాజిక – సాంస్కృతిక దృక్పథాల దృష్ట్యా, దీనిపై తగిన పరిశోధన జరగకపోవడం శోచనీయం. ఆ దృక్పథంతో చూస్తే ఎన్నో మంచి విశేషాలు వెలుగు చూసే అవకాశముంది. ఉదాహరణకు పై చివరి 68 వ పద్యంలోని బోయజాతి మాటే తీసుకొందాం! ఎన్నో జాతుల వాండ్లుండగా, అస్తమయ చంద్ర పరివేషంలో శుక్రుడుంటే బోయజాతికే ఎందుకంత నష్టం కలుగుతుంది? అప్పుడు బోయజాతి వృత్తి ఏమిటి? వారికీ, ఈ వ్యవసాయ జ్యోతిర్విజ్ఞానానికి సంబంధం ఏమిటి? ఇలాటి ఎన్నో ప్రశ్నలుత్పన్నమౌతాయి…

ఆ వర్గ ప్రస్తావనల విషయమలావుంచితే, ఈ రెండు మూడు ప్రశ్నలు అవశ్యం పరిశీలించతగినవే!

  1. తెలుగు రెట్టమత శాస్త్రంలో, తెలుగునాట వ్యావసాయిక విశేషాలు ఏమైనా ప్రత్యేకం అగుపించాయా? (పోనీ పశుపాలనకు సంబంధించినవి)
  2. జైన విరచితాలైన ఇతర శాస్త్రగ్రంథాలేవైనా తెలుగులోకి వచ్చాయా? జైనులు ఒకప్పటి తమ ప్రాభవం అడుగంటగా, దాన్ని సామాన్యప్రజల్లో పునఃప్రతిష్టించడానికి, వారిని తమ విశ్వాసం వైపుకు ఆకర్షించడానికి, జ్యోతిష శాస్త్రపరంగా విశేష కృషి చేస్తూ వచ్చారని, ఆరేడు శతాబ్దాల కాలంలో, తెలుగునాట కాకున్నా, కన్నడ సీమలో సామాన్య ప్రజావిశ్వాసం తిరిగి పొందారని చరిత్ర పరిశోధనలు నిరూపించాయి. ఆచార్య బి. ఎస్. ఎల్. హనుమంతరావు గారు తన ‘రెలిజియన్ ఇన్ ఆంధ్ర’ ఆంగ్లపుస్తకంలో దీన్ని చక్కగా వివరించారు… తాత్త్విక, పురాణ మత విశ్వాసాలకు బ్రాహ్మణులు పట్టుకొమ్మలు కాగా, తదితరమైన వృత్తి విజ్ఞాన సహాయక కృషిలో జైనులు నిమగ్నులయ్యారు. ఆదినుంచి వారు శ్రమణ వాదులు. వారి రచనలు తెలుగులోకి తగినంత రాకపోవటానికి కారణమేమిటి?
  3. ఈ అనువాద కవులైన అయ్యల- భాస్కరులైనా ఈ గ్రంథానువాదాన్ని (నిజానికి ఇది అనువాదం కాదు; రెట్టడు ఇలా చెప్పాడని రాసిన స్వతంత్ర శాస్త్ర కావ్యమే!) చేపట్టడానికి కారణాలేమిటి? పావులూరి మల్లన (గణితశాస్త్రం) తో ఎన్నడో ఆగిపోయిన జైన శాస్త్ర కావ్య వాఙ్మయాన్ని వీరు అన్ని వందల సంవత్సరాల అనంతరం చేపట్టుట లోని ఆంతర్యమేమిటి?
  4. కర్ణాటక- ఆంధ్ర ప్రాంతాలు ఒకే ఏల్బడిలో ఉన్నా, దాదాపుగా ఒకే సాంస్కృతిక స్వభావం కలిగివున్నా, సాహిత్య ప్రక్రియా స్వరూపాల్లో ఎందుకింత మార్పు, తేడా తల ఎత్తింది?

దయతో మీకు తోచినంతమేరకు చెప్పమని కోనలో ఏల్చూరి గారిని కోరినా, ఈ ‘సంచిక’ ముఖంగా పండిత-పరిశోధక లోకాన్ని తమ దృష్టిని ఈ ప్రశ్నలపై సారించ వలసిందిగా కోరుతున్నాను..

*** *** ***

ముక్తాయింపు:

కొసరాజు వంటి జానపద గేయబ్రహ్మ ‘కల్లా కపటం తెలియని వాడా!’ అని చక్కటి నుడికారాన్ని పక్కన బెట్టి, “కల్లా కపటం కానని వాడా!” అంటూ పాట రాశాడేమిటని మా జో.శ్రీ మూర్తి గారు చర్చను మొదలుపెడితే, ముక్తాయింపుగా ఘంటశాల నిర్మాలగారు:

అది అప్పుడు

ఇప్పుడు

“కల్లాకపటం మాననివాడా…”! అని మాంచి ముగింపు స్ట్రోక్ నిచ్చారు.

అవును! రోజులు ఎంత మారాయి!?**

― గంగిశెట్టి లక్ష్మీనారాయణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here