‘సిరికోన’ చర్చాకదంబం-6

0
7

[box type=’note’ fontsize=’16’] సిరికోన వాక్స్థలిలో జరిగిన చర్చ పాఠ్యాన్ని కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ. [/box]

తొలి తెలుగు వ్యాకరణం: ఆంధ్రభాషాభూషణం

డా. చొప్పకట్ల సత్యనారాయణ, ఆచార్య దావులూరి కృష్ణకుమారి, & ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ ( ఈ కదంబ వ్యాస రూపకర్త).

~

[dropcap]”తె[/dropcap]లుగువారి వ్యాకరణ దీపం చిన్నది” – అని ఒకప్పుడు నవయుగ వైతాళిక గురువులకు గురువు, శ్రీ చెళ్ళపిళ్ల వారు చమత్కరించారు… వ్యాకరణ బ్రహ్మ వజ్ఝల చినసీతారామ శాస్త్రి వారి శత జయంతి సందర్భంగా 78లో (లేదా 77) ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాస్తూ, అదే మాటను శీర్షికగా పెట్టాను. ‘వ్యాకరణ సంహితా సర్వస్వ’ మనే మాట ఏమిటి? అంతకు పూర్వం కానీ, ఆ తర్వాత కానీ, వజ్ఝల వారంతటి కూలంకష పరిశ్రమ చేసిన వారు తెలుగులో లేరు. తెలుగు మాట అటుంచి, మొత్తం వ్యాకరణ విషయంగా చూసినా, నవీన భారతావనిలో మరొకరు కనరారు!

వారి మున్నుడులనైనా సాకల్యంగా ఆకళించుకొనే ప్రజ్ఞ లేకపోయినా, అంతకు మునుపు పూనా దక్కన్ కాలేజీలో నేను పరిశోధన కార్యక్రమానికి ఉద్యమించి, వజ్ఝల వారి గ్రంథాలను స్పృశించినప్పటి నుండి, నన్నొకే ప్రశ్న పీడిస్తోంది…

ఏ భాషకైనా వ్యాకరణం అంత పెద్దది కావలసిన అవసరం ఉందా?

వ్యాకరణ బృహత్తత, ఆ భాష సాధించిన విస్తృతికి దర్పణంగా నిలుస్తూ ఉందా? భాష అంటే ఒక సంస్కృతికి సజీవ ప్రతిబింబం. అయితే ఏ భాషా సంస్కృతి చేసిన విస్తార చారిత్రక ప్రయాణానికైనా ఆ భాషావ్యాకరణం ప్రతిబింబంగా కానీ, సాక్షీభూతంగా కానీ నిలవడం లేదు. అది వ్యాకరణ పరిశీలనాపరిధిలోకి వచ్చిన విషయమూ కాదు… మరి అలాటప్పుడు ఎంత పెద్ద వ్యాకరణ దీపం వెలిగించి మాత్రం ఏం ప్రయోజనం? చిన్నయగారి ‘బాల’ వ్యాకరణ దీపం చిన్నదే అయినా, ఆ వెలుతురులోనే మన వేడుక మీరా, వెదకగలిగినంత వెదుకుతూనే ఉన్నాం కాదా!? వజ్ఝల వారు ఎంత ఫ్లడ్ లైట్లు వెలిగించీ, కొత్తగా వెలుగులోకి తెచ్చిన అంశాలు ఏ మాత్రం?… ఇవన్నీ అప్పటికీ ఇప్పటికీ సమాధానాలు దొరకని అనుబంధ ప్రశ్నలే!

చిన్నయ్య కంటే ఇంకా చిన్నగానే, తొలి తెలుగు వ్యాకరణ దీపం వెలిగించిన మహానుభావుడు తిక్కన యుగం నాటి కేతన! తెలుగుకు సంబంధించి ఆయన ఇచ్చిన వర్గీకరణ, తద్భవ, దేశ్యాదుల వంటి పరిభాషా పరికల్పనల వెనుక ఉన్న భాషా స్వభావ తత్త్వమే మనకింకా సరిగా స్పష్టపడడం లేదే! ఏ చారిత్రక భూమికల్లో ఆ నామ పరిభాష రూపొందిందో తెలిస్తే, సగం తెలుగు భాషా వికాస చరిత్ర, సగం పైగా తెలుగు సంస్కృతి పరిణామ చరిత్ర విదితమౌతుందనే బాలిశ దృక్పథం కలిగిన వాడిని నేను.. ఆ పరిభాష నామాలు కేవలం పర్యాయాలు కాక, వివిధ పరిణామ ఘట్టాల్లోని భాషా-జాతి ఉద్యమాలకు ప్రతీకలని భావిస్తుంటాను….

అందుచేతే ఎవరెక్కడ కేతన ఆంధ్రభాషాభూషణం గూర్చి గాని, ఆ పరిభాష గూర్చి గాని, మాట్లాడినా ఆసక్తిగా చూస్తూ ఉంటాను…

అదలా ఉండగా మొన్న సెప్టెంబర్ మాసంలో ఒక శుభోదయాన వయోధిక పండిత ప్రకాండులు, డా . చొప్పకట్ల సత్యనారాయణ గారు, సిరికోనలో ముచ్చటైన కేతన పద్యమొకటి ముచ్చటించి, దానికి మెచ్చుకోలుగా ఇలా వ్యాఖ్యానించారు. ఆ పద్యం, వ్యాఖ్యానం కథా కమామీషు ఇది: 👇

“మెచ్చుకోలులో మతలబు!
“మెచ్చుడు మెచ్చవచ్చునెడ,మెచ్చకుడిచ్చకు మెచ్చురానిచో,/
మెచ్చియు మెచ్చుమ్రింగకుడు,మెచ్చక మెచ్చితిమంచుగ్రుచ్చలై/
మెచ్చకు,డిచ్చమెచ్చుగనిమెచ్చుడు,మెచ్చనుమానమైనచో /
మెచ్చియు,మెచ్చకుండకయు,మెచ్చుడు,సత్కవులారమ్రొక్కెదన్!
― ఆంధ్రభాషాభూషణము-మూలఘటిక కేతన.

తెనుగు భాషకు పద్యాలలో తొలివ్యాకరణం రచించబూనినదిట్ట మూలఘటిక కేతన. ఆ కాలంలో విద్యాలయాలను ఘటిక లనేవారు. అలాంటి విద్యాలయానికాతడు అధికారి. తిక్కనకు ప్రియశిష్యుడు. దండి దశకుమార చరిత్రముననువదించి తిక్కనకు కృతినొసంగిన మహనీయుడు.

“తల్లి సంస్కృతంబె యెల్లభాషలకును,
దానివలన కొంతగానబడియె,
కొంత తానగలిగె నంతయునేకమై
తెనుగుబాసనాగ వినుతికెక్కె౹౹
౼ అంటూ తెలుగు సంస్కృత జన్యమని నొక్కి వక్కాణించినవాడు.

ప్రస్తుతానికి వద్దాం.

సత్కవులకు మ్రొక్కుతూ అవతారికలో కవిచెప్పిన మాటలే పైపద్యం. (దీని)

భావం: నా గ్రంథంలో నచ్చిన విషయం మీకు కనిపిస్తే మెచ్చుకోండి. మీ మనస్సుకు నచ్చకపోతే మెచ్చుకోకండి. మనస్సులో మెచ్చుకుంటున్నా పైకి గాంభీర్యం నటిస్తూ మెచ్చనట్లు ప్రవర్తించకండి. నచ్చకపోయినా కుటిలురై నచ్చినదని మెచ్చుకోకండి. మనఃపూర్వకంగా మెచ్చుకోండి. మీకు మెచ్చు అనుమానమైతే మెచ్చిమెచ్చనట్లు మెచ్చుకోండి. సత్కవులారా! మీకిదే నాప్రణామములు.

మెచ్చు అనే క్రియను వృత్యనుప్రాసముగా నుపయోగించి అశేష విమర్శకుల యభిప్రాయములెట్లుండునో సద్విమర్శయెటులుండవలెనో కేతన నిపుణముగా సూచించినాడు. నేడిట్టికవులొక్కరైననుగలరా? సంశయమే!…… స్వస్తి!”

అంటూ చొప్పకట్ల గారు ముగించారు..

***

కేతన చెప్పిన మెచ్చుకోలు మర్మం సకల కవులకు నిత్య ఉపాదేయ మైనదే… రసజ్ఞులైన వారందరూ ఆ పద్య భావాన్ని నిత్యం మనస్సులో ఉంచుకోవలసిందే!

అయితే నా మనస్సు దానిమీద పడలేదు.. ఆ దిగువ చొప్పకట్ల గారుదాహరించిన భాషాసంబంధ పద్యం మీద పడింది… అందులోనూ సంస్కృతం అన్ని భాషలకు తల్లి అంటూనే, తెలుగు దాన్నుంచి కొంత ఏర్పడ్డా, కొంత తాన కలిగె‘ అనే దాని మీద పడింది.

ద్రావిడ భాషాకుటుంబ వాదానికి సంబంధించి, నా పరిమిత జ్ఞాన పరిధిలో అదే అతి ప్రాచీన ప్రస్తావన కావటం వల్ల!… ‘ద్రావిడ భాషలు’ అనే మాటను కాల్డ్వెల్ ఇత్యాది తమిళ ప్రాంతీయులు వాడినప్పటికీ, కాల్డ్వెల్‌కు మునుపటి వాడై, ఆయనకు ఈ భాషాధ్యయనాల పట్ల దారి చూపిన ఎల్లిస్ గారు మాత్రం వాడలేదు!! ఎల్లిస్ గారు తెలుగును ఈ భాషలకు కేంద్రభాషగా చూశారు… అది వేరే మాట!(వివరాలు కావాలంటే, నా “ప్రాచీన శ్రేష్ఠ భాషగా తెలుగు-చరిత్ర: కొన్ని కొత్త చూపులు” గ్రంథాన్ని చూడవచ్చు.)

ఏదైనా తెలుగు సంస్కృతజన్యేతరమైనదని పాక్షికంగా నైనా చెప్పిన తొట్ట తొలి లాక్షణిక కవిపండితుడు కేతన!

అందుకే వెంటనే ఇలా స్పందించాను:

“తెలుగు భాషకు తొట్ట తొలి తెలుగు వ్యాకరణం లోని మెచ్చుకోలు చమత్కారం గురించి మాత్రమే మాకు చెబితే మెచ్చుకోమండీ…..

మీ రమణీయ శైలిలో, ఆ వ్యాకృతిలోని నవ్యతలు, ముఖ్యంగా పరిభాష విశిష్టతల గురించి కూడా అప్పుడప్పుడొక్కొకటిగా పరిచయం చేయ ప్రార్థన… “ఆంధ్ర భాషాభూషణము” ఆధునిక భాషాశాస్త్రజ్ఞులకే ఆదర్శప్రాయమైన కృతి అంటారు… తెలుగు విశ్వవిద్యాలయం, భాషా పీఠంలో ఆచార్యులుగా ఉద్యోగించి విరమించిన డా. ఎ. ఉషాదేవి గారు దానిమీద కొంత పరిశ్రమ చేశారు.

కానీ మీ వంటి సంప్రదాయజ్ఞుల నోటి వెంట దాన్ని గురించి వినాలని ఉంది… ముఖ్యంగా ఈ కింది అంశాలకు సంబంధించి:

  1. ముందుగా కేతన వాడిన ‘దేశి’ భావన గురించి చెప్పండి. అది ‘జానుతెనుగు’ కంటే భిన్నమా? కాదా? మీ ఆలోచనలేమిటి?
  2. మీ మాటల్లో “‘తల్లి సంస్కృతంబె’ అని ఎల్లవారికి నేర్పిన మహానుభావుడు” అన్నారు కదా! దానివలన ‘కొంత కానబడియె‘ అంటూ, ‘కొంత తానగలిగె‘ అనటంలో భావమేమిటి? ‘తెలుగు సంస్కృతంతో సంబంధం లేని, స్వయం ప్రతిపత్తి కలిగిన భాష’ అని అంగీకరించినట్లేగా! ఆ మాటనంటే ఇప్పటికీ కొందరు మహానుభావులు కయ్యి మని మీదికి వస్తారెందుకండీ!?….” (గ.ల.నా.)

***

ఆ తర్వాత రెండురోజులకు, వ్యాకరణం మీద చిన్నప్పటినుంచి అభిమానంతో కృషిచేసిన ఆచార్య దావులూరి కృష్ణకుమారి (పద్మావతీ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు) ఇలా స్పందించారు:

“దేవినేని సూరయ్య గారు ప్రచురించిన ‘దివ్యప్రభా వివరణ సహిత’ ఆంధ్రభాషాభూషణానికి డా. వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు విపులమైన పీఠిక (152 పుటలు) రాశారు. అందులో వారు చూపిన నవ్యతలు కొన్ని: 1. సంస్కృతవ్యాకరణ మర్యాదలతో పని లేనిది; 2. సంజ్ఞాసాదృశ్యం లేనిది; 3. సంపూర్ణ ప్రక్రియా రహితమైనది; 4. ప్రకృతి ప్రత్యయాది విభాగంలేనిది; 5. విలక్షణమైన విశేష విషయమైన స్వతంత్ర వ్యాకరణం… ఇలా వారు తరువాతి వ్యాకరణాల దృష్టితో చెప్పినవీ మాటలు. కాని అప్పటికి ఇదొక కొత్తవ్యాకరణ నిర్మాణరీతికి ఒరవడి దిద్దిన వ్యాకరణం అనేది మరువరానిది. సంస్కృతం మాతృకగల(తల్లి)భాషగా దీని వివరణభాగం తెలుపుతుంది..”

దానిపై చొప్పకట్ల గారి ప్రతిస్పందన: “డా:వడ్లమూడి గోపాలకృష్ణయ్య మా విద్యాధ్యయన సోదరుడు (సతీర్థుడు), మహామేధావి. “వ్యావహారికాంధ్ర వ్యాకరణము” – అనే పేరున ఒక అద్భుతాన్ని సృజించి, మనం మాట్లాడుకొనే వ్యవహారభాషకు వ్యాకరణ బద్ధతను నిరూపించాడు. మాకు చదువు నేర్పిన గురువులందరు ముక్కున వ్రేలేసికొన్నారు.

కొంచెం ప్రత్యుత్పన్నమతి. నన్నయాది కవుల కవితలలో దోషాలు చూపారు. ప్రబంధకవులలో సరేసరి.

పొన్నూరు కాబోలు.మిత్రులందరాతనికి కనకాభిషేకం చేసి కాలికి గండపెండేరం తొడిగారు. “వాఙ్మయమహాధ్యక్ష!” “మహాగవేషణ”-ఇత్యాది బిరుదాలిచ్చారు.”

తదుపరి ఆచార్య కృష్ణకుమారి భాషా విషయక చర్చను కొనసాగిస్తూ: “గ.ల.నావారి ప్రశ్నలు లోతైన అవగాహన కలవి. సామరస్యంగా సమాధానాలు చెప్పింపగలవి. చొప్పకట్లవారి మాటలకు మరికొన్ని అచ్చతెనుగు గూర్చిన మాటలు కలుపుకుందాం….

అచ్ఛమున కభిధేయము అచ్చము. అచ్ఛ సంస్కృత పదం. దానికి తెలుగులో పేరు అచ్చము.(ప.21).బహుపథాలగలది ఆంధ్రభాష అంటూ తెనుగుబాస ఐదు తెరగులుకలదంటాడు.

  1. అచ్చుగా కొంత తానకలది దేశితెనుగు.ఇది ఎల్లవారికి తెలిసేది.తేటగా పలికించేది.(ప.25).
  2. సంస్కృతభాషవల్ల కొంతగా కానబడే భాష― ఇదితత్సమం,తద్భవంఅని రెండుతెరగులు.(ఈ విభాగ పద్ధతిప్రాకృతానిదే అయినా ద్వితీయప్రకృతిగ అప్పటికి అంగీకరించనిది).
  3. తెలుగు విభక్తులుంచి చెప్పేది తత్సమం (ప.24).
  4. శాస్త్రజ్ఞులైనపండితసముదాయం వ్యవహరించేదితద్భవం.
  5. ఒరుల తెగడుచోట తప్ప ఎవరికీ ఒప్పనిది గ్రామ్యం.—ఇక తెనుగు కావించలేని ఈ పెఱపదాలను అలాగే గ్రహించాలనికేతన సందేశంగా భావించాలనిపిస్తుంది. ఈ పద్ధతిని ఆంధ్ర శబ్ద చింతామణి, బాల వ్యాకరణాలు అనుసరించాయి.ఇంతచాలనుకొంటాను…”

***

అటుపిమ్మట శ్రీ ఏసీపీ శాస్త్రిగారు: ” తెలుగును వికృతి అని ఎందుకన్నారు?” అని ప్రశ్నించారు.

ఆపై కృష్ణకుమారిగారు మొదటగా చొప్పకట్ల గారికి సమాధానమిస్తూ: “వ్యావహారిక వ్యాకరణంలో ముప్పాతికవంతు బాలవ్యాకరణ అనుసరణమే కనిపిస్తుంటుంది. ఆకృతిగణ కల్పనం ఎక్కువగా ఉంటుంది. లక్ష్యగ్రంథాలు మాత్రం ఆధునికమైనవే” అన్నారు.

తర్వాత ఏసీపీ గారిని ఉద్దేశించి – “వికృతి అంటే మార్పు అని అర్థం. మార్పు పొందిన భాష వరకే వర్తించే పదం ఇది. కాని బడులలో ప్రకృతి వికృతులు మొదలైనాక ఈరీతి వ్యవహారానికి తోవ పడిందని పెద్దల భావన” అని వివరించారు.

ఆ విషయం మీదనే మరింత వివరంగా చొప్పకట్ల గారు స్పందిస్తూ: “ఆద్యప్రకృతి ప్రకృతిశ్చాద్యే ఏషాతయోర్భవేద్వికృతిః”-చిన్తామణి సంజ్ఙాప్రకరణం లోని సూత్రం.

సంస్కృతము- ప్రకృతి ; ప్రాకృతము-ప్రకృతి… ఆ రెంటినుండి ఏర్పడినదీ భాష….. సంస్కృత,భవ ప్రాకృతభవములనుండి, వర్ణలోప వర్ణాగమాది వికారములను (మార్పులను) పొందుటచే నీభాష (తెలుగు)వికృతి యైనది.

ఉదా : సత్యము-సత్తెము; దైవము-దయ్యము…. ఇలా వికృతి అనేది ఒకపారిభాషిక పదం!” అంటూ చర్చకు స్వస్తి పలికారు.

***

కానీ మా సిరికోనీయుల జిజ్ఞాసకు మాత్రం స్వస్తి కలుగలేదు.

ఫలితంగా 21 నవంబర్ ’21 న, ఆచార్య కృష్ణకుమారి గారిచేత సాహితీ సిరికోన ‘తెలుగు సాహిత్య చరిత్ర ‘ పై నిర్వహిస్తున్న దృశ్య ప్రసంగ మాలికలో కేతన మీద, విశేషించి ఆయన ‘ఆంధ్ర భాషా భూషణం’ మీద ఒక ప్రత్యేక ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆనాటి కార్యక్రమంలో సిరికోన విద్వాంసులతో బాటు, తె.వి.వి. కి చెందిన ఆచార్య ఎ. ఉషాదేవి, డా.రెడ్డి శ్యామల, సాహిత్యంతో బాటు భాషాశాస్త్రంలో కూడా అధ్యయన కృషి చేసిన, ఎమెస్కో ఎడిటర్ డా.డి. చంద్రశేఖరరెడ్డి, కేంద్రీయ విశ్వవిద్యాలయం లో భాషాశాస్త్ర బోధకులు 4 డా. భుజంగరెడ్డి ఇత్యాదులు పాల్గొని ఆం. భా.భూ. లోని శాస్త్రీయ పరికల్పనలను గాఢంగా చర్చించారు.

భాషాభిమానంగల వారందరికీ ఉపయుక్తమైన ఆ కార్యక్రమం మొత్తం యూట్యూబ్‌లో https://youtu.be/z4Hmhnkv9Us లంకె వద్ద లభిస్తుంది…

***

― గంగిశెట్టి లక్ష్మీనారాయణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here