‘సిరికోన’ చర్చాకదంబం-9

0
7

[box type=’note’ fontsize=’16’] సిరికోన వాక్స్థలిలో జరిగిన చర్చ పాఠ్యాన్ని కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ. [/box]

భాగవతార్థ చర్చ- ౨ : ‘ భాగవతార్థ కల్ప తరువు’

(సిరికోన చర్చా కదంబ వ్యాసం)

వ్యాఖ్య : డా. ఉపద్రష్ట సత్యం(డాలస్, యు. ఎస్.)

[dropcap]“భ[/dropcap]గవత్తత్త్వమును వివరించుచు, భగవదవతారములను వర్ణించి(చు)నది భాగవతము అని ఇదివరకు నా వంటి సామాన్య సాహిత్య విద్యార్థులు ఏర్పరచుకున్న అభిప్రాయము” అని ఆచార్య గంగిశెట్టి గారి వెల్లడించిన భావముపై

నా స్పందన:

అవును. సాధారణంగా అందరి అవగాహన అదేగదా! అసలు భాగవతము అంటే ఏమిటీ? “భగవత ఇదం భాగవతమ్” (భగవంతుని చరిత్ర భాగవతం). మరి భగవత్ శబ్దానికి వ్యుత్పత్తి ఏమిటి? – “భగోస్యాస్తీతి భగవాన్.” ‘భగము’ ఉన్నవాడు భగవానుడు. విష్ణు పురాణం – “ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ – షణ్ణామ్ భగ ఇతీరణా” (జ్ఞానైశ్వర్య బల వీర్యయశో వైరాగ్యాలనే షాడ్గుణ్య సంపదను భగము అంటారు. ఇవి ఎవరిలో సమగ్రంగా ఉంటే అతడే భగవంతుడు) అని చెబుతోంది. ఇంకో నిర్వచనం ప్రకారం ప్రవృత్తి నివృత్తులూ, గతాగతాలూ, ధర్మాధర్మాలూ (ఈ ఆరూ) సమగ్రంగా, సంపూర్ణంగా తెలిసినవాడే భగవంతుడు. ఇవి జీవునిలో కూడా ఉన్నా, అవి సమగ్రం కావు. జీవుడు ముముక్షువు అయితే భగవానుడు నిత్యముక్తుడు. అందుకే జీవుడు నిత్యముక్తుడిని ధ్యానించి ముక్తుడవవచ్చు (భ్రమరకీట న్యాయం). ఈ జీవాత్మ-పరమాత్మల ఆంతరంగిక బంధాన్ని నిరూపించేదే భాగవతము.

ఓం ప్రథమంగా ‘భాగవతము’ అన్న పదంలో అక్షరపక్షపాతం లేకుండా ప్రతి అక్షరమూ (దాని శబ్దము) ఏం ప్రతిపాదిస్తోందో చూద్దాం:

*భా = ‘భా’ శబ్దము భాసురమైన ‘భక్తి’ ని తెలియజేస్తుంది

గ = ‘గ’ శబ్దము ప్రజ్ఞానఘనమైన ‘జ్ఞాన’ సూచకం

వ = ‘వ’ శబ్దము వివేకయుతమైన ‘వైరాగ్య’ నిర్దేశకం

త = ‘త’ శబ్దము అజ్ఞాన తిమిరాదిత్యమైన ‘తపస్సు’ కు సూచకం

ము= ‘ము’ మోక్షరూపమైన ‘ముక్తి’ ని ముఖ్యంగా విదితం జేస్తోంది*

(భక్తి, జ్ఞాన, వైరాగ్యాల సహాయంతో తపోనిష్ఠాగరిష్ఠులమై ముక్తి పీఠాన్ని ఆరోహించమని భాగవతం చెబుతోంది.)

భాగవతం గభీరమైన ఆధ్యాత్మిక లోతులలో విరాజిల్లే ఆనంద రసార్ణవం! “వేద కల్పవృక్ష విగళితం” = వేదాలు అన్న కల్పతరువునుండి రాలింది. “శుకముఖదామృత ద్రవ సంయుతమ్” = శుక (మహర్షి) ముఖం నుండి జారిపడిన అమృత ఫలం. అంతా అమృతమయమే. దీనికి టెంక, పీచు, తొక్కు లాంటి త్యాజ్య వస్తువులు లేవు. ఆస్వాదిస్తూ కూచోడమే! మోక్షం సహజంగా లభ్యమౌతుంది. భవరోగానికి భవ్యమైన ఔషధం! ‘బాగు’ అన్నా ‘భాగ్యము’ అన్నా’ ఏమిటో తెలియక అభాగ్యులలా తిరిగే మానవాళికి ఒక మాజిక్ లాన్టర్న్ (దివ్యమైన లాంతర్ – దారిదీపం). అందుకే, పరీక్షిన్మహారాజు దీనిని విన్న తరువాత చేసిందేమీ లేదు! దేహత్యాగం చేసి, ‘అపరాన్ని’ ‘పరం’ లో లీనం చేసి పరంధామునిలో లీనమవడం తప్ప! ”భాగవతో వాఙ్మయావతారః” – భాగవతము వాఙ్మయరూపమైన భగవదవతారమే!

ఇక మీ ప్రధాన ప్రశ్నలు:

  1. గాయత్రీ మూలతత్త్వమేమిటి? భాగవతం దానికి ఆవిష్కరణ ఎలా అవుతున్నది?
  2. దాన్ని అధఃకరించి వృత్రాసుర సంహార వర్ణన తెలపడమే కాక, అలా తెలిపినదే భాగవతమని మత్స్యపురాణం ఎందుకు చెప్పింది? వృత్రాసుర సంహరంలో గోప్యమైన భాగవత మూలాంశమేమిటి? (అనేది తమకు తోచిన పరిధిలో, పరిమితిలో, తెలియ చెప్పవలసినదిగా అభ్యర్థిస్తున్నాను.)

నా ప్రయత్నం:

భాగవతము ”జన్మాద్యస్య యతః” అనే బ్రహ్మసూత్రముతో ప్రారంభమై, వేదాంతరహస్య ప్రతిపాదకమై, నిగమార్థసారమై భాసిస్తోంది.

“జన్మాద్యస్య యతోన్వయాది తరత శ్చార్థే ష్వభిజ్ఞః స్వరాట్

తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే ముహ్యన్తి యత్సూరయః

తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోమృషా

ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి”

ఈ శ్లోకాన్ని ఆంధ్రీకరిస్తూ పోతన ఇలా వ్రాసారు (భాగవతం 1-35):

‘ఇట్లు సత్యం పరం ధీమహి” యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీనామబ్రహ్మ స్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి థర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందు జెప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం జేసి యీ పురాణంబు శ్రీమహాభాగవతం బన నొప్పుచుండు.’

వ్యాసుడు వేద రహస్యాలను కథల మూలంగా వివరించాడు. మొదట మత్స్యపురాణ మిచ్చిన నిర్వచనాన్ని చూద్దాం –

యత్రాధికృత్య గాయత్రీం

వర్ణ్యతే ధర్మవిస్తరః

వృత్రాసుర వధోపేతమ్‌

తద్భాగవత మిష్యతే”

వృత్రాసురవధా, గాయత్రీ మంత్రార్థమూ ఎక్కడ ప్రస్తావించబడతాయో అదే భాగవతమట! ఇది మూల భాగవతంలో లేదు కానీ వ్యాఖ్యాతృ చక్రవర్తి అయిన శ్రీధరాచార్యుల వారు దీనిని ఉదహరించారు. అంతేగాక పోతన గారు కూడా తన గ్రంథంలో పేర్కొన్నాడు కూడా!

ఇందులో మొదటిదైన ‘గాయత్రీ మంత్ర ఆరంభం’ ఉండాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తే, దేవీ భాగవతంలోని –

సర్వచైతన్య రూపాంతామాద్యం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్’ అన్న ప్రథమ శ్లోకంలో ‘ధీమహి,’ ‘ప్రచోదయాత్’ – అనే రెండు పదాలలో గాయత్రీమంత్ర గర్భితమైన పదాలు దర్శనమిస్తున్నాయ్! గాయత్రీ మంత్రం మూడు పాదాలు కలది గనుక వేదంలోని త్రిపదా గాయత్రిగా పరిగణించబడుతోంది. గాయత్రి, వృత్రాసుర వధ, ధర్మవిస్తరము, మరియు ‘సత్యం పరం ధీమహి’ అనే మంత్రము – ఈ నాలుగు కూడా భాగవత నిర్వచనం లో ఉన్నాయి కనుక అవి ఇప్పుడు చర్చనీయాంశములు. ఈ వృత్రవధ, గాయత్రీ మంత్రార్థాలకూ, భాగవత ప్రతిపాదిత సత్యధర్మాలకూ ఏదైనా సంబంధం ఉందా? అదే అతి గుహ్యమైన విషయం! సత్యధర్మాలకు ప్రతీకలే ఇవి. ఇందులో ధర్మానికి ప్రతీక గాయత్రి. సత్యానికి ప్రతీక వృత్రవధ. ఇది నిజమా? ఎలా విశ్వాసం కుదుర్చుకోవాలి?

మొదటగా “గాయత్రి”

మహాభాగవతంలో ఒకే ఒక్క లఘు వచనము తప్ప, గాయత్రి ప్రసక్తి అసలు లేదు. నైమిశారణ్యాన్ని వర్ణిస్తూ, మరియును మధువైరి మందిరంబునుం బోలె….” అన్న ఆ వచనములో ‘నిగమంబునుం బోలె గాయత్రీ విరాజితంబై’ అని చెప్పబడింది. వేదద్రష్టలైన ఋషులలో పశ్యంతి కనులు తెరుచుకోవడంతో మనస్సు యొక్క అపేక్ష లేకుండానే స్వయంగా ఇంద్రియాలకు గోచరముగాని విషయాలను కూడ వారు దర్శించగలిగారు. వేద వాఙ్మయం పశ్యంతీ మూలం. లోక వాఙ్మయం వైఖరీ మూలం. వేద వాఙ్మయం ప్రమాణము; లోక వాఙ్మయం అప్రమాణం. శ్రీమన్నారాయణుడు భాగవతదైవము కదూ? భాగవతము పంచమ వేదము. గాయత్రి వేదమాత. అయితే వేదమాత అయిన గాయత్రి, పంచమ వేదమైన భాగవతదైవం – నారాయణుడు, ఒకే పరతత్త్వమా? కాదా? అన్నది ఆరు మిలియన్ డాలర్ల అద్భుతమైన ప్రశ్న. ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి’ అని శాస్త్రోక్తి కనుక, ఒకే పరతత్త్వమే కాబట్టి, నామభేదమేకానీ తత్త్వభేదం లేదని చెప్పుకోవచ్చు. ఆ రెండింటి తత్త్వము ఒకటే అవ్వాలి. త్రిపదా గాయత్రీ మంత్రంలో 24 అక్షరములు ఉన్నాయి కనుక ఇవి 24 తత్త్వాలను సూచిస్తాయ్! అలాగే నారాయణునకు 24 కేశవాది నామాలు ఉన్నాయ్ (మన దేవతార్చనలో పురాణ ఆచమనంలో ఉచ్చరిస్తాం). విష్ణుధర్మోత్తర పురాణము ఇలా చెబుతోంది:

కర్మేంద్రియాణి పంచైవ, పంచబుద్ధీంద్రియాణిచ

పంచబుద్ధీంద్రియా ర్థంశ్చ, భూతానాం చైవ పంచకమ్‌

మనో బుద్ధిస్త ధైవాత్మా గాయత్య్రా అక్షరాణి చ

ప్రణవం పురుషం విద్ధి సర్వగం పంచ వింశకమ్‌”

కర్మేంద్రియాలు (5); పంచ తన్మాత్రలు (5); పంచ మహాభూతాలు (5); బుద్ధి, చిత్తం, అహంకారం (3); జ్ఞానేంద్రియాలు (5); మనస్సు (1); మొత్తం = 24.

ఈ గాయత్రీ మంత్రం 24 తత్త్వములను, 24 కేశవాది నామాలను సూచిస్తుందనడానికి నిదర్శనంగా గాయత్రీ అనుష్ఠాన తత్త్వప్రకాశికలో గాయత్రీ మంత్రాక్షరములను కేశవాది 24 నామములతో జోడించి న్యాసము చేసే విధానము విధింపబడి ఉంది కనుక ఆదినారాయణునకూ గాయత్రికీ అభేదమని తెలుస్తోంది. అందుచేత వేదమాత అయిన గాయత్రీ, భాగవతంలోని నారాయణుడు ఒకే పరతత్త్వమనడమే సమంజసం గదూ?

రెండో అర్థం (నిర్వచనము):

బాగవతం నారాయణుని అవతారాలను అద్భుతంగా వర్ణించింది. గాయత్రీ, శ్రీమన్నారాయణుడు ఒకే పరతత్త్వమని నిరూపించడానికి భాగవతం యొక్క రెండో నిర్వచనాన్ని కూడా మనం స్పృశించాలి. మనందరికీ సుపరిచయమున్న ‘భాగవతాఖ్యకల్పతరువు’ మహాభాగవతం లో అపురూపంగా నిర్వచించబడింది.

లలితస్కంధము కృష్ణమూలము శుకాలా పాభిరామంబు మంజు

లతా శోభితమున్‌ సువర్ణసుమన స్సుజ్ఞేయమున్‌ సుందరో

జ్వల వృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబునై,

వెలయున్‌ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్‌ సద్విజశ్రేయమై.”

ఈ కల్పతరువు నిర్వచనంతో భారతంలోని పారిజాత నిర్వచనాన్ని పోలిస్తే (నన్నయభట్టు, ఆదిపర్వము 1.66) –

అమితాఖ్యానక శాఖలం బొలిచి, వేదార్థామలచ్ఛాయమై

సుమహద్వర్గ చతుష్కపుష్పవితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో-

త్తమ నానాగుణ కీర్తనార్థఫలమై, ద్వైపాయనోద్యాన జా-

త మహాభారతపారిజాత మమరున్, ధాత్రీసురప్రార్థ్యమై”

రామాయణము అనే కల్పభూజములో ప్రతిశ్లోకములోనూ కూడా ఆదిలో గాయత్రీ మంత్రాక్షరాలు ఉంటాయి గదూ? పైన చెప్పుకున్న నిర్వచనాలలో భాగవతమనబడే కల్పభూజము “సద్విజశ్రేయం” అనీ, భారత పారిజాతమేమో “ధాత్రీసురప్రార్థ్యమ్” అనీ చెప్సబడింది. అంటే, భాగవత భారతములు భూసురులచేత ప్రార్థింపతగినవి, అవి శ్రేయస్సును ఇస్తాయి అనే అర్థంలో చెప్పుకోకూడదు! ఎందుకు? జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః’ అని గదా ఆర్యోక్తి? జన్మతో శూద్రుడుగా బుట్టి, గాయత్రీ బ్రహ్మోపదేశముచేత, సంస్కారాలచేత బ్రాహ్మణుడు (ద్విజుడు) అయ్యాడు. ఈ విధంగా బ్రహ్మోపదేశంచేత (ఉపనయనముచేత) ద్విజుడుగా రూపొందిన బ్రాహ్మణుడు గాయత్రిని ఉపాసిస్తాడు. భారతం, భాగవతం, గాయత్రి మంత్రాక్షరభరితమైన రామాయణం – ఈ మూడూ కూడా – సద్విజ శ్రేయములు, ప్రార్థ్యములు అవడం వలన అవి ‘గాయత్రీ స్వరూపములే’ యని చెప్పబడుతోంది.

మరో భాగవత నిర్వచనం అయిన ‘లలితస్కంధము’ అనే ప్రసిద్ధ పద్యానికి భాగవతపరంగానూ, కల్పవృక్ష పరం గానూ రెండర్థాలు సామాన్యంగా చూస్తూంటాం. కాని ఇంకొకటి మూడవది రహస్యార్థం – గాయత్రీ పరంగా చెప్పుకోవచ్చు.

పురాణాలన్నీ సామాన్యంగా కల్పవృక్షం, పారిజాత వృక్షం, అశ్వత్థం, అంటూ ఇలాటి వృక్షాలతో పోల్చబడ్డాయ్! ఈ తరువులన్నీ మానవ దేహములోని నాడీమండలమునకు నంకేతాలే. ఉత్తర గీతలో అశ్వత్థవృక్షం గూర్చి ఇలా చెప్పబడింది –

నానా నాడీ ప్రసరగం

సర్వభూతాంతరాత్మని

ఊర్ధ్వమూల మధశ్శాఖం.”

సర్వభూతాంతర్గతమైన మానవ నాడీమండలమే ఈ అశ్వత్థము. మన దేహములోని వెన్నెముకలో సుషుమ్నానాడి ఉంది. దాంట్లోనే షట్చక్రాలు (మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, ఆజ్ఞా, సహస్రార చక్రాలు లేదా నాడీకూటములు) ఉన్నాయ్! ఈ చక్రాల (పద్మాల) లోని దళాలలో ‘అకారాది-క్షకారాంత’ వర్ణాలు ఉంచబడినాయి. సర్వవర్ణే మహాదేవి సంధ్యావిద్యే సరస్వతీ’ అనడంచేత ఈ వర్ణమాల గాయత్రీ స్వరూపమేగా? శ్రీమన్నారాయణుడుకూడ ‘అకారాది-క్షకారాంత’ వర్ణ వినిర్మిత విగ్రహుడే! అంతే కాక,

ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।

ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్”

అన్న భగవద్గీతా (పురుషోత్తమప్రాప్తి యోగం) శ్లోక ప్రకారం అశ్వత్థవృక్షానికి ‘వ్రేళ్ళు పైకి, కొమ్మలు క్రిందికి ఉంటాయి.’ ఇది ప్రపంచములోని సాధారణ వృక్షములకు వ్యతిరేకం. అయితే మరి దీని సంకేతార్థం ఏమిటి?

మూలకందమైన మెదడును వేరు గాను, వెన్నెముకలో ఉండే సుషుమ్నా నాడిని స్కంధముగాను, ఇతర అవయవములకు వెళ్ళే నాడులు కొమ్మలుగను, రెండు ప్రక్కల వెన్నెముకను చుట్టుకునియున్న ఇడ, పింగళ నాడులను తీగలు గాను ఊహిస్తే ఈ నాడీమండలమే తలక్రిందులుగా నున్న అశ్వత్థ వృక్షము అని అనుకోవచ్చు. ఇది పిండాండ స్వరూపము. దీనిలోని షట్చక్రములే బ్రహ్మాండములోని షట్చక్రములతో పోల్చబడ్డాయి. కల్పవృక్షము అమరలోకంలో ఉన్నా, భాగవత కల్పవృక్షము ‘ఉర్విన్‌ సద్విజశ్రేయమై’ యుంది.

“లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు …. సద్ద్విజ శ్రేయమై” అనే భాగవత నిర్వచన పద్యానికి కల్పవృక్షపరం గాను, భాగవతపరం గాను రెండర్థాలను విజ్ఞులు చెబుతారు. ఇవి జనబాహుళ్యంలో ఉన్నవే గనుక కేవలం గాయత్రీ పరంగా ఈ రహస్య సంకేతార్థాన్ని క్రింది విధముగా కూడా చెప్పుకోవచ్చని విబుధుల అభిప్రాయం!

గాయత్రీ పరంగా “లలిత స్కంధము” –

అశ్వత్థవృక్షం ఉదాహరణలో పోల్చబడిన నాడీమండలానికి సుషుమ్నానాడి స్కంధము లాగా ఉంది. లేదా స్థూల సూక్ష్మకారణ శరీరాలనబడే త్రిపురాలకు అధిదేవత అయిన త్రిపురసుందరి యని కొందరి భావన.

గాయత్రీ పరంగా “కృష్ణమూలము” –

సహస్రార చక్రాంతర్గతమైన శ్రీకృష్ణనామక పరబ్రహ్మమే మూలకందము. ‘మూలకందం ముకుందమ్‌’ అని సాధారణంగా అంటూ ఉంటారు; మనం వింటూ ఉంటాం. చెట్టుకు తల్లివేరు ఎలా ముఖ్యమో, నాడీమండలానికి శిరస్సులోనున్న సహస్రార చక్రాంతర్గతుడైన కృష్ణ పరమాత్మ మూలం.

గాయత్రీ పరంగా – “శుకాలాపాభిరామంబు”:

గాయత్రీ మంత్రాన్ని సామగానములో నారదుడు తన మహతీ విపంచి మీద పలికిస్తూంటాడు. ‘సరిగమపదని’ అనే సప్తస్వరములు కూడా గాయత్రీ మంత్రములోనివే అని ‘సంగీత సార సంగ్రహం” లో తెలియజేయబడింది.

కర రుచి దిక్‌ పక్షంబులు

గిరి త్రిశత త్రివింశతియును గిరివాస, యటుల్‌

వరగాయత్య్రక్షరములు

సరిగమపదననీ యటంచు సప్తస్వరముల్‌.”

అంటే, గాయత్రీ మంత్రములో ఉన్న 24 అక్షరాలలో రెండు (2), ఆరు (6), పది (10), పదిహేను (15), ఏడు (7), ఇరవైఒక్కటి (21), ఇరవైమూడు (23) – స్థానాలలో ఉండే ఏడక్షరాలూ ‘స రి గ మ ప ద ని’ అని ‘సప్త స్వరాక్షరములు’ అయినాయి అని అర్థం. త్యాగరాజు ఆరాధించినది ఈ సప్తస్వరాక్షరాలే కదూ? పోతన తన భాగవతంలో – ఒక చిన్న వచనంలో – ఈ సప్త స్వరములను ‘బ్రహ్మాభివ్యంజకములు’ అని వ్యవహరిస్తాడు. ఏమిటా వచనం? …

“అని యిట్లాకాశంబు మూర్తియు, ఋగ్వేదాదికంబు నిశ్వాసంబునుగా నొప్పి, …. అందు నఖండిత బ్రహ్మచర్యుండనై యేను మూడు లోకంబుల బహిరంతరంంబులందు మహావిష్ణుని అనుగ్రహంబున నడ్దంబు లేక యీశ్వర దత్తయై బ్రహ్మాభివ్యంజకంబులైన సప్త స్వరంబులు దమయంతన మ్రోయుచున్న యీ వీణాలాపన రతిం జేసి నారాయణ కథాగానంబు సేయుచు జరియించుచుందు.)

అంటే – ఇవి పరతత్త్వాన్ని గూర్చి తెలుపుతాయి. వెన్నెముకకు వీణాదండమని ఇంకొక పేరుందని, దానినే నారదుని మహతీ వీణ అనవచ్చుననీ చెప్పుకున్నాం. ఈ వీణాదండము (వెన్నెముక) లో వీణను మీటే అవసరం లేకుండానే తమంతట తామే సప్తస్వరాలు వినిపిస్తున్నాయ్! అందుకే త్యాగరాజు ‘నాదతను మనిశం శంకరం’ అని అంటారు. కాబట్టి ‘శుకాలాప’ శబ్దము నాదబ్రహ్మ విద్యను సూచిస్తోంది అనవచ్చు.

రమణమహర్షుల వారు మంత్రజపం చేసేటప్పుడు మంత్రమూలమైన నాదానుసంధానము చేయమని బోధించారు. ఉచ్చరించినప్పుడు మాత్రమేకదా ప్రణవనాదం వినిపించేది? మరి నిరంతరం ఎలా వింటాం? రేచక పూరకాలను “సోహం” భావముతో జరిపితే ఓంకార ధ్వని నిరంతరాయంగా వినిపిస్తుంది. కుండలినీశక్తి ప్రకోపిస్తుంది. కాబట్టి ‘ఆలాపాభిరామంబు = ఆలాప + అభిరామంబు’ = అంటే ‘నాదబ్రహ్మవిద్య’ ఇక్కడ పోతన గారి పద్యంలో ధ్వనింపచేయబడింది.

“మంజులతా శోభితమున్‌”: సుషుమ్నానాడిని స్కంధముగా భావించాము. దానిని లతలలాగా చుట్టుకొని ఇడా, పింగళా నాడులు (సూర్యచంద్ర నాడులు) ఉన్నాయి. ఇవి సుషుమ్నానాడితో కలిసి త్రికూటస్థానాన్ని (భ్రూమధ్యాన్ని) చేరి ఆగిపోతాయి.

“సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్‌”: సువర్ణ = మంచి అక్షరాల చేత (షట్చక్రాలలో ఉంచిన అకారాది-క్షకారాంత మాతృకా వర్ణాల చేత); షట్చక్రములను ఒకదానిమీద ఇంకొకటి పేరిస్తే శ్రీచక్రము ఏర్పడుతుందంటారు.

“సుమనస్‌” = మంచిమనస్సు గలవారిచేత (సత్వగుణ ప్రధానులచేత) గాని, మనోవిక్షేపాన్ని వదిలించుకుని ఏకాగ్రతాలబ్ధిని పొందినవారి చేత గాని, “సుజ్ఞేయము“ = బాగ తెలుసుకొనబడునది.

“సుందరోజ్వల వృత్తంబు”: “వృత్తము (circle)” పూర్ణమునకు సంకేతం. సుందరోజ్వల వృత్తంబు అంటే ఈశ్వర సంబంధిత విషయాలను, అవతార విశేషాదులను తెలియజేసే సుందరమైన, ఉజ్వలమైన కథావస్తువు కలది అని అన్వయం చేసుకోవచ్చు; “మహాఫలంబు”: అక్షరమైన మోక్ష సంపదను (మోక్ష ఫలమును) ప్రసాదించేది.

భాగవతము ‘పలికిన భవహర మగునట’ అని కదూ పోతన వారి పలుకులు! అందుకేగా పరమభాగవతోత్తముడు – “శ్రీకైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్” అన్నాడు ప్రారంభంలోనే!

“విమల వ్యాసాలవాలంబునై”: విమలమై, పూర్ణమై, అనంతమైన బ్రహ్మాండమును ఆక్రమించినది. విశ్వవ్యాప్తమైనది (విశ్వం విష్ణుః).

వెలయున్‌భాగవతాఖ్యకల్పతరువుర్విన్‌సద్విజశ్రేయమై.”

ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే

తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి”

ఒకే చెట్టుపైన రెండు పక్షులు ఉన్నాయి. క్రింద కొమ్మ మీద కూర్చున్న పక్షి పళ్ళను తింటోంది. అది తియ్యని పళ్ళను తిన్నప్పుడు సుఖాన్ని, చేదు పళ్ళను తిన్నప్పుడు దుఃఖాన్ని పొందుతోంది. రెండవ పక్షి ఏమీ తినకుండా ప్రశాంతంగా కూర్చొని సుఖదుఃఖాలకు అతీతమైన ఆత్మానందాన్ని అనుభవిస్తోంది. ఈ రెండు పక్షులే జీవేశ్వరులు.

(దేహం = చెట్టు, పళ్ళు తింటున్న పక్షి = జీవాత్మ, పళ్ళు తినకుండా సాక్షిగా ఉన్న పక్షి = పరమాత్మ.)

సద్విజుడనగా రజస్తమోగుణ పరిహారిణి అయిన భాగవత ఆత్యంతిక భక్తి సిద్ధించి శుద్ధసత్త్వగుణప్రధానుడైన పరాభక్తుడు.

సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ

ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ”* (భగవద్గీత 14-17)

సత్త్వాత్ సంజాయతే జ్ఞానం’ అన్న గీతా పలుకులననుసరించి అలాంటి భక్తునికి జ్ఞానము లభించి ముక్తి లభిస్తుంది.

వ్యాసభాగవతమందలి తొలి శ్లోకం మరొక్క సారి –

జన్మాద్యస్య యతోన్వయాది తరత శ్చార్థే ష్వభిజ్ఞః స్వరాట్

తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే ముహ్యన్తి యత్సూరయః

తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోమృషా

ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి”

వ్యాఖ్యాతృ చక్రవర్తి శ్రీధరులు భాగవతానికి వ్యాఖ్య వ్రాస్తూ ఈ శ్లోకాన్ని గాయత్రీ మంత్ర పరంగా సమన్వయించి వ్యాఖ్యానించిన విధం పరిశీలనార్హం – దాని సారాంశం:

“జన్మాద్యస్య” అను పదద్వయం గాయత్రి మంత్రంలోని “సవితుః” అనే పదాన్ని బోధిస్తుంది. శ్లోకంలోని “పరం” అనుపదం – గాయత్రి మంత్రంలోని “వరేణ్యం” – అనే పదానికి బోధకం. శ్లోకంలోని “స్వరాట్,” “ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం” అనే పదాలు మంత్రంలోని ‘భర్గః’ అను పదానికి బోధకాలు. “తే నే బ్రహ్మ య ఆదికవయే” – అను శ్లోకభాగం ‘ధియో యో నః ప్రచోదయాత్” అనే భాగానికి బోధకం. శ్లోకం లోని ‘సత్యం’ – అనే పదం మంత్రం లోని ఆరంభంలో ఉండే “తత్” – అనే పదానికి బోధకం. “అస్య” – అనే శ్లోకంలోని పదం మంత్రంలోని “దేవస్య” – అనే పదానికి బోధకం. “ధీమహి” – అనేది శ్లోకంలోను, మంత్రంలోను సమానంగా ఉంది. “హృదా” – అను శ్లోకంలోని పదం “ధియః” – అను గాయత్రీ మంత్రంలోని పదాన్ని బోధిస్తుంది. శ్లోకంలోని “ఆదికవయే” అను పదం మంత్రంలోని “నః” – అను పదాన్ని సూచిస్తోంది. శ్లోకమందలి “తేన” – అనే పదం మంత్రంలోని “ప్రచోదయాత్” అనే పదానికి సన్నిహితమైనది.

ఈ విధంగా శ్రీధరపండితులు భాగవత ప్రథమశ్లోకాన్ని వ్యాఖ్యానించి భాగవతము గాయత్య్రాఖ్య పరబ్రహ్మ విద్యారూపమైన పురాణమని నిర్ణయించేరు.

సారాంశమేమిటంటే – భాగవతదైవమైన శ్రీమన్నారాయణుడే వేదమాతయైన గాయత్రికి ప్రతిరూపము. వేరే ఆలోచనాసులోచనాలను ధరిస్తే (looking through a different set of lenses) – కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః’ (చేతివ్రేళ్ళ గోళ్ళనుండి ఉద్భవించిన శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలు కలిగినది) అని లలితాసహస్ర నామములో (32వ శ్లోకంలో) ప్రస్తుతింపబడుతోంది అమ్మవారు. ఈ దశావతారాలనే మహాభాగవతము వర్ణించినది. అందుచేత, సాక్షాత్తూ వేదమాత అయిన గాయత్రీ దేవీ, భాగవతదైవమైన నారాయణమూర్తి – ఇద్దరూ ఒకే పరతత్త్వమని నిర్థారించుకోవచ్చు!

2) ఇక వృత్రాసురవధ గురించి –

ఈ వృత్రవధ ప్రస్తావన ఒక పరమాధ్యాత్మిక రహస్యాన్ని సూచిస్తోంది. ‘వృత్రం’ అంటే ‘ఆవరణము’ అనే అర్థం ఉంది. జీవుడిని ఆవరించిన మాయే “వృత్రాసురునిగా” పేర్కొనబడింది. ఈ వృత్రుడు (అంటే మాయ) షోడశ వికారాలను స్వరూపంగా కలిగిన వాడు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచప్రాణాలు (ప్రాణాపాన వ్యానోదాన సమానములు), అంతఃకరణము ఒకటి – ఈ పదహారుకీ షోడశ వికారాలని పేరు. ఈ పంచభూతాల వికారాలే దేహరూపాన్ని దాల్చి ఆ దేహంలో ఈ జీవుడిని బంధించి వేస్తాయి. అందుకే మాయకు, వృత్రుడు (పరమాత్మను ఆవరించినవాడు) అనే సార్థక నామం కలిగింది. ఆ వికారాలను వారించి జీవునికి ముక్తిని కలిగించేటువంటిది వజ్రాయుధం. ఇది కేవలం దైవానుగ్రహం వలన, సద్గురు కృపచేత మాత్రమే లభించేది. అన్యథా దొరకదు! అందుకే, జీవరూపుడైన ఇంద్రునికి గురు స్వరూపుడు, భగవద్రూపుడు అయిన ‘త్వష్ట’ తన శిష్యుని ఆవరించిన మాయను గెలవడానికి వజ్రాయుధ రూపమయిన తత్త్వోపదేశాన్ని చేశాడనే రహస్యం మనం ఇక్కడ గ్రహించాలి. ఆ వజ్రం చేత జీవస్వరూపుడైన ఇంద్రుడు వృత్రుని (అంటే – షోడశ వికార స్వరూపుడైన మాహామాయను) గెలిచి, ముక్తుడై స్వారాజ్య పట్టభద్రుడైనాడని పిండితార్థం. ఇది తైత్తిరీయ సంహిత (కాం 5, ప్రశ్న4, అనువాకం 5) లో చెప్పబడింది. ఏ తత్త్వజ్ఞుడు ఈ షోడశ వికారాలనుండి జీవుడైన తనను, వేరుచేసుకొని తనను పరమాత్మునిగా తెలుసుకుంటాడో, అతడు ముక్తుడవుతాడు అని వృత్రవధ రహస్యం తెలియజేస్తోంది. మానవుడిని ఆవరించిన పెనుమాయను పటాపంచలు జేసి, మానవుడు మాధవునిగా మారడానికి తగిన జ్ఞానాన్ని భాగవతం మనకు ప్రసాదిస్తుంది.

పైన మనం చెప్పుకున్న ‘సత్య ప్రతిపాదకమైన’ “జన్మాద్యస్య యతో ….” అన్న భాగవత ప్రథమ శ్లోకంలో అంతిమ చరణం – ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి” అని ఉంది. ఇక్కడ కుహకం అంటే మాయ. అజ్ఞాన తిమిరం. లేనిది ఉన్నట్లుగా తెలిస్తే అదేగా మాయ? ఏమిటి ఇక్కడ ‘నిరస్త కుహకం’ అయింది? ‘సత్యం’ అని అటున్నారు వ్యాసుల వారు. తిమిరం లాగానే ‘సత్యం’ కూడా ఆవరణ రూపమయింది. ‘వృత్రం’ అంటే ‘ఆవరణము’ అని అర్థం కనుక ‘వృత్రాసురుడు’ అంటే పైన చెప్పుకున్నట్లు సర్వచైతన్యతత్త్వాన్ని ఆవరించిన పెనుమాయ! పరంధామునికి మాత్రమే అది వశవర్తిని. దాని సత్త్వరజస్తమస్సులనే త్రిగుణాలతో (త్రిశీర్షాలతో) మానవులను ఊపిరాడని విషయసుఖాలలో ముంచిపడేస్తుంది, మన చుట్టూ ఒక ఆవరణను సృష్టించి స్వరూపజ్ఞానం లేకుండా జేస్తుంది; అదే వృత్ర విజృంభణం! దానిని మనం ఇంద్రులమై గెలవాలి. ‘ఇదమ్ ద్ర’ అనేదే ‘ఇంద్ర’ అయింది. ‘ఇదం’ = మాయామయమైన జగత్తు; ‘ద్ర’ = చూస్తున్నాము. కానీ, ఇది కాదు నిజానికి మనం చూడవలసినది. దీనికి అతీతమైన వాస్తవతత్త్వాన్ని చూడాలి. దానికి ఈ వృత్రవధ రహస్యం ముఖ్యం. కాబట్టి ముందుగా త్రిగుణాలు, షోడశ వికారాలు (మాయ) నశించాలి. అందుచేత ఓం ప్రథమంగా ఈ మాయచ్ఛేదమూ, తదనంతరం వృత్రవధ – ఈ క్రమంలో చెబుతుంది పురాణ కథ.

మరల పై భాగవత శ్లోకానికొస్తే – ఇది ఎందుకు అని అడగకుండా ఈ మాయను ఎలా నిర్మూలించుకోవాలనేది మన ప్రశ్న కావాలి. దీనికి సమాధానం అన్వేషిస్తూ పోతే చివరికి దొరికే పరిష్కారమే – *“ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం.”* అంటే – కుహకం నిరస్తమవ్వాలిట; మార్గం? “ధామ్నా స్వేన” – స్వకీయమైన ధామం (తేజస్సు)! తన ఆత్మచైతన్య జ్యోతితోనే తన అజ్ఞాన తిమిరాంధకారాన్ని తరిమేయాలి అని అంటున్నారు. ఈ జగత్తులో ఏది ఎప్పుడు గోచరించినా అది ‘సత్-రూపమనీ,’ ‘చిత్-స్వరూపమనీ’ భావిస్తూ, అవగాహనను సరిచేసుకుంటూ అన్నింటినీ సమదృష్టితో చూస్తూ పోతూంటే ఆ వెలుగులో గుణత్రయభరితమైన జగత్తు అనే మాయ (చీకటి) పోయి, ‘అపరము’ ‘పరమై’ పోతుంది. జగత్తుకూ మనకూ అభేదమేననే సత్యం తెలుస్తుంది. ‘ధీమహి’ = ఆ విధమైన అఖండ అభేదానుభూతి కలిగేదాకా దానికి ఆధారంగా దీన్ని మనం తద్రూప భావనతో ధ్యానం చేయడమే గతి అని అర్థం. ఈ వృత్రవధ కథ భాగవతములోనే కాక, ఋగ్వేదము, యజుర్వేదము, పరాశర సంహిత, దేవీభాగవతము, భారతము మొదలగు వాని యందు కూడా ఉంది (పైన తైత్తిరీయ సంహితను ఉదహరించుకున్నాం).

 భాగవతము భగవత్తత్త్వార్థ ప్రతిపాదకము. ఆ తత్త్వాన్ని తెలుసుకోవడానికి ఇంద్రియవృత్తి నిరోధము, మనోవృత్తి నిరోధము మన కర్తవ్యము. వీనిని సంకేత రూపములో తెలిపే కథలే వృత్రాసురవధ లాంటి కథలు (అంగిరసుల కథ కూడా వుంది). భాగవతంలో విదుర-మైత్రేయ సంవాదంలో –

”ఇంద్రియంబు లీశ్వర విషయంబులైన మది సంచిత

నిశ్చల తత్త్వమైనచో, సరసిజనాభు కీర్తనమె చాలు”

అని చెప్పబడుతోంది.

భగవంతుడు ఎవరికైనా చేతికివ్వడానికి మోక్షమనేది ఒక వస్తువు కాదు గదా? ఇంద్రియాలన్నీ జయించి మనస్సునుండి విషయవాసనలను నిర్మూలిస్తేగాని మోక్షము లభించదు. అందుకే వృత్రాసురవధ వేదాలలోనూ, సంహితల యందును, పురాణముల లోనూ చెప్పబడింది! ఆత్మ సాక్షాత్కారమునకు తొలిమెట్టయిన వృత్రాసుర వధను తెలియజేసే ప్రతిగ్రంథము భగవత్తత్త్వార్థ ప్రతిపాదకమయిన భాగవతమని అనుకోవచ్చును. అందువలన వృత్రాసుర వధను దెలుపు వేదములు పురాణములు సామాన్యదృష్టిలో భాగవతములే.

చివరగా – సత్యధర్మ ప్రతిపాదన కొరకే ఈ రెండు (గాయత్రీ, వృత్రవధ) వృత్తాంతాలూ భాగవతంలో ప్రస్తావించబడ్దాయని మనం ఊహించవచ్చు. అయితే భాగవతం వృత్రవధ వర్ణించినా, గాయత్రిని వర్ణించలేదు. సూక్ష్మేక్షికతో పరిశీలిస్తే కొంత అర్థం చేసుకోవచ్చు. కృష్ణావిర్భావానికి ముందే యోగమాయ ఆవిర్భావం జరిగింది. కంసుడు పైకి ఎగరేస్తే అష్టబాహువులతో ఆకాశంలో దర్శనమిచ్చింది. ఆ యోగమాయే గాయత్రి. ఎలా చెబుతాం? గాయత్రికి అష్టబాహువులు ఉన్నాయ్! “ఉత్తమే శిఖరే జాతే ప్రచోదయంతీ పవనే ద్విజాతా” – లాంటి వర్ణనలను వింటే, చూస్తే గగనవిహారం చేసే దివ్యసుందరి మన కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది! ఆ యోగమాయే “దుర్గా, కాళీ, భద్రా, ….” అనే అనేక విశేష నామాలతో పూజించబడుతోందని భాగవతం చెబుతూంటే – ఆ దేవతే గాయత్రీమంత్ర అధిదేవత అని విదితమవుతోంది. ఇదే వ్యాసుల వారి మెరుపు – మంత్రదేవతను (మంత్ర స్వరూపాన్ని) భాగవతంలో భంగ్యంతరంగా, వాచ్యతీతంగా ధ్వనింపజేయడం!

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!

***

ఇంత వివరంగా వచ్చిన లోతైన వ్యాఖ్య మీద మా ప్రతిస్పందన ఏముంటుంది? శాస్త్రీయవృత్తి పరమైన బాధ్యతల్లో తలమునకలై ఉన్నా, ఇంత విపులంగా భాగవతార్థాన్ని విశదీకరించినందుకు నమస్సులర్పించటం తప్ప! అయినా చాపల్యం కొద్దీ ఈ నాలుగు మాటలు రాశాను:

“ఉన్న నిడివి లోనే, మీ ప్రజ్ఞాపాటవములకు సూచకముగా, నవ్య చమత్కార భరితముగా, మీరు చేసిన వ్యాఖ్యానములు (ఉదా: భా-గ-వ-త-మునకు మీరిచ్చిన ప్రత్యక్షర వివ రణము) అపూర్వములు. అందు 24 అక్షరముల గాయత్రీ స్వరూపమునకు, శ్రీమన్నారాయణ తత్త్వమునకు మీరు చేసిన అభేద నిరూపణము అతి ప్రశస్తము.

ఆఖ్యానమును విశేషముగా వి+ ఆఖ్యానించి చెబితేనే వ్యాఖ్యానము. ఈ విశేష అన్వయ, వ్యాఖ్యానములున్నప్పుడే పురాణ ప్రవచనమునకు సార్ధక్యము అను బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి మాటలు జ్ఞప్తికి వచ్చు చున్నవి. వారు దానిని వచసా ఒక కళగా నిర్వహించినారు. మీరు అక్షరశః నిరూపించినారు..

వ్యాసుడు శ్రీమన్నారాయణునకు ఏకవింశత్యవతారములు కాక, 24 అవతారములు చెప్పి, ద్వాదశ స్కంధ పరిమితముగా కాక, చతుర్వింశతి స్కంధ పర్యంతము చేసి ఉంటే, శ్రీధరామాత్యుల దర్శనము మరింత శోభస్కరమై విరాజిల్లెడిది. బహుశా అందులో అది గోప్యమై ఉండవచ్చు.

ఏది ఏమైనా మీ ఈ వ్యాఖ్యయే, మాకలవాటైన అభినవపామర వాక్కున చెప్పాలంటే ఒక ఇండిపెండెంట్ థీసిస్సు..

మరికొన్నిటిని కూడా చేర్చినచో మహత్తరంగా భాసిల్లుతుంది”

– ఇట్లు : కూర్పరి – గంగిశెట్టి లక్ష్మీనారాయణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here