సిరివెన్నెల పాట – నా మాట -1..ఈ పాట.. అసామాన్య దార్శనికుడి గొప్ప మార్గదర్శనం

2
11

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా

~

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా

నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా

ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా

ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా

అప్పుడో ఇప్పుడు కననే కనను అంటుందా

ప్రతి కుసుమం తనదే అనదె విరిసే కొమ్మైనా

గుడికో జడకో సాగనంపక వుంటుందా

బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా

పొరపడిన పడినా జాలిపడదె కాలం మనలాగా

ఒక నిమిషం కూడా ఆగిపోదె నువ్వొచేదాక

అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా

కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా

గతముందని గమనించని నడిరేయికి రేపుందా

గతి తోచని గమనానికి గమ్యం అంటూ వుందా

వలపేదో వలవేస్తుంది వయసేమో అటు తోస్తుంది

గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది

సుడిలో పడు ప్రతి నావా.. చెబుతున్నది వినలేవా

పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా

ప్రతిపూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా

మనకోసమె తనలో తను రగిలే రవి తపనంతా

కనుమూసిన తరువాతనె పెను చీకటి చెబుతుందా

కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని

అని తిరగేసాయా చరిత పుటలు వెను చూడక వురికే వెతలు

తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు

ఇది కాదె విధి రాత.. అనుకోదేం ఎదురీత

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా

అప్పుడో ఇప్పుడు కననే కనను అంటుందా

ప్రతి కుసుమం తనదే అనదె విరిసె కొమ్మైనా

గుడికో జడకో సాగనంపక వుంటుందా

బతుకంటే బడి చదువా అనుకుంటె అతి సులువా

పొరపడిన పడినా జాలిపడదె కాలం మనలాగా

ఒక నిమిషం కూడా ఆగిపోదె నువ్వొచేదాక

~

విశ్లేషణ

‘అప్పో దీపో భవ’ అంటే, Be A Light Unto Yourself అని అర్థం. బుద్ధుడు తన జీవితంలో చివరిగా తన ప్రియ అనుచరుడైన ఆనందుడికి ఇచ్చిన సందేశం ఇది:

“ఓ ఆనందా! నీకు నువ్వే దిక్కు కావాలి!

ఇతరుల మీద ఎప్పుడూ ఆధారపడవద్దు

నీ ముక్తిని నువ్వే శ్రద్ధతో సంపాదించుకో”, అన్న హితబోధ అది.

2008వ సంవత్సరం, ‘కొత్త బంగారులోకం’, సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి కలం నుండి జాలువారిన సిరా బిందువు, ఈ వేదాంత జ్ఞాన సింధువు. కలం పలికే, చిలికే తళుకులకు ఏమాత్రం తీసిపోకుండా గంధర్వ గాయకుడు బాలుగారి గళం ఒలికిన, పలికిన భావలహరి ఈ పాటకు మరింత గాంభీర్యాన్ని అందించింది. ఈ పాటంతా ప్రశ్నలే! ప్రశ్నలతోనే మనలోని వివేకాన్ని తట్టిలేపుతున్న సాహితీ భానుడు – సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు. తికమకపెట్టే ఈ ప్రశ్నల పాటలను విశ్లేషించగలగడం నిజంగా ప్రశ్నార్థకమే!?

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా

నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా

..అనే మొదటి రెండు పాదాలు వినగానే నాకు స్ఫురించిన భావం, అప్పోదీపోభవ – సిద్ధాంతం. మన సమస్యలు, చిక్కులు, ఎవరివి వారివే! అంటే మరి పరిష్కార మార్గాలు? నిస్సందేహంగా మనవే.

ఎదుటి వారిపై ఆధారపడడమంటేనే పరాధీనత. అందుకే నీ ప్రశ్నలకు నీవే సమాధానాలు వెతుక్కో! అన్నది శాస్త్రిగారి ఉపదేశం.

ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా

ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

మనం ఏదైనా ఒక లక్ష్యంతో, ఒక నావలో ఒక దిశగా పయనిస్తూ వుంటే, ఒక అల్లరి గాలి మనల్ని తరుముతూ, చెదరగొట్టే ప్రయత్నం చేస్తే, ఆగిపోవాలా? సాగిపోవాలా? అని ఆలోచిస్తే, సందేహిస్తే లాభం లేదనీ, దృఢ చిత్తంతో ముందుకు సాగమనీ, హెచ్చరిస్తోంది, శాస్త్రిగారి అపార అనుభవం.

‘సంశయాత్మా వినశ్యతి’, అన్న గీతాసందేశాన్ని చక్కటి తేట తెలుగులో వివరించడంలో ఆయనకు ఆయనే సాటి.

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా

అప్పుడో ఇప్పుడు కననే కనను అంటుందా?

ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా

గుడికో జడకో సాగనంపక వుంటుందా?

ఆగాలో లేదో తెలియదంటే చెల్లదు, అజ్ఞానం ప్రగతికి బాటలు వేయదు. సృష్టిలో ఏదీ, దేనికోసం ఆగదని, కాలం యొక్క స్వభావాన్ని, విలువను, శాస్త్రిగారు ఈ పాదాల్లో చక్కటి ఉపమానాలతో విడమరిచి చెప్పారు. పిల్లల్ని కడుపులో మోసే అమ్మైనా, పువ్వుల్ని కనే కొమ్మైనా మోస్తూనే వుండిపోదు కదా? అలాగే సమయపాలనతో నీవు కూడా సాగిపోవాలి అని సందేశం.

బతుకంటే బడి చదువా? అనుకుంటే అతి సులువా?

పొరపడిన పడినా జాలిపడదె కాలం మనలాగా

ఒక నిమిషం కూడా ఆగిపోదె నువ్వొచేదాకా

బతుకంటే పాఠాలు నేర్పి పరీక్షలు పెట్టదు, పరీక్ష పెట్టి పాఠాలు నేర్పుతుంది. అందుకే బ్రతుకు బడిచదువంత సులువు కాదంటారు ఆయన. కష్టపడినా, క్రిందా-మీదా పడినా, మనలాగా కాలానికి జాలి లేదని నొక్కి చెబుతూ, కాలం ఎవరికోసం ఆగదనీ, (Time and Tide Waits For None), మనమే కాలాన్ని అందిపుచ్చుకుని దాంతోపాటుగా పరుగులు తీయాలని, బ్రతుకు వేదాంతాన్ని వివరిస్తున్నారు. కఠినమైన కాలానికి ఏ మాత్రం పక్షపాతం లేదు. గమనం మాత్రమే దాని లక్షణం, లక్ష్యం. ఈ పాట పల్లవిలోనే శాస్త్రిగారు గంభీరమైన జీవిత సత్యాన్ని ఎంతో సున్నితంగా ఆవిష్కరించారు.

పల్లవే అంత లోతుగా వుంటే చరణం ఇంకెలా వుంటుంది? ఈ పాటలో చాలా పెద్ద చరణం వుంది. పల్లవి, చరణాలు దేనంతట అదే వేరు వేరు జీవిత సత్యాల్ని ఆవిష్కరిస్తాయి. ఆ రెంటికీ థీమాటిక్ కనెక్టివిటీ వున్నట్లు అనిపించదు. పల్లవిలో ఎవరు పరుగు వారే తీయాలనీ, సృష్టిలో అన్నీ కాలగమనానికి కట్టుబడి వున్నాయని, అందుకే తెలివిగా మసలుకోవాలనీ హెచ్చరికలు చేశారు. ఇక మనకు భగవంతుడు ప్రసాదించిన తెలివితేటలను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు వివరిస్తున్నారు సిరివెన్నెలగారు.

అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా?

కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా?

కష్టాలు, కన్నీళ్ళు లేని బ్రతుకులు వుంటాయా? అలలు లేని సముద్రం వుంటుందా? కలలు కనాలంటే నిద్రపోతూవుంటే చాలు కదా? అని వితండవాదం చేయడానికేనా మనకు దేవుడు తెలివితేటలను ఇచ్చింది, అన్నింటినీ సక్రమంగా అర్థం చేసుకోవడానికే కదా? తెలివిగా బ్రతుకు దిదద్దుకోరా? అని చురకలు అంటించారు.

గతముందని గమనించని నడిరేయికి రేపుందా?

గతి తోచని గమనానికి గమ్యం అంటూ వుందా?

నిన్నటి రోజు ఎలా గడిచిందో సమీక్షించుకోనివారికి భవిష్యత్తు ఎలా వుంటుంది? ప్రతి గమనానికి ఒక గమ్యం వుంటుంది కాబట్టి గమ్యమెరుగని గమనం వ్యర్థమని, బ్రతుకును సరియైన బాటలో నడిపించి, సార్థకం చేసకోమని శాస్త్రిగారు బోధిస్తున్నారు.

వలపేదో వలవేస్తుంది, వయసేమో అటు తోస్తుంది

గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది?

సుడిలో పడు ప్రతి నావా.. చెబుతున్నది వినలేవా?

ఎవరి గతి ఎలా వున్నా, మతి పోగొట్టే ప్రేమ గోలైతే తప్పదు.. వయసుచేసే మాయను తప్పించుకోవడం సాధ్యం కాదంటున్నారు.

ముందుకన్నా ఈ కాలంలో ఎక్కువమంది Success గురించి మాట్లాడుతున్నారు. గెలుపుపై ఎవరి కోణం వారిది. గెలుపంటే ఇది, అని లోకంలో కొలమానాలు ఏవీ లేవు.

ఎవరి పోరాటం వారిది; ఎవరి గెలుపు వారిది.

ప్రేమ కావచ్చు, ఈ మిథ్యా జగత్తు మాయే కావచ్చు, మరేదైనా ఉచ్చు కావచ్చు, ఒక్కసారి చిక్కుకుంటే ఇక బయటపడలేక అలా సుడిలో పడి తిరుగుతూనే వుంటాం. మునగడం, తేలడం- రెండూ సాధ్యంకాదు. కాబట్టి అనుభవంతో చెప్పేవారి సలహాలను పాటించి బాగుపడమని అంతరార్థం.

పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా?

ప్రతిపూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా?

కరిగిపోయిన కాలం ఏంచేసినా వెనుకకు రాదు. చేయిదాటిపోయాక చేయగలిగింది ఏదీ లేదు. మన బ్రతుకు పుస్తకంలో ప్రతి కొత్త ఉదయం, ఒక కొత్త పుటను తెరుస్తుంది. మనం చేసిన పొరపాట్లే గ్రహపాట్లయి, జీవితం పాఠాలను నేర్పిస్తుంది.

మనకోసమె తనలో తను రగిలే రవి తపనంతా

కనుమూసిన తరువాతనె పెను చీకటి చెబుతుందా?

తను రగిలిపోతూ కూడా కటిక చీకటిని చీల్చాలని, జగమంతా వెలుగులు నింపాలని సూర్యుడు పడే తపనని, కళ్ళు తెరిచి వున్నప్పుడే తెలుసుకో! కనుమూశాక తెలుసుకోవడానికి ఏమీ వుండదన్న ఘాటైన హెచ్చరిక అది.

కడతేరని పయనాలెన్ని? పడదోసిన ప్రణయాలెన్ని?

అని తిరగేసాయా చరిత పుటలు వెను చూడక వురికే వెతలు?

తమ ముందు తరాలకు జతల చితులు అందించాలా ప్రేమికులు?

ఇది కాదె విధి రాత.. అనుకోదేం ఎదురీత..

ముందు వెనుకలు ఆలోచించకుండా, గత అనుభవాలను పాఠాలుగా మార్చుకోకుండా పరుగులు తీసి, లక్ష్యాలను చేరుకోలేని జీవితాలు, ప్రేమను సఫలం చేసుకోలేక కూలిన బ్రతుకులు తమ చేదు అనుభవాలను, జ్ఞాపకాలను ఆరని జంట చితుల్లా అందిస్తారా? అందించకూడదు! ఇదే విధిరాత అని సరిపెట్టుకోకుండా, ఎదురీది సాధించమని విజయనాదం పూరించి మనల్ని ఉత్తేజపరుస్తున్నారు శాస్త్రిగారు.

మొత్తం మీద ఈ పాట ఒక జీవన వికాస సందేశాల సమాహారం. మన దృక్కోణాన్ని మార్చే ఒక చైతన్య సాధనం. ఒక అసామాన్య దార్శనికుడి నుండి ఒక గొప్ప మార్గదర్శనం.

(Images courtesy: Internet)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here