సిరివెన్నెల పాట – నా మాట – 11 – సాధారణ పదాలతో అసాధారణ భావాలు

3
6

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

మెరిసే తారలదే రూపం..

~

చిత్రం: సిరివెన్నెల

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: కే.వీ. మహదేవన్

గాత్రం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

~

సాహిత్యం

మెరిసే తారలదే రూపం?
విరిసే పూవులదే రూపం?
అది నా కంటికి శూన్యం..

మనసున కొలువై మమతల నెలవై
వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం..
గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం.. అపురూపం@2

ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను
ఎల కోయిల అడిగేనా?
ఎవరి పిలుపుతో పులకరించి
పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై
నెమలి వెదుకులాడేనా?
నా కన్నులు చూడని రూపం..
గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం.. అపురూపం..

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా?
గానం పుట్టుక గాత్రం చూడాలా?
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా?
గానం పుట్టుక గాత్రం చూడాలా?
వెదురును మురళిగ మలచి
ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవన నాదం పలికిన నీవే
నా ప్రాణ స్పందన..
నీకే నా హృదయ నివేదన..

మనసున కొలువై మమతల నెలవై..
వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం..
గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం.. అపురూపం

సినీగీతాల్ని కావ్య సాహిత్య స్థాయికి చేర్చిన, చేంబోలు సీతారామశాస్త్రిగారిని సాహితీ ‘సిరివెన్నెల’గా మార్చిన సుమధుర గీతాల్లో ఇది ఒకటి. ప్రశ్న- సమాధానాల సమాహారంగా సాగుతుంది ఈ పాట. ఈ గీతానికి అమృతత్వాన్ని అద్దింది బాలుగారి గాత్రం.

సిరివెన్నెల సినిమాలో అంధుడైన కథానాయకుడికి తన స్పర్శ ద్వారా ప్రకృతి సొగసులను, హొయలను పరిచయం చేస్తుంది నాయిక. తన మనో నేత్రంతో ఆ సోయగాలను దర్శించి, అనుభవించిన కథానాయకుడి మనసు పొంగి, గళంలో అమృతం ఉప్పొంగి, గాయకుడిగా గొప్ప పేరు, ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. తన హృదయ స్పందనగా మారిన కథానాయికను ఆరాధించడం ప్రారంభిస్తాడు. ఆ ప్రేమ భావాతీతమైన ఒక ప్లాటోనిక్ లవ్. ఆమెను తన జీవిత సహచరిగా మార్చుకోవాలని అనుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న నాయిక, “నేను ఎవరో- ఏమిటో, నా రూపం ఏమిటో నీకు తెలుసా?”, అని ప్రశ్నించినప్పడు, నాయకుడు పాడే పాట ఇది.

తాను ప్రకృతిలోని అందాలను చూడలేని అశక్తుడనని చెబుతూ..

“మెరిసే తారలదే రూపం?

విరిసే పూవులదే రూపం?

అది నా కంటికి శూన్యం..”

అని తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు.

మనసున కొలువై మమతల నెలవై

వెలసిన దేవిది ఏ రూపం

నా కన్నులు చూడని రూపం..

గుడిలో దేవత ప్రతిరూపం

నీ రూపం.. అపురూపం@2

ఒక దేవతా ప్రతిరూపంగా తన బ్రతుకు లోగిలిలో అడుగుపెట్టి, తనకు మమతను పంచి, తన మనసులో కొలువైన, ఆరాధ్య దేవత రూపం ఎలా వుందో తనకు అవసరం లేదన్నది కథానాయకుడి భావనగా శాస్త్రిగారు ఆవిష్కరించారు. మనం కూడా దేవత ప్రతిబింబంగా విగ్రహాన్ని చూడగలం కానీ, నిజమైన దేవత, జ్ఞాన నేత్రాలకు మాత్రమే దర్శనమిస్తుంది.

అనంతమైన ఆమె ప్రేమ తత్వంతో నాయకుడి అంతరంగమంతా నిండిపోయిందని భావం. ఆత్మసౌందర్యాన్ని అనుభవించిన పులకింత అది.

అపురూపమైన ఆ రూపాన్ని మనకు ఎంతో మనోహరంగా చూపించారు సిరివెన్నెల గారు.

ఎంత ఉద్వేగభరితమైన భావమో కదా!

పోనీ తన కులగోత్రాలు ఏమిటో, అవైనా తెలియాలిగా? అన్న నాయిక ప్రశ్నకు సమాధానంగా నాయకుడు ఇలా అంటాడు.

ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో..

ఆ వసంత మాసపు కులగోత్రాలను

ఎల కోయిల అడిగేనా?

ఎవరి పిలుపుతో పులకరించి

పురి విప్పి తనువు ఊగేనో..

ఆ తొలకరి మేఘపు గుణగణాలకై

నెమలి వెదుకులాడేనా?

నా కన్నులు చూడని రూపం..

గుడిలో దేవత ప్రతిరూపం

నీ రూపం.. అపురూపం

తన మనసును స్పందింపజేసి, రాగాల పరవళ్ళు తొక్కించిన ఆమని రాకే తనకు ముఖ్యంగానీ ఇతల వివరాలతో కోయిలకు పనిలేదు. తొలకరి చినుకుల మైమరపులో ఆడే నెమలికి, ఆ మేఘపు వివరాలతో ఏమీ అవసరం లేదు. అదే విధంగా తనలోని భావాల వెల్లువకు ప్రేరణగా నిలచిన ఆ అందమైన, ఆత్మీయమైన మనసు తప్ప, బాహ్య సౌందర్యంతో తనకు ఏ సంబంధం లేదన్న అపురూపమైన కవితా శిల్పాన్ని అందించడం శాస్త్రిగారికి సులభ సాధ్యం.

కనీసం నా పుట్టుపూర్వోత్తరాలైనా తెలుసుకొనక్కర్లేదా? అన్న నాయిక ప్రశ్నకు కథానాయకుని సమాధానం..

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా?

గానం పుట్టుక గాత్రం చూడాలా?@2

వెదురును మురళిగ మలచి

ఈ వెదురును మురళిగ మలచి

నాలో జీవన నాదం పలికిన నీవే

నా ప్రాణ స్పందన..

నీకే నా హృదయ నివేదన..

ప్రకృతిలో దేని పుట్టుకా దాని ‘ఎఱుకతో’ జరగదన్న వేదాంత సత్యాన్ని, ఎంతో అలతి పదాలతో సున్నితంగా చెప్పడంలో శాస్త్రిగారు సిద్ధహస్తులు. వెదురుముక్కలాగా చైతన్య రహితంగా, ఒక జడంలా వున్న తనలో స్పందనలను కలిగించి, చైతన్యాన్ని తట్టిలేపి, జీవననాదాన్ని పలికించిన ఆ దేవతే తన ప్రాణమని, ఆమెకే తన హృదయాన్ని నివేదిస్తానన్న, అలౌకిక ప్రేమతత్వానికి పులకించని సాహిత్యాభిమానులు వుండరంటే అతిశయోక్తి కాదు.

ఇంత సాధారణ పదాలు వాడుతూ, అసాధారణ భావాలు పలికించడం ఎంతమందికి సాధ్యం? భాషకు అందని భావం, భాషలో ఒదగలేని భావం.. మనం అందుకోగలిగితే ధన్యులమే..

సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సాహిత్యాన్ని మనసారా ఆస్వాదించడం, కవితా శిల్పానికి, శిల్పికీ శిరస్సు వంచి పాదాభివందనం చేయడమే నాకు తెలిసిన ఆరాధన! ఆ సాహితీ తపస్వి, సుమధుర భాషాఝరి, తెలుగువారిగా జన్మించటం మనందరి భాగ్యం.

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here