[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
నేను తానని అనుకుంటారా
~
చిత్రం: ఓ మై ఫ్రెండ్
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : రాహుల్ రాజ్
గానం : రంజిత్
~
సాహిత్యం
పల్లవి:
నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరా? ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా? ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా? స్నేహం మోహం రెండూ వేరని తెలిసి తప్పుకుపోతారా?
చరణం:
ఒక చోటే ఉంటూ ఒకటే కల కంటూ విడివిడిగా కలిసే ఉండే కళ్ళది ఏ బంధం?
కలకాలం వెంటే నడవాలనుకుంటే కాళ్ళకు ఓ ముడి ఉండాలని ఎందుకు ఈ పంతం?
చుట్టరికముందా చెట్టుతో పిట్టకేదో ఏం లేకపోతే గూడు కడితే నేరమా?
ఏ చెలిమి లేదా గట్టుతో ఏటికేదో వివరించమంటే సాధ్యమా ॥ నేను తానని ॥
చరణం:
కనులకు కనిపించే రూపం లేకుంటే ప్రాణం తానున్నానన్నా ‘నమ్మం’ అంటారా?
చెవులకు వినిపించే సవ్వడి చేయందే గుండెల్లో కదిలే నాదం లేదని అంటారా?
మదిలోని భావం మాటలో చెప్పకుంటే అటువంటి మౌనం తగనిదంటూ అర్థమా?
తీరాన్ని నిత్యం అల అలా తాకుతుంటే నిలిపే నిషేధం న్యాయమా? ॥నేను తానని ॥
♠
బంధాలు ఎన్నో రకాలు.. రక్తసంబంధం, ప్రేమ బంధం, ఆత్మబంధం(స్నేహబంధం). లోకానికీ, కాలానికీ కట్టుబడని అమరమైన బంధాలు ఎన్నో ఉన్నాయి. అన్ని బంధాల్లోకి స్నేహానిది ఒక ప్రత్యేకమైన స్థానం. మమతలతో అల్లుకున్న స్నేహాలు, ఏ నిర్వచనాలకు కట్టుబడవు. భార్యాభర్తలుగా మారిన స్త్రీ పురుషుల మధ్య ఉన్న బంధం ‘సహగమనం’ స్థాయి నుండి, ‘సహజీవనం’ స్థాయి వరకు కాలానుగుణంగా ఎన్నో మార్పులు చవిచూసింది. ఏది ఏమైనా స్త్రీ పురుషుల మధ్య స్నేహం ఎప్పుడూ చర్చనీయాంశమే!
అబ్బాయి, అమ్మాయి కలిసి ఎప్పటికీ కేవలం స్నేహితులుగా ఉండగలరా? ఇలాంటి సంబంధాన్ని సమాజం అంగీకరించగలదా? ప్రేమ మరియు స్నేహం మధ్య తేడా ఈ ఏమిటి? సినిమాకి సంబంధించినంతవరకు ఈ ఎలిమెంట్స్ ఎప్పుడూ కథా బలాన్ని చేకూరుస్తూనే ఉంటాయి. యూత్ తక్కువ సమయంలోనే ఇలాంటి కథాంశాలకు ఆకర్షితులవుతారు. ఈ నేపథ్యంతోనే తీసిన సినిమా, ‘ఓ మై ఫ్రెండ్’.
ప్రేమ వర్సెస్ స్నేహం కథాంశంగా సాగే ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంలో’ చందు (సిద్ధార్థ్) మరియు సిరి (శ్రుతిహాసన్) చిన్ననాటి స్నేహితులు. చందు రాక్ బ్యాండ్లో కళాకారుడిగా ఉండాలనుకుంటాడు. క్లాసికల్ డ్యాన్సర్ అవ్వడం సిరి కల. జీవితంపై సిరికి ఉన్నంత క్లారిటీ, జాగ్రత్త తన కొడుక్కి లేదని చందు తండ్రి భావిస్తాడు. సిరి అమెరికాలో నివసిస్తున్న ఉదయ్ (నవదీప్) తో ప్రేమలో పడి, వాళ్లు నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు చందు కూడా తన ఇంటర్ క్లాస్‌మేట్ రీతు (హన్సిక)తో ప్రేమలో పడతాడు. సిరి సహాయంతో, అతను ఆమె ప్రేమను గెలుచుకోవడంలో విజయం సాధిస్తాడు.
అంతా సంతోషంగా ఉన్న సమయంలో, చందు సంగీత పోటీకి హాజరు కావాల్సివుండడంతో నలుగురూ బయలుదేరతారు. చందు మరియు సిరిల స్నేహంపై అపార్థాలు ఏర్పడి చందు-రీతు మరియు సిరి-ఉదయ్ మధ్య సంబంధానికి భంగం కలిగించడం, ఆ తర్వాత జరిగే సంఘటనల ఆధారంగా అపార్థాలు తొలగిపోయి, రెండు జంటలు ఒకటవడం జరుగుతుంది.
ఈ చిత్రంలో, ఆడ-మగ మధ్య కల్మషం లేని స్నేహాన్ని ప్రస్తావిస్తూ, ఆత్మానుబంధంలో ‘రెండింటికి’ తావులేదన్న అద్వైతాన్ని వ్యక్తీకరిస్తూ సిరివెన్నెల కలం నుండి జాలువారిన పాట ఇది. రాహుల్ రాజ్ స్వరపరిచిన బాణీలు కొత్త బలాన్ని నింపగా, రంజిత్ స్వరం చాలా సెన్సిబుల్ గా భావాలని పలికించింది.
నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరా? ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా? ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా? స్నేహం మోహం రెండూ వేరని తెలిసి తప్పుకుపోతారా?
తమ స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకునే సమాజాన్ని ఉద్దేశిస్తూ ఈ పాట సాగుతుంది. నేను-తాను అని రెండు శరీరాలుగా పైకి కనిపిస్తున్నా, నేనే తానని, మేమిద్దరం ఒకటేనని ఎందుకు అర్థం చేసుకోరు? రెండు రూపాలుగా కనిపించడమే మా తప్పా? ఒక వ్యక్తిని అభిమానించడంలో కూడా స్త్రీ పురుష భేదాలు ఉండాలా?, అని ప్రశ్నలు కురిపిస్తాడు సాహితీకారుడు. అలా ఉంటే, ఆ విషయం గురించి ‘అభిమానానికి’ చెప్పండి! ఈ భేదాలు అన్నీ జాగ్రత్తగా గమనించాకే నువ్వు హృదయంలో నుండి ఉప్పొంగు అని! అలా చెప్పలేకపోతే, స్త్రీ పురుషుల ప్రేమలో, స్నేహమూ, మోహమూ మధ్య ఉన్న చెప్పలేనంత వ్యత్యాసాన్ని గుర్తించి, అనుమానించే వాళ్ళందరూ తప్పకపోవచ్చు.. అని నాయకుడి భావనగా సిరివెన్నెల గారు సున్నితమైన, ఆత్మీయమైన స్నేహ బంధాన్ని పల్లవిలో వ్యక్తం చేశారు.
ఒక చోటే ఉంటూ ఒకటే కల కంటూ విడివిడిగా కలిసే ఉండే కళ్ళది ఏ బంధం?
కలకాలం వెంటే నడవాలనుకుంటే కాళ్ళకు ఓ ముడి ఉండాలని ఎందుకు ఈ పంతం?
చుట్టరికముందా చెట్టుతో పిట్టకేదో ఏం లేకపోతే గూడు కడితే నేరమా?
ఏ చెలిమి లేదా గట్టుతో ఏటికేదో వివరించమంటే సాధ్యమా ॥
పల్లవికి అద్భుతమైన ప్రకృతిలోని ఉపమానాలనిస్తూ, చరణాల్లో తన భావుకతను పరవళ్ళు తొక్కించారు సిరివెన్నెల. సహజంగా నిరంతరంగా కలిసి ఉండే రెండు కళ్ళ మధ్య ఏ బంధం ఉంది? కలిసి నడిచే రెండు కాళ్ళకి ఏదైనా ముడితో అవసరం ఉందా? (స్త్రీ పురుషులు కలిసి స్నేహంగా బ్రతకాలంటే, మాంగల్యం అనే ముడి అవసరమా?) ఏ చుట్టరికము ఉందని, పిట్ట చెట్టుపై గూడు కట్టుకుంటుంది? ఏ చెలిమి ఉందని, ఏరు గట్టును హత్తుకొని ఉంటుంది? అంటూ.. ప్రశ్నలకి ప్రశ్నలతోనే సమాధానాలు అనిపిస్తున్నారు గీత రచయిత.
కనులకు కనిపించే రూపం లేకుంటే ప్రాణం తానున్నానన్నా ‘నమ్మం’ అంటారా?
చెవులకు వినిపించే సవ్వడి చేయందే గుండెల్లో కదిలే నాదం లేదని అంటారా?
మదిలోని భావం మాటలో చెప్పకుంటే అటువంటి మౌనం తగనిదంటూ అర్థమా?
తీరాన్ని నిత్యం అల అలా తాకుతుంటే నిలిపే నిషేధం న్యాయమా? ॥
ఇక రెండో చరణంలోకి వస్తే నిక్కమైన స్నేహానికి ఎటువంటి సాక్షాలు అవసరం.. అని ప్రశ్నిస్తున్నారు. కళ్లకు కనిపించని ప్రాణం నేనున్నానన్నా నమ్మలేమని అనగలమా? గుండెలో నిరంతరంగా కదిలే లయ, చెవులకు వినపడనంత మాత్రాన.. లేదని అనగలమా? ఆత్మీయమైన బంధాల్ని మాటల్లో చెప్పలేనంత మాత్రాన, ఆ మౌనాన్ని తప్పు పట్టగలమా? అతి సహజంగా, నిరంతరంగా తీరాన్ని తాకే అల చెలిమిని నిషేధించగలమా? అంటూ ప్రశ్నలు సంధించి, పవిత్రమైన స్నేహ బంధానికి ఎటువంటి సాక్షాలు, రుజువులు, ఎవరి ఆమోదాలు అవసరం లేవని బలంగా చెబుతున్నారు సిరివెన్నెల.
సన్నివేశానికి తగినట్టుగా మనో విశ్లేషణకు సంబంధించిన పాటలు రాయడంలో సిరివెన్నెలకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ‘మనసుకవి’ అయిన ఆత్రేయగారి తర్వాత, ‘మనసు’ అనే ఇతివృత్తంపై సిరివెన్నెల మార్కు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఎటువంటి ఇతివృత్తాన్నైనా తనదైన శైలిలో నిర్వచించడంలో సిరివెన్నెలగారిది అందవేసిన చేయి.
Images Courtesy: Internet