సిరివెన్నెల పాట – నా మాట – 36 – ముద్దులొలికించే ముద్దు పాట

0
11

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

అమ్మాయి ముద్దు ఇవ్వందే..

~

చిత్రం: క్షణ క్షణం

సంగీతం: ఎం ఎం కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల

గానం: ఎస్పీ బాలసుబ్రమణ్యం, చిత్ర

~

పాట సాహిత్యం

పల్లవి:
అతడు: అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
ఆమె: అబ్బాయి మీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమో గొడవలే
అతడు: ముద్దిమంది బుగ్గా.. వద్దంటు అడ్డం రాకే నువ్వు సిగ్గు లేని సిగ్గా
ఆమె: ముద్దిమంటే బుగ్గా అగెల్లె వస్తే ఆగేదెట్టా, హద్దు పొద్దు వొద్దా?

చరణం:
అతడు: మోజు లేదనకు ..
ఆమె: ఉందనుకో ..ఇందరిలో ఎలా మనకు? మోగీపొమ్మనకు ..
అతడు: చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో..
ఆమె: చూడదా సహించనీ వెన్నెల.. దహించిన కన్నులా
అతడు: కళ్ళు మూసేసుకో హయిగా..

అతడు: ॥అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
ఆమె: అబ్బాయి మీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమో గొడవలే॥

చరణం:
ఆమె: పారిపోను కదా?
అతడు: అది సరే అసలు కథ అవ్వాలి కదా? ఏది ఆ సరదా?
ఆమె: అన్నిటికి సిద్ధపడే వచ్చాను కదా?
అతడు: అందుకే అటు ఇటు చూడకూ సుఖాలను వీడకు
ఆమె: తొందరేముందిలే విందుకు?

A truly unforgettable kiss symbolizes the beautiful union of two souls. When two hearts intertwine, it’s the kiss that seals their connection.. అని ఇంగ్లీష్ వారు ముద్దుని ముద్దుముద్దుగా నిర్వచిస్తారు. ఇంతకూ ఈ ముద్దుల గోల ఏంటి, అనుకుంటున్నారా? ఏం లేదండి, మోడనైజేషన్ అనే ముసుగులో మనం Westernise అయిపోతున్నాం కదా!

మనం కూడా మోడరన్ అనిపించుకోవడానికి, సనాతన సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చుకుంటూ, వాటిని చాదస్తాలుగా వక్రీకరించుకుంటూ, విదేశీయులు చెప్పిన అన్ని ప్రత్యేక దినాలను -Special Days , జరుపుకుంటూ మనలో ఎంతో శాతం మంది, మురిసిపోతున్నాం కదా! ఆ గోలలో భాగం అన్నమాట ఇది. ప్రపంచవ్యాప్తంగా, మరి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ఎంతో ప్రాచుర్యాన్ని సంపాదించుకొని, ఒక్క రోజుల్లో వందల కోట్ల వ్యాపారాన్ని ఇస్తున్న Valentine’s Day ని, యూరోపియన్లు Valentine’s Week గా జరుపుకుంటారు. అందులో వరుసగా Rose Day, Propose Day, Chocolate Day, Teddy Day, Promise Day, Hug Day, Kiss Day, చివరగా Valentine’s Day ఉంటాయన్నమాట. మనం ఈరోజు విశ్లేషించుకుంటున్నది సీతారామశాస్త్రి గారి ముద్దు పాట కాబట్టి, కాస్త దాన్ని ఉపోద్ఘాతం తెలుసుకుంటున్నాం.

అయినా అన్ని రకాల ముద్దులకు, ఒకే రకమైన ప్రయోజనం, అంతరార్థం లేదు. French kiss వంటి, శృంగార పరమైన ముద్దుల విషయం వదిలేస్తే, నుదుటి మీద ఇచ్చే ముద్దు, బుగ్గ మీద ఇచ్చే ముద్దు, చేతికి ఇచ్చే ముద్దు.. మొదలైనవి ఆత్మీయత, ప్రేమ, గౌరవ సూచకం ఇలాంటి భావాలను వ్యక్తపరుస్తాయి. ముద్దుల్లో.. Peck, Smack (చప్పుడు వచ్చేలా ఇచ్చే ముద్దు), Air kiss, Soul kiss అని పలు విధాలుగా ఉంటుంది. మన సనాతన, కామ శాస్త్రాలలో కూడా చుంబనాలకు సంబంధించిన సశాస్త్రీయమైన వివరణ, విశ్లేషణ దొరుకుతుందన్న విషయం మనకు తెలియనిది కాదు.

ముద్దుకు ఓ రోజు ప్రత్యేకించబడి ఉందని మనకు తెలుసు కదా! వాలెంటైన్స్ డే కంటే ఒక రోజు ముందు, అంటే ఫిబ్రవరి 13 ప్రపంచ వ్యాప్తంగా Kiss Day జరుపుకుంటారు. ఆ రోజు ప్రేమికులు ముద్దుల ప్రపంచంలో మునిగితేలిపోతారు. ముద్దులోచ అనిర్వచనీయ భావాలతోపాటు, మనసును ఉత్సాహపరిచే రొమాంటిక్ ఫీలింగులు కూడా ఎన్నో ఉంటాయి.

In the garden of affection, where emotions play,
Comes a day of sweetness, where love finds its way.
A moment to cherish, under the moon’s soft light, It’s Kiss Day, my love, let our spirits take flight., అంటాడు ఒక ఆంగ్ల కవి.

ఒక్క ముద్దుతో మనసులో ఉన్న ప్రేమనంతా వ్యక్తం చేయ్యొచ్చు. ఈ విషయం తెలుగు గేయ రచయితలకు బాగా తెలుసు. అందుకే తెలుగులో ‘ముద్దు’పై ఎన్నో పాటలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. విచ్చలవిడి శృంగార సాహిత్యాన్ని పక్కనపెట్టి, ముచ్చటైన, బహుళ ప్రజాదరణ పొందిన ముద్దు పాటలు నాలుగింటి గురించి మాట్లాడుకుందాం.

~
ము..ము..ము..ము.. ముద్దంటే చేదా.. నీకావుద్దేశం లేదా?
ఇప్పుడొద్దనావంటే చిన్నవాడా.. రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా .. ఆరుద్ర
~
అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు – ఆచార్య ఆత్రేయ
~
ఆమె:
ముక్కు పై ముద్దు పెట్టు ముక్కెరయి పోయేట్టు
చెంపపై ముద్దు పెట్టు చక్కెరయి పోయేట్టు
అతడు:
మీసం పై ముద్దు పెట్టు మీదికే దూకెట్టు
గడ్డం పై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు – శ్రీహర్ష
~
చుంబనం, ప్రేమవలంబనం, ప్రియచుంబనం – శ్రీ వేదవ్యాస్ (పాండురంగడు చిత్రంలో, ముద్దుపై సంస్కృతంలో ఒక పాట)
~
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి
చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి
రహదారులన్నీ తారలైన వేళ
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి- సిరివెన్నెల
~
Nizar Qabbani అనే కవి ముద్దుని ఇలా నిర్వచిస్తున్నాడు..
Every time I kiss you
After a long separation
I feel
I am putting a hurried love letter In a red mailbox.
చాలా కాలం వియోగం తరువాత, తన ప్రియురాలిని కలిసి, ముద్దు పెట్టుకున్న ప్రతిసారి, హడావిడిగా రాసిన ఒక ప్రేమ లేఖను, ఎర్రటి పోస్ట్ బాక్స్‌లో వేసిన అనుభూతి వస్తుందట!
~

సినీ గీత సాహిత్యాన్ని ఎంత ఉన్నత స్థానానికి చేర్చి, అశ్లీలమైన పాటల జోలికి పోకుండా, 3 వేల పాటలకు పైగా సినిమా పాటలు వ్రాసిన తన ప్రస్థానంలో, అక్కడక్కడ సందర్భాన్ని బట్టి శృతి మించని, శృంగార గీతాలు సిరివెన్నెల సాహిత్యంలో మనకు కనిపిస్తాయి. సినిమాల్లో కమర్షియల్‌గా తప్ప డ్యూయెట్లకు- అంటే యుగళగీతాలకు వేరే ప్రాముఖ్యత ఏది లేదని, ప్రేక్షకులు అలవాటు పడ్డారు కాబట్టి, ఒక మూసలో అవి ముందుకు సాగుతున్నాయని, సిరివెన్నెల గారు ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు. అయితే, సిరివెన్నెల చేత ఒక ముద్దు పాట రాస్తే, తన సాహిత్యంతో ఎంత ముద్దులొలికిస్తారో, చూడాలని కాబోలు, రాంగోపాల్ వర్మ గారు, ‘క్షణ క్షణం’ చిత్రంలో, ఆయన చేత ఓ ముద్దు పాట రాయించారు.

కథలో హీరో హీరోయిన్లు, శ్రీదేవి, వెంకటేష్, వారిని వేటాడే శత్రువుల నుండి, వెంటపడే పోలీసుల బారి నుండి తప్పించుకొని, అడవిలో అష్ట కష్టాలు పడి, చివరకు జనావాసాలలో ప్రవేశిస్తారు. అక్కడ ఒక బట్టల దుకాణంలో దూరి, కొత్త బట్టల్ని ఎంపిక చేసుకుంటారు. ఉన్న ఒక జత బట్టలతో అడవిలో ఎన్నో పాట్లు పడ్డ హీరోయిన్, సొగసైన కొత్త బట్టల్లో దర్శనం ఇచ్చేసరికి, హీరోకి ఎంతో ముద్దొచ్చేస్తుంది. ఆ సందర్భంగా, వారిద్దరి మధ్య జరిగే సంభాషణను, సిరివెన్నెల ముచ్చటైన పదాలతో కూర్చి, ఒక మంచి యుగళగీతంగా మలచారు.

అతడు: అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
ఆమె: అబ్బాయి మీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమో గొడవలే
అతడు: ముద్దిమంది బుగ్గా.. వద్దంటు అడ్డం రాకే నువ్వు సిగ్గు లేని సిగ్గా
ఆమె: ముద్దిమంటే బుగ్గా అగెల్లె వస్తే ఆగేదెట్టా, హద్దు పొద్దు వొద్దా?

అమ్మాయి ముద్దుకై ఆరాటపడిన హీరో, ఆమె ముద్దు ఇవ్వకపోతే వదిలేది లేదని బెట్టు చేస్తాడు. అతని కోరిక తీరిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని హీరోయిన్ వారిస్తుంది. ఇందులో గొప్ప మెలిక ఏంటంటే, హీరో తన ప్రేయసి తనకి ముద్దు ఇవ్వకుండా అడ్డుపడద్దని, సిగ్గును బ్రతిమాలడం. రొమాంటిక్ పాటల్లో కూడా, ఒక ఉన్నత స్థాయి భావుకతను, పాటలోకి చొప్పించగలగడంలోనే సిరివెన్నెల గారడీ మనకు కనిపిస్తుంది. సహజంగానే, హీరోని అదుపులో ఉండమని, అగ్గిలాగా ఎగసిపడద్దని, హద్దులు గీస్తుంది హీరోయిన్.

Each kiss a promise, sealed with devotion,
A magical elixir, a sweet emotion. In the language of love, where words fall short, Our lips converse, in a silent rapport.

అద్భుత మహత్యాలు కలిగిన ఒక అమృతం లాంటిదని, భాగస్వామి పట్ల ఆరాధనను పలికిస్తుందని, మాటలు మౌనాలు అయినప్పుడు, పెదవులు నిశ్శబ్దంగా సంభాషిస్తాయని, కవి ముద్దు పట్ల, తన భావాన్ని వ్యక్తపరుస్తాడు.

O beauty, passing beauty! Sweetest sweet! How can thou let me waste my youth in sighs. I only ask to sit beside thy feet.

Thou knowest I dare not look into thine eyes. Might I but kiss thy hand! I dare not fold My arms about thee–scarcely dare to speak. And nothing seems to me so wild and bold, As with one kiss to touch thy blessed cheek. Methinks if I should kiss thee, no control Within the thrilling brain could keep afloat The subtle spirit. Even while I spoke, The bare word “kiss” hath made my inner soul To tremble like a lute string, ere the note Hath melted in the silence that it broke.- Alfredo Lord Tennyson

ప్రియురాలి పాదాల దగ్గర కూర్చుని, కళ్ళలోకి కూడా నేరుగా చూసే ధైర్యం లేక, ముద్దివ్వమని అడగలేక, చేతిని మాత్రమే ముద్దు పెట్టుకోగల ధైర్యాన్ని కూడగట్టుకోగలననీ, kiss అనే మాట కూడా మాట్లాడలేక, తీగ తెగిన ఒక సంగీత వాయిద్యం లాగా మూగపోయాననీ, తన బాధను వెళ్లబుచ్చుతాడు Tennyson. ఇది కూడా సిరివెన్నెల బాణీలో ముద్దులోని అడిగే ఒక మధురమైన భావం ప్రకటన.

అతడు: మోజు లేదనకు..
ఆమె: ఉందనుకో ..ఇందరిలో ఎలా మనకు? మోగీపొమ్మనకు..
అతడు: చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో..
ఆమె: చూడదా సహించనీ వెన్నెల.. దహించిన కన్నులా
అతడు: కళ్ళు ముసేసుకో హయిగా..

నీకు కూడా ముద్దు ఇవ్వాలని ఉంది. మోజు లేదని అబద్ధాలు చెప్పకు, అని హీరో అంటే, ఇంతమందిలో అలాంటి కోరికలు కోరవద్దంటుంది.

కళ్ళు మూసుకుని చుట్టూ ఎవరూ లేరనుకో, చీకట్లో ఉన్నామనుకో! అన్న హీరో సలహాకు.. వెన్నెల తమనిద్దరినీ గమనిస్తోందని.. గడుసుగా సమాధానం చెప్పిస్తారు.. సిరివెన్నెల, కథానాయకతో.

ఆమె: పారిపోను కదా?
అతడు: అది సరే అసలు కథ అవ్వాలి కదా? ఏది ఆ సరదా?
ఆమె: అన్నిటికి సిద్ధపడే వచ్చాను కదా?
అతడు: అందుకే అటు ఇటు చూడకూ సుఖాలను వీడకు
ఆమె: తొందరేముందిలే విందుకు?

ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడతావు. నేను ఎక్కడికీ పారిపోను కదా! అని ప్రశ్నిస్తుంది, హీరోయిన్. చిలిపి తలుపులు తనలో చెలరేగుతుండగా, అవన్నీ సరే, మన సరదాలు తీరాలి కదా, అసలు కథ అవ్వాలి కదా! చుట్టూ ఎవరున్నా పట్టించుకోకు, మన ఆనందాలను కోలుపోనీకు.. అని, తన మనసులోని కోరికను బయటపెడతాడు హీరో. అలా అబ్బాయి తొందరపాటును, సున్నితంగా ఆపుతూ, గోముగా వారిస్తూ, అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా! అందాల విందుకు తొందర ఏముంది.. అంటూ గుంభనంగా సమాధానం చెబుతుంది, హీరోయిన్.

ఈ విధంగా, ఎంతో శృంగారంగా, వేలం వెర్రిగా, ఇలాంటి సందర్భాన్ని పాటగా, ఘాటుగా రాసే అవకాశం ఉన్నా, అత్యంత సహజమైన సంభాషణలతో, తాళ బద్ధంగా, సాహిత్యాన్ని సృష్టించి, తను నిబద్ధతను ప్రదర్శించారు సిరివెన్నెల.

సినిమా పాటలు విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలకు, గీసుకున్న కట్టుబాట్లకు, అనుగుణంగా, మంచి పాటను సందర్భోచితంగా అందించారు ఆయన. నా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇలాంటి పాటలు రాయను! అనకుండా, రాస్తాను కానీ, నాకు నచ్చినట్టు, నా పద్ధతిలో, ఇలానే రాస్తాను! అని శాసించగలిగిన ధీశాలి, సిరివెన్నెల.

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here