సిరివెన్నెల పాట – నా మాట – 40 – అందాల ఝడిలో ముంచే పాట

0
14

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

చినుకు తడికి చిగురు తొడుగు

~

చిత్రం: నీ స్నేహం

సంగీతం: ఆర్పీ పట్నాయక్

సాహిత్యం: సిరివెన్నెల

గాత్రం: ఉష

~

పాట సాహిత్యం

పల్లవి:
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా..ఆ ..ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

చరణం 1:
పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు
కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా
ఆ.. ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా

చరణం 2:
వరములన్నీ నిను వెంట బెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతున్నావే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ..కాముని సుమశరమా ఆ..కాముని సుమ శరమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా..ఆ ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నీవమ్మా

వర్షం లోకానికంతా హర్షమే. తొలకరి చినుకు కోసం మనిషికీ, మట్టికీ ఎదురుచూపే. జీవజాలానికి కావాల్సిన ఆహారమంతా వర్షం సాయంతోనే నేల తల్లి మనకు అందిస్తుంది. వానజల్లులో తడవని, ఆనందించని బాల్యమే ఉండదంటే అతిశయోక్తి కాదు. వర్ష ఋతువును ప్రాచీన కవుల నుండి, భావ కవుల వరకు ఎంతో రమణీయంగా వర్ణించారు. అయితే తెలుగు టాకీ ప్రారంభమైన 33 ఏళ్ల వరకు సినీ కవులు వాన జోలికి వెళ్లలేదని, 1964లో ఆత్రేయ కన్ను పడే వరకు వెండితెర మీద సాహితీ వాన కురవలేదని, ‘సిరివెన్నెల రసవాహిని’, పుస్తకంలో డాక్టర్ పైడిపాల తెలియజేశారు. ఆత్రేయ చిటపట చినుకులే వెండితెర మీద తొలి వాన తళుకులు. 60 లలో ఆత్రేయ, 80 లలో వేటూరి వాన పాటల స్పెషలిస్టులయితే, ఇప్పటి వాన పాటల సర్దార్, సిరివెన్నెలే! వర్షం చిత్రంలో రాసిన వాన పాటలు, సిరివెన్నెలను ఈ అంశంలో శిఖరాగ్రాన కూర్చోబెట్టాయని, డాక్టర్ పైడిపాల ప్రశంసించారు.

సిరివెన్నెల రచనల్లోని భావ కవిత్వపు లక్షణాలలో ప్రకృతి ప్రియత్వం గురించి మనం గతవారం చర్చించుకున్నాం. దానికి కొనసాగింపుగా, ఈ వారం వర్షం అంశంగా ఆయన వ్రాసిన కొన్ని పాటలను సమీక్షించుకుందాం.

సిరివెన్నెల చిత్రంలో నాయకుడు వేణువు వాయిస్తుండగా, వర్షం ప్రారంభమవుతుంది. మూగదైన కథానాయక, తన మనసులోని భావాలను వ్యక్తపరుస్తూ ఈ పాట పాడుతూ, నృత్యం చేస్తుంది. నక్షత్రాలు చిలికే కాంతితో, గగన గళం పలికే అమర గానమే వర్షం అని సిరివెన్నెల నిర్వచిస్తారు

కన్నె మూగమనసు కన్న స్వర్ణస్వప్నమై

తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై గగనగళము నుండి అమరగానవాహిని (2) జాలువారుతోంది ఇలా అమృత వర్షిణి.. అమృతవర్షిణి.. అమృతవర్షిణి..

ఈ స్వాతివానలో నా ఆత్మ స్నానమాడే

నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే..

~

ఇదే చిత్రంలో, ఆషాడం మాసం లాంటి నాయకుడి హృదయానికి, శ్రావణం లాంటి తొలకరి చినుకులతో పులకలు కలిగించిన జ్యోతిర్మయి స్పర్శకు symbolic గా కూడా సిరివెన్నెల వర్షాన్నే మాధ్యమంగా వాడారు.

చినుకు చినుకు చినుకు చినుకు

తొలితొలి తొలకరి చిలికిన చినుకు

పిలుపు పిలుపు పిలుపు పిలుపు

పుడమికి పులకల మొలకల పిలుపు

ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన మేఘాల రాగాల ఆలాపన (2)

~

ఇక స్వర్ణకమలం తీసుకుంటే, దాదాపు పాటలన్నీ వర్షంలో తడిసి ముద్దయిపోయాయి. ఆకాశంలో ఆశల హరివిల్లు పాటలో //మబ్బుల్లో తుళ్లుతున్న మెరుపై పోనా.. వయ్యారి వానజల్లై దిగిరానా..//,

//ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లె తుళ్ళు, ఘల్లు ఘల్లు ఘల్లున ఒప్పొంగె నింగి ఒళ్ళు, నల్లమబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు, పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు/ దూకే అలలకు ఏ తాళం వేస్తారు? సెలయేటికి నటనము నేర్పించే గురువేది? //

కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి

మెత్తగా రేకు వచ్చిన కొమ్మ చాటునున్న కన్నె మల్లికి.. పాటలో కూడా మేఘాల రాగాలే మనకు కురిపించారు

సిరివెన్నెల.. ఈ పాట చరణంలో…

//కొండ దారి మార్చింది కొంటె వాగు జోరు

కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు

బండరాళ్ల పోరు మారి, పంటచేల పాటలూరి

మేఘాల రాగాల, మాగాణి ఊగేలా..

సిరి చిందులేసింది, కనువిందు చేసింది.. //అంటూ ఏరూ, వాగూ, మేఘాలు.. పంటలతో.. తన ప్రకృతి ప్రియత్వాన్ని ప్రదర్శించారు.

~

ఇదే చిత్రంలో… అందెల రవమిది పదములదా, అనే పాటలో కూడా నాట్య లయల, హొయల చినుకుల్ని.. గంగ పొంగుల్లా రసఝరులు పారించారు..

 // మువ్వల ఉరుముల సవ్వడులై- మెలికలు మెరుపుల మెలకువలై..

మేను హర్షమేఘమై- వేణి విసురు వాయువేగమై

అంగ భంగిమలు గంగ పొంగులై- హావ భావములు నింగి రంగులై

లాస్యం సాగే లీల.. రసఝరులు జాలువారేలా..

జంగమమై జగమాడదా- జలపాత గీతముల తోడుగా

పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా..//

~

‘నువ్వు నాకు నచ్చావు’ చిత్రంలో పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన పాటలో కూడా// ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి/ వాన విల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో//వర్షాన్ని స్వేచ్ఛగా వాడేసారు సిరివెన్నెల.

‘నారి నారి నడుమ మురారి’ చిత్రంలో //ఏం వానో తరుముతున్నది.. ఇది ఏం గాలో తరుముతున్నది/ చినుకు పడు క్షణమేదో చిలిపి సడి చేసింది //అనే గీతంతో శ్రోతల మనసుల్ని దోచుకున్నారు.

‘వాన’ చిత్రంలో//1. సిరిమల్లె వాన పడుతుంది లోన, చూపించదే కంటికి/ వడగళ్ల వాన ఉరికింది అయినా, వినిపించదే జంటకి/ తడిసే తరుణాన గొడుగై నే లేనా సిరిమల్లి..// //2. ఆకాశగంగా దూకావే పెంకితనంగా జడిగా తొలి అలజడిగా// //3. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో.. ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో/ / అనే వాన నేపథ్యంతో వ్రాసిన మూడు పాటల ద్వారా వాన అనుభూతుల్ని, చల్లదనాల్ని పంచారు సీతారామశాస్త్రి గారు.

ఎంతో ముచ్చటగా, ముద్దుగా, ఆత్మీయంగా, ఒక అందమైన పరుచు పిల్ల వర్షాన్ని personify చేస్తూ, ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా? చుట్టంలా వస్తావా? నాతోనే ఉండిపోవా? అనే సహజమైన భావాలతో అందరి మనసును ఆకట్టుకున్న పాట ‘వర్షం’ చిత్రంలో మనకు కనిపిస్తుంది.

 / /ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వాన? ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన?/ చుట్టంలా వస్తావే? చూసెళ్ళి పోతావే? అచ్చంగా నా తోటే, నిత్యం ఉంటానంటే, చెయ్యరా చేరదీసుకోనా? నువ్వొస్తానంటే నేనొద్దంటానా?/ /అనే అపూర్వమైన, హృదయాన్ని హత్తుకునే పల్లవితో ప్రారంభించి, నా ముక్కుపుడకలా, జూకాల్లా, గాజుల్లా, పట్టీల్లా, పచ్చల పతకంలా, చిన్ననాటి తాయిలంలా.. ఇలా.. ఇలా.. నన్నే అంటుకొని, నాతోనే ఉండిపోవా, అంటూ బుజ్జగించడం, గోముగా బ్రతిమాలడం, శ్రోతల హృదయాన్ని దోచేసింది.

ఇలా రాసుకుంటూ వెళ్తే వర్షం నేపథ్యంగా రాసిన గీతాలు సిరివెన్నెల సాహిత్యంలో కొల్లలుగా కనిపిస్తాయి.. మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం అనే పాటలో కూడా వలపు వాన దారాలు, చినుకు పూల హారాలు, హరివిల్లు వంతెనలు, ఉరుములు, చిటపటలు, పాటంతా సందడి చేస్తాయి.

బీడు నేలపై కురిసే సిరిజల్లు లాగా, కరువు సీమను జడివానతో భాగ్యసీమగా మార్చాలన్న ఆశావహ దృక్పథంతో సాగిన వాన పాట ‘ఇంద్ర’ చిత్రంలో మనకు వీనుల విందు చేస్తుంది. //ఘల్లు ఘల్లు మని సిరుమువల్లే చినుకే చేరగా/ ఘల్లు ఘల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ/ నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని/ జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా/ రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారల కురిసేలా/ /..ఇలాంటి అద్భుత పదబంధాలతో, ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఒక ఉత్సాహభరితమైన గీతం ఇది.

ఇన్ని వాన పాటల్ని కురిపించిన సిరివెన్నెల మేఘం ‘అతడు’ చిత్రంలో //పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా/కళ్ళెర్రజేసి మెరుపై తరిమేనా?/ /అనే ఒక అల్లరి కొంటే వానను కూడా కురిపించారు.

‘నీ స్నేహం’ చిత్రంలో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన చినుకు తడికి.. పాటలోని అక్షరాల చినుకుల్ని, వాటి ద్వారా సిరివెన్నెల అందించే అనుభూతుల వెల్లువనీ మనసారా ఆస్వాదిద్దాం.

పల్లవి:
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా..ఆ ..ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా..

ఒక హీరోయిన్ introduction కోసం సాగే ఈ పాటలో, చినుకు తడి సోకి.. చిగురించే పువ్వులా, ఒక చిలిపి కలలా, మువ్వలే మనసు పడే పాదంలా, అందమైన ప్రాయంలో ఉన్న కన్నె వయస్సు సౌందర్యాన్ని సిరివెన్నెల వర్ణిస్తారు. ఉదయం రాగమైన హిందోళాన్ని చిగురు తొడుగుతున్న అందాలకు చిహ్నంగా తీసుకుని, ఆమనిలోని మధువనం లాగా అందాలు ఒలకబోస్తోంది.. అన్న అపురూపమైన భావ చిత్రం ముద్రించారు సిరివెన్నెల.

పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు
కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా
ఆ.. ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా

చరణంలో కూడా ఆ ప్రశంసలు ఝల్లు అలాగే కొనసాగుతుంది. పసిడి వేకువలు, పరువాల వెల్లువలు, అచ్చ తెలుగు మురిపాల సంగతులు.. ఆమె అందాలకు నీరాజనం పడతాయి. పాల కడలి లాంటి తెల్లని లేత పాదాలు నేలమ్మను తాకుతుంటే, నేలతల్లి ఆగని సంబరంతో పొంగిపోయిందట! మన మనసులు కూడా అలాగే పొంగుతున్నాయి కదా!

వరములన్నీ నిను వెంట బెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతున్నావే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ.. కాముని సుమశరమా ఆ.. కాముని సుమ శరమా

రెండవ చరణం మనల్ని మరింత భావ లోకాల లోతుల్లోకి తీసుకువెళ్తుంది. ఇన్ని వరాలను నీ వెంట పెట్టుకుని.. ఎవరి ఇంటికి నీవు దీపంలా వెళ్లబోతున్నావు? ఏ వరుడు ఆ అదృష్టానికి నోచుకున్నాడు? అన్న భావాన్ని మృదువుగా పలికించారు. మరింత heights of ecstasy కి వెళ్లి, అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు మూలమైన, కాముని పూల విల్లులాంటి అందాలు ఆ అమ్మాయిలో ఉన్నాయని ఎంతో అందంగా అక్షరీకరించి మనల్ని అందాల ఝడిలో ముంచేశారు సిరివెన్నెల.

సిరివెన్నెల మన హృదయానికి కురిపించిన సాహిత్యపు మధురిమలు అనే వాన చినుకులు.. ఏనాటికి తడి ఆరని ఆమని చిగురులు.. విన్నంతకాలం మన మనసుకు వర్షాల పులకింతలు, గిలిగింతలు కలిగిస్తూనే ఉంటాయి.

Images Courtesy: Internet

***
ఈ పరిశోధనలో నాకు సహకారం అందించిన వారు, డాక్టర్ ఆర్.ఎన్. శర్మ (మా శ్రీవారు), డాక్టర్. శ్రీవాణి అర్జున్, (స్నేహితురాలు, ఎం.ఏ. పి.హెచ్.డి., మ్యూజిక్), సాయి శ్రీకాంత్ (సోదరుడు, సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్), డాక్టర్ నీహాల్ (ప్లే బ్యాక్ సింగర్& మ్యూజిషియన్), శ్రీమతి బి. జయలక్ష్మీకృష్ణ (అక్కయ్య), ఆలూరి యశ్వంత్ (అక్కయ్య గారి అబ్బాయి, లిరిక్ రైటర్), శ్రీమతి మాచిరాజు ప్రమీలమ్మ (అత్తయ్య),.. వీరి సహకారానికి పత్రికాముఖంగా వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here