సిరివెన్నెల పాట – నా మాట – 43 – సీతారామశాస్త్రి గారి వ్యక్తిత్వాన్ని తెలిపే పాటలు

0
15

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

[dropcap]జ[/dropcap]గమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అనే పాటలో సిరివెన్నెల గారు “నాతో నేను సహగమిస్తూ, నాతో నేను రమిస్తూ, ఒంటరినై, అనవరతం కంటున్నాను నిరంతరం, కలల్ని, కథల్ని, ఆటల్ని పాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని, కావ్య కన్యల్ని, ఆడపిల్లల్ని…” అని, తన ఆత్మవలోకనాన్నే తన సాహిత్య సృష్టిగా ఆవిష్కరించుకుంటున్నాన్న సత్యాన్ని నొక్కి చెప్పారు. సిరివెన్నెల కవిత్వం ఒక క్షీరసాగర మథనం. మనిషి యొక్క ప్రయత్నశీలత, ఆశ -నిరాశలు, జయాపజయాలు, బలం- బలహీనతలు, జీవితంలోని అనేక ప్రశ్నలు; మొదలైన వాటన్నిటికీ సమాధానమే, ఆయన సాహిత్యం.

భావ కవిత్వ లక్షణాలలో ‘అంతర్ముఖత్వం’ అనే లక్షణాన్ని సిరివెన్నెల రచనలలో మనం ఈరోజు విశ్లేషించుకుంటున్నాం. A Poet is not different from his Poetry కాబట్టి, ఒక ప్రత్యేకమైన పాట కాకుండా, సిరివెన్నెల గారి వ్యక్తిత్వాన్ని తెలియజేసే కొన్ని పాటలను ఈరోజు చర్చిద్దాం.

సిరివెన్నెల సాహిత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే పుస్తకాలలో; సిరివెన్నెల గారే స్వయంగా వ్రాసుకున్న, సిరివెన్నెల తరంగాలు, డా. పైడిపాల రచించిన, సిరివెన్నెల రసవాహిని, చేంబోలు శ్రీరామశాస్త్రి వ్రాసిన సమ్మాన్యుడు, ఆయనే సంకలనం చేసిన పూర్ణత్వపు పొలిమేరలో.. ముఖ్యమైనవి.

“రకరకాల ముసుగులు వేస్తూ ఎపుడో మరిచాం సొంత ముఖం” అని జల్సా చిత్రంలోని ఒక పాటలో ప్రశ్నించిన వైజ్ఞానిక కవి ఎలాంటి ముసుగులు ఎప్పుడు వేసుకోలేదు. తనలో ఉన్న (పరాయి) మనిషికి చెప్పే ముందు తనలోఉన్న మనిషే రాసి చేసి చూపించారు. అందరూ మనుషులేనని! ఆదర్శవాది – ఆచరణాత్మకముగా సాధ్యం చేస్తూ అన్నయ్య రాసింది సంపూర్తిగా తను ఆచరించి చూపించాడు.-Annayya walks/walked the write!

“ఎదలో ఆశ వెంటే ఎగసే వేగముంటే, సమయం వెనుకపడదా ఊహ తనకన్నా ముందుంటే!. నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమవదా అమృతమైనా!” (మొదటి సినిమా). కొంతమంది. చెప్తారు, చెప్తూనే ఉంటారు అదే giving lip service. మరి కొందరు చెప్పింది చేస్తారు-They walk the talk. అన్నయ్య రాసిందే ఆచరించారు Annayya walks the write, అని పూర్ణత్వపు పొలిమేరలో అనే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వ్యక్తిత్వ విశ్లేషణ గ్రంథంలో, కొండా వెంకట్, వ్యాఖ్యానించారు. ఆయన సిరివెన్నెల సాహిత్యాన్ని multiple dimensions లో విశ్లేషించి, ఆయనను Scientific Poet గా నిర్వచించారు. ఆయన సాహిత్యంలో భారతీయ తత్వచింతన, బహుముఖత్వం, పరిపూర్ణత, ఖచ్చితత్వం, సరళత, గూడార్ధం, ప్రయోజనం; ఉన్నాయని తేల్చి చెప్పారు.

సీతారామశాస్త్రిగారికి  సమాజంకోసం, ముఖ్యంగా, యువత కోసం నేను చేయగలిగింది చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆత్మీయులతో అంటూ ఉండేవారట. యువతను నిరాశా నిస్పృహల నుండి బయట పడేసే దారి వెదకాలనీ, తన గీతాలతోనైతేనేమి, ప్రసంగాలతోనైతేనేమి వారు జీవితంపట్ల ఒక ఈ విషయమై సకారాత్మక దృక్పథం (Positive attitude) అలవరచుకునేలా చేయాలనీ, విరివిగా పర్యటించాలనీ భావించేవారట. ఆధునిక సాంకేతిక మాధ్యమాల ద్వారా వారిలోకి చొచ్చునని వెళ్ళి, వారి స్థాయికి దిగి, ఆలోచించి, పరిష్కారాలు వెదకాలన్న సిరివెన్నెల గారి దృక్కోణమే ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దు రా ఓరిమి… వంటి పాటలకు ప్రేరణగా మారింది.

అలాగే సామాజిక జీవితం, జీవన విధానంలో వున్న జవాబు తెలిసేంతవరకు ప్రశ్నిస్తూనే ఉండాలి. సమస్యలకు సమాధానాలు దాదాపుగా అన్నైల్లోనే దొరుకుతాయి. మనల్ని మనమే సంస్కరించుకోవాలి. పైనుంచి ఎవరూ ఆ సమాజంలోని కుళ్ళును కడిగేందుకు ఊడిపడరు!” అని కూడా అంటూండేవారట. ఇటువంటి లోతైన తీవ్రమైన అభిప్రాయాలు, విశ్లేషణలతో తన దగ్గరకు వచ్చిన దర్శక, నిర్మాత లాగైన దర్శకులను ఆవేశపురితమైన చర్చల్లోకి దింపేవారు. “మనిషి మనిషికీ మధ్య ఈ సమాజాన ఇన్ని వ్యత్యాసాలెందుకు? ఈ పగ, ద్వేషాలెందుకు? వీటికి పరిష్కారమెక్కడుంది?” అని తల్లడిల్లేవారట. ఇలా ఆయనలో కనబడే ఆవేశమే అనేక సినిమా పాటల్లో సందర్భానుసారం ప్రతిధ్వనించేది. అవకతవకలను ప్రశ్నించేది, పరిష్కారాలను చూపించేది.

సిరివెన్నెలగారు స్త్రీ పక్షపాతి. స్త్రీలపట్ల గౌరవ, మర్యాదలు గలిగి, వారికి గల సహజ సిద్ధమైన అనంతశక్తిని గుర్తెరిగిన శాస్త్రిగారు అవకాశం వచ్చినప్పుడల్లా తన పాటల ద్వారా స్త్రీ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను సగుణాత్మకంగా వ్యక్తీకరించే ప్రయత్నం చేసారు. ఇటువంటి పాటలు ఎన్నో పురస్కారాలు, ప్రశంశలను అందుకున్నాయి కూడా! /అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ/ పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం, పీటను వేసిన ఈ నేలమ్మకు ఇవ్వమ్మా ఆహ్వానం/  నువ్వేమి చేసావు నేరం- నిన్నెక్కడంటింది పాపం.. చినబోకుమా/ చిలకా! ఏ తోడు లేక ఏటేపమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారింటి దారుల వెనుక/ అంటూ, వివాహ వ్యవస్థలోని పటుత్వాన్ని ఒకవైపు బలపరుస్తూ, అందులోని లోపాలను మరి కొన్ని పాటల్లో వ్యక్తపరుస్తూ, తన స్త్రీ పక్షపాతాన్ని చాటుకున్నారు.

స్నేహస్వభావాన్ని వివరిస్తూ ఇద్దరు మిత్రులు పాడుకొనే ఎన్నో పాటలను వ్రాయడం ఆయనలో సహజంగా ఉన్న స్నేహశీలతకు దర్పణం… రూపురేఖలు వేరుగా ఉన్న ఒకే ఆత్మగా, బొమ్మ బొరుసుగా, బింబం ప్రతిబింబంగా..అలా  స్నేహబంధాన్ని అభేదంగా చెప్పడం ఈ పాటలలోని ప్రత్యేకత. కాకినాడలో చిరుద్యోగం చేస్తుండగానే చెలిమి కలిమితో ఎందరికో చేరువైన సిరివెన్నెల పరిశ్రమలో కూడా అన్ని విభాగాల వారికి స్నేహ పరిమళాన్ని పంచారు. ఆ మాటకొస్తే విదేశాల్లో కూడా ఆయనకు వేలమంది అభిమానులు యేర్పడ్డానికి కారణం సృజనాత్మక శక్తితోపాటు స్నేహానురక్తి కూడా. చిన్ననాటి మిత్రుడు చాగంటి శరత్ బాబుతో నెయ్యాన్ని వియ్యంగా మార్చుకోవడం సిరివెన్నెల స్నేహశీలతకు నిదర్శనం. కుటుంబ సభ్యులతో సమంగా మిత్రబృందాన్ని కూడా పరిగణించిన మనస్వి సిరివెన్నెల.

ఎంత ఎదిగినా తన వున్నతికి కారణమైన ఏ వ్యక్తినీ, తన వూరినీ, తన వారినీ, హితులనూ, స్నేహితులనూ – ఎన్నడూ మర్చిపోని సంస్కారం గల సిరివెన్నెల ఆయా సందర్భాలకు సంబంధించిన సినీగేయాలను రాసే అవకాశాలు లభించినపుడు వాటిలో తను కనిపిస్తూ తన ఆత్మీయతను రంగరించడం గమనార్హం!

/ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు

ననుగన్న నా వాళ్లు నా కళ్ళ లోగిళ్ళు../

సీతారామశాస్త్రి కూడా సినీరంగంలో అడుగుపెట్టక ముందునుంచి తన రచనల్లో సనాతన ఆర్షధర్మానికి, భారతీయ సంస్కృతికీ పెద్దపీట వేశారు. తండ్రి అడుగుజాడల్లో సంఘ సభ్యునిగా క్రమశిక్షణను పాటిస్తూ సంప్రదాయాన్ని గౌరవించేవారు. ఆయన శివారాధన తత్పరతకు ‘శివదర్పణమ్’ పేరుతో ప్రచురించిన గ్రంథమే నిదర్శనం. ఆయన సద్గురు శివానందమూర్తికి ప్రియశిష్యులు. సినిమాల్లో అవకాశం వున్న తావుల్లో భక్తిపారవశ్యంతో ఆ పరమశివునిపై అనేక గేయాలను రాశారు.

‘శంకరాభరణం’ చిత్రం స్ఫూర్తితో సినీరంగం వైపు అడుగులు వేసిన సీతారామశాస్త్రి తనకు పేరు తెచ్చిన ‘సిరివెన్నెల’ లోనే ‘ఆదిభిక్షువు వాడి నేది కోరేది..’ అంటూ అద్భుతమైన శివస్తుతి చేసి, శివాగనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆ తర్వాత ‘స్వాతిముత్యం’ ‘సంకీర్తన’ ‘శ్రుతిలయలు’ ‘శ్రీనివాస కల్యాణం’ ‘రుద్రవీణ’ మొదలై చిత్రాల్లో వివిధ రూపాల్లోని దైవాలకు సంబంధించిన భక్తి గీతాలను రాశారు. ‘స్వర్ణకమలం’ చిత్రంలో నాట్యవేదానికి సంబంధించిన కథా వస్తువు నాధారంగా చేసుకొని శివుని వివిధనామాలతో స్తుతిస్తూ భక్తిభావ సమన్వితమైన గీతాలను రాశారు.

సిరివెన్నెల తరంగాలలో, సీతారామశాస్త్రి గారు పాట రాయడం తన వృత్తి మాత్రమే కాదని, ప్రవృత్తి కూడా అని చెప్పారు. /నా హృదయమే నా లోగిలి, నా హృదయమే నా పాటకు తల్లి, నా హృదయమే నాకు ఆలి, నా హృదయములో ఇది సినీ వాలి, అని ఎప్పుడో పాతికేళ్ళ క్రితమే రాసుకున్నారు./ సిరివెన్నెల తరంగాలు అన్న తన స్వీయ రచనలో అనేక శీర్షికల కింద తన పాటలను వర్గీకరించారు. భావతరంగంలో, ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి, ఆ సందర్భాలు తన వైపు తెచ్చుకొని, తానైతే ఎలా స్పందిస్తారో అలాగే ఆ పాటలు రాశానని చెప్పారు.

/విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం..ఓం..

నే పాడిన జీవన గీతం ఈ గీతం../

ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు

ననుగన్న నా వాళ్లు నా కళ్ళ లోగిళ్ళు../

/మెరిసే తారలదే రూపం? మెరిసే పువ్వులదే రూపం

నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం.. నీ రూపం../

ఇలాంటి ఎన్నో పాటలు ఈ విభాగంలో మనకు కనిపిస్తాయి, ఆయనలోని భావ కవిని మనకు పరిచయం చేస్తాయి.

సీతారామ శాస్త్రిగారి జీవితంలోను, సాహిత్య వ్యాసంగంలోను యెప్పుడూ అవకాశవాదాన్ని ఆశ్రయించలేదు. అవ్యవస్థను, అరాచకాన్ని చూసి మనసు క్షోభించినప్పుడు, అవకాశం వున్న సందర్భాలలో ఘాటుగా ప్రశ్నించేవారు. వీలుకాని చోటుల్లో ఆ ఆవేదనకు అక్షరరూపమిచ్చి పదిలపర్చుకొనేవారు. ఇలాంటి ఆవేదనకు సాక్ష్యాలే.. /అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, /నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని/, వంటి పాటలు.

సినిమారంగంలో అడుగుపెట్టక ముందు నుంచి అన్యాయాన్ని చూస్తూ వుపేక్షించేవారు కాదు. మనసును రగిలించే మంటను చల్లార్చుకోడానికి ఆ ఆర్తికి అక్షరాకృతి నిచ్చేవారు. అలా యెప్పుడో రాసుకున్న పాటల్లో /’సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని?’ /అనేది ఒకటి. ఇలాంటి పాటలున్నిటినీ కల్లోల తరంగం అనే విభాగంలో చేర్చారు.

సమాజం అవ్యవస్థ, అస్తవ్యస్తత చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టు వుండలేక, అలాగే నిస్సహాయతను వ్యక్తం చేస్తూ దిగులు పడక – పాత్రల స్పందనను తనదిగా చేసుకొని కవి తన వంతుగా తన గొంతును వినిపించారు.

ప్రేమ అనేది ఇద్దరు స్త్రీపురుషుల మధ్య కలిగే సహజమైన ఆకర్షణ మాత్రమే కాదని అదొక భావకమైన సంగతని, మానసికమైన విషయం అనే అభిప్రాయం గల సిరివెన్నెల గారు, ప్రేమ తత్వాన్ని మృదువుగా చెప్పే పాటలను రసతరంగంలోనూ, డ్యూయెట్లను సరాగపరాగం విభాగంలోనూ చేర్చారు.

/శ్రీకరమే ఇదీ ప్రణయమా నీ కావ్యంలో..

నీ గాధలో ప్రతిక్షణం వర్ధిల్లనీ, జ్వలించే గేయాలతో../

/ఏమిటో ఏమో ఈ ప్రేమ- శాపమో వరమో ఈ ప్రేమ

నీతో ఆడుతుందీ ప్రేమ- నిను వెంటాడుతుందీ ప్రేమ

విషమో అమృతమో చెప్పే వారే లేరమ్మా../ వంటి పాటలు ఈ విభాగంలో మనకు కనిపిస్తాయి.

నిరాశకే నిరాశ కలిగించి, ఆశావహ దృక్పథాన్ని తట్టి లేపే పాటలు ఆశాంతరంగంలో మనకు కనిపిస్తాయి. “ఈ ఆశాంత రంగంలో వచ్చే పాటలలో నా జీవిత దృక్పథం స్పష్టంగా తెలుస్తుంది. భావతరంగంలో నేనొక కవిని. కల్లోల తరంగం నా చుట్టూ ఉండే పరిస్థితుల్లో నా మనసు యొక్క రియాక్షన్. ఈ ఆశాంతరంగం నా తాలూకు philosophical outlook of life అని చెప్పవచ్చు”, అన్నారు సిరివెన్నెల. /తరలి రాద తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం,/ నీతోనే ఆగేన సంగీతం ..బిళహరి.. నీతోనే ఆగేనా సంగీతం..,/మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు.. ఎవరూ లేరని చితి ఆడికి చేరకు, ప్రాణమన్నది బంగారు పెన్నిధి, నూరేళ్ళు నిండుగా జీవించమన్నది../. .. ఇలా బలమైన సందేశాలతో, positive attitude కి ఊపిరి పోసే, ఆత్మహత్య నుండి వెనక్కి మరళించే పాటలు మనకు కనిపిస్తాయి. సిరివెన్నెల పాజిటివ్ దృక్పథాన్ని ఇవన్నీ మనకు బలంగా వినిపిస్తాయి.

/భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ, భర్తగా మారకు బ్యాచిలరూ/ బోడి చదువులు వేస్టూ, నీ బుర్రంతా భోంచేస్తూ, ఆడి చూడు క్రికెట్టూ టెండూల్కర్ అయ్యేటట్టు/ వంటి పాటలు మనకు వ్యంగ్య తరంగంలో కనిపిస్తాయి.

సిరివెన్నెల గారి హాస్య ప్రియత్వాన్ని గురించి, సన్నిహితులు అప్పుడప్పుడు వివరిస్తూ ఉంటారు. నవ్వుకోడానికి హాయిగా నవ్వుకోడానికి పనికొచ్చే పాటలు ఈ విభాగంలోనూ,  యువతను ఉత్సాహపరిచే, యువత నాడిని తెలియజేసి పాటలు కుర్ర తరంగంలోనూ, మనం చూడవచ్చు. ఈ అన్ని పాటలు వెనుక ఆయన అంతరంగం మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

భారతీయత పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల ఎంతో గౌరవాన్ని కలిగిన సిరివెన్నెల, అమృతాంతరంగం, అనే విభాగంలో మనుషుల మధ్య ఉన్నటువంటి అనేక రకమైన బాంధవ్యాలు, చుట్టరికాలు, మమతలు, తల్లి కొడుకుల – తండ్రి కొడుకుల, అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధాలు, ప్రేమలు, అనురాగాలు, మమతలు వంటి అన్ని ఎమోషన్స్ మనకు కనిపిస్తాయి.

/ఎవరు రాయగలరూ. అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం/ నోరార పిలిచినా పలకని వాడినా.. మనసున మమతలున్న మనిషిని కానా/ చిన్ని తండ్రి నిను చూడగా, వేయి కళ్ళయినా సరిపోవురా/ వంటి గీతాలు కనిపిస్తాయి.

ఇన్ని విధాలుగా, విభిన్న కోణాల్లో ఆయన వ్యక్తీకరించిన సినీ గేయ సాహిత్యం, సిరివెన్నెల అంతరంగాన్ని మనకు పరిపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. తన చుట్టూ ఉన్న సమాజం పట్ల, భారతీయ విలువల పట్ల, మాతృభూమిపట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల, ఆయన మనసులో కలిగిన సున్నితమైన reflections ప్రతి పాటలోను మనకు అడుగడుగునా దర్శనమిస్తాయి. అందుకే, ఇటు introvertism అటు extrovertism రెండూ సిరివెన్నెల గారు రచనలలో మనం గమనించగలం. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఎంతో కాలంగా ఆయనతో కలిసి నడిచిన సన్నిహితులు: అందరి అభిప్రాయం ప్రకారం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కేవలం పాటలు వ్రాయడం కాదు, ఆ భావాలను ఆయన ఆచరణలో కూడా వ్యక్తపరిచారు. ఏమి ఆచరించారో దాన్నే పాటలలో పలికించారు. అందుకే ఆయన పాటలు మన అంతరంగాన్ని సున్నితంగా స్పృశించాయి. మన మనసుల్లో అవి బలంగా నాటుకున్నాయి. ఆచరణాత్మకమైనదే ఎదుటి వారిపై బలమైన ముద్ర వేయగలదు, అన్న సత్యం మరోసారి రుజువుఅయింది. అందుకే ఆయన  పూర్ణత్వపు పొలిమేరలో ఒక సాధు పుంగవుడిలాగా చిరకాలం అలా నిలిచిపోతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here