సిరివెన్నెల పాట – నా మాట – 45 – అక్షరాలతోనే ఆవేశాన్ని రగిలించిన పాట

1
14

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

ఎగిరే జండా మన జనని

~

చిత్రం: బాలమురళి ఎమ్.ఏ.

సాహిత్యం: సిరివెన్నెల.

సంగీతం: కే.వి.మహదేవన్.

గాత్రం: పి సుశీల.

~

పాట సాహిత్యం

పల్లవి:
ఎగిరే జండా మన జనని ॥2॥
ఏమంటున్నది మననుగని
పూవుల దీవెనలందిస్తున్నది
తనంత ఎత్తుకు ఎదగమని ॥ఎగిరే॥

కోరస్ : వందేమాతరం వందేమాతరం వందేమాతరం

చరణం:
తరతరాల భరతావని సంస్కృతి తెలుపును పవిత్ర కాషాయం
స్వచ్ఛమైన శాంతికి సంకేతం మచ్చలేని ఆ తెల్లదనం తరగని సంపద తనలో గలదని పలుకును పంటల పచ్చదనం
ధర్మ దళముతో ఈ విలువలు ముడివేసి నడుపునది ఆశోకచక్రం
ఆ నీడను నడవమని ఆ ఘనతను నిలపమని ॥2॥
॥ఎగిరే॥
కోరస్ : వందేమాతరం వందేమాతరం వందేమాతరం

చరణం:
గాంధీజీ అందించిన సూత్రం కలిపిన భారతి సంతానం ఎన్నో జాతుల ఎన్నో రీతులు ఎన్నో రంగుల విరులసరం
విభేదాలతో విడిపోతే ఆ తల్లికి తీరని సంతాపం కళకళలాడుతూ కలిసుంటేనే కలుగును కళగను సంతోషం
ఆ వెలుగును అందుకొని నీ ప్రగతిని పొందమని ॥2॥
॥ఎగిరే॥
కోరస్ : వందేమాతరం వందేమాతరం వందేమాతరం

భావ కవిత్వంలో దేశభక్తి కవిత్వం, సంఘ సంస్కరణ కవిత్వం, స్మృతి కావ్యాలు (Elegies) అని మూడు విభాగాలుగా చెప్పుకోవచ్చు. భావ కవిత్వంలో దేశభక్తి రెండు పాయలుగా ప్రవహించింది. ఒకటి భారత జాతీయాభిమానానికి సంబంధించింది కాగా, రెండవది ఆంధ్రాభిమానానికి సంబంధించినది. దేశభక్తి కవిత్వం మీద కాల్పనిక కవిత్వ ప్రభావం లేదు. ఇది సమకాలీన పరిస్థితులు, రాజకీయ ఉద్యమాల ప్రభావంతో వెలువడింది. ఈ దేశభక్తి కవిత్వంలో ఉద్యమ గీతాలు, ప్రబోధాత్మక గీతాలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి.

1905నకు ముందు భారత దేశంలో జాతీయోద్యమం బలపడలేదు. ఆంధ్రావాసుల మనసుల్లో జాతీయాభిమానం అంకురార్పణ స్థితిలో మాత్రమే ఉండేది. ఆంగ్ల ప్రభుత్వం 1905లో వంగదేశాన్ని (బెంగాల్‌ను) రెండు ముక్కలుగా చేయటంతో భారతీయుల గుండె భగ్గుమనడంతో జాతీయాభిమానం పొంగిపొరలింది. బిపిన్ చంద్రపాల్ కలకత్తా నుంచి మద్రాసు వరకు ఉన్న ముఖ్య పట్టణాల్లో ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను ఉత్తేజితులను చేశారు. రాజమండ్రి సభలో ఆయన ఉపన్యాసం విని ఉద్రిక్తులై చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు జాతీయాభిమానం పెల్లుబికి ఆశువుగా ఈ పద్యాన్ని రచించారు.

‘భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియబట్టి’

భావకవులలో భారత జాతీయతను ప్రబోధించినవారిలో చిలకమర్తి, గురజాడ, రాయప్రోలు, దువ్వూరి, బసవరాజు ముఖ్యమైనవారు. గురజాడ ‘దేశభక్తి’ గేయం జాతీయాభిమానంతో పాటు అంతర్జాతీయ భావన కలిగిస్తుంది. రాయప్రోలు ‘జన్మభూమి’ గేయం జాతీయ భక్తి తత్పరతకు శిరోభూషణం వంటిది.

‘ఏదేశమేగినా, ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలుపరా నీ జాతి నిండు గౌరవము’

దువ్వూరి రామిరెడ్డిగారు ‘నైవేద్యము’ అన్న శీర్షికతో భారతమాతృచరణ పూజకై తరలిపోయిన సామాన్య ప్రజలగీతిని వినిపించారు. ‘మాతృమందిరము’లో మాతృపద సన్నిధిలో ఆత్మలను కర్పూరంగా వెలిగించనిదే స్వాతంత్ర్య ఫలం సిద్ధించదనే ప్రబోధమున్నది. వెంకట పార్వతీశ్వరులు ‘పరమార్థానిధియైన భారతభూమి, పైసకు కొఱగాక పాడగుచుండ’, ‘పరమధామంబైన భారతభూమి బానిసతనములో బడి క్రుంగుచుండ’ ఆర్యసంతతివారు ‘కనుమూసి కాలంబు గడపుట తగునె’ అని హెచ్చరించారు.

స్వాతంత్ర సాధన కోసం ప్రజలలో ఉద్యమాగ్నిని రగిలించడానికి వెలువడిన సాహిత్యమది. అయితే, స్వాతంత్రం గడిచి ఏడు దశాబ్దాలు దాటుతున్నా, సమాజంలో పెచ్చుపెరుగుతున్న అరాచకాలు, మనుషుల స్వార్థపూరితత్వం, అనుకున్న స్థాయిలో ప్రగతి సాధించలేకపోవడం.., వంటి సమస్యలు ఎన్నో కలాలని కదిలించాయి. ఆ భావజాలం సినిమా సాహిత్యంపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపించింది.

సిరివెన్నెల, సినియేతర సాహిత్యంలో మనకు కొల్లలుగా దేశభక్తి గీతాలు కనిపిస్తాయి. స్వాతంత్రోద్యమ కవుల రచనల్లోని భావాలన్నీ మనకు వీటిలో దర్శనమిస్తాయి.

/చుక్కల్ని దాటాలి మన జెండా దిక్కుల్లో చాటాలి జయ గాథ/

/దిక్కుల్ని దాటాలి జయ ఘోష, చుక్కల్ని తాకాలి ఘనకాంక్ష/

 /పాడుదాం, పాడుదాం భారత జయ గీతం, వాడిపోని వైభవాల పావన సంగీతం/

వంటి ఎన్నో దేశభక్తి గేయాలు, మనకు స్ఫూర్తిగా నిలుస్తాయి.

/యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది, వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిది/ – అనే బహుళ ప్రజాదరణ పొందిన గీతంలో.. విదేశీ దాడుల అరాచకత్వమనే హాలాహలాన్ని అరిగించుకోగల అమృత హృదయుల స్వర్గమిది’, అని భరతావనిని కొనియాడారు సిరివెన్నెల.

సమాజ నిర్మాణం సాహిత్యానికి ప్రధానమైన బాధ్యత. ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకొని, ప్రజలను తగిన రీతిలో ఉత్తేజపరచడానికి, సమాజాన్ని ఉన్నతంగా, నిత్య నూతనంగా తీర్చిదిద్దడానికి సిరివెన్నెల కలం ఎంతో బలంగా పనిచేసింది. తనే తన సమాజం’, అన్న భావన బలమైనప్పుడే ఆ సమాజం స్వార్థపరత్వాన్ని వీడి, దేశభక్తి వైపు అడుగులు వేస్తూ, ఉన్నతమైన సమాజంగా రూపొందుతుంది.. అని బలంగా నమ్మే సిరివెన్నెల.. తనకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో సమాజాన్ని తట్టి లేపే ఉద్యమ గీతాన్ని/ భక్తి గీతాన్ని రచించారు.

‘సురాజ్యమవలేనీ స్వరాజ్యమెందుకనీ
సుఖాన మనలేనీ వికాసమెందుకనీ
నిజాన్ని బలికోరే సమాజమెందుకని
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం..’

అని ఎంతో ఆవేదనతో ప్రశ్నించారు. కుల మతాల కలహాలతో, భారతదేశమంతా అట్టుడికి పోతుంటే, తలెత్తుకు ఎగరలేని త్రివర్ణ పతాకం దయనీయ స్థితిని హృదయం కదిలించేలా వర్ణించారు ఆయన.- గాయం

‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం..’

సమాజం మెరుగుపడాలని, కాలం త్వరగా రావాలని కోరుకుంటూ, ఇకనైనా మారమని సిగ్గులేని సమాజాన్ని నిగ్గదీసి అడిగారు.- గాయం

భరతఖండం భగ్గుమంటోంది భవిత స్వప్నం భగ్నమవుతోందీ |॥2॥

స్వార్థహోమజ్వాలలో సంతానమంతా సమిధలై శ్వాసమిగిలిన శవసమూహపు దిక్కుమాలిన తల్లియై రుద్రభూముల మధ్య నిలువున దరమౌవుతోంది అర్థరాతిరి స్వతంత్రానికి అర్థమడిగింది, అర్థమడిగింది ॥ భరతఖండం ॥……అని స్వతంత్ర భారతం చిత్రంలో భగ్గుమన్నారు సిరివెన్నెల.

దేశ భక్తుల, జాతీయవాదుల త్యాగఫలమైన స్వాతంత్ర ఫలాన్ని, నిలుపుకోలేని మనకు, అసలు స్వాతంత్రాన్ని అనుభవించే హక్కు ఉందా? అని, అన్ని వర్గాల ప్రజల బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టారు సిరివెన్నెల – సిందూరం చిత్రంలోని ఈ పాటలో.

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా?
-స్వర్ణోత్సవాలు చేద్దామా?
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా?
-దానికి సలాము చేద్దామా?
శాంతి కపోతపు కుత్తుక తెంచి యిచ్చిన బహుమానం
-ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలని చూడమ్మా
-ఓ పవిత్ర భారతమా
అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా?
-స్వర్ణోత్సవాలు చేద్దామా?
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా – దాన్నే స్వరాజ్యమందామా?

భారతరత్న చిత్రంలో, సిపాయి పాత్రలోకి ఒదిగిపోయి, భరతమాతకు ప్రణామాలు అర్పించారు.

మేరా భారత్‌కో సలాం ప్యారా భారత్‌కో ప్రణామ్
పుట్టిన భూమిని ఆరాధించగా పూసిన నెత్తుటి పూవులం
మేరా భారత్‌కో సలాం ప్యారా భారత్‌కో ప్రణామ్./
/పారా హుషార్ భాయీ! భద్రం సుమా సిపాయీ!
పాడురేయి జాడతీయి భగ్గుమను జ్వాలవై
పిడుగులయ్యే అడుగులెయ్యి మృత్యువుకే మృత్యువై
క్రీనీడల కీడును కనిపెట్టాలొయీ/

ధర్మపీఠం దద్దరిల్లింది చిత్రం కోసం వ్రాసిన ఒక స్ఫూర్తిదాయక గీతంలో, సమాజాన్ని మేలుకోమని, ఉత్సాహంగా ప్రగతికి బాటలు కమ్మని సందేశం ఇచ్చారు.

వందేమాతరం వందేమాతరం, వందేమాతరం వందేమాతరం
కారు చీకటిని చీల్చి వెలుతురును పంచే రవికిరణాలై
జాతి పురోగతి గీతికలో వినిపించే రేపటి చరణాలై
భావిజీవితపు ఆదర్శానికి గడచిన కాలము వెతకండి
ఆశయపథమున నడిచిన నేతల ఉత్తేజముతో బ్రతకండి..
వందేమాతరం వందేమాతరం, వందేమాతరం వందేమాతరం..

~

మనం విశ్లేషణకు తీసుకున్న పాటని ఒకసారి చూస్తే అందులో కూడా మనకు నిండిన దేశభక్తి కనిపిస్తుంది.

ఎగిరే జండా మన జనని ॥2॥
ఏమంటున్నది మననుగని
పూవుల దీవెనలందిస్తున్నది
తనంత ఎత్తుకు ఎదగమని ॥ఎగిరే॥

ఈ పాటలో, తన జాతిని ఉన్నతంగా ఎదగాలని జండా కోరుకుంటోందని, తన మనసును జెండా ద్వారా వినిపించారు సిరివెన్నెల. ఈ పాట చరణాలలో జెండాలోని మూడు రంగులు, తరతరాల సంస్కృతికి, శాంతికి, పచ్చదనానికి ప్రతీకలని వివరిస్తూ, అందరూ కలిసిమెలిసి ఆనందంగా దేశాభివృద్ధికి పాటుపడాలని తన ఆకాంక్షను తెలియజేశారు.

సిరివెన్నెల సాహిత్యమే సంఘసంస్కరణ కోసం పుట్టింది! అనడంలో సందేహం లేదు. రంగంలో అడుగుపెట్టక ముందు నుంచి కూడా అన్యాయాన్ని చూస్తూ ఉపేక్షించేవారు కాదట. మనసులోని మంటను చల్లార్చుకోవడానికి ఆ ఆర్తికి అక్షరాకృతినిచ్చేవారు. భావ కవిత్వంతో మనసును ఎంతలా ఉల్లాసపరచగలిగారో.. అంతకు పదింతలుగా సంఘసంస్కరణ దిశగా, సమాజాన్ని ప్రేరేపించగలిగారు. పాలకుల నిర్లక్ష్యాన్ని, స్త్రీ వివక్షను, కరుడుగట్టిన మానవ నైజాన్ని, మానవతను మరిచిన సమాజాన్ని, అక్షరాగ్నితో కడిగి సంస్కరించడానికి ప్రయత్నించారు సిరివెన్నెల.

దేశభక్తిలో మరొక విభాగం – ప్రాంత/ భాషాభిమానం. ఆంధ్రాభిమానంతో 1905-1920 మధ్య ఆంధ్రోద్యమం సాగింది. భాషా సంబంధమైన ఉద్యమాల ప్రభావంతో ఆంధ్రోద్యమం రూపుదాల్చింది. ఆంధ్రుల గతవైభవం ఈ ఉద్యమానికి ఊపిరినిచ్చింది. కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఎంతో స్ఫూర్తిని కలిగించాయి. 1907లో విజ్ఞాన చంద్రికామండలి స్థాపన, 1910లో గుంటూరులో ఆంధ్రయువజన సాహిత్య సంఘ సమావేశంలో జరిపిన ఆంధ్రరాష్ట్రానికి సంబంధించిన తీర్మానం, 1912లో ఢిల్లీ రాజధాని కావడంతో జరిగిన ఉత్సవాల సంరంభం, 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ – ఈ సంఘటనల సమిష్టి ప్రభావమే ఆంధ్ర రాష్ట్రోద్యమ కవిత్వంగా రూపొందింది.

రాయప్రోలు సుబ్బారావుగారు ప్రబోధించిన ‘నాదుజాతి, నా దేశము, నాదుభాష, అను అహంకార దర్శనమందు మాంధ్ర’ అన్న పంక్తులలోని అహంకార దర్శనమే ఆంధ్రోద్యమానికి మూలమైంది.

రాయప్రోలవారికి ముందే 1914లో గడ్డము కొండారెడ్డిగారు ‘ఆంధ్ర మాతృస్తవము’ అను శీర్షికతో ఆంధ్ర మాత ప్రాచీన వైభవాన్ని, ప్రస్తుత దుస్థితిని చిత్రించారు. 1916లో మండపాక పార్వతీశ్వర శాస్త్రిగారు ‘ఆంధ్ర సంవత్సరాది’లో వసంతకాల ప్రకృతిని వర్ణించే నెపంతో ఆంధ్ర రాష్ట్ర భావనను వెల్లడించారు.

‘ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రానికి చాటించె మదపికంబులు పంచమస్వనంబున’.

రాయప్రోలు సుబ్బారావుగారు ఆంధ్రుల గత వైభవాన్ని ‘అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వ విద్యాలయమ్ములు స్థాపించునాడు’, ‘ఓరుగల్లున రాజవీర లాంఛనమ్ముగా పలుశాస్త్ర  శాలలు నిలుపునాడు’ అంటూ కీర్తించారు. ఆంధ్రనౌకలను, ఆంధ్రతేజస్సును, ఆంధ్ర పౌరుషాన్ని, తెనుగువాణిని, తెనుగుభూమిని కీర్తించిన రాయప్రోలువారు

‘బాఱిన దేశ గౌరవము చక్కనదిద్ది, మహాంధ్ర మండలీ భారము శ్లాఘనీయముగ పాలన చేసి, సమాన రాష్ట్రముల్ కూరిమినాసజేయ తెనుగుంబుడమిన్ కయిసేయరయ్య” అని ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, ప్రస్తుత కర్తవ్యాన్ని ప్రబోధిస్తున్నారు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అన్న విధాన, భారతీయత పట్ల తమ భక్తి భావాన్ని చాటుకుంటూనే, మరోవైపు తెలుగు తల్లి పట్ల కూడా, తమ విధేయతను చాటుకున్నారు ఎందరో కవులు. సిరివెన్నెల మహాత్మా చిత్రం కోసం రచించిన అలాంటి పాటను ఒకదాన్ని చూద్దాం.

తలయెత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని
కనుక నిలువెత్తుగా ఎదిగినానని
తలవంచి కైమోడ్చు తమ్ముడా
తెలుగు తల్లి నను కని పెంచినాదని
కనుక తులలేని జన్మమ్ము నాదని
త్రైలింగ ధామం త్రిలోకాభిరామం
అనన్యం అగణ్యం ఏదో పూర్వ పుణ్యం
త్రిసంధ్యాభి వంద్యం అహో జన్మ ధన్యం..

ఇక భావ కవిత్వంలో మరో విభాగమైన దేశనాయక స్మృతి పద్యాలు/ కవితలు – Elegies తీసుకుంటే, మహాత్మ చిత్రంలోని, ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ.. అన్న అద్భుతమైన గీతం జాతిపిత మీద ఆయన రాసిన ఓ స్మృతి గీతం. అదేవిధంగా, ఆయన సైనికులపై కూడా వ్రాసిన గీతాలు ఇలాంటి కోవకు చెందినవే.

రఘుపతి రాఘవ రాజారాం.. పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరో నాం.. సబ్ కో సన్మతి దే భగవాన్

ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ.. ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ..

ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ.. ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ..

కరెన్సీ నోటు మీద.. ఇలా నడి రోడ్డు మీద.. మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధీ.. భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ.. తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ..

రామనామమే తలపంతా.. ప్రేమధామమే మనసంతా ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత.. అపురూపం ఆ చరిత..

ధర్మయోగమే జన్మంతా.. ధర్మక్షేత్రమే బతుకంతా.. సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత.. ఈ బోసినోటి తాత..

మన లాగే ఓ తల్లి కన్న మాములు మనిషి కదరా గాంధీ.. మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన సూక్తి..

సత్య అహింసల మార్గ జ్యోతి.. నవ శకానికే నాంది..

రఘుపతి రాఘవ రాజారాం.. పతీత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరో నాం.. సబ్ కో సన్మతి దే భగవాన్.. మహాత్మా

ఈ విధంగా మనసు లోతుల్లోంచి ఒప్పొంగే దేశభక్తిని, సమాజ ఉన్నతి పట్ల ఆయనకు ఉన్న ఆకాంక్షను, దేశాభిమానాన్ని పటిష్టమైన పదబంధాల్లో పేర్చి, అక్షరాలతోనే ఆవేశాన్ని రగిలించి, ఒక ఉత్తమ పౌరుడిగా, తను సాహితీ సేవతోనే భరతమాత రుణం తీర్చుకున్న, ఓ సాక్షరసాయుధ సిపాయి సిరివెన్నెల.

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here