సిరివెన్నెల పాట – నా మాట – 47 – భాగవత లీలలకు భాష్యం చెప్పిన పాట

0
13

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

జరుగుతున్నది జగన్నాటకం

~

చిత్రం: కృష్ణం వందే జగద్గురుమ్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: మణిశర్మ

గానం: ఎస్పీ బాలసుబ్రమణ్యం బృందం.

~

పాట సాహిత్యం

పల్లవి:
జరుగుతున్నది జగన్నాటకం.. (2)
పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం
నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం
జరుగుతున్నది జగన్నాటకం..(2)

చరణాలు:
చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని
ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని
సత్యవ్రతునకు సాక్షాత్కరించి, సృష్టి రక్షణకు చేయూతనిచ్చి
నావగ త్రోవను చూపిన మత్స్యం.. కాలగతిని సవరించిన సాక్ష్యం..

చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే..
పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే..
బుసలుకొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక
ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగరమథన మర్మం..

ఏడీ ఎక్కడరా నీ హరి?
దాక్కున్నాడేరా భయపడి?
బయటకి రమ్మనరా!
ఎదుటపడి నన్ను గెలవగలడా తలపడి?

నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు
నీ నాడుల జీవజలమ్ముని అడుగు
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు
నీ ఊపిరిలో గాలిని అడుగు
నీ అణువుల ఆకాశాన్నడుగు
నీలో నరుని, హరిని కలుపు…
నీవే నరహరివని నువ్వు తెలుపు||

అమేయమనూహ్యమనంత విశ్వం..
ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం
కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్పప్రమాణం
ముజ్జగాలనూ మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం
జరుగుతున్నది జగన్నాటకం.. (2)

పాపపు తరువై పుడమకి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ
పరశురాముడై, భయదభీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన
శ్రోత్రియ క్షత్రియ తత్త్వమే భార్గవుడు..

ఏ మహిమలూ లేక ఏ మాయలూ లేక
నమ్మశక్యముగాని ఏ మర్మమూ లేక
మనిషిగానే పుట్టి, మనిషిగానే బ్రతికి
మహిత చరితగ మహిని
మిగలగలిగే మనికి సాధ్యమేనని
పరంధాముడే రాముడై ఇలలోన నిలచె

ఇన్ని రీతులుగా, ఇన్నిన్ని పాత్రలుగా
నిన్ను నీకే నూత్నపరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణతరణము..

అణిమగా, మహిమగా, గరిమగా, లఘిమగా, ప్రాప్తిగా
ప్రాకామ్యవర్తిగా, ఈశత్వముగా, వశిత్వమ్ముగా –
నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా..
స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా..

నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా
తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే
నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే..

గతవారం మనం, సిరివెన్నెల సాహిత్యంలో ‘భక్తి గీతాలు’ అనే కోణాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈ వారం , ఆయన పాటలోని భగవత్ తత్వాన్ని విశ్లేషించుకుందాం. అయితే, జరుగుతున్నది జగన్నాటకం.. అనే పాటని, సిరివెన్నెల కోరుకున్న practical relevance dimension లో ఒక పరిశీలన చేయాలని భావిస్తున్నాను. ఆయన భాగవత లీలలను నిత్య జీవన సత్యాలుగా ప్రతిపాదించారు కాబట్టి, ఈ పాటకు నిజమైన సార్థకత లభించాలంటే, ఈ పాట అన్ని దృష్టి కోణాలతోనూ పరిశీలించబడాలి. ఇందులో నా వంతు ప్రయత్నం నేను చేస్తాను.

ఈ పాటను అనేకమంది కథా పరంగా, భాగవత తత్త్వం పరంగా, ఆధ్యాత్మికపరంగా.. ఇలా పలు కోణాల్లో ఇప్పటికే విశ్లేషించడం జరిగింది. అయితే సిరివెన్నెల గారు మనిషిలోని అనంత శక్తులను సోదాహరణలుగా తీసుకుని, తాము ఎవరో తెలుసుకోమని, సత్యాన్వేషణ దిశగా, మనకు దిశా నిర్దేశం చేసినట్టు నాకు అనిపిస్తుంది. నిజానికి నేను ఎవరు? ఈ భూమి మీదికి ఎందుకు వచ్చాను? నా ఉనికి ఏమిటి? నా గమ్యం ఏమిటి? అన్న ప్రశ్నలు ప్రతి వారిలోనూ ఏదో ఒక వయసులో మొదలవుతాయి. మనకు పుట్టుకతోనే వచ్చే సామర్థ్యాలలో ప్రహ్లాదుడు, ధృవుడు వంటి వారిలో అతి చిన్న వయసులో మొదలైన ఈ స్వీయాన్వేషణ (existentialism) ఒకటి. యుగయుగాలుగా ఎంతోమంది ఋషులు, మునులు, యోగులు, తత్వవేత్తలు తరచి, తరచి జీవితకాలం సాధనలు చేసి తెలుసుకొని మనకు తెలియజేసిన సత్యం.. We are not the Human beings in spiritual bodies but we are the Spiritual beings in human bodies. దానికై లోతైన స్వీయాన్వేషణ జరగాలి. అప్పుడే మన మూలాలు, మన అనంత శక్తిమత్వం, ఆత్మ పరమాత్మల అద్వైత తత్వం తెలుసుకోగలుగుతాం. అదే జీవిత పరమార్థం. ‘జరుగుతున్నది జగన్నాటకం’, పాట వింటే సిరివెన్నెల భాగవత లీలలకు భాష్యం చెప్పారు అనిపిస్తుంది. భాష్యం అనేది సందేశం లేదా వచనాన్ని అర్థం చేసుకోవడం లేదా అర్థం చేసుకునే ఆత్మాశ్రయ ప్రక్రియను సూచిస్తుంది. ఇది వ్యక్తిగత నమ్మకాలు, విలువలు, అనుభవ జ్ఞానంతో అర్థాన్ని విశ్లేషించడం. భాగవత తత్త్వాన్ని సిరివెన్నెల తన అనుభవంతో క్రోడీకరించి, తన జ్ఞానంతో సూత్రీకరించి (formulise) ఈ పాటలో పొందుపరిచారనడంలో సందేహం లేదు!

కృతయుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం అనే నాలుగు యుగాలు కలిస్తే ఒక మహా యుగం. అయితే భగవంతుని చేత సృష్టింపబడిన (కృత) యుగంలో అన్ని సహజ సిద్ధంగా, వాటి పరిమితులలో ఉంటూ, విశ్వమంతా క్రమబద్ధంగా నడుస్తూ, సమతుల్యతతో, ఆనందమయంగా ఉండేది. క్రమేణ ధర్మం ఒక్కొక్క పాదంగా క్షీణిస్తూ, కలియుగం వచ్చేసరికి ఒక పాదం మీదే నడుస్తోందని చెప్తారు. అయితే ఈ ‘స్వయంకృత’ యుగం (కలియుగం) వికృతంగా మారిపోవడానికి కారణం మానవుల స్వభావంలో వచ్చిన మార్పులే. భగవంతుని కల్పన నుంచి జనించిన ఈ సృష్టిలో ఎటువంటి ఒడిదుడుకులు, అసమతుల్యత వచ్చినా, దాన్ని సరిదిద్దడం కోసం భగవంతుడే భూమి మీద ఒక అవతారాన్ని దాల్చి, వాటిని సరిదిద్దడం జరిగింది. ఆ విధంగా పరమాత్ముడు తీసుకున్న అవతారాలు, అ లీలలు భాగవతంలో అభివర్ణించబడ్డాయి. అలాంటి అవతారాల గురించి కథాపరంగా వర్ణిస్తూ వ్రాయబడిన

మహత్తర సాహితీ రచన.. ఈ ‘జరుగుతున్నది జగన్నాటకం..’ అనే కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలోని పాట.

“మహిమలు చూపేవాడు కాదు సాయం చేసేవాడు దేవుడు. ఇతరులకు సాయం చేస్తే మనిషి కూడా దేవుడు కాగలడు” అన్న కథాంశంతో వచ్చిన ఈ సినిమా బీటెక్ బాబు (రానా) అనే వ్యక్తి జీవిత ప్రయాణంగా సాగుతుంది. స్వతహాగా స్వార్థపరుడైన బాబు తన తాతయ్య సుబ్రహ్మణ్యం (కోట శ్రీనివాసరావు) ప్రోద్బలంతో సురభి సంస్థలో నాటకాలు వేస్తుంటాడు. అమెరికా వెళ్ళే అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తాతయ్య చనిపోతాడు. ఆయన అస్థికలు స్వగ్రామంలో కలిపి, బళ్ళారి నాటకోత్సవాల్లో తన తాతయ్య చివరిగా వ్రాసిన కృష్ణం వందే జగద్గురుమ్ అనే నాటకాన్ని ప్రదర్శించడానికి తన బృందంతో వెళ్తాడు.

బళ్ళారి ప్రాంతంలో రెడ్డప్ప (మిళింద్ గునాజీ) అనే వ్యక్తి అక్రమంగా మైనింగ్ చేస్తుంటాడు. అతడిని ఆపే దిశగా దేవిక (నయనతార) అనే రిపోర్టర్ పనిచేస్తుంటుంది. నాటకోత్సవాల్లో కొన్ని పరిస్థితుల వల్ల ఆ మైనింగ్ మాఫియాతో బాబు తలపడాల్సి వస్తుంది. ఆ క్రమంలో బాబు ఎదుర్కున్న పరిణామాలు, కలుసుకున్న మనుషులు, తెలుసుకున్న నిజాలు, మాఫియాను బాబు ఎలా అంతం చేశాడు.. అన్నవి మిగిలిన కథాంశాలు. ఇక నా కోణంలో పాటను విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను.

పల్లవి:

జరుగుతున్నది జగన్నాటకం.. (2)

పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం

నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం

జరుగుతున్నది జగన్నాటకం..(2)

అసలు వ్యక్తి అంటేనే, భగవంతుడు తనను తాను వ్యక్తం చేసుకోవడానికి, తయారు చేసుకున్న శక్తి అని అర్థమట! మనిషి దేహంతో పరమాత్ముడు తనను తాను చేసుకునే అన్వేషణే, ఈ జగత్తును నడిపించే నాటకం. పురాణ వర్ణనలా అనిపించే ఈ పురాతన కథనాలు, నిత్య జీవిత సత్యాలు. భాగవత లీలలు అంతరార్థం ఇదే! అని, పల్లవిలో ఒక hypothesis ని ప్రవేశపెట్టి, చరణాల్లో దాన్ని సత్య నిరూపణ (prove) చేసి సమగ్రంగా పొందుపరిచిన ఒక Philosophical Thesis ఈ పాట.

చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని

ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని

సత్యవ్రతునకు సాక్షాత్కరించి, సృష్టి రక్షణకు చేయూతనిచ్చి

నావగ త్రోవను చూపిన మత్స్యం.. కాలగతిని సవరించిన సాక్ష్యం..

పరిమితులను దాటి, విలయం విజృంభిస్తుందని, ధర్మమూలాలు మరచిన జగతిని యుగాంతం కబళించి వేస్తుందని ముందుగానే సత్యవ్రతుడు అనే మనువుకు మత్స్య రూపంలో సాక్షాత్కారించి హెచ్చరిస్తాడు పరమాత్ముడు. అంతేకాకుండా తానే ఒక పెద్ద ఓడగా మారి, అన్ని జీవజాలాల్లోంచి ఒక్కొక్కదాన్ని ఆ ఓడలో వేయమని చెప్పి, ప్రళయ జలాల్లో నుండి వాటన్నిటిని, కాపాడి మరో యుగానికి నాంది పలుకుతూ, కాలగమనానికి సాక్ష్యంగా నిలుస్తుంది ఆ మహా మత్స్యం.

ఇక practical కోణానికి వస్తే, వేద విజ్ఞానాన్ని, సనాతన సంస్కృతి సంప్రదాయాలను, శ్రుతులు, స్మృతులు, పురాణాల రూపంలోనూ, రాతి కట్టడాల్లోనూ, శిలాఫలకాల ద్వారాను, ఇంకా time capsules రూపంలోనూ, తరువాత తరాలకు అందించడానికి ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న ప్రతివారూ మత్స్యవతార వారసులే! పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులు, పిట్టలు, రకరకాల జంతువులు, జీవజాలాలను రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా నడుము కట్టిన వేలాది స్వచ్ఛంద సంస్థలు మళ్లీ ఊపిరి పోసుకున్న మత్స్యావతారాలుగా మనం భావించాలి. సాక్షాత్తుగా ఆ పరమాత్ముడు భూమి మీదకి రావడం చాలా అరుదుగా జరిగినా, అదే సంకల్పంతో, అదే గమ్యంతో మనిషి రూపంలో జన్మించి భగవత్ కార్యాలు తీరుస్తున్న మహనీయులు ఎందరో! దీన్ని గుర్తించే ప్రయత్నం చేయమని చెప్పడమే, సిరివెన్నెల గారి అంతరార్థం.

సత్యాన్ని నిరూపించడం కోసం, Aristotle, Bruno, Galileo వంటి సత్యవ్రతులు వారి ప్రాణాలను ఫణంగా పెట్టారు.

ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగనురికే ఉన్మాదమ్మును

కరాళ దంష్ట్రుల కుళ్ళగించి, ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల

ధీరోద్దతి రణహుంకారం.. ఆదివరాహపు ఆకారం..

తమ ఉనికికే ఆధార భూతమైన భూమిని, కలపడానికి ప్రయత్నించిన రాక్షసులను శిక్షించిన, భూమిని రక్షించిన ఆది వరాహం ఒక పురాణం.

నదులను కాపాడడానికి, అడవులను ప్రకృతిని రక్షించడానికి, వన్యప్రాణులను కాపాడుకోవడానికి, పంచభూతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, వికృతి/త శక్తులకు విరుద్ధంగా మానవుడు చేస్తున్న ప్రయత్నం అనిర్వచనీయం. నర్మదా బచావో, నమామి గంగే, ర్యాలీ ఫర్ రివర్స్, చిప్కో వంటి అసంఖ్యాకమైన ఉద్యమాలు వీటికి ఉదాహరణలు.

Forest Man గా పిలవబడే Jadav Molai Payeng అనే భారతీయుడు ఒక అడవినే నిర్మించగా, కెన్యాకు చెందిన Nobel Prize winner Wangari Maathai సౌత్ ఆఫ్రికాలో Green belt Movement ద్వారా అదే పని చేశారు. వీరందరూ కూడా వరాహవతారపు సూక్ష్మ నమూనాలే!

చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే..

పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే..

బుసలుకొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక

ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగరమథన మర్మం..

అమృత సాధన కోసం రాక్షసులనబడే negative forces, దేవతలనబడే positive forces కలిసికట్టుగా చేసిన ప్రయత్నమే క్షీరసాగరమథనం.

మంధర పర్వతాన్ని కవ్వంగా, క్షీరసాగరాన్ని చిలికినప్పుడు మహా శక్తివంతమైన, ఓరిమికి మూలమైన కూర్మ రూపంలో భగవంతుడు వారికి దన్నుగా నిలిచాడు. ఇది పురాణ గాథ.

మన మనసులలో సానుకూల, వ్యతిరేక దృక్పథాల మధ్య నిత్యం జరిగే సంఘర్షణే ఈ అంతర్మథనం. సిరివెన్నెల గారి అంతర్మథనంలో నుండి ఆవిర్భవించిన అమృతమే, ఈ సాహిత్యం. దీన్ని తాగిన వారందరూ సానుకూల శక్తులై, సమాజానికి విలువల రక్షణలో తోడుగా నిలుస్తారు.

ఓటమిని ఓడించగలిగిన ఓర్పు ఉన్ననాడే గెలుపు తథ్యం. విదేశీ దాస్య శృంఖలాల నుండి భరతమాతకు స్వేచ్ఛను ప్రసాదించడానికి దేశభక్తులనే దేవతలు, భారతదేశాన్ని అన్ని విధాల హింసకు గురి చేసిన విదేశీయులనే రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ఊతగా నిలిచిన మహాత్ముడి లాంటి కూర్మావతారాలు, అబ్రహాన్ లింకన్, ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక నెల్సన్ మండేలా లాంటి ఉపమానాలు ఎన్నో మనకు చరిత్రలో ప్రబలంగా కనిపిస్తాయి.

ఏడీ ఎక్కడరా నీ హరి?

దాక్కున్నాడేరా భయపడి?

బయటకి రమ్మనరా!

ఎదుటపడి నన్ను గెలవగలడా తలపడి?.’.. అని తండ్రి హిరణ్యకశిపుడు ప్రశ్నిస్తే..

నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు

నీ నాడుల జీవజలమ్ముని అడుగు

నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు

నీ ఊపిరిలో గాలిని అడుగు

నీ అణువుల ఆకాశాన్నడుగు

నీలో నరుని, హరిని కలుపు..

నీవే నరహరివని నువ్వు తెలుపు’..

అనే సందేశాన్ని సమాధానంగా ఇస్తాడు ఆయన కుమారుడు ప్రహ్లాదుడు.

ఉన్మత్త మాతంగ భంగి వితతి 
హంత్రు సంఘాత నిర్ఘృణ నిబిడమీ జగతి
అఘము నగమై ఎదిగే అవనికిదే ఆశనిహతి
అతతాయుల నిహతి అనివార్యమో నియతి 
శితమస్తి హతమస్తి నఖ‌ సమకాసియో కౄరాసి గ్రోసి
హుతదాయ దంష్ట్రుల ద్రోసి మసిజేయ మహిత యజ్ఞం..
 
     దుష్ట సంహారానికై మహోగ్రరూపంతో అవతరించిన శ్రీనారసింహుడిని సిరివెన్నెల ఇలా వర్ణిస్తున్నారు..మదమెక్కిన ఏనుగుల గుంపుతోనూ, హంతకులతోను నిండిపోయిన ఈ ప్రపంచం, పాపం కొండలాగా పెరిగి భూమికి పిడుగుపాటుగా మారగా, దుర్మార్గుల అంతం అనివార్యమైన నియమం కాగా, పదునైన కొనలు కలిగిన శత్రువుల తలలు చీల్చగల కత్తులలాంటి గోళ్ళతో కోసి, అగ్నికీలల్లోకి తోసి మసి చేసే మహా యజ్ఞమట నారసింహ అవతరణం!( కథ ప్రకారం, ప్రతి నాయకుడు మంటల్లో ఆహుతి అవుతాడు.)

పంచభూతాత్మకమైన ఈ దేహంలో అనంత శక్తివంతమైన ఆత్మ రూపంలో భగవంతుడు కొలువై ఉన్నాడు. సముద్రంలో తిరిగే చేప పిల్ల నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? అని జీవితకాలం వెతికినట్టు, మనలోనే ఉన్న పరమాత్మను తెలుసుకోక, భగవంతుడు ఎక్కడ ఉన్నాడని జీవితకాలం అన్వేషించినా, సమాధానం దొరకదు. ఇంత గొప్ప సత్యాన్ని అనుభవ పూర్వకంగా అర్థం చేసుకున్న ఆత్మజ్ఞాని సిరివెన్నెల, తను ఆస్వాదించిన జ్ఞానామృతాన్ని మనకు కూడా అందజేస్తున్నారు.

తనలోని పరమాత్మ బయట కనిపిస్తాడా? కనిపించి తనతో తలపడతాడా? ఒకవేళ తలపడితే గెలవగలడా? అన్న అహంకారపు ప్రశ్న హిరణ్యకశిపుడిది.

పరమాత్మ లేని తావే లేదని, పంచభూతాల్లో ఎక్కడ వెతికినా తాను కొలువై ఉంటాడని, జడంలోనూ, చేతనలోనూ తానే ఉన్నాడని, ఈ సృష్టిలోని అణువణువు తానై ఉన్నాడని, ఆ నిజాన్ని తెలుసుకోవాలంటే తనలో ఉన్న నరుని, హరిని కలిపి చూడమని, అదే నరసింహ అవతారమని, అద్భుతమైన భాష్యం చెప్పారు సిరివెన్నెల.

అమేయమనూహ్యమనంత విశ్వం..

ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం

కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్పప్రమాణం

ముజ్జగాలనూ మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం

జరుగుతున్నది జగన్నాటకం..(2)

ఈ అనంతమైన సృష్టిలో సౌర మండలాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, వాటి అనంతమైన పరిమాణాలు, వాటితో ఏర్పడిన అసంఖ్యాకమైన పాలపుంతలు.. ఊహకు కూడా అందని అనంతమైన విశ్వామిది.

ఈ సృష్టిలో మరొక అత్యంత అద్భుతమైన అంశం – మానవ శరీర నిర్మాణం. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, మూత్ర పిండాలు, పునరుత్పత్తి వ్యవస్థ, ఎముకలు, కండరాలు, నరాలు.. ఇంకా చెప్పుకుంటూ పోతే గంగానది అంత పొడవైన జాబితా. మళ్ళీ ఒక్కొక్క అవయ నిర్మాణం, అనంతమైన దాని పనితీరు, ..ఎంత చెప్పినా తరగదు. ఉదాహరణకు:

యుక్త వయసులోని ఒక సాధారణ మానవుని మెదడు 100 బిలియన్ల న్యూరాన్లు, దాదాపు అంతే సంఖ్య గల గ్లియా (నాన్ న్యూరాన్) కణాలతో ఏర్పడి వుంటుంది.

ప్రతి మూత్రపిండం లోపల దాదాపు మిలియన్ (1,000,000) ప్రత్యేకమయిన నెఫ్రాన్లు ఉంటాయి. మూత్రపిండాలకి ఈ నెఫ్రాన్లు, అంటే వడపోత కణాలే, ఆయువు పట్టు.

పెద్దవారిలో పెద్దప్రేగు దాదాపు 4.7 అడుగులు, చిన్నప్రేగు 2.3 అడుగుల పొడవు వుంటాయి. మన శరీరంలోని మొత్తం ప్రేగులు, నరాలు, సిరలు, ధమనులు కలిపితే.. భూమిని నాలుగు మార్లు చుట్టేంత పొడవు వుంటాయట! నమ్మలేకపొతున్నారు కదా!

ఇక కన్ను విషయం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కంటి నుడి మెదడుకు కలిపే ప్రతి ఆప్టిక్ నరం 770,000 మరియు 1.7 మిలియన్ నరాల ఫైబర్లను కలిగి ఉంటుంది.

ఒక్కో సాధారణ నాలుకపై సుమారు 200 నుంచి 400 వరకు ‘పాపిల్లా’లు వుంటాయి. ఒక్కో దానిలో సుమారు 2,000 నుంచి 10,000 వరకు రసాంకురాలు (taste buds) వుంటాయని అంచనా. ఒకో రసాంకురం లోపల సుమారు 50 నుంచి 150 వరకు గ్రాహక కణాలు (Receptor cells) వుంటాయి. విభిన్న రుచుల (సువాసన)ను గుర్తించడంలో ఇవి సహాయ పడుతుంటాయి. ఆసక్తికరంగా వీటిలోని ఒక్కో గ్రాహకం కేవలం ఏదో ఒక రకమైన రుచినే గ్రహించగలుగుతుంది.

ఇలా మానవ శరీరం అత్యంత క్లిష్టమైన ప్రక్రియలు నిర్వహించడం కోసం కోటానుకోట్ల కణాలతో నిర్మించబడి ఉంది. ప్రతిరోజు శరీరం రోగాల బారిన పడకుండా పోరాడుతూ, 6000 కోట్ల కణాలు చనిపోతూ మళ్లీ పడుతూ ఉంటాయట! ఎంత సంక్లిష్టమైన నిర్మాణం!

ఈ విధంగా అనంతమైన బ్రహ్మాండానికి, మానవ దేహం భిన్నం కాదు. “We are a part of the Universe, we are the Universe Ourselves..”

అందుకే ఈ బ్రహ్మాండానికి సూక్ష్మ స్వరూపం (miniature universe) గా మానవుడిని, ప్రతిరూపంగా వామనుడిని చిత్రీకరించారు సిరివెన్నెల.

ఒక అడుగుతో నేలను, మరొక అడుగుతో గగనాన్ని ఆక్రమించిన వామనుడు, మూడవ పాదంతో బలి చక్రవర్తి లోని అహంకారాన్ని పాతాళానికి తొక్కడం, వామనావతార విశ్వరూప (త్రివిక్రమ) దర్శనం.

బ్రహ్మాండంతో పోలిస్తే సూక్ష్మరూపమేమో అని బుద్ధిని భ్రమింప చేస్తూ, అనంత శక్తిని తమలో నింపుకున్న మానవుడిని వామనుడి ప్రతిరూపంగా చూపించడంలో సిరివెన్నెల అపురూప సామ్యం నన్ను ఎంతో అబ్బురపరుస్తుంది. తన అనంతమైన మేధస్సుతో మానవుడు ఇటు భూతలాన్ని, అటు గగనతలాన్ని, ఇంకా పాతాళం లాంటి మహాసముద్రాల్ని కూడా వదలకుండా explore చేయడం (ఉన్న వినాశకర పరిణామాలను పక్కన పెడితే) త్రైవిక్రమ విస్తరణం జరుగుతూ.. జగన్నాటకం కొనసాగుతోందని మనకు అర్థం అవుతుంది కదా!

శ్రీకృష్ణుడికి దారి ఇచ్చినట్లే, చాలు గగనాలు కూడా సముద్రాలు, గగనాలు కూడా మానవులకు దారి ఇస్తున్నాయి.

పాపపు తరువై పుడమకి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ

పరశురాముడై, భయదభీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన

శ్రోత్రియ క్షత్రియ తత్త్వమే భార్గవుడు..

భూమి మీద అధర్మం అనే నాచును (గ్లానిని) పీకి వేయడానికి శ్రోత్రియ గుణాలతో పుట్టి, ధర్మాగ్రహంతో క్షాత్ర గుణంతో విజృంభించి, పరశురాముడై ధర్మస్థాపన చేశాడు పరంధాముడు. వారి సిద్ధాంతాలనే పరశువులుగా ఆదిశంకరుడు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వంటి ఎందరో మహనీయులు వారి, వారి కాలాలలో ధర్మస్థాపనకు కృషి చేశారు.

ఏ మహిమలూ లేక ఏ మాయలూ లేక

నమ్మశక్యముగాని ఏ మర్మమూ లేక

మనిషిగానే పుట్టి, మనిషిగానే బ్రతికి

మహిత చరితగ మహిని

మిగలగలిగే మనికి సాధ్యమేనని

పరంధాముడే రాముడై ఇలలోన నిలచె..

ఒక సాధారణ మానవుడిగా జన్మించిన రాముడు, తన ధర్మనిరతితో, విశిష్ట విలువలు ప్రమాణాలు ఏర్పరచి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి, తన చరిత్రనే రామాయణంగా మార్చుకుని దేవుడయ్యాడు. ప్రపంచంలో సాధారణ మానవులుగా పుట్టి, అసాధారణ విజయాలను సాధించి చరిత్రను తిరగ రాసిన వారు నిజజీవితంలో మనకి ఎందరో తలసపడతారు. వారందరూ మనకు స్ఫూర్తిదాతలే!

రాముడిని దేవుడిగా కొలవడం మాత్రమే కాకుండా, రాముడిలాగా ఎదగడం కూడా నేర్చుకోమని సిరివెన్నెల ఇచ్చే సందేశం.

ఇన్ని రీతులుగా, ఇన్నిన్ని పాత్రలుగా

నిన్ను నీకే నూత్నపరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణతరణము..

అణిమగా, మహిమగా, గరిమగా, లఘిమగా, ప్రాప్తిగా

ప్రాకామ్యవర్తిగా, ఈశత్వముగా, వశిత్వమ్ముగా –

నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా..

స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా..

శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనమిచ్చినప్పుడు, పై అవతారాలు అన్నీ కూడా ఆయనలో దర్శింపజేశాడు.

మనల్ని మనకే వినూత్నంగా పరిచయం చేశాడు. మనలో నిబిడీకృతమై (latent talent) ఉన్న జ్ఞానాన్ని మనకి దర్శింపజేసిన దర్పణం కృష్ణావతార రహస్యం.

భగవంతుడికి మనం భిన్నం కాదని, అణిమ, మహిమ గరిమాది అష్టసిద్ధులు మనలోనే ఉన్నాయనీ, ఉన్నాయని తెలుసుకోవడమే మనం సాధించాల్సిన విజయమనీ, నీ స్వస్వరూపమే విశ్వరూపమని, కృష్ణ గీత బోధిస్తోందని, గీతా సారాన్ని విప్పి చెప్పారు సిరివెన్నెల.

నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా

తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే

నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే..

మన లోపల దాగి ఉన్న ఆత్మను తెలుసుకో గలిగితే, దాన్ని గురువుగా దాన్నే గురువుగా గ్రహించగలిగితే, నీవే శిష్యుడవు, నీ గమ్యం వైపు నిన్ను నడిపించుకోగల ఆచార్యుడవు కూడా నీవే! అనేది చివరి చరణంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇచ్చిన ఒక సానుకూల విస్ఫోటనం వంటి తత్త్వజ్ఞాన బోధ.

Helen Keller, Stephen Hawking, Nick Vujicic, Esther Vergen, Braille వంటి వారు ఏ వైకల్యమైన శరీరానికి మాత్రమే అని నిరూపించారు. 13 ఏళ్ల వయసులోనే ఎవరెస్ట్‌ను అధిరోహించిన పూర్ణా మాలవత్, పదహారేళ్ళ వయసులో నేపాల్ వైపు నుండి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన కామ్యా కార్తికేయన్, తానే ఒక సైన్యంగా 22 సంవత్సరాల కష్టంతో తన గ్రామానికి ప్రధాన రహదారితో అనుసంధానం చేయడం కొండను తవ్విన Mountain Man దశరథ్ మంజీ, పారా ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొనే వివిధ రకాల దివ్యాంగులు, ..అందరూ కూడా, వారి స్వశక్తిని జాగృతం చేసుకున్న ఆచార్యులే! ఓటమే వారి ముందు ఓడిపోతోంది! ప్రయత్నిస్తే నీలోని ఆచార్యుడిని మేలుకొలిపితే, నీకు నీవే శిష్యుడైతే, సృష్టి నీ ముందు మోకరిల్లుతుంది. Arise, Awake and Stop not!

తెలుగు సినిమా ఆరంభం నుండి వచ్చిన అత్యుత్తమ పాటల్లో కృష్ణం వందే జగద్గురుమ్ పాట ఒకటని అనడంలో అతిశయోక్తి లేదు. “ బహుషా ఈ రచన చేయడానికి 28 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నానా అనిపించింది నాకు. దీని తరువాత ఏదైనా రచన చేయవచ్చునా? చేయవలసిన అవసరం ఉందా? అనిపించేంత పరాకాష్ఠకు తీసుకుపోయినటువంటి రచన ఇది’ అని సిరివెన్నెల గారే స్వయంగా సంతృప్తిని వెలిబుచ్చిన  మహా భాష్యం వంటి ఈ పాట సాహిత్యాన్ని అర్ధం చేసుకోవటం, ఆచరించడమే మనము ఆయనకు ఇవ్వగలిగిన ఘనమైన నివాళి. ఈ గీత  సారాన్ని, గీతా సారంలా అందరికీ అందిద్దాం.  ఈ పాటపై ఆయన వ్యక్త పరచిన అభిప్రాయాన్ని గమనిస్తే, ఈ  పాట ఆయన ప్రస్థానంలో ఆయనకెంత విలువైనదో అర్థం చేసుకోవచ్చు. కేవలం, ఆయన ప్రస్థానంలో మాత్రమే కాదు, తెలుగు సినిమా ప్రస్థానంలో కూడా ఈ పాట అంతే విలువైనది.

“శాస్త్రి గారు వ్రాసిన అన్ని పాటలు ఒక ఎత్తు అయితే ఈ ఒక్క పాట ఒక ఎత్తు అని చెప్పొచ్చు. సహజంగా, ఆయన వ్రాసిన పాటలు సూటిగా ఒకే అర్థాన్నిస్తూ సాగిపోతాయి. కానీ ఈ పాట ఎవరెలా వింటే అలా వినిపించే, ఎవరెలా అర్థం చేసుకుంటే అలా అర్థమయ్యే పాట. ఆ జగన్నాథుని రూపాల్లాగే దీనికీ పలు అనుసృజనలుంటాయి. తెలుగు సినిమా పాట చరిత్రలో ఈ పాటకు స్వర్ణాక్షరాలతో ఓ పుట ఎప్పటికీ ఉంటుంది. ఈ సందర్భంగా శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి మరొక్కసారి పాదాభివందనం చేసుకుంటున్నాను..!” యశ్వంత్ ఆలూరు.

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here