సిరివెన్నెల పాట – నా మాట -5 – మృదు మధుర భావ ప్రకటనకు మచ్చుతునక

1
10

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

తెలి మంచు కరిగింది

~

చిత్రం: స్వాతికిరణం

గానం: వాణి జయరాం

కవనం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

~

గీత సాహిత్యం

తెలి మంచు కరిగింది.. తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వొణికింది.. పిలుపు నీయనా ప్రభూ
నీ దోవ పొడవునా.. కువకువలా స్వాగతం
నీ కాలి అలికిడికి.. మెలకువల వందనం
||తెలిమంచు||
~
ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు
పల్లవించును ప్రభూ పవళించు భువనాలు
భాను మూర్తీ.. నీ ప్రాణకీర్తన విని..
పలుకనీ ప్రణతులనీ ప్రణవ శృతినీ..
పాడనీ ప్రకృతినీ ప్రథమ కృతిని ||తెలిమంచు||
~
భూపాల! నీ మ్రోల ఈ బేల రాగాలు
నీ రాజసానికవి నీరాజనాలు
పసరు పవనాలలో.. పసికూన రాగాలు
పసిడి కిరణాల పడి పదును తేరిన చాలు..
తలయూచు.. తలిరాకు బహుపరాకులు విని..
దొరలనీ దోర నగవు దొంతరనీ
తరలనీ దారి తొలగి రాతిరిని ||తెలిమంచు||

~

[dropcap]అ[/dropcap]ద్భుతమైన సూర్యోదయాన్ని వర్ణించకుండా ఉండడం కవులకు సాధ్యమా? నిజానికి కవిత్వానికి ఇదొక జీవనది లాంటి, నిత్య నూతనమైన ప్రేరణ.

“తొలి సంధ్య వేళలో, తొలి పొద్దుపొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం కదిలొచ్చే కెరటం సింధూరం..” అని 1980లో సీతారాములు చిత్రం కోసం దాసరి నారాయణరావు వ్రాస్తూ, ఆ ఉదయ సంధ్యారాగం అనురాగాన్ని మేలుకొలుపుతుందని వివరించారు.

తెల్లవారుజామునే లేచిన పల్లె, అందరినీ మేలుకొలిపితే, అదిరిపడిన కోడి అదే పనిగా కూసిందట. అప్పుడు..

“వెలుగు దుస్తులు వేసుకొని సూరీడు,
తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు,
కారు చీకటికెంత భయమేసిందో
పక్క దులుపుకొని ఒకే పరుగు తీసింది,
అది చూసి లతలన్నీ ఫక్కున నవ్వాయి,
ఆ నవ్వులే ఇంటింటా పువ్వులైనాయి..”

అని మల్లెమాల ‘ముత్యాల పల్లకి’ సినిమాలో సూర్యోదయాన్ని చమత్కారంగా వ్రాశారు.

“తెల్లారింది లెగండో కొక్కొరోక్కో మంచాలింక దిగండో కొక్కొరోక్కో..” అన్న పాట ‘కళ్ళు’ చిత్రం కోసం సిరివెన్నెలే వ్రాసి, బాలు గారి సంగీత సారథ్యంలో స్వయంగా ఆలపించిన గీతం. సామాజిక చైతన్యాన్ని తట్టి లేపే ఆ పాట ఇంకా ఇలా సాగుతుంది..

“..ఎక్కిరించు రేయిని సూసి ఎర్రబడ్డ ఆకాశం ఎక్కుబెట్టి యిసిరిందా సూరీడి సూపుల బాణం కాలి బూడిదై పోదా కమ్ముకున్న నీడ..”

ఆంగ్ల సాహిత్యంలో కూడా Morning beauty ని వర్ణించే ఎన్నో అద్భుతమైన కవిత్వాలు ఉన్నాయి. నాకు నచ్చిన Morning poems లో రెండు మూడింటిని ఇక్కడ ఉదాహరిస్తాను.

~

“Full many a glorious morning have I seen
Flatter the mountain tops with sovereign eye,
Kissing with golden face the meadows green,
Gilding pale streams with heavenly alchemy..”
అంటాడు William Shakespeare, ఉదయాన్ని వర్ణిస్తూ.

~

“The laughing hours have chased
away the night
Picking the stars out from her diadem,
And how the blue eyed Morn; with the modest grace,
Looks through her half drawn curtains in the East,
Blushing in Smiles and the glad as
infancy”
– Rufus Dawes.

~

“Each dawn before my eyes I see
A shining new day spread for me;
All trace of worn-out yesterday
The winds of night have washed away.
O’ let me use God’s hand-work well—
His glorious daily miracle!”
– Annette Wynne

~

ఇక మనం ఎంచుకున్న పాటలోని భాషని, భావాల్ని, అందమైన ఆ కవనాన్ని, కవిత్వంలోని ఆ శిల్పాన్ని ఆస్వాదిద్దాం.

తెలి మంచు కరిగింది.. తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వొణికింది.. పిలుపు నీయనా ప్రభూ
నీ దోవ పొడవునా.. కువకువలా స్వాగతం
నీ కాలి అలికిడికి.. మెలకువల వందనం

“తెల్లవారు జాము అవుతోంది.. చీకటితోపాటు మంచు కూడా కరుగుతోంది.. తలుపు తీసి వెలుగును ఆహ్వానించనా ప్రభూ! స్వాగతగీతం ఆలపించడానికి ఇల గొంతు సవరించుకుంటోంది, ఆ భానునికి స్వాగతం పలుకుతూ పిలుపునివ్వనా ప్రభూ!” అంటూ, సూర్యోదయాన్ని ఒక అద్భుతమైన భావచిత్రంగా సిరివెన్నెల ఆవిష్కరించిన ఈ పాట, కే.వీ.మహదేవన్ సంగీత సారధ్యంలో ‘స్వాతికిరణం’ సినిమా కోసం వాణి జయరాం మనోహరంగా పాడినది. వినగానే ఇది సూర్య భగవానుడికి పలికే స్వాగతంలాగా, సూర్యోదయ వర్ణనలాగా అనిపించినా, అంతర్లీనంగా కథా నేపథ్యం మీదనే పాట సాగుతుంది.

ఈ పాట వినగానే మన హృదయంలో వినిపించే ఉదయ రాగాలు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. “నీ దోవ పొడవునా పక్షుల కిలకిల రావాలతో నిన్ను స్వాగతిస్తున్నాయి.. నీ లేత కిరణాలు సోకగానే సర్వ జగత్తు మేలుకొని, చైతన్యవంతమై, నీకు ప్రణతులు అర్పిస్తోంది.. సూర్య భగవానుడా! నీకు వందనాలు”.. అని సిరివెన్నెల గారు దినకరుడికి అర్పిస్తున్న వందనాలివి. అదొక మనోహర దృశ్యం.

ఇక కథా నేపథ్యానికి వస్తే, ఒక గొప్ప పేరు, ప్రఖ్యాతులు ఉన్న సంగీతం విద్వాంసుడికి శిష్యరికం చేయాలని వచ్చిన గంగాధరం పాడే పాట ఇది. ఇటు పేరు ప్రతిష్ఠలలోనూ, అటు అహంకారంలోనూ ప్రచండ మార్తాండుడికి ధీటైన అనంతరామశర్మను ప్రసన్నం చేసుకోవాలని చిన్నారి గంగాధరం ఆయనను ప్రశంసిస్తూ, ఆయన రాకను స్వాగతిస్తూ, తనలోని సంగీతాన్ని ఆ గురుకృప అనే సూర్య కిరణాలు మేల్కొల్పాలని ఆశిస్తూ, సూర్యోదయానికి ఆహ్వానం పలికే సన్నివేశం ఇది. ఆయన శిష్యరికంలో ఉన్నతి సాధించాలనే గంగాధరం ఆశ, ఆశయం మనకు పరోక్షంగా ఈ పాటలో స్పష్టమవుతుంది.

ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు
పల్లవించును ప్రభూ పవళించు భువనాలు
భాను మూర్తీ.. నీ ప్రాణకీర్తన విని..
పలుకనీ ప్రణతులనీ ప్రణవ శృతినీ..
పాడనీ ప్రకృతినీ ప్రథమ కృతిని..

తెలతెలవారుతుండగానే వికసించే ఈ పూలలో భానుడి రాక వల్ల పులకింతల గమకాలు (పరిమళాలు) పలుకుతుంటే, మలయ మారుతాలు మెల్ల మెల్లగా, గారాబంగా కదులుతూ ఆ రాగాలకు సంగతులు దిద్దుతున్నాయి. ఇక్కడ గంగాధరం, ‘నీ చరణ స్పర్శ సోకితే నాలో నిద్రాణంగా ఉన్న సంగీతానికి మేలుకొలుపు అవుతుంది. నువ్వు అందించే చైతన్యం.. నీ ప్రాణకీర్తనగా, నాలో ప్రణవ శృతిని పలికిస్తుండగా నీకు ప్రణతులు తెలుపుకుంటున్నాను’, అని గురువుకు వందనాలు అర్పిస్తున్నాడు.

ఇక ప్రకృతి విషయానికి వస్తే, బాలభానుడి లేత కిరణాలు సోకగానే, నిద్రలో ఉన్న భువనాలన్నీ మేలుకుంటున్నాయని, ప్రకృతి ఓంకార నాదాన్నే ప్రథమ కృతిగా పాడుతోందని సిరివెన్నెల తొలిసంధ్యను ఎంతో మనోహరంగా వర్ణిస్తున్నారు.

భూపాల! నీ మ్రోల ఈ బేల రాగాలు
నీ రాజసానికవి నీరాజనాలు
పసరు పవనాలలో.. పసికూన రాగాలు
పసిడి కిరణాల పడి పదును తేరిన చాలు..
తలయూచు.. తలిరాకు బహుపరాకులు విని..
దొరలనీ దోర నగవు దొంతరనీ
తరలనీ దారి తొలగి రాతిరిని

 

‘నాకు ప్రభువు వంటి ఓ గురువర్యా! ఈ అమాయకమైన పసి మనసుతో, నన్ను నేను పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాను. పరిణతి లేకుండా నేను పాడుతున్న ఈ రాగాలు నీ రాజఠీవికి నీరాజనాలు పలుకుతున్నాయి. నా పసి రాగాలపై నీ పసిడి కిరణాలు సోకితే, నా విద్య ఎంతో పదును తేలుతుంది. నా జీవితంలోకి నీవు అడుగు పెట్టాలని, చిగురాకు లాగా నేను బహుపరాక్! పలుకుతున్నాను. నా స్వాగతాలు విని నువ్వు దొంతర దొంతరలుగా ముసి ముసి నవ్వులు నవ్వితే, నా అనుభవరాహిత్యమనే చీకటి తొలగిపోయి, అనంతమైన సంగీత విద్య అనే శుభ కిరణాలు అడుగుపెడతాయి’, అని చీకటిని తరిమికొట్టే సూర్యోదయానికి వినమ్రతతో, పరవశంతో స్వాగతం పలకుతాడు గంగాధరం.

అంత ఉద్దండ పండితుడైన సంగీత విద్వాంసుడి ఆదరణ తనకు కాస్తంత దొరికి పదును తేలితే చాలని అంటాడు గంగాధరం. కానీ సిరివెన్నెల ఎంతో symbolicగా కథలో రాబోయే మలుపును ఇక్కడ ప్రస్తావిస్తారు. బుడతడైన గంగాధరాన్ని, తలిరాకు, గారాబు కవనాలు, పసరు పవనాలు, పసికూన రాగాలు వంటి లేత వయస్సును సూచించే పదాలతో ప్రస్తావిస్తూ, ఇటువంటి చిగురాకుకు సూర్యుడు ఇచ్చే వెచ్చదనం మాత్రం చాలునని వివరిస్తూ ఆ పండితుని ఈర్ష్య అనే వడగాలికి, వడలిపోయి, చిగురాకు రాలిపోతుందని.. ముందస్తు సూచన చేశారు. భాషకు, భావానికి (తగిన imagery తో) సిరివెన్నెల సమతుల్యం సాధించారనడంలో సందేహం లేదు. ఆయన క్షుణ్ణమైన పరిశీలనా శక్తికి, మృదు మధుర భావ ప్రకటనకు మచ్చుతునక ఈ పాట.

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here