సిరివెన్నెల పాట – నా మాట – 50 – సిరివెన్నెల అభిమానుల పాట.. మాట

2
10

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ. ]

ఈ శీర్షిక ఆరంభించి యాభై వారాలయిన సందర్భంగా సిరివెన్నెల అభిమానులు పాటల రూపంలో ఆయనకు అర్పించిన గీతాంజలి ఈ వారం ప్రత్యేక వ్యాసం

 

సిరివెన్నెలకు అభిమానుల అక్షర నీరాజనం

సీతారామశాస్త్రి గారు రాసిన ప్రతి పాట, తెలుగు తల్లి గుడి ముందు గణగణలాడే ధ్వజస్తంభం లాంటిదని, అందుకే ఆ పాటలు మందలు, మందలుగా తనకు నందులను సంపాదించి పెట్టాయని, అందుకే ఆ పాటలు అభిమానుల గుండెల్లో శిలాక్షరాలుగా నిలిచిపోయాయని, తనికెళ్ల భరణి గారు సీతారామశాస్త్రికి ఘన నివాళి అర్పించారు, సిరివెన్నెలకో నూలుపోగు అనే విశిష్టమైన గ్రంథానికి తన అభిప్రాయాన్ని వ్రాస్తూ. ప్రఖ్యాతమైన సినిమా హీరోలకు గొప్ప గొప్ప అభిమాన సంఘాలు ఉండడం, వారికి సంబంధించిన జన్మదినాలు వంటి ఉత్సవాలు నిర్వహించడం సర్వ సాధారణమైన విషయం.

గొప్ప గొప్ప సినీ గేయ రచయితలకి కూడా అలాంటి ఘనత దక్కుతుంది. కానీ, సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి దక్కిన ఒక ప్రత్యేకమైన సత్కారం మరెవ్వరు రచయితలకు దక్కలేదు! తన పాటలతో కోట్లాదిమంది మనసులను గెలుచుకున్న, జగమంతా తన కుటుంబంగా మలుచుకొన్న, సిరివెన్నెల సీతారామశాస్త్రి ఘనత వేరు! ఎందుకంటే తమ హృదయాల్లో ఆ శ్రీరాముడిని నిలుపుకున్న, హనుమంతుళ్ళలాగా, తమ గుండెలోని ప్రేమనంతా రంగరించి, సిరివెన్నెల పాట ప్రాభవాన్ని, తమ జీవితంపై ఆ పాట ప్రభావాన్ని, ఆయన చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలని పొందుపరుస్తూ, వేరు వేరు రంగాలకు చెందిన సిరివెన్నెల అభిమానులే, ఒక వ్యాస సంకలనాన్ని రచించి, సిరివెన్నెలకో నూలుపోగు అనే పేరుతో దాన్ని ముద్రించారంటే, ఆ వైభవాన్ని ఏమని కొనియాడగలం? ఇటువంటి ఘన సత్కారం ఇంతకుముందు ఏ రచయితకు దక్కలేదు! నా అదృష్టం కొద్దీ, ఈ పుస్తకంలో ఒక వ్యాసం వ్రాసే అవకాశం నాకు కూడా దక్కింది!

“సిరివెన్నెల కుటుంబం జగమంత కుటుంబం. ఈ విస్తృత కుటుంబంలోని కొంతమంది సభ్యులు ‘సిరివెన్నెల’ అనే భావతరంగం తమనెలా వెన్నంటి నడిపిందో, నడుపుతోందో ప్రపంచానికి తెలిసేలా అమావాస్య ఎఱుగని ఆ చందమామకి సమర్పించుకున్న నూలుపోగు ‘సిరివెన్నెలకో నూలుపోగు’ అనే పుస్తకం”, అని, ఈ పుస్తక ప్రచురణలో ప్రధాన భూమిక వహించిన, వ్యాసకర్త ఆలూరు యశ్వంత్ అభిప్రాయపడ్డారు.

వెలకట్టలేనంత అభిమానాన్ని సొంతం చేసుకున్న సిరివెన్నెలకు అభిమానులు అందించిన అక్షర నీరాజనాలను, ఈ 50వ సంచికలో ప్రచురించడం, నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ నా ఆలోచనను మన్నించి ప్రోత్సహించిన, సంచిక యాజమాన్యానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఈ ఏడాది సిరివెన్నెల జయంతి రోజున, ఆ మహాకవికి, తన తొలి పాట అయిన ఆది భిక్షువు వాడి నేది కోరేది, పాట బాణీలోనే నేను సమర్పించుకున్న, ఒక సాహితీ సుమమాల! ఈ పాటను ప్రముఖ నేపథ్య గాయకుడు సాయి శ్రీకాంత్ ఆలపించారు.

~

సిరివెన్నెలకో నూలుపోగు..

కైత నేర్చిన గురువుకేమి తెచ్చేది?
పోత పోసిన ఋషికి ఏమి ఇచ్చేది..
ఏమి తెచ్చేది.. ఏమి ఇచ్చేది
ఏమి తెచ్చేది.. నేనేమి ఇచ్చేది

జగమంత తనదంటు, ఏకాకి తానన్న అద్వైత యోగికి ఏమి ఇచ్చేది
గమనమే గమ్యమని గగనానికెగసిన,
ఘన మార్గదర్శికి ఏమి ఇచ్చేది
ఏమి తెచ్చేది.. ఏమి ఇచ్చేది
ఏమి తెచ్చేది.. నేనేమి ఇచ్చేది

ఉచ్చ్వాస నిశ్శ్వాసలే కవన గానాలు,
భారతి సుతునికి ఏమి ఇచ్చేది
సాహితీ వెన్నెలలు కురిపించి మురిపించు
ఆ నిండుచందురునికేమి ఇచ్చేది..
ఏమి తెచ్చేది.. ఏమి ఇచ్చేది
ఏమి తెచ్చేది.. నేనేమి ఇచ్చేది

చిత్ర సీమకు చిత్ర చిత్రమౌ పాటలతో
మరుమల్లె దండలను సిరి కూర్చినాడు..
తనకు ఏమి ఇచ్చేది
శిరసొంచి ప్రణమిల్లి తన పాదముల చెంత నూలుపోగొక్కటి నేను పేర్చేను,
కూర్చి మురిసేను
తెలుగు వెలిగేదాక తన కీర్తి వెలగంగ నేను కోరేనూ.
చేంబోలు వారింటి ..
చేంబోలు వారింటి ఘన వారసుండు..

కైత నేర్చిన గురువుకేఏమి తెచ్చేది?
పోత పోసిన ఋషికి ఏమి ఇచ్చేది..
ఏమి తెచ్చేది.. ఏమి ఇచ్చేదీ
ఏమి తెచ్చేది.. నేనేమి ఇచ్చేది..

~

తనే బాణీ కట్టుకుని సిరివెన్నెల గారు పాడుకున్న అభిమాని పాట!

కాలనాథభట్ల ఫణీంద్ర అనుభవాన్ని తన మాటల్లోనే వివరిస్తున్నారు. “2010 లో సిరివెన్నెల పుట్టినరోజుకి రాసిన పాట ప్రత్యేకమైనది. ఆ రోజు ఉదయం ఆఫీసుకి వెళుతూ బస్సులో కూర్చుని అప్పటికప్పుడు రాసిన పాటది. పాటని ‘సిరివెన్నెల భావలహరి’ గూగుల్ గ్రూప్ లో పోస్ట్ చేస్తే మిత్రులు విజయసారధి గారు నా పాటనీ, ఇంకా కొందరు రాసిన రచనలనీ సిరివెన్నెల గారికి చూపించారు. సిరివెన్నెల గారు నా పాటని మెచ్చుకుంటే ఆ సాయంత్రం సిరివెన్నెల గారిని కలిసిన మరో మిత్రులు ప్రభగారు, “ఉండండి! ఫణీంద్రకి ఫోన్ చేసి చెప్పండి!” అని నాకు కాల్ చేసి ఫోన్ అందించారు. “నాన్నా ఫణీ! నువ్వు పాటలు రాస్తావని నాకు చెప్పలేదేంటి?” అంటూ మొదలెట్టి సిరివెన్నెల గారు పాటని చాలా మెచ్చుకోవడమే కాక, చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అదో మరపురాని అనుభూతి! నిజానికి ఈ పాటలో సాహితీ విశేషం ఏమీ లేదు. అయినా అంతలా మెచ్చుకోవడం సిరివెన్నెల గారు నన్ను ప్రోత్సహించడం, ఆశీర్వదించడం మాత్రమే. యూట్యూబులో నేను పెట్టే పాటలకి మహా అయితే ఓ 100 views వస్తాయి, కానీ ఈ పాటకి 11000 views వచ్చాయంటే, అది కేవలం సిరివెన్నెల గొప్పతనమే! ఆయన పాప్యులారిటీ అలాంటిది మరి!

ఇతరుల రచనలని ప్రేమించినట్టే తన రచనలనీ ప్రేమించేవారు గురువు గారు. దీనిని అపార్థం చేసుకుని – “ఆయన పాటల గొప్పతనాన్ని ఆయనే చెప్పుకుని పొగుడుకోవడం ఏమిటి?” అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియనిది ఏమిటంటే ఆయనకి నచ్చితే ఎవరి పాటనైనా ఆకాశానికి ఎత్తేస్తారు అని. ఓ పుట్టినరోజుకి నేను ఆయనపై రాసిన “వెన్నెల చూడు వెన్నెల చూడు పాటల వెన్నెలిది” అనే పాట సాహిత్యాన్ని మా సిరివెన్నెల కూటమి సభ్యులు సూర్యప్రభ గారు, విజయసారధి గారు ఆయనకి చేరవేసినప్పుడు ఫోన్లో నాతో ఎంతో ఆత్మీయంగా – “చాలా బావుందిరా పాట. నేనే ట్యూన్ కట్టుకుని పాడుకుంటున్నాను ఉదయం నుంచీ! నువ్వు పాటలు రాస్తావని నాకెందుకు చెప్పలేదు? నీకు సినిమా పాటల రచయితగా మంచి భవిష్యత్తు ఉంది. ఒకసారి నన్ను కలు, మాట్లాడదాం!” అని ఆశీర్వదిస్తూ మాట్లాడడం మరిచిపోలేను. ఆయన నన్ను అంతలా అభినందించాల్సిన అవసరం లేదు. కానీ ఆయనంతే! ఏ రచనైనా ఆయన మనసుకి బాగా నచ్చితే అది ఎవరు రాసినా వాళ్ళను తన ప్రేమతో ముంచెత్తేస్తారు. ఇది మా కూటమిలో చాలా మందికి అనుభవం.

పల్లవి:
వెన్నెల చూడు వెన్నెల చూడు పాటల వెన్నెలిది
వెన్నెల చూడు వెన్నెల చూడు మన సిరివెన్నెలిది
అమవస నిశిలో కూడా వెలిగే జ్ఞానప్రకాశమిది
మండుటెండలో నీడై దొరికే ఆప్తుని వాక్యమిది
చరణం:
పుట్టుకలోన జ్వలనం ఉన్నా
చల్లగ తాకునిది
అర్థంకాని వేదాంతాలను
సులువుగ తెలుపునిది
చుట్టూ ఎన్నో చీకటులున్నా
తరగని విలువ ఇది
వేకువకోసం నిత్యం రగిలే
తపనకి రూపమిది
॥వెన్నెల చూడు వెన్నెల చూడు॥
చరణం:
వలపులు నిండిన పడుచుల ఎదలో
తియ్యని తలపు ఇది
బతుకున బరువుని దూరం చేసే
ఆశల వెలుగు ఇది
కష్టం చూసి కన్నీరయ్యే
కరుణా కావ్యమిది
మనిషితనానికి అద్దం పట్టిన
జీవన వేదమిది
॥ వెన్నెల చూడు వెన్నెల చూడు॥

సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు అస్తమించిన రోజున పుబాక వ్రాసుకున్న కవిత..

ఇంత త్వరగా శివ సాన్నిధ్యం చేరుకుంటారు అనుకోలేదు మహానుభావా ..
నీ లోటు ఎవరూ తీర్చలేరు..
నీ కలములో సిరా ఇంకదు..
నీ మెదడులో చైతన్యం ఇగరదు..
ఆయువు తీరింది నీ శరీరానికి కానీ నీ అక్షరాలకు కాదు..
తరాలు మారినా.. యుగాలు గడిచినా ..
ఇది ‘ సిరివెన్నెల జల్లు “ అని పులకింపజేసే నీ ప్రతి పదం మేము నెమరేసుకుంటాం.
మృత్యువుకి సైతం నిన్ను కౌగిలించుకొనే అవకాశమిచ్చిన ధైర్యశాలీ..
మరు జన్మలో కూడా మాకోసం రావాలి .. రాయాలి.

గుండెల్లో ఏనాడో గుడి కట్టేసుకున్న నీకు
నా ప్రతి అక్షరముతో అర్చన చేస్తాను.
నీ మరణం మనస్కరించకపోయినా .. తప్పక ఒప్పుకు నమస్కరిస్తాను..
– కార్తిక్ పుబాకా

పుబాకా (పులిపాక బాలాజీ కార్తీక్)

ప్రస్తుతం స్వీడన్లో ఒక బ్యాంక్ ఉద్యోగిగా చేస్తున్నారు. తనకు సినిమాలన్నా, సినిమా పాటల సాహిత్యం అన్నా చాలా ఇష్టం. ఆ ఆసక్తితో కథలు, డైలాగ్స్, లిరిక్స్ కూడా వ్రాస్తూ ఉంటారు.. ఈ మధ్య ‘వెండితెర వాకిట్లో’ అనే పేర యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ మొదలుబెట్టి సినిమాలో ఉన్న సాహిత్యాన్ని వాటి తాత్పర్య మాధుర్యాన్ని, సందర్భోచిత అర్థాలని అందరితో పంచుకుంటున్నారు. పుబాకకు అత్యంత ఇష్టమైన సినీ గేయ రచయితల్లో ఒకరు సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా అక్షర రూపాన అమరులంటూ, ఆయన పాటలు తలుచుకుంటూ జీవితాన తను నేర్చుకున్న పాఠాలెన్నో వున్నాయని, తన మనసులోని భావాలని మనతో పంచుకున్నారు.

~

నిత్యభావసిరిగా, సీతారామశాస్త్రిగారిని కొనియాడిన మాడుగుల నాగగురునాథశర్మగారి పద్య పరిమళం.

వేదాంతమ్మది పాటలో,పలుకులో విన్యాసముల్ చేయగా
నాదప్రాభవమై పదమ్ములు శివానందార్థమై మ్రోగగా
మోదంబై కవనాంధ్ర చిత్రజగతిన్ మూర్ధన్యులై వెల్గగా
తాదాత్మ్యస్థిత నిత్యభావ! సిరి! సీతారామశాస్త్రీ! నమో!

కర్ణాటక బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తున్న, కవి, అవధాని, సినీగేయ రచయిత, మాడుగుల నాగగురునాథశర్మగారు.

~

హైదరాబాద్‌కు చెందిన, ఇరువంటి మాధురీ దేవి (నాగిని) గారు, అందమైన తన కందపద్యాలతో సిరివెన్నెలకు అక్షరార్చన చేస్తున్నారు.

సిరివెన్నెల సాహిత్యంలో అక్షర సిరులను కురిపించారని, ప్రశ్నించడం నేర్పారని, అన్నిటికీ మూల సారాంశం ఒకటేనని, లేత పూబాలల వంటి సున్నితమైన పదాలతోనే మనకెంతో విజ్ఞత నేర్పారనీ కితాబిస్తున్నారు.

కరమున అక్షర సిరులను
విరివిగ కురిపించిన కవి! వెన్నెల ధారీ!
పురమున తలపుల నేర్పిరి
నరులకు ప్రశ్నించు విధము నడకయు తోడన్

ప్రతి పాటను భావము గన!
లత నుండిన పూవుల వలె లలితమ్ముగ‌ తా
నతి సుళువుగ సారమ్మును
ద్యుతితో బోధించి పథము జ్యోతుల నింపెన్

గుడియైనను బడి యైనను
మడి దడి యేదైనను తన మంత్రమదొకటే
విడివిడి తలపులు గాదని!
ముడి సరుకొకటే నని తన బోధన సాగెన్

సిరివెన్నెల రాముడు తా
నరులుగ దెలిపె పిరికితనమను భావననే
చిరు దివ్వెలుగ ప్రశ్పించుట
పరిపాటిగ జేసె మనకు! పథమున తోడై

అజ్ఞానమ్మును వప్పక
నజ్ఞాతమ్మను తిమిరముకాశ్రయ గృహమున్
ప్రజ్ఞనుఁ గూల్చిన ఘనుడై
విజ్ఞత నేర్పిన గురువుగ వెలిగెను సీమన్

వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న నాగినికీ, తెనుఁగు భాష అన్నా, పద్య సాహిత్యము అన్నా మక్కువ. అలాగే, సాహితీ ప్రక్రియలలో గాంభీర్యాన్ని రంగరించి పోసుకున్న చిత్ర సీమకు చెందిన పాటల పట్ల కూడా మక్కువ ఎక్కువ.

అటువంటి గీతాలు కోకొల్లలుగా ఉన్న మన తెలుగు భాషలో, సీతారామశాస్త్రి గారి పాటలూ మన తలపులను కదిలిస్తాయనటంలో సందేహం లేదని, అందుకని వారి గురించి వ్రాయటం అన్నా, వారి పాటల గురించి వ్రాయటం అన్నా తనకు ఎంతో ఆసక్తి అనీ, ఆ ఆసక్తియే తన చేత ఈ పద్యాలు వ్రాయించిందనీ, సిరివెన్నెల పట్ల తన ఆదరాన్ని చాటుకున్నారు, నాగినిగారు.

~

సిరివెన్నెల సాహిత్యాన్ని ఆస్వాదించిన వారు, లోతులను స్పృశించినవాడు వారు, ఆ ఆనందాన్ని అనుభవించిన వారు ధన్యులని బలంగా ప్రకటిస్తున్నారు, డా. వీరా.

బోసి నవ్వుల బుజ్జాయి అమాయకత్వం
బడికెళ్ళే పిల్లాడి మారాముల మొండితత్వం
కాలేజి కుర్రకారు అల్లరి చేసే ఆకతాయితత్వం
నడివయసుపు మనుజులకు భోదించే బాధ్యతాయుతత్వం
పెద్దవాళ్ళను సైతం అబ్బురపరిచే ఆధ్యాత్మికత్వం

ఇలా ప్రతీ దశలోనూ మనల్ని పలకరిస్తూ,
ప్రశ్నించేలా, ప్రశ్న వేసుకునేలా,
ఉత్తేజపరిచేలా, ఉత్సాహంతెచ్చేలా
ఉండేవే మా/మన సిరివెన్నెల మాయాజాలపు
పాటల్లోని సాహిత్యపు పంక్తులు. – వీర

గుంటూరుకు చెందిన ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం విశ్రాంత అధ్యాపకులు, డా|| వీర ఆతుకూరి. వీరు వ్యాపారవేత్త, గాయకుడు, రచయిత, సామాజిక కార్యకర్త మరియు వ్యక్తిత్వ వికాస నిపుణులు. చరవాణి: +91 89786 92777

~

మా గురువు గారు మాస్ లీడర్! అంటూ భావవేశంతో సిరివెన్నెలను ప్రశంసిస్తున్నారు విజయ్.

ఏంటి? ఒక సినిమా హీరోనో రాజకీయ నాయకుడినో పొగిడినట్టు..

చక్కటి సాహితీవేత్త ను మాస్ లీడర్ అంటున్నావ్? అని మీరు అంటే..

మురళిని కల స్వరముల కళ

పెదవిని విడి పలకదు కద

అనే సిద్ధాంతాన్ని ఏ రచన లోనూ వదలని విక్రమార్కుడు మా మాస్ లీడర్, అని నేనంటాను!

గొప్ప గొప్ప వ్యక్తిత్వ వికాస విషయాలను, సాంసారిక..వేదాంత విషయాలను.. అలతి ఆలతి పదాలతో అభినవ పోతన లాగా సామాన్యుల మనసులలో నిలిచిపోయేలా మాస్ కి దగ్గిర చేసిన ఘనుడు మా మాస్ లీడర్!, అని నేను ఘంటా పథంగా చెప్తాను.

70 ఏళ్ళ వయసులో..పైగా ఇటు సినీ సాహిత్యంలోని, అటు జీవితంలోని అన్నీ కోణాలూ చూసేసిన ‘అన్న ఎన్టీఆర్’, అంతటి ఆయన్ని,

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

ఎన్నడూ కోలుపో వద్దురా ఓరిమి’

అన్న, ఒక్క పాటతో కదిలించగలిగి,

నూతన ఉత్సాహాన్ని నింపగలిగిన మాస్ లీడర్ సిరివెన్నెల గురువుగారు!

పాండిత్యం దరికి రాలేని నా లాంటి సామాన్యుల కోసం వసంతం లాంటి సాహిత్యాన్ని మా దగ్గరికే తీసుకు వచ్చిన మాస్ లీడర్ సీతారామ శాస్త్రిగారు!

ఆయన ప్రతి పాట నా కోసం రాశారు,

నా లాంటి పామరుల కోసం రాశారు,

ఆయన సాహిత్యం మాకు వేదం,

అందుకే మేము ఎంతో మమకారంతో

ఆయనని అంటాం..Masses కి Leader అని!

సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు..The Mass Leader..

తెలుగు భాషాభిమానమే తప్ప పాండిత్యం తెలియని సగటు సినీ గీతాల శ్రోతననీ, ఒక software engineer ననీ, రోజూవారీ వాడుక పదాలలోంచే గొప్ప వ్యక్తిత్వ వికాస జ్ఞానాన్ని ప్రసాదించిన గురువు గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారనీ, ప్రశంసిస్తూ తన ప్రేమని చాటుకుంటున్నారు యడవల్లి విజయ్.

మొబైల్ నెంబర్: +91 72076 91830

~

తాను సిరివెన్నెల భక్తుడిననీ, ఆయనే తన దైవమనీ, కవనమనీ తన కవితతో ‘సిరాభిషేకం’, చేస్తున్నారు లిరిసిస్ట్ వివేక్.

తాను ఒక అక్షర సిరి
నా జీవితానికి ఒక దారి
నేను ఒప్పుకోని ఓటమి తను నేర్పిన విజయం
నేను వదులుకోని ఓరిమి తను చూపిన జీవితం
నా చీకటి తలపుల్లో ఇది తను కురిపించిన వెన్నెల
తన సిరా రాయలేనప్పుడు నాకెందుకు ఇంత వెన్నెల
నా పదాలు పలికే భావం
నా అక్షరాల మధ్య బంధం
నా పాటకు శ్రీకారం
నా భాషకు నుడికారం
నా కళకి ప్రాణం
నాకెప్పటికీ తీరని ఋణం

నా దైవం
నా సిరా పెంచుకున్న అనుభవం

ఇది కవనం కాదు నా జీవనం
ఆయన కవి కాదు నా దైవం

నమో సిరివెన్నెల! నమో నమః!

2004 లో ఆయన సాహిత్య సమూహం ఉంది అని ఆర్కుట్‌లో జాయిన్ అయ్యారట ఈయన. ఒక సాహిత్య అభిమానానికి ఇంతకన్నా పరాకాష్ట కనిపిస్తుందా? ఆయనని గురువుగా ఎంచుకుని పాటలు రామడంలో ఏకలవ్య శిష్యుడను అయ్యారట వివేక్. తన జన్మంతా స్మరించుకునేలా ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అనేది తన జీవనంలో ఒక భాగమయ్యిందట! 15 యేళ్ళుగా తన ముఖపుస్తకంలో పేరయ్యిందట. తన ఫోన్ లో ఎప్పటికీ మారని రింగ్ టోన్ అయ్యిందట!

చరవాణి: +1 (669) 238-9074

~

సిరివెన్నెల పాటే ఓ ప్రవచనమనీ, ఓ ప్రభంజనమనీ, అనుభవసారమనీ పరవశిస్తున్నారు, కాలిఫోర్నియాలో నివసిస్తున్న మధుశ్రీ.

మీ పాటే ఒక ప్రవచనం
ప్రతీ మాట ఓ ప్రభంజనం
జన్మ జన్మల అనుభవ సారం
జన్మంతా చదివిన గీతా జ్ఞానం
నిముషాల పాటలో నిక్షిప్తం
అదే మీరు మాకు ఇచ్చిన వరం
అందుకే మీ కీర్తి ఆచంద్ర తారార్కం!

మా సిరి చంద్రుడు లేని వెన్నెలెక్కడ
అమ్మ ప్రేమ నాన్న లాలనకు ధీటుగా
మీ హృదయ తరంగ ధ్వనులు
గాయపడ్డ మా గుండెకు లేపనమౌతాయి

అద్దం ముందు నిలబెడితే
దర్పణంలో శివుని దర్శనం
వేగాస్ పెట్టెలో నాణెం వేసి
మీట నొక్కి మురిసే నిత్యయవ్వనం,
కల్మషం లేని మీ దరహాసం,
కన్నులారా చూడాలని ఆరాటం,
వేచేము అందుకోవాలని ఆ ఆనంద క్షణం!

అంతలో ఈ శరాఘాతం!?
మీ పాటే సిరి, పలుకే వెన్నెలగా
ఓటమి ఒప్పుకోని ధీరత్వాన్ని
అలవాటు చేసుకుని,
బాధను గుండెల్లో దాచేసి,
మీరు బోధించిన ఆశావహ దృక్పథాన్ని
ఆచరిస్తూ..అనుగమిస్తాం..- మధూశ్రీ

శ్రీ బుద్ధవరపు, స్వస్థలం అనపర్తి, నివాసం కాలిఫోర్నియా. కార్పోరేట్ రంగంలొ వృత్తి, అమ్మ వారి దయతో జ్యోతిష్యం, ఓ నాలుగు మాటలు వ్రాయడం ప్రవృత్తి. చరవాణి : +1 (408) 228-7718

~

సిరివెన్నెల గారి గురించి సమగ్రంగా భావవ్యక్తీకరణ చేయలేక, తెలుగు పదాలు చిన్నబోతాయేమో! అని తన సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు, శ్రీమతి బి. జయలక్ష్మి.

తొలి చిత్రం సిరివెన్నెల లో
‘ఆది బిక్షువు వాని నేమి కోరేది,
బూడిదిచ్చే వాడినేమి అడిగేది’, అంటూ అడగదలచినవన్నీ పాటల ద్వారా అడిగించిన
అపర మేధావి శాస్త్రి గారు..
పాటల వనాన బాట వేసి,
ఆ బాటలో సరికొత్త బాణీల మొలకెత్తించి
అర్థమవుతూ, అర్థమవనంత తికమకబెట్టే
అంతర్గత భావజాల విరుల పూయించి,
పండిత పామరులందరితో ఆ విరుల సౌరభాన్ని ఆగ్రాణింపజేసిన అక్షర శిల్పి శాస్త్రిగారు.

తనదంటూ ఓ శైలి, ఓ బాణి
ఓ సందేశాత్మకతను సమాజానికి, యువతకు చేరవేసిన మార్గదర్శి శాస్త్రిగారనడంలో,
ఇసుమంతైన సందేహం కనరాదు!
ప్రతి పదములో ఉన్న నిగూఢ అర్థాన్ని ఆకళింపు చేసుకొని,
అతని అంతరంగాన్ని తరచి చూడాలంటే,
సముద్ర గర్భంలో రతనాల వేటే అవుతుంది
ఆ ప్రయాస!
కానీ, అర్థమైతే మన వేట సఫలం అవుతుంది.
ఆ లోతైన భావజాలం, అర్థమైతే చాలు, మనసు తేలిపోతుంది!

శాస్త్రి గారి పాటల గురించి సంకలనం చేసి, వ్యాఖ్యానించారు ఎందరో మహానుభావులు, వారందరికీ వేవేల వందనాలు!
ఆయన గురించి నాకు తెలిసిన, విన్న అనుభూతే కవితగా రూపుదిద్దుకుంది.
మునుపెందరో మహా కవులు ఎన్నో సందేశాలు, ప్రజాహిత భోదనలు వారి వారి రచనల ద్వారా సమాజ అభ్యుదయానికి, సరళ, సున్నిత పద ప్రయోగాలతో ప్రచురించారు.
సినీ నేపథ్య గానాలతో అలరించారు..

కానీ శాస్త్రి గారు కఠిన పదాలతో,
నిఘంటువు తిరగేసి ఆయా సందర్భానికి తగిన పదాన్ని వెదికి, గ్రహించే భాద్యత కూడా మన మెదడులకు పెట్టారు..
అదే శాస్త్రి గారి కవిత్వానికి ఆయువు పట్టు.
నిజంగా శాస్త్రిగారి లాంటి కవి లేరు, ఇకపై ఉండబోరు అనవచ్చు.
ఆయన గురించి ఎంత చెప్పినా, వ్రాసినా, తక్కువే. తెలుగు పదాలే చిన్నబోతాయేమో..ఏమో!!

శ్రీ. బి. సుబ్రహ్మణ్యం Rtd SSS (O), BSNL, కడప, గారి సతీమణి, బి. జయలక్ష్మీ క్రిష్ణ B.A., కడప BSNL, కార్యాలయం, విశ్రాంత అకౌంట్స్ ఆఫీసర్

సింగింగ్, కుకింగ్, రీడింగ్, రచన చేయడం, తన హాబీలు. పాత పాటలు అంటే ఈమెకు పిచ్చి. కొన్ని వందల పాటలు, (తెలుగు, హిందీ అన్నీ) పాడుతూ, సామాజిక మాధ్యమాలలో పంచుకుంటూ, అందరిని అలరిస్తూ, ఆనందించడం ఈమెకు ఎంతో ఇష్టం.

~

తన మనసులో సిరివెన్నెల సాహిత్యం పట్ల ఉన్న మక్కువ గురించి చెప్పాలంటే, మాటలు రావడం లేదు, కానీ ఎంతో చెప్పాలని ఉందని, ఆయనపై తనకున్న ఆధారాభిమానాలు చాటుకుంటున్నారు గిరిజాకృష్ణ గారు.

‘మనసున వున్నది చెప్పాలని వున్నది
మాటలురావే ఎలా’,
ఈ అయోమయ స్థితి నాదా? నీదా?
నాది నీది కాదు! ఎందరిదో?
ఉవ్వెత్తున లేచే భావకెరటాలు,
తెలియని అనిశ్చితి,
ఆగని ఉద్వేగం,
తెలపాలనే ఆరాటం,
మాటలు దొరకని నిస్సహాయత,
ఒకే దారి – సిరివెన్నెల పాట!

మన మనసున మాట సిరివెన్నెల పాట!
ఏ భావమైనా ఇది నాదే
అన్పించే మాట సిరివెన్నెల పాట!
ఆ పాట మన మాటన్పించినా
నిజానికి అది సిరివెన్నెల మాటే!
ఆ మాట మనదే కదా అనే ఆశ్చర్యం
మాటతో మనసు తేలికైన సంతోషం!

అలాంటి కొన్ని భావాలు –
సిరులొలికించే చిన్నినవ్వులే మణిమాణిక్యాలు
ఓ తల్లి మనసు మాట – సిరివెన్నెలపాట
బోడి చదువులు వేస్ట్ రా గురూ
విద్యార్థి మనసున గందరగోళం – సిరివెన్నెలపాట
ఓనమాలు నేర్పాలనుకొన్నా కన్నా
ఎదిగిన కొడుకును చూసి గర్వపడే తండ్రి మనసు – సిరివెన్నెల పాట
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి
ఆశించినది అందుకోవాలంటే – సిరివెన్నెలపాట
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని
సమజాన్ని ప్రశ్నించాలంటే – సిరివెన్నెలపాట
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
కష్టాన్ని ఎదుర్కోవాలంటే – సిరివెన్నెలపాట
ఎక్కడవున్నా పక్కన నువ్వే వున్నట్టుంది
అప్పుడే మనసుకు తెలిసిన ప్రేమ – సిరివెన్నెల పాట
ఏచోట వున్నా నీ వెంట నేనా
ఓ ప్రేమ ప్రకటన – సిరివెన్నెలపాట
ఈ క్షణం ఒకే ఒక కోరిక
తన మనిషి దూరమైతే – సిరివెన్నెలపాట
మరీ అంతగా మొహం ముడుచుకోకలా
జీవితంలో సర్దుకోవడం అంటే – సిరివెన్నెలపాట
ఆదిభిక్షువు వాడినేమి కోరేది
ఓ ఆధ్యాత్మిక భావన – సిరివెన్నెలపాట
ఏ దారెదురైనా ఎటు పోతుందో అడిగానా
మనిషి తనను తాను తెలుసుకోవాలంటే – సిరివెన్నెలపాట!
మచ్చుకు కొన్ని మాత్రమే
ఇలా ఎన్నో ఎన్నెన్నో
మనిషి ‘ప్రతి’ స్పందనకు
రూపమివ్వగల మాట – సిరివెన్నెలపాట!
వేల పాటలు కోట్ల మంది భావాలు
తరచి చూస్తే దొరకని మాటంటూ లేదు
మన మాట – సిరివెన్నెల పాట

కడప జిల్లాకు చెందిన ఆలూరు గిరిజా కృష్ణ, విశ్రాంత బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిని. ప్రస్తుతం హైదరాబాద్ నివాసి. పాటలన్నా, సాహిత్యం అన్న మక్కువ ఎక్కువ. మంచి సాహిత్యం ఉన్న పాటలను వింటూ ఆనందిస్తారు. చరవాణి సంఖ్య: +91 94938 33499

~

మహోన్నతమైన తెలుగు సాహితీ గ్రంథపు మధ్యపుటలలో ఒదిగిన అపురూప ముఖచిత్రంగా,సమాజపు నిశ్శబ్దానికి గళంగా మారిన తెలుగు భాషా ఘన వారసుడిగా సీతారామశాస్త్రిని ప్రశంసిస్తున్నారు వెల్లాల శ్రీకర్.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి..

తెలుగు భాషా ఘన సారస్వత వారసత్వమితడు
తెలుగు నేల కన్న మహోజ్వల సాహితీ కవనమితడు

మహోన్నత గ్రంధంగా ఎదిగిన తెలుగు సాహిత్యపు
మధ్యపుటలలో ఒదిగిపోయిన అపురూప ముఖచిత్రమితడు

సునిశిత సాహితీ దృక్కోణ విప్లవ కలమితడు
గళం లేని సమాజపు నిశ్శబ్దానికి గళమైనవాడితడు

చిత్ర సాహితీ సౌరభపు సరిహద్దులను
చెరిపేసి, విశాల విశ్వానికి చేర్చిన ఘనుడితడు

లాలి పాట జోలపాటల బాణీలతో సైతం
జాతిని జాగ్రుతం చేయగల సామాజిక చైతన్య
స్రవంతి ఇతడు

సాహితీ సంద్రపు అగాధాలను సైతం ఛేదించి
శోదించిగలిగిన కవి దిగ్గజమితడు

శివతత్వమునెరిగి, తత్త్వలోక అమృతాన్ని
ఆద్యంతం గ్రోలిన అద్వైత సిద్ధాంతి ఇతడు

సినీ సాహితీ వినీలాకాశంలో విలువల
సిరివెన్నెలలు పూయించిన సీతారాముడితడు

తన తీయని భావాలతో మనందరి మనములు గెలిచిన, జగమంత కుటుంబ విశ్వ యాత్రికుడితడు
-వెల్లాల శ్రీకర్

వెల్లాల శ్రీకర్, హైదరాబాదులో నివసిస్తున్న సీనియర్ గ్రాఫిక్ డిజైనర్& ట్రైనర్. కుటుంబ నేపథ్యంలోనే సాహితీ వారసత్వం కలిగిన, రచయిత్రి అయిన కీllశేll కుందవరం విజయభారతి కుమారుడిగా, సినీ నేపథ్య గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు అయిన సాయి శ్రీకాంత్ సోదరుడిగా, శ్రీకర్ కు సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. వీలు వెంబడి ఈయన కవితలు రాస్తూ ఉంటారు.

~

అక్షరమే నర్తకిగా, కాగితం అనే వేదిక మీద నర్తించిన నటరాజుగా, ప్రతి ఎదను తాకిన రసవాహినిగా ప్రసరించిన సిరివెన్నెలను పాటుగా మరో జన్మ ఎత్తమని కోరుతూ, ఆ మహాకవికి కావ్యాంజలి అర్పిస్తున్నారు ఆదిత్య.

అక్షరమను నర్తకికీ, కాగితమను వేదికకీ
మక్కువ తీర్చకుండ మఱుగేల నటరాజా?
సూర్యగోళపు జ్వాలవై, సిరివెన్నెల జోలవై,
మా మెలకువ నీవై, నీ నెలకువ మా ఎదై..
ఇన్నాళ్ళుగా ఉన్నాముగా ఇనయిలలంటి గురుశిష్యుల వోలె?

పాంచజన్యములో పోసిన పంచామృతమె కద నీ వాక్యము
ఆ తీర్థము త్రాగి పరవశింౘర ఎల్లరు జనులు!
ఎల్లలను త్రెంౘుతూ, వెల్లువై సాగుతూ, పల్లవింౘు నీ గానము
అజ్ఞాన తిమిర సంహరణకై సుదర్శన శస్త్రమైన శాస్త్రము!

నీ పదములను పొదువుకొని నిగమాలు పలికినవి సరిగమలై
మా నిశ్శబ్దం ఉనికిని ౘాటుకుంది నీ కవనమే తన గాత్రమై!
ఱాతి వంటి మా గుండెల్ని ప్రేమతో చెక్కింది ఉలి నీ కలమై!
రసవాహిని కౌగలించింది ప్రతి మనసునీ నీ భావలహరై!

జాబిలిలో జొబ్బిలు ఏటిపై మెఱిసే తెర నీ కవిత
వీచే తెమ్మెర తుమ్మెదై ఆలపించే పాట నీ కవిత
పూచే వసంతాల పుప్పొడి ఆడే కేళి నీ కవిత
మట్టిని చీల్చుకు పుట్టే పచ్చని ప్రాణం నీ కవిత!

తత్త్వమే కవిత్వమై పూచేటి కొమ్మకి
మూలమై నిలిచావు కనిపెంచిన తరువై
నీ తనువున అణువణువున వెలసిన అనురాగమై పొందవా మఱుజన్మను పాటవై, పూబాలవై!

పొందవా మఱుజన్మను
పాటవై, పూబాలవై!

~

మారెళ్ళపూడి వేంకట ఆదిత్యకు ఇంజినీరింగ్ చదువు యొక్క చివరి దశ పూర్తి కావొస్తోంది. పన్నెండేళ్ళు విదేశంలో ఉండి, 8వ తరగతిలో భారత దేశానికి తిరిగొచ్చి, ఇక్కడ పాఠశాలలో చేరిన తనకు అలతి కాలంలోనే తెలుగు భాష పట్ల, సాహిత్యం పట్ల అమితమైన మక్కువ పెఱగడానికి ముఖ్య కారణం సీతారామ శాస్త్రి గారి పాటలు. తనపై వారి ప్రభావం, తనకు వారు అందించిన స్ఫూర్తి, ప్రేరణ ఎనలేనివి. ఆయనకెప్పుడూ తాను ఋణపడి ఉంటానని అంటున్నాడు ఆదిత్య. చాలా మందిలాగే తను కూడా ఎందరి ద్వారానో స్ఫూర్తి పొందాడట, కానీ ఇందరిలో తన అంతరాత్మతో మాట్లాడింది సిరివెన్నెల ఒక్కరే! అన్నది తన బలమైన అభిప్రాయం.

ఇంతమందిని, ఇన్ని వర్గాల వారిని, వీలైనంత మేర ప్రభావితం చేసి, తన పదునైన ప్రశ్నలతో ఆలోచింపజేసి, స్ఫూర్తిని, విలువలను, ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపి, ఆధ్యాత్మిక ప్రగతిని అందించి, మనిషిని మనిషిగా మెలగమని బోధించి, రసానందాన్ని అందించి, ఎల్లలు లేకుండా విస్తరించిన విశ్వ కుటుంబంలో ఆత్మబంధువులను, ఆత్మీయంగా పలకరిస్తున్న సిరివెన్నెల పాట, అవసరమయతే సూర్యకిరణాల్లోని వేడిని వాడిని అందిస్తూ, లాలన కోరుకునే సమయాల్లో చల్లని వెన్నెలై స్పృశిస్తూ.. అనంతంగా అలా సాగిపోతూనే ఉంటుంది.

(50 వారాలుగా సిరివెన్నెల పాటల పైన నా వ్యాసాలను ఆదరిస్తున్న పాఠకులకు, నేను అడిగిన విధంగా తమ కవితలను అందించిన మిత్రులందరికీ, వెన్నంటి ప్రోత్సహిస్తున్న సంచిక సంపాదక వర్గానికి, టెక్నికల్ బృందానికి, నన్ను అనుక్షణం ఉత్సాహపరుస్తూ, ఒక్క వారం కూడా విఘ్నం కలగకుండా ముందుకు నడిపిస్తున్న మా శ్రీవారు డాక్టర్. ఆర్. ఎన్ శర్మకు, కుమారుడు ఆర్. సి. ఎస్. సిద్ధార్థకు, నాకు అవసరమైనప్పుడు సమాచారాన్ని అందిస్తున్న రీసెర్చ్ బృందం లాంటి నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరి సహకార, ప్రోత్సాహాలతో నేను నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను.- ఆర్. శ్రీవాణీశర్మ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here