సిరివెన్నెల పాట – నా మాట – 53 – పూల భావాల పాట

0
11

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

పూల ఘుమ ఘుమ చేరని..

~

చిత్రం: శ్రీ ఆంజనేయం

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: మణిశర్మ

గానం : శ్రేయాఘోషల్

~

పాట సాహిత్యం

పల్లవి:
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని ఆ మూతిముడుపేంటలా
ప్రేమంటే పామని బెదరాలా? ధీమాగా తిరగరా మగరాయడా
భామంటే చూడని వ్రతమేలా? పంతాలే చాలురా ప్రవరాఖ్యుడా
మారనే మారవా? మారామే మానవా? మౌనివా మానువా? తేల్చుకో మానవా

చరణం:
చెలి తీగకి ఆధారమై బంధమై అల్లుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో
మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
నా వాలుజడ చుట్టుకొని మొగలిరేక నడుము నడిపించుకో
వయసులో పరవశం చూపుగా చేసుకో సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో
॥పూల ఘుమఘుమ చేరని॥

చరణం:
ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాగనై జతలీలలో అలసి మత్తెక్కిపోనీ నిద్ర గన్నేరునై
నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై
నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమి చెంగల్వనై
మోజులే జాజులై పూయనీ హాయిని తాపమే తుమ్మెదై తీయనీ తేనెని ॥పూల ఘుమఘుమ చేరని॥

పచ్చని ప్రకృతి కాంతకు, దూకే జలపాతాలు, ఎగిరే రంగురంగుల పక్షులు, విరగ పూసిన వేవేల వర్ణాల పూలు, విరగ కాసిన పండ్లు, చెంగు చెంగున దూకే లేళ్లు.. దూడలు.. ఎన్నో అందమైన ఆభరణాలు. చూడటానికి రెండు కళ్ళు చాలవనిపించే మనోహర దృశ్యాలు. వీటిలో పువ్వులది కూడా ఓ ప్రత్యేకమైన స్థానం. సుగంధ భరితమైన పువ్వులు, సున్నితత్వానికి, రసానందానికి ప్రతీకలు. అద్భుతమైన రంగుల మేళవింపులో దొరికే పూలు, మనసుకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చి, మానసిక సమస్యలను, ఒత్తిళ్ళను దూరం చేసి, మనసును ఎంతో relax చేస్తాయి. Aroma Therapy కూడా మానసిక వైద్యశాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగమే!

బాహ్యమైన అలంకారానికే కాక, ఇటు వైద్యశాస్త్రంలోనూ, అటు వాణిజ్యపరంగాను ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి ఈ పువ్వులు. అనంతమైన ప్రకృతిలో ఎన్ని రకాల, ఎన్ని రూపాల, ఎన్ని రంగుల, ఎన్ని సుగంధాల పూలు ఉన్నాయో లెక్క తేల్చడం కష్టమే! పూల సౌరభాలు వర్ణనాతీతం. ఒక్కో ప్రాంతంలో, ఒక్కో ఋతువులో విభిన్నమైన పూల జాతులు మనకు కనిపిస్తాయి. మంచు ప్రాంతాల్లో కొన్ని, చిత్తడి నేలల్లో కొన్ని, రేగడి నేలల్లో కొన్ని, ఎండ ప్రాంతాల్లో మరికొన్నీ, ఇసుక ప్రాంతాల్లో కొన్ని, కొండ ప్రాంతాల్లో కొన్ని.. వాటి వాటి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ పూల మొక్కలకు, వృక్షజాతులకు సంబంధించిన శాస్త్రాన్ని Anthology గా పిలుస్తారు. ఇటీవల ఇది ఎంతో అభివృద్ధి చెందిన దిశలో ఉంది.

సాహిత్యంలో పూలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అన్ని భాషల్లో ఈ విరులు విరిసిన భావాలు ఎన్నో! విరిసిన పూలది ఒక అందమైతే, అరవిరిసిన పూలది మరో అందం. పూల అందాలతో పోలుస్తూ ఎక్కువ శాతం స్త్రీ వర్ణన మనకు, ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం దాకా, అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. ‘ఆ రజనీకర మోహనబింబం.. నీ నగుమోమును పోలునటే.. కొలనిలోని నవ కమల దళమ్ములు.. నీ నయనమ్ముల పోలునటే..’ అని ఒక కవి పోలిస్తే.. ‘ముద్దబంతి పూలు పెట్టి, మొగలిరేకులు జడును చుట్టి.. హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా..’ అంటూ మరో కవి ప్రశంసిస్తాడు. ఇటు లలిత గీతాల్లో కానీ, అటు సినీ సాహిత్యంలో కానీ.. పూల అందాలతో ముడిపడిన పాటలు కోకొల్లలు.

‘పుష్పోం కీ అభిలాష’ అనే కవితలో పూల మనోగతాన్ని వర్ణించి చెబుతూ, దేశమాత రక్షణకై సైన్యం నడిచే బాటలో, వారి పాదాల వద్ద, తమను సమర్పించమని, పూలు కోరుతున్నట్టు దేశభక్తిని చాటారు మరొక హిందీ కవి మాఖన్ లాల్ చతుర్వేది.

चाह नहीं, मैं सुरबाला के गहनों में गूंथा जाऊँ,
चाह नहीं प्रेमी-माला में बिंध प्यारी को ललचाऊँ,
चाह नहीं सम्राटों के शव पर हे हरि डाला जाऊँ,
चाह नहीं देवों के सिर पर चढ़े भाग्य पर इठलाऊँ,

मुझे तोड़ लेना बनमाली,
उस पथ में देना तुम फेंक।
मातृ-भूमि पर शीश चढ़ाने,
जिस पर जावें वीर अनेक॥

~

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి, పుష్పవిలాపమైతే మరి చెప్పనక్కరలేదు. తమ స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ ఉందని, సున్నితమైన పూబాలలను ఎందుకు హింసిస్తారని, తల్లి ఒడిలో తమని హాయిగా ఆడుకోనివ్వమనీ, తల్లి నుండి వేరు చేయొద్దని, పూలు అర్థించినట్టు, కరుణ రసార్ద్రవంగా ఆయన వర్ణిస్తారు. ఇలా సాగుతుంది ఆ పుష్ప.. విలాపం..

‘నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభూ ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో, ఉద్యానవనం కలకలలాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు..

నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి కృంగిపోతి నా మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై

అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అంది, ప్రభూ!

ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపించిన తీవతల్లి

జాతీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన స్వేచ్చ్చమై ఊయల లూగుచున్ మురియుచుందుము

ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వేళ్ళపై..’

అమర గాయకులు ఘంటసాల గారి స్వరంలో, కరుణ రసాత్మక కావ్యంలా, శాశ్వతంగా నిలిచిపోయింది ఆ కవిత.

Pearlyn రచించిన Flowers కవితలో.. పూల భావాలను ఎంత అద్భుతంగా వర్ణించారో, ఒకసారి గమనించండి.

They have no mouth, but seem to speak
A thousand words so mild and meek.
They have no eyes, but seem to see
And bury thoughts into me.
They have no ears, but seem to hear
All my cries, my every tear.
They have no arms, but seem to pat
When with worries my heart is fat.
They have no feet, but seem to walk
Along with me in my dreams and talk.
They, I know, are the flowers so nice
That spread their fragrance a million miles.
Grow a few and then you’ll know
How your life is fresh and new.
With a smile so broad, I thank my God, Whose work to imagine is really too hard.

కొన్ని కొన్ని రకాల పూల సువాసనలు, కొన్ని ప్రత్యేక భావాలకు సూచికలు. కొన్ని స్నేహాన్ని పలికిస్తే, మరికొన్ని భక్తిని కలిగిస్తే, మరికొన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తే, ఇంకొన్ని రక్తిని రగిలిస్తాయి.

వాటి రంగులు, సువాసనలు; అన్నిటికీ కూడా ప్రత్యేకమైన భావాలను ఆపాదించడం జరిగింది.

మొత్తం మీద, ఈ ఉపోద్ఘాతం చూడంగానే మీకు ఒక విషయం అర్థం అయిపోయి ఉంటుంది! మనం ఈరోజు విశ్లేషించుకునే పాట అద్భుతమైన, సౌందర్య భరితమైన పుష్పాలకు సంబంధించినది. ‘శ్రీ ఆంజనేయం’ చిత్రంలో, శ్రేయ ఘోషల్ ఆలపించిన, ‘పూల ఘుమఘుమ చేరని..’, అనే ఈ పాట, అమ్మాయిలపై ఏ మాత్రం ఆసక్తి కనపరచని, హనుమంతుడి భక్తుడైన, కథానాయకుడిని ఉద్దేశించి అతడిని ప్రేమించే అమ్మాయి పాడే పాట. పాట చిత్రీకరణ అయితే, పూర్తి రొమాంటిక్‌గా కథానాయకను చూపిస్తూ షూట్ చేయడం జరిగింది. కానీ, సాహిత్యం మాత్రం ఎంతో మనోహరంగా, పూల ఘుమఘుమలాగా పరిమళిస్తూ, సౌరభాన్ని వెదజల్లుతూ, మన మనసుల్ని పూల వనాల్లో విహరింప చేస్తుంది. Visual song impact ఒక ప్రత్యేకమైన అంశం.. పాట సాహిత్యాన్ని మాత్రం దాన్నుండి విడదీసి ఆస్వాదించడం మరొక పద్ధతి. అందుకే కథా నేపథ్యంతో సంబంధం లేకుండా, సాహిత్యాన్ని మనసారా ఆస్వాదిద్దాం!

పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని ఆ మూతిముడుపేంటలా
ప్రేమంటే పామని బెదరాలా ధీమాగా తిరగరా మగరాయడా
భామంటే చూడని వ్రతమేలా పంతాలే చాలురా ప్రవరాఖ్యుడా
మారనే మారవా మారామే మానవా మౌనివా మానువా తేల్చుకో మానవా

పూల ఘుమ ఘుమ చేరని ప్రదేశంలో ఉంటే, దాని సువాసన నిన్ను ఎలా ఆకర్షిస్తుంది? అన్న ఈ ప్రశ్న అంతరార్థం ఒకసారి ప్రేమలో పడితే కదా దాని విలువ తెలిసేది, ప్రేమ జోలికే రాకుంటే, అమ్మాయి నీకు ఎలా అర్థం అవుతుంది, అని. ఇంత అందమైన అమ్మాయిని చూసి ఎందుకు పారిపోతావు, ప్రేమని పాము అనుకొని భయపడి పోతున్నావు, ఆ తేనె తీయదనం నీకు తెలియదు కాబట్టి, అదేదో చేదు మందనుకొని మూతి ముడుచుకుంటున్నావు, అలా చేయకు, అంటూ ఎద్దేవా చేస్తుంది, ప్రేమికురాలు. పైగా ధైర్యంగా మగరాయుడిలా తిరుగు, ప్రేమకు భయపడకు! అంటూ హెచ్చరిస్తుంది. ప్రవరాఖ్యుడిలాగా నువ్వేమన్నా, భామ వైపు కన్నెత్తి చూడనని వ్రతం పెట్టుకున్నావా అని కోపంగా ప్రశ్నిస్తుంది. ఎంత చెప్పినా నువ్వు మారనే మారవా, అని తన అసహనాన్ని ప్రదర్శిస్తుంది. ఏ మాత్రం స్పందన లేకుండా ఉండడానికి నీవేమైనా మానువా? మునివా? కాదు కదా? నువ్వు మానవుడివే, నువ్వు నా ప్రేమ వైపు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు నా పట్ల ఆకర్షితమవడం లేదు? అని తన బాధనంతా వెళ్ళబోసుకుంటుంది. అందమైన ప్రశ్నలను మరింత అందమైన ప్రాసలతో కూర్చి, అందమైన అమ్మాయి మనసులోకి దూరి, అ(క)డిగించాల్సిన ఆ నాలుగు మాటలు అడిగించేశారు, సిరివెన్నెల కొంటెగా.

చెలి తీగకి ఆధారమై బంధమై అల్లుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో
మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
నా వాలుజడ చుట్టుకొని మొగలిరేక నడుము నడిపించుకో
వయసులో పరవశం చూపుగా చేసుకో సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో

పల్లవిలో అడగాల్సిన నాలుగు మాటలు అడిగేశాక, తన తళుకు బెళుకులతో, ప్రయత్నం చేస్తుంది ప్రియుడ్ని ఊరించే ప్రయత్నం ఆ అమ్మాయి. ఒక సొగసైన పూల తీగ నీ ఆధారం కోసం వేచి ఉంది, నువ్వు బలమైన చెట్టులా నిలబడితే, తన బంధాన్ని నీతో పెనవేసుకుంటుంది, అని తన కోరికను తెలియజేస్తుంది. కన్నెపిల్లనైన నా దగ్గరికి నువ్వు వస్తే, నా అరవిచ్చిన, అరవిందమయ్యే అందాలు అందుకోవచ్చని offer ఇస్తుంది. ఇక్కడ అరవిందమంటే, ఎర్ర కలువ.. అంటే.. నీ తలపులతో.. ఆ సిగ్గుతో.. ఎర్రబడిన.. నా అందాలు నీవే అని symbolic గా చెప్పడం, అలా చెప్పించడం, extensive subject knowledge, కవిత్వీకరించడంలో ప్రత్యేకమైన శైలి కలిగిన సిరివెన్నెలకు కొత్తేమీ కాదు. ఇంకా బోనస్‌గా, నా పెదవిపై విరిసే మల్లెల్ని తుంచుకో, నా వాలుజడను చుట్టుకొని, మొగలిరేకంటె సున్నితమైన నా నడుమును, నీకు నచ్చినట్టు నడిపించుకో! అంటుంది.

తన వయసులోని పరవశాలను, సొగసులోని పరిమళాలను, తనివి తీరా అందుకోమని ప్రియుడికి ఆహ్వానం పలుకుతుంది. సంయోగ వేళలలో, ఉద్దీపన కలిగించాల్సిన విషయంలో, మొగలి పొదను, మొగలిరేకులను, మొగలి సువాసనను, సాహిత్యంలో సమయానుసారంగా వినియోగించడం పరిపాటే. దాన్ని సమయోచితంగా ఉపయోగించారు సిరివెన్నెల.

ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాగనై జతలీలలో అలసి మత్తెక్కిపోనీ నిద్ర గన్నేరునై
నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై
నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమి చెంగల్వనై
మోజులే జాజులై పూయనీ హాయిని తాపమే తుమ్మెదై తీయనీ తేనెని..

సిరివెన్నెల వ్రాసే romantic lyrics – భాషలో, భావంలో, ఎంత ఉన్నతంగా మలుస్తారో.. మనం ఇందులో గమనించవచ్చు. చెప్పదలుచుకున్నది చెప్తూనే, విలువలు కోల్పోయేంత కమర్షియల్‌గా కాకుండా, పాత సినిమాల్లోని ప్రేమ గీతాల్లా.. గుంభనంగా చెప్పడంలో ఆయనది అందవేసిన చేయి. ప్రతి ముద్దులో ఎంతో కొత్తదనం ఉంటుందని చెబుతూ.. కొత్త పున్నాగనై ఉదయిస్తాను, అని, హీరోయిన్ అనడంలో, పున్నాగ పువ్వులోని అందాల్ని, సువాసనని, ఉపమానంగా వాడారు సిరివెన్నెల. Rain tree గా పిలువబడే, గొడుగు లాంటి, దట్టమైన నిద్ర గన్నేరు చెట్టు పూలకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. పగలంతా వికసించి పరిమళాల వెదజల్లే ఆ పూలు, రాత్రిపూట ముడుచుకొని ఉంటాయి. నీతో గడిపిన ఆనందంలో అలసిపోయి, మత్తెక్కి, నిద్ర గన్నేరులా, సేద తీరుతాను.. అని అర్థం వచ్చేలా రాశారు ఆ వాక్యం. అందమైన పొగడ పువ్వు దండలాగా, నీ గుండెలపై ఒదిగి ఉండాలి, అని మనసారా ఆశపడుతుంది. కోనేటికి – చెంగల్వకు వీడని చెలిమి. నీటితో విడివడితే చెంగల్వ మనలేదు. అంత చక్కటి, చెలిమి బంధాన్ని మనసారా కోరుకుంటుంది. ఇందులో. నీ కంటిలో కొలువుండిపోనీ అని, అందరూ చెప్పేంత రొటీన్‌గా చెబితే సిరివెన్నెల ఎందుకు అవుతారు? అందుకే నీ కంటి కోనేటిలో, చెలిమి చెంగల్వనై ఉండిపోని అన్నారు! నా మోజులన్నీ జాజులై విరబూయనీ, నా తాపాలే తుమ్మెదల్లాగా, ఆనందాల తేనెను ఆస్వాదించనీ!.. అంటూ.. తన ప్రేమను.. తమకాన్ని.. తన గుండెల్లో ప్రియుడిపై దాగి ఉన్న ఇష్టాన్ని, పాట ద్వారా వ్యక్తీకరిస్తుంది ప్రియురాలు.

మరి ముఖ్యంగా, ఈ రచన వెనుక, మరో గమ్మత్తైన విషయం దాగి ఉంది. ఈ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ, పాట నేపథ్యం మొత్తం ఒక పల్లెటూరికి సంబంధించింది కాబట్టి, పల్లెల్లో దొరికే పూలని మాత్రమే పాటలో ఉపయోగించి వ్రాయమని, సిరివెన్నెల గారిని అడిగారని ఆకెళ్ళ రాఘవేంద్ర, ‘పాట షికారుకొచ్చింది’, పుస్తకంలో తెలియజేశారు. ఏది ఏమైనా ఒక ఛాలెంజ్ పాటను వ్రాయడం, గురువుగారికి ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు కదా! ఆ పాటకి ఎంత శాతం, ఎన్నింతల న్యాయం చేయగలిగారో.. మీరే నిర్ణయించుకోండి.

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here